కేంద్రానికి ఆర్టీసీ ప్రతిపాదన
మంగళవారమే ప్రారంభమైన కొత్త పథకం
హైదరాబాద్‌లో మొత్తం ఈ–బస్సులు నడపాలన్న ఆలోచనకు వీలుగా ముందడుగు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద మొత్తంలో సమకూర్చుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. పీఎం ఈ–డ్రైవ్ పథకంలో హైదరాబాద్ నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. నరేంద్రమోదీ తొలి దఫా ప్రభుత్వం అమలు చేసిన ‘ది ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) పథకంలో భాగంగా తెలంగాణ తొలిసారి ఎలక్ట్రిక్ బస్సులను పొందింది. వాటిని విమానాశ్రయానికి నడుపుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫేమ్–2లో కూడా కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంది. వాటిని దూర ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌లో సిటీ బస్సులుగా తిప్పుతోంది.
ఈ రెండు పథకాలను నిలిపేసిన కేంద్రం పీఎం ఈ–డ్రైవ్ పేరుతో కొత్త పథకాన్ని మంగళవారం ప్రారంభించింది. దీని మార్గదర్శకాలు వెల్లడి కావటంతోనే, టీజీఎస్ ఆర్టీసీ ఈ పథకానికి ప్రతిపాదనలు పంపింది. ఈ పథకం అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి వరకు కొనసాగుతుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఈ పథకాన్ని ఆ శాఖ ద్వారానే కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఈ పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు, ఈ–రిక్షా/ ఈ–కార్డులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు, ఈ–ట్రక్కు లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు, టెస్టింగ్ ఏజన్సీల బలోపేతానికి ఈ నిధులు వినియోగిస్తారు.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 40 లక్షల జనాభా దాటిన నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తంగా 14,028 బస్సులు సమకూర్చడానికి రూ.4391 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను రెండు రోజుల క్రితమే వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ వెంటనే తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నగరానికి 2,500 బస్సులు కేటాయించాలని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసింది.
వీలైనన్ని ఎక్కువ బస్సులు వచ్చేలా..
హైదరాబాద్‌లో వాహన కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇక్కడ డీజిల్ బస్సులను నడపొద్దని ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఉన్న బస్సులను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.1.85 కోట్ల వరకు ఉంది. అంత ఖర్చు భరించే పరిస్థితి లేనందున, గ్రాస్ కాస్ట్ మోడల్ పద్ధతిలో అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ద్వారా హైదరాబాద్‌కు ఎన్ని బస్సులు మంజూరు చేస్తుందో తేలిన తర్వాత, అన్ని బస్సులు జీసీసీ పద్ధతిలో నిర్వహించేందుకు వీలుగా టెండర్లు పిలవనుంది. æఒక్కో కిలోమీటరుకు తక్కువ అద్దెను ప్రతిపాదించే సంస్థను ఎంపిక చేస్తుంది. ఆ కంపెనీ అన్ని బస్సులను ఆరీ్టసీలో అద్దె ప్రాతిపదికన నిర్వహించాల్సి ఉంటుంది.
కొత్తగా పది డిపోల ఏర్పాటు..
ఈ బస్సులకు ప్రస్తుతమున్న డిపోలు సరిపోవని ఆర్టీసీ భావిస్తోంది. వాటి చార్జింగ్ వ్యవస్థ ఏర్పాటుకు చాలా స్థలం అవసరమవుతున్నందున కొత్తగా పది డిపోలను ఏర్పాటు చేయనున్నారు.
ఒక్కో బస్సుకు రూ.30 లక్షల రాయితీ..
పీఎం ఈ–డ్రైవ్‌లో భాగంగా ఒక్కో బస్సు కొనుగోలుపై కేంద్రం రూ.30 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. గతంలో ఫేమ్–1లో ఆ మొత్తం రూ.50 లక్షలుండేది. గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కొంత సులభతరం కావటం, బ్యాటరీ ధరలు తగ్గటం, ఇప్పుడు మన దేశంలో కూడా బ్యాటరీలను తయారు చేస్తున్నందున సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం తగ్గించినట్టు సమాచారం. సబ్సిడీ అమలు చేస్తున్నందున బస్సులు సమకూర్చేందుకు తయారీ సంస్థలు పోటీ పడతాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment