ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తున్న సంస్థకు డిపోలను అప్పగిస్తున్న రోడ్డు రవాణా సంస్థ
అక్కడి సొంత బస్సులు, సిబ్బందిని వేరే డిపోలకు తరలింపు.. వరంగల్–2, హైదరాబాద్–1 డిపోలతో శ్రీకారం
త్వరలో కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట సహా మరికొన్ని డిపోలు కూడా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పెద్ద ఆర్టీసీ డిపోలు ప్రైవేటు సంస్థ పరిధిలోకి వెళ్లిపోతున్నాయి. అద్దె బస్సుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలకు కోతపడే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఆర్టీసీ ఉద్యోగులలో కలకలం రేపుతున్నాయి. ఇది ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడమేమీ కాకపోయినా.. ప్రైవేటీకరణకు దారితీసినట్టేననే ఆందోళనకు దారితీస్తున్నాయి.
ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంలో భాగంగా..
వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించటం, డీజిల్ భారాన్ని తగ్గించుకోవటం లక్ష్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటోంది. క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. ఇంతకాలం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఒలెక్ట్రా సంస్థ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకున్న ఆర్టీసీ.. ఇప్పుడు ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ నుంచి తీసుకుంటోంది. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.కోటిన్నరపైనే కావడంతో వాటిని కొనటం తలకుమించిన వ్యవహారమని భావిస్తున్న ఆర్టీసీ.. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో వాటిని అద్దెకు తీసుకుంటోంది.
ఆ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి సమకూరిస్తే.. ఈ బస్సులు తిరిగిన దూరం ఆధారంగా కిలోమీటరుకు ఇంత అని నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ అద్దెగా చెల్లిస్తుంది. బస్సు నిర్వహణ, డ్రైవరు, మెకానిక్ సిబ్బందిని ఆ ప్రైవేటు సంస్థనే సమకూర్చుకుంటుంది. కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ తరఫున ఉంటారు. ఇలా జేబీఎం సంస్థ 500 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అద్దెకిస్తుంది. అందులో ఇప్పటికే దాదాపు 150 బస్సులను సరఫరా చేసింది. మిగతావి విడతలవారీగా రానున్నాయి.
ఈ బస్సులను ప్రస్తుతానికి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాలకు కేటాయించారు. త్వరలో హైదరాబాద్‌లోని ఓ డిపోకు అందనున్నాయి. తర్వాత నల్లగొండ, సూర్యాపేట లాంటి పట్టణాలకు కూడా సమకూర్చుతారు. ఇంతకాలం ఎలక్ట్రిక్ బస్సులు అనగానే ఏసీ బస్సులే ఉండేవి. ఇప్పుడీ సంస్థ నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తోంది. వాటిని సూపర్ లగ్జరీ, డీలక్స్, సెమీ డీలక్స్, ఎక్స్‌ప్రెస్ కేటగిరీల్లో తిప్పుతున్నారు.
ఈ బస్సుల కోసం డిపోలనే అప్పగిస్తూ..
అయితే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్ డిపోలను సదరు జేబీఎం సంస్థకే అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్–2 డిపోకు 75 ఎలక్ట్రిక్ బస్సులు అందాయి. మరో 40 బస్సులు రానున్నాయి. హైదరాబాద్‌లోని హైదరాబాద్–1 డిపోకు 75 బస్సులు సమకూరనున్నాయి. ఈ రెండు డిపోల నుంచి ఆర్టీసీ సొంత బస్సులను ఇతర డిపోలకు మార్చేసి... ఆ రెండు డిపోలను పూర్తిగా జేబీఎం సంస్థకు కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే వరంగల్ డిపో నుంచి సొంత బస్సులను ఇతర డిపోలకు తరలించేశారు. హైదరాబాద్–1 డిపో బస్సులను హైదరాబాద్–3 డిపోకు బదిలీ చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరిగితే వాటిని.. భవిష్యత్తులో మిగతా బస్సులు సరఫరా అయ్యాక ఆయా డిపోలను కూడా ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారన్న ప్రచారం ఆర్టీసీ ఉద్యోగుల్లో జోరుగా సాగుతోంది.
సిబ్బందిని కూడా తరలించేస్తూ...
ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకిస్తున్న సంస్థ ఆ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు, వాటి మరమ్మతులు చేపట్టేందుకు మెకానిక్ సిబ్బందిని సొంతంగానే సమకూర్చుకుంటుంది. ఆ డిపోల్లో ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది అవసరం ఉండదు. వీరి వ్యవహారాలు చూసే డిపో అధికారులకూ పని ఉండదు. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ పక్షాన పనిచేస్తారు. కేవలం వీరి వ్యవహారాలు చూసేందుకు ఒకరిద్దరు ఆర్టీసీ సిబ్బంది, డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మాత్రమే డిపోలలో ఉంటారు. డిపోలో కార్యకలాపాలన్నీ ప్రైవేటు సంస్థ అధీనంలోనే నడుస్తాయి. బస్సుల చార్జింగ్ కోసం ఆ సంస్థనే చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకుంటుంది. విద్యుత్ సరఫరా వ్యవస్థను మాత్రం ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది.
ఇకపై నియామకాలు లేనట్టే!
ప్రస్తుతం ఆరీ్టసీలో దాదాపు 7 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం గతంలో ప్రక్రియ ప్రారంభించినా నిలిచిపోయింది. అయితే ఆర్టీసీలోకి అద్దె బస్సులు భారీగా వస్తుండటం, వాటి నిర్వహణకు ప్రైవేటు సంస్థల సిబ్బందే ఉంటుండటంతో... ఆర్టీసీలో ఇకపై నియామకాలు ఉండకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ప్రైవేటీకరణకు దారితీసినట్టేనని ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు.
హైదరాబాద్‌లో డిపోలన్నీ ప్రైవేటు చేతికే!
హైదరాబాద్ నగరంలో తిప్పుతున్న ఆర్టీసీ డీజిల్ బస్సులను వెలుపలికి తరలించి.. వాటి స్థానంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద కేంద్రానికి దరఖాస్తు చేసింది. ఆ బస్సులను కూడా జీసీసీ పద్ధతిలోనే నడుపుతారు. అంటే ఆ బస్సులు చేరే డిపోలన్నీ ప్రైవేటు సంస్థ అ«దీనంలోకి వెళతాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని డిపోలు ప్రైవేటు నిర్వహణలోకి చేరుతాయనే అభిప్రాయం వినిపిస్తోంది.
వేల మంది డ్రైవర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం!
హైదరాబాద్‌లో మొత్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుండటం, అవి అద్దె బస్సులు కానుండటంతో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న సుమారు 6,000 మంది ఆర్టీసీ డ్రైవర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. నగరంలో డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన కొద్దీ.. ఆర్టీసీ సొంత బస్సులతోపాటు డ్రైవర్లను కూడా ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఆయా చోట్ల అవసరానికి మించి డ్రైవర్లు ఉంటే.. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) దిశగా ఒత్తిడి చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కాలుష్య రహిత, పర్యావరణహిత ప్రజారవాణా సదుపాయం ఆహా్వనించదగ్గదే అయినా.. ఆర్టీసీ సిబ్బంది భవిష్యత్తును దెబ్బతీయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వస్తోంది. ‘‘ప్రైవేట్ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీని సృష్టించుకోవడం కోసం ఆర్టీసీలను బలితీసుకుంటున్నాయి. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టదాయకం’’అని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment