
మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2024 నవంబర్ 17 నుంచి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. ‘మీలో ఎవరైనా విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని డిక్లేర్ చేశారా లేదా. ఒకవేళ చేయకపోతే వెంటనే చేయండి‘ అనేది దీని సారాంశం. సాధారణంగా ఐటీఆర్‌లు దాఖలు చేసినప్పుడు, ప్రతి అస్సెస్సీ ముఖ్యంగా రెసిడెంట్ స్టేటస్ గల వారు తమ ఆదాయాన్ని .. అంటే మనదేశంలో వచ్చిన ఆదాయంతో పాటు విదేశాల్లో వచ్చినదాన్ని కూడా చూపించాలి.
నాన్ రెసిడెంట్లు కేవలం మన దేశంలో వచ్చిన ఆదాయాన్ని చూపిస్తే చాలు. విదేశాల్లోని ఆస్తులు, ఆదాయాలు డిక్లేర్ చేయక్కర్లేదు. పన్ను భారమనేది అస్సెస్సీ రెసిడెన్షియల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు భారత్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉన్న వ్యవధి 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే రెసిడెంట్ అవుతారు. లేకపోతే నాన్ రెసిడెంట్లవుతారు. ఈ వ్యవధిని లెక్కించడానికి పాస్‌పోర్ట్‌లోని పద్దులు, ఎంట్రీలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వాటి ప్రకారం రోజులను లెక్కిస్తారు.
సాధారణంగా మనందరం రెసిడెంట్లు అవుతాం. పిల్లలు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండటం వల్ల వారు నాన్ రెసిడెంట్లు అవుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టేటస్‌ను తప్పుగా పేర్కొనకూడదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు, అవగాహన కల్పించేందుకు, విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తప్పులుంటే/తప్పులు జరిగితే సరిదిద్దుకోండి. మీ రిటర్నును రివైజ్ చేసుకోండి .. అని చెప్పారు. దీనిపై మెసేజీలు పంపారు. ఇవి రాగానే అందరూ ఉలిక్కిపడ్డారు.
వెంటనే తమ స్టేటస్‌ని, ఆదాయాన్ని, ఆస్తుల వివరాలను చెక్ చేసుకున్నారు. 30,161 మంది అస్సెస్సీలు తమ తప్పులను సరి చేసుకున్నారు. వారి వారి ఆస్తులను (విదేశాల్లోనివి) డిక్లేర్ చేశారు. వీరిలో 24,678 మంది రివ్యూ చేసుకున్నారు. 5,483 మంది తమ రిటర్నులను రివైజ్ చేసుకున్నారు. దీనితో రూ. 29,208 కోట్ల విదేశీ ఆస్తులు అదనంగా ఉన్నట్లు బైటపడింది. వాటి ద్వారా అదనంగా రూ. 1,089 కోట్ల ఆదాయం బైటికొచ్చింది.
అంతే కాకుండా 6,734 మంది వారి స్టేటస్‌ను రెసిడెంటు నుంచి నాన్ రెసిడెంటుగా మార్చుకున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల ఎన్నో మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అవగాహన, పారదర్శకత పెరుగుతోంది. నిబంధనలను పాటించడం (కాంప్లయెన్స్) పెరిగింది. కీలక వివరాలు తెలిశాయి. పన్నుల వసూళ్లు పెరిగాయి.
కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (సీఆర్‌ఎస్) ద్వారా విదేశాల్లోని పన్ను అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అన్ని దేశాల నుంచి సమగ్రమైన సమాచారం వస్తోంది. అంతే కాకుండా విదేశీ ఖాతాల నుంచి సమాచారం వస్తోంది. పలు చోట్ల సెమినార్లు, వెబినార్లు నిర్వహించారు. కరపత్రాలు, బ్రోచర్లు పంచారు. సోషల్ మీడియా వాడుకున్నారు. ఇదంతా ఇప్పటివరకు స్నేహపూర్వకంగా జరుగుతోంది. ఇలాగే కొనసాగాలంటే, ‘వాళ్లు మన గురించి తెలుసుకుంటున్నారన్న విషయాన్ని‘ మనం అర్థం చేసుకుని మసలుకోవాలి.

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment