
పీఎం ఈ–డ్రైవ్ పథకం కిందకేంద్రం ఆమోదం
సబ్సిడీ విడుదలకు రెండు రోజుల క్రితం ఓకే.. మార్చి చివరలోటెండర్లు.. జూన్ నాటికి ప్రక్రియ పూర్తి
ఆ తర్వాత విడతలవారీగా బస్సుల సరఫరా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు భారీగా రాబోతున్నాయి. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద 2,800 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని గత సెప్టెంబర్ లో తెలంగాణ ఆర్టీసీ కేంద్రానికి దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తాజాగా ఆర్టీసీ కోరిన బస్సులకు సబ్సిడీ మొత్తాన్ని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
త్వరలో ఈ బస్సుల సరఫరాకు టెండర్లు పిలవనున్నారు. జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సరఫరా ప్రారంభించనున్నారు. టెండర్ దక్కించుకునే సంస్థ విడతలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) విధానంలో నిర్వహిస్తుంది.
ప్రస్తుతానికి రెండు నగరాలకే..
దేశవ్యాప్తంగా 40 లక్షల కంటే ఎక్కువ జనా భా ఉన్న 9 నగరాల్లో వీలైనన్ని ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ–డ్రైవ్ పథకం మొదటి విడతలో లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడత 2026 మార్చి వరకు కొనసాగనుంది. ఇందులో మొత్తం 14,028 బస్సులను సరఫరా చేయా లని నిర్ణయించింది. ఇందుకోసం 4,391 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 2,800 బస్సులు ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ దరఖాస్తు చేసింది.
బెంగళూరు సిటీ కోసం కర్ణాటక ఆర్టీసీ 7 వేల బస్సులు కోరింది. కేంద్రం ఈ రెండు నగరాలకు 9,800 బస్సుల సబ్సిడీ మొత్తానికి ఆమోదం తెలిపింది. ఈ పథకంలో పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం అనే అంశాన్ని కేంద్రం పొందుపరిచింది. జీసీసీ పద్ధతిలో ప్రైవేటు సంస్థ ఈ బస్సులను ఆర్టీసీ పరిధిలో నిర్వహిస్తుంది. ఆ బస్సులు తిరిగిన దూరం ఆధారంగా అద్దెను ఆ సంస్థకు ఆర్టీసీ చెల్లించాలి.
ఒకవేళ నెల రోజులపాటు ఆర్టీసీ చెల్లించలేకపోతే, ఆ మొత్తాన్ని కేంద్రం చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తు పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం నుంచి ఆ మొత్తాన్ని తీసేసుకుంటుంది. అంతమేర సొమ్మును తిరిగి మూడు నెలల్లో రాష్ట్రం ఆ మెకానిజంలో భర్తీ చేయాల్సి ఉంటుంది. నగరానికి సరఫరా అయ్యే 2,800 బస్సులకు సాలీనా అద్దె దాదాపు రూ.120 కోట్లు ఉంటుందని ఆర్టీసీ అంచనా వేసింది. రూ.1.85 కోట్ల విలువైన ఒక్కో బస్సుపై గరిష్టంగా 30 శాతం వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తోంది.