Road Transport
-
‘ప్రైవేటు’ చేతికి ఆర్టీసీ డిపోలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పెద్ద ఆర్టీసీ డిపోలు ప్రైవేటు సంస్థ పరిధిలోకి వెళ్లిపోతున్నాయి. అద్దె బస్సుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలకు కోతపడే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఆర్టీసీ ఉద్యోగులలో కలకలం రేపుతున్నాయి. ఇది ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడమేమీ కాకపోయినా.. ప్రైవేటీకరణకు దారితీసినట్టేననే ఆందోళనకు దారితీస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంలో భాగంగా.. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించటం, డీజిల్ భారాన్ని తగ్గించుకోవటం లక్ష్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటోంది. క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. ఇంతకాలం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఒలెక్ట్రా సంస్థ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకున్న ఆర్టీసీ.. ఇప్పుడు ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ నుంచి తీసుకుంటోంది. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.కోటిన్నరపైనే కావడంతో వాటిని కొనటం తలకుమించిన వ్యవహారమని భావిస్తున్న ఆర్టీసీ.. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో వాటిని అద్దెకు తీసుకుంటోంది. ఆ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి సమకూరిస్తే.. ఈ బస్సులు తిరిగిన దూరం ఆధారంగా కిలోమీటరుకు ఇంత అని నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ అద్దెగా చెల్లిస్తుంది. బస్సు నిర్వహణ, డ్రైవరు, మెకానిక్ సిబ్బందిని ఆ ప్రైవేటు సంస్థనే సమకూర్చుకుంటుంది. కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ తరఫున ఉంటారు. ఇలా జేబీఎం సంస్థ 500 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అద్దెకిస్తుంది. అందులో ఇప్పటికే దాదాపు 150 బస్సులను సరఫరా చేసింది. మిగతావి విడతలవారీగా రానున్నాయి. ఈ బస్సులను ప్రస్తుతానికి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాలకు కేటాయించారు. త్వరలో హైదరాబాద్‌లోని ఓ డిపోకు అందనున్నాయి. తర్వాత నల్లగొండ, సూర్యాపేట లాంటి పట్టణాలకు కూడా సమకూర్చుతారు. ఇంతకాలం ఎలక్ట్రిక్ బస్సులు అనగానే ఏసీ బస్సులే ఉండేవి. ఇప్పుడీ సంస్థ నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తోంది. వాటిని సూపర్ లగ్జరీ, డీలక్స్, సెమీ డీలక్స్, ఎక్స్‌ప్రెస్ కేటగిరీల్లో తిప్పుతున్నారు. ఈ బస్సుల కోసం డిపోలనే అప్పగిస్తూ.. అయితే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్ డిపోలను సదరు జేబీఎం సంస్థకే అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్–2 డిపోకు 75 ఎలక్ట్రిక్ బస్సులు అందాయి. మరో 40 బస్సులు రానున్నాయి. హైదరాబాద్‌లోని హైదరాబాద్–1 డిపోకు 75 బస్సులు సమకూరనున్నాయి. ఈ రెండు డిపోల నుంచి ఆర్టీసీ సొంత బస్సులను ఇతర డిపోలకు మార్చేసి... ఆ రెండు డిపోలను పూర్తిగా జేబీఎం సంస్థకు కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే వరంగల్ డిపో నుంచి సొంత బస్సులను ఇతర డిపోలకు తరలించేశారు. హైదరాబాద్–1 డిపో బస్సులను హైదరాబాద్–3 డిపోకు బదిలీ చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరిగితే వాటిని.. భవిష్యత్తులో మిగతా బస్సులు సరఫరా అయ్యాక ఆయా డిపోలను కూడా ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారన్న ప్రచారం ఆర్టీసీ ఉద్యోగుల్లో జోరుగా సాగుతోంది. సిబ్బందిని కూడా తరలించేస్తూ... ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకిస్తున్న సంస్థ ఆ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు, వాటి మరమ్మతులు చేపట్టేందుకు మెకానిక్ సిబ్బందిని సొంతంగానే సమకూర్చుకుంటుంది. ఆ డిపోల్లో ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది అవసరం ఉండదు. వీరి వ్యవహారాలు చూసే డిపో అధికారులకూ పని ఉండదు. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ పక్షాన పనిచేస్తారు. కేవలం వీరి వ్యవహారాలు చూసేందుకు ఒకరిద్దరు ఆర్టీసీ సిబ్బంది, డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మాత్రమే డిపోలలో ఉంటారు. డిపోలో కార్యకలాపాలన్నీ ప్రైవేటు సంస్థ అధీనంలోనే నడుస్తాయి. బస్సుల చార్జింగ్ కోసం ఆ సంస్థనే చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకుంటుంది. విద్యుత్ సరఫరా వ్యవస్థను మాత్రం ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది.ఇకపై నియామకాలు లేనట్టే! ప్రస్తుతం ఆరీ్టసీలో దాదాపు 7 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం గతంలో ప్రక్రియ ప్రారంభించినా నిలిచిపోయింది. అయితే ఆర్టీసీలోకి అద్దె బస్సులు భారీగా వస్తుండటం, వాటి నిర్వహణకు ప్రైవేటు సంస్థల సిబ్బందే ఉంటుండటంతో... ఆర్టీసీలో ఇకపై నియామకాలు ఉండకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ప్రైవేటీకరణకు దారితీసినట్టేనని ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు.హైదరాబాద్‌లో డిపోలన్నీ ప్రైవేటు చేతికే!హైదరాబాద్ నగరంలో తిప్పుతున్న ఆర్టీసీ డీజిల్ బస్సులను వెలుపలికి తరలించి.. వాటి స్థానంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద కేంద్రానికి దరఖాస్తు చేసింది. ఆ బస్సులను కూడా జీసీసీ పద్ధతిలోనే నడుపుతారు. అంటే ఆ బస్సులు చేరే డిపోలన్నీ ప్రైవేటు సంస్థ అ«దీనంలోకి వెళతాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని డిపోలు ప్రైవేటు నిర్వహణలోకి చేరుతాయనే అభిప్రాయం వినిపిస్తోంది.వేల మంది డ్రైవర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం!హైదరాబాద్‌లో మొత్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుండటం, అవి అద్దె బస్సులు కానుండటంతో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న సుమారు 6,000 మంది ఆర్టీసీ డ్రైవర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. నగరంలో డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన కొద్దీ.. ఆర్టీసీ సొంత బస్సులతోపాటు డ్రైవర్లను కూడా ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఆయా చోట్ల అవసరానికి మించి డ్రైవర్లు ఉంటే.. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) దిశగా ఒత్తిడి చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాలుష్య రహిత, పర్యావరణహిత ప్రజారవాణా సదుపాయం ఆహా్వనించదగ్గదే అయినా.. ఆర్టీసీ సిబ్బంది భవిష్యత్తును దెబ్బతీయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వస్తోంది. ‘‘ప్రైవేట్ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీని సృష్టించుకోవడం కోసం ఆర్టీసీలను బలితీసుకుంటున్నాయి. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టదాయకం’’అని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి పేర్కొన్నారు. -
‘హిట్ అండ్ రన్’కు అంత కఠిన శిక్ష సబబేనా?
న్యాయ శిక్షాస్మృతుల్లో ఇటీవల కేంద్రం గణనీయమైన మార్పులతో కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్(IPC)కి ప్రత్యామ్నాయంగా తెచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు ట్రక్ డ్రైవర్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. హిట్ అండ్ రన్లకు మరీ అంత శిక్ష సబబేనా? అనే చర్చ సోషల్ మీడియాలోనూ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ‘హిట్ అండ్ రన్’ గణాంకాలు ఆందోళన కలిగించే అంశమేనని కొందరు గణాంకాలతో చెబుతున్నారు. హిట్ అండ్ రన్.. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఎక్కడైనా పరిమితికి మించిన వేగంతో టూ వీలర్, కార్లు, ట్రక్కులు రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రమాదానికి కారణమైన వ్యక్తి అక్కడి నుంచి పారిపోతే అది హిట్ అండ్ రన్ అవుతుంది. అలా పరారు కావటాన్ని మన గత చట్టం.. ఇప్పుడు కొత్త చట్టం కూడా నేరపూరిత చర్యగా పేర్కొంటోంది. అయితే.. భారతీయ న్యాయం సంహిత ప్రకారం.. హింట్ అండ్ రన్, ప్రమాదకర డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత చర్యల కిందకు వస్తాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 104లో రెండు నిబంధనలు ఉన్నాయి. మొదటి నిబంధన.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక ప్రాణం పోవడానికి కారణమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైటు శిక్ష ఉంటుంది. దీంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇక రెండో నిబంధన: రోడు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదంటే స్థానిక మెజిస్ట్రేట్‌కు సమాచారం అందించాలి. అలా ఇవ్వకుండా.. ఘటన స్థలం నుంచి పారిపోతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, దాంతో పాటు రూ. 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంత ఆందోళనకరంగా ఉంది కాబట్టే.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో మొత్తంగా 2022 ఏడాది కాలంలో అధికారంగా 67,387 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఆ ప్రమాదాల్లో 30,486 మంది మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 12,250 ప్రమాదాల నమోదయ్యాయి. మహారాష్ట్ర (8768), ఉత్తరప్రదేశ్ (7585), రాజస్థాన్ ( 5618) వంటి పెద్ద రాష్ట్రాల్లో హిట్ అండ్ రన్ ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే.. హిట్ అండ్ రన్ ప్రమాదాలకు మధ్య భారతం కేంద్ర బిందువుగా ఉండటం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ (2099), ఆంధ్రప్రదేశ్(1560) హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో లెక్కలు ఉన్నాయి కాబట్టే.. కఠిన శిక్షల అమలును సమర్థిస్తున్నవాళ్లు లేకపోలేదు. అభ్యంతరాలు అందుకే.. భారతీయ శిక్షాస్మృతి (IPC)లో హిట్ అండ్ రన్ కేసులు సెక్షన్ 304 ఏ కిందకు వస్తాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే గరిష్టంగా రెండేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష ఉంది. అయితే మాములు రోడ్డు ప్రమాదాల కంటే హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో విచారణలు పూర్తై శిక్షలు పక్కాగా అమలవుతున్నాయి. 2022లో విచారణ పూర్తిన హిట్ అండ్ రన్ కేసుల రేటు 47.9గా నమోదైంది. అయితే ఇతర రోడ్డు ప్రమాదాల్లో ఈ రేటు కేవలం 21.8 శాతం మాత్రమే నమోదు కావటం గమనార్హం. కానీ, కొత్త చట్టం ప్రకారం హిట్ అండ రన్ కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తుండడంపై ట్రక్కులు, లారీ, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారురు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ఎవరూ ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే శిక్షతోపాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన బాట పట్టిన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. దీంతో.. ట్రక్కు డ్రైవర్లు తాత్కాలికంగా శాంతించి సమ్మె విరమించారు. -
టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య!
రోడ్ ట్రిప్‌లంటే చాలామంది అమితమైన ఇష్టాన్ని చూపిస్తుంటారు. కుటుంబ సమేతంగా కారులో కూర్చుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడమంటే చాలామందికి ఇష్టం. ఓ భార్యాభర్తల జంట ఇలానే రోడ్ ట్రిప్‌కు బయలుదేరింది. కానీ భర్త చేసిన పొరపాటు కారణంగా భార్య నానా అవస్థలు పడింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డు ప్రయాణంలో భర్త టాయిలెట్ కోసం కారు దిగాడు. పావుగంట తరువాత తిరిగి కారును స్టార్ట్ చేశాడు. అయితే ఆ సమయంలో కారులో తన భార్య లేదన్న విషయాన్ని అతను గమనించలేదు. ఆమె కారులో నిద్రపోతున్నదని అనుకున్నాడు. అయితే కొద్దిసేపటి తరువాత కారు వెనుక సీటులోకి చూశాడు. అక్కడ భార్య లేదు. అతను తన పొరపాటు తెలుసుకునే సరికే 160 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. భర్త పేరు బ్రూనో టామ్చామ్ (55), భార్య పేరు అమ్నుయ్ టామ్చామ్ (49). ఇద్దరూ థాయిలాండ్‌కు చెందినవారు. ఇద్దరూ తెల్లవారుజామున మూడు గంటలకు మహాసర్ఖా ప్రావిన్స్‌కు బయలుదేరారు. దారిలో బ్రూనో ఒక టాయిలెట్ కోసం దిగవలసి వచ్చింది. ఒక అడవికి సమీపంలో రోడ్డు పక్కగా కారును ఆపాడు. టాయిలెట్ ముగించి, తిరిగి కారులోకి వచ్చి కూర్చున్నాడు. అయితే బ్రూనో కారు దిగాక అతని భార్య కూడా కారు దిగి టాయిలెట్‌కు వెళ్లింది. అయితే అమ్నుయ్ తిరిగి వచ్చేసరికి, రోడ్డుపై కారు కనిపించలేదు. అమె దగ్గర డబ్బు, ఫోన్ కూడా లేవు. అవన్నీ కారులోనే ఉన్నాయి. దీంతో ఆమె ఎవరినైనా సాయం అడిగేందుకు ముందుకు నడక ప్రారంభించింది. దాదాపు 20 కిలోమీటర్ల దూరం నడిచాక తెల్లవారుజామున 5 గంటలకు అమ్నుయ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. జరిగిన సంఘటనను పోలీసులకు తెలియజేసింది. దీంతో పోలీసులు బ్రూనోకు పలుమార్లు కాల్ చేశారు. అతను కాల్ ఎత్తలేదు. ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి, తన భార్యను కలుసుకున్నాడు. ఇది కూడా చదవండి: కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు -
అది అత్యంత వింత రోడ్డు..రోజుకు 2 గంటలే కనిపించి..
ఇప్పుడున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు హైటెక్ రోడ్లను నిర్మించే పనిలో తలమునకలై ఉన్నాయి. అయితే ఈరోజుకీ కొన్ని రోడ్లు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తున్నారు. కొండ ప్రాంతాలోని రోడ్లు భీతిగొలుపుతుంటాయి.అయితే వీటకి భిన్నంగా ప్రపంచంలో ఒక రోడ్డు ఉంది. అది రోజులో కేవలం రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో అదృశ్యం అవుతుంది. ఇంతకీ ఆ రోడ్డు ఎక్కడ ఉంది? ఆ రోడ్డు మీదుగా ఎవరు ప్రయాణిస్తుంటారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోడ్డు ఫ్రాన్స్‌లో ఉంది. ఈ రోడ్డు ప్రధాన భూభాగాన్ని నోయిర్ మౌటియర్ ద్వీపంతో కలుపుతుంది. ఈ ప్రాంతం ఫ్రాన్స్‌లోని అట్లాంటిక్ వద్ద ఉంది. ఈ రోడ్డు 4.5 కిలోమీటర్ల పొడవు కలిగివుంది. ఈ రోడ్డును ‘పాసేజ్ డూ గోయిస్’ పేరుతో పిలుస్తారు. ఫ్రెంచ్ భాషలో ‘గోయిస్’ అంటే ‘చెప్పులు విడిచి రోడ్డు దాటడం’ అని అర్థం. ఇది రోజులో ఒక గంట లేదా రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో నీటిలో మునిగిపోతుంది. ఆ సమయంలో రోడ్డుకు నలువైపులా నీరే కనిపిస్తుంది. ఈ రోడ్డు తొలిసారిగా 1701లో మ్యాప్‌లో కనిపించింది. ఈ రోడ్డు దాటడం ఎంతో ప్రమాదకరం. రోజులో రెండు గంటలు మాత్రమే ఎంతో పరిశుభ్రంగా కనిపించి, ఆ తరువాత మాయమైపోతుంది. రోడ్డుకు రెండు పక్కల నీటిమట్టం పెరిగిపోతుంది. దీంతో అక్కడి నీటి లోతు 1.3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకూ ఏర్పడుతుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ రోడ్డు మీదుగా ప్రయాణించే చాలామంది ప్రతీయేటా మృత్యువు పాలవుతుంటారు. మొదట్లో జనం ఈ ప్రాంతానికి బోట్లలో వచ్చేవారు. తరువాత ఇక్కడ రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. 1840లో గుర్రాల సాయంతో జనం ఇక్కడికి వచ్చేవారు. 1986 తరువాత ఇక్కడ ప్రత్యేకమైన్ రేసులు నిర్వహిస్తూ వస్తున్నారు. 1999 నుంచి ఫ్రాన్స్ ఈ రోడ్డుపై ‘టూర్ ది ఫ్రాన్స్’ పేరిట సైకిల్ రేసులు నిర్వహిస్తూ వస్తోంది. -
కేంద్రం నుంచి ఏపీకి సంపూర్ణ సహకారం: నితిన్ గడ్కరీ
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఏపీ పారిశ్రామిక వృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకమని పేర్కొన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీని బలోపేతం చేస్తామని చెప్పారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు రూ.20వేల కోట్లు కేటాయిస్తామని గడ్కరీ తెలిపారు. అలాగే ఏపీలో మత్స్య పరిశ్రమ చాలా కీలకంగా మారిందని గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. 50-50 భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఈ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోందని వివరించారు. పర్యావరణహిత వాహనాలదే భవిష్యత్ అని స్పష్టంచేశారు. కాలుష్యాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని సూచించారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి రాయితీలు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. కేంద్రం నుంచి ఏపీకీ సంపూర్ణ సహకారం ఉంటుందని గడ్కరీ చెప్పారు. దేశంలోని ముఖ్య రాష్ట్రాల్లో ఏపీ ఒకటన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఏపీ జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చదవండి: ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. అంబానీ కీలక ప్రకటన -
Telangana: ఆర్టీసీ నష్టాలు రూ.11,000 కోట్లు.. ఆది నుంచి కష్టాలే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ రూ.10 వేల కోట్ల నష్టాల మార్కును దాటిపోయింది. గతేడాది డిసెంబర్ నాటికే నష్టాలు రూ.10,762 కోట్లకు చేరగా, జనవరి కూడా కలిపితే ఆ మొత్తం రూ.11 వేల కోట్లకు చేరినట్లు తాజాగా క్రోడీకరించిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే సంస్థ నష్టాలతో పరుగుపెడుతోంది. రాష్ట్రం విభజన జరిగిన 2014 జూన్ 2 నుంచి ఆర్థిక సంవత్సరం ముగిసిన 2015 మార్చి 31 నాటికి టీఎస్ ఆర్టీసీ రూ.299.64 కోట్ల నష్టాలతో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరమే కావటంతో, ఆ నష్టాలు తాత్కాలిక మే అన్న భావన వ్యక్తమైంది. కానీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. నష్టాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఎనిమిదేళ్లలో ఒక్క 2022లోనే తక్కువ నష్టాలు నమోదయ్యాయి. గత ఏడాది చివరలో డీజిల్ సెస్‌ను ప్రారంభించటం, నెల రోజుల్లోనే దాన్ని సవరించి మళ్లీ పెంచటం, ఆదాయం పెంచేందుకు చేపట్టిన రకరకాల చర్యలు, ఖర్చును తగ్గించటం, ప్రత్యామ్నాయ ఆదాయం పెంపుపై దృష్టి.. వెరసి నష్టాలు బాగా తగ్గాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ.473 కోట్లు రికార్డయ్యాయి. ఇదే నష్టాల్లో అత్యుత్తమ గణాంకం కావడం గమనార్హం. భారీ వేతన సవరణతో.. ఆర్టీసీలో 2013లో జరగాల్సిన వేతన సవరణ 2015లో జరిగింది. కార్మికులు అడిగిన దాని కంటే ఎక్కువగా ప్రభుత్వం ఏకంగా 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. భారీగా జీతాల పెంపుతో ఆర్టీసీపై సాలీనా రూ.850 కోట్ల మేర కొత్త భారం పడింది. కానీ అదనపు ఆదాయం పెంపు దిశగా అధికారులు కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ప్రభుత్వం కూడా పర్యవేక్షణను పట్టించుకోకపోవటంతో నష్టాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆ ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ.1,150 కోట్ల నష్టం వచ్చింది. ఇది అప్పటివరకు ఆర్టీసీ చరిత్రలోనే అతిపెద్ద నష్టంగా నమోదయ్యింది. ఉమ్మడి ఆరీ్టసీలో కూడా (రెండు ఆర్టీసీలు కలిపి) ఎప్పుడూ ఇంత నష్టం రాలేదు. ఆ వేతన సవరణకు సంబంధించిన బకాయిల్లో సగం ఇంకా చెల్లించలేదు. బాండ్ల రూపంలో చెల్లించాల్సిన రూ.288 కోట్ల మొత్తమూ అలాగే ఉంది. అది చెల్లిస్తే నష్టాల కుప్ప మరింత పెరుగుతుంది. సమ్మెతో కోలుకోని స్థితికి.. 2019లో ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద సమ్మె జరిగింది. కారి్మకులు ఏకంగా 52 రోజుల పాటు బస్సుల్ని స్తంభింపజేశారు. ఫలితంగా 2019–20లో రూ.1,002 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఆ వెంటనే కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్లు బస్సులు సరిగా తిరగలేదు. దీనివల్ల కూడా నష్టాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇటీవల చేపట్టిన సంస్కరణల వల్ల ప్రస్తుతం 35 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. మరో 20 డిపోలు బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యాయి. మిగతా డిపోల్లో నష్టాలు తగ్గాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఏప్రిల్ నాటికి కొత్త నష్టాలు పూర్తిగా నియంత్రణలోకి వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. కానీ పరిస్థితి అంత సులభంగా మారేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం డీజిల్ సెస్ పెంపు వల్ల మాత్రమే నష్టాలు తగ్గాయన్నది సుస్పష్టం కాగా ఇప్పటికీ ప్రత్యామ్నాయ ఆదాయం పెరగక పోవడం గమనార్హం. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు... ఇటీవల నష్టాల లెక్కలను ఆర్టీసీ ప్రభుత్వం ముందుంచింది. ఆరీ్టసీకి రావాల్సిన బకాయిలు, సీసీఎస్, పీఎఫ్‌లకు చెల్లించాల్సిన మొత్తాలపై నివేదిక అందించింది. అయితే గతేడాది బడ్జెట్లో ఆరీ్టసీకి రూ.1,500 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ తాజా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. కొత్త బడ్జెట్లో ఎక్కువ నిధులు వస్తాయని ఆశించినా, మళ్లీ అంతేమొత్తాన్ని ప్రతిపాదించటంతో సందిగ్ధత ఏర్పడింది. నష్టాలు మరింత తగ్గిస్తాం ఇటీవలి కొన్ని నిర్ణయాలతో ఆర్టీసీ నష్టాలను భారీగా తగ్గించగలిగాం. మరింత తగ్గించేందుకు చర్యలు చేపడతాం. డీజిల్ సెస్, సేఫ్టీ సెస్ లాంటివి సంస్థ ఆదాయాన్ని పెంచాయి. ఇక ప్రభుత్వం తన వంతుగా ప్రతి సంవత్సరం రూ.1,500 కోట్లు ఇస్తోంది. అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవటంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. అవి కూడా వస్తే ఆరీ్టసీకి మరింత సాయం అందేది. పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు రానున్నందున ఆదాయం కొంత పెరిగే వీలుంది. – బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ చైర్మన్ -
2024 కల్లా అమెరికాకు దీటుగా రోడ్లు: నితిన్ గడ్కరీ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. లఖ్‌నవూలో జరిగిన ‘ఇండియన్ రోడ్డు కాంగ్రెస్’ 81వ సదస్సులో రోడ్ల నిర్మాణంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.8,000 కోట్లు విలువ చేసే రోడ్డు ప్రాజెక్టులను ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్ రహదారులను అగ్రరాజ్యానికి దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూ.5 లక్షల కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు నితిన్ గడ్కరీ. ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభలో మాట్లాడుతూ భారత్‌లోని రోడ్ల మౌలిక సదుపాయాలు త్వరలోనే అమెరికా తరహాలో ఉంటాయని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ‘షాహబాద్-హర్దోర్ బైపాస్, షాజహాన్‌పుర్ టూ షాహబాద్ బైపాస్, మోరాబాద్- థాకుర్వారా-కషిపుర్ బైపాస్, ఘాజిపుర్-బలియా బైపాస్‌లతో పాటు 13 ఆర్వోబీలు, మొత్తం రూ.8వేల కోట్లు ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. సాంకేతికత, పర్యావరణ పరిక్షణ, వినూత్నత, భద్రత, నాణ్యత.. వంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రహదారుల అభివృద్ధి జరగాలి.’ అని గడ్కరీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్‌తో కాకుండా సీఎన్జీ, ఇథనాల్, మిథనాల్‌తో నడిచే వాహనాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు గడ్కరీ. విద్యుత్తు వాహనాలను వినియోగించాలన్నారు. ఫలితంగా రవాణ వ్యయాలు తగ్గుతాయన్నారు. మరోవైపు.. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు గడ్కరీ. యూపీలో జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్: యూపీ కాంగ్రెస్ -
అదానీ హవా: 3 వేల కోట్ల భారీ డీల్
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా మెక్వారీ ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌కి (ఎంఏఐఎఫ్) ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లోని టోల్ రహదారుల పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,110 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. ఈ రహదారులు పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్నాయని వివరించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ (ఏఆర్‌టీఎల్) ద్వారా ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. ‘గుజరాత్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ (జీఆర్ఐసీఎల్), స్వర్ణ టోల్‌వే (ఎస్టీపీఎల్)ను కొనుగోలు చేసేందుకు ఏఆర్‌టీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది‘ అని అదానీ గ్రూప్ వెల్లడించింది. ఎంఏఐఎఫ్‌కు జీఆర్‌ఐసీఎల్‌లో 56.8 శాతం, ఎస్‌టీపీఎల్‌లో 100 శాతం వాటాలు ఉన్నాయి. ఈ వాటాలను ఏఆర్‌టీఎల్ పూర్తిగా కొనుగోలు చేస్తోంది. అలాగే జీఆర్‌ఐసీఎల్‌లో ఐఎల్అండ్ఎఫ్ఎస్కి ఉన్న మిగతా వాటాలను కూడా దక్కించుకునే అంశాన్ని కూడా పరిశీలించనుంది. 2022 సెప్టెంబర్‌లో ఈ లావాదేవీ పూర్తి కాగలదని అదానీ తెలిపింది. ఏపీ, గుజరాత్లో రెండు రహదారులు.. ఎస్‌టీపీఎల్‌కు ఆంధ్రప్రదేశ్‌లో రెండు టోల్ రోడ్లు ఉన్నాయి. ఒకటి నేషనల్ హైవే 16పై తడ నుంచి నెల్లూరు (110 కి.మీ.) వరకూ, మరొకటి నేషనల్ హైవే 65పై నందిగామ నుంచి ఇబ్రహీంపట్నం- విజయవాడ వరకూ(48 కి.మీ.) ఉంది. అటు జీఆర్‌ఐసీఎల్‌కు కూడా గుజరాత్లో రెండు టోల్ రోడ్లు ఉన్నాయి. ఒకటి అహ్మదాబాద్ నుంచి మెహ్సానా వరకూ(51.6 కి.మీ.), రెండోది వదోదర నుంచి హలోల్ వరకూ(31.7 కి.మీ.) ఉన్నాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 469 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 266 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 12,579 కోట్ల నుంచి 3 రెట్లుపైగా ఎగసి రూ. 41,066 కోట్లకు చేరింది. -
‘లింక్’ ప్యాకేజ్... అనుసంధాన రోడ్లకు రూ.2410 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రధాన రహదారులతోపాటు లింక్ రోడ్లకు సైతం అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో నగరంలో రెండు దశల్లో చేపట్టిన మిస్సింగ్, లింక్ రోడ్లతో ప్రజలకు మంచి ప్రయోజనం కలిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మూడో ఫేజ్‌లో జీహెచ్ఎంసీతోపాటు జీహెచ్ఎంసీని ఆనుకొని ఉన్న 10 యూఎల్బీల్లోనూ ఆయా కారిడార్లలో మిస్సయిన, లింక్ తెగిన ప్రాంతాల్లో మిస్సింగ్, లింక్‌రోడ్ల ఏర్పాటుకు, ఆయా కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏకంగా 104 కారిడార్లలో (రోడ్లలో) పనులు చేపట్టేందుకు పురపాలనశాఖ రూ.2410 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వీటిల్లో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో 50 కారిడార్లలో 120.92 కి.మీల మేర పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టేందుకు అనుమతినిచ్చింది. ఈ నిధులను హెచ్ఎండీఏ అంతర్గత వనరుల నుంచి కానీ, ఆరి్థక సంస్థల నుంచి రుణాలుగా కానీ సేకరించాలని ఆదేశించింది. ఈ మేరకు హెచ్ఆర్డీసీఎల్ ఎండీ, హెచ్ఎండీఏ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్యాకేజీ–1 7 కారిడార్లు 25.20 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ. 304 కోట్లు. ఈసానది తూర్పువైపు బాపూఘాట్ బ్రిడ్జి నుంచి పీఅండ్‌టీ కాలనీ. కొత్తూరులో రైల్వే క్రాసింగ్ నుంచి కుమ్మరిగూడ జంక్షన్. కొత్తూరు వై జంక్షన్ నుంచి వినాయక స్టీల్ (ఎన్‌హెచ్44)వరకు. శంషాబాద్‌లో ఎన్‌హెచ్ 44 బస్టాప్ నుంచి ఒయాసిస్ ఇంటర్నేషనల్. శంషాబాద్ రైల్వే క్రాసింగ్ నుంచి ధర్మగిరి రోడ్. ఎన్‌హెచ్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ సరీ్వస్‌రోడ్. గొల్లపల్లి ఎన్‌హెచ్ జంక్షన్–ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ప్యాకేజ్ –2 10 కారిడార్లు 27.20 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ. 330 కోట్లు. ఆర్సీఐ ఎక్స్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ హోటల్ శ్రీశైలం హైవే వరకు మల్లాపుర్ క్రాస్ రోడ్ నుంచి కుర్మగూడ వరకు కుర్మగూడ నుంచి నాదర్గుల్ వరకు బడంగ్‌పేట మెయిన్ రోడ్ నుంచి తుర్కంజల్ వయా రామయ్య నాదర్గుల్ వరకు అంబేద్కర్ జంక్షన్ నుంచి అక్టోపస్ వరకు ఇంజాపూర్ రోడ్ నుంచి మునుగురు రోడ్ తొర్రూర్ నుంచి నాగార్జున సాగర్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ టూ డీఎల్ఆర్ఎల్ కాలనీ (వయా టీకేఆర్ కాలేజ్ రోడ్) వనస్థలిపురం రోడ్ టూ ఓల్డ్ హయత్‌నగర్ రోడ్ బడంగ్‌పేట–నాదర్గుల్ మెయిన్ రోడ్ –నాదర్గుల్ రోడ్ ప్యాకేజ్–3 13 కారిడార్లు 33.35 కి.మీల లింక్ రోడ్లువ్యయం రూ. 417 కోట్లు. రోజ్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్ దోమల గూడ నుంచి నాగారం రోడ్ కనెక్టింగ్ టూ ఈసీఐఎల్ చేర్యాల జేఎన్ఎన్యూఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మాద్గూడ ఆర్జీకే వరకు ఫిరంగ్ కట్టా నుంచి ఎనీ్టఆర్ విగ్రహాం రోడ్ వరకు – ఎన్టీఆర్గ్రహంనుంచి దోమలగూడ రోడ్ (మున్సిపల్ పరిధిలో ) వరకు ఎన్టీఆర్ విగ్రహం నుంచి డంపింగ్ యార్డ్ ఎన్టీఆర్ విగ్రహం నుంఇ వంపుగూడ రోడ్ రాంపల్లి ఎక్స్‌రోడ్ నుంచి సర్వే నెంబర్ 421 సర్వే నెంబర్ 421నుంచి యమన్పేట నగరం యూఎల్బీ బౌండ్రీ– చర్లపల్లి నుంచి ఓఆర్ఆర్ సరీ్వస్‌రోడ్ వయా కరీంగూడ యామన్పేట ఫ్లైఓవర్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ వరకు యామన్పేట్ నుంచి ఆర్ఆర్ఆర్ సర్వీస్ రోడ్ శివరెడ్డిగూడెం నుంచి మాధవ్‌రెడ్డి బిడ్జ్రి ప్యాకేజ్–4 11 కారిడార్లు 24.64 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ.297 కోట్లు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి కోకపేట చెవేళ్ల రోడ్ టూ రాధా రియాల్టీ కార్పొరేషన్ రోడ్ చెవేళ్ల రోడ్ (బాలాజీనగర్)నుంచి రాధా రియాల్టీ కార్పొరేన్ లింక్ రోడ్ నార్సింగ్ అప్పా సర్వీస్ రోడ్ నుంచి చెవేళ్ల –రాధ రియాల్టీ కార్పొరేషన్ రోడ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి చెవేళ్ల రోడ్ వయా కిస్మత్‌పురా వివేకనంద విగ్రహం కిస్మత్‌పురా నుంచి ఆర్అండ్ బీ రోడ్ హనుమాన్ దేవాలయం నుంచి కైసర్ నగర్ నుంచి మైతలి నగర్ జాజుల రామారం అమీన్‌పురా నుంచి హెచ్‌ఎంటీకాలనీ మియాపూర్ వరకు వీఎన్ఆర్ కాలేజీ బాచుపల్లి నుంచి పోట్టి శ్రీరాములు తెలుగుయూనివర్సిటీ నిజాంపేట వరకు ఎన్‌హెచ్ 44 నుంచి ఇండస్ట్రీ ఏరియా రాంరెడ్డినగర్ వయా ఫాక్స్ సాగర్ వరకు ప్యాకేజ్–5 9 కారిడార్లు 10.53 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ.152 కోట్లు. రాజ్‌భవన్ రోడ్ నుంచి ఆర్అండ్బీ అతిథిగృహాం, లింక్‌రోడ్ బేగం పేట రైల్వేస్టేషన్ ప్రకాశ్‌నగర్ నుంచి బ్రాహా్మణవాడి రైల్వే ట్రాక్ వయా పార్క్ బైరాగి గూడ నుంచి నార్సింగి వరకు దర్గా నుంచి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వరకు ఫర్మాయిస్ హోటల్ నుంచి తారమతి బారాదరి వయా కేంద్రీయా విహార్ అపార్ట్మెంట్ కుత్బుల్లాపూర్ రోడ్ నుంచి పైప్లైన్రోడ్ వయా గోదావరి హోస్ కుత్బుల్లాపూర్ రోడ్ నుంచి పైప్‌లైన్ రోడ్ వయా సెయింట్ అంథోని హైసూ్కల్ వెన్నలగడ్డ చెర్వు ఎన్సీసీ జంక్షన్ నుంచి అడిక్‌మెట్ ఫ్లైఓవర్ ఓయూ కంపౌండ్ వాల్ ప్రగతి నగర్ నుంచి మహదేవ్‌పురం పశువుల ఆసుపత్రి వరకు (చదవండి: ప్రకృతి వైద్యానికి కేరాఫ్‌గా హైదరాబాద్) -
ఏపీలో రోడ్డు ప్రమాద మరణాలు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 2020లో రహదారి ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రహదారి ప్రమాదాలు, వాటి వల్ల సంభవించే మరణాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. 2019తో పోలిస్తే 2020లో రహదారి ప్రమాదాలు 18.46 శాతం తగ్గగా, మరణించిన వారి సంఖ్య 12.84 శాతం, క్షతగాత్రుల సంఖ్య 22.84 శాతం తగ్గిందని తెలిపింది. 2020లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3,66,138 ప్రమాదాల్లో 1,31,714 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశంలో రోడ్డు ప్రమాదాలు–2020 నివేదిక ప్రకారం 2016 నుంచి చూస్తే రహదారి ప్రమాదాల్లో 0.46 శాతం స్వల్ప తగ్గుదల కనిపిస్తోందని తెలిపింది. -
వాహనదారులకు అలర్ట్.. కొత్త రూల్..అమలులోకి వచ్చేది అప్పుడే..!
సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్ -1989 చట్టంను కేంద్ర ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. ఈ సవరణలో భాగంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు రిజిస్టర్డ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS) ద్వారా మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందడాన్ని తప్పనిసరి చేస్తూ రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ గురువారం (ఏప్రిల్ 7)న నోటిఫికేషన్ జారీ చేసింది. అన్నీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు వచ్చే ఏడాది నుంచి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల నుంచి మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని పేర్కొంది. 8 ఏళ్ల పాత వాహనాలకు రెండు సంవత్సరాల పాటు, అంతకు మించిన పాత వాహనాలకు ఒక ఏడాది పాటు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏటీఎస్ అందించనుంది. రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం...హెవీ గూడ్స్ వెహికల్స్/హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్స్ కోసం ఏప్రిల్ 1, 2023 నుంచి, మీడియం గూడ్స్ వెహికల్స్/మీడియం ప్యాసింజర్ మోటార్ వెహికల్స్, లైట్ మోటర్ వెహికల్స్ (రవాణా) కోసం జూన్ 1, 2024 నుంచి వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుందని నోటిఫికేషన్ వెల్లడించింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ నిబంధనలలో మార్పులను ప్రతిపాదిస్తూ గతంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా తుది నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి అభ్యంతరాలు లేదా సూచనలను లేవనెత్తడానికి 30 రోజుల సమయాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇచ్చింది. MoRTH has issued a notification regarding mandatory fitness of motor vehicles only through registered Automated Testing Station. pic.twitter.com/DBtkJIFSX9 — MORTHINDIA (@MORTHIndia) April 7, 2022 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS)ద్వారా వాహన ఫిట్‌నెస్‌ని తనిఖీ చేయడానికి అవసరమైన వివిధ పరీక్షలను ఆటోమేట్ చేయడానికి మెకానికల్ పరికరాలతో చేయనుంది. ఈ టెస్టింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు ఫిట్నెస్ను పరీక్షించడానికి ఏటీఎస్ పరీక్ష కేంద్రాలను నెలకొల్పేందుకు గత ఏడాది అనుమతులను జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: భారీ డీల్‌ను కైవసం చేసుకున్న టాటా మోటార్స్..! -
వాహనదారులకు అలర్ట్.. ఇక ఆ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి!
కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకీ రోడ్డు నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తుంది. తాజాగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(ఎంఓఆర్టీహెచ్) రోడ్డుపై నడిచే అన్ని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్'ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మార్క్ వాలిడిటీని నిర్ణీత పద్ధతిలో చూపించడానికి కేంద్రం నేడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ వాహనం నెంబరు ప్లేట్ తరహాలోనే ఉంటుంది. దీని మీద వేహికల్ ఫిట్నెస్ గడువు తేదీని స్పష్టంగా కనబడుతుంది. ఈ సర్టిఫికేట్ DD-MM-YY ఫార్మట్'లో ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారీ వస్తువులు/ప్యాసింజర్ వాహనాలు, మీడియం గూడ్స్/ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాల విషయంలో విండ్ స్క్రీన్ ఎడమ వైపున ఎగువ అంచున దీనిని ప్రదర్శించాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఆటో రిక్షాలు, ఈ-రిక్షాలు, ఈ-కార్ట్లు & క్వాడ్రిసైకిల్స్ విషయంలో విండ్ స్క్రీన్ ఎడమ వైపున ఎగువ అంచున ఈ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక మోటార్ సైకిళ్లకు వాహనా మీద స్పష్టంగా కనిపించ భాగంలో దీనిన్ ఉంచాలని తెలిపింది. నోటిఫికేషన్ ప్రకారం, వాహనాలు టైప్ అరియాల్ బోల్డ్ స్క్రిప్ట్'లో నీలం బ్యాక్ గ్రౌండ్ పై పసుపు రంగులో సమాచారాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. MoRTH has issued a draft notification according to which validity of fitness certificate (in format DD-MM-YYYY) and registration mark of the motor vehicle shall be exhibited on the vehicles in the manner as prescribed in the draft rules. pic.twitter.com/g0D0sIoTkJ — MORTHINDIA (@MORTHIndia) March 3, 2022 ఇందుకు సంబంధించి రాబోయే 30 రోజుల్లో ప్రజలు, ఇతర వాటాదారులు సూచనలు చేయలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ డేటా ప్రకారం, భారతదేశంలో 20 ఏళ్లు పైబడిన 51 లక్షల లైట్ మోటార్ వాహనాలు ఉన్నాయి. అలాగే 15 ఏళ్ల కంటే ఎక్కువ లైఫ్ గల 34 లక్షల వాహనాలు దేశంలో ఉన్నాయి. 15 ఏళ్లు పైబడిన మరో 17 లక్షల మీడియం & హెవీ కమర్షియల్ వేహికల్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా ఉన్నాయి. (చదవండి: కొత్త కారు కొనేవారికి బంపరాఫర్.. హోండా కార్లపై భారీగా డిస్కౌంట్!) -
నయా లుక్‌లో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు వచ్చేశాయ్!
సాక్షి, సిటీబ్యూరో: నయా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు వచ్చేశాయి. ఇప్పటివరకు తెలుపు రంగు కార్డుపై నలుపు, ఎరుపు రంగులో ముద్రించిన అక్షరాలతో కనిపించిన స్మార్ట్ కార్డులు ప్రస్తుతం లేత ఆకుపచ్చ, నీలి రంగుల్లో నలుపు అక్షరాలతో అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని అమలు చేసేందుకు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల్లో మార్పులు చేశారు. కేంద్ర మోటా రు వాహన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్మార్ట్‌కార్డులను అందజేసేందుకు చర్యలు చేపట్టినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు పాత స్మార్ట్‌కార్డులపై ముద్రించిన అక్షరాల కంటే కొత్త కార్డులపై ముద్రించిన అక్షరాల సైజును పెంచారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే నమూనాలో ఉండేవిధంగా వీటిని రూపొందించారు. దేశంలో ఎక్కడి నుంచైనా.. ♦ కేంద్ర మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఏకీకృత పౌరసేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు వాహన్ సారథి పోర్టల్‌లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన వాహనదారులు, డ్రైవర్ల వివరాలు నమోదవుతాయి. ఇటీవల వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే వాహన్ సారథి పోర్టల్‌తో అనుసంధానమై ఉండేవి. వాహన సారథి పోర్టల్‌లో లేని రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాలు లేకపోవడంతో కేంద్ర మోటారు వాహన చట్టం (సీఎంవీ) అమల్లో సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తాయి. ♦ వివిధ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలు, వాహనదారులను ఈ చట్టం పరిధిలో గుర్తించడం కష్టంగా మారింది. ఇప్పటివరకు దూరంగా ఉన్న తెలంగాణ తాజాగా వాహన్ సారథిలో చేరడంతో తెలంగాణకు చెందిన వాహనాలు, డ్రైవర్ల వివరాలు దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చు. ఇందుకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు చేసినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కార్డుల కొరత తీరింది.. ♦ మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 3.5 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్‌కార్డుల కొరత తీరినట్లు అధికారులు తెలిపారు. కొత్త సాంకేతిక వ్యవస్థతో పాటే కార్డుల ప్రింటింగ్, పంపిణీకి తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్డులు లేకపోవడంతో 3 నెలలుగా ప్రింటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ♦ లక్షలాది మంది వాహనదారులు స్మార్ట్‌కార్డుల కోసం ఆర్టీఏ కేంద్రాల చుట్టూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొత్త కార్డులు రావడంతో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వాటిని ముద్రించి పంపిణీ చేస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో ఏ రోజు డిమాండ్ మేరకు ఆ రోజే కార్డులను ముద్రించి అందజేసే అవకాశం ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
అందరికీ ‘ఆర్టీసీ’ వైద్యం!
సాక్షి, హైదరాబాద్: తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆసుపత్రిలో సాధారణ ప్రజలకూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఇది కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే వైద్యం అందిస్తోంది. తాజాగా దీనిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు వసతులు మెరుగుపరచాలని, ఇతరులకు కూడా వైద్యం అందించేలా రూపొందించాలని భావిస్తోంది. విశాలమైన ప్రాం గణం, పెద్ద భవనాలు అందుబాటులో ఉన్నందున, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భావిస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారిస్తే.. అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని, అదే సమ యంలో ఆర్టీసీకి ఆదాయం కూడా సమకూరుతుందనేది ఆలోచన. కాగా ఈ ప్రక్రియను క్రమంగా పట్టాలెక్కించేందుకు కసరత్తు ప్రారంభించారు. సరిపడ నిధులు, పర్యవేక్షణ లేక పడక ఉమ్మడి రాష్ట్రంలో లక్ష మంది ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వైద్యాన్ని అందించిన ఈ ఆసుపత్రి ఆ తర్వాత పర్యవేక్షణ లేక పడకేసింది. చాలినన్ని నిధులు లేక వసతులు కూడా మృగ్యమయ్యాయి. క్రమంగా వైద్యుల కొరత ఏర్పడింది. కావాల్సిన మందుల సరఫరా లేక బయట కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మెరుగైన వైద్యం అందక రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేయాల్సి వచ్చింది. ఇలా సంవత్సరానికి దాదాపు రూ.30 కోట్ల మేర రెఫరల్ బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. ఒక్క సంవత్సరంలో చెల్లించే రెఫరల్ బిల్లులను ఆసుపత్రిపై వెచ్చిస్తే అది మెరుగ్గా మారుతుందన్న ఆలోచన లేకుండా వ్యవహరించారు. ప్రభుత్వంపై ఆధార పడకుండా.. తాజాగా దీనావస్థలో ఉన్న ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలని నిర్ణయించారు. భవనాన్ని విస్తరించి అదనంగా బెడ్లను పెంచి ల్యాబ్‌ను విస్తరించటం ద్వారా వైద్య సేవలను కార్పొరేట్ స్థాయికి తేవాలని నిర్ణయించారు. దీనికి భారీగా నిధులు అవసరం కానున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి నిధులు ఆశించకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) విధానం ద్వారా నిధులు సమకూర్చు కోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధమైంది. ల్యాబ్‌లో పరీక్షలు 24 గంటలూ నిర్వహించటం, మందుల కౌంటర్‌ను నిర్విరామంగా తెరిచి ఉంచటం లాంటి వాటిని ప్రారంభించారు. ఇటీవలే డయాలసిస్ కేంద్రాన్ని మొదలుపెట్టారు. త్వరలో సహాయ సిబ్బంది నియామకం ఆస్పత్రిలో 28 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 16 మందే సేవలందిస్తున్నారు. దీంతో నలుగురిని కొత్తగా నియమించుకుని, మరో ఐదుగురు ప్రైవేటు వైద్యుల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇక 60 మంది సహాయ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోబోతున్నారు. ఇందులో నర్సులు, డయాలిసిస్ టెక్నీషియన్లు, మల్టీ పర్పస్ వర్కర్ల పోస్టులు ఉన్నాయి. సంస్థ ఎండీ సజ్జనార్ బుధవా రం వరకు సెలవులో ఉన్నారు. గురువారం ఆయన అనుమతితో నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఇక ఆధునిక వైద్య పరికరాలు, బెడ్లకు కావాల్సిన నిధుల సమీకరణ జరుగుతోంది. కోవిడ్ సెంటర్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు. విశ్రాంత సర్జన్ ఆధ్వర్యంలో.. గతంలో గాంధీ ఆసుపత్రిలో కీలక పోస్టులో కొన సాగి పదవీ విరమణ పొందిన ఓ సర్జన్‌కు తార్నాక ఆసుపత్రి విస్తరణ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించారు. ఆయన కొద్ది రోజులుగా దగ్గరుండి దీనిని నిర్వహిస్తున్నారు. కన్సల్టెన్సీ తరహాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి సూచనలు అందిస్తోంది. -
ఐదు రోడ్లు.. రెండు ఆర్వోబీలు.. ఓ వంతెన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యాచరణ ఊపందుకుంది. 2021–22 వార్షిక ప్రణాళికలో పనులను ఆర్అండ్బీ శాఖలోని జాతీయరహదారుల విభాగం వేగవంతం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు కేంద్రం గతంలో ఎన్నడూలేని రీతిలో ఆమోదించిన రూ.6,421కోట్ల వార్షిక ప్రణాళికలో పేర్కొన్న రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధమయ్యింది. అందులో భాగంగా రూ.1,048.50 కోట్లతో ఐదు రోడ్లు, రెండు ఆర్వోబీలు, పెన్నా నదిపై ఓ వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ టెండర్లు పిలిచింది. ఆ పనుల వివరాలిలా ఉన్నాయి. ► చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో రెండు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)లు రూ.140కోట్లతో నిర్మిస్తారు. జాతీయ రహదారి–40 వద్ద, జాతీయ రహదారి–71 వద్ద ఒక్కోటి రూ.70కోట్లతో నిర్మిస్తారు. ► రూ.100 కోట్ల అంచనా వ్యయంతో నెల్లూరు సమీపంలోని జాతీయ రహదారి–67 మార్గంలో పెన్నా నదిపై కొత్త వంతెన నిర్మిస్తారు. ప్రస్తుతం పెన్నా నదిపై ఉన్న వంతెన 6.70మీటర్ల వెడల్పే ఉంది. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పెన్నా నదిపై 2.68 కి.మీ. మేర కొత్త వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► తెలంగాణ సరిహద్దులోని ముదిరెడ్డిపల్లె నుంచి నెల్లూరు రహదారిలో భాగంగా 43 కి.మీ. మేర రెండు లేన్ల రోడ్డును పావ్డ్ సోల్డర్స్ (10 మీటర్ల వెడల్పు) అభివృద్ధి చేస్తారు. వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దు నుంచి నెల్లూరు జిల్లా సరిహద్దు వరకు రూ.300కోట్లతో రహదారి నిర్మిస్తారు. రోజుకు 4,500 వరకు పాసింజర్ కార్ యూనిట్ల ట్రాఫిక్ రద్దీ ఉన్న ఈ రహదారిని అభివృద్ధి చేయడంతో ప్రయాణం మరింత సౌలభ్యంగా మారుతుంది. ► రూ.318.50 కోట్ల అంచనా వ్యయంతో జాతీయ రహదారి 167బి మార్గంలో సీఎస్ పురం నుంచి మాలకొండ వరకు రెండు లేన్ల రోడ్డును పావ్డ్ సోల్డర్స్ (10 మీటర్ల వెడల్పు)తో అభివృద్ధి చేస్తారు. 44 కి.మీ.రహదారి నిర్మాణం వల్ల రోజుకు 6,900 పాసింజర్ కార్ యూనిట్ల ట్రాఫిక్ రద్దీ ఉండే ఈ మార్గంలో రాకపోకలు మరింత సౌలభ్యంగా మారతాయి. ► రూ.90కోట్ల అంచనా వ్యయంతో చిత్తూరు నగర పరిధిలో జాతీయ రహదారి–40, జాతీయ రహదారి–69ని అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 6.80కి.మీ. మేర ఈ రహదారిపై రోజుకు12,500 పాసింజర్ కార్ యూనిట్ల ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఆ నాలుగు లేన్ల రహదారితో మన రాష్ట్రం నుంచి అటు చెన్నై ఇటు బెంగళూరుకు రాకపోకలకు సౌలభ్యంగా ఉంటుంది. ► చిత్తూరు జిల్లాలోని పుత్తూరు నుంచి ఉత్తుకొట్టై వరకు రహదారిని అభివృద్ధి చేస్తారు. 40 కి.మీ. మేర ఈ రహదారి పనుల కోసం రూ.50కోట్లు కేటాయించారు. ► రూ.50కోట్ల అంచనా వ్యయంతో చిలమత్తూరు–హిందూపూర్–పరిగి మార్గంలో 23.20 కి.మీ. మేర రెండు లేన్ల రోడ్డును పావ్డ్ సోల్డర్స్ (10 మీటర్ల వెడల్పు) విధానంలో అభివృద్ధి చేస్తారు. -
వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజీ (తుక్కు) విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పాత వాహనాలను స్క్రాప్‌కి ఇచ్చేసి కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్‌లో 25 శాతం దాకా రిబేట్ ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. కాలుష్యం వెదజల్లుతున్న పాత వాహనాలను వదిలించుకునేలా వాహదారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి చర్యలు దోహదపడగలవని ప్రెస్ నోట్లో పేర్కొంది. దీని ప్రకారం రవాణాయేతర (వ్యక్తిగత) వాహనాలకు 25 శాతం దాకా, రవాణా (వాణిజ్య)వాహనాలకు 15 శాతం దాకా కన్సెషన్ లభించగలదని కేంద్రం తెలిపింది. రవాణా వాహానాలకు ఎనిమిదేళ్ల దాకా, రవాణాయేతర వాహనాలకు 15 ఏళ్ల వరకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఈ నిబంధనలు 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజీ విధానాన్ని ఈ ఏడాది ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దీని ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ టెస్టింగ్ తప్పనిసరి కానుంది. మిగతా కేటగిరీల వాహనాలకు 2024 జూన్ 1 నుంచి దశలవారీగా అమలు చేస్తారు. చదవండి: కొత్త స్వరం.. గడ్కరీ కీలక ప్రకటన -
భారీ షాక్: పాత కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు భారీగా పెంపు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లకు మించి పాతబడిన కార్ల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవడానికి భారీగా చార్జీలు చెల్లించుకోవాల్సి రానుంది. ప్రస్తుత స్థాయికి ఎనిమిది రెట్లు అధికంగా కట్టాల్సి వస్తుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం 15 ఏళ్లు పైబడిన కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 600గా ఉంది. ఇక పాత బైక్‌ల రెన్యువల్ కోసం రూ. 1,000 కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతమిది రూ. 300గా ఉంది. మరోవైపు, 15 ఏళ్లు పైబడిన బస్సు లేదా ట్రక్కు ఫిట్నెస్ రెన్యువల్ సర్టిఫికెట్ కోసం రూ. 12,500 (ప్రస్తుతం రూ. 1,500), మధ్యస్థాయి గూడ్స్ లేదా ప్యాసింజర్ వాహనానికి రూ. 10,000 చార్జీలు వర్తిస్తాయి. దిగుమతి చేసుకున్న బైక్‌లకు రూ. 10,000, కార్లకు రూ.40,000 కట్టాల్సి ఉంటుంది. అదనం.. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరిగితే రోజుకు రూ. 50 చొప్పున అదనంగా ఫీజు వసూలు చేస్తారు. ఒకవేళ స్మార్ట్ కార్డ్ తరహా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావాలంటే అదనంగా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరిగితే ప్రతి నెలకు రూ. 300 చొప్పున అదనంగా ఫీజు చెల్లించాలి. అదే వాణిజ్య వాహనాలకైతే ఇది రూ. 500. చదవండి: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు! -
ఆర్టీసీ మూసివేత ప్రసక్తే లేదు
సాక్షి, నిజామాబాద్: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) మూసి వేత ప్రసక్తేలేదని, అలాగే ప్రైవేటుపరం కూడా చేసేది లేదని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తేల్చి చెప్పారు. సంస్థకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. దుబారా ఖర్చులు తగ్గించి లాభాల బాట పట్టించేందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు మానుకోవాలని, నష్టాలు తగ్గించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కోవిడ్‌కు ముందు ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ.14 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.3 కోట్లు మాత్రమే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు పెంచడంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని విచారం వ్యక్తం చేశారు. కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో సంస్థ ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ ప్రతినెల జీతాలిచ్చేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్గో సేవలతో లాభాలు పెరుగుతాయని, ఇందుకు మరో వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తామని, ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్సులు నిర్మిస్తామని వెల్లడించారు. -
మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల సంఖ్య పెరగాలి
న్యూఢిల్లీ: దేశంలో వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కనీసం 600 మెడికల్ కాలేజీలు, 50 ‘ఎయిమ్స్’ తరహా సంస్థలు, 200 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావాలని అన్నారు. ప్రతి తాలూకాలో కనీసం ఒక వెటర్నరీ ఆసుపత్రి ఉండాలన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. గడ్కరీ శనివారం మహా రాష్ట్రలో సతారా జిల్లాలోని కరాడ్‌లో కోవిడ్–19 మహమ్మారిపై పోరాడిన యోధులను సన్మానిం చారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను నెలకొల్పేందుకు సహకార రంగం కూడా ముందు రావాలని పిలుపునిచ్చారు. మోదీతో సంభాషణను గడ్కరీ ప్రస్తావించారు. కరోనా తొలినాళ్లలో 13వేల వెంటిలేటర్లుండేవి. దేశంలో వెంటిలేటర్ల కొరత ఉందని తాను చెప్పగా, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని మోదీ ప్రశ్నించారని, ఇప్పుడు భారీగా 2.5 లక్షల వెంటిలేటర్లు ఉండొచ్చని బదులిచ్చానని చెప్పారు. చదవండి: Speaker Om Birla: చట్టసభల గౌరవం పెంచాలి -
ట్రక్ డ్రైవర్లకు డ్రైవింగ్ గంటలు!
సాక్షి, న్యూఢిల్లీ: కమర్షియల్ ట్రక్ డ్రైవర్ల అలసట, నిద్రలేమి కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పైలట్ల మాదిరిగానే ట్రక్ డ్రైవర్లకు సైతం రోజుకి ఎంతసేపు వాహనాన్ని నడపాలన్న విషయంలో డ్రైవింగ్ గంటలను నిర్ణయించాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వాణిజ్య ట్రక్కు డ్రైవర్ల నిద్రలేమి కారణంగా జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున ఈ విషయంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై మంత్రి నితిన్ గడ్కరీ నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ (ఎన్ఆర్ఎస్సి) సమావేశంలో ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ ఏడాది జూలై 28న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. మంగళవారం జరిగిన ఈ సమావేశానికి 13 మంది నాన్–అఫీషియల్ కో–ఆప్టెడ్ వ్యక్తిగత సభ్యులు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె. సింగ్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రోడ్డు భద్రతను మెరుగుపరిచే విషయంలో సభ్యులు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. యూరోపియన్ ప్రమాణాలను అనుసరిస్తూ కమర్షియల్ వాహనాల్లో ఆన్‌బోర్డ్ స్లీప్ డిటెక్షన్ సెన్సార్ల ఏర్పాటుపైనా చర్చించారు. కనీసం రెండు నెలలకోసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షించుకోవాలని కౌన్సిల్‌ని గడ్కరీ ఆదేశించారు. రహదారి భద్రతపై చర్చించేందుకు క్రమం తప్పకుండా రహదారి భద్రత కమిటీల సమావేశాలు జరిగేలా చూడాలని రాష్ట్రాలకు లేఖలు రాయనున్నట్లు గడ్కరీ తెలిపారు. -
వేరే రాష్ట్రాల్లో మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు !
సాక్షి, న్యూఢిల్లీ: తమ కొత్త వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లినపుడు ఆ రాష్ట్రాల్లోనూ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన పనిలేకుండా ‘భారత్ సిరీస్ (బీహెచ్–సిరీస్)’ పేరిట కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త సిరీస్ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి తేనుంది. ఈ వివరాలతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ –సిరీస్) వినియోగించనున్నారు. వాహన యజమాని మరొక రాష్ట్రానికి బదిలీ అయినప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ ముద్ర ఉన్న వాహనాన్ని రీ–రిజిస్ట్రేషన్ చేయించుకోనవసరం ఉండదని రవాణా శాఖ తెలిపింది. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, నాలుగుకంటే ఎక్కువ రాష్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు బదిలీ అయినపుడు ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వాడుకోవచ్చని పేర్కొంది. బీహెచ్–సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాటి వాహనాల పన్ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాలి. మోటారు వాహనం పన్నును రెండేళ్లు, అంత కుపైన విధించనున్నారు. 14 ఏళ్లు పూర్తవగానే ఆ వాహనంపై ఏటా విధించే పన్ను అంతకు ముందు విధించిన మొత్తంలో సగానికి తగ్గించనున్నారు. అదేవిధంగా, కొత్త సిరీస్ ఉన్న నాన్–ట్రాన్స్పోర్ట్ వాహనాల ధర రూ. 10 లక్షల లోపు ఉంటే 8% వాహన పన్ను, రూ. 10–20 లక్షల మధ్య ఉంటే 10% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ముద్ర ఫార్మాట్ YY BH #### XX. ఇందులో వైవై అంటే తొలి రిజిస్ట్రేషన్ సంవత్సరం, బీహెచ్ అంటే భారత్ సిరీస్ కోడ్, #### అంటే 0000 నుంచి 9999 నంబర్లు.. ఎక్స్ఎక్స్ అంటే ఆంగ్ల అక్షర క్రమం. -
బీహెచ్ ట్యాగ్: ఇక కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ అక్కర్లేదు
వ్యక్తిగత వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత్ సిరీస్(బీహెచ్) కొత్త వాహనాలను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లినప్పుడు..రిజిస్ట్రేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంతకు ముందు వాహనాలు తీసుకెళ్లినప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ అవసరం ఉండేది. అయితే బీహెచ్ సిరీస్ ట్యాగ్ ఉన్న వాహనాలకు ఇకపై ఆ అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజా నొటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రక్షణ సిబ్బంది, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలకు (PSU), నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ సెక్టార్ కంపెనీలకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్వచ్చందంగా వర్తించనుంది. ఈ పథకం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యక్తిగత వాహనాల తరలింపునకు బీహెచ్ ట్యాగ్ దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది. పద్నాలుగేళ్ల కాలపరిమితి తర్వాత మాత్రం.. క్రితం కంటే వసూలు చేసిన మోటర్ వెహికిల్ ట్యాక్స్‌లో సగం చొప్పున ప్రతీ ఏడాది వసూలు చేయనున్నట్లు నొటిఫికేషన్‌లో పేర్కొంది. చదవండి : మీరు పాత కారు కొనాలనుకుంటున్నారా ?! -
శంషాబాద్‌లో రవాణాశాఖా తనిఖీలు.. 11 విదేశీ కార్లు సీజ్
హైదరాబాద్: శంషాబాద్ శివారులో రవాణాశాఖ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో, విదేశాలకు చెందిన 15 వాహనాలపై రవాణాశాఖా అధికారులు కేసులను నమోదు చేశారు. కాగా, వీరు తెలంగాణ స్టేట్ రోడ్ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికి 11 కార్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ బడాబాబుల నుంచి రూ. 5 కోట్లను జరిమాన రూపంలో వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆర్టీసీకి దారులు మూస్తున్న ప్రైవేట్ రూట్
సాక్షి, హైదరాబాద్: నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని మరింతగా అగాథంలోకి నెట్టే కొత్త విధానానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. నిబంధనలకు పాతరేసి స్టేజీ క్యారియర్లుగా ప్రయాణికులను తరలిస్తూ ఆర్టీసీ కొంప ముంచుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఇక దర్జాగా తిరగనున్నాయి. ఇంతకాలం టూరిస్ట్ పర్మిట్లకే పరిమితమవుతూ వచ్చిన బస్సులు ఇక సమూహాలతోపాటు వ్యక్తులుగా కూడా ప్రయాణికులను తరలించొచ్చు. దీంతో ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఏంటీ ఈ మార్పు.. కేంద్ర ప్రభుత్వం గతంలో రోడ్డు రవాణా నిబంధనల్లో చేసిన అతి కీలక సవరణ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. గతంలో టూరిస్టు పర్మిట్లతో కేవలం నిర్ధారిత ప్రాంతం నుంచి గమ్యం వరకు సమూహాలను మాత్రమే తరలించే వెసులుబాటు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు బస్సులకు ఉండేది. ఏయే రాష్ట్రాల మీదుగా ఆ బస్సు తిరిగితే, ఆయా రాష్ట్రాలకు పర్మిట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు పర్యాటకాన్ని ప్రోత్సహించే పేరుతో కేంద్రం అఖిల భారత టూరిస్ట్ పర్మిట్ నిబంధనలను సవరించింది. ఇందులో భాగంగా కొత్త పర్మిట్ విధానం, ప్రయాణికుల తరలింపులో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో పెళ్లి బృందాలు, యాత్రలు, ఇతర అవసరాలకు సంబంధించి ఒక ప్రాంతం నుంచి గమ్యం వరకు ఒకే బృందంగా ప్రయాణికులను తరలించేవారు. కానీ, ఇప్పుడు ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా ఎవరికి వారుగా ప్రయాణాలు చేయొచ్చు. అలాంటప్పుడు వారి గమ్యస్థానాలు కూడా వేరుగా ఉంటాయి. అంటే.. స్టేజీ క్యారియర్లుగా అధికారికంగా మారినట్టే. బస్సుకు బోర్డు పెట్టొద్దన్న నిబంధన తప్ప మిగతా అంతా ఆర్టీసీ బస్సు తరహాలోనే మారే అవకాశం కనిపిస్తోంది. పర్మిట్ ఫీజులు ఇలా.. గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పర్మిట్ ఫీజులు వసూలు చేసుకునేవి. ఇప్పుడు దేశం మొత్తం ఒకే పర్మిట్ ఫీజు ఉంటుంది. మొత్తం వసూళ్ల నుంచి దామాషా ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు పంచుతుంది. కొత్త ఫీజులు ఇలా... డ్రైవర్ కాకుండా తొమ్మిది మంది లోపు ప్రయాణికులుండే వాహనాలకు సంబంధించి ఏసీ వాహనాలకు రూ.25 వేలు, నాన్ ఏసీ వాహనాలకు రూ.15 వేలు, పది అంతకంటే ఎక్కువ–23 కంటే తక్కువ మంది ప్రయాణికుల సామర్ధ్యం ఉండే వాహనాలలో ఏసీ అయితే రూ.75 వేలు, నాన్ ఏసీ అయితే రూ.50 వేలు, 23 మంది ప్రయాణికులు అంతకంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న వాహనాలకు ఏసీ అయితే రూ.3 లక్షలు, నాన్ ఏసీ అయితే రూ.2 లక్షలు వార్షిక పర్మిట్ ఫీజు చెల్లించాలి. ఇది మ్యాక్సీ క్యాబ్, టూరిస్టు బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. సొంత వాహనాలకు ఇది వర్తించదు. పెరగనున్న ప్రైవేటు బస్సులు ప్రస్తుతం రాష్ట్రంలో 4,575 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. వీటిల్లో కొన్ని టూరిస్టు బస్సులు పోను, మిగతావన్నీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులే. ఆర్టీసీ తరహాలో ఇవి టికెట్లు బుక్ చేసి ప్రయాణికులను తరలిస్తున్నాయి. వీటి వల్ల సాలీనా ఆర్టీసీ రూ.3 వేల కోట్ల వరకు నష్టపోతోందన్న అంచనా ఉంది. ప్రైవేట్ బస్సులను నియంత్రించే యంత్రాంగంలోని పలువురు సిబ్బంది నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసి వదిలేస్తున్నారు. ఎప్పుడో ఓసారి దాడులు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్టీసీ, రవాణా శాఖలతో కలిపి ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించి, అప్పటి జేటీసీ వెంకటేశ్వర్లుకు బాధ్యత అప్పగించారు. కానీ, ఆ తర్వాత దాని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ అధికారి రిటైరయ్యే వరకు ఎలాంటి కార్యాచరణ లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తవిధానం వచ్చిన నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దూరప్రాంతాలకు అవి స్టేజీ క్యారియర్లుగా తిరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఆర్టీసీకి అశనిపాతమే.. ‘కొత్తగా అమలులోకి వచ్చిన ఈ వెసులుబాటు నిజంగా ఆర్టీసీకి అశనిపాతమే కానుంది. ఊరి పేరుతో బోర్డు లేకుండా ప్రైవేటు బస్సులు స్టేజీ క్యారియర్ల తరహాలోనే తిరుగుతాయి. చర్యలు తీసుకుంటారన్న భయం కూడా ఉండదు. కేంద్రం చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించే వెసులుబాటు ఇందులో లేకుండా పోయింది’’ –గాంధీ, రవాణా శాఖ విశ్రాంత అదనపు కమిషనర్ -
ఆర్టీసీలో యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలో టికెటింగ్ విధానంపై వినూత్న ప్రాజెక్టుకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఆర్టీసీ అధికారులు టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. టికెటింగ్, రిజర్వేషన్, ట్రాకింగ్, ఫిర్యాదులు, డేటా అంతా ఒకే యాప్‌లో రూపొందించేలా ‘యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్’ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. దేశంలో ఏ ఆర్టీసీ అమలు చేయని విధంగా ఈ ప్రాజెక్టును ఏపీఎస్ఆర్టీసీ చేపట్టనుంది. ప్రస్తుతం టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే వెబ్‌సైట్‌కు, ట్రాకింగ్, ఫిర్యాదులకు వేర్వేరు వెబ్సైట్లను ఆశ్రయించాలి. ఇకపై ఒకే యాప్‌లో అన్ని సేవలు లభ్యమయ్యేలా యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ విధానాన్ని అమలు చేస్తారు. ఆర్టీసీ పంపిన డ్రాఫ్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్రం ఇప్పుడు ఆమోదముద్ర వేయడంతో ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్లు పిలిచి ఎంపికైన కన్సార్షియంకు ప్రాజెక్టును అప్పగిస్తారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.30 కోట్ల నిధుల్ని అందిస్తోంది. పల్లె వెలుగు నుంచి.. పల్లె వెలుగు బస్సుల నుంచి హై ఎండ్ టెక్నాలజీ బస్సుల వరకు ఈ విధానం అమలవుతుంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్లను కలిపి ఈ ప్రాజెక్టు అమలు చేస్తారు. క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ వినియోగించనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 39 శాతం మాత్రమే ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ శాతం ఇంకా పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ అంటే? ఏటా ఆర్టీసీలో రూ.5 వేల కోట్ల విలువైన టికెట్లు అమ్ముడవుతున్నాయి. రోజుకు 30 లక్షల టికెట్లు అమ్ముడవుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ టికెట్లను జారీ చేయడానికి ఆర్టీసీకి ఏటా రూ.10 కోట్ల వరకు ఖర్చవుతోంది. టిమ్ మిషన్లకు రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు, పేపర్ రోల్స్‌కు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతోంది. యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ ప్రాజెక్టులో ఆర్టీసీకి ఎలాంటి ఖర్చు లేకుండా టికెట్ల జారీ మొత్తం కన్సార్షియంకు టెండర్ విధానం ద్వారా అప్పగిస్తారు. బ్యాంకు, సాఫ్ట్వేర్ కంపెనీ కలిపి కన్సార్షియంగా ఏర్పడి టెండర్లలో పాల్గొనాలి. అన్ని బస్ సర్వీసుల్లో టిమ్ మిషన్లకు బదులు బ్యాంకు అందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ–పోస్ మిషన్లలో టికెట్లను జారీ చేస్తారు. టెండర్లలో పాల్గొనే కన్సార్షియంకు టికెట్‌కు ఎన్ని పైసలు కమీషన్ అందించాలనే అంశంపై ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏ ఆర్టీసీ బస్సులో ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో.. ప్రధాన కార్యాలయం నుంచి ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతమున్న విధానం అయితే డిపోకు టిమ్ మిషన్ తీసుకువచ్చిన తర్వాతే టికెట్ల అమ్మకం వివరాలు తెలుస్తాయి. -
డబుల్ లేన్లుగా సింగిల్ రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న పలు సింగిల్ లేన్ రోడ్లు.. డబుల్ లేన్లుగా మారనున్నాయి. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ఈ రోడ్లను గతంలోనే ఆర్ అండ్ బీ నుంచి నేషనల్ హైవేస్ పరిధికి మార్చారు. ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ వీటికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) రూపొందించింది. వెంటనే ఈ డీపీఆర్‌లను మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆమోదించింది. రూ.2,797 కోట్లతో 440 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్న ఈ రోడ్లకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ రోడ్లను మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ► చెన్నై–బళ్లారిని కలిపే ఎన్‌హెచ్–716లో భాగమైన ఎన్‌హెచ్–67(ముద్దనూరు), ఎన్‌హెచ్–40(కడప)పై ట్రాఫిక్ పెరిగిపోయింది. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు వెళ్లేందుకు ఇది ప్రధాన రహదారి. దీనిపై రోజుకు 9 వేల ప్యాసింజర్ కార్ యూనిట్ (పీసీయూ)ల ట్రాఫిక్ ఉంటోంది. ఈ మార్గంలో 51 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ► ఏజెన్సీ గ్రామాలకు రంపచోడవరం నుంచి కొయ్యూరు (ఎన్‌హెచ్–516 ఈ) రోడ్డు ముఖ్యమైనది. ఈ రహదారిలో ఎక్కువ భాగం ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి 74 కి.మీ. మేర రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ► పోరుమామిళ్ల–సీఎస్ పురం, సీఎస్ పురం–సింగరాయకొండ రోడ్ల అభివృద్ధికి కేంద్రం డీపీఆర్‌లను ఆమోదించింది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే తెలంగాణ–ఏపీని కలిపే జీలుగుమిల్లి– జంగారెడ్డిగూడెం– దేవరపల్లి – రాజమండ్రి రోడ్డుతో పాటు కొవ్వూరు నుంచి అశ్వారావుపేట, ఖమ్మం వరకు రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. -
బీఐఎస్ నాణ్యత హెల్మెట్లు మాత్రమే..
న్యూఢిల్లీ: ద్విచక్రవాహనదారులకు మరింత భద్రత కల్పించేలా బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే దేశంలో లభించేలా నియమాలను రూపొందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రోడ్డు రవాణా, హైవేల శాఖ ముసాయిదా నివేదికను ఇచ్చింది. దేశంలో బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే తయారు చేసేలా, బీఎస్ఐ సర్టిఫికెట్ ఉండేలా నియమాలు తీసుకొని రానుంది. దీనివల్ల ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు మరణాలపాలయ్యే అవకాశాలు తగ్గుతాయని చెప్పింది. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే నెల రోజుల్లోగా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీకి పంపాలని కోరింది. -
ఆర్టీసీకి 698 కొత్త బస్సులు!
సాక్షి, అమరావతి: ప్రయాణికుల ఆదరణను మరింతగా పెంచుకునేందుకు ఆర్టీసీ కొత్త ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెలలోనే 698 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. వీటిలో 18 మల్టీ యాక్సిల్ వోల్వో, 50 ఇంద్ర, 630 నాన్ ఏసీ బస్సులు కొనాలని ప్రతిపాదించారు. మరోవైపు కాలం చెల్లిన బస్సులను దశల వారీగా మార్చడంతో పాటు అధ్వానంగా ఉన్న బస్సులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. అధ్వానంగా ఉన్న బస్‌ల బాడీ యూనిట్లు మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందుకు సంబంధించి డిపోల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. సౌకర్యాలను మరింత మెరుగుపర్చటం ద్వారా ఆక్యుపెన్సీ శాతాన్ని 90కు పైగా పెంచుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. కొత్త బస్సులకు రూ.225 కోట్లు విలీనానికి ముందే ఆర్టీసీకి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. బడెŠజ్‌ట్‌లో రూ.1,572 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత రూ.వెయ్యి కోట్లను గ్యారంటీ రుణం కింద అందించింది. ఈ నిధుల్లో రూ.225 కోట్లను కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ కేటాయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో 27 వెన్నెల స్లీపర్, 68 అమరావతి బస్సులు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. వీటికంటే అధునాతనంగా ఉండే 18 మల్టీ యాక్సిల్ వోల్వో బస్సులను సమకూర్చుకునేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. ఏసీ సర్వీసులైన గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర, అర్బన్‌లో నడిచే బస్సులు మొత్తం కలిపి 230 వరకు ఉన్నాయి. ఏసీ సర్వీసుల్లో ఆక్యుపెన్సీ శాతం 90 వరకు ఉంటోంది. పాఠశాల బస్సుల్ని సిటీ సర్వీసులుగా తిప్పే యోచన ప్రైవేట్‌పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల్ని ప్రధాన నగరాల్లో సిటీ సర్వీసులుగా తిప్పి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. తొలుత విశాఖలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించారు. పాఠశాలలు, కళాశాలలకు చెందిన ప్రైవేటు బస్సులు ఉదయం, సాయంత్రం తప్ప మిగిలిన సమయాల్లో ఖాళీగా ఉంటాయి. ఆ బస్సులకు ఇంధనం సమకూర్చి ఖాళీ సమయాల్లో వాడుకునేందుకు విద్యాసంస్ధల యాజమాన్యాలతో చర్చలు జరపాలని నిర్ణయించారు. -
పెరిగిన బస్సు చార్జీలు రేపటి నుంచే
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) బస్సు చార్జీల పెంపు రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు సవరించిన చార్జీలతో ఏపీఎస్ ఆర్టీసీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. పెంచిన చార్జీలు రేపు ఉదయం నుంచి అమల్లోకి వస్తాయని అందులో పేర్కొంది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతున్నట్టు ప్రకటనలో తెలిపింది. (చదవండి : ఆర్టీసీకి ఆక్సిజన్ అందించేందుకే.. ) వీటితోపాటు ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు చార్జీ పెంపు ఉంటుందని సంస్థ వెల్లడించింది. వెన్నెల స్లీపర్ బస్సుల్లో చార్జీల పెంపు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. అలాగే, సిటీఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు చార్జీల పెంపుదల లేదని ఆర్టీసీ తెలిపింది. పల్లెవెలుగులో మొదటి 2 స్టేజీలు.. అనగా 10 కిలోమీటర్ల వరకు చార్జీల పెంపు లేదని పేర్కొంది. తదుపరి 75 కిలోమీటర్ల వరకు రూ.5 ఛార్జీ పెంపు ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది. (చదవండి : అందుకే ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు: పేర్ని నాని) ఇంధన ధరల పెంపువల్లే.. డీజిల్ ధరలు గత నాలుగేళ్లలో రూ.49 నుంచి రూ.70కి పెరిగాయని ఆర్టీసీ తన ప్రకటనలో వెల్లడించింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల సంస్థపై ఏటా రూ.630 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపింది. విడిభాగాలు, సిబ్బంది జీతభత్యాల వల్ల ఏటా మరో రూ.650 కోట్ల భారం సంస్థపై పడుతోందని పేర్కొంది. నష్టాన్ని భర్తీ చేసేందుకే బస్సు చార్జీలు పెంచామని ఆర్టీసీ తెలిపింది. -
భారీ పెనాల్టీల అమలులో జాప్యం?
సాక్షి, హైదరాబాద్: రోడ్డు రవాణా నిబంధనలు అతిక్రమిస్తే అతి భారీ పెనాల్టీలు విధించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేయడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న పెనాల్టీలను ఏకంగా పది రెట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. సెపె్టంబర్ ఒకటి నుంచి కొత్త పెనాల్టీలు అమలులోకి రావాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పునరాలోచనలో పడింది. ఒకేసారి ఏకంగా పది రెట్లకు పెనాల్టీలు పెంచటం సబబు కాదన్న అభిప్రాయంతో ఉంది. ఆదివారం నుంచే అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ శనివారం రాత్రి వరకు ఉత్తర్వు విడుదల కాలేదు. శనివారం సాయంత్రం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ రవాణా శాఖ అధికారులతో భేటీ అయ్యారు. కొత్త పెనాల్టీల సర్క్యులర్‌ను అధికారులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా అతి భారీ పెనాల్టీల పర్యవసానాలపై వారు చర్చించారు. సమావేశం నుంచే ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణలోని అంశాలకు కొన్ని సవరణలు కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సునీల్‌శర్మ రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. వెరసి ఆదివారం నుంచి ఇవి అమలులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. -
పాత డీజిల్ కార్లను పట్టుకెళ్లిపోతున్నారు!!
న్యూఢిల్లీ : పొద్దున్న ఆరు అయినా కూడా చీకటి మబ్బులు దుప్పటి తెరవని రోజులు రాబోతున్నాయి. దీంతో ఓ వైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం దేశ రాజధానిని పట్టి పీడించబోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఢిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. 15 ఏళ్లకు పైబడిన వాహనాలు రోడ్లపైకి ఎక్కకుండా ఉండేందుకు ఆ వాహనాలను డీరిజిస్ట్రర్ చేయడం, రద్దు చేయడం చేస్తోంది. సీజ్ చేసి పట్టుకెళ్లిన వాహనాలను తిరిగి యజమానులకు ఇవ్వకూడదని కూడా ఢిల్లీ రవాణా శాఖ ఆలోచిస్తోంది. సీజ్ చేసిన, రద్దు చేసిన వాహనాలను ప్రభుత్వ రంగ ఎంఎస్టీసీ లిమిటెడ్‌కు అప్పజెప్పబోతున్నారు. అంతేకాక ఆ వాహనాలు వాడిన యజమానులకు మున్సిపల్ కార్పొరేషన్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లు కలిసి అదనంగా జరిమానాలు కూడా విధించబోతున్నాయి. ‘మరికొన్ని రోజుల్లో శీతాకాలం ప్రారంభం కాబోతుంది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోబోతుంది. దీంతో 15 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలను సీజ్ చేసే డ్రైవ్ ప్రారంభించాం. పబ్లిక్ ప్రాంతాల్లో పార్క్ చేసినా, ఇళ్లలో ఉన్నా వీటిని తీసుకెళ్లిపోతాం. ఇతర వాహనాల విషయంలో పొల్యుషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికేట్లు ఉన్నాయో లేవో తమ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ పరిశీలించనున్నాయి’ అని రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ చెప్పారు. ప్రభుత్వ డేటా ప్రకారం ఢిల్లీలో కోటికి పైగా రిజిస్ట్రర్ వాహనాలు ఉన్నాయి. వాటిలో 15 ఏళ్లకు పైబడినవి 3,70,000. 15 ఏళ్లకు పైబడినవి రోడ్లపై తిరగడానికి వీలులేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆర్డర్‌తో 2016 జనవరి నుంచి ఇప్పటి వరకు 2,23,000 డీజిల్ వాహనాలను డీరిజిస్ట్రర్ చేశారు. ఎన్జీటీ ఆర్డర్ ప్రకారం వాటిని పబ్లిక్ ప్రాంతాల్లో పార్క్ చేయడానికి కూడా వీలు లేదు. ఢిల్లీలో చాలా ఇళ్లలో సొంత పార్కింగ్ స్థలం లేదు. యజమానులు ఈ వాహనాలను ఢిల్లీ వెలుపల అమ్మేయాల్సి ఉంది. అయితే అమ్మేయకుండా అలానే ఉంచుకుని, రోడ్లపైకి తీస్తున్న ఆ వాహనాలను ఢిల్లీ రవాణా శాఖ అధికారులు పట్టుకుపోతున్నారు. రోడ్లపై ఉన్నా.. పబ్లిక్ పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్నా.. ఇళ్లలో ఉన్నా వీటిని రవాణా శాఖ సీజ్ చేస్తోంది. -
విరమణ..పదోన్నతి!
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీలో ఇదో విచిత్రం.. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు, జీతభత్యాలు పెంచటానికి దిక్కు లేదు కానీ.. పదవీ విరమణ పొందిన అధికారులకు మాత్రం వరుసబెట్టి కొత్త పోస్టింగులు ఇస్తున్నారు. నిబంధనలు పక్కనబెట్టి అడ్డదారిలో రూ.లక్షల్లో జీతాలు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. రిటైర్మెంట్కు ఒక్క రోజు ముందు.. పోలీసు శాఖకు చెందిన ఓ ఏఎస్పీ స్థాయి ఉద్యోగికి 2012లో తన పదవీ విరమణకు కేవలం ఒక్క రోజు ముందు ఏపీఎస్ఆర్టీసీలోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో అదనపు డైరెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. విధుల్లో చేరిన మరుసటి రో జే పదవీ విరమణ పొందారు. వాస్తవానికి అదనపు డైరెక్టర్ పోస్టులకు ఎస్పీ స్థాయి కేడర్‌కు పోస్టింగ్ ఇవ్వాలి. కానీ అప్పటి ఆర్టీసీ చైర్మన్ ని బంధనలు పక్కనబెట్టి ఆయనకు పోస్టింగ్ ఇప్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా సర్వీసు పొడిగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయ న వయసు 64 ఏళ్లు. నడవటానికి శరీరం సహకరించటంలేదు. వినికిడి శక్తిని కోల్పోయారు. గతేడాది సుమారు రూ.2 లక్షలు ఆర్టీసీ డబ్బు ఖర్చు చేసి వినికిడి యంత్రాలు తెచ్చుకున్నారు. ఇప్పుడేమో డైరెక్టర్‌గా.. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులు వేతన సవరణ డిమాండ్‌తో సమ్మెకు సిద్ధమయ్యారు. ఉద్యోగులతో చర్చలు పూర్తికాక ముందే కార్మిక సంఘం నాయకులు సమ్మెకు నోటీసులు ఇవ్వటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. వాస్తవానికి విజిలెన్స్ విభాగం ఈ విషయాన్ని ముందే పసిగట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సి ఉందని, కానీ విజిలెన్స్ చీఫ్ సమాచారం సేకరించటంతో విఫలమయ్యారనే ఆరోపణ వచ్చాయి. అదే సమయంలో ఆయన సర్వీస్ పొడిగింపు గడువు కూడా ముగియటంతో రెగ్యులర్ ఉద్యోగిని ఇవ్వాలని కోరుతూ రవాణా శాఖ అధికారులు పోలీసు శాఖకు లేఖ రాశారు. కానీ ఈ లేఖను పక్కన పెట్టి సదరు అధికారికే డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ.. ఇప్పుడున్న జీతభత్యాలకు 30 శాతం అదనంగా పెంచుతూ ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను యథాతథంగా అనుమతిస్తూ ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఫైల్‌ను పంపారు. మరో ఇద్దరికి ‘పునరావాసం’ సాధారణంగా రోడ్డు రవాణా సంస్థలు పొరుగు రాష్ట్రాలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించటం, రాష్ట్రం నుంచి నడిచే బస్సు సర్వీస్‌లకు రూట్లను ఎంపిక చేయటం తదితర పనుల కోసం పక్క రాష్ట్రాల్లో సంస్థ ప్రతినిధులను నియమిస్తుంది. ఈ విధుల నిర్వహణ కోసం సీనియర్ కంట్రోలర్ స్థాయి అధికారి సరిపోతారు. కానీ ఇద్దరు రిటైర్డ్ ఆర్ఎం స్థాయి అధికారులకు మళ్లీ పునరావాసం కల్పించటం కోసం ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు. ఈ ఇద్దరు అధికారులకు స్పెషల్ ఆఫీసర్ హోదా కల్పిస్తూ.. రూ.లక్ష జీతంతో విజయవాడ, విశాఖపట్నంలో పోస్టింగులకు ప్రతిపాదనలు సిద్ధం చేíసి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపారు. ఈ ఫైళ్లను ఆమోదింపజేయటానికి ఆర్టీసీలో అత్యున్నత స్థాయి అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ వ్యక్తి ముఖ్యమంత్రి కార్యాలయంపై ఒత్తిడి చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. -
వాహన యజమానులకు గుడ్‌న్యూస్
గౌహతి : వాహన యజమానులకు రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాయి. వాహన యజమానులు తమ వాహనాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసేముందు ఎలాంటి రోడ్డు పన్ను చెల్లించాల్సినవసరం లేకుండా రాష్ట్రాల రవాణా మంత్రుల బృందం ప్రతిపాదనలను రూపొందించింది. అంతేకాక తేలికగా కొత్త రిజిస్ట్రర్ నెంబర్ పొందేలా కూడా మార్గదర్శకాలను తయారుచేసింది. వీటిని ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తేబోతున్నాయి. ఈ ప్రతిపాదనలు రెండేళ్ల కంటే ఎక్కువ కాలం నాటి వాహనాలకు లేదా రెండు రాష్ట్రాల మధ్య పన్ను రేటు 2 శాతం తక్కువగా ఉంటే అమల్లోకి వస్తుంది. ఈ విషయంపై 12 మంది రవాణా మంత్రుల బృందం గౌహతిలో సమావేశమైంది. ఈ సమావేశంలో వాహనాల బదిలీ, ఆన్లైన్లోనే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డ్రైవింగ్ లైసెన్సును బదిలీ చేయడం వంటి వాటిపై నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో రోడ్డు, రవాణాలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించడమే కాకుండా, ప్రజలకు వేధింపులు తగ్గించవచ్చని మంత్రులు నిర్ణయించారు. రవాణా రంగానికి సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. త్వరలోనే రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అడ్వయిజరీ, రూల్స్‌తో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాబోతోంది. ప్రస్తుతం వాహన రిజిస్ట్రేషన్‌ను, డ్రైవింగ్ లైసెన్స్‌ను బదిలీ చేయడానికి వాహనదారులు ఆర్టీఓ నుంచి ఎన్ఓసీ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొత్త నెంబర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియలేమీ అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఈ ప్రక్రియలన్నీ ముగించేలా మంత్రుల బృందం మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దీనికోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రెండు సెంట్రల్ ఆన్లైన్ డేటా బేస్‌లను రూపొందించింది. దానిలో ఒకటి వాహన్-4 దీనిలో వాహన రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి. రెండు సారథి-4 దీనిలో అంతకముందు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా లైసెన్స్ తొలగించి, కొత్త దాన్ని జారీచేస్తారు. మంత్రుల బృంద ప్రతిపాదనల మేరకు సెంట్రల్ డేటాబేస్‌లో ప్రతి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. -
భారత్‌కు ఇక రోడ్డు రేలర్ రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో సరకు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకరావడంలో భాగంగా దేశంలో తొలిసారిగా రోడ్డు రేలర్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. కేంద్ర రోడ్డు సరకు రవాణా, జాతీయ రహదారులు, రైల్వే శాఖల సమన్వయంతో ఈ పథకం కార్యరూపం దాలుస్తోంది. చట్టంలో సవరణలు తీసుకురావడంతోపాటు అన్ని అనుమతులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో గూడ్సు రైళ్ల ద్వారా సరకు రవాణా ఎక్కువగా జరుగుతోంది. రైళ్లలో తీసుకొచ్చిన సరకును దించి మళ్లీ రోడ్డు మార్గాన నిర్దేశిత ప్రాంతానికి తీసుకెళ్లాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన విషయం. ఈ రోడ్డు రేలర్ రైళ్ల వల్ల రైలు ఇంజన్ల ద్వారా తీసుకొచ్చిన సరకుల బోగిని రోడ్డు మార్గాన ట్రక్కు ఇంజన్‌కు తగిలించి తీసుకెళ్లవచ్చు. అంటే, రైలింజన్‌తో సరకు తీసుకొని వెళ్లే కార్గో బోగీ రోడ్డుపైకి వచ్చేసరికల్లా కార్గో వ్యాగన్ అవుతుంది. అందుకు వీలుగా ఈ రోడ్డు రేలర్కు ఎనిమిది టైర్లు, నాలుగు రైలు చక్రాలు ఉంటాయి. పట్టాలపై వెళుతున్నప్పుడు చక్రాలు, రోడ్డుపై వెళుతున్నప్పుడు టైర్లు పని చేస్తాయి. ఉభయ పద్ధతుల్లో సరకును తరలించవచ్చు కనుక వ్యాపారులు కోరుకునే నిర్దేశిత ప్రాంతానికే కచ్చితంగా తరలించవచ్చని, దీని వల్ల ఎంతో డబ్బు ఆదా అవుతుందని అధికారులు అంటున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, రిటేల్ సరకులు, ఫర్నీచర్, హార్డ్‌వేర్ ఉత్పత్తులను ఈ రోడ్డు రేలర్లలో సులభంగా తరలించవచ్చు. జోలార్‌పేట–అరక్కోణం మధ్య ప్రయోగాత్మకంగా ఈ రైలును విజయవంతంగా నడిపి చూశారు. -
అమలాపాల్ కారు వ్యవహారంలో భిన్నాభిప్రాయం
తమిళసినిమా: నటి అమలాపాల్ కారు వ్యవహారం పుదుచ్చేరి రవాణాశాఖ అధికారి, ఆ రాష్ట్ర గవర్నర్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది చిలికి చిలికి కేంద్రానికి ఫిర్యాదు చేసే స్థాయికి చేరింది. నటి అమలాపాల్ కొత్తగా రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన కారును పుదేచ్చేరిలో రిజిస్టర్ చేయించుకుంది.అక్కడ రోడ్డు రవాణా శాఖ పన్ను తక్కువ ఉండడమే అందుకు కారణం.అయితే పుదుచ్చేరిలో రిజిస్టర్ చేయించుకున్న కారును కేరళా రాష్ట్రంలో నడపడంతో ఆ ప్రభుత్వ రవాణా శాఖ సుమారు రూ.20 లక్షల వరకూ నష్టం కలిగిందట. దీంతో ఆ రాష్ట్ర రవాణాశాఖ విచారణ జరుపుతోంది. పుదుచ్చేరిలో వాహనాలను రిజస్టర్ చేయాలంటే ఆక్కడ నివశిస్తున్న ఆధారాలు అవసరం అవుతాయి. అలాంటిది నటి అమలాపాల్ నకిలీ ఆధారాలు చూపి తన కారును రిజిస్టర్ చేసినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతన్నాయి. పుదుచ్చేరి గవర్నర్ ఆకస్మిక తనిఖీలు నటి అమలాపాల్ కారు వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చడానికి పుదుచ్చేరి గవర్నర్ కరణ్‌బేడీ సిద్ధం అయ్యారు. బుధవారం కిరణ్‌బేడీ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అనంతరం అమలాపాల్ కారు రిజిస్టర్ విషయంలో మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. నటి అమలాపాల్‌కు చెందిన ఎఫ్‌సీ వంటి అధారాలను పరిశీలించకుండానే కారు రిజిస్టేషన్ చేశారని, అయితే ఇది చట్టబద్ధ మోసం అని గవర్నర్ ఆరోపించారు.ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాసినట్లు కిరణ్‌బేడీ తెలిపారు. చట్టబద్ధంగానే జరిగింది–రవాణాశాఖమంత్రి అయితే నటి అమలాపాల్ కారు విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని, అన్నీ చట్టబద్ధంగానే జరిగాయని పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి షార్జహాన్ పేర్కొన్నారు. అమలాపాల్ కర్ణాటకలో బెంజ్‌కారును కొనుగోలు చేసి దానికి చట్టబద్ధంగా తాత్కాలిక నమోదు నంబర్ పొందడానికి పుదుచ్చేరికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనదారుడు ఓటరు కార్డు, ఎల్ఐసీ, పాస్‌పోర్టు, అఫిడివిట్లను దాఖలు చేయాలన్నారు. దాన్ని ఆ శాఖాధికారులు పరిలీరించి కారును రిజిస్టర్ చేస్తారన్నారు. నటి అమాలాపాల్ తన సంతకంతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేశారని, దానితో పాటు ఎల్ఐసీ పాలసీని, తన నివాస చిరునామా వివరాలను అందించారని మంత్రి తెలిపారు. అమలాపాల్ కారు రిజిస్టేషన్‌లో ఎలాంటి మోసం జరగలేదని, చట్టబద్ధంగానే నమోదు చేశామని వివరించారు. గవర్నర్ కిరణ్‌బేడీపై వ్యక్తిగత విభేదాలు లేవని, ఆమె కోరితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలన్ని సమర్పిం,డానికి సిద్ధమేనని పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి షార్జహాన్ పేర్కొన్నారు. -
చైనా 'బస్సు'పై.. మోదీ ఆరా
పెరుగుతున్న జనభాతోపాటూ మన దేశంలో ట్రాఫిక్ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం వల్ల విలువైన శిలాజ ఇంధనం ఖర్చు అవడమేగాకుండా వాయుకాలుష్యానికి దారితీస్తోంది. ఈ సమస్యకు చెక్ చెప్పే విధంగా తాజాగా చైనా ఓ భారీ బస్సుకు రూపకల్పన చేసింది. ఇటీవలే ఈ బస్సును విజయవంతంగా ట్రయల్ రన్‌ను కూడా పూర్తి చేసుకుంది. దీంతో బ్రెజిల్, ఇండోనేసియా, ఫ్రాన్స్ లాంటి దేశాలతో పాటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని కూడా ఈ బస్సు ఆకర్షించింది. ప్రపంచంలోనే తొలిసారి చైనా రూపొందించిన ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. అత్యంత రద్దీగా ఉండే మన దేశంలోని నగరాల రోడ్లకు ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్‌లు అనువుగా ఉంటాయో లేదో విశ్లేషించి నివేదిక అందించాని అధికారులకు సూచించారు. నేషనల్ హైవేకారిడార్లలో ట్రాఫిక్ నియంత్రణ అంశంపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో మోదీ చర్చిస్తున్న సమయంలో ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్‌ల ప్రస్తావన వచ్చింది. ఈ బస్సులో ఎన్నో విశేషాలు.. ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెడుతూ, భవిష్యత్ రవాణా రంగాన్నే మలుపుతిప్పగల కొత్త బస్సును చైనా ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్ (టీఈబీ-1) పిలిచే ఈ భారీ బస్సును ఉత్తర చైనాలోని హ బెయి ప్రావిన్స్‌లోని కిన్‌హువాంగ్‌డావో నగరంలో టెస్ట్ రన్ నిర్వహించారు. 25 అడుగుల వైశాల్యమున్న ఈ బస్సు రోడ్డు నుంచి దాదాపు రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో మిగతా వాహనాలు అవలీలగా ఈ బస్సుకింద నుంచి ప్రయాణం చేయవచ్చు. ఈ బస్సు ఆగేందుకు ప్రత్యేకమైన బస్సుబేలను ఏర్పాటు చేశారు. రోడుకిరువైపులా నిర్మించిన ప్రత్యేక మార్గం ద్వారా ఈ బస్సు ప్రయాణిస్తుంది. ఒకేసారి నాలుగు బస్సు కోచ్‌లను కలపడం ద్వారా దాదాపు 1400 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. బస్సు లోపలి భాగం చాలా విశాలంగా ఉంది. రెండు వైపులా సీట్లు, మధ్యలో రౌండ్ సీట్లతో కంపార్టుమెంట్ చాలా స్టైలిష్ లుక్‌తో ఉంది. ట్రాఫిక్ అవసరాల్ని తీర్చేందుకు నగరాల్లో ఇప్పటికే నెలకొల్పిన మెట్రో రైల్, సబర్బన్ రైళ్లతో పోలిస్తే అత్యంత చౌకగా ఈ బస్సుల్ని తయారు చేయవచ్చు. ఎలా పనిచేస్తుంది.. విద్యుత్తుతో పని చేసే ఈ బస్సును, సాధారణ రోడ్లపై ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్గం ద్వారా నడిపిస్తారు. దాదాపు ఈ బస్సు ఒక సబ్వేలాగా పనిచేస్తుందని ఈ బస్సు ప్రాజెక్టు ఇంజనీర్ బాయి జిమింగ్ పేర్కొన్నారు. అయితే సబ్వే నిర్మాణానికి అవసరమయ్యే నిధుల్లో కేవలం ఐదోవంతుతోనే ఈ బస్సును రూపొందించవచ్చని తెలిపారు. దాదాపు 40 బస్సుల్లో ప్రయాణించేంత మంది ఈ బస్సులో ఒకసారి ప్రయాణించవచ్చు. ఎప్పుడు రూపొందించారు.. ఇలాంటి బస్సుల్ని తయారుచేయాలని చాలా మంది ఔత్సాహికులకు తీవ్రంగా పరిశోధనలు చేశారు. అయితే సంగ్ యిజూ అనే డిజైనర్ ఈబస్సును రూపొందించారు. గత మేలో చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన 19వ హైటెక్ ఎక్సోపోలో తొలిసారిగా ఈమోడల్‌ను తొలిసారిగా ప్రదర్శించారు. ఈ ఆగస్టులో టెస్టురన్ ఉంటుందని అప్పుడే నిర్వాహకలు ప్రకటించారు. బుధవారం దిగ్విజయంగా ఈ బస్సును టెస్టురైడ్ చేశారు. ఇందుకోసం క్విన్హువాంగ్డావో నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గంలో ఈ బస్సును నడిపిచూశారు. గంటకు 60 కిమీ గరిష్ట వేగంతో నడిచే ఈ బస్సు భవిష్యత్ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ టెస్టురన్ను ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా గమనించింది. పలు సామాజిక మాధ్యమాల్లో దీనిపై విశేష చర్చ జరిగింది. టెస్టురన్ విజయవంతం కావడంతో చైనాలోని మరిన్ని ప్రావిన్స్‌ల్లో ఈ బస్సుల్ని ఏర్పాటు చేసేందుకు ప్రయాత్నాలు జరుగుతున్నాయి. -
నష్టాల ఊబిలో..
గ్రేటర్ ఆర్టీసీపై రూ.370 కోట్లకు పైగా భారం ఇంధనం, నిర్వహణ తడిసి మోపెడు జీహెచ్ఎంసీ నుంచి అందిన సాయం అంతంతే.. సీఎం సమీక్ష సమావేశంపై కోటి ఆశలు.. ⇒ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొత్తం నష్టాలు రూ. 701 కోట్లు ⇒అధికారుల లెక్కల ప్రకారం కేవలం గ్రేటర్ ఆర్టీసీ నష్టాలు రూ. 354.75 కోట్లు. ఏ రోజుకు ఆ రోజు వచ్చే నష్టాలు, నిర్వహణ ఖర్చులు, భారీగా పెరిగిన ఇంధన వ్యయం దృష్ట్యా ఈ జూన్ నాటికి రూ. 370 కోట్లకు పైగా ఉన్నట్టు అంచనా. ⇒ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీని గట్టెక్కించేందుకు జీహెచ్ఎంసీ చేస్తానన్న సాయం రూ. 126 కోట్లు. ఇప్పటికి అందినది రూ.60 కోట్లే. సిటీబ్యూరో: పెరుగుతున్న నష్టాలు గ్రేటర్ ఆర్టీసీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సంస్థ మొత్తంగా ఎదుర్కొనే నష్టాల్లో సగానికి పైగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. 28 డిపోలు, 3804 బస్సులతో రోజూ సుమారు 41 వేల ట్రిప్పుల రవాణా సదుపాయాన్ని కల్పిస్తోన్న నగర ఆర్టీసీ రోజుకు కోటి రూపాయల నష్టాల్లో నడుస్తోంది. టిక్కెట్ చార్జీల రూపంలో నిత్యం 32 లక్షల మంది ప్రయాణికుల నుంచి రూ. 3.68 కోట్ల ఆదాయం లభిస్తుండగా, రోజుకు రూ. 4.65 కోట్ల చొప్పున ఖర్చులు నమోదవుతున్నాయి. వీటిలో నష్టాలు రూ.97 లక్షలుగా తేలింది. భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీ.. ఇప్పుడు సీఎం సాయం కోసం చూస్తోంది. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్షా సమావేశం నిర్వహించనున్న దృష్ట్యా గ్రేటర్ ఆర్టీసీ అధికారులు భవిష్యత్తు కార్యాచరణపై సన్నద్ధమయ్యారు. ముఖ్యమంత్రి సమావేశంలో డిపోల వారీగా లాభనష్టాలపై సమగ్ర చర్చ జరుగనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి నివేదికను అందజేసేందుకు సన్నద్ధమవుతున్నారు. నష్టాల నావకు సవాలక్ష కారణాలు అంతర్జాతీయ నగరం స్థాయికి తగ్గట్టుగా ప్రజా రవాణా సదుపాయాలు ఉండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఏసీ బస్సులు తెల్ల ఏనుగులుగా మారాయి. రూపాయి లాభం లేకుండా మొదటి నుంచి నష్టాల్లోనే నడుస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నడిచే పుష్పక్ బస్సులు, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, తదితర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులు వరుస నష్టాలనే ఇస్తున్నాయి. మొత్తం 163 ఏసీ బస్సులు ఉండగా, ఒక్కో బస్సుపై రోజుకు సుమారు రూ.5000 చొప్పున మొత్తం రూ.8.15 లక్షల నష్టాలు వస్తున్నాయి. నెలకు రూ.2.44 కోట్ల చొప్పున గత నాలుగేళ్లలో ఒక్క ఏసీ బస్సులపైనే సిటీ ఆర్టీసీ రూ.117.36 కోట్ల నష్టాలను చూసింది. ఇంధనం భారం.. నగరంలో సిటీ బస్సులు రోజుకు 9.7 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. వాహనాల రద్దీ, ఎక్కువ సేపు బస్సులను ఐడలింగ్‌లో ఉంచడం వంటి కారణాలతో గ్రేటర్ ఆర్టీసీలో డీజిల్ వినియోగం సగటున లీటర్‌కు 4 కిలోమీటర్ల చొప్పున ఉంది. ఏసీ బస్సులు ఒక లీటర్‌కు 2.5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్లు, మెట్రో బస్సులు 4 కిలోమీటర్లు, ఆర్డినరీ బస్సులు 4.5 కిలోమీటర్ల చొప్పున వినియోగిస్తున్నాయి. మొత్తంగా సిటీ బస్సుల కోసం ప్రతి రోజు 2.19 లక్షల డీజిల్ వినియోగిస్తున్నారు. ఇటీవల పెరిగిన డీజిల్ ధరల ప్రభావంతో ఆర్టీసీపై నెలకు రూ.2 కోట్లకు పైగా అదనపు భారం పడింది. పుట్టి ముంచుతున్న అద్దె బస్సులు అద్దె బస్సులపై వచ్చే ఆదాయం కంటే చెల్లించే అద్దే భారంగా మారింది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి గ్రేటర్ ఆర్టీసీ 462 బస్సులను అద్దెకు తీసుకుని నడుపుతోంది. వీటికి ఈ ఏడాది రూ.80 కోట్లు అద్దెగా చెల్లించింది. కానీ ఆ బస్సుల ద్వారా ఆర్టీసీకి లభించిన ఆదాయం కేవలం రూ.58 కోట్లు. అంటే ఒక్క ఏడాదిలో వచ్చిన ఆదాయం కంటే అదనంగా రూ.22 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అదనంగా చెల్లించిన రూ.22 కోట్లతో కనీసం 150 కొత్త బస్సులు సొంతంగా సమకూర్చుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ ఆపరేట్ల లాభం కోసమే ఆర్టీసీ యాజమాన్యం బస్సులను అద్దెకు తీసుకుంటోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ గ్రేటర్ ఆర్టీసీ పరిస్థితి.. మొత్తం డిపోలు : 28 నగరంలో తిరిగే బస్సులు : 3804 ప్రయాణికుల సంఖ్య 33 లక్షలు, ఆక్యుపెన్సీ రేషియో 70 శాతం రోజూ తిరిగే ట్రిప్పులు 41,110 (9 లక్షల కిలోమీటర్లు) రోజువారి ఆదాయం రూ. 3.68 కోట్లు రోజువారీ ఖర్చు: రూ.4.65 కోట్లు రోజువారీ నష్టం రూ.97 లక్షలు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి లభించిన ఆదాయం రూ.1330.47 కోట్లు బస్సుల నిర్వహణ కోసం చేసిన ఖర్చు రూ.1685.15 కోట్లు ఏప్రిల్ నాటికి నమోదైన నష్టాలు రూ.354.75 కోట్లు ఈ జూన్ నెలకు రూ.370 కోట్లకు పైగా నమోదైనట్లు అంచనా -
ఫస్ట్ ఎయిడ్ కిట్.. అడ్రస్ నిల్!
జిల్లాలో అత్యధిక శాతం ఆర్టీసీ బస్సుల్లో ఖాళీగా బాక్సులు కిట్ల జాడే లేదు ప్రయాణికులకు తక్షణ వైద్యం లేనట్టే జిల్లాలో అన్ని డిపోల్లో ఇదే పరిస్థితి కొత్త బస్సులకే కిట్లు పరిమితం ‘సాక్షి’ విజిట్‌లో వాస్తవాలు వెలుగులోకి కోట్లు కుమ్మరించి బ్రాండ్ ఇమేజ్ కోసం కృషి చేస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు సౌకర్యాల కల్పనను మాత్రం విస్మరిస్తోంది. అమరావతి రాజధానికి కొత్త బస్సుల మంజూరు, విజయవాడ బస్‌స్టేషన్‌లో ఆధునిక వసతుల పేరుతో సినిమా థియేటర్ల నిర్మాణం, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, సీటింగ్ సౌకర్యాలు, ఏసీ లాంజ్‌ల నిర్మాణానికి కోట్లు కుమ్మరిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా బస్సుల్లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు మాత్రం పట్టించుకోవటం లేదు. బస్సుల్లో ప్రథమ చికిత్సా కిట్లు భూతద్దం పెట్టి వెతికినా బస్సుల్లో కనిపించని పరిస్థితి నెలకొంది. జిల్లాలో దాదాపు 60 శాతం బస్సుల్లో ఈ పరిస్థితి నెలకొనటం ఆర్టీసీ పనితీరుకు నిదర్శనం. జిల్లాలో శనివారం సాక్షి విజిట్ నిర్వహించగా ఈ విషయం తేటతెల్లమైంది. విజయవాడ : ఆర్టీసీ కృష్ణా రీజియన్ పరిధిలో జిల్లాలో 14 బస్ డిపోలు, 36 బస్టాండ్లు ఉన్నాయి. రోజుకు రూ.5 కోట్లకు పైగా ఆదాయంతో ఆర్టీసీ బస్టాండ్లు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో మొత్తం 1349 బస్సులు ఉన్నాయి. వాటిలో 250 అద్దె ప్రాతిపదికన నడుస్తుండగా.. మిగిలినవి సొంత బస్సులు. వాటిలో 59 ఏసీ సర్వీసులు, 154 సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఇవి కాకుండా నిత్యం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు, రాయలసీమకు, బెంగళూరుకు వెళ్లే బస్సులు అన్ని కలుపుకొని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నిత్యం 3,200 వరకు బస్సులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు ‘తెలుగు వెలుగు’ పాసింజర్ బస్సులు ఉన్నాయి. జిల్లాలో 5 నుంచి 10 శాతం గ్రామాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున 75 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీతో ఇవి నడుస్తున్నాయి. టిక్కెట్లపై సెస్ రూపంలో విజయవాడ రీజియన్‌కు ఏటా కోట్లలో ఆదాయం వస్తుంది. కిట్ల జాడేదీ? జిల్లాలో 60 శాతం బస్సుల్లో కిట్ల జాడే కనిపించటం లేదు. ప్రస్తుతం జిల్లాలో 300 వరకు బస్సుల్లో మాత్రం బాక్సులు ఉన్నాయి. వాటిలోనూ ఈ ఏడాది సుమారు 270 బస్సుల్ని పలు దఫాలుగా కొనుగోలు చేశారు. దీంతో అన్ని ఏసీ బస్సుల్లో మాత్రమే కిట్లు అందుబాటులో ఉన్నాయి. బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో మాత్రమే ఈ విషయం పట్టించుకుంటున్న రవాణా శాఖ ఆ తర్వాత విస్మరిస్తోంది. నిర్వహణ చూడాల్సిన ఆర్టీసీ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో బస్సుల్లో ప్రథమ చికిత్సా కిట్లను ఏర్పాటుచేసే బాక్సులు అలంకారప్రాయంగా మారాయి. కిట్‌లో ఇవి ఉండాలి... రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతి బస్సులో ప్రథమ చికిత్స బాక్సులు ఉండాలి. అందులో ప్రథమ చికిత్సకు అవసరమైన కిట్లు ఏర్పాటుచేయాలి. కిట్‌లో దూది, టించర్, బ్యాండేజీలు, గాయాలైనప్పుడు కట్టే వూండ్ క్లాత్, చిన్నపాటి గాయాలకు సంబంధించిన ఆయింట్మెంట్లు ఉండాలి. అవన్నీ కాలం చెల్లని మందులై ఉండటం తప్పనిసరి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫస్ట్ ఎయిడ్ కిట్‌లోని మందుల్ని మార్చాలి. ఇది రవాణా శాఖ ప్రాథమిక నిబంధన. భద్రత ఏదీ? వేసవి తీవ్రత పెరిగింది. జిల్లాలో సగటున 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతోంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ సమయంలో జిల్లాలోని అన్ని డిపోల్లో కలిపి సుమారు 350 సర్వీసులు నడుస్తున్నాయి. శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బస్సులో ప్రయాణిస్తున్న తిరుపతయ్య అనే వ్యక్తి వడదెబ్బ తగిలి బస్సులోనే మృతి చెందాడు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. మే నెలలో 48 డిగ్రీలకూ చేరవచ్చు. ఇలాంటి తరుణంలో కనీసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం కొద్దిపాటి సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఆవైపు ఆర్టీసీ సంస్థ దృష్టి సారించాలి. -
కష్టాల బస్టాండ్లు
బెజవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ మినహా జిల్లాలోని రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణాలన్నింటినీ ఏదో ఒక సమస్య పట్టిపీడిస్తోంది. నిత్యం వివిధ ప్రదేశాలకు ప్రయాణించే నాలుగు లక్షలమంది ప్రయాణికులకు బస్టాండ్లలో కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగుదొడ్లు కరువవుతున్నాయి. ఇక గట్టిగా వాన పడితే మచిలీపట్నం బస్టాండు పెద్ద చెరువును తలపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం.. వెరసి బస్సు ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని బస్టాండ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 14 డిపోలు, 37 బస్టాండ్లు ఉన్నాయి. రోజుకు 1419 బస్సులు ఉన్నాయి. వీటిలో 240 అద్దె బస్సులు ఉన్నాయి. ప్రతి రోజూ 4 లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటాయి. ఎక్కడైనా బస్టాండ్‌లో బస్సు ఆగితే దాహం తీర్చుకునేందుకు గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి. దూరప్రాంతాలకు వెళ్లే వారు బస్సు ఎక్కేందుకు బస్టాండ్‌కు వస్తే కూర్చునేందుకు బల్లలు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లోని బస్టాండ్ల పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మరుగుదొడ్లు, బాత్రూమ్ల వద్ద పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేయటంతో దుర్గంధం ప్రయాణికులతో సహవాసం చేస్తోంది. జిల్లాలోని వివిధ బస్టాండ్లలో పరిస్థితిపై ‘సాక్షి’ విజిట్ చేయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. -మచిలీపట్నం జగ్గయ్యపేట బస్టాండ్‌లో ఒక లైటు సక్రమంగా వెలగని పరిస్థితి. ఫ్యాన్లు తిరగవు. తాగునీరు అందుబాటులో లేదు. దాతలు ఇచ్చిన కూలర్లు బస్టాండ్ ఆవరణలో ఉన్నా అవి పనిచేయటం లేదు. రాత్రి సమయంలో బస్టాండ్ ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రాత్రి సమయంలో కంట్రోలర్ అందుబాటులో ఉండకపోవటంతో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మందుబాబుల గొడవలు నిత్యకృత్యంగా మారాయి. మైలవరం బస్టాండ్ నుంచి పొందుగల, పోరాటనగర్, పి.గన్నవరం తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు లేవు. ఎన్నాళ్లుగా సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు స్పందించటం లేదు. జి.కొండూరులో బస్టాప్ కూడా లేదు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నారు.తిరువూరు బస్టాండ్‌లో ఆరు సంవత్సరాలుగా క్యాంటీన్ సౌకర్యమే లేదు. వాణిజ్య సముదాయం సగం మాత్రమే నిర్మించి నిలిపివేశారు. మరుగుదొడ్లు మరమ్మతుల నిమిత్తం మూసివేశారు. సెప్టిక్‌ట్యాంక్ మూత పగిలిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. లైట్లు, ఫ్యాన్లు లేనేలేవు. మంచినీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. పామర్రు బస్టాండ్ ఆవరణలో మురుగునీరు నిత్యం నిలిచిపోయి ఉంటుంది. మరుగుదొడ్ల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కూచిపూడి, మొవ్వ బస్టాండ్ ఆవరణ ఆక్రమణకు గురైంది. తాగునీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. పెడన బస్టాండ్ రాళ్లు లేచిపోయాయి. నెల రోజుల క్రితమే మరమ్మతులు చేసినా మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. సెప్టిక్‌ట్యాంకు నిండి వ్యర్థాలు రోడ్డుపైనే ప్రవహిస్తున్నాయి. మరుగుదొడ్డికి సంబంధించిన పైప్‌ను డ్రెయిన్‌లో కలిపివేయటంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఆర్టీసీ బస్సుల కన్నా ఆటోవాలాలే ఈ బస్టాండ్‌ను అధికంగా వినియోగించుకుంటున్నారు. బంటుమిల్లి బస్టాండ్ ట్యాక్సీస్టాండ్గా మారింది. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మోపిదేవిలో బస్టాండ్ ఉన్నా లోపలకు బస్సులు వెళ్లటం లేదు. రెండు సంవత్సరాల క్రితమే మరుగుదొడ్లు పాడైపోయాయి. అక్కడ ఉన్న చేతిపంపు విరిగిపోయింది. నాగాయలంక బస్టాండ్ గోతులమయంగా మారటంతో కొద్దిపాటి వర్షానికే నీరు నిలబడుతోంది. కోడూరు బస్టాండ్ ఊరికి శివారున ఉండటంతో అక్కడకు ఎవరు వెళ్లలేని పరిస్థితి. అవనిగడ్డ బస్టాండ్‌లో డిపో మేనేజరు కార్యాలయంపై తాగునీటి కుండీని ఏర్పాటు చేశారు. పగలు సమయంలో తాగునీరు వేడిగా వస్తోంది. రెండు కుండలు ఏర్పాటు చేసినా కొద్దిసేపటికే ఈ తాగునీరు అయిపోతోంది.బందరు బస్టాండ్ ఆవరణలోకి అడుగు పెట్టగానే దుర్వాసన ఆహ్వానం పలుకుతోంది. సెప్టిక్ ట్యాంకు సిమెంటు బల్లలు పగిలిపోవటంతో రేక్‌లు అడ్డుగా పెట్టారు. లైట్లు సక్రమంగా వెలగవు. తాగునీటి కోసం కూలర్ ఉన్నా సక్రమంగా పనిచేయదు.కలిదిండిలోని బస్టాండ్ 20 సంవత్సరాలుగా మూతపడింది. ఈ ప్రాంగణం ఆక్రమణలకు గురైంది. లోతట్టుగా ఉండటంతో కొద్దిపాటి వర్షానికే నీరు చేరుతోంది. చెత్త వేసేందుకు ఉపయోగిస్తున్నారు. ముదినేపల్లి, కైకలూరు బస్టాండ్లను నెలరోజుల కిందట రూ. 8 లక్షలతో మరమ్మతులు చేయించటంతో ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి. మండవల్లిలో బస్షెల్టరే గతి. గుడివాడ బస్టాండ్ 30 సంవత్సరాలుగా ప్రయాణికులకు సౌకర్యాలు అందించలేకపోతోంది. ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు లేవు. కొద్దిపాటి వర్షానికే మురుగునీరు చేరుతోంది. మహిళల మరుగుదొడ్లు, బాత్రూమ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గన్నవరం బస్టాండ్‌లో ఫ్యాన్లు తిరగవు. మంచినీళ్లు లేవు. వాటర్ కూలర్లు ఉన్నా పక్కనపెట్టేశారు. హనుమాన్‌జంక్షన్ బస్టాండ్‌లో ఆరు నుంచి 11వ ఫ్లాట్‌ఫారం వరకు షెల్టర్ లేకపోవటంతో ప్రయాణికులు ఎండలోనే నిలబడాలి. జాతీయ రహదారికి నాలుగు అడుగులు లోతుగా బస్టాండ్ ఆవరణ ఉండటంతో ఒక మాదిరి వర్షం కురిసినా జలమయంగా మారుతోంది. మరుగుదొడ్లు సక్రమంగా లేవు. ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.నందిగామ బస్టాండ్ ఆవరణ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బస్టాండ్‌లో అసౌకర్యాలు అధికమయ్యాయి. ఫ్యాన్లు తిరగవు, ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు లేవు. రాత్రి పూట కంట్రోలర్ అందుబాటులో లేకపోవటంతో సమాచారం చెప్పేవారే ఉండరు. తాగునీటి కుళాయి ఉన్నా ఆ నీరు తాగేందుకు ప్రయాణికులు సాహసించరు. కూడళ్లు ఏర్పాటు చేసిన అవి పనిచేయటం లేదు.నూజివీడు బస్టాండ్‌లో మంచినీరు లేదు. ఫ్యాన్లు తిరగవు. టీవీలు లేవు. -
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాక గానీ.. తెలిసిరాలేదు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో అది వాహనదారులకు నరకం చూపించే రోడ్డు. ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌లో ఎవ్వరైనా గంటలు, గంటలు మగ్గిపోవాల్సిందే. ఆ నరకం ఏ స్థాయిలో ఉంటుందో తాజాగా సాక్షాత్తు ఓ కేంద్రమంత్రికి రుచి చూపించింది. రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లో మగ్గిపోయిన ఆ కేంద్రమంత్రికి అసలు సమస్య తెలిసిరావడంతో 24 గంటల్లో పరిష్కారం ఏంటో కనుగొనండంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వివరాలివి.. కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాత్రి ఢిల్లీ శివార్లలోని గుర్గావ్-మహిపాల్పూర్ ఫ్లైఓవర్ పై ప్రయాణించారు. విమానాశ్రయానికి వెళ్లాలంటే ఈ ఫ్లైఓవర్ మీదుగానే వెళ్లాలి. కానీ దానిపై వాహనాల రాకపోకలు స్తంభించడంతో ఆయన రెండు గంటలపాటు మగ్గిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో కంగుతిన్న గడ్కరీ జాతీయ హైవే అథారిటీ అధికారులకు ఫోన్ చేసి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందే. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా 24 గంటల్లో తన ముందు ప్రతిపాదనలు పెట్టాలని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. మొత్తానికి గడ్కరీ ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. 'ఢిల్లీ ట్రాఫిక్ గురించి మేం అధ్యయనం చేస్తున్నాం. దీనిపై 15 రోజుల్లో నివేదిక రానుంది. ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోయే ప్రదేశాలను మేం గుర్తించనున్నాం. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి కూడా తెలియజేసి.. దాదాపు ఆరు నెలలు, ఏడాదికాలంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మేం సంయుక్తం చర్యలు తీసుకుంటాం' అని గడ్కరీ విలేకరులకు చెప్పారు. -
ఆర్‌అండ్‌బీకి పంచాయతీరాజ్ రోడ్లు
- అప్పగించేందుకు ప్రభుత్వ అంగీకారం - తొలుత 33 రోడ్ల అప్పగింత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన రహదారుల పనులు చేపట్టిన రోడ్లు భవనాల శాఖ తాజాగా పంచాయతీరాజ్ రోడ్లపై కన్నేసింది. హైవేలతో సరైన అనుసంధానం లేని మండల కేంద్రాలకు సంబంధించిన రోడ్లను అభివృద్ధి చేసే బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖ అధీనంలో ఉన్న ఇలాంటి రోడ్ల ను ఇకనుంచి తానే నిర్వహిస్తానని ముందుకొచ్చింది. అందుకు ప్రభుత్వమూ అంగీకరించింది. ఈ క్రమంలో తొలుత 33 రోడ్లను ఆ శాఖకు అప్పగించనుంది. సోమవారం జరిగే ఓ సమావేశంలో దీనికి సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న మండల కేంద్రాలను సమీపంలోని హైవేలకు రెండు వరసల రోడ్లతో అనుసంధానించనుంది. ఈ తరహా రోడ్ల నిర్మాణానికి నిధుల అవసరం ఎక్కువగా ఉండటం, ప్రత్యేక నిర్మాణ పద్ధతులను అవలంభించాల్సి ఉన్నందున అది పంచాయతీరాజ్ శాఖకు కష్టంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అలాంటి అన్ని రోడ్లను దశలవారీగా రోడ్లు భవనాల శాఖకు అప్పగించబోతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధాని నగరానికి రెండు వరసలతో అనుసంధాన రోడ్ల నిర్మాణంతోపాటు దాదాపు 370 వంతెనల నిర్మాణ పనులతో బిజీగా ఉన్న రోడ్లు భవనాల శాఖ ఈ కొత్త రోడ్ల బాధ్యత ఎలా నిర్వహిస్తుందన్నది సందేహంగా మారింది. గతంలో పంచాయతీరాజ్ రోడ్లను తీసుకుని వాటి పనులను పూర్తి చేసేందుకు సంవత్సరాల కొద్ది సమయం తీసుకుంది. తమ పరిధిలో ఉండిఉంటే వాటిని ఓ స్థాయికి తెచ్చేవారమని, ఆర్అండ్బీ తీసుకున్నతర్వాత మామూలు నిర్వహణను కూడా చేయలేదని అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇప్పుడు కొత్తగా తీసుకోబోయే రోడ్ల విషయంలో ఆర్అండ్బీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలని పరిశీలకులు అంటున్నారు. -
గతేడాది 75 వేల మంది మృతి
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లోయువత బతుకు ఛిద్రమవుతోంది. రహదారులపై జరుగుతున్న దుర్ఘటనల్లో యువతీ యువకులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుండడం తీవ్రాందోళన కలిగిస్తోంది. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 75 వేల మంది మృతి చెందారు. వీరంతా 15 నుంచి 34 ఏళ్ల వయసు కలిగిన వారని ఉపరితల రవాణా, జాతీయ రహదారుల కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. రోడ్డు మృతుల్లో 82 శాతం మంది పురుషులు. 2014 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 4.89 లక్షల మంది మృతి చెందగా, అందులో 53.8 శాతం యువత. 35 నుంచి 64 ఏళ్ల వయసున్న వారు 35.7 శాతం మంది ఉన్నారు. అతివేగం, ఓవర్ లోడింగ్, మద్యంమత్తు, హిట్ అండ్ రన్ కారణంగా రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. -
రవాణా కార్మికులకు రూ.5 లక్షల బీమా
హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల ఉప కార్మిక కమిషనర్లు సాక్షి, హైదరాబాద్: రవాణా రంగ కార్మికులు, డ్రైవర్లు తమ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి 12 రూపాయలు చెల్లిస్తే ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల కార్మికశాఖ ఉప కమిషనర్లు పి.శ్రీనివాస్, ఇ.హనుమంతరావు, ఎస్.నరేశ్ కుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని టి.అంజయ్య కార్మిక సంక్షేమ భవన్లో విలేకరులతో వారు మాట్లాడారు. ఈ మేడే రోజు నుంచి ఈ బీమా పథకం అమల్లోకి వచ్చిందన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే ఐదు లక్షల రూపాయలు వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. దీనికి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు గల ట్రాన్స్‌పోర్టు కార్మికులు, డ్రైవర్లు అర్హులని అన్నారు. ఈ పథకంపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16వ తేదీన సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ట్రేడ్ యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు కార్మికులు టోల్‌ఫ్రీ నంబర్ 180030708787కు ఫోన్ చేయవచ్చని సూచించారు. -
30న బంద్
రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశం బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న రోడ్డు రవాణా సురక్షతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ రవాణా కార్మికులు ఈనెల 30న బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోరిక్షా కార్మికులతో పాటు కెఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోషియేషన్, ట్యాక్సీ డ్రైవర్ల సంఘం, మరికొన్ని సంఘాలు మద్దతునిచ్చిన నేపథ్యంలో ఈనెల 30న రాష్ట్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈనెల 30న రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆటో రిక్షాలతో పా టు ట్యాక్సీలు సైతం స్టాండ్లకే పరిమితం కానున్నాయి. ఇక కేఎస్ఆర్టీసీలో ని నాలుగు విభాగాలకు చెందిన మొత్తం 1.2 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ బంద్‌లో పాల్గొననున్నారు. దీంతో ఈ నెల 30న ప్రజా రవాణాకు సైతం తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఈ బంద్‌కు ప్రైవేటు బస్‌ల యజమానులు మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో ప్రైవేటు బస్‌ల సంచారం మాత్రం యధావిధిగా సాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బంద్ కు మద్దతునివ్వాల్సిందిగా ప్రైవేటు బస్‌ల యజమానులను సైతం కోరినట్లు ఆటో డ్రైవర్ల ఏకతా పోరాట సమితి ప్రధాన కార్యదర్శి రుద్రమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న రోడ్డు రవాణా సురక్షతా చట్టం ఆటోరిక్షాలకు మరణశాసనంగా మారుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. -
ఆర్టీసీ ఖజానాకు అద్దె బస్సుల కన్నం
ఐదేళ్లు దాటిన బస్సులకు అద్దె తగ్గించి చెల్లించే నిబంధనకు నీళ్లు అక్రమంగా అదనపు చెల్లింపులు వరంగల్ జిల్లాలో ఒకే డిపోలో రూ.10 లక్షలకు పైగా స్వాహ.. ప్రధాన కార్యాలయం టెస్‌ఆడిట్‌లో వెలుగులోకి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఖజానాకు చేరాల్సిన డబ్బులను అద్దె బస్సులు మింగేస్తున్నాయి. ఆ బస్సులకు అందాల్సిన అసలు అద్దె అందినా, అక్రమంగా మరింత మొత్తాన్ని పొందుతున్నాయి. నయా పైసా కూడా స్వాహా కాకుండా ఆర్టీసీలో అంచెలవారీ నిఘా వ్యవస్థ ఉన్నా పైసలకు కాళ్లొస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ ఉదంతం చూసి ఆర్టీసీ ఉన్నతాధికారులే షాక్‌కు గురయ్యాయి. వెంటనే అప్రమత్తమై అలాంటి ఘటనలు ఇంకెక్కడైనా జరిగాయేమో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బస్సుల నిండా జనం ఉన్నా ఆర్టీసీకి నష్టాలు వస్తుండడం సామాన్యులకు అంతుచిక్కడం లేదు. ప్రపంచంలో మరే రవాణా సంస్థకు లేనన్ని బస్సులు నడుపుతున్న ఆర్టీసీ నష్టాలు ఊబిలో నిండా మునగడానికి ఇలాంటి ఉదంతాలు కూడా కారణమవుతున్నాయని స్పష్టమవుతోంది. ఇదీ సంగతి... ఆర్టీసీ తన అవసరాలకు తగ్గట్టుగా బస్సులు కొనే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని తిప్పుతోంది. ప్రస్తుతం 1200కు పైగా బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంది. పక్షం రోజులకోసారి ఈ బస్సులకు బిల్లులు చెల్లిస్తోంది. ప్రతి బస్సు కండిషన్‌గా ఉండడం అత్యంత ముఖ్యం. ఇందుకోసం వరుసగా ఐదేళ్లపాటు తిరిగిన బస్సును ఆ తర్వాత కూడా కొనసాగించాల్సి వస్తే దాన్ని బాడీ సహా పూర్తిస్థాయిలో మార్చాల్సి ఉంటుందని ఆర్టీసీ నిబంధన విధించింది. ఆ బస్సుకు అప్పటివరకు చెల్లిస్తున్న అద్దె కూడా తగ్గిస్తారు. అది తిరిగే దూరాన్ని బట్టే అద్దె నిర్దారిస్తారు. ఐదేళ్ల తర్వాత కొనసాగే బస్సుకు... ఒప్పందంలో పేర్కొన్న మొత్తం కంటే కిలోమీటరుకు 99 పైసలు చొప్పున తగ్గించి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే మతలబు చోటుచేసుకుంటోంది. ఈ నిబంధనను తుంగలో తొక్కి ఐదేళ్లు నడిచిన బస్సుకు కూడా పూర్తి అద్దె చెల్లిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా తొర్రూరు డిపో పరిధిలో ఈ భాగోతం వెలుగు చూసింది. ఐదేళ్ల గడువు తీరిన కొన్ని బస్సులకు మొత్తం అద్దె చెల్లించినట్టు తేలింది. ఇవ్వాల్సిన మొత్తం కంటే దాదాపు రూ.10.86 లక్షల మేర అదనంగా చెల్లించారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో ఉండే ఆర్టీసీ టెస్ట్ ఆడిట్ విభాగం ఈ విషయాన్ని గుర్తించింది. పది బస్సులకు సంబంధించి అదనంగా చెల్లింపులు జరిగినట్టు తేలడంతో గతుక్కుమన్న ఆ డిపో అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆ బస్సు యజమానులను పిలిపించి... అదనంగా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. దీంతో ఇలాంటి వ్యవహారాలు మిగతా జిల్లాల్లో కూడా జరిగి ఉంటాయని అనుమానిస్తున్న ఉన్నతాధికారులు వెంటనే కేంద్ర ఆడిట్ విభాగాన్ని రంగంలోకి దించారు. తొలుత వరంగల్ జిల్లాలోని అన్ని డిపోల్లో సోదాలు చేస్తున్నారు. తీవ్రంగా పరిగణిస్తున్నాం అద్దె బస్సులకు అక్రమంగా బిల్లులు చెల్లించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. వరంగల్ జిల్లా తొర్రూరు డిపో ఉదంతంలో సిబ్బంది తీవ్రమైన నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనిపిస్తోంది. నిఘా వ్యవస్థ ఉండికూడా రూ.లక్షలు దారిమళ్లడం ఆశ్చర్యంగా ఉంది. దీనిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి ఘటనలు ఇంకెక్కడైనా జరిగాయేమో తెలుసుకునేందుకు మా టెస్ ఆడిట్ విభాగం రంగంలోకి దిగింది. రమణరావు, జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్, టీఎస్ఆర్టీసీ -
రూ. 1 తగ్గింది !
సగటున 5 శాతం మాత్రమే తగ్గిన బస్సు ఛార్జీలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలు ఇంతకంటే తగ్గించడం కుదరదన్న మంత్రి బెంగళూరు:రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థలోని నాలుగు విభాగాల బస్ చార్జీలను తగ్గిస్తూ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తగ్గిన బస్సు చార్జీలు అమలు కానున్నాయి. సగటున 5 శాతం కంటే తక్కువగా ఈ తగ్గింపు ఉండడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. ధరలు పెంచే సమయంలో గరిష్టంగా 20 శాతం పెంచే ప్రభుత్వం తగ్గింపులో మాత్రం ఉదారస్వభావాన్ని కనబరచకపోవడాన్ని రవాణాశాఖ అధికారులు తప్పుబడుతున్నారు. ఛార్జీల తగ్గింపు ధరలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి మీడియాకు వివరించారు. బీఎంటీసీ సంస్థలో మొదటి స్టేజ్‌కు రూ.1, అటుపై 9,12,13, 16,17,18, 19,22,23 స్టేజ్‌లకు రూపాయి చొప్పున టికెట్టు ధరలు తగ్గాయి. అంటే రెండు నుంచి ఎనిమిది స్టేజీల మధ్య ఎటువంటి తగ్గింపు లేదు. కేఎస్ఆర్టీసీ, ఎన్‌డబ్యూకేఆర్టీసీ, ఎన్ఈకేఆర్టీసీ విభాగాల్లోని ఆర్డినరీ సర్వీసుల్లో సబ్స్టేజ్ 2 (2ఎస్) రెండు రూపాయల తగ్గింపు. 4,6,7,8,12,13,14,15,16,17 స్టేజీలకు రూ.1 తగ్గించారు. సిటీ/సబ్-అర్బన్ సర్వీసుల్లో 1,2,13 స్టేజీలకు రూపాయి తగ్గించారు. స్టేజీ 3కు రెండు రూపాయలు తగ్గించారు. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కనిష్టంగా రూ.1 గరిష్టంగా రూ.11 తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలవారి, వికలాంగులు, వృద్ధులు తదితర పాసు ధరల్లో మార్పులేదు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ధరలను తగ్గించామని, ఇంతకు మించి ఎక్కువ తగ్గించలేమని మంత్రి స్పష్టం చేశారు. -
ఏడాదంతా సాఫీగా ప్రయాణం
2014లో ఆర్టీసీ మెరుగైన ఫలితాలు ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడి సాక్షి. హైదరాబాద్: గత ఏడాది రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణం సాఫీగా సాగిందని, 2014 సంవత్సరం మొత్తమ్మీద చూసుకుంటే ఆర్టీసీకి మంచికాలంగా చెప్పవచ్చని మేనేజింగ్ డెరైక్టర్ డీజే పూర్ణచందద్రరావు తెలిపారు. నష్టాలను చాలావరకు తగ్గించుకోగలిగామని, బంద్‌లు, సమ్మెల కారణంగా రూ. 1300 కోట్ల నష్టం వచ్చినా గతంలో పోల్చుకుంటే తక్కువేనని అన్నారు. బుదవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీజిల్ ధరలు తగ్గిన కారణంగా సంస్థకు లాభం చేకూరిందని, అయినా ఇప్పటికీ రోజుకు రూ. 3 కోట్ల నష్టంతో సంస్థ నడుస్తోందని చెప్పారు. 2015 సంవత్సరంలో ప్రయాణికులకు మరింత సుఖమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కొత్త పథకాలను అందుబాటులోని తెస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ మీకోసం, తెలంగాణలో ఆర్టీకీ మీకు తోడు అని పేర్లను ఖరారు చేశామన్నారు. ఏపీలో సంక్రాంతి రోజుల్లోనూ బస్సులు నడుస్తాయని, దీనిపై ఆందోళన అవసరం లేదని చెప్పారు. నెలరోజుల్లో ఆర్టీసీ విభజన పూర్తి రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థల విభజన ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని పూర్ణచంద్రరావు తెలిపారు. జనవరి తొలి వారంలో ఈడీల కమిటీ సమావేశం నిర్వహిస్తామని, అనంతరం ఢిల్లీలో షీలా బేడి కమిటీకి నివేదిక అందజేస్తామని చెప్పారు. జనవరి నెలాఖరుకు కేంద్రం నుంచి విభజనకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. -
ఓల్వో బస్సు బోల్తా
డ్రైవర్ మృతి - 16 మందికి గాయాలు ముందు చక్రం పగిలి ప్రమాదం చెన్నేకొత్తపల్లి (అనంతపురం) : స్థానిక 44వ జాతీయ రహదారిపై కర్ణాటక రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఓల్వో బస్సు బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. మరో 16 మంది గాయపడ్డారు. పోలీసుల సమాచారం మేరకు... హైదరబాద్ నుంచి బెంగళూరుకు 20 మంది ప్రయాణికులతో బయలుదేరిన కేఎస్ఆర్టీసీకి చెందిన ఓల్వో బస్సు(కేఏ 01ఎఫ్9164) చెన్నేకొత్తపల్లి వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంది. వై జంక్షన్ వద్దకు చేరుకోగానే బస్సు ముందు కుడివైపున ఉన్న టైర్ బద్ధలైంది. ఘటనతో వాహనం డ్రైవర్ అదుపుతప్పి కుడివైపు నుంచి రోడ్డు మధ్యన డివైడర్‌ను దాటి ఎడమవైపు రోడ్డుపై దూసుకొచ్చి బోల్తాపడింది. ఘటనలో బస్సు నడుపుతున్న డ్రైవర్ సిద్దప్ప(32) అక్కడికక్కడే మరణించాడు. డివైడర్‌ను ఢీకొన్న సమంయలో బస్సు ముందు భాగంలోని అద్దం పగిలి అందులో నుంచి అతను ఎగిరి కిందపడ్డాడు. ప్రయాణికుల్లో 16 మంది గాయపడ్డారు. విషయాన్ని గుర్తించిన సమీపంలోని డాబాలో ఉన్న వారు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ధర్మవరం, అనంతపురం, చెన్నేకొత్తపల్లిలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండవ డ్రైవర్ అనిల్, హైదరాబాద్‌కు చెందిన రామయ్య, లక్ష్మి, ప్రవలిక, లక్ష్మి తల్లి జయమ్మతో పాటు నల్గొండ జిల్లా కేశాపురానికి చెందిన ప్రశాంత్ తదితరులు ఉన్నారు. ఘటనపై ఎస్ఐ రామాంజనేయులు దర్యాప్తు చేపట్టారు. -
అవినీతికి అడ్డా!
* ఆర్టీఏ కార్యాలయంలో యథేచ్ఛగా దందా * వయసు ధ్రువీకరణ పత్రం పేరుతో అడ్డగోలు వసూలు * ఒక్కో పత్రానికి రూ.250 దండుకుంటున్న వైనం అనంతపురం క్రైం : అనంతపురంలోని రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీఏ) ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. వయసు ధ్రువీకరణ పేరుతో దందా సాగుతోంది. ఒక్కో పత్రానికి రూ.250 వసూలు చేస్తున్నారు. రోజుకు రమారమి రూ.8-10 వేలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోంది. ఇటీవల ఉప రవాణా కమిషనరుగా బాధ్యతలు తీసుకున్న సుందర్ వద్ది ప్రారంభంలోనే ఈ విధానానికి చెక్పెట్టినా.. సరికొత్త పంథాలో వసూళ్ల పర్వం సాగిపోతోంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించాలంటే సంబంధిత వ్యక్తి జాతీయతను ధ్రువీకరించే పత్రాలు జమ చేయాలి. అంటే.. జనన ధ్రువీకరణ పత్రం, చదువుకుని ఉంటే టీసీ, ఓటరు ఐడీ కార్డు జత చేస్తే సరిపోతుంది. ఇవేవీ లేకపోతే నోటరీ సర్టిఫికెట్ ఇవ్వాలి. వయసు ధ్రువీకరణ పత్రం జత చేయాలనే నిబంధన లేదు. కానీ అనంతపురం డీటీసీ, తాడిపత్రి ఆర్టీఓ (రోడ్డు రవాణా అధికారి) కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లకు సంబంధించి వయసు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలనే నిబంధన విధించారు. హిందూపురం ఆర్టీఓ కార్యాలయంలో ఈ నిబంధన లేదు. ఒకే జిల్లాలో రెండు విధాలుగా నిబంధన అమలు చేస్తుండడం గమనార్హం. లెసైన్స్ కోసమైతే వయసు ధ్రువీకరణ పత్రం జత చేయాలనే నిబంధన ఉంది. ఒక్కో పత్రానికి రూ. 250.. వయసు ధ్రువీకరణ పత్రానికి రూ. 250 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రభుత్వ ఖజానాలో జమ కావడం లేదు. కొందరు సిబ్బంది జేబుల్లోకి వెళుతోంది. అనంతపురం డీటీసీ కార్యాలయంలో రోజూ సగటున 60-70 వాహనాలు (నాన్ ట్రాన్స్‌పోర్టు) రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వీటిలో సుమారు 40 వాహనాలకు సంబంధించి యజమానుల వయసు ధ్రువీకరణ పత్రాలను అడుగుతున్నారు. ఒక్కో వాహనానికి రూ. 250 చొప్పున మొత్తమ్మీద రోజూ రూ.10 వేలు సిబ్బంది జేబుల్లోకి వెళుతోంది. మరోవైపు రూ.2 వేల దాకా ఏజెంట్లకు చేరుతోంది. ఒక్కో సర్టిఫికెట్‌కు ఏజెంట్లు రూ.50 తీసుకుంటున్నారు. దందా ఇలా... అన్ని సర్టిఫికెట్లు జత చేసి సంబంధిత క్లర్కు వద్దకు వెళ్తే ఫీజు మొత్తం తీసుకుని అన్నింటినీ పరిశీలించి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)కు సిఫారసు చేస్తారు. ఆయన వాహనాన్ని పరిశీలించిన తర్వాత ఏఓకు సిఫారసు చేస్తారు. ఏఓ ఆమోదం లభించగానే వాహనానికి నంబరు కేటాయిస్తారు. అయితే.. క్లర్కు వద్దకు ఫైలు వెళ్లగానే వారు పరిశీలించకుండానే అసిస్టెంటు (ప్రైవేటు వ్యక్తి)కు ఇస్తున్నారు. అసిస్టెంటు సర్టిఫికెట్లను పరిశీలించి ఫైలుపై ఒక గుర్తు పెడతాడు. వయసు ధ్రువీకరణ పత్రం కావాలని సూచిస్తాడు. వాహన యజమాని ఏజెంటును సంప్రదిస్తే రూ. 300 వసూలు చేసి ధ్రువీకరణ పత్రం ఇస్తాడు. ఆ పత్రాన్ని అసిస్టెంటు ఫైలులో జతచేసి.. క్లర్కకు పంపుతాడు. అక్కడి నుంచి ఎంవీఐ.. అటు నుంచి ఏఓకు చేరుతుంది. ప్రైవేటు వ్యక్తి పెట్టిన గుర్తు ఆధారంగా ఏ ఏజెంటు నుంచి ఫైలు వచ్చిందీ తెలుస్తుంది. సాయంత్రం కార్యాలయ పనివేళలు ముగిసిన తర్వాత సదరు ప్రైవేటు వ్యక్తి ఆయా ఏజెంట్ల వద్దకు వెళ్లి ఎన్నెన్ని ఫైళ్లు వచ్చిందీ లెక్కించి.. ఒక్కో ఫైలుకు (వయసు ధ్రువీకరణ పత్రం ఇచ్చినవాటికి) రూ. 250 చొప్పున వసూలు చేస్తాడు. ఆ మొత్తాన్ని సంబంధిత సిబ్బందికి అందజేస్తాడని తెలుస్తోంది. ఒక్క రూపాయి వసూలు చేయకూడదు వయసు ధ్రువీకరణ పత్రాల పేరిట వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఎవరితోనూ ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. వసూలు చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనదారులు నేరుగా వచ్చి నాకు ఫిర్యాదు చేయొచ్చు. - సుందర్ వద్ది, డీటీసీ -
రవాణా శాఖపై ప్రైవేటు
పార్లమెంటులో రోడ్డు రవాణా భద్రత-2014 బిల్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి అడ్డుకునేందుకు ఢిల్లీకి వెళుతున్న రవాణా శాఖ ఉద్యోగులు రేపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా గుడివాడ అర్బన్ : ‘రోడ్డు రవాణ భద్రత-2014’ బిల్లుతోకేంద్ర ప్రభుత్వం రవాణశాఖపై ప్రై‘వేటు’ను వేయనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్న శాఖల్లో నాలుగో స్థానంలో ఉన్న రోడ్డు రవాణాశాఖ నడ్డివిరిచే బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. దీనిపై తీవ్ర ఆందోళన చెందుతున్న రవాణా శాఖ ఉద్యోగులు శనివారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. సోమవారం ఉదయం జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించి... అదే రోజు పార్లమెంట్‌ను ముట్టడించి బిల్లును అడ్డుకుంటామని చెబుతున్నారు. రవాణాశాఖలో ప్రస్తుతం ఉన్న నిబంధనలకు మరింత పదును పెడుతూ కొన్ని కీలక శాఖల్లో సేవలను ప్రైవేటు పరం చేసేలా కేంద్రం ముసాయిదా బిల్లును ఇప్పటికే ప్రకటించింది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ పేరుతో కొద్ది నెలల కిత్రం దీనికి సంబంధించిన 530పేజీల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ‘రోడ్డు రవాణ భద్రత-2014’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేయడంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందా అని రవాణశాఖ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి... కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను మార్చి డ్రైవింగ్ లెసైన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ వంటి కీలక విభాగాలను ప్రైవేటీకరించనున్నారు. మొత్తం రవాణాశాఖ ద్వారా రాష్ర్టంలో ఏటా రూ.2,500కోట్ల ఆదాయం వస్తోంది. ప్రైవేటీకరణ చేస్తే ఆదాయం ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్లి ఆదాయానికి గండి పడే ప్రమాదం ఉంది. బిల్లులో కొన్ని కీలక అంశాలివే... కేంద్రం ప్రతిపాదించే బిల్లు పార్లమెంటులో ఆమోదిస్తే కొన్ని సేవలు ప్రైవేటు పరం కావడంతోపాటు నిబంధనలు కఠినతరమవుతాయి. హెల్మెట్ లేకుండా మోటార్‌సైకిల్‌ను నడిపితే ప్రస్తుతం రూ.500వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. బిల్లు ఆమోదిస్తే హెల్మెట్ లేకుండా వాహ నం నడిపితే రూ.5వేలు అపరాధ రుసుం వసూలు చేస్తారు. -వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే రూ.25వేలు జరిమాన విధిస్తారు. దురదృష్టవశాత్తు ఎవరైనా వాహనం కింద పడి మరణిస్తే దానికి బాధ్యులైన వ్యక్తికి రూ.లక్ష అపరాధ రుసుం, నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. ► ప్రమాదంలో చిన్న పిల్లలు మరణిస్తే బాధ్యులకు రూ.3లక్షలు జరిమానా, 7ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. ► ట్రాఫిక్ సిగ్నిల్ అధిగమిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తారు. ► డ్రైవింగ్ లెసైన్స్‌ను ప్రతి మూడేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించాలి. రెన్యువల్ సమయంలో మెడికల్ ఫిట్నెస్తో పాటుగా మరోమారు వాహనాన్ని ట్రైల్ వేయాల్సి ఉంటుంది. బిల్లును అడ్డుకుంటాం.... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదిస్తే ప్రజలు ప్రభుత్వ సేవలను కోల్పోతారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. రాష్ట్ర కేబినెట్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించి బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ ప్రకటించాలి. బిల్లుకు నిరసనగా సోమవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నా అనంతరం పార్లమెంట్‌కు చేరుకుని బిల్లును అడ్డుకుంటాం. డి.శ్రీనివాస్, ఉద్యోగ సంఘంనేత -
ప్రతిష్టాత్మకంగా ‘ఆసరా’
మంత్రి మహేందర్‌రెడ్డి ఆదిబట్ల : ఆసరా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని , అర్హులందరకీ పింఛన్లు అందించటంమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోందని రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎంపీ పటేల్‌గూడలో జిల్లా సంయుక్త పాలనాధికారి చంపాలాల్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ జిల్లాలో గతంలో రూ.7 కోట్ల రూపాయలు మేరకు పింఛన్లు అందించేవారని, ఇప్పుడు ఆసరా పథకంలో భాగంగా రూ.27 కోట్ల పింఛన్లు ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం రైతుల రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా ఐదు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. బడ్జెట్లో ఆర్‌అండ్‌బీకి రూ.10 వేల కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్లకు రూ. 5 వేల కోట్లను కేటాయించామని తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణకు బడ్జెట్‌ను కేటాయించటం జరిగిందన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు మూడు ల క్షల మూపై వేల రూపాయలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని, దళిత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అమ్మాయిలకు 51 వేల రూపాయలు ఇచ్చి వివాహలు జరిపిస్తామని తెలిపారు. జంట నగరాలలో కోటీ 20 ల క్షల జనాభాకు మంచి నీరుకు 4000 నుంచి 5000 కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నాయన్నారు. మల్కాజ్‌గిరిలో రూ,240 కోట్లతో మంచి నీటి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రూ.150 కోట్లతో 540 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే నిరుద్యోగ సమస్యపై మాట్లాడుతూ.. జిల్లాపై అత్యధిక కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. వాటితో చర్చలు జరిపి నిరుద్యోగులకు ఉపాధిని చూపిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఐలయ్య, ఎంపీపీ, వైస్ ఎంపీపీ వెంకట్రారాంరెడ్డి, కొత్త అశోక్‌గౌడ్, సర్పంచ్ పొట్టి రాములు, ఎంపీటీ సీ సభ్యులు గౌని అండాలు బాలరాజ్గౌ డ్, ఆర్డీవో యాదగిరి రెడ్డి, తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీవో అనిల్‌కుమార్, నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, లచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీని త్వరగా విభజించండి: మహేందర్‌రెడ్డ్డి
కేంద్రానికి మంత్రి మహేందర్‌రెడ్డ్డి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు రవాణా సంస్థను వీలైనంత త్వరగా విభజించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్టు తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందిం చారని పేర్కొన్నారు. కేంద్ర ఉపరిత రవాణాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో అన్ని రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత సదస్సులో మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 1998 మోటార్ వాహనాల చట్టం రద్దు చేస్తూ 2014 చట్టాన్ని తీసుకురావడంపై అన్ని రాష్ట్రాల రవాణాశాఖ మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపారు. కొత్త చట్టం ప్రకారం ఆర్టీసీ, రవాణా సంస్థ బస్సులు, ట్యాక్స్‌లు, లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ వంటివన్నీ కేంద్రం ఆధీనంలోకి వెళితే రాష్ట్రాల ఉనికి కోల్పో తాయని, ఈ చట్టానికి టీ సర్కార్ వ్యతిరేకమని చెప్పినట్లు పేర్కొన్నారు. -
ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమిద్దాం
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణ సంస్థను పరిరక్షణకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కొత్త బస్టాండ్‌లో ఆ సంఘం రీజినల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రస్తుతం కిష్ట పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. 1.25 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులకు జీవనోపాధి కల్పించిన సంస్థ ప్రస్తుతం రూ.3 వేల కోట్లు అప్పుల్లో ఉందని, ఈ సంస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. అయితే ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి గుర్తింపు సాధించిన ఎంప్లాయీస్ యూనియన్, రీజియన్ స్థాయి గుర్తింపు పొందిన నేషనల్ మజ్దూర్ యూనియన్లు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. హడావిడిగా సమ్మెకు నోటీసులివ్వడం, ఎలాంటి హామీలు పరిష్కారం కాకుండానే ఆందోళన విరమించుకోవడం కార్మికుల పట్ల ఆ సంఘాలకు ఉన్న చిత్తుశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. కొందరు డిపో మేనేజర్లు, ఇతర అధికారులు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, ఈ వైఖరిని మానుకోవాని కోరారు. సమస్యలను పరిష్కరించి సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఎస్.ఎస్. ప్రసాద్, కార్యదర్శులు శంకర్‌రెడ్డి, కె.ఎ.ఖాన్, ప్రచార కార్యదర్శి ఎం.వి. కుమార్ పాల్గొన్నారు. -
‘బల్క్’ వైపు ఆర్టీసీ అడుగు
కర్నూలు(రాజ్‌విహార్): ‘బల్క్ బయ్యర్’ పేరుతో ఇకపై డీజిల్ కొనుగోలు చేసేందుకు రోడ్డు రవాణ సంస్థ కసరత్తు చేస్తోంది. ఎక్కువ మొత్తంలో డీజిల్‌ను కొనుగోలు చేస్తే తక్కువ ధరకే లభిస్తుందని భావించిన అధికారులు అందుకు కార్యచరణ మొదలుపెట్టారు. లీటరుపై సాధారణ ధర కంటే 50 పైసలు మిగులుతుందని, దీంతో ఏటా రూ.1.63 కోట్లకుపైగా ఇంధన ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకోవచ్చని నివేదికలు సిద్ధం చేశారు. ఈనివేదికలను సోమవారం రీజినల్ మేనేజరు కృష్ణమోహన్ ఉన్నతాధికారులకు పంపించారు. 2013 జనవరి వరకు బల్క్ బయ్యర్ పేరుతో ఎక్కువ మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసే సంస్థగా ఆర్టీసీ ఉండేది. కానీ అదే ఏడాది జనవరి 30న బల్క్ బయ్యర్ కొనుగోలుదారులపై లీటరుకు రూ.11.40ల చొప్పున పెంచింది. దీనికి తోడు మరో 40పైసల పన్ను అదనంగా చెల్లించాల్సి వస్తుంది. డీజిల్ బంకుల్లో చిల్లరగా కొనుగోలు చేసే వాటి ధర పెంచకుండా అధిక మొత్తంలో కొనుగోల చేసే సంస్థల (బల్క్ బయ్యర్)పైన మాత్రమే ఈ పెంచిన భారాన్ని అప్పట్లో వేశారు. దీంతో ఆర్టీసీ ఈ సమస్యలను అధిగమించేందుకు బల్క్ బయ్యర్‌కు బదులు చిల్లర కొనుగోలు సంస్థగా మారింది. అప్పటి నుంచి డీజిల్‌ను ఆయా డిపోలకు సమీపంలోని డీజిల్ బంకుల వద్ద నుంచే కొనుగోలు చేసుకోవాల్సిందిగా అప్పటి వైస్‌చైర్మన్, మేనేజింగ్ డెరైక్టరు ఏకే ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో స్థానిక డిపో మేనేజర్లు ఆచరణలో పెట్టారు. అప్పట్లో చిల్లరగా కొనుగోలు చేస్తే లీటరు డీజిల్ రూ.51.14లకే లభిస్తుండగా బల్క్ బయ్యర్ భారం రూ.11.40తో కలిపి లీటరు రూ.62.54 చొప్పున చెల్లించాల్సి వచ్చేది. దీంతో చిల్లర వ్యాపారిగా మారింది. గత యూపీఏ ప్రభుత్వం డీజిల్ ధరల పెరుగుదలపై నియంత్రణ ఎత్తివేయడంతో ప్రతి నెల 1న 50 పైసల చొప్పున పెంచుతూ పోవడంతో గతంలో పెంచిన బల్క్ బయ్యర్ ధరను మించిపోయింది. ప్రస్తుతం చిల్లర కోనుగోలుపై లీటరు డీజిల్ రూ.63.70కు లభిస్తుండగా బల్క్ సంస్థలకు రూ.63.20 పడుతోంది. దీంతో ఇప్పుడు తిరిగి చిల్లర కొనుగోలుదారు నుంచి బల్క్ సంస్థగా మారేందుకు సిద్ధం అవుతోంది. ఇలా చేయడంతో ఏడాదికి రూ.1.37కోట్లు ఇందన ఖర్చులు పొదుపు అవుతాయి. నివేదికలు పంపించాం: కృష్ణమోహన్, ఆర్ఎం, కర్నూలు ప్రస్తుతం చిల్లరగా కొనుగోలు చేస్తుండటంతో లీటరు డీజిల్ రూ.63.70కి లభిస్తోంది. బల్క్ బయ్యర్‌గా ఎక్కువ మొత్తంలో కొంటే లీటర్ రూ.63.20కే వస్తుంది. దీంతో లీటరుపై 50పైసలు మిగులుతుంది. ఇదే విషయాన్ని నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు పంపించాం. అనుమతులు వస్తే ఆచరణలో పెడతాం. -
అసెంబ్లీలో ఎలుగెత్తిన ప్రజాగళం
సాక్షి , ఒంగోలు : ‘అధ్యక్షా.. జాతీయ రహదారులపై కనీసం 100 కిలోమీటర్లకైనా విశ్రాంతి ప్లాట్‌ఫాంలు లేవండీ.. కానీ, ప్రతీ కిలోమీటరుకు మద్యం దుకాణాలు (వైన్స్, బార్అండ్ రెస్టారెంట్) ఉండటం సిగ్గుచేటుగా భావించాలి అధ్యక్షా.. గుంటూరు, ప్రకాశం జిల్లాలను కలుపుతోన్న ఐదోనంబర్ జాతీయ రహదారి, అటు అద్దంకి - నార్కెట్‌పల్లి హైవేల పరిస్థితి చూస్తే...రక్తంతో తడవని రోజంటూ ఉండదు.’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ శాసనసభలో గళం విప్పారు. అసెంబ్లీలో సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ రహదారుల్లో సగటున రోజుకు 41 మంది ప్రమాదాలబారినపడి చనిపోతున్నారని చెప్పారు. తుపాను విపత్తుల నేపథ్యంలో వాటిల్లే ప్రాణనష్టం కన్నా రోడ్డు ప్రమాదాల్లో గాల్లో కలుస్తోన్న ప్రాణాలే అధికమంటూ వివరించారు. దేశవ్యాప్తంగా రోడ్డుప్రమాదాల గణాంకాల్ని తీసుకుంటే మనరాష్ట్రంలో 8.9 శాతం ప్రాణనష్టం జరుగుతుందన్నారు. ఏటా రోడ్డుభద్రతా వారోత్సవాలు జరుపుతున్నా.. ప్రమాదాల నివారణలో ప్రభుత్వం వెనుకంజలో ఉండటానికి గల కారణాలపై సంబంధిత మంత్రి దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు. వాహనాల డ్రైవర్ల లెసైన్స్‌ల జారీ ప్రక్రియను ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. ఏజెంట్ల వ్యవస్థకు మంగ ళం పాడి.. రోడ్‌ట్రాన్స్‌పోర్టు అధికారులు క్షేత్రస్థాయిలోకెళ్లి విధులు నిర్వర్తిస్తే మంచి ఫలితాలుంటాయని చెప్పారు. రోడ్‌ట్యాక్స్‌ను రోడ్ల మరమ్మతులు, రక్షణ ఏర్పాట్లకే వెచ్చించాలని సూచించారు. ‘హైవే’ పక్కనుండే గ్రామాలకు బ్రిడ్జి సౌకర్యమేదీ..? ‘ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని దొడ్డవరప్పాడు గ్రామం ప్రజలు ఐదో నంబర్ జాతీయరహదారిని దాటాలంటే నానా ప్రయాసలు పడుతున్నారు. రోడ్డుకు తూర్పు వైపు నుంచి పడమరకు మహిళలు, చిన్నారులు వెళ్లాలంటే అతివేగంతో వచ్చే వాహనాలతో ప్రమాదాలు జరుగుతాయని భయపడుతున్నారంటూ’ సంతనూతలపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తెచ్చారు. దొడ్డవరప్పాడు వద్ద హైలెవల్ బ్రిడ్జి కానీ అండర్బ్రిడ్జినైనా నిర్మించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాదాల్లో ఆంధ్రరాష్ట్రం ఐదోస్థానంలో ఉండగా, మరణాలసంఖ్య ప్రతేటా పెరుగుతూనే ఉందన్నారు. ప్రతిఏడాది నమోదవుతోన్న రోడ్డుప్రమాదాల్లో 29 నుంచి 30 శాతం ఆటోరిక్షా ప్రమాదాలే చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 5,790 గ్రామాల(30శాతం)కు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం విచారకరమన్నారు. ప్రధానంగా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అంశాల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండిషన్, రోడ్డు పరిస్థితులతో పాటు ట్రాఫిక్‌పై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు అధిక జరిమానాతో పాటు కఠినచర్యలు చేపట్టడం, ఫాస్ట్‌ట్రాక్, మొబైల్కోర్టులు ఏర్పాటుచేయడం, అధునాతన ఫిట్నెస్ టెస్ట్ పరికరాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి విడుదలయ్యే రోడ్‌సేఫ్టీ ఫండ్స్‌ను కూడా సద్వినియోగం చేయాలన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రోడ్డుభద్రత చర్యలకు ఏమేరకు నిధులు కేటాయించారనేది తెలియపరచాలని ఎమ్మెల్యే ప్రశ్నించగా, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ప్రతిపక్ష సభ్యుల వద్ద రోడ్డుప్రమాదాలపై చాలా సమాచారం ఉన్నట్లుందని.. ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలన్నీ నిజమేనని అంగీకరించారు. రోడ్డుప్రమాదాల నియంత్రణపై దృష్టిపెడతామన్నారు. ఓవర్ లోడింగ్ ఆటోలపై చర్యలేవీ...? కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ నిబంధనలప్రకారం హైవేలపై రాకూడని ఆటోరిక్షాలు పాఠశాలల పిల్లల్ని ఎక్కించుకుని యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారు. చిన్నారులు, కూలీలు, కార్మికులతో ఓవర్లోడింగ్ ఆటోలు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. దీనిపై రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు సమాధానమిస్తూ ఆర్టీసీ ప్రాంగణాల వద్ద ప్రమాదాల నియంత్రణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఇద్దరేసి చొప్పున మోటార్ ట్రాన్స్‌పోర్టు ఇన్స్పెక్టర్లను నియమిస్తామన్నారు. హైవే ప్రమాదాల నియంత్రణకు సైతం ట్రాన్స్‌పోర్టు కార్యాలయ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని సమాధానమిచ్చారు. -
అక్కడ చోరీ.. ఇక్కడ విక్రయం
మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో ఖరీదైన కార్ల చోరీ నకిలీ పత్రాలతో నగరంలో విక్రయం అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు రూ.3 కోట్ల విలువైన 15 కార్ల స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: ఇతర రాష్ట్రాలలో ఖరీదైన కార్లు, ఇతర భారీ వాహనాలను చోరీ చేసి.. వాటికి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.3 కోట్ల విలువ చేసే 15 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు సహకరిస్తున్నట్టు తెలియడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వివరాలు... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వాహనాల దొంగపై సీసీఎస్ ఆటో మొబైల్ టీం దృష్టి సారించింది. అతడిని ఆ బృందం అదుపులోకి తీసుకొని విచారించగా దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూశాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలలో ఖరీదైన కార్లను చోరీ చేసి నగరానికి తెస్తున్న ముఠా.. ఆర్టీఏ బ్రోకర్ల సహాయంతో రిజిస్ట్రేషన్ నెంబర్లను మార్చి విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఇలా విక్రయించిన వాహనాలకు నగరంలోని పలు ఫైనాన్స్ కంపెనీలు ఫైనాన్స్ కూడా చేశాయి. మహబూబ్‌నగర్‌లో పట్టుబడిన నిందితుడు మరో ఇద్దరు నిందితుల పేర్లు వెల్లడించడంతో వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఈ ముఠా ఏడాది కాలంలో 15 కార్లను విక్రయించినట్లు తేలడంతో వీటిని ఖరీదు చేసిన వారి నుంచి వాహనాలను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పోలీసులు ఈ ముఠా అరెస్టును చూపించే అవకాశాలున్నాయి. -
‘ఈ’ బస్సు చాలా స్పెషల్ !
అధునాతనం: మనదేశంలో ఏదైనా కొత్తగా వస్తే అది ప్రపంచంలో బాగా పాపులర్ అనుకుంటాం. నిజానికి చాలా పెద్ద దేశాల్లోనూ ఈ-బస్సు లాంటివి ఇంకా ఇపుడిపుడే మొదలువుతున్నాయి! బైకు మీద రయ్యిన దూసుకెళ్తుంటాం. కాస్త స్లో చెయ్యగానే పక్క నుంచి సిటీ బస్సు ఓవర్టేక్ చేస్తుంది. సరిగ్గా మనం బస్సు వెనుకభాగంలో ఉంటాం. డ్రైవర్ మరింత వేగం పెంచుతాడు. అప్పుడు ఆ బస్సు గుప్పుమంటూ వదిలే పొగ మన ముఖాన్ని మాడ్చేసి, ఒక్క నిమిషం ఊపిరిసలపకుండా చేస్తుంది... ఇలాంటి బస్సులు ఒకటా రెండా? వేలల్లో ఉంటాయి. అవన్నీ వదిలే పొగకు నగరం ఏమవ్వాలి? వాతావరణం ఎంతగా కాలుష్యం కావాలి? ఇలాగే ఆందోళన చెందిన బెంగళూరు నగర రోడ్డు రవాణా సంస్థ.. ఎలక్ట్రానిక్ బస్సును రోడ్డుపైకి తెచ్చింది. పొగ లేదు.. శబ్దం లేదు.. కుదుపుల్లేవు.. సుఖవంతమైన ప్రయాణం. డీజిల్ పోయక్కర్లేదు. నిర్వహణ ఖర్చు తక్కువ. ఇలా ఎన్నో ప్రత్యేకతలు. రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అందిపుచ్చుకోవడంలో కర్ణాటక ముందుంటుందన్నది తెలిసి విషయమే. దేశంలో ముందుగా వోల్వో బస్సులను ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో అది ఒకటి. సిటీలో ఏసీ బస్సుల్ని నడపడం కూడా కర్ణాటక ముందుగా చేసి చూపించింది. ఇపుడు దేశంలోనే తొలి ఎలక్ట్రానిక్ బస్సును ప్రవేశపెట్టింది. నగరంలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో బీఎంటీసీ చేసిన కొత్త ఆలోచన ఇది. చైనాకు చెందిన బీవైడీ అనే ఆటోమొబైల్ సంస్థ మూడు నెలల పాటు ట్రయల్ రన్ కోసం ఈ బస్సును ఉచితంగా ఇచ్చింది. అంతేగాక ఓ వ్యక్తిని ఆ బస్సుతో పాటు పరిశీలనకు నియమించింది. బస్సును మెజెస్టిక్-కడుగొడి మధ్య రోజూ ఆరు ట్రిప్పులు నడుపుతున్నారు. పొగ లేని ఈ బస్సులో ప్రయాణించడానికి బెంగళూరు ప్రజలు సరదా పడుతున్నారు. కొందరు అయితే ప్రయాణ అనుభూతి కోసమే బస్సెక్కుతున్నారట. మరి తొలి ఎలక్ట్రిక్ బస్సు కదా. ఇందులో ఛార్జీ కూడా వోల్వో బస్సు ఛార్జీనే. ట్రయల్న్ ్రవిజయవంతం కావడంతో త్వరలో ఇంకొన్ని బస్సుల్ని దిగుమతి చేసుకుని పూర్తి స్థాయిలో నడపాలని.. భవిష్యత్తులో వాటిని పెంచుతూ పోవాలని బీఎంటీసీ నిర్ణయించింది. బస్సు నడిపే వ్యయం తక్కువే కానీ కొనాలంటే బస్సు బాగా ఖరీదు. ఒక్కోటీ 2.7 కోట్ల రూపాయల విలువైన ఈ బస్సులను కొనడానికి ప్రభుత్వ సాయం కోరుతోంది బీఎంటీసీ. ఈ-బస్సు సంగతులు - వోల్వో బస్సు ధర ఇందులో మూడోవంతే. అయితే వోల్వో నిర్వహణ ఖర్చు కి.మీ.కు 16 రూపాయలు. ఎలక్ట్రిక్ బస్సు వ్యయం ఏడురూపాయలే. - కాలుష్యం జీరో. పూర్తి ఎయిర్ కండిషన్డ్. - అన్నీ కుషన్ సీట్లే. సామర్థ్యం 41. బస్సు మొత్తం సీసీ కెమెరాలుంటాయి. స్త్రీలకూ రక్షణ. - అగ్నిప్రమాద నివారణ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఒకవేళ జరిగినా ఆర్పే పరికరాలన్నీ ఇన్‌బిల్ట్. - ఆరు గంటలు ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పొడవు 40 అడుగులు. బరువు 18 టన్నులు. లండన్‌లో మొదలయ్యాయి మనదేశంలో ఏదైనా కొత్తగా వస్తే అది ప్రపంచంలో బాగా పాపులర్ అనుకుంటాం. నిజానికి చాలా పెద్ద దేశాల్లోనూ ఈ-బస్సు లాంటివి ఇంకా ఇపుడిపుడే మొదలువుతున్నాయి! బ్రిటన్‌లోనూ ఇదే ఏడాది ఈ బస్సులు రోడ్డుపైకి వచ్చాయి. లండన్‌లో ఒకేసారి నాలుగు ఈ-బస్సులు ప్రారంభించారు. విశేషం ఏంటంటే అక్కడ ఈ ప్రాజెక్టు చేపట్టింది ఇండియాలో మొదలై ప్రస్తుతం లండన్ హెడ్‌క్వార్టర్‌గా నడుస్తున్న హిందుజా గ్రూప్ ఉప సంస్థ ఆప్టేర్. కాలుష్యం ఎక్కువ కావడం వల్లే లండన్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. మరో రెండేళ్లలో 20 శాతం బస్సులు ఇవే ఉండాలని అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుజరాత్‌కు రాబోతున్నాయి బెంగళూరులో ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందని తెలియగానే ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ర్టం వీటిపై దృష్టిసారించింది. దేశంలో పర్యావరణంపై ఎక్కువగా దృష్టిపెట్టిన రాష్ర్టం గుజరాత్. అందుకే ఈ-బస్సులను పైలట్ ప్రాజెక్టుగా గాంధీనగర్-అహ్మదాబాద్‌ల మధ్య ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రచిస్తోంది. గుజరాత్ పవర్ కార్పొరేషన్ ఇందులో ప్రధాన భాగస్వామి. తొలి దశలో 15-20 బస్సులు తేనున్నారు. సోలార్ పవర్ ద్వారా వీటికి ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటుచేస్తారట. ప్రతి 35 కిలోమీటర్లకు ఈ పాయింట్లు ఏర్పాటుచేస్తారు. బ్యాటరీ ఇండికేటర్ సిగ్నల్స్‌ను బట్టి బస్సును మార్గమధ్యలో కూడా ఛార్జి చేసుకోవచ్చు. ఆరు నెలల్లో ఇది అమలు చేస్తారట. మన రాష్ర్టంలో కూడా ముఖ్యంగా నగరాల్లో వీటిని ప్రారంభించి కాస్త కాలుష్యాన్ని తగ్గిస్తే బాగుంటుంది. -
ఆర్టీసీపై ‘తెలంగాణ’ బంద్ ఎఫెక్ట్
కర్నూలు(రాజ్‌విహార్): తెలంగాణ బంద్ రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునివ్వడంతో ఆర్టీసీ అధికారులు తెల్లవారు జామున ఉదయం 5గంటల నుంచే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సెక్టారు వైపు వెళ్లే బస్సులన్నీ నిలిపివేశారు. బెంగళూరు, చిత్తూరు, కడప, తిరుపతి నుంచి వచ్చిన సర్వీసులన్నీ కర్నూలు నుంచే వెనక్కి పంపారు. మధ్యాహ్నం 2గంటల తరువాత క్రమంగా బస్సులు కదిలాయి. దీంతో ఆర్టీసీకి రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజరు టి.వి. రామం పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ డిపోలకు చెందిన బస్సులు కర్నూలు మీదుగా ప్రతి రోజు 180 బస్సులు తెలంగాణ సెక్టారుకు వెళ్లి వస్తుంటాయి. ఇందులో హైదరాబాద్‌కే 115 బస్సులు తిరుగుతున్నాయి. కర్నూలు-1 డిపో చెందిన 10 బస్సులతో పాటు ఎమ్మిగనూరు-8, ఆళ్లగడ్డ-10, కర్నూలు-2 డిపో 14, కోవెలకుంట్ల 6, బనగానపల్లె 9, నంద్యాల 22, డోన్ 12, నందికొట్కూరు 5, ఆదోని 11, ఆత్మకూరు డిపోకు చెందిన 8 బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేగాక గద్వాల, అలంపూర్, మహబూబ్ నగర్, ఐజ, శాంతినగర్, కోరాడ, రాయచూర్, కొల్లాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే కర్నూలు-1, ఆత్మకూరు, కర్నూలు-2 డిపోలకు చెందిన మరో 65 బస్సులు కూడా రద్దయ్యాయి. ఇటు ఇతర జిల్లాల నుంచి వచ్చే మరో 15 బస్సులు కూడా కదల్లేదు. బంద్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
సంక్షోభం అంచున ఎర్రబస్సు!
భారీ నష్టాల మధ్య ఆవిర్భవించనున్న టీఎస్ఆర్టీసీ 2013-14లో రూ. 210 కోట్ల నష్టాలు ప్రభుత్వం ఆదుకోవాలంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతోంది. వరుస నష్టాలతో ఏటేటా మరింతగా కునారిల్లుతోంది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉమ్మడి రవాణా సంస్థగా కొనసాగుతున్న ఏపీఎస్ ఆర్టీసీ మరికొద్ది రోజుల్లో విభజన కానున్న దశలో... రికార్డు స్థాయి నష్టాలను మూటగట్టుకుని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. త 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా వస్తున్న నష్టాలు.. గుదిబండగా మారనున్నాయి. ఇటీవలి మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణకు సంబంధించిరూ. 210 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం తొలి మాసం ఏప్రిల్‌లోనే రూ. 14.5 కోట్ల నష్టాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోకుంటే సంస్థ కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చార్జీలు పెంచకుండానే.. ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవాలంటూ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నష్టాల నుంచి కొంతమేర అయినా కోలుకోవాలంటే టికెట్ చార్జీలను 10శాతం వరకు పెంచేందుకు అనుమతివ్వాలని కోరింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చార్జీలు పెంచేందుకు సుముఖంగా లేరు. ఆర్టీసీని గట్టెక్కించాలంటే టికెట్ చార్జీల పెంపు మాత్రమే పరిష్కారం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంధన వ్యయం, మోటారు వాహనాల పన్ను విషయంలో ప్రభుత్వం ఆదుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. దీంతోపాటు సరైన పర్యవేక్షణ లేకపోవటంతో కొన్నేళ్లుగా ఆర్టీసీలో ఖర్చుల పద్దు గతి తప్పుతోందని, దీనిపై లోతుగా విశ్లేషిస్తే నియంత్రణలోకి వచ్చే అవకాశముందని అంటున్నారు. ‘‘సిబ్బంది జీతభత్యాలతో పాటు డీజిల్ ఖర్చు పెరుగుతోంది. పొదుపు చర్యలు లేకపోవటం, బస్సులు సరైన కండిషన్లో ఉండకపోవటం, డ్రైవర్లకు పునశ్చరణ శిక్షణ లోపించటంతో ఇంధనం వృథా కావడం, కార్యాలయాల నిర్వహణ పేర చూపుతున్న భారీ వ్యయం, తరుగుదల, వడ్డీలు, చిల్లర ఖర్చువంటివి కూడా ఉన్నాయంటున్నారు. * 2013-14 ఆర్థిక సంవత్సరంలో టీఎస్ఆర్టీసీ రూ. 3,742 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇది అంతకుముందు ఏడాది కంటే రూ. 335 కోట్లు మాత్రమే ఎక్కువ. అదే 2013-14 సంవత్సరంలో వ్యయాన్ని రూ. 3,950 కోట్లుగా చూపారు. ఇది ముందటి ఏడాది కంటే రూ. 537 కోట్లు ఎక్కువ. అంటే నష్టం మరింత పెరిగిందన్న మాట. * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల (ఏప్రిల్)లో అంతకు ముందు నెల (మార్చి) కంటే ఆదాయం తగ్గిపోయింది. హైదరాబాద్ జోన్ పరిధిలో మార్చిలో రూ. 97 కోట్ల ఆదాయం వస్తే ఏప్రిల్‌లో అది రూ. 92 కోట్లు మాత్రమే. అదే హైదరాబాద్ సిటీ జోన్ పరిధిలో మార్చిలో రూ. 115 కోట్లు రాగా ఏప్రిల్‌లో రూ. 104 కోట్లే నమోదైంది. కరీంనగర్ జోన్ పరిధిలో మార్చిలో రూ. 136 కోట్ల ఆదాయం వస్తే ఏప్రిల్‌లో రూ. 130 కోట్లకు తగ్గింది. * డీజిల్ రూపంలో మార్చిలో రూ. 80 కోట్లు ఖర్చు చూపగా.. ఏప్రిల్‌కు అది రూ. 102 కోట్లకు పెరిగింది. డీజిల్ ఖర్చు పెరిగినా ఆదాయం తగ్గటం గమనార్హం. * ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే హైదరాబాద్ సిటీ జోన్లో రూ. 7.1 కోట్లు, హైదరాబాద్ జోన్లో రూ. 3.8 కోట్లు, కరీంనగర్ జోన్ రూ. 3.4 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. -
'ఆర్టీసీ విభజన ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తాం'
హైదరాబాద్: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో విభజన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఇప్పటికీ విభజన ప్రక్రియ కొనసాగుతుందున్నారు. శుక్రవారం ఆర్టీసీ భవన్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ ఆస్తుల పంపకంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే జూలై 1 వ తేదీన ఆర్టీసీ నిపుణుల కమిటీ సమావేశం కానుందని ఆయన స్పష్టం చేశారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికను త్వరలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామన్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఆర్టీసీని విభజన జరుగుతుందని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. -
ఆర్టీసీ ప్రయాణాలిక మరింత భారం
-
'జూలై 1న ఆర్టీసీ విభజన'
రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో విభజన ప్రక్రియ కొనసాగుతోందని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. బుధవారం ఆర్టీసీ భవన్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ ఆస్తుల పంపకంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన వివరించారు. ఆ కమిటీ తన నివేదికను త్వరలో తమకు అందజేయనుందని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా జూలై 1వ తేదీన ఆర్టీసీని విభజిస్తామని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. -
అవినీతికి లెసైన్స్!
ప్రభుత్వ కార్యాలయాలంటేనే అవినీతి అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. అయితే, వాటన్నింట్లోకల్లా రోడ్డు రవాణా శాఖ (ఆర్టీవో) కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. లంచాలు తీసుకునేందుకు తామంతా లెసైన్సులు పొందినట్లుగా అక్కడి అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తుంటారు.నేరుగా చేసే అక్రమాలు చాలవన్నట్లు ఏజెంట్లను ప్రోత్సహిస్తున్నారు. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారంతా ఏజెంట్ల ద్వారానే తమను సంప్రదించేలా పరిస్థితిని మార్చేశారు. దీంతో ఏజెంట్లు అడిగినంతా ముట్టజెప్పి ఆర్టీవో అధికారులు, సిబ్బంది ద్వారా పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దర్శి : రోడ్డు రవాణా శాఖ జిల్లా కార్యాలయం ఒంగోలు నగరంలో ఉండగా, దాని పరిధిలో దర్శి, మార్కాపురం, చీరాల, కందుకూరు పట్టణాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాలున్నాయి. ఆయా కార్యాలయాల్లో డ్రైవింగ్ లెసైన్సులు మంజూరు చేయడం, పలు వాహనాల రిజిస్ట్రేషన్లు, బ్రేక్ చేయించడం తదితర పనులు చేస్తుంటారు. అయితే, కొన్నేళ్లుగా అవినీతికి నిలయాలుగా ఆర్టీవో కార్యాలయాలు మారడంతో ప్రస్తుతం ఆయా కార్యాలయాలకు ప్రజలు నేరుగా వెళ్లడం మానేశారు. జిల్లా కేంద్రంలో ఆర్టీవో కార్యాలయం నుంచి దర్శి, మార్కాపురం, చీరాల, కందుకూరు పట్టణాల్లోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాల్లో ఏ పని కోసమైనా ముందుగా ఆయా కార్యాలయాల చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉండే ఏజెంట్లను సంప్రదించాల్సి వస్తోంది. కొన్నేళ్ల క్రితం అనధికారికంగా ప్రారంభమైన ఈ ఏజెంట్ల వ్యవస్థ ప్రస్తుతం ఆర్టీవో కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందికంటే కూడా కీలకపాత్ర పోషిస్తోంది. ప్రజలకు ఆర్టీవో కార్యాలయంలో ఏ పని అవసరమైనా ముందుగా ఏజెంట్లను సంప్రదిస్తున్నారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికారులు, సిబ్బంది సైతం ఏజెంట్లతో చేతులు కలిపి వారి ద్వారా వచ్చిన వారికి వెంటనే పనులు చేసి పంపిస్తుండటం, నేరుగా కార్యాలయంలో సంప్రదించిన వారిని రోజుల తరబడి తిప్పుకుంటుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఏజెంట్లు వివిధ పనుల కోసం తమను సంప్రదించే వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన దానికంటే రెండుమూడు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. వాటిలో కొంత మొత్తాన్ని అధికారులు, సిబ్బందికి ముట్టజెప్పి సులభంగా పనులు చేయిస్తున్నారు. మిగిలిన మొత్తంతో తమ జేబులు నింపుకుంటున్నారు. ఏజెంట్లకు నంబర్ల కేటాయింపు... ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాల్సినదానికంటే అదనంగా ఒక్కో పనికి ఒక్కో రేటును ఏజెంట్లు నిర్ణయించారు. అన్నిపత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఏజెంట్ల ద్వారా వెళ్తేనే కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పనులు చేస్తుండటంతో ప్రజలకు వారు అడిగినంతా సమర్పించుకోక తప్పడం లేదు. ఏజెంట్లంతా వివిధ పనుల కోసం నిత్యం కార్యాలయానికి వచ్చే ప్రజలను పీల్చిపిప్పిచేస్తూ తమ జేబులు నింపుకుంటుంటారు. ఇలా చేయడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైనప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం, స్థానికంగా పనిచేసే అధికారులు, సిబ్బంది కూడా ఏజెంట్ల చెప్పుచేతల్లో ఉంటూ వారిచ్చే లంచాలకు కక్కుర్తిపడి పనులు చేస్తుండటంతో ఏళ్ల తరబడి ఈ పరిస్థితిలో మార్పులేకుండా పోయింది. దర్శి ఎంవీఐ కార్యాలయం వద్ద 18 మంది ఏజెంట్లున్నారు. అధికారులు, సిబ్బంది వీరితో కుమ్మక్కై వారందరికీ ఏకంగా 18 నంబర్లు కేటాయించారు. ఏజెంట్లు తమ ద్వారా కార్యాలయంలోకి పంపే ఫైలుపై తమకు కేటాయించిన నంబర్ వేస్తారు. అలా వచ్చిన వారికే అధికారులు పనులు చేసి పంపిస్తుంటారు. ఇలా పనులు చేయించినందుకుగానూ జనం నుంచి చలానాలకన్నా అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని సాయంత్రానికి అధికారులు, ఏజెంట్లు పంచుకుంటారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతుండటం విశేషం. కొత్త మంత్రిపైనే ఆశలు... ప్రస్తుతం జిల్లాకు చెందిన దర్శి ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖామంత్రిగా నియమితులవడంతో ఆయనపైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని ఆ శాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి అధికారులు, సిబ్బంది నిజాయితీగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే, ఏళ్ల తరబడి అడ్డదారుల్లో హైస్పీడ్‌తో వెళ్తున్న వారిని మార్చడం అంత సులభం కాదు. దీనిపై మంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
ఇంకా ‘ఏపీఎస్ఆర్టీసీ’యే..!
-
ఇంకా ‘ఏపీఎస్ఆర్టీసీ’యే..!
విభజనకు ‘ఉవ్ముడి ఆస్తుల’ రెడ్ సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాల విభజన కసరత్తు కొలిక్కివచ్చినా ఆర్టీసీలో మాత్రం పరిస్థితి వూత్రం అందుకు భిన్నం గా ఉంది. ‘ఉవ్ముడి’ ఆస్తుల విషయుంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విభజన కసరత్తు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసే రోజున మహంతి ఆదేశించడంతో ఆర్టీసీలో విభజన పనులు ఆగి పోయాయి. అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ ఆర్టీసీ ఇప్పటికీ ‘సమైక్యం‘గానే విధులు నిర్వహిస్తోంది. తెలంగా ణలోని ప్రధాన విభాగాలకు అధిపతులను నియుమించినా, ఆర్టీసీని అందులోనుంచి మినహారుుంచింది. వాస్తవానికి గత నెల 25నే ఆర్టీసీ విభజన కసరత్తు దాదాపు పూర్తయింది. సంస్థ ప్రధాన పరిపాలన భవనం అయిన బస్‌భవన్‌ను రెండుగా విభజించి ‘ఏ’ వింగ్‌ను ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థకు, ప్రస్తుతం ఎండీ తదిత ర ఉన్నతాధికారులు ఉంటున్న ‘బి’ వింగ్‌ను తెలంగాణ రవాణా సంస్థకు కేటాయించారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, ట్రాన్స్‌పోర్టు అకాడమీ, బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపం, బ్యాంకు, ఏటీఎంలను ఉమ్మడి ఆస్తులుగా పరిగణిస్తూ రెండుగా విభజించినట్టు నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. ఇక రెండుగా విభజించే వీలులేని ఉమ్మడి ఆస్తులుగా ఆసుపత్రి రేడియాలజీ విభాగం, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్, మియాపూర్‌లోని బస్‌బాడీ ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాపు, ప్రింటింగ్‌ప్రెస్, ఓపీఆర్ఎస్, సీఐఎస్, వీటీఎస్ ఐటీ సేవల వ్యవస్థలను, అనంతపూర్‌లోని విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను ఉమ్మడిగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఇక్కడే సమస్య మొదలైంది. హైదరాబాద్‌లోని ఆస్తుల్లో బస్‌భవన్ మినహా మిగతావన్నీ పూర్తిగా తమకే చెందాలని డివూండ్ చేస్తూ సమ్మెకు సిద్ధపడడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఇదే విషయాన్ని ఆర్టీసీ ఎండీ గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి నివేదించడంతో కొత్త ప్రభుత్వాలు పరస్పరం చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో విభజన పనిని నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాక దీనిపై చర్చించి తీసుకునే నిర్ణయం ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని అప్పట్లో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొలువుదీరకపోవడంతో ఆర్టీసీని ‘సమైక్యం’గానే కొనసాగిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తరువాతే ఆర్టీసీ విభజనకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది. -
ఆర్టీసీపై డీజిల్ పిడుగు
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రోడ్డు రవాణా సంస్థపై డీజిల్ రేటు పెంపు రూపంలో పిడుగు పడింది. దీంతో అసలే నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీకి ధర పెంపు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. అన్ని రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం డిజిల్ ధరలు పెంచింది. పెరిగిన ఈ ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈనెల 12వ తేదీ వరకు లీటరు డీజిల్ రూ.60.56కు లభిస్తుండగా ప్రస్తుతం లీటరుపై రూ.1.34 పెరిగి రూ.61.90కి చేరింది. కర్నూలు రీజియన్ (జిల్లా )లోని 11డిపోల్లో మొత్తం 970 బస్సులున్నాయి. ఇందులో అద్దెబస్సులు పోను 855 సంస్థ బస్సులున్నాయి. ఇవి రోజుకు దాదాపు 4 లక్షల కిలో మీటర్లు తిరిగి 3.90లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. ఇందుకు 78వేల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. పెరిగిన ధరలతో రోజుకు రూ. 1,04,520 కాగా నెలకు రూ.31,35,600 అవుతుంది. ఏడాదికి సంస్థపై రూ. 1.67 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. అంతేకాక శ్రీశైలం బ్రహ్మోత్సవాలు, ఉగాది, అహోబిలం, ఊరుకుంద జాతర, సంక్రాంతి ఇతర సందర్భాల్లో ఇతర జిల్లాల నుంచి తెప్పించే బస్సులకు సైతం డీజిల్‌ను కొనుగోలు చేయాల్సి రావడంతో ఈ భారం మరింత అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపునకు చర్యలు చేపట్టామని డిప్యూటి చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాసులు తెలిపారు. -
షెడ్యూల్స్ తగ్గిస్తాం
ప్రయాణికులకు ఇబ్బంది కలిగించం నష్టనివారణ కోసమే ఈ నిర్ణయం తెలంగాణ ఉద్యమంతో రూ.21.80 కోట్ల నష్టం టోల్ పెంపుతో బీఎంటీసీపై రూ.3.33 కోట్ల భారం మంత్రి రామలింగారెడ్డి వెల్లడి సాక్షి, బెంగళూరు : నష్టాలు తగ్గించుకోవడంలో భాగంగా రోడ్డు రవాణా సంస్థలోని కేఎస్ ఆర్టీసీతో పాటు మిగిలిన మూడు కార్పోరేషన్లలోని బస్సు షెడ్యూల్స్‌ను తగ్గించనున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎస్ ఆర్టీసీలో ప్రస్తుతం 7,791 షెడ్యూల్స్ ఉన్నాయని, దశల వారిగా ఎనిమిది శాతం షెడ్యూల్స్‌ను తగ్గించే అవకాశం ఉందన్నారు. దీని వల్ల నిర్వహణ వ్యయం తగ్గి సంస్థ నష్టాలు లేని స్థితికి చేరుకునే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. షెడ్యూల్స్ తగ్గించడం వల్ల ప్రజల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్త వహిస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కేఎస్ ఆర్టీసీతో సహా అన్ని విభాగాలు లాభాల్లో ఉండేవంటూ ఆ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆ పార్టీ హయాంలో ఒక్క కేఎస్ ఆర్టీసీ మాత్రమే రూ.1.74 కోట్లు లాభాల్లో ఉండేదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షెడ్యూల్స్, ఉద్యోగుల సంఖ్య పెరగడంతో పాటు నిర్వహణ వ్యయం, ఇంధన ధరలు చాలా పెరిగాయన్నారు. ఇక గత ఏడాది జరిగిన తెలంగాణ బంద్ వల్ల సంస్థకు రూ.21.80 కోట్ల నష్టం (కేఎస్ఆర్టీసీ-రూ.10.50 కోట్లు, ఎన్ఈకే ఆర్టీసీ-రూ.6.09 కోట్లు, ఎన్డబ్ల్యూకే ఆర్టీసీ-రూ.5.21 కోట్లు) వాటిల్లిందన్నారు. అందువల్లే 2013-14 ఏడాదికి నష్టం రావచ్చని భావిస్తున్నామన్నారు. సంస్థ మనగడ సాగించాలనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో బస్ చార్జీలు పెంచామని ప్రభుత్వ చర్యలను సమర్థించుకున్నారు. దేవనహళ్లి మార్గంలో టోల్ రూపేణా బీఎంటీసీ రోజుకు రూ.38,430 చెల్లిస్తున్నామన్నారు. టోల్ పెంచడం వల్ల ఈ మొత్తం రూ.1,29,930కు పెరుగుతుందన్నారు. అంటే రోజుకు టోల్ రూపేణ రూ.91,500 ఎక్కువ చెల్లించాల్సి వస్తుందన్నారు. దీంతో ఈ ఒక్క మార్గంలో బీఎంటీసీ గత ఏడాదితో పోలిస్తే ఇకపై రూ.3.33 కోట్లు టోల్ రూపేణా ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని వివరించారు. ఇక ఈ మార్గంలో కేఎస్ ఆర్టీసీ ఏడాదికి రూ.2.97 కోట్లు చెల్లించనుందన్నారు. ఈ పెంపు వల్ల టికెట్టు ధరలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని భరోసా ఇచ్చారు. -
నాలుగైదు రోజుల్లో ఆర్టీసీ ‘విభజన’ కసరత్తు పూర్తి
* నివేదికను తొలుత బోర్డుకు సమర్పించనున్న అధికారులు * నగరంలో ఉన్నట్టుగా సీమాంధ్రలోనూ కల్యాణమండపం, ఆసుపత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆస్తులు, అప్పులను తెలంగాణ-సీమాంధ్రల మధ్య విభజించే అంశం మరో నాలుగైదు రోజుల్లో కొలిక్కి రానుంది. దీనికి సంబంధించి అధికారులు వారం రోజులుగా వేగంగా కసరత్తు చేస్తున్నారు. బోర్డుకు సమర్పించేందుకు వీలుగా ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తున్నారు. కార్పొరేషన్ ఆస్తులను 58:42 పద్ధతిలో విభజిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ తీవ్ర నష్టాల్లో ఉన్నందున వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ నష్టాలు గత 10 నెలలుగా రికార్డు స్థాయికి చేరుకోవటంతో... అదీ గత జనవరిలో మరింత తీవ్రంగా ఉండటంతో ఏప్రిల్ వరకు ఉన్న పరిస్థితిని అధికారులు తాజాగా సిద్ధం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి అత్యంత విలువైన స్థలాలున్నాయి. వీటి విలువ రూ.65 వేల కోట్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఏ ప్రాంతంలో ఉన్న స్థలాలు ఆ ప్రాంతానికే దక్కనున్నాయి. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కల్యాణ మండ పం, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి తరహాలో సీమాంధ్రలో కూడా వాటిని నిర్మించాలని నివేదికలో పొందుపరచనున్నారు. అప్పులు, నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ వాటిని నిర్మించే పరిస్థితిలో లేనందున ప్రభుత్వం అందుకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని అందులో పేర్కొంటున్నారు. 123 డిపోలు, వాటి పరిధిలో ఉన్న పదమూడున్నర వేల బస్సులను ఆయా ప్రాంతాలకే కేటాయిస్తారు. కొత్తగా జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కొనే బస్సులను కూడా 58:42 పద్ధతిలో రెండు ప్రాంతాలకు కేటాయించాలని నిర్ణయించారు. ఆయా డిపోల పరిధిలో ప్రస్తుతం 45 వేల డ్రైవర్లు, 42 వేల కండక్టర్లు కలిపి మొత్తం 1.24 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో సీమాంధ్రకు చెందిన వారు 70 వేల మంది ఉన్నారు. ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే కేటాయిస్తారు. నగరంలోని ప్రధాన కార్యాలయం, రీజియన్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారుల పంపిణీ మాత్రం జరగాల్సి ఉంది. ఓ ప్రాంతానికి చెందిన వారు మరో ప్రాంతంలో పనిచేస్తున్న వారి సంఖ్య కేవలం వందల్లోనే ఉండటంతో వీరి పంపిణీ కూడా సవ్యంగానే సాగనుంది. ఈ మొత్తం కసరత్తును మరో మూడునాలుగు రోజుల్లో పూర్తి చేసి ఆర్టీసీ బోర్డు ముందుంచనున్నారు. ఇందులో దీనిపై చర్చించి అవసరమైన మార్పు చేర్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు. -
ప్రపంచ వేగానికి కారకుడు
సత్వం మానవ చరిత్రలో ‘చక్రం’ ఆవిష్కరణ తెచ్చిన పురోగతి మామూలుది కాదు! జీవితపు వేగాన్ని చక్రం ప్రభావితం చేసింది. ఆలాంటి చక్రం ఎన్నో చక్రాలుగా బహుముఖీనంగా విస్తరించింది. ఆ చక్రానికి కొనసాగింపయిన ‘టైరు’ ప్రవేశంతో రవాణావ్యవస్థ చాలాముందుకు లంఘించింది. అయితే, ఒక కన్నతండ్రి ప్రేమకూ, ఇప్పటి ఆధునిక టైరు రూపకల్పనకూ సంబంధం ఉంది! జాన్ బాయ్డ్ డన్లప్ తన కొడుకు సమస్యను పరిష్కరించడం కోసం చేసిన సృజన... రవాణావ్యవస్థ రూపురేఖల్ని మార్చేసింది. స్కాట్లాండ్లో 1840 ఫిబ్రవరి 5న జన్మించాడు జాన్ బాయ్డ్ డన్లప్. ఎడింబరో విశ్వవిద్యాలయంలో చదివాడు. వృత్తిరీత్యా వెటర్నరీ సర్జన్. కొన్నాళ్ల ప్రాక్టీస్ తర్వాత ఆయన కుటుంబం స్కాట్లాండ్ నుంచి ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ నగరానికి తరలివచ్చింది. బెల్ఫాస్ట్లో రోడ్లు కంకరతేలి ఉండటం, వాటిమీద కొడుకు తన ట్రైసైకిల్‌ను నడపడానికి తిప్పలు పడుతుండటం గమనించాడు డన్లప్. ట్రైసైకిల్ అంటే ఇప్పటి పిల్లల ఆటసైకిల్లాంటిది కాదు. పెద్దవాళ్లు కూడా తొక్కుకుంటూ వెళ్లేదే! అప్పటి చక్రాలు ఇనుముతోనో, చెక్కతోనో తయారుచేసేవారు. కొన్నిచోట్ల ఇనుప రీముల చుట్టూతా రబ్బరు చుట్టడం కూడా వినియోగంలోకి వచ్చినా, అది చక్రానికీ, నేలకూ మధ్య ఘర్షణను తగ్గించడానికే ఎక్కువగా ఉపయోగపడింది. 1887 నాటికి అలా రబ్బరు చుడుతున్నారన్న సంగతి బెల్ఫాస్ట్లో ఇంకా తెలియదు. సహజంగానే డన్లప్కూ తెలియదు. అయితే, తన కొడుకు ఆ దోవల్లో ట్రైసైకిల్ నడపలేక పడుతున్న అవస్థను గమనించాక, ఆ ఇనుప చక్రాల చుట్టూ రబ్బరు చుడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయనలో తనకుతానుగా మొలకెత్తింది. అంతకంటే ముఖ్యం, ఆ రబ్బరులో గాలినింపాలని మరింత ‘అడ్వాన్సు’గా కూడా ఆలోచించాడు. అందుకు ఫుట్‌బాల్‌లో గాలినినింపే పంపు ఆయనకు పనికొచ్చింది. గాలినింపిన టైరు... నేలకూ, చక్రానికీ మధ్య ‘కుషన్’గా ఉపయోగపడింది. వేగం పెరిగింది. ప్రయాణం సుఖవంతం అయింది. ఇది మరింత ప్రాక్టికల్ విధానం కూడా! చాలా పెద్ద పరిష్కారాలు కూడా అప్పటి తక్షణ సమస్యలోంచే పుడతాయేమో! దళసరి రబ్బరును టైరుగా వాడొచ్చన్న ఆలోచన అదివరకే వేరొకరికి వచ్చివుండటం మూలాన డన్లప్ ‘టైరు ఆవిష్కర్త’ కాలేకపోయాడు. కానీ టైరులో గాలినింపి వాడాలన్న ఆలోచన అచ్చంగా ఆయనదే! ఈ ‘గాలి నింపిన టైరు’ గురించి ఇంకా ప్రపంచానికి తెలియదు. రెండేళ్ల తర్వాత, 1889లో డన్లప్ దాన్ని మరింత ఆధునికపరచి, సైక్లిస్ట్ విలియమ్ హ్యూమ్‌తో తన ఆలోచన పంచుకున్నాడు. ఈ హ్యూమ్ ‘బెల్ఫాస్ట్ క్రూయిజర్స్ సైక్లింగ్ క్లబ్’ జట్టు కెప్టెన్. తను రూపొందించిన టైర్లు వాడుతూ హ్యూమ్ పందెంలో పాల్గొనేలా చేశాడు డన్లప్. ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించేలా, హ్యూమ్ ఆ పోటీల్లో విజయం సాధించాడు. దృఢమైన రబ్బరు కంటే గాలి నింపిన టైర్లు వేగవంతమైనవని అలా నిరూపణ జరిగింది. 1921 అక్టోబర్ 23న మరణించిన డన్లప్ అలా చరిత్రలో నిలిచిపోయాడు. -
లక్కీనంబర్ 6666 @ రూ.1.51 లక్షలు
నూజివీడు ఎంవీఐ కార్యాలయంలో పలు ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించారు. ఏపీ సీజీ శ్రేణిలో 6666 నంబరు కోసం అధిక పోటీ జరిగింది. దీని కోసం ముగ్గురు బిడ్ వేశారు. ఈ నంబరు బేసిక్ మొత్తం రూ.30వేలు కాగా, హనుమాన్జంక్షన్కు చెందిన చలమలశెట్టి రమేష్ అత్యధికంగా రూ.1,21,300లకు బిడ్‌వేయగా ఆయనకు నంబర్ ఖరారైంది. దీనికి బేసిక్ మొత్తాన్ని కలిపితే రూ.1.51లక్షలకు రమేష్ నంబర్ దక్కించుకున్నట్టయింది. ఇదే నంబరుకోసం ముసునూరుకు చెందిన పాల డుగు నాగభరత్ రూ.45వేలకు, నూజివీడు మండలం యనమదలకు చెందిన జి.కృష్ణారావు 37,777కు బిడ్లు వేశారు. అలాగే 6667 నంబరును ఆగిరిపల్లి మండలం శోభనాపురానికి చెందిన డి.శ్రీహర్ష రూ.35వేలకు, 6669 నంబరును నూజివీడుకు చెందిన కె.వి.రమేష్‌కృష్ణ రూ.42,625కు, 6677 నంబరును హనుమాన్జంక్షన్కు చెందిన టి.ఎల్.వి. రమేష్ రూ.10,100కు, 6678 నంబరును హనుమాన్జంక్షన్కు చెందిన ఎం.రాఘవరావు రూ.12,010కి దక్కించుకున్నారు. మొత్తంమ్మీద ఈ ఫ్యాన్సీ నంబర్ల వల్ల స్థానిక కార్యాలయానికి రూ.21,51,730 ఆదాయం వచ్చింది. -
నిబంధనలకు పాతర !
పట్టుబడ్డ ప్రైవేటు బస్సుల్లో సగం వోల్వోలే పాలెం ఘటన తర్వాతా బస్సుల్లో బాణసంచా తరలింపు అదనపు ఆదాయం కోసం లారీల తరహాలో సరుకు రవాణా అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తున్న దిమ్మతిరిగే వాస్తవాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రహదారులపై పరుగులుపెడుతున్న వోల్వో బస్సుల సంఖ్య 650. పాలెం దుర్ఘటన తర్వాత రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో ఇప్పటి వరకు జప్తు చేసిన వోల్వో బస్సుల సంఖ్య 320. రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఏ స్థాయిలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో ఈ సంఖ్యే స్పష్టం చేస్తోంది. 45 నిండుప్రాణాలను బలి తీసుకున్న పాలెం దుర్ఘటన తర్వాత కూడా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల్లో మార్పు రాలేదనటానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. పాలెం దుర్ఘటన జరిగిన మూడు రోజులకే... రెండు బస్సులు లగేజీ బాక్సులో బాణసంచాను తరలిస్తూ పట్టుబడ్డాయి. రవాణా శాఖ అధికారులవి తాటాకు చప్పుళ్లే అని బలంగా విశ్వసించే ట్రావెల్స్ యజమానులు యథాప్రకారం నిబంధనలు కాలరాస్తూ బస్సులను నడుపుతున్నారు. వోల్వో ఎగ్జాస్ట్ సిస్టమ్‌కు చేరువగా ఉండే లగేజీ బాక్సులో నిప్పు పుట్టించే వస్తువులు ఉంచకూడదు. కానీ కాసుల కోసం పెద్ద సంఖ్యలో వస్తువులను తరలించే అలవాటున్న బస్సు నిర్వాహకులు బాణసంచాను కూడా తరలించేందుకు సిద్ధపడ్డారు. అధికారుల తనిఖీలో ఈ విషయం వెలుగు చూడటంతో.. ఆ రెండు బస్సులను జప్తు చేయటమే కాక.. యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇంతకాలం కళ్లుమూసుకున్న రవాణా శాఖ అధికారులు, పాలెం దుర్ఘటన తర్వాత ఏ ఒక్క బస్సునూ వదలకుండా తనిఖీలు చేస్తూ నిబంధనలను విస్మరిస్తున్న వాటిని అక్కడికక్కడే జప్తు చేస్తున్నారు. ఇదే పని ఇప్పటికే చేసి ఉంటే నిబంధనలు అపహాస్యం అయిఉండేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ తనిఖీలైనా ఎంతకాలం కొనసాగుతాయన్నదే అసలు ప్రశ్న. గతఏడాది జూన్‌లో శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్ వోల్వో బస్సు ప్రమాదానికి గురై 32 మంది చనిపోయినప్పుడు ఇలాగే తనిఖీలు చేసి.. 500 బస్సుల వరకు సీజ్ చేసిన అధికారులు ఆ తర్వాత చూసీచూడనట్టు వ్యవహరిం చారు. ఇప్పుడు కూడా ఈ హడావుడి మధ్యలో నిలిచిపోయే అవకాశం లేకపోలేదు. ఉల్లంఘనలెన్నో: ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకునేందుకు వీలుగా ఉండే అత్యవసర ద్వారం వద్ద కొంతమేర ఖాళీ వదలాలి. ఆ స్థలంలో అదనపు సీట్లను బిగించిన వ్యవహారాలు ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. బస్సుల్లో అదనపు ప్రయాణికులు కూర్చోవటానికి వీలుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పాలెం ఘటనలో ఈ అదనపు సీట్ల వల్లే ప్రాణనష్టం పెరిగింది. కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతి పొంది స్టేజి క్యారియర్‌గా నడుపుతున్న బస్సులపైనా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం కర్ణాటకలో ప్రమాదానికి గురైన బస్సు ఇలాంటి నిబంధన ను అతిక్రమించిందే. మన రాష్ట్రంలోనూ మూడొంతుల బస్సులు ఇలాగే అనుమతి లేకుండా నడుస్తున్నాయి. దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో కచ్చితంగా ఇద్దరు డ్రైవర్లుండాలి. ఆరు గంటల డ్రైవింగ్ తర్వాత డ్రైవర్ మారాలి. కానీ 90% బస్సుల్లో ఒకే డ్రైవర్ ఉంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా లగేజీ బాక్సులో సరుకులు బట్వాడా చేస్తున్నారు. ప్రయాణికుల తాలూకు వస్తువులు ఉంచాల్సిన చోట లారీల తరహాలో సరుకు రవాణా చేస్తూ ట్రావె ల్స్ నిర్వాహకులు అదనపు ఆదాయం పొందుతున్నారు. బస్సులో ప్రయాణికుల వివరాలతో జాబితా ఉండాలి. కానీ మూడొంతుల బస్సుల్లో అది ఉండటం లేదు. ఉన్నా అందులోని వివరాలకు.. ప్రయాణిస్తున్న వారి వివరాలకు పొంతన ఉండటం లేదు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించినప్పుడు కొందరు మృతుల వివరాలు దొరక్కపోవటానికి ఇదే కారణం. వోల్వోను వదిలించుకుందాం! చారణా కోడికి బారాణా మసాలా అనే హైదరాబాదీ సామెత రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నడుపుతున్న వోల్వో బస్సులకు అతికినట్టు సరిపోతుంది. వీటి ఖరీదు దాదాపు రూ. కోటి. పైగా చిన్న చిన్న మరమ్మతులకు కూడా లక్షల్లో చమురు వదులుతోంది. పైగా వీటితో ఆదాయం మాట అటుంచి నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. తెల్ల ఏనుగులుగా మారిన బస్సులను వదిలించుకోవాలని ఏపీటీడీసీ నిర్ణయించిందని సమాచారం. ఇకపై విదేశీ తయారీ వాహనాలను కొనుగోలు చేయబోదంటున్నారు. 2002- 2005 మధ్య కొన్న ఒక్కోటీ దాదాపు రూ.60 లక్షల చొప్పున కొన్న 11 వోల్వో బస్సులను తుక్కు కింద సంస్థ అమ్మకానికి పెట్టింది! కానీ వాటిని కొనేందుకు ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. ఇవి పోను ఏపీటీడీసీ నడిపే 106 బస్సు సర్వీసుల్లో మరో 20 వోల్వోలు, 8 మెర్సిడస్ బెంజ్ వాహనాలున్నాయి. వోల్వో బస్సు ఖరీదు ప్రస్తుతం రూ.85 లక్షల నుంచి రూ. 1.08 కోట్లుంది. అదే దేశీయ తయారీ హైటెక్ ఏసీ బస్సు రూ.35 లక్షలుంది. అంటే ఒక్క వోల్వోకు వెచ్చించే మొత్తంతో మూడు హైటెక్ ఏసీ బస్సులను సమకూర్చుకోవచ్చు. -
హైదరాబాద్‌లో 20 ప్రైవేట్ బస్సులు సీజ్ చేసిన ఆర్టీఏ
ప్రైవేట్ ట్రావెల్స్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగాయి. అందులోభాగంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఓల్డ్ కర్నూలు రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 20 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం సమీపంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది మరణించారు. దాంతో రాష్ట్రంలోని ప్రైవేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దాంతో మహబూబ్‌నగర్ ఘటన జరిగిన నాటి నుంచి దాదాపు వెయ్యికి పైగా బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అయితే మహబూబ్‌నగర్ ఘటన మరువకు ముందే నిన్న బెంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న వోల్వో బస్సు లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో ఏడుగురు సజీవ దహనమైయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
20 ప్రైవేట్ బస్సులను సీజ్ చేసిన రవాణ శాఖ
మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం బస్సు దుర్ఘటన నేపథ్యంలో రవాణశాఖ అధికారులు చేపట్టిన దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 బస్సులు సీజ్ చేసినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో 9, కర్నూలులో 2, అనంతపురంలో 5,గుంటూరులో 4 బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరంగళ్ చౌరస్తాలో నాలుగు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేట్ వాహనాలపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ ట్రాన్‌పోర్ట్ కమిషనర్ సుందర్ బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులను హెచ్చరించారు. గత నెలలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 46 మంది మరణించారు. ఆ ఘటనతో నిద్రావస్థలో ఉన్న రాష్ట్ర రవాణ శాఖ కొద్దిపాటి ఉలికిపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ పై దాడులు రవాణశాఖ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
రోడ్డు భద్రతపై శ్రద్ధేదీ..?
= మొక్కుబడిగా ‘సఫర్’ కార్యక్రమం = మూలనపడిన ‘స్పీడ్ గన్’లు సాక్షి, ఒంగోలు: రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు రవాణాశాఖ ప్రవేశపెట్టిన ‘సఫర్’ (సేఫ్టీ ఆల్వేస్ ఫర్ ఆల్ రోడ్స్) కార్యక్రమంపై కిందిస్థాయి అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. 2003లో ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ఏటా జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు ‘రహదారి భద్రత వారోత్సవాలు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. తొలుత ఐదారేళ్లు ఈ కార్యక్రమం సజావుగా అమలైనా క్రమంగా చిత్తశుద్ధి లోపించింది. ప్రతి మూడు నెలలకోసారి కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎం, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, కార్పొరేషన్ కమిషనర్, ఆర్అండ్బీ ఈఈ, ఆర్టీఓ, జాతీయ రహదారి జనరల్ మేనేజర్, ట్రాఫిక్ సీఐ తదితరులు సభ్యులుగా ఉండే కమిటీ సమావేశమై అందులో తీసుకునే నిర్ణయాలను అమలు చేయాలి. అయితే ఈ సమావేశాలు ప్రస్తుతం ఆరు నెలలకోసారి జరుగుతున్నాయి. అమలు కాని రోడ్ సేఫ్టీ మెజర్స్ : ప్రమాదాల నివారణపై కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను సంబంధిత శాఖాధికారులు సక్రమంగా అమలు చేయకపోతుండటం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఒంగోలు నగరానికి సంబంధించి గతంలో అధికారులు తీసుకున్న సేఫ్టీ మెజర్స్ ప్రస్తుతం అమలవడం లేదు. హైవే అధికారులు సైతం సరిగా స్పందించడం లేదు. హైవేపై, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలపై ఏర్పడుతున్న గుంతలను పూడ్చడం లేదు. ‘స్పీడ్ గవర్నర్’లను ఉపయోగిస్తున్నారా...? ప్రమాదాలను అరికట్టేందుకు గానూ ప్రవేశపెట్టిన నిబంధనలను డ్రైవర్లు సక్రమంగా పాటించడం లేదు. మితిమీరిన వేగం, సరైన శిక్షణ లేకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటం, దూరప్రాంతాలకు వెళ్లే వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు లేకపోవడం... తదితర కారణాలతో తరచూ రోడ్డుప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రత్యేకంగా జాతీయ రహదారి, ఇతర ప్రధాన రహదారుల్లో ఎక్కడ ఎంత వేగంతో వాహనాన్ని నడపాలనే సూచనలు కనిపిస్తుంటాయి. అయితే డ్రైవర్లు వాహనాలను త్వరగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా వేగం పెంచుతూ ఉంటారు. దీనిని పసిగట్టేందుకు ప్రభుత్వం ‘స్పీడ్ గవర్నర్’ (స్పీడ్ గన్) పేరుతో ఒక మెషీన్‌ను రవాణాశాఖాధికారులకు అప్పగించింది. ఆ మెషీన్ ద్వారా మోటారు వాహనాల ఇన్స్పెక్టర్లు వాహనం ఎంత స్పీడ్‌తో వస్తుందో గుర్తించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెంటనే తాఖీదులు జారీ చేసి వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ యంత్రాన్ని సక్రమంగా వినియోగించడం లే దు. జాతీయ రహదారి పక్కన మద్యం దుకాణాలు కానీ, బార్లు కానీ ఉండకూడదు. కానీ రోడ్డు పొడవునా మద్యం దుకాణాలతో పాటు, బెల్టు షాపులు సైతం దర్శనమిస్తూనే ఉన్నాయి. దాబా హోటళ్లలో మద్యం అందుబాటులో ఉంటుండడం వల్ల లారీలు, బస్సులు, కార్లు తదితర వాహనాల డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు సంభవించి ఎంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పోలీస్, ఆర్టీఏ, జాతీయ రహదారులకు సంబంధించిన అధికారులు నిత్యం పెట్రోలింగ్ చేస్తుండాలి. ఈ పెట్రోలింగ్ కూడా సక్రమంగా జరగడం లేదు. ఏటా రూ.7 కోట్ల వరకు ఆదాయం ఒంగోలు నగరంతో పాటు కందుకూరు, మార్కాపురం, చీరాల డివిజన్ల నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు నిత్యం పెద్ద సంఖ్యలో పలు రకాల ట్రావెల్స్ నుంచి బస్సులు వెళ్తుంటాయి. టికెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తుండటంతో ఆర్టీసీ కన్నా ఈ బస్సులకే అధిక డిమాండ్ కనిపిస్తోంది. రవాణా శాఖకు ఒక్క ప్రకాశం జిల్లా నుంచి ఏటా ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు సుమారు రూ.6 నుంచి రూ.7 కోట్ల వరకు పన్ను చెల్లిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తీవ్రంగా ఉన్న డ్రైవర్ల కొరత: పది, పదిహేనేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం బస్సులు, లారీల వంటి భారీ వాహనాలకు డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు సంబంధిత యజమానులు చెప్తున్నారు. పాత వారు మినహాయిస్తే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోతోందంటున్నారు. దీంతో ఉన్న కొద్దిమందితోనే వారు పని నడిపిస్తున్నారు. సరైన శిక్షణ పొందని, లెసైన్సులు లేని క్లీనర్లు సైతం స్టీరింగ్ పట్టుకుంటుండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సాధారణ బస్సుల విషయం అటుంచితే ఓల్వో బస్సు ఖరీదు ప్రస్తుతం సుమారు రూ.1.20 కోట్లకుపైగా ఉంటుంది. సరైన శిక్షణ తీసుకుని ఈ వోల్వో వాహనాలను నడిపితే ప్రమాదాలు జరగడం చాలా తక్కువే. సాంకేతిక పరంగా బస్సు తయారీ, ఇతర విషయాల్లో హైసెక్యూరిటీ ఉంటుంది. కేవలం అవగాహన రాహిత్యం, తొందరపాటుతనం తదితర కారణాల వల్ల డ్రైవర్లు చేస్తున్న తప్పిదాలకు యాజమాన్యం భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఓల్వో వాహనాలకు సంబంధిత కంపెనీ వారు డ్రైవర్లకు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. వాహనాలు నడుపుతున్న వారు ఆ శిక్షణ తీసుకున్నారా... లేదా... ? తనిఖీ చేయాల్సిన బాధ్యత రవాణాశాఖ అధికారులపై ఉంది. 300 కి.మీ.లు దూరం తర్వాత డ్రైవర్‌కు తప్పనిసరిగా విశ్రాంతి అవసరం. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాల్సి ఉండగా కొన్ని బస్సుల్లో ఒక్కరే డ్రైవర్ ఉంటున్నారు. వాహనాలు నడిపేటప్పుడు ఒక చేత్తో సెల్ఫోన్లు మాట్లాడుతుండటం కూడా ప్రమాదాలు సంభవించేందుకు కారణాలవుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం రవాణాశాఖాధికారులు స్కూలు బస్సుల విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తూ పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఇదే విధంగా ట్రావెల్స్ బస్సులపై కూడా కఠినంగా వ్యవహరించి బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు నిబంధనలను పాటించేలా చూస్తే ప్రమాదాలను అరికట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రమాదాలు సంభవించిన తరువాత నాలుగైదు రోజులు హడావుడి చేయడం కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ ముమ్మరంగా తనిఖీలు చేపడితే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. అయితే కొన్ని విషయాల్లో చేతులు కాలిన తరువాత కూడా ఆకులు పట్టుకోవడం లేదంటే వారి నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. జాతీయ రహదారిపై ఆటోలు తిరుగుతున్నాయి. కనీసం ఒక్కో ఆటోలో కనీసం పది మంది ప్రయాణిస్తుంటారు. ఇలాంటి వాహనాలపై కూడా రవాణా, పోలీసు శాఖలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
గత మూడు రోజల్లో 150 ప్రైవేట్ బస్సులు సీజ్
మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన అగ్నికి ఆహుతి అయి 45 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణ శాఖ అధికారులు కోరడా ఝుళిపించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా తనిఖీలు నిర్వహించారు. దాంతో 150 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. విశాఖ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 8 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 1 బస్సును సీజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ -6, నిజామాబాద్ - 2, మెదక్ -5, అనంతపురం -1, మెదక్ జహీరాబాద్ చెక్‌పోస్ట్ వద్ద 3 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో గత అర్థరాత్రి నుంచి ఆర్టీఏ అధికారులు నిర్వహంచిన తనిఖీల్లో 15 బస్సులను సీజ్ చేశారు. ఇంకా పలు జిల్లాలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది మరణించారు. డ్రైవర్, క్లీనర్‌తోపాటు మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. -
గోదావరి జిల్లాల్లో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ దాడులు
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధమైన నేపథ్యంలో పలు జిల్లాలలో రవాణ ఆధికారులు ప్రైవేట్ బస్సులపై దాడులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) శ్రీదేవి ఆధ్వర్యంలో గత అర్థరాత్రి నుంచి దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న13 బస్సులను సీజ్ చేశారు. ఏలూరు - 6,తణుకు -2, తాడేపల్లిగూడెం -3, భీమవరం-2 బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ శ్రీదేవి వెల్లడించారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 2 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైంది. ఆ ఘటనలో 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో ఐదుగురు మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. -
‘వోల్వో’ డ్రైవర్లకు ప్రత్యేక లెసైన్స్..?
రవాణాశాఖ యోచన సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో అతివేగంగా ప్రయాణించే బస్సులకు సంబంధించి డ్రైవింగ్ నిబంధనల్లో మార్పు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ప్రస్తుతం బస్సులన్నింటికీ ఒకే తరహా డ్రైవింగ్ లెసైన్స్ విధానం అమలు చేస్తున్నారు. కానీ, గతే డాది 32 మందిని బలిగొన్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు, ఇప్పుడు 45 మంది మృతికి కారణమైన బస్సు.. రెండూ ‘వోల్వో’ బస్సులే. అత్యంత వేగంగా ప్రయాణించగలిగే ఈ తరహా బస్సుల్ని ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారే అదుపు చేసే అవకాశముంటుంది. కానీ సరైన శిక్షణ లేనివారు కూడా వాటిని నడుపుతూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాంటి వాటి డ్రైవర్లకు ప్రమాదకర పదార్థాలను తరలించే వాహనాలకు జారీ చేసే లెసైన్స్ విధానం వర్తింప చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ఈ లెసైన్స్‌లను ఏడాదికోసారి రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో డ్రైవర్లకు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తా రు. అందులో సఫలమైతేనే రెన్యువల్ చేస్తారు. మరోవైపు ‘వోల్వో’ తరహా బస్సుల్లో.. ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తే ముందస్తుగా హెచ్చరించే పరిజ్ఞానమూ కొత్త బస్సుల్లో ఉం టోంది. వాటిపై డ్రైవర్లకు అవగాహన ఉందని ధ్రువీకరించుకున్నాకే లెసైన్సులు రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. కాగా.. ఆర్టీసీలో ‘వోల్వో’ తరహా బస్సులు నడిపే డ్రైవర్లకు ఇస్తున్న తరహాలోనే ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లకు శిక్షణ ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సిఫారసు చేయాలని ఆలోచిస్తున్నారు. -
బంద్ సంపూర్ణం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో బంద్ సంపూర్ణమైంది. జన జీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా బంద్‌కు ఏపీఎన్జీవోల పిలుపు మేరకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లా మార్మోగిపోయింది. ప్రతి ప్రాంతంలోను స్థానికులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర వర్గాల వారు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు, ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా అంతటా తిరుగుతూ సందడి చేశారు. నక్కపల్లి, యలమంచిలి,చోడవరం, పాడేరు, అనకాపల్లి, అరకులోయ,తదితర ప్రాంతాల్లో వివిధ సంఘాల వారు మానవహారాలు నిర్వహించారు. రాస్తారోకోలు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యాపారసంస్థలు మూత: సమైక్యాంధ్ర బంద్ నేపథ్యంలో చిన్న వ్యాపారులు నుంచి భారీ షాపింగ్ మాల్స్ వరకు అన్నింటినీ స్వచ్ఛందంగా మూసివేశారు. సినిమా థియేటర్ల యజమానులు తొలి రెండు ప్రదర్శనలు నిలిపివేశారు. పార్లర్లు నుంచి హోటళ్లు వరకు అన్ని బంద్ పాటించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరగలేదు. వ్యాపారాలకు రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ఆటో కార్మికులు స్వచ్ఛందంగా బంద్ పాటించి విశాఖ నగరమంతా ర్యాలీలు చేశారు. కేంద్ర సంస్థలను మూయించిన ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు, ఇతర వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించినా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మాత్రం యాథావిధిగా ఉదయం తెరిచారు. విషయం తెలుసుకున్న ఉద్యోగ సంఘాలు బృందాలుగా విడిపోయి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఆదాయపన్ను శాఖ, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, ఎంఎంటీసీ, ఎన్ఎంటీసీ, బీఎస్ఎన్ఎల్, వన్‌టౌన్‌లోని ఫిషరీస్, ఎల్ఐసీ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించారు. తెరిచి ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాలలను కూడా బలవంతంగా మూయించారు. బ్యాంకులు మూసివేత బంద్‌కు పిలుపునిచ్చినా బ్యాంకులు తెరుచుకోవడంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెళ్లి కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఆయా బాంకుశాఖల్లోకి వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించేశారు. బలవంతంగా బ్యాంకులకు తాళాలు వేయించారు. విశాఖ సిరిపురంలోని ఎస్బీఐ జోనల్ కార్యాలయాన్ని కూడా మూసివేయాలని ఉద్యోగులు డిమాండ్ చేసినా అధికారులు అంగీకరించలేదు. దీంతో ఉద్యోగులు కొంత సేపు హడావుడి చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెనక్కి తగ్గకపోవడంతో బ్యాంకు ఉద్యోగులు కూడా బయటకు వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో సుమారుగా రూ.300 కోట్లు లావాదేవీలు నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు. నేడు, రేపు ప్రయివేట్ వాహనాల బంద్ సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఈ నెల 25, 26 తేదీల్లో ప్రైవేట్ వాహనాల యాజమాన్యాలు బంద్ పాటించనున్నాయి. రెండు రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి రోడ్డు రవాణా సదుపాయం ఉండదు. ఇప్పటికే ఆర్టీసీ సేవలు నిలిచిపోవడంతో ఇతర జిల్లాలకు వెళ్లాలంటే ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. ప్రయివేట్ వాహనాల సర్వీసులను కూడా స్తంభింపజేయాలని ఉద్యోగ సంఘాలు ఆయా యాజమాన్యాలపై కొంతకాలంగా ఒత్తిడి తీసుకువస్తున్నాయి. తాజాగా ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం ప్రయివేట్ వాహన యజమానులతో చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించాలని కోరారు. దీనికి వారు కూడా అంగీకరించారు. దీంతో రెండు రోజుల పాటు బంద్ పాటిస్తున్నట్టు ప్రకటించారు. -
విద్యార్థులకు తప్పిన ప్రమాదం
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రైవేట్ స్కూల్ బస్సు టైర్లు ఊడిపోయిన ఘటన సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... అమ్మవారిశాల సమీపంలోని గౌని సర్కిల్లో ఉన్న శ్రీవాణి విద్యాలయం స్కూల్ బస్సు సోమవారం ఉదయం విద్యార్థులను తీసుకొని వచ్చేందుకు మండల పరిధిలోని కల్లూరు గ్రామానికి వెళ్లింది. కల్లూరు, తాళ్లమాపురం, నీలాపురం గ్రామాల విద్యార్థులందరూ ఇదే బస్సులో వస్తారు. కల్లూరులో సుమారు 60 మంది దాకా విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. వారిలో నర్సరీ, ఒకటి, రెండు, మూడో తరగతులు చదివే చిన్న పిల్లలు కూడా వున్నారు. విద్యార్థులు ప్రయాణించే ఈ బస్సు కల్లూరు గ్రామం దాటిన తర్వాత కొంత దూరం వెళ్లగానే బస్సు వెనుక వైపున ఉన్న రెండు టైర్లు ఊడిపోయాయి. ఊడిపోయిన టైర్లు రహదారికి ఇరువైపుల ఉన్న పొలాల్లో దూరంగా పడ్డాయి. టైర్లు విడిపోగానే బస్సు ఒక వైపుకు ఒరిగి పెద్ద శ బ్దం వచ్చింది. విద్యార్థులందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో కల్లూరు గ్రామానికి చెందిన తేజేష్, ఉదయ్‌కుమార్, భరత్, బాలాజీ, నాని, గురుప్రసాద్ అనే విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. కొందరైతే భయంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఈ విషయం విద్యార్థుల తల్లి దండ్రులకు తెలియడంతో వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ పిల్లలను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. గాయ పడిన విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లారు. బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది విద్యార్థులకు ప్రమాదం తప్పింది. వీరిని మరో బస్సులో పాఠశాలకు తరలించారు. కాగా 25-30 మాత్రమే ప్రయాణించాల్సిన మినీ బస్సులో 60-70 మందిని పాఠశాలకు తరలిస్తున్నట్లు కల్లూరు గ్రామస్తులు అంటున్నారు. అంతేగాక స్కూల్ యాజమాన్యం బస్సు కండీషన్ పట్ల జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా రవాణాశాఖ అధికారులు స్కూల్ బస్సులపై నిఘా పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.