ఏదాదిలో చెరి సగం కానున్న సంఖ్య
మూడేళ్లలో రెట్టింపు అయ్యే పరిస్థితి
డ్రైవర్ పోస్టులను కోల్పోనున్న ఆర్టీసీ
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు
సాక్షి, హైదరాబాద్ : అద్దె బస్సులు ఆర్టీసీని కబళించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి రూపొందించిన ప్రణాళిక ప్రకారం అద్దె బస్సులు సమకూరితే, ఆర్టీసీ సొంత బస్సుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. క్రమంగా ఇది సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేయనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అద్దె బస్సుల సంఖ్యను పెంచటంపై చాలాకాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.
సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని నిధుల వినియోగంపై ప్రభుత్వం అనధికారికంగా పరిమితులు విధిస్తుండటంతో, సొంతంగా కొత్త బస్సులు కొనటం ఆర్టీసీకి కష్టంగా మారింది. దీంతో అద్దె బస్సులకు గేట్లు బార్లా తెరిచేస్తోంది. అద్దె బస్సులకు డ్రైవర్లను వాటి నిర్వాహకులే నియమిస్తారు. డ్రైవర్ల జీతాల పద్దు తగ్గుతుండటంతో ఆర్టీసీ దీనివైపు మొగ్గు చూపుతోంది.
30 శాతానికి చేరిన అద్దె బస్సులు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014లో ఆర్టీసీలో అద్దె బస్సుల వాటా 17 శాతం మాత్రమే. అద్దె బస్సుల సంఖ్యపై పరిమితి ఉన్నందున, అంతకు మించి వాటిని సమకూర్చుకునేందుకు వీలుండేది కాదు. కానీ ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు బకాయి పడటం, గ్రాంట్లు ఇవ్వకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటి సంఖ్య పెంచుతూ వస్తున్నారు.
ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 9,800 బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ప్రైవేటు వ్యక్తులు ఆర్టీసీకి అద్దెకిచ్చిన బస్సులు 2,800 ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’పథకం కింద సమకూరి హైదరాబాద్ విమానాశ్రయానికి తిప్పుతున్న 40 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒలెక్ట్రా అన్న సంస్థ అద్దెకిచ్చినవే. అదే సంస్థ ఇటీవల మరో 100 బస్సులు సమకూర్చింది.
ఇటీవల ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ మరో 90 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చింది. అలాగే మరో 40 బస్సులు కూడా కొత్తగా వచ్చాయి. వీటిని ప్రారంభించాల్సి ఉంది. ఇలా ప్రస్తుతం మొత్తం బస్సుల్లో అద్దె బస్సుల వాటా దాదాపు 30 శాతానికి చేరింది. ఇక ఏడాది, ఏడాదిన్నరలోగా ఆర్టీసీ, అద్దె బస్సుల సంఖ్య చెరి సగం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ముంచెత్తనున్న అద్దె బస్సులు
హైదరాబాద్‌లో తిరిగేందుకు మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉంది. వాటిల్లో కొన్ని వచ్చాయి. ఏడాది కాలంలో మరో 400 సమకూరుతాయి. జేబీఎం సంస్థ కూడా 500 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చాల్సి ఉంది. ఇప్పటికి కొన్ని బస్సులే రాగా మరో 400 బస్సులను సమకూర్చాల్సి ఉంది. దశలవారీగా అవి కూడా వస్తాయి. ఇక హైదరాబాద్‌లో కాలుష్యాన్ని నివారించేందుకు మొత్తం బ్యాటరీ బస్సులనే తిప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘పీఎం ఈ–డ్రైవ్’పథకం కింద 2,800 బస్సులు మంజూరు చేయాలంటూ ఆర్టీసీ దరఖాస్తు చేసింది. దేశవ్యాప్తంగా ఆ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు తిప్పేందుకు కేంద్రం 9 నగరాలను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. అంటే ఆర్టీసీ దరఖాస్తు మేరకు ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కానున్నాయి. తాజాగా మహిళా సంఘాలు 1,000 బస్సులను ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మూడేళ్లలో అద్దె బస్సుల సంఖ్య 8 వేలకు చేరే అవకాశం ఉంది. అప్పుడు ఆర్టీసీ సొంత బస్సులు 6 వేల లోపే ఉంటాయి. అయితే అప్పటికి చాలా బస్సులు పాతబడి తుక్కుగా మారిపోతాయి. వాటి స్థానంలో కొత్తగా సొంత బస్సులు రాకపోతే ఆర్టీసీ సొంత బస్సుల సంఖ్య 4 వేలకు తగ్గుతుంది. అద్దె బస్సులు భారీగా వస్తున్నందున సొంత బస్సులు కొనేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపే పరిస్థితి ఉండదని అంటున్నారు.
డ్రైవర్ల నియామకం అంతేనా?
ఆర్టీసీలో ప్రస్తుతం డ్రైవర్లకు కొరత ఉంది. దీంతోఇటీవలే దాదాపు 2 వేల పోస్టుల భర్తీకి ఆర్టీసీ ప్రతిపాదించింది. దానికి ప్రభుత్వం కూడా సమ్మతించి రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఆదేశాలిచ్చి0ది. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది. కానీ వాటి ఊసే లేకుండాపోయింది. భవిష్యత్తులో అద్దె బస్సుల సంఖ్య పెరుగుతున్నందున సొంత డ్రైవర్ల అవసరం అంతగా ఉండదన్న ఉద్దేశంతోనే ఎంపిక ప్రక్రియను వాయిదావేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సంస్థ మనుగడకేప్రమాదం: సంఘాల నేతలు
‘ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య విచ్చలవిడిగా పెరగటం సంస్థకు మంచిది కాదు. భవిష్యత్తులో సంస్థ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తుంది. ఇది ప్రైవేటీకరణను ప్రేరేపిస్తుంది. గతంలోలాగా అద్దె బస్సుల సంఖ్యపై సీలింగ్ విధించి కావాల్సినన్ని బస్సులను ప్రభుత్వమే కొనాలి..’అని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నరేందర్, నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment