
మహబూబ్‌నగర్ డిపోలోని బస్సులు
ఆదాయం పెంచుకునే విధంగా ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రజలకు చేరువలో ఆర్టీసీ అనే విధంగా తగిన చర్యలు తీసుకుంటుంది. గతంలో జరిగిన 50 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె, కరోనా మహమ్మారితో విధించిన లాక్‌డౌన్‌తో సంస్థ భారీ ఆదాయాన్ని కోల్పోయి నష్టాలు చవిచూసింది. లాక్‌డౌన్ అనంతరం తిరిగి బస్సులు నడిపినా ప్రయాణికుల నుంచి అంతగా స్పందన లేకపోవటం కూడా ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో అదనపు ఆదాయం కోసం ఆర్టీసీలో ఇటీవలñ పలు సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పార్సిళ్లు, కొరియర్ సేవల కోసం ప్రత్యేక కార్గో బస్సులను ప్రవేశపెట్టింది.
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం శుభకార్యాలు, పెళ్లిళ్లు, విజ్ఞాన, విహార యాత్రల రవాణా అవసరాల కోసం అద్దె ప్రాతిపదికన ‘ప్రత్యేక బస్సు’ సౌకర్యం కల్పిస్తోంది. అయితే ప్రయాణికులకు మరింత సులభతరంగా, ఆకర్శవంతంగా ఉండే విధంగా అద్దె బస్సుల విధానాలను సరళీకృతం చేస్తూ ఛార్జీలను భారీగా తగ్గించింది. రిఫండబుల్ కాషన్ డిపాజిట్, స్లాట్ విధానాన్ని రద్దు చేసింది. కేవలం బస్సు తిరిగిన కిలోమీటర్ల వరకు మాత్రమే చార్జీ వసూలు చేయనున్నారు.
కిలోమీటర్ల వారీగా..
ప్రయాణికులను బస్సులో ఎక్కించుకొని, దింపే రాకపోకల దూరాన్ని కనీసం 200 కిలోమీటర్ల వరకు నిర్ధారించారు. ప్రస్తుత విధానంలో (పికప్, డ్రాప్) ప్రయాణికులను కావాల్సిన చోట దించుతారు. తిరుగు ప్రయాణానికి నిర్దేశించిన సమయానికి వచ్చి తీసుకెళ్తారు. పికప్, డ్రాప్ విధానంలో ఎలాంటి డిపాజిట్లు లేకుండా బస్సు తిరిగిన కిలోమీటర్లకు వందశాతం సీటింగ్ కెపాసిటీ (ఆక్యూపెన్సి రేట్)పై సాధారణ ఛార్జీలకు 50శాతం అదనంగా తీసుకుంటారు. 200 కిలోమీటర్ల దూరం (రాను, పోను కిలోమీటర్లు) ఆపై ప్రయాణంకు ఎక్స్‌ప్రెస్ బస్సు తిరిగిన కిలోమీటర్లకు సాధారణ చార్జీలు, సీటింగ్ కెపాసిటీ (100శాతం ఓఆర్)పై లెక్కింపు, పల్లె వెలుగు బస్సులకు సాధారణ చార్జీలపై 10 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తారు. సూపర్ లగ్జరీ బస్సుకు కనీస దూరం 300 కిలోమీటర్లు, ఏసీ బస్సుల కనీస దూరం 400 కిలోమీటర్లు, వీటికి 100శాతం సీటింగ్ కెపాసిటీపై సాధారణ చార్జీలను తీసుకుంటారు. నిర్ణీత సమయానికి మించి దాటితే బస్సు వెయిటింగ్ చార్జీ గంటకు రూ.300లు వసూలు చేస్తారు. గతంలో కంటే ప్రస్తుత విధానం ప్రకారం 200 కిలోమీటర్ల వరకు బస్సును అద్దెకు తీసుకుంటే ప్రయాణికులకు దాదాపు రూ.2500 నుంచి 3వేల వరకు తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment