
బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకుగాను యూకే తరపున ఆర్థికంగా, సాంకేతికంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రకటించారు. గురువారం ఆయన బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులతో భేటీ అయ్యారు.
గతేడాది గోవాలో జరిగిన జీ–20 దేశాల మంత్రుల సమావేశం సందర్భంగా భారత్‌లో పర్యావరణహిత బస్సుల నిర్వహణకు సహకరించేందుకు యూకే, యూఎస్‌లు ముందుకొచ్చి భారత్‌తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జీరో ఎమిషన్ వెహికిల్ పైలట్ ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఆర్టీసీ అధికారులతో చర్చించేందుకు బస్‌భవన్‌కు వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ అభినందనీయమని, వాటి సంఖ్య మరింత పెరగాల్సి ఉందని, ఈ విషయంలో ఆర్థిక, సాంకేతిక తోడ్పాడుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహిస్తున్న తీరును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో బ్రిటిష్ హైకమిషనర్ సీనియర్ అడ్వయిజర్ జావైద్ మల్లా, తెలంగాణ ప్రభుత్వ ఆటోమోటివ్ అండ్ ఈవీ సెక్టార్ డైరెక్టర్ గోపాలకష్ణ, టీఎస్‌ఆర్టీసీ సీఓఓ డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, డబ్ల్యూఆర్‌ఐ ఇండియా ప్రతినిధి చైతన్య కనూరి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన అనన్య బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.