
Photo Courtesy: BCCI/IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ టాప్ పెర్ఫార్మర్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్ బెంగళూరు కీలక ఆటగాడైన కోహ్లీ ఐపీఎల్‌లో టాప్ పెర్ఫార్మర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతని ఆట, పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు కోహ్లీకి అత్యధిక ధర (కాంట్రాక్ట్ ఫీజు) చెల్లించి నిలుపుకొంది.
ఈసారి రూ.21 కోట్లు
ఈ ఏడాది ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఆన్‌టైన్ టాక్స్ అండ్ బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ టాక్సాలజీ ఇండియా డేటా ప్రకారం.. 2008 నుండి 2010 వరకు విరాట్ కోహ్లీ పలికిన ధర కేవలం రూ .12 లక్షలు మాత్రమే. తన ఆకట్టుకునే ఆట, ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ కారణంగా 2025లో రూ .21 కోట్లకు పెరిగింది.
2010 తర్వాత 2011-13 మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ధర రూ.8.28 కోట్లకు పెరిగింది. 2014 నుంచి 2017 వరకు రూ.12.5 కోట్లు, 2018 నుంచి 2021 వరకు రూ.17 కోట్లు. అయితే 2022 నుంచి 2024 వరకు ఆయన ధర రూ.15 కోట్లకు పడిపోగా, ఇప్పుడు 40 శాతం పెరిగి రూ.21 కోట్లకు చేరుకుందని టాక్సాలజీ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ ద్వారా విరాట్ కోహ్లీ రూ.179.70 కోట్లు అందుకున్నాడు.
కట్టాల్సిన పన్ను ఎంత?
2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ కోసం విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ పేమెంట్ రూ .21 కోట్లకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కోహ్లీ ఆర్సీబీ ఉద్యోగి కాదు కానీ ఐపీఎల్ కాంట్రాక్ట్ ఫీజు అందుకుంటున్నాడు కాబట్టి, ఈ ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28 కింద "వ్యాపారం లేదా వృత్తి నుండి వచ్చే ఆదాయం" గా వర్గీకరిస్తారు.
పన్ను లెక్కింపు
రూ.5 కోట్లకు పైగా సంపాదిస్తున్న వ్యక్తిగా విరాట్ కోహ్లీ అత్యధిక ఆదాయపు పన్ను శ్లాబ్ పరిధిలోకి వస్తాడు. అతను కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నాడనుకుంటే (ఇది అధిక ఆదాయం సంపాదించేవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది) సంపాదనపై 30% పన్ను వర్తిస్తుంది.
సంపాదన రూ.21 కోట్లపై 30% పన్ను అంటే రూ.6.3 కోట్లు అవుతుంది. ఆదాయం రూ.5 కోట్లకు పైగా ఉంటే పన్ను మొత్తంపై 25 శాతం సర్ఛార్జ్ అదనంగా ఉంటుంది. అలా రూ.6.3 కోట్లపై ఇది రూ.1.575 కోట్లు అవుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ (ట్యాక్స్ + సర్ఛార్జ్‌పై 4%) రూ.0.315 కోట్లు. ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.8.19 కోట్లు అవుతుందన్న మాట. అంటే పన్ను కింద పోయేది తీసేయగా విరాట్ కోహ్లీ అందుకునేది రూ.12.81 కోట్లు.
ఒకవేళ వ్యాపార ఖర్చులు (ఏజెంట్ ఫీజులు, ఫిట్ నెస్ ఖర్చులు, బ్రాండ్ మేనేజ్ మెంట్ వంటివి) ఉంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ముందు సెక్షన్ 37(1) కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతర ఆదాయ మార్గాలు (ఎండార్స్ మెంట్లు, పెట్టుబడులు మొదలైనవి) కూడా విడిగా పన్ను విధించబడతాయి.
Comments
Please login to add a commentAdd a comment