ఆర్టీసీ నిర్ణయం.. ‘సాక్షి’ కథనం నేపథ్యంలో స్పందన
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో పాటు కొన్ని ఆర్టీసీ సొంత బస్సులు, ఇప్పటికే తిప్పుతున్న అద్దె బస్సుల నిర్వహణ కూడా కొనసాగించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అంటే హైబ్రిడ్ పద్ధతిలో డిపోలను వాడనుంది. ఎలక్ట్రిక్ బస్సులను భారీ సంఖ్యలో సమకూర్చుకుంటున్న నేపథ్యంలో, వాటి సరఫరా సంస్థకు డిపోలను కేటాయించనున్న తీరును వివరిస్తూ ‘ప్రైవేటు చేతికి ఆర్టీసీ డిపోలు’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో సంస్థ వైఖరిపై ఉద్యోగులతో పాటు, ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆర్టీసీ స్పందించింది.
డిపోలను కేవలం ఎలక్ట్రిక్ బస్సులకే పరిమితం చేయకుండా, ఇతర బస్సులకు కూడా ఉపయోగిస్తామని ప్రకటించింది. ‘డిపోల నిర్వహణ పూర్తిగా ఆర్టీసీ అ«దీనంలోనే ఉంటుంది. కార్యకలాపాలన్నీ సంస్థ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే సంస్థ డిపో స్థలాన్ని చార్జింగ్, పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించుకుంటుంది..’అని స్పష్టం చేసింది. ‘గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో నడిచే ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సంస్థలో డ్రైవర్లకు కొరత ఉంది. వివిధ కేటగిరీలకు సంబంధించి 3,038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఆ నియామక ప్రక్రియ వివిధ నియామక సంస్థల పరిశీలనలో ఉంది..’అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment