electric buses
-
సిటీ డిపోలన్నీ ప్రైవేటుకే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆర్టీసీ డీజిల్ బస్సులను నగరం వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించటం ఆ సంస్థ ఉద్యోగులకు ప్రాణ సంకటంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. డీజిల్ బస్సుల స్థానంలో ప్రైవేటు సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని భావిస్తున్నారు. ఈ బస్సుల్లో కండక్టర్ తప్ప ఇతర సిబ్బంది అంతా సదరు సంస్థవారే ఉంటారు. దీంతో ఇప్పుడు నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది డీజిల్ బస్సులతోపాటే నగరం బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. సిటీ బయటకు 80 శాతం సిబ్బంది! ప్రస్తుతం నగరంలో 2,500 సిటీ బస్సులు తిరుగుతున్నా యి. విమానాశ్రయం సర్వీసులు, సిటీ సర్వీసులుగా తిరుగుతున్న కొన్ని నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మినహా అన్నీ డీజిల్ బస్సులే. ఇటీవలే ఎలక్ట్రిక్ పాలసీలో మార్పులు తెచి్చన రాష్ట్ర ప్రభుత్వం.. నగరంలో డీజిల్ బస్సులను తిప్పొద్దని నిర్ణయించింది. వీటిని ఔటర్ రింగురోడ్డు అవ తలికి తరలించి, నగరంలో ఎలక్ట్రిక్ బస్సులనే తిప్పాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఆర్టీసీ దరఖాస్తు చేసింది. ఆ పథకం కింద దేశవ్యాప్తంగా 9 నగరాలకు 14 వేల ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అందులో 2,800 బస్సులు తమకు అందజేయాలని టీజీఆర్టీసీ కోరింది. ఈ పథకానికి సంబంధించి ఈ నెలలో లేదా వచ్చే నెలలో కేంద్రం టెండర్లు పిలవనుంది. టెండర్లు దక్కించుకునే సంస్థలు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్థతిలో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో అద్దెకు తిప్పుతాయి. ఈ బస్సుల నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలదే. ఒక్క కండక్టర్ సర్వీసును మాత్రమే ఆర్టీసీ పర్యవేక్షిస్తుంది. డ్రైవర్, మెకానిక్, సెక్యూరిటీ వంటి బాధ్యతలను బస్సుల యజమానులే చూసుకొంటారు. దీంతో నగరంలోని ప్రస్తుత ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేటు బస్సులు నిలిపేందుకు కేటాయిస్తారు. రెండేళ్లలో దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు. డిపోలపై అజమాయిషీ మాత్రం ఆర్టీసీదే ఉండనుంది. అంటే, డిపో మేనేజర్, సహాయ మేనేజర్, కండక్టర్లకు టికెట్ యంత్రాలు అందివ్వటం, టికెట్ల ద్వారా వచ్చే నగదును లెక్కించి బ్యాంకుల్లో జమ చేయటం వంటి బాధ్యతలు చూసే కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఆర్టీసీలో ఉంటారు. డ్రైవర్లు, మెకానిక్–శ్రామిక్‌లు, సెక్యూరిటీ సిబ్బందిని రాష్ట్రంలోని ఇతర డిపోలకు పంపాల్సి ఉంటుంది. దీంతో నగరంలోని 80 శాతం మంది ఆర్టీసీ సిబ్బంది ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాల భర్తీ కూడా ఉండదని చెబుతున్నారు. ఇది ప్రైవేటీకరణే:కార్మిక సంఘాలుఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి వాటి సిబ్బంది ఆధ్వర్యంలో బస్సులను తిప్పటమంటే అంతమేర ఆర్టీసీని ప్రైవేటీకరించినట్టేనని ఆర్టీసీలోని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని సహించేది లేదని, ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. మరో వైపు జీసీసీ పద్ధతిలో బస్సుల నిర్వహణ చేపట్టినంత మాత్రాన దాన్ని ప్రైవేటీకరించినట్టు అనటం సరికాద ని ఉన్నతాధికారులు పేర్కొంటున్నా రు. డిపోల్లోని స్థలాలను మాత్రమే ఆయా సంస్థలు బస్సులు నిలుపుకోవటం, చార్జింగ్ చేయటం, నిర్వహణ పనులకు వినియోగించుకుంటాయని చెబుతున్నారు. డిపోల అజమాయిషీ పూర్తిగా ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటుందని అంటున్నారు. -
హైదరాబాద్–వరంగల్ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా విస్తరిస్తున్న వరంగల్‌కు భారీగా ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. త్వరలో ఇవి రాకపోకలు సాగించనుండగా, దశలవారీగా మొత్తం 82 ఎలక్ట్రిక్ బస్సులను వరంగల్–హైదరాబాద్ మధ్య నడపనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్‌ప్రెస్ (29) కేటగిరీ బస్సులున్నాయి. ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ఈ బస్సులను నిర్వహిస్తుంది. తెలంగాణలో తొలిసారి ఒలెక్ట్రా కంపెనీ బ్యాటరీ బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ రెండు పర్యాయాలు బస్సులను సరఫరా చేసి నిర్వహిస్తోంది. మూడో ప్రయత్నంలో ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ టెండర్ దక్కించుకుంది. ఇటీవలే కొన్ని బస్సులను కరీంనగర్, నిజామాబాద్ నుంచి ప్రారంభించింది. కానీ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత జనాభా, విస్తీర్ణం పరంగా పెద్ద పట్టణమైన వరంగల్‌కు ఎక్కువ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు 82 బస్సులు కేటాయించారు. వీటిని వరంగల్–2 డిపో ఆధ్వర్యంలో నడుపుతారు. సింహభాగం బస్సులు హైదరాబాద్‌కే.. హైదరాబాద్–వరంగల్ మధ్య బస్సులు ఎక్కువగా ఉంటాయి. నిత్యం రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటుండటంతో ఎక్కువ సర్వీసులు తిప్పుతారు. ఈ నేపథ్యంలోనే రెండు ప్రాంతాల మధ్య అదనంగా కొత్త బస్సులను తిప్పాలని సంస్థ నిర్ణయించింది. జేబీఎం సరఫరా చేసేవరకు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతున్నారు. కాగా తొలిసారి హైదరాబాద్ వెలుపల (హైదరాబాద్–విజయవాడ కాకుండా) ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఇక వరంగల్‌కు సరఫరా చేసే ఎలక్ట్రిక్ బస్సుల్లో మూడొంతులు హైదరాబాద్ రూట్లోనే తిప్పనున్నారు. వరంగల్–2 డిపోలో సిద్ధం చేసిన సెంటర్లో బ్యాటరీ చార్జ్ చేసి పంపిన తర్వాత, తిరుగు ప్రయాణం కోసం మళ్లీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో చార్జింగ్ పాయింట్లు ఉన్నందున హైదరాబాద్‌కే ఎక్కువ బస్సులు తిప్పనున్నారు. కరీంనగర్, నిజామాబాద్‌ల్లో ఇప్పటికే చార్జింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దీంతో కొన్ని బస్సులను వరంగల్ నుంచి ఆ రెండు నగరాలకు కూడా నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు తిప్పనున్నందున.. ప్రస్తుతం హైదరాబాద్–వరంగల్ మధ్య నడుస్తున్న డీజిల్ బస్సుల్లో కొన్నింటిని తప్పించి వరంగల్ నుంచి ఇతర ప్రాంతాల మధ్య నడపనున్నారు. -
‘పీఎం ఈ–డ్రైవ్’ కింద 2500 బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద మొత్తంలో సమకూర్చుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. పీఎం ఈ–డ్రైవ్ పథకంలో హైదరాబాద్ నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. నరేంద్రమోదీ తొలి దఫా ప్రభుత్వం అమలు చేసిన ‘ది ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) పథకంలో భాగంగా తెలంగాణ తొలిసారి ఎలక్ట్రిక్ బస్సులను పొందింది. వాటిని విమానాశ్రయానికి నడుపుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫేమ్–2లో కూడా కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంది. వాటిని దూర ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌లో సిటీ బస్సులుగా తిప్పుతోంది. ఈ రెండు పథకాలను నిలిపేసిన కేంద్రం పీఎం ఈ–డ్రైవ్ పేరుతో కొత్త పథకాన్ని మంగళవారం ప్రారంభించింది. దీని మార్గదర్శకాలు వెల్లడి కావటంతోనే, టీజీఎస్ ఆర్టీసీ ఈ పథకానికి ప్రతిపాదనలు పంపింది. ఈ పథకం అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి వరకు కొనసాగుతుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఈ పథకాన్ని ఆ శాఖ ద్వారానే కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఈ పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు, ఈ–రిక్షా/ ఈ–కార్డులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు, ఈ–ట్రక్కు లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు, టెస్టింగ్ ఏజన్సీల బలోపేతానికి ఈ నిధులు వినియోగిస్తారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 40 లక్షల జనాభా దాటిన నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తంగా 14,028 బస్సులు సమకూర్చడానికి రూ.4391 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను రెండు రోజుల క్రితమే వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ వెంటనే తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నగరానికి 2,500 బస్సులు కేటాయించాలని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసింది. వీలైనన్ని ఎక్కువ బస్సులు వచ్చేలా.. హైదరాబాద్‌లో వాహన కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇక్కడ డీజిల్ బస్సులను నడపొద్దని ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఉన్న బస్సులను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.1.85 కోట్ల వరకు ఉంది. అంత ఖర్చు భరించే పరిస్థితి లేనందున, గ్రాస్ కాస్ట్ మోడల్ పద్ధతిలో అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ద్వారా హైదరాబాద్‌కు ఎన్ని బస్సులు మంజూరు చేస్తుందో తేలిన తర్వాత, అన్ని బస్సులు జీసీసీ పద్ధతిలో నిర్వహించేందుకు వీలుగా టెండర్లు పిలవనుంది. æఒక్కో కిలోమీటరుకు తక్కువ అద్దెను ప్రతిపాదించే సంస్థను ఎంపిక చేస్తుంది. ఆ కంపెనీ అన్ని బస్సులను ఆరీ్టసీలో అద్దె ప్రాతిపదికన నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా పది డిపోల ఏర్పాటు.. ఈ బస్సులకు ప్రస్తుతమున్న డిపోలు సరిపోవని ఆర్టీసీ భావిస్తోంది. వాటి చార్జింగ్ వ్యవస్థ ఏర్పాటుకు చాలా స్థలం అవసరమవుతున్నందున కొత్తగా పది డిపోలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బస్సుకు రూ.30 లక్షల రాయితీ.. పీఎం ఈ–డ్రైవ్‌లో భాగంగా ఒక్కో బస్సు కొనుగోలుపై కేంద్రం రూ.30 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. గతంలో ఫేమ్–1లో ఆ మొత్తం రూ.50 లక్షలుండేది. గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కొంత సులభతరం కావటం, బ్యాటరీ ధరలు తగ్గటం, ఇప్పుడు మన దేశంలో కూడా బ్యాటరీలను తయారు చేస్తున్నందున సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం తగ్గించినట్టు సమాచారం. సబ్సిడీ అమలు చేస్తున్నందున బస్సులు సమకూర్చేందుకు తయారీ సంస్థలు పోటీ పడతాయని భావిస్తున్నారు. -
తెలంగాణకు 300 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, న్యూఢిల్లీ: ఫేమ్ ఇండియా పథకం రెండో దశలో భాగంగా తె లంగాణకు 300 ఎలక్ట్రి క్ బస్సులు మంజూరు చేశామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ తెలిపారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 6 వరకు తెలంగాణకు ఒక్క ఎలక్ట్రిక్ బస్సును కూడా ఇవ్వలేదని శుక్ర వారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కు మార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఫేమ్ రెండో దశలో దేశ వ్యాప్తంగా మొత్తం 6,862 ఎలక్ట్రిక్ బస్సులను వివిధ రాష్ట్రాలకు అందించాల్సి ఉండగా, 4,901 బస్సులను అందించామన్నారు. -
‘పల్లె’కూ బ్యాటరీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వెలుపలా ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో పరిమితంగా తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇటీవల హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయోగాత్మకంగా పది ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను గరుడ ప్లస్ కేటగిరీలో ప్రారంభించారు. ఇప్పుడు తొలిసారి రాష్ట్రపరిధిలో హైదరాబాద్‌తో ఇతర ప్రధాన పట్టణాలను ఎలక్ట్రిక్ బస్సులతో అనుసంధానించే బృహత్తర కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఇవి సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు కేటగిరీలో సేవలందించనున్నాయి. ఇప్పటివరకు నగరం వెలుపలి ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు లేవు. ఆ లోటును భర్తీ చేస్తూ 450 బస్సులు ఆర్టీసీ బస్సు శ్రేణిలో చేరబోతున్నాయి. మరో వారం తర్వాత నుంచి ఈ బస్సులు దశలవారీగా రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్–నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట మధ్య ఇవి తిరగనున్నాయి. నేషనల్ ఎలక్ట్రిక్ బస్సు ప్రోగ్రాం కింద సరఫరా.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటానని భారత్ ఐక్యరాజ్య సమితికి హామీ ఇచ్చి, ఆమేరకు చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే మోదీ ప్రభుత్వం గతంలో ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యూఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్)’పేరుతో పథకాన్ని ప్రారంభించింది. రెండుదశల్లో దీన్ని అమలు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయానికి నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు ఈ పథకం కింద వచ్చినవే. రెండోదశలో మరో 500 బస్సుల కోసం ఆర్టీసీ ప్రతిపాదించగా, అవి కూడా మంజూరయ్యాయి. కానీ కొన్ని కారణాలతో ఆ కాంట్రాక్టు వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండటంతో ఆ బస్సులు రాలేదు. ఇప్పుడు ఫేమ్ స్థానంలో కేంద్రప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు(ఎన్‌ఈబీపీ)ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కింద తెలంగాణ ఆర్టీసీకి 450 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో బస్సులు సరఫరా చేసే ఆ టెండర్‌ను ఢిల్లీకి చెందిన జేబీఎం కంపెనీ దక్కించుకుంది. వారంరోజుల్లో తొలిదశ బస్సులు బ్యాటరీ బస్సులకు జేబీఎం సంస్థ మరో వారంరోజుల్లో శ్రీకారం చుట్టనుంది. ఆ సంస్థనే అద్దె ప్రాతిపదికన బస్సుల నిర్వహణ చూసుకుంటుంది. డ్రైవర్ల బాధ్యత జేబీఎందే కాగా,కండక్టర్ మాత్రం ఆర్టీసీ నుంచి విధుల్లో ఉంటాడు. ఈ బస్సులను నడిపినందుకుగాను ప్రతి కి.మీ.కు రూ.40 చొప్పున అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లిస్తుంది. వీటికి అవసరమైన చార్జింగ్ వ్యవస్థను ఆ సంస్థనే ఏర్పాటు చేసుకుంటుంది. హైదరాబాద్‌తోపాటు ఆయా పట్టణాల్లోని సంబంధిత డిపోల్లో వీటిని ఏర్పాటు చేస్తుంది. తొలుత 20 బస్సులు రానున్నాయి. అలా విడతలవారీగా వచ్చే రెండు నెలల్లో మొత్తం బస్సులు రోడ్డెక్కే అవకాశముంది. 450 బస్సులను సరఫరా చేయాల్సి ఉండగా, 400 బస్సులకు సంబంధించిన షెడ్యూళ్లను ఆర్టీసీ ఆ సంస్థకు అందించింది. ఇప్పుడు ఆ 400 బస్సులు వీలైనంత త్వరలో అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ ఆ సంస్థకు సూచించింది. వీటిల్లో 245 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 85 సూపర్ లగ్జరీ బస్సులు, 70 పల్లెవెలుగు సర్వీసులు ఉంటాయి. దాదాపు వేయి వరకు డీజిల్ బస్సులను ఆర్టీసీ దశలవారీగా సమకూర్చుంటుండగా, వాటికి అదనంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే 350 కి.మీ. వరకు ప్రయాణం గతంలో ఎలక్ట్రిక్ బస్సులు ఒకసారి ఫుల్‌చార్జ్ చేస్తే 225 కి.మీ.వరకు తిరిగేవి. దీంతో వాటిని దూరప్రాంతాలకు నడపటం కష్టంగా మారింది. హైదరాబాద్ నుంచి గమ్యం చేరి తిరిగి సిటీకి వచ్చేలోపు చార్జింగ్ అయిపోయే పరిస్థితి ఉండేది. ఈ సమస్యను అప్పటికిప్పుడు అధిగమించలేక ఇతర పట్టణాలకు తిప్పేందుకు ఆర్టీసీ సాహసించలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న బస్సులు ఫుల్‌చార్జ్ చేస్తే 350 కి.మీ.వరకు నడుస్తాయి. దీంతో దూరప్రాంత పట్టణాలకు వాటిని తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఆయా పట్టణాల్లో కూడా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నందున, తిరుగు ప్రయాణంలో మళ్లీ ఫుల్ చార్జింగ్‌తో వస్తాయి. దీంతో మధ్యలో చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. -
ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో ఆర్టీసీకి సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకుగాను యూకే తరపున ఆర్థికంగా, సాంకేతికంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రకటించారు. గురువారం ఆయన బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. గతేడాది గోవాలో జరిగిన జీ–20 దేశాల మంత్రుల సమావేశం సందర్భంగా భారత్‌లో పర్యావరణహిత బస్సుల నిర్వహణకు సహకరించేందుకు యూకే, యూఎస్‌లు ముందుకొచ్చి భారత్‌తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జీరో ఎమిషన్ వెహికిల్ పైలట్ ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఆర్టీసీ అధికారులతో చర్చించేందుకు బస్‌భవన్‌కు వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ అభినందనీయమని, వాటి సంఖ్య మరింత పెరగాల్సి ఉందని, ఈ విషయంలో ఆర్థిక, సాంకేతిక తోడ్పాడుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహిస్తున్న తీరును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో బ్రిటిష్ హైకమిషనర్ సీనియర్ అడ్వయిజర్ జావైద్ మల్లా, తెలంగాణ ప్రభుత్వ ఆటోమోటివ్ అండ్ ఈవీ సెక్టార్ డైరెక్టర్ గోపాలకష్ణ, టీఎస్ఆర్టీసీ సీఓఓ డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, డబ్ల్యూఆర్ఐ ఇండియా ప్రతినిధి చైతన్య కనూరి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన అనన్య బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. -
మహాలక్ష్మి సిటీ బస్సులు ప్రారంభం..!
-
ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలు రెండింతలు
ముంబై: చార్జింగ్ స్టేషన్లపరమైన కొరత, ఇతరత్రా రిస్కులు ఉన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) అమ్మకాలు రెండింతలు పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. పాలసీలు, వ్యయాలపరంగా సానుకూలత దన్నుతో మొత్తం బస్సుల విక్రయాల్లో వాటి వాటా 8 శాతానికి చేరవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం విద్యుత్ బస్సులకు సానుకూలమని క్రిసిల్ వివరించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం కింద టెండర్ల ద్వారా రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలు ఈ–బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు, సాంప్రదాయ ఇంధనాలు, సీఎన్జీతో నడిచే బస్సులతో పోలిస్తే ఈ–బస్సుల కొనుగోలు వ్యయం ప్రాథమికంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ స్థానికంగా తయారీ, బ్యాటరీ ఖరీదు తగ్గుదల, విస్తృతంగా తయారీ తదితర అంశాల కారణంగా వ్యయాలు తగ్గొచ్చని క్రిసిల్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ఈ–బస్సుల ఓనర్íÙప్ వ్యయాలు పెట్రోల్/డీజిల్ లేదా సీఎన్జీ బస్సులతో పోలిస్తే 15–20 శాతం తక్కువగానే ఉంటాయన్నారు. వాటి జీవితకాలం 15 ఏళ్లు ఉండగా.. ఆరు–ఏడేళ్లలోనే బ్రేక్ఈవెన్ (లాభనష్ట రహిత స్థితి) సాధించవచ్చని (సగటున 330 రోజుల పాటు రోజుకు 250 కి.మీ. రన్ రేట్‌తో) సుశాంత్ వివరించారు. సవాళ్లూ ఉన్నాయి.. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి సానుకూలాంశాలు ఉన్నా, దానికి తగ్గట్లే సవాళ్లు కూడా ఉన్నాయని క్రిసిల్ వివరించింది. రాష్ట్రాల రవాణా సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం వల్ల అంతిమంగా ఈ–బస్ ప్రాజెక్టులకు రుణదాతలు రుణాలివ్వడానికి వెనుకాడేలా చేస్తోందని పేర్కొంది. బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత రెండో సవాలని వివరించింది. నగరాల మధ్య బస్సులు నడిపే ఆపరేటర్లకు చార్జింగ్ సదుపాయాలే కీలకం. ఇటీవల ప్రకటించిన పీఎం–ఈ–బస్5 సేవా స్కీముతో చెల్లింపులపరంగా రుణదాతలకు కాస్త భరోసా లభించగలదని క్రిసిల్ రేటింగ్స్ టీమ్ లీడర్ పల్లవి సింగ్ తెలిపారు. ఈ–బస్ ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు రుణదాతలు సానుకూలంగా ఉండొచ్చని పేర్కొన్నారు. పీఎం–ఈబస్ సేవా స్కీము కింద కేంద్రం 169 నగరాల్లో 10,000 పైచిలుకు ఈ–బస్సులను వినియోగంలోకి తేవడం, 181 నగరాల్లో చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. -
సీఎం వైఎస్ జగన్ సహకారం మరువలేనిది
పుంగనూరు: జర్మనీకి చెందిన తమకు రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సహకారం మరువలేనిదని పెప్పర్ మోషన్ విద్యుత్ బస్సుల తయారీ సంస్థ సీఈవో ఆండ్రియాస్ హేగర్ చెప్పారు. తాము చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేయబోయే పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. హేగర్, ఆయన బృందం శుక్రవారం పుంగనూరు మండలంలోని ఆరడిగుంటలో పెప్పర్ మోషన్ బస్సులు, ట్రక్కుల తయారీ పరిశ్రమకు కేటాయించిన భూమిని జిల్లా కలెక్టర్ షన్మోహన్తో కలిసి పరిశీలించింది. ఈ సందర్భంగా హేగర్ జిల్లా కలెక్టర్‌తో, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్‌తో పలు విషయాలపై చర్చించారు. అనంతరం పుంగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారతదేశం పెప్పర్ మోషన్ సంస్థకు రెండో పుట్టినిల్లు అని తెలిపారు. 2009లో తొలిసారిగా ఇండియాను సందర్శించామన్నారు. భారతదేశంలో అధిక జనాభా ఉన్నారని, అధిక శాతం వాహనాలను వినియోగిస్తున్నారని తెలిపారు. అందుకే ఇక్కడ 800 ఎకరాలలో రూ.4,640 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో 8,100 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2027 నాటికి 30 వేల బస్సులు, ట్రక్కులను మార్కెట్లో విడుదల చేస్తామన్నారు. మూడు దశల్లో నిర్మాణం చేస్తామని తెలిపారు. పర్యావరణానికి పూర్తి అనుకూలమైన విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీతో పాటు విడిభాగాల తయారీ పరిశ్రమ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు, తమిళనాడుకు పుంగనూరు జాతీయ రహదారులు అనుసంధానం కావడం, విమానాశ్రయాలు, రవాణా సదుపాయాలు ఎంతో బాగుండడంతో ఇక్కడ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించామన్నారు. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు కొనసాగించేందుకు వీలుందని సీఈవో తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ షన్మోహన్ పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది: జిల్లా కలెక్టర్ పుంగనూరు మండలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జర్మన్ పెప్పర్ ఎల్‌క్ట్రికల్ బస్సుల సంస్థ పరిశ్రమ ఏర్పాటు కావడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని జిల్లా కలెక్టర్ షన్మోహన్ కొనియాడారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి చొరవతో పరిశ్రమ ఏర్పాటవుతోందన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఇక్కడే 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఘన స్వాగతం పెప్పర్ కంపెనీ సీఈవో ఆండ్రియస్ హేగర్కు, ఆయన బృందానికి కర్ణాటక సరిహద్దులో పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి ఘన స్వాగతం పలికారు. శాలువలు కప్పి సన్మానించారు. హేగర్తోపాటు ఆ సంస్థ సీటీవో డాక్టర్ మదియాస్ కెర్లర్, సీఎస్‌వో సత్య, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్డర్, సీఐవో రాజశేఖర్‌రెడ్డి, సీఎస్‌వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, ఉర్త్ ఎల్రక్టానిక్స్ ఎండీ హర్ష ఆద్య తదితరులు ఉన్నారు. -
కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): ఈ ఏడాది కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మంగళవారం ఆయన నర్సీపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విజయదశమి ఆర్టీసీకి ఆదాయం తెచ్చే పండుగ అన్నారు. దసరాకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 5,500 స్పెషల్ బస్సులను తిప్పుతున్నామన్నారు. గతంలో దసరా పర్వదినాల్లో 50 శాతం అదనపు చార్జీలు విధించటం జరిగేదని, రెండేళ్లుగా చార్జీల పెంపునకు స్వస్తి పలికామని చెప్పారు. రాను పోను ప్రయాణికులకు 10 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. రాయితీలు కల్పించి ఓఆర్ పెంచి ఆదాయ పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా 1500 డీజిల్ బస్సులు ఆర్డర్ చేశామన్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఏడాది వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశామని, మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇకపై ప్రతి ఏటా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అలాగే పీఎఫ్ బకాయిలు సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించటం వల్ల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పెన్షన్ వచ్చే కేడర్‌లో ఉన్న వారికి ఇకపై రూ.25 వేలు పెన్షన్, రూ.5 నుంచి 6 వేలు ఉన్న వారికి రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వరకు పెన్షన్ వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన డిపో ఆవరణలో మొక్కలు నాటారు. స్థానిక ఏఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎండీ వెంట జిల్లా ప్రజారవాణా సంస్థ అధికారి పద్మావతి ఉన్నారు. -
గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ రోడ్లపై ఇకనుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నేడు ప్రారంభం అయ్యాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌లు ఈ బస్సులను ప్రారంభించారు. వేవ్ రాక్, బాచుపల్లి, సికింద్రబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జేబీఎస్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య ఈ బస్సులు నడవనున్నాయి. సీసీ కెమెరాలు, ప్రయాణికులకు ఛార్జింగ్ సదుపాయం వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. 'రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యం లేకుండా సౌకర్యాలను అందించాలి. ఎంత కష్టాల్లో tsrtc ఉన్నా ప్రయాణికుల సంక్షేమమే మాకు ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్ లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి. అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నాం. వచ్చే కొన్ని ఏసీ లేని బస్సులు వస్తున్నాయి. వాటిని కూడా ఏసీగా మార్చి నడిపించాలనుకుంటున్నాం. మెట్రో వీటిన్నింటిని అనుసంధానం చేయాలి.' అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. 'కొత్త 25 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం. కాలుష్య ప్రభావం కొంత తగ్గుతుంది. ఎయిర్ పోర్టుకు గతంలో నడిచేవి. అందుకే మరిన్ని కొత్త బస్సులను నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. ఐటీ కారిడార్ తో పాటు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తిప్పుతున్నాం. 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.' అని ఆర్టీసి ఎండీ సజ్జనార్ అన్నారు. కేంద్రం నుంచి గతంలో సబ్సిడీ వచ్చేది కానీ ఇప్పుడు అదికూడా రాట్లేదని మంత్రి పువ్వాడ అన్నారు. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్ధ్యం మాత్రమే ఉంది.. కానీ త్వరలో సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం uv పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుందని చెప్పారు. కోటి 52 లక్షల వాహనాలు తెలంగాణ లో ఉన్నాయి.. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ దిశగా మార్చాలని అన్నారు. ఆర్టీసి ఉద్యోగుల ప్రధాన సమస్య తీరింది వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని పేర్కొన్న మంత్రి పువ్వాడ.. మరో నెలలో ఈ ప్రాసెస్ కూడా పూర్తవుతుందని చెప్పారు. ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. -
కొత్తగా ఈ–బస్సులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మరిన్ని విద్యుత్ బస్సులు (ఈ–బస్సులు) కొనుగోలు దిశగా కార్యాచరణకు సంసిద్ధమవుతోంది. కొత్తగా 1,500 ఈ–బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం 100 ఈ–బస్‌లను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకూ వీటి సేవలను విస్తరించాలని నిర్ణయించింది. అందుకోసం రెండో దశ కింద 1,500 ఈ–బస్‌లను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్)తో కలిసి ఆర్టీసీ ఈ బస్సులను తీసుకురానుంది. డీజిల్ బస్సుల స్థానంలో ఈ–బస్‌లు.. సీఈఎస్ఎల్, ఆర్టీసీ సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్కో బస్సుకు రూ.కోటి చొప్పున రూ.1,500 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్టును ఆమోదించాయి. డీజిల్ బస్సుల స్థానంలో ఈ–బస్‌లను ప్రవేశపెట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు 27 శాతం నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఇక తొమ్మిది మీటర్ల పొడవుండే ఈ–బస్‌లు అయితే కి.మీ.కు రూ.39.21, అదే 12 మీటర్ల పొడవున్న ఈ–బస్ అయితే కి.మీ.కు రూ.43.49 వ్యయం అవుతుందని అంచనా వేశారు. జిల్లా కేంద్రాల మధ్య ఈ–బస్ సర్వీసులు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాల్లో ఈ–బస్ సేవలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అందుకే సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాల మధ్య ఈ సర్వీసులను నిర్వహించాలని నిర్ణయించారు. మొదటగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు డిపోలకు వాటిని కేటాయించనున్నారు. ఆ డిపో కేంద్రాలు ఉన్న జిల్లా కేంద్రాల నుంచి రానూపోనూ 250 కి.మీ. దూరంలో ఉన్న జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలకు వీటిని నడుపుతారు. ఎందుకంటే ఈ–బస్‌లకు ఓసారి చార్జింగ్ పెడితే గరిష్టంగా 250 కి.మీ. వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆయా డిపోల్లో చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటుచేస్తారు. ఇక ఆర్టీసీకి వెయ్యి ఈ–బస్‌లను అద్దె విధానంలో అందించేందుకు సీఈఎస్ఎల్ త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహించనుంది. అనంతరం ఈ ఏడాది చివరి నాటికి వాటిని ఆర్టీసీకి అందజేస్తుంది. -
రూపాయికే బస్సు ప్రయాణం.. దేశమంతా తిరగొచ్చు..
సాక్షి, సిటీబ్యూరో: బస్సు ప్రయాణీకులకు బంపరాఫర్. ఇంటర్–సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ సేవలందించే న్యూగో సంస్థ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూపాయికే బస్సు ప్రయాణ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 15న తమ రవాణా మార్గాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం రూపాయితోనే ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా గ్రీన్‌సెల్ మొబిలిటీ సీఈఓ దేవేంద్ర చావ్లా మాట్లాడుతూ.. పర్యావరణ స్థిరత్వంతో పాటు దేశాన్ని పచ్చదనంగా మార్చడానికి ఈవీ సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. పంద్రాగస్టు రోజున ఈ ప్రయాణ ఆఫర్‌ను పొందడానికి బుకింగ్స్ మొదలయ్యాయని, రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు తమ రవాణా సేవలు కొనసాగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఇండోర్– భోపాల్, ఢిల్లీ–చండీగఢ్, ఢిల్లీ– ఆగ్రా, ఢిల్లీ–జైపూర్, ఆగ్రా–జైపూర్, బెంగళూరు–తిరుపతి, చెన్నై–తిరుపతి, చెన్నై–పుదుచ్చేరి తదితర మార్గాల్లో తమ సేవలు కొనసాగుతున్నాయని, దేశమంతా ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. బుకింగ్స్ కోసం న్యూగో వెబ్సైట్ https:// nuego. in/ booking, సంస్థ అధికారిక మొబైల్ అప్లికేషన్లలోనూ బుకింగ్ చేసుకోవచ్చని దేవేంద్ర చావ్లా తెలిపారు. ఇది కూడా చదవండి: ఒకే నెలలో ఇన్ని పరీక్షలా? -
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయ్!
హైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. “హైదరాబాద్ లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే సంస్థ అందుబాటులోకి తీసుకురాబోతుంది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడ రూట్ లో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ లో తొలి దశలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయి. వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరుగుతాయి. మరో 30 ఐటీ కారిడార్ లో నడుస్తాయి. వాటిలో 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ ఆర్థిక ఏడాదిలో సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వస్తున్నాయి. అందులో 50 ఏసీ బస్సులుండగా.. మిగతావి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను టీఎస్ఆర్టీసీకి ఒలెక్ట్రా అందజేయనుంది. వీటికి తోడు సిటీలో మరో 800 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రాసెస్ లో ఉంది.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) వేణుగోపాల్ రావు, మేనేజర్ ఆనంద్ బసోలి, అసిస్టెంట్ మేనేజర్ యతిష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ప్రత్యేకతలివే! 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు సీటు బెల్ట్ సదుపాయం ఉంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఫుల్ చార్జింగ్ కు 2 నుంచి 3 గంటలకు సమయం పడుతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు.