పల్లె వెలుగు అద్దె బస్సులు ప్రయాణికుల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల అనేక ప్రాంతాలలో ఆర్టీసీ అద్దె బస్సుల టైర్లు ఊడిపోవడం, చక్రం రాడ్‌లు విరిగిపోవడం వంటి సంఘ టనలు జరిగాయి. కొన్నిచోట్ల డ్రైవర్ల అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, కొన్నిచోట్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డారు. ముఖ్యంగా అనేక బస్సులు ఫిట్‌నెస్ లేకుండా, కాలం చెల్లినవి ఉన్నాయి. డిపో అధికారులు, మెకానికల్ సిబ్బంది సరైన తనిఖీ చేయకుండానే బస్సులను డిపోల నుండి వదులు తున్నారు. నిబంధనల ప్రకారం బస్సును డిపోలో క్షుణ్ణంగా ఆయా యంత్రాలను తనిఖీ చేయాలి. చెడిపోయిన భాగాలను మరమ్మతులు చేయాలి. అలాగే దుమ్ము, ధూళితో ఉన్న బస్సులను శుభ్రం చేయాలి. కానీ ఇవేవీ చేయడం లేదు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో భయంతో ప్రయాణిస్తున్నారు. అలాగే దుమ్ము, ధూళి బస్సులలో బాగా ఉండటంతో శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం కాలం చెల్లిన బస్సులను నిషేధించాలి. బస్సు కండిషన్ తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలి. అలాగే బస్సులలో పరిశుభ్రతపై దృష్టి సారించాలి.
- బి. ప్రేమ్‌లాల్ వినాయక్ నగర్, నిజామాబాద్
ఆర్టీసీ అద్దె బస్సులు డేంజర్
Published Tue, Feb 10 2015 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM
Advertisement