శుభ ముహూర్తాలు ఆర్టీసీని లాభాల బాటపట్టించాయి. ఏప్రిల్‌లో రోజువారీ సగటు ఆదాయం రూ.11.50 కోట్లకు పడిపోయి జీతాలిచ్చేందుకు సంస్థ ఇబ్బందిపడ్డ పరిస్థితి మారి.. ప్రస్తుతం రోజువారీ సగటు ఆదాయం రూ.15.50 కోట్లుగా నమోదవుతోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో తొలిసారి 45 డిపోలు లాభాల్లోకి చేరాయి. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 74 శాతంగా నమోదవుతోంది. శుభముహూర్తాలు కొనసాగినన్ని రోజులు పరిస్థితి మెరుగ్గా ఉండనుంది. అలాగే, రానున్న వానాకాలంలోనూ ఓఆర్ పడిపోకుండా చూడాలని ఆర్టీసీ భావిస్తోంది.
రికార్డు స్థాయి లాభాలతో..
తెలంగాణ ఆర్టీసీ ఏర్పడిన స్వల్ప కాలానికే ఏకంగా 44 శాతం ఫిట్ మెంట్‌తో వేతన సవరణ జరిగింది. దీంతో ఆర్టీసీపై సాలీనా రూ.850 కోట్ల భారం పడింది. అనంతరం పర్యవేక్షణ లోపించడంతో ఆర్టీసీ పనితీరు దిగజారింది. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన నష్టాల కంటే తెలంగాణ ఆర్టీసీ నష్టాలు పెరిగిపోయాయి. డిపోలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి.
ఇన్నాళ్లకు తొలిసారి 96 డిపోలకు 45 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. ఏప్రిల్‌లో శుభకార్యాలు లేకపోవడంతో ఓఆర్ 58 శాతానికి పడిపోయి, రోజు వారీ ఆదాయం సగటున రూ.11.50 కోట్లకు పరిమితమైంది. మేలో ముహూర్తాల కాలం ప్రారంభం కావటంతో ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ పుంజుకుంది. ఆదాయం రూ.16 కోట్లను మించి నమోదుకాగా, సగటున వారం రోజులుగా రూ.15.50 కోట్ల మేర వస్తోంది.
లాభాల్లో ఉన్న డిపోలు ఇవే..
షాద్‌నగర్, తొర్రూరు, ఆదిలాబాద్, అచ్చంపేట, తాండూరు, జనగామ, వేములవాడ, బీహెచ్‌ఈఎల్, మహేశ్వరం, మెట్‌పల్లి, మధిర, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి, నార్కెట్‌పల్లి, సూర్యాపేట, జహీరాబాద్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, పరిగి, నారాయణపేట, సిరిసిల్ల, కొత్తగూడెం, జగిత్యాల, మణుగూరు, గద్వాల, కరీంనగర్–1, భద్రాచలం, నల్లగొండ, సత్తుపల్లి, కోదాడ, దేవరకొండ, వరంగల్–1, పికెట్, యాదగిరిగుట్ట, హైదరాబాద్–2, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వనపర్తి, హైదరాబాద్–1, మియాపూర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, నారాయణ్‌ఖేడ్.
చదవండి: ప్రియాంక ‘యువ సంఘర్షణ సభ’.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు
Comments
Please login to add a commentAdd a comment