పార్లమెంటులో రోడ్డు రవాణా భద్రత-2014 బిల్లు
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి అడ్డుకునేందుకు ఢిల్లీకి వెళుతున్న
రవాణా శాఖ ఉద్యోగులు రేపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా
గుడివాడ అర్బన్ : ‘రోడ్డు రవాణ భద్రత-2014’ బిల్లుతోకేంద్ర ప్రభుత్వం రవాణశాఖపై ప్రై‘వేటు’ను వేయనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్న శాఖల్లో నాలుగో స్థానంలో ఉన్న రోడ్డు రవాణాశాఖ నడ్డివిరిచే బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. దీనిపై తీవ్ర ఆందోళన చెందుతున్న రవాణా శాఖ ఉద్యోగులు శనివారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. సోమవారం ఉదయం జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించి... అదే రోజు పార్లమెంట్‌ను ముట్టడించి బిల్లును అడ్డుకుంటామని చెబుతున్నారు. రవాణాశాఖలో ప్రస్తుతం ఉన్న నిబంధనలకు మరింత పదును పెడుతూ కొన్ని కీలక శాఖల్లో సేవలను ప్రైవేటు పరం చేసేలా కేంద్రం ముసాయిదా బిల్లును ఇప్పటికే ప్రకటించింది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ పేరుతో కొద్ది నెలల కిత్రం దీనికి సంబంధించిన 530పేజీల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ‘రోడ్డు రవాణ భద్రత-2014’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేయడంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందా అని రవాణశాఖ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి...
కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను మార్చి డ్రైవింగ్ లెసైన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ వంటి కీలక విభాగాలను ప్రైవేటీకరించనున్నారు. మొత్తం రవాణాశాఖ ద్వారా రాష్ర్టంలో ఏటా రూ.2,500కోట్ల ఆదాయం వస్తోంది. ప్రైవేటీకరణ చేస్తే ఆదాయం ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్లి ఆదాయానికి గండి పడే ప్రమాదం ఉంది.
బిల్లులో కొన్ని కీలక అంశాలివే...
కేంద్రం ప్రతిపాదించే బిల్లు పార్లమెంటులో ఆమోదిస్తే కొన్ని సేవలు ప్రైవేటు పరం కావడంతోపాటు నిబంధనలు కఠినతరమవుతాయి. హెల్మెట్ లేకుండా మోటార్‌సైకిల్‌ను నడిపితే ప్రస్తుతం రూ.500వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. బిల్లు ఆమోదిస్తే హెల్మెట్ లేకుండా వాహ నం నడిపితే రూ.5వేలు అపరాధ రుసుం వసూలు చేస్తారు. -వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే రూ.25వేలు జరిమాన విధిస్తారు.
దురదృష్టవశాత్తు ఎవరైనా వాహనం కింద పడి మరణిస్తే దానికి బాధ్యులైన వ్యక్తికి రూ.లక్ష అపరాధ రుసుం, నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు.
► ప్రమాదంలో చిన్న పిల్లలు మరణిస్తే బాధ్యులకు రూ.3లక్షలు జరిమానా, 7ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు.
► ట్రాఫిక్ సిగ్నిల్ అధిగమిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తారు.
► డ్రైవింగ్ లెసైన్స్‌ను ప్రతి మూడేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించాలి. రెన్యువల్ సమయంలో మెడికల్ ఫిట్‌నెస్‌తో పాటుగా మరోమారు వాహనాన్ని ట్రైల్ వేయాల్సి ఉంటుంది.
బిల్లును అడ్డుకుంటాం....
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదిస్తే ప్రజలు ప్రభుత్వ సేవలను కోల్పోతారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. రాష్ట్ర కేబినెట్‌లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించి బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ ప్రకటించాలి. బిల్లుకు నిరసనగా సోమవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నా అనంతరం పార్లమెంట్‌కు చేరుకుని బిల్లును అడ్డుకుంటాం.
డి.శ్రీనివాస్, ఉద్యోగ సంఘంనేత
రవాణా శాఖపై ప్రైవేటు
Published Sun, Nov 23 2014 1:08 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement
Advertisement