rental buses
-
అద్దె బస్సులే ముద్దు
‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం.. సురక్షితం’ అన్నది ఆర్టీసీ నినాదం. అయితే దీనికి టీడీపీ కూటమి ప్రభుత్వం మరో సరికొత్త నినాదాన్ని కూడా జోడిస్తోంది. అదే ‘అద్దె బస్సులే ముద్దు... ఆర్టీసీ బస్సులు వద్దు’. అసలు విషయమేమంటే... ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు ముగింపు పలికి అద్దె బస్సుల సంఖ్యను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా 14వేల ఉద్యోగాల కోతకు కూడా సిద్ధపడేలా ప్రభుత్వ ప్రణాళిక ఇలా ఉంది. – సాక్షి, అమరావతిఅద్దె బస్సులు రెట్టింపు చేద్దాం.. ఆర్టీసీలో మొత్తం 11,216 బస్సులు ఉన్నాయి. వాటిలో సొంతవి 8,465 కాగా అద్దె బస్సులు(Rental buses) 2,751 ఉన్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో అద్దె బస్సుల శాతం 24.6గా ఉంది. ఉద్యోగ భద్రత, ఉద్యోగుల సేవలను సది్వనియోగం చేసుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఆర్టీసీ(Rtc) ప్రయోజనాల పరిరక్షణ తదితర అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉంది. అందుకే అద్దె బస్సులు గరిష్టంగా 25శాతం దాటకూడదని గతంలోనే ఆర్టీసీ పాలకమండలి తీర్మానించింది. ఈ విధానాన్ని ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు పాటించాయి. ఇలా ఉంటే, ఆర్టీసీ బస్సుల కొనుగోలు, కొత్తగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం తదితర అంశాలపై ఇటీవల సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు సమకూర్చలేమని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే సమీక్షా సమావేశానికి నివేదిక రూపొందించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో ఆర్టీసీ ప్రయోజనాల పరిరక్షణకు అద్దె బస్సులు గరిష్టంగా 25శాతానికి పరిమితం చేయాల్సి ఉందని ఆర్టీసీ అధికారులు నివేదించారు. ఇక్కడే... సీఎం ఉద్దేశాన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ‘ప్రభుత్వం కోరితే అద్దె బస్సులను 50 శాతానికి పెంచుతాం’ అని కూడా నివేదికలో పొందుపరచడం గమనార్హం. తద్వారా ఆర్టీసీలో ప్రస్తుతం 24.6 శాతంగా ఉన్న అద్దె బస్సులను 50 శాతానికి పెంచేందుకు సిద్ధపడ్డారు. తాము అనుకున్న ప్రతిపాదనను ఆర్టీసీ అధికారులే ప్రతిపాదించేట్టుగా ప్రభుత్వం కథ నడిపించింది. ఇక అద్దె బస్సులను 50 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకే సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. ఈ చర్యతో అద్దె బస్సులు రెట్టింపు కానున్నాయనేది సుస్పష్టం. ఈ ప్రకారంగా కొత్తగా 2,857 అద్దె బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టే. 14వేల ఉద్యోగాలకు కోతే... సగం బస్సులు అద్దెవి కానుండటంతో ఆర్టీసీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలగనుంది. ఒక్కో ఆర్టీసీ బస్సుకు సగటున ఐదుమంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఆ ప్రకారం కొత్తగా ప్రవేశపెట్టే 2,857 అద్దె బస్సులకు కలిపి 14,285 ఉద్యోగాలకు కోత పడనుంది. ఆర్టీసీలో ప్రస్తుతం దాదాపు 50వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రిటైరయ్యే ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేస్తుందన్నది స్పష్టమవుతోంది. అలా దశల వారీగా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని నిలిపివేస్తే... కొంతకాలానికి ప్రైవేటుపరమయ్యే ప్రమాదం ఉందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక అద్దె బస్సులను కూడా రాబడి అధికంగా ఉన్న రూట్లలోనే తిప్పేందుకు ఆర్టీసీ ప్రాధాన్యమిస్తుంది. దాంతో పల్లెలు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కోల్పోవాల్సి వస్తుందని కూడా విమర్శిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ వినకుండా అద్దె బస్సుల సంఖ్యను రెట్టింపు చేయాలని స్పష్టం చేసినట్టు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. -
కొత్త బస్సులు సమకూర్చుకోండి
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా సేవలను అందించడానికి కొత్త బస్సులను సమకూర్చుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సీఎండీ సజ్జనార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులతో మంత్రి పొన్నం శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసిందన్నారు. మొదటి విడతలో మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మహి ళా స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్యలకు అద్దె బస్సులను అందజేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఒక్కటి చొప్పున అద్దె బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల ప్రారంభించిన కార్గో హోం డెలివరీ సదుపాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మరణించిన, మెడికల్లీ అన్‌ఫిట్ అయిన సిబ్బంది జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఇచ్చే కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రూ. 3,747 కోట్ల మేర చార్జీల ఆదా! మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 20 వరకు మొత్తం 111 కోట్ల జీరో టికెట్లను సంస్థ జారీ చేసిందని, రూ.3747 కోట్ల చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం తెలిపారు. జీరో టికెట్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు.రవాణా ఆదాయ లక్ష్యాలను సాధించాలి.. ఆదాయ పెంపుదల లక్ష్యాలను సాధించాలని శాఖ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలని సమీక్షలో సూచించారు. -
అద్దె బస్సులతో ఆర్టీసీ ఆగమాగం!
సాక్షి, హైదరాబాద్ : అద్దె బస్సులు ఆర్టీసీని కబళించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి రూపొందించిన ప్రణాళిక ప్రకారం అద్దె బస్సులు సమకూరితే, ఆర్టీసీ సొంత బస్సుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. క్రమంగా ఇది సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేయనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అద్దె బస్సుల సంఖ్యను పెంచటంపై చాలాకాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని నిధుల వినియోగంపై ప్రభుత్వం అనధికారికంగా పరిమితులు విధిస్తుండటంతో, సొంతంగా కొత్త బస్సులు కొనటం ఆర్టీసీకి కష్టంగా మారింది. దీంతో అద్దె బస్సులకు గేట్లు బార్లా తెరిచేస్తోంది. అద్దె బస్సులకు డ్రైవర్లను వాటి నిర్వాహకులే నియమిస్తారు. డ్రైవర్ల జీతాల పద్దు తగ్గుతుండటంతో ఆర్టీసీ దీనివైపు మొగ్గు చూపుతోంది. 30 శాతానికి చేరిన అద్దె బస్సులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014లో ఆర్టీసీలో అద్దె బస్సుల వాటా 17 శాతం మాత్రమే. అద్దె బస్సుల సంఖ్యపై పరిమితి ఉన్నందున, అంతకు మించి వాటిని సమకూర్చుకునేందుకు వీలుండేది కాదు. కానీ ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు బకాయి పడటం, గ్రాంట్లు ఇవ్వకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటి సంఖ్య పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 9,800 బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ప్రైవేటు వ్యక్తులు ఆర్టీసీకి అద్దెకిచ్చిన బస్సులు 2,800 ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’పథకం కింద సమకూరి హైదరాబాద్ విమానాశ్రయానికి తిప్పుతున్న 40 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒలెక్ట్రా అన్న సంస్థ అద్దెకిచ్చినవే. అదే సంస్థ ఇటీవల మరో 100 బస్సులు సమకూర్చింది. ఇటీవల ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ మరో 90 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చింది. అలాగే మరో 40 బస్సులు కూడా కొత్తగా వచ్చాయి. వీటిని ప్రారంభించాల్సి ఉంది. ఇలా ప్రస్తుతం మొత్తం బస్సుల్లో అద్దె బస్సుల వాటా దాదాపు 30 శాతానికి చేరింది. ఇక ఏడాది, ఏడాదిన్నరలోగా ఆర్టీసీ, అద్దె బస్సుల సంఖ్య చెరి సగం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముంచెత్తనున్న అద్దె బస్సులు హైదరాబాద్‌లో తిరిగేందుకు మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉంది. వాటిల్లో కొన్ని వచ్చాయి. ఏడాది కాలంలో మరో 400 సమకూరుతాయి. జేబీఎం సంస్థ కూడా 500 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చాల్సి ఉంది. ఇప్పటికి కొన్ని బస్సులే రాగా మరో 400 బస్సులను సమకూర్చాల్సి ఉంది. దశలవారీగా అవి కూడా వస్తాయి. ఇక హైదరాబాద్‌లో కాలుష్యాన్ని నివారించేందుకు మొత్తం బ్యాటరీ బస్సులనే తిప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘పీఎం ఈ–డ్రైవ్’పథకం కింద 2,800 బస్సులు మంజూరు చేయాలంటూ ఆర్టీసీ దరఖాస్తు చేసింది. దేశవ్యాప్తంగా ఆ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు తిప్పేందుకు కేంద్రం 9 నగరాలను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. అంటే ఆర్టీసీ దరఖాస్తు మేరకు ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కానున్నాయి. తాజాగా మహిళా సంఘాలు 1,000 బస్సులను ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మూడేళ్లలో అద్దె బస్సుల సంఖ్య 8 వేలకు చేరే అవకాశం ఉంది. అప్పుడు ఆర్టీసీ సొంత బస్సులు 6 వేల లోపే ఉంటాయి. అయితే అప్పటికి చాలా బస్సులు పాతబడి తుక్కుగా మారిపోతాయి. వాటి స్థానంలో కొత్తగా సొంత బస్సులు రాకపోతే ఆర్టీసీ సొంత బస్సుల సంఖ్య 4 వేలకు తగ్గుతుంది. అద్దె బస్సులు భారీగా వస్తున్నందున సొంత బస్సులు కొనేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపే పరిస్థితి ఉండదని అంటున్నారు. డ్రైవర్ల నియామకం అంతేనా? ఆర్టీసీలో ప్రస్తుతం డ్రైవర్లకు కొరత ఉంది. దీంతోఇటీవలే దాదాపు 2 వేల పోస్టుల భర్తీకి ఆర్టీసీ ప్రతిపాదించింది. దానికి ప్రభుత్వం కూడా సమ్మతించి రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశాలిచ్చి0ది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది. కానీ వాటి ఊసే లేకుండాపోయింది. భవిష్యత్తులో అద్దె బస్సుల సంఖ్య పెరుగుతున్నందున సొంత డ్రైవర్ల అవసరం అంతగా ఉండదన్న ఉద్దేశంతోనే ఎంపిక ప్రక్రియను వాయిదావేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్థ మనుగడకేప్రమాదం: సంఘాల నేతలు ‘ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య విచ్చలవిడిగా పెరగటం సంస్థకు మంచిది కాదు. భవిష్యత్తులో సంస్థ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తుంది. ఇది ప్రైవేటీకరణను ప్రేరేపిస్తుంది. గతంలోలాగా అద్దె బస్సుల సంఖ్యపై సీలింగ్ విధించి కావాల్సినన్ని బస్సులను ప్రభుత్వమే కొనాలి..’అని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నరేందర్, నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. -
ఈ నెల 5 నుంచి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారించకపోతే ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేశారు. మంగళవారం టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు సాక్షి మీడియాతో మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతున్నాయన్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు. ప్రమాదానికి ఇన్య్సూరెన్స్ రాకపోతే మాపై కేసులు పెడుతున్నారు. కొత్త బస్సులకు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు టెండర్లు వేయలేదు. ఇందులో గిట్టుబాటు కావడం లేదు. టెండర్లు వేయొద్దని కోరుతున్నాం’’ అని అద్దె బస్సుల యజమానులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: నేను ఎక్కడికి పారిపోలేదు: బైరి నరేష్ -
659 అద్దెబస్సులకు ఆర్టీసీ టెండర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అద్దె ప్రాతిపదికన 659 బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు పిలిచింది. వాటిలో ఏసీ స్లీపర్ 9, నాన్ ఏసీ స్లీపర్ 47, ఇంద్ర ఏసీ 6, సూపర్ లగ్జరీ 46, అల్ట్రా డీలక్స్ 22, ఎక్స్‌ప్రెస్ 70, అల్ట్రా పల్లె వెలుగు 208, పల్లె వెలుగు 203, మెట్రో ఎక్స్‌ప్రెస్ 39, సిటీ ఆర్డినరీ బస్సులు 9 ఉన్నాయి. ‘ఎంఎస్టీసీ’ ఇ–పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేయవచ్చునని బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఆగస్టు 5 ఉదయం 10గంటల నుంచి ఆగస్టు 6 సాయంత్రం 4గంటల వరకు రివర్స్ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం అద్దె బస్సుల టెండర్లను ఖరారు చేస్తారు. బస్సు రూట్ల వివరాలు, బస్సు ప్రమాణాలు, టెండర్ల నిబంధనలు, ఇతర వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్: http://apsrtc.ap. gov. in టెండర్లు పిలిచిన అద్దె బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి శ్రీకాకుళం–39, పార్వతీపురం మన్యం–32, విజయనగరం–14, విశాఖపట్నం–61, అనకాపల్లి–22, కాకినాడ–41, తూర్పు గోదావరి–27, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ – 39, పశ్చిమ గోదావరి–52, ఏలూరు – 21, కృష్ణా – 28, ఎన్టీఆర్ – 12, గుంటూరు – 26, పల్నాడు – 30, బాపట్ల– 6, ప్రకాశం– 10, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – 39, తిరుపతి– 35, చిత్తూరు – 2, అన్నమయ్య – 10, వైఎస్సార్ – 6, నంద్యాల – 29, కర్నూలు – 14, అనంతపురం – 31, శ్రీసత్యసాయి – 33. -
సిటీజనులకు గుడ్‌న్యూస్.. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు.. ఇలా బుక్ చేసుకోండి
సాక్షి, సిటీబ్యూరో: సిటీ ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. ప్రయాణికులు నేరుగా తమ ఇంటి వద్ద నుంచే బయలుదేరేందుకు వీలుగా ఇవి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, జాతరల కోసం అద్దె ప్రాతిపదికన బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు కనీసం 30 మంది ఉంటే చాలు. బస్సు అద్దెకు తీసుకొని వెళ్లవచ్చు. ఆర్టీసీ బస్సులు నేరుగా సమ్మక్క గద్దె వరకు వెళ్తాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంధువులను తీసుకెళ్లేందుకు బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని డిపో మేనేజర్‌ను సంప్రదించి బస్సును బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ వెబ్సైట్ www. tsrtconline.in ద్వారా సంప్రదించి బస్సులను అద్దెకు తీసుకోవచ్చు. (చదవండి: బీజేపీ Vs టీఆర్ఎస్.. చిచ్చురేపిన వాట్సాప్ మెసేజ్) -
ప్రజలకు మరింత చేరువగా..
ఆదాయం పెంచుకునే విధంగా ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రజలకు చేరువలో ఆర్టీసీ అనే విధంగా తగిన చర్యలు తీసుకుంటుంది. గతంలో జరిగిన 50 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె, కరోనా మహమ్మారితో విధించిన లాక్‌డౌన్‌తో సంస్థ భారీ ఆదాయాన్ని కోల్పోయి నష్టాలు చవిచూసింది. లాక్డౌన్ అనంతరం తిరిగి బస్సులు నడిపినా ప్రయాణికుల నుంచి అంతగా స్పందన లేకపోవటం కూడా ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో అదనపు ఆదాయం కోసం ఆర్టీసీలో ఇటీవలñ పలు సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పార్సిళ్లు, కొరియర్ సేవల కోసం ప్రత్యేక కార్గో బస్సులను ప్రవేశపెట్టింది. స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం శుభకార్యాలు, పెళ్లిళ్లు, విజ్ఞాన, విహార యాత్రల రవాణా అవసరాల కోసం అద్దె ప్రాతిపదికన ‘ప్రత్యేక బస్సు’ సౌకర్యం కల్పిస్తోంది. అయితే ప్రయాణికులకు మరింత సులభతరంగా, ఆకర్శవంతంగా ఉండే విధంగా అద్దె బస్సుల విధానాలను సరళీకృతం చేస్తూ ఛార్జీలను భారీగా తగ్గించింది. రిఫండబుల్ కాషన్ డిపాజిట్, స్లాట్ విధానాన్ని రద్దు చేసింది. కేవలం బస్సు తిరిగిన కిలోమీటర్ల వరకు మాత్రమే చార్జీ వసూలు చేయనున్నారు. కిలోమీటర్ల వారీగా.. ప్రయాణికులను బస్సులో ఎక్కించుకొని, దింపే రాకపోకల దూరాన్ని కనీసం 200 కిలోమీటర్ల వరకు నిర్ధారించారు. ప్రస్తుత విధానంలో (పికప్, డ్రాప్) ప్రయాణికులను కావాల్సిన చోట దించుతారు. తిరుగు ప్రయాణానికి నిర్దేశించిన సమయానికి వచ్చి తీసుకెళ్తారు. పికప్, డ్రాప్ విధానంలో ఎలాంటి డిపాజిట్లు లేకుండా బస్సు తిరిగిన కిలోమీటర్లకు వందశాతం సీటింగ్ కెపాసిటీ (ఆక్యూపెన్సి రేట్)పై సాధారణ ఛార్జీలకు 50శాతం అదనంగా తీసుకుంటారు. 200 కిలోమీటర్ల దూరం (రాను, పోను కిలోమీటర్లు) ఆపై ప్రయాణంకు ఎక్స్‌ప్రెస్ బస్సు తిరిగిన కిలోమీటర్లకు సాధారణ చార్జీలు, సీటింగ్ కెపాసిటీ (100శాతం ఓఆర్)పై లెక్కింపు, పల్లె వెలుగు బస్సులకు సాధారణ చార్జీలపై 10 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తారు. సూపర్ లగ్జరీ బస్సుకు కనీస దూరం 300 కిలోమీటర్లు, ఏసీ బస్సుల కనీస దూరం 400 కిలోమీటర్లు, వీటికి 100శాతం సీటింగ్ కెపాసిటీపై సాధారణ చార్జీలను తీసుకుంటారు. నిర్ణీత సమయానికి మించి దాటితే బస్సు వెయిటింగ్ చార్జీ గంటకు రూ.300లు వసూలు చేస్తారు. గతంలో కంటే ప్రస్తుత విధానం ప్రకారం 200 కిలోమీటర్ల వరకు బస్సును అద్దెకు తీసుకుంటే ప్రయాణికులకు దాదాపు రూ.2500 నుంచి 3వేల వరకు తగ్గనుంది. -
అద్దె బస్సులపై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల స్థాయిలోనే సేవలందిస్తున్న అద్దె బస్సుల భవితవ్యం గందరగోళంలో పడింది. ప్రభుత్వం 5,100 బస్సులను ఆర్టీసీ నుంచి మినహాయించి అంతమేర రూట్లను ప్రైవేటీకరించాలని నిర్ణయించడమే దీనికి కారణం. ఆర్టీసీకి సొంత బస్సులు సగం ఉండనుండగా మిగతావి ప్రైవేటు పర్మిట్లతో నడిచే బస్సులుంటాయని సీఎం ఇప్పటికే తేల్చిచెప్పడం, దీనికి హైకోర్టు అడ్డుచెప్పకపోవటంతో ఈ ప్రక్రి య అమలు దాదాపు ఖాయమైంది. అయితే ప్రైవేటీకరించే కోటా(5,100 బస్సులు) పరిధిలోకే అద్దె బస్సులు వస్తాయని గతంలోనే సీఎం స్పష్టం చేసిన నేపథ్యంలో అద్దె బస్సుల విధానమే రద్దవుతుందన్న ప్రచారం ఆర్టీసీలో మొదలైంది. అద్దె బస్సుల యజమానులనూ ప్రైవేటు పర్మిట్ బస్సుల పరిధిలోకి తెస్తారని చర్చ జోరుగా సాగుతోంది. ఆర్టీసీ తమతో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు దానికి విరుద్ధంగా కొత్త ఒప్పందంలోకి వెళ్లమంటే ఎలా సాధ్యమని అద్దె బస్సుల యజమానులు ప్రశ్నిస్తున్నారు. కొత్త ఒప్పందాన్ని ఒప్పుకోబోమని, అవసరమైతే న్యాయ పోరాటానికి దిగుతామని కొందరు పేర్కొంటున్నారు. ఏమిటా ఒప్పందం.. ఎందుకీ సమస్య? ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆర్టీసీ సొంతంగా బస్సులు కొనుగోలు చేయడం లేదు. ఏటా పాతవి, నడవలేని బస్సులను సర్వీసు నుంచి తప్పిస్తోంది. వాటి స్థానంలో అద్దె బస్సులను పెంచు తూ వచ్చింది. గతంలో మొత్తం బస్సుల్లో వాటి సంఖ్య 15 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 25 శాతానికి చేరింది. అద్దె బస్సులను ప్రోత్సహిం చడం వల్ల వాటి కొనుగోలు భారం లేకపోవడమే కాకుండా డ్రైవర్లను నియమించే అవసరం తప్పింది. దీంతో క్రమంగా వాటి సంఖ్య 2,100కు చేరుకుంది. ఇటీవల కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా యుద్ధప్రాతిపదికన కొత్తగా 1,200 అద్దె బస్సులను తీసుకున్నారు. వెరసి ఇప్పుడు అద్దె బస్సుల సంఖ్య 3,300కు చేరుకుంది. ఒక్కో బస్సుకు పదేళ్ల ఒప్పందం ఉంది. అయితే ఆర్టీసీ తీసుకున్న అద్దె బస్సుల్లో 2,100 బస్సుల గడువు ఇంకా తీరలేదు. ఇటీవలే కొత్తగా తీసుకున్న 1,200 బస్సులకు పదేళ్ల ఒప్పందం అలాగే ఉంది. అద్దె బదులు వాటిని ప్రైవేటు పర్మిట్ల కోటాలోకి మారాలంటూ ప్రభుత్వం సూచించనుందనే మాట అధికారుల నుంచి వినిపిస్తోందని అద్దె బస్సుల యజమాను లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అద్దె బస్సుల ఒప్పందం ప్రకారం మోటారు వాహన పన్ను, డీజిల్ ఖర్చు, కండక్టర్ వేతనం, బీమా భారం యజమానులకు లేదు. అన్ని పన్నులూ ఆర్టీసీనే చెల్లించి తిరిగి ప్రభుత్వం నుంచి దాన్ని వసూలు చేసుకుంటోంది. దీంతో ఒక్కో బస్సుపై యజమానులు ఏటా రూ.1.30 లక్షలే ఖర్చు చేస్తున్నారు. అదే ప్రైవేటు పర్మిట్ల విషయంలో ఆ ఖర్చు రూ. 3.36 లక్షలు అవుతుందని బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం తమను ప్రైవేటు పర్మిట్ల రూపంలో తిప్పాలని సూచిస్తే ఒప్పందం నుంచి వైదొలుగుతామని, బస్సులను అమ్మేసి ప్రజా రవాణా నుంచి వైదొలగుతామని చెబుతున్నారు. -
అద్దె బస్సుల టెండర్లపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ అద్దె బస్సుల టెండర్లను పిలవడాన్ని సవాలు చేస్తూ కార్మిక సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. 1035 బస్సులను అద్దెకు తీసుకోవడం కోసం టెండర్లు ఆహ్వానిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టీసీకి బోర్డు లేకుండా ఎండీ టెండర్లు పిలవడం చట్ట విరుద్ధమని పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. కార్మికుల సమ్మెపై ఏ విషయం తేల్చకుండా శాశ్వత ప్రాతిపదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఆర్టీసీ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్.. ఆర్టీసీ సొంత బస్సులను నడిపే పరిస్థితుల్లో లేదని కోర్టుకు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అద్దె బస్సులు తీసుకుంటున్నామని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ పిటిషన్‌ను ఇప్పటివరకు ఆర్టీసీపై దాఖలై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో కలపాలని ఆదేశించింది. అన్ని పిటిషన్లపై ఈ నెల 28న వాదనలు వింటామని తెలిపింది. -
అద్దె బస్సులకు దరఖాస్తుల వెల్లువ
స్టేషన్ మహబూబ్‌నగర్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉమ్మడి జిల్లాలో అదనంగా 51 అద్దె రూపంలో ఆర్టీసీ బస్సు సర్వీసుల ఎంగేజ్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. 25 రూట్లలో అదనంగా 51 హైర్ విత్ ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. టెండర్‌దాఖలు గడువు సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ముగిసింది. దీంతో 51 బస్సుల టెండర్లకు దాదాపు 1,800 నుంచి 2వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల అనంతరం లక్కీ డిప్ నిర్వహించాల్సి ఉండగా దరఖాస్తులు ఎక్కువగా రావడంతో వాటి లెక్కింపు పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాత్రి 11 గంటల తర్వాత లక్కీ డిప్ తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుదారులతో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్, కార్యాలయం ఆవరణలు కిటకిటలాడాయి. -
ప్రయి'వేటు'కరణ కుట్ర..!
ఏపీఎస్ ఆర్టీసీని ప్రయివేటుపరం చేసేలా ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం మరో అడుగు ముందుకేశాయి. 22 శాతంగా ఉన్న అద్దె బస్సులను 35 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం అదేనని తెలుస్తోంది. అదేగనక జరిగితే కార్మికులు తీవ్రంగా నష్టపోనున్నారు. కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. మరింత అగాథంలోకి నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తిరుపతి సిటీ : ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్టీసీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 14 డిపోల్లో 1,420 బస్సులు ఉన్నాయి. ఇప్పటికే 22 శాతం అద్దె బస్సులకు అనుమతిచ్చారు. ఈ మేరకు 230 అద్దె బస్సులు వివిధ రూట్లలో సేవలు అందిస్తున్నాయి. 35 శాతం అద్దె బస్సులు ప్రవేశపెడితే జిల్లా వ్యాప్తంగా 350–400 అద్దె బస్సులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు.. జిల్లా వ్యాప్తంగా 14 డిపోల్లో 400 మంది డ్రైవర్ల అవసరం కాగా, ప్రస్తుతం ఉన్నవారిపైనే అదనపు పనిభారం పెంచి డ్యూటీలు చేయిస్తున్నారు. కార్మికులకు సరైన విశ్రాంతి లేక జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలుగువెలుగు బస్సులను సగానికి పైగా రద్దుచేసి, వాటి స్థానంలో ప్రయివేట్ బస్సులను ప్రోత్సహించారు. దీంతో 22 శాతం ఉన్న అద్దె బస్సులను 35 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అద్దె బస్సుల వల్ల ఆర్టీసీలో పనిచేసే కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. అద్దె బస్సుల్లో పనిచేసే ప్రవేట్ సిబ్బందికి బాధ్యత ఉండదనే విషయం ఆర్టీసీ యాజమాన్యం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అద్దె బస్సుల కాలపరిమితి ముగిసిన వెంటనే అద్దె బస్సులను దశలవారీగా తొలగించి వాటి స్థానంలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు గతంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులతో యాజమాన్యం సమావేశమైనప్పుడు అంగీకరించిందనే విషయం యాజమాన్యం మరచినట్లు ఉందని ఈయూ నాయకులు చెబుతున్నారు. ఒక్కో అద్దె బస్సు వల్ల జిల్లాలో అయిదున్నర మంది కార్మికులు రానున్న రోజుల్లో కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యజమాన్యం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కోరుతున్నారు. అద్దె బస్సులు పెంచితే ఉద్యమమే.. జిల్లాలో 35 శాతానికి అద్దె బస్సులను పెంచితే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతాం. దీనివల్ల జిల్లాలో కార్మికుల సంఖ్య క్రమేణ తగ్గిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో 12,500 ఆర్టీసీ బస్సులుండగా, ప్రస్తుతం 11వేల బస్సులతో నడిపే దుస్థితి ఏర్పడింది. జిల్లాలో 9,350 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం 8వేల మంది మాత్రమే ఉన్నారు. గత అయిదేళ్లుగా ఆర్టీసీలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరపలేదు. ఇప్పటికైనా యాజమాన్యం అనాలోచిత నిర్ణయాలు విరమించుకోవాలి. ప్రభుత్వంతో కలిసి కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి. – టి.సత్యనారాయణ,రీజనల్ కార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్ -
అద్దె బస్సుల రెన్యువల్‌కూ ఉందో రేటు!
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ‘అద్దె బస్సుల ఒప్పందం’ వివాదాస్పదంగా మారింది. కాలపరిమితి ముగిసిన అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యూవల్ చేయడానికి వీల్లేదని అధికారులు అంటున్నా. తాజాగా టెండర్లు పిలవాలని ఆర్టీసీ పాలకమండలి నిర్ణయించినా.. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలకనేత వినిపించుకోవడంలేదు. ఎందుకంటే అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యువల్ చేసేందుకు ఉత్తరాంధ్రకే చెందిన ఓ ఎమ్మెల్సీ ద్వారా ఆయన డీల్ కుదుర్చుకున్నారు మరి. దాదాపు 140 అద్దె బస్సుల ఒప్పందం 2008, 2009లో ఆర్టీసీ దాదాపు 140 అద్దె బస్సుల్ని తీసుకుంది. వాటిలో పల్లెవెలుగు, సిటీ బస్సులు ఉన్నాయి. వాటి ఒప్పంద కాలపరిమితి ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. దాంతో ఒప్పందాన్ని తాత్కాలికంగా 6 నెలలకు పొడిగించారు. ఈ సెప్టెంబర్ 30తో ఆ గడువు ముగియనుంది. గతేడాది కాలపరిమితి ముగిసిన అద్దె బస్సుల ఒప్పందాలను ఆర్టీసీ రెన్యువల్ చేసింది. అయితే అప్పట్లో ఆర్టీసీ పాలకమండలి లేదు. దాంతో అధికారులు ఒప్పందాన్ని రెన్యూవల్ చేసి ఇటీవల పాలకమండలి నియామకం తర్వాత ర్యాటిఫికేషన్ చేశారు. అదే రీతిలో ఈ ఏడాది మార్చితో కాలపరిమితి ముగిసిన 140 బస్సుల ఒప్పందాలను కూడా రెన్యువల్ చేయాలని అద్దె బస్సుల యజమానులు కోరారు. ఆర్టీసీ పాలకమండలికి చెందిన ‘పెద్ద’ అందుకు సమ్మతించారు. అయితే ఆ ప్రతిపాదనను ఆర్టీసీ ఉన్నతాధికారులు తిరస్కరించారు. ఎంఎస్టీసీ నిబంధనల ప్రకారం అద్దె బస్సుల కోసం ఆన్లైన్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఆర్టీసీ పాలకమండలిలో మెజార్టీ సభ్యులు అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆమేరకు తీర్మానం ఆమోదించారు. దీంతో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. కీలక నేతతో డీల్.. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతను ఆశ్రయించారు. ఆయన సామాజికవర్గానికే చెందిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అంతా తానై ఈ కథ నడిపించారు. ఆ ఎమ్మెల్సీ సూచన మేరకు అద్దెబస్సుల యజమానులు ఈ నెల 10 విజయవాడలోని ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో 9 ఏళ్ల పాటు ఒప్పందాన్ని రెన్యువల్ చేసేందుకు ఎమ్మెల్సీ ప్రతిపాదించిన డీల్‌మీద చర్చించారు. ఒక్కో బస్సుకు రూ.50 వేల చొప్పున వసూలు చేసి ఉత్తరాంధ్ర కీలకనేతకు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే దాదాపు రూ.70 లక్షలు ఉత్తరాంధ్ర కీలక నేతకు ముట్టజెప్పనున్నారన్నమాట. ఇక ఎమ్మెల్సీకి, ఆర్టీసీ పెద్దకు, జోనల్‌స్థాయి ప్రతినిధులకు ముడుపులు దీనికి అదనం. టెండర్ల ప్రక్రియకు బ్రేక్..? డీల్ కుదిరిన విషయాన్ని ఎమ్మెల్సీ కీలక నేతకు తెలిపారు. దాంతో ఆయన వెంటనే రంగంలోకి దిగారు. అద్దె బస్సుల కోసం తాజాగా టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని మౌఖికంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సుల ఒప్పందాలను నిబంధనలకు విరుద్ధంగా రెన్యూవల్ చేయలేమని చెబుతున్నారు. ప్రస్తుతానికి కీలక నేత ఆదేశాలతో టెండర్ల ప్రక్రియ అయితే తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే ఆ కీలక నేత పట్టుబడుతుండటంతో అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యూవల్ చేయకతప్పదని తేల్చిచెబుతున్నారు. -
ఆర్టీసీలో ‘కుల’కలం!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు అధికారులపై ఒకే తరహా ఫిర్యాదులొచ్చాయి. విజిలెన్సు విచారణలో అవి నిజమేనని తేలాయి. కానీ ఓ అధికారిని విధుల నుంచి తొలగించారు... మరో అధికారి ఆ తర్వాత ప్రమోషన్ అందుకుని పెద్ద పోస్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడీ అంశం ఆర్టీసీలో వివాదానికి కారణమవుతోంది. వేటు పడ్డ అధికారి ఎస్సీ కావటమే దీనికి కారణం. సొంతంగా బస్సులు కొనటం ఆర్టీసీ భారంగా భావిస్తుండటంతో కొంతకాలంగా అద్దె బస్సులను పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటోంది. వీటి పరిమితిపై ఉన్న నిబంధనను కూడా సడలించి వాటి సంఖ్యను పెంచుకుంటోంది. ఇది కొందరు ఉన్నతాధికారులకు ఆదాయవనరుగా మారింది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఈ బస్సుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు దండుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఆ బస్సులు నడుపుకు నేందుకు అనుమతించినా, ఈ అధికారి మాత్రం ఒక్కో బస్సు నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించి, మరో జిల్లా రీజినల్ మేనేజర్‌కు ఆ బాధ్యత అప్పగించారు. ఆయన కూలంకషంగా విచారణ జరిపి వసూళ్లపై ఆధారాలున్నట్టు నివేదిక సమర్పించారు. మరో కేసులో.. వరంగల్‌లో కూడా ఇదే స్థాయి అధికారి అద్దె బస్సులపై పడి జేబులు నింపేసుకున్నాడు. దీనిపై కూడా బస్‌భవన్‌కు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణ చేసి ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. రాజుకున్న కుల వివాదం నల్లగొండలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి పదోన్నతి పొంది బస్‌భవన్‌లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇది కులం రంగు పులుముకొంది. వేటుపడిన అధికారి ఎస్సీ కావటంతో ఆ వర్గం అధికారులు, సిబ్బంది దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒకే నేరానికి శిక్ష కూడా ఒకే రకంగా ఉండాలని కోరుతున్నారు. ఎస్సీ అధికారిపై వేటువేసి, మరో కులానికి చెందిన అధికారిని కాపాడటం కుల వివక్షగానే పరిగణించాలంటూ వారు ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తీవ్ర ఆరోపణలున్నా.... నల్లగొండ జిల్లాలో పనిచేసి బదిలీ అయిన అధికారిపై గతంలో కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా బస్టాండ్లలో దుకాణాల కేటాయింపులో ఆయన హస్తలాఘవం ప్రదర్శించారన్నది ప్రధాన ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా పదార్థాలు, వస్తువులు అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో మిగ తా దుకాణాలు ఖాళీగా ఉండిపోయి ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లింది. ఆయన అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత స్థానిక అధికారులు మళ్లీ వాటికి టెండర్లు పిలిచారు. కానీ దుకాణదారులతో కుమ్మక్కై ఆ అధికారి టెండర్లు రద్దు చేయించారు. -
అయ్యో ఆర్టీసీ
ప్రైవేటుకు బాటలు..సంస్థకు బీటలు సొంత నియామకాలకు చెల్లుచీటీ.. ఇక అంతా ఔట్‌సోర్సింగే చివరకు సెక్యూరిటీ బాధ్యతా ‘ప్రైవేటు’కే.. 18 శాతం నుంచి 28 శాతానికి పెరిగిన ‘అద్దె’ బస్సులు తార్నాక ఆస్పత్రి ఫార్మసీ ప్రైవేటుకు టైర్ రీ ట్రేడింగ్ యూనిట్‌కు తాళం.. రేపోమాపో సొంత ప్రింటింగ్ ప్రెస్ మూత ఆర్టీసీ.. సగటు ప్రయాణికుడిపైనే తప్ప మరెవరిపై ఆధారపడకుండా ఇన్నాళ్లూ తన మనుగడను సుస్థిరం చేసుకుంటూ సాగిన ఈ సంస్థ ఇప్పుడు క్రమంగా ‘పరాన్న జీవి’గా మారుతోంది! సంస్థ నిండా సొంత కార్మికులు.. అవసరాలను తీర్చుకునేందుకు సొంత అనుబంధ సంస్థలు.. ఈ రాజఠీవీని చరిత్ర పుటల్లోకి తోసి.. ‘ప్రైవేటు’పై ఆధారపడి కుంటి నడకకు సిద్ధమైంది. సొంతంగా సిబ్బందిని సమకూర్చుకోకుండా ప్రైవేటు సంస్థల ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవటం, సొంత అనుబంధ సంస్థలను మూసేసి సేవలన్నింటినీ ప్రైవేటు సంస్థలకు అప్పగించటం... వెరసి ప్రపంచంలోనే గొప్ప రవాణా సంస్థగా గిన్నిస్ రికార్డు సాక్షిగా వెలుగొందిన ఆర్టీసీ ఇప్పుడు ప్రైవేటు చాటున మిణుకుమిణుకుమంటోంది. ఐదేళ్లుగా నియామకాల్లేవ్ దేశంలో ప్రభుత్వపరంగా ప్రజా రవాణా వ్యవస్థలున్న రాష్ట్రాల్లో మన ఆర్టీసీ(ఉమ్మడి రాష్ట్రం)దే అగ్రస్థానం. లక్షన్నర మంది సిబ్బందితో కళకళలాడేది. రాష్ట్ర విభజన తర్వాత కూడా 57 వేల మందితో ఉనికి చాటుకుంది. కానీ నష్టాల బూచీతో బుగులుపడి నియామకాల విషయంలో వెనుకడుగు వేసింది. దాదాపు ఐదేళ్లుగా నియామకాల్లేవు. దీంతో సిబ్బంది సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇద్దరి పనిని ఒకరితో చేయించే విధానం రావటంతో మరిన్ని పోస్టులు కాలగర్భంలో కలిసిపోయాయి. కండక్టర్ల నియామకం ఇక చేపట్టొద్దన్న ఆలోచనతో ఉంది. దూరప్రాంతాల సర్వీసుల్లో డ్రైవర్లకే టిమ్ యంత్రాలు ఇచ్చి కండక్టర్ లేని సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్‌లో కూడా స్మార్ట్ కార్డులు, వాటిని గుర్తించే సెన్సార్ల ఏర్పాటుతో కండక్టర్ పోస్టులకు మంగళం పాడబోతోంది. సిబ్బంది సంఖ్య.. 2015 మే: 56,000 ప్రస్తుతం: 53,700 ‘హైర్’ హవా.. కొత్త బస్సు వేయడమంటేనే భారంగా భావిస్తోంది ఆర్టీసీ. అందుకే హైర్(అద్దె) బస్సుల వైపు మొగ్గుచూపుతోంది. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న అద్దె బస్సులు ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి. కొత్త రూట్లు గుర్తించి టెండర్లు పిలిచి అద్దె బస్సులను రోడ్లపైకి ఎక్కిస్తోంది. గతంలో మొత్తం బస్సుల సంఖ్యలో 18 శాతానికి మించకుండా అద్దె బస్సులు తీసుకునేవారు. ఇప్పుడు గేట్లు బార్లా తెరిచి దాన్ని 28 శాతానికి పెంచేశారు. అద్దె బస్సుల సంఖ్య..2015 మే:1,643ప్రస్తుతం:2,184 ∙తగ్గుతున్న షెడ్యూళ్లు... జనాభా పెరిగేకొద్ది వాహనాల సంఖ్య పెరగటం సాధారణం. పదేళ్ల క్రితం రాష్ట్రంలో 28 లక్షల వాహనాలుంటే ఇప్పుడు 77 లక్షలను మించాయి. ఈ సూత్రం ఆర్టీసీ బస్సులకు కూడా వర్తించాలి. కానీ కొంతకాలంగా ఆర్టీసీ బస్సు షెడ్యూళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఏటేటా వాటిని తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇతర రవాణా సాధనాల వైపు మళ్లుతున్నారు. ఆర్టీసీ బస్ షెడ్యూళ్ల సంఖ్య..2015 మే: 8,842 ప్రస్తుతం: 7,822 అంతా ఔట్సోర్సింగ్ ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ హవా పెరుగుతోంది. కార్మికులు డిమాండ్ చేసిన దానికంటే ప్రభుత్వం ఎక్కువ ఫిట్మెంట్(44 శాతం) ప్రకటించడంతో సంస్థలో కొత్త పోకడ మొదలైంది. భారీగా పెరిగిన జీతాలను భరించటం సంస్థకు ఇబ్బందిగా మారింది. ఉన్న సిబ్బందికి జీతాలిచ్చేందుకే నెలనెలా దిక్కులు చూస్తోంది. ఈ పరిస్థితిలో కొత్త నియామకాల ఊసే ఎత్తడం లేదు. విభాగాల వారీగా పత్రికా ప్రకటన జారీ చేస్తూ ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేస్తోంది. ఇటీవల సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి ఇదే పద్ధతి అనుసరించింది. తాజాగా ఉప్పల్ వర్క్‌షాపులోని టైర్ రీ ట్రేడింగ్, క్యాంటీన్, డిపో మెయింటెనెన్స్ సిబ్బందిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకునేందుకు ప్రకటన విడుదల చేసింది. అనుబంధ సంస్థలకు తాళం ఆర్టీసీ అనుబంధ సంస్థలు ఒక్కొక్కటిగా ప్రైవేటుపరమవుతున్నాయి. ఇటీవల తార్నాకలోని ఆర్టీసీ ప్రధాన ఆస్పత్రిలో మందుల సరఫరా విభాగాన్ని ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. వరంగల్‌లోని టైర్ రీ ట్రేడింగ్ యూనిట్‌ను మూసేసింది. కరీంనగర్, ఉప్పల్‌లోని యూనిట్ల ఉత్పత్తి తగ్గించుకుంది. కొద్ది రోజుల్లో అవి కూడా మూతపడతాయన్న వాదన వినిపిస్తోంది. మియాపూర్‌లో ఉన్న సొంత ప్రింటింగ్ ప్రెస్‌కు కొద్దిరోజుల్లో తాళం పడబోతోంది. ప్రింటింగ్ అవసరాలను ప్రైవేటుకు అప్పగించి సిబ్బంది సంఖ్యను భారీగా కుదించింది. ఇప్పటికే బస్ బాడీ తయారీ పనులను ఎక్కువగా ప్రైవేటుకు అప్పగిస్తోంది. వెరసి సొంత యూనిట్‌ను కూడా మూసే అవకాశం ఉందనే సంకేతాలిస్తోంది. సాక్షి, హైదరాబాద్ -
అద్దెబస్సు ‘ముంచుతోంది’
♦ ఈ ఏడాది నష్టాలు... ♦ గ్రేటర్ ఆర్టీసీకి లభించిన ఆదాయం ♦ రూ.1330.47 కోట్లు ♦ బస్సుల నిర్వహణకు చేసిన ఖర్చు ♦ రూ.1685.15 కోట్లు ♦ నష్టం రూ.354.75 కోట్లు సాక్షి, సిటీబ్యూరో: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీపై అద్దె బస్సులు పిడుగుపాటుగా మారాయి. వాటిపై వచ్చే ఆదాయం కంటే చెల్లించే అద్దె భారంగా పరిణమించింది. కొత్త బస్సులు కొనలేని స్థితిలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకొని నడుపుతున్న 462 బస్సులపై గ్రేటర్ ఆర్టీసీ ఈ ఏడాది రూ.80 కోట్లు అద్దె రూపంలో చెల్లించింది. కానీ ఆ బస్సుల నిర్వహణ ద్వారా ఆర్టీసీకి లభించిన ఆదాయం మాత్రం కేవలం రూ.58 కోట్లు కావడం గమనార్హం. అంటే ఒక్క ఏడాది కాలంలోనే వచ్చిన ఆదాయం కంటే అదనంగా రూ.22 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. నిత్యం పొదుపు మంత్రం పాటించే ఆర్టీసీ అద్దె బస్సులపై కోట్లాది రూపాయాలు అదనంగా చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. అద్దె డబ్బుతో 150 కొత్త బస్సులు సొంతంగా సమకూర్చుకునే అవకాశం ఉండేది. కేవలం ప్రైవేట్ ఆపరేటర్ల స్వలాభం కోసమే ఆర్టీసీ యాజమాన్యం బస్సులను అద్దెకు తీసుకుంటోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ ఆర్టీసీ నష్టాలు ఈ ఏడాది రూ.354.75 కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రూ.701 కోట్ల నష్టాలు నమోదు కాగా, ఒక్క గ్రేటర్ ఆర్టీసీలోనే సగానికిపైగా నష్టాలు రావడం గమనార్హం. అద్దె బస్సులకు పొదుపు మంత్రం వర్తించదా.... గ్రేటర్ జోన్‌లోని 28 డిపోల ద్వారా ప్రతి రోజు 3550 బస్సులు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 462 బస్సులను రెండు దఫాలుగా అద్దెకు తీసుకున్నారు. మొత్తం 1050 కి పైగా రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు రోజుకు 220 నుంచి 300 కిలోమీటర్ల వరకు తిరుగుతాయి. అద్దె బస్సులు తిరిగే రూట్లు, బస్సుల కండిషన్ దృష్ట్యా ఒక కిలోమీటర్‌కు రూ.18 నుంచి రూ.22 చొప్పున ఆర్టీసీ చెల్లిస్తుంది. అయితే ఈ బస్సుల నిర్వహణ ద్వారా ఒక కిలోమీటర్‌పై ఆర్టీసీకి వచ్చే ఆదాయం పట్టుమని రూ.10 కూడా ఉండడం లేదు. -
అద్దెబస్సుల బిల్లు.. ఆర్టీసీ ఖజానాకు చిల్లు
♦ రూట్ సర్వే చేయకుండానే కిలోమీటర్ల లెక్క తేల్చిన అధికారులు ♦ ఒక్కో ట్రిప్పులో 20 కిలోమీటర్ల ఎక్కువ నమోదు ♦ రూ.లక్షల్లో అదనపు చెల్లింపులు ఆలస్యంగా వెలుగుచూసిన వ్యవహారం సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సుల అడ్డగోలు బిల్లులు ఆర్టీసీ ఖజానాకు చిల్లులు పెడుతున్నాయి. అక్రమాలు, అవకతవకలకు అడ్డూఅదుపూలేకుండా పోయింది. ఇంత దగా చేస్తున్నా నిఘా సంస్థ మొద్దునిద్ర వీడడంలేదు. డొక్కు బస్సులకు కూడా కొత్త బస్సు లెక్కల ప్రకారం బిల్లులు చెల్లిస్తూ ఇటీవల సిబ్బంది అడ్డంగా దొరికిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు ఏకంగా ఆ బస్సులు వాస్తవంగా తిరిగిన కిలోమీటర్లతో సంబంధం లేకుండా అడ్డదిడ్డంగా బిల్లులు చెల్లిస్తున్న తీరు వెలుగు చూసింది. నిఘా, ఆడిట్ విభాగాలు ఉన్నా దాన్ని పట్టుకోలేకపోతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఈ బాగోతం వెలుగుచూసింది. కానీ, చాలా చోట్ల ఇదే తరహా అవకతవకలు జరుగుతున్నట్టు పలువురు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ సంగతి... ఐదు నెలల క్రితం కొత్తగా ఆర్టీసీ 600 అద్దె బస్సులు తీసుకుంది. ఇవి నాలుగు నెలల నుంచి దశలవారీగా రోడ్డెక్కుతున్నాయి. తాజాగా ఈ బస్సులకు చెల్లిస్తున్న బిల్లులో లొసుగులు చోటుచేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఒక అద్దె బస్సు రాగానే... అది తిరిగే రూట్లో అధికారులు సర్వే చేయాల్సి ఉంటుంది. దానికి కేటాయించిన మార్గం ఎన్ని కిలోమీటర్ల మేర ఉందో అదే బస్సు లో ప్రయాణించి అధికారులు సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారు. దాని ఆధారంగా అది తిరిగిన ట్రిప్పుల సంఖ్యను తేల్చి నెల కాగానే బిల్లు సిద్ధం చేస్తారు. కానీ కొత్తగా వచ్చిన అద్దెబస్సుల్లో కొన్నిచోట్ల ఈ రూట్ సర్వే చేయలేదని తేలింది. గతంలో ఆ మార్గంలో నడిచిన అద్దెబస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరిగాయో చూసి వాటి ఆధారంగా కొత్త బస్సులకూ బిల్లు లెక్కగట్టారు. పాత అద్దె బస్సులు ఆయా మార్గాల్లో కొన్ని గ్రామాలను కూడా చుట్టొచ్చేవి. కానీ కొత్త బస్సులకు ఆ గ్రామాలను కేటాయించలేదు. అంటే కొత్త బస్సులు ఆ మార్గంలో తిరిగే దూరం తగ్గిపోయింది. కానీ పాత బస్సుల ప్రకారం ఎక్కువ దూరం తిరిగినట్టుగా అధికారులు లెక్కలు తేల్చి నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నారు. వరంగల్ జిల్లాలో కొన్ని బస్సులకు అలా ప్రతి ట్రిప్పులో 20 కిలోమీటర్లకుపైగా అదనపు కిలోమీటర్లను జోడించారు. అంటే ఒక్కో ట్రిప్పులో దాదాపు రూ.500పైగా అదనంగా చెల్లించినట్టయింది. ఇది నెల తిరిగేసరికి లక్షల్లోకి చేరుకుంది. ఇలా గత నాలుగు నెలలుగా అదనపు బిల్లులు చెల్లిస్తున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో అసలు ఎన్ని బస్సులకు అక్రమంగా చెల్లించారన్నదానిలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఉన్నతాధికారులు హడావుడిగా మిగతాచోట్ల పరిస్థితిని తేల్చే పనిలో పడ్డారు. -
ఏపీఎస్ ఆర్టీసీలో ఆద్దె బస్సులకు టెండర్లు
-
ఆర్టీసీ అద్దె బస్సులు డేంజర్
పల్లె వెలుగు అద్దె బస్సులు ప్రయాణికుల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల అనేక ప్రాంతాలలో ఆర్టీసీ అద్దె బస్సుల టైర్లు ఊడిపోవడం, చక్రం రాడ్లు విరిగిపోవడం వంటి సంఘ టనలు జరిగాయి. కొన్నిచోట్ల డ్రైవర్ల అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, కొన్నిచోట్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డారు. ముఖ్యంగా అనేక బస్సులు ఫిట్నెస్ లేకుండా, కాలం చెల్లినవి ఉన్నాయి. డిపో అధికారులు, మెకానికల్ సిబ్బంది సరైన తనిఖీ చేయకుండానే బస్సులను డిపోల నుండి వదులు తున్నారు. నిబంధనల ప్రకారం బస్సును డిపోలో క్షుణ్ణంగా ఆయా యంత్రాలను తనిఖీ చేయాలి. చెడిపోయిన భాగాలను మరమ్మతులు చేయాలి. అలాగే దుమ్ము, ధూళితో ఉన్న బస్సులను శుభ్రం చేయాలి. కానీ ఇవేవీ చేయడం లేదు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో భయంతో ప్రయాణిస్తున్నారు. అలాగే దుమ్ము, ధూళి బస్సులలో బాగా ఉండటంతో శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం కాలం చెల్లిన బస్సులను నిషేధించాలి. బస్సు కండిషన్ తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలి. అలాగే బస్సులలో పరిశుభ్రతపై దృష్టి సారించాలి. - బి. ప్రేమ్‌లాల్ వినాయక్ నగర్, నిజామాబాద్