TSRTC Launched Pallevelugu Town Bus Pass in Karimnagar, Mahabubnagar - Sakshi
Sakshi News home page

Pallevelugu Town Bus Pass: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. కొత్తగా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్‌’

Published Mon, Jul 17 2023 2:23 PM | Last Updated on Mon, Jul 17 2023 2:57 PM

TSRTC Launched Pallevelugu Town Bus Pass In karimnagar Mahabubnagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌కు  శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. 

ఈ టౌన్‌ పాస్‌లో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్‌లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్‌ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌’ను సంస్థ తెచ్చింది.  

హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో సోమవారం ‘పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌’ పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. 

‘జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్‌’ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్‌ను అమలు చేస్తున్నాం. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్‌ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్‌ను విస్తరిస్తాం.

వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్‌లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్‌ను హైదరాబాద్, వరంగల్‌లో  మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.

ఈ బస్ పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్‌ రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఈడీలు మునిశేఖర్‌, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: హైదరాబాద్‌కు అతిభారీ వర్ష సూచన!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement