Foreign
-
అంతర్జాతీయ పరిణామాలే కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచిగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. వివరాలు చూద్దాం.న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ క్యూ2 ఫలితాలు దాదాపు ముగియనున్నాయి. దీంతో ఇకపై ఇన్వెస్టర్లు విదేశీ మార్కెట్లు, పెట్టుబడులు, గణాంకాలవైపు దృష్టి సారించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. బుధవారం(20న) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. 288మంది సభ్యుల మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు పారీ్టలు ఎన్నికలలో పోటీ పడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్ ఎఫెక్ట్ కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. గత వారాంతాన ఒక దశలో 106.66ను తాకింది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. గురువారం(14న) రూపాయి సరికొత్త కనిష్టం 84.41 వద్ద ముగిసింది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. గత వారం చివర్లో 4.5 శాతానికి చేరాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. రియల్టీ రంగానికి వెసులుబాటు కల్పించింది. 5.3 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్టీగేజ్ రుణ వ్యయాలుసహా.. డౌన్ పేమెంట్‌ను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివెళుతున్నాయి. ఈ వారం జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. యూఎస్ నిరుద్యోగిత, తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. 10 శాతం దిద్దుబాటు.. గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలా పడ్డాయి. సెన్సెక్స్ 1,906 పాయింట్లు కోల్పోయి 77,580 వద్ద ముగిసింది. వెరసి రికార్డ్ గరిష్టం(86,000స్థాయి) నుంచి 8,395 పాయింట్లు(10 శాతం) పడిపోయింది. ఇక గత వారం నిఫ్టీ సైతం 616 పాయింట్లు క్షీణించి 23,533 వద్ద స్థిరపడింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టం(26,277) నుంచి 2,745 పాయింట్లు పతనమైంది.వర్ధమాన మార్కెట్లకు దెబ్బయూఎస్ బాండ్ల ఈల్డ్స్, డాలరు బలపడటంతో వర్ధమాన మార్కెట్లపై ప్రభావం పడుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. క్యూ2 ఫలితాల సీజన్ ముగియడంతో ఇకపై మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల తీరు ఆధారంగా కదలవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ట్రేడర్లు ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌ను అనుసరించే వీలున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేశారు.అమ్మకాల బాటలోనే...దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. యూఎస్ డాలర్‌తోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలిమి, చైనా ప్యాకేజీలు, దేశీ మార్కెట్ల గరిష్ట విలువల కారణంగా అమ్మకాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గత నెల(అక్టోబర్)లో కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఈ స్థాయిలో రూ. 61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే ఈ ఏడాది సెపె్టంబర్లో 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానా
పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కొత్త వార్నింగ్ ఇచ్చింది. విదేశీ ఆస్తులు లేదా విదేశాల నుండి సంపాదించిన ఆదాయాన్ని తమ ఐటీఆర్‌లో బహిర్గతం చేయడంలో విఫలమైతే రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్యాక్స్ పేయర్స్‌ను హెచ్చరిస్తూ అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించింది.పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో అసెస్మెంట్ ఇయర్ 2024-25కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నివేదించేలా చూడటమే లక్ష్యంగా ఈ "కంప్లయన్స్-కమ్-అవేర్నెస్ క్యాంపెయిన్"ను ఐటీ శాఖ చేపట్టింది. ఉల్లంఘించినవారికి బ్లాక్ మనీ నిరోధక చట్టం కింద జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.విదేశీ ఆస్తి అంటే ఏమిటి?ఐటి శాఖ అడ్వైజరీ ప్రకారం.. భారతీయ నివాసితులకు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, నగదు రూప బీమా ఒప్పందాలు, ఏదైనా సంస్థ లేదా వ్యాపారంపై ఆదాయం, స్థిరాస్తి, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీలు, ట్రస్టీలుగా ఉండే ట్రస్ట్‌లు, సెటిలర్ ప్రయోజనాలు, మూలధన ఆస్తి వంటి వాటిని విదేశీ ఆస్తిగా పరిగణిస్తారు. -
Foreign Students: వుయ్ ఆర్ విదేశీ
భాగ్యనగరం.. రోజూ వేలాది మంది నగరానికి వస్తుంటారు. వారందరికీ హైదరాబాద్ పట్నం.. ఓ కల్పతరువులా మారుతోంది. ఎవరు వచి్చనా అందరినీ ఆదుకుంటుంది.. ఆదరిస్తుంటుంది. ఇలా రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, వేరే రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు. వారందరినీ హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది.. వ్యాపారం, పర్యాటకం కోసమే కాకుండా పై చదువుల కోసం కూడా ఇక్కడికి వస్తున్నారు. వీరందరినీ అమ్మలా ఆదరిస్తోంది భాగ్యనగరం.. వారంతా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాషపై ఎంతో మక్కువ చూపిస్తున్నారు. మన సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఇక్కడి వారితో స్నేహం చేస్తూ.. కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. వేర్వేరు దేశాల నుంచి.. వేర్వేరు సంస్కృతుల నుంచి తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎల్లలు దాటి ఇక్కడికి వచ్చిన కొందరు విదేశీ విద్యార్థుల మనోగతం తెలుసుకుందాం.. దేశం కాని, దేశం.. భాష కాని భాష.. అనుకోకుండా కొందరు.. ఇష్టంతో కొందరు ఇలా ఎంతో మంది భాగ్యనగరం గడ్డపై అడుగుపెట్టారు. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త ఆహారం ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయం.. అనుమానం.. వాటన్నింటినీ భాగ్యనగరం ప్రజలు, వాతావరణం పటాపంచలు చేశాయి. కొత్త, వింత అనుకున్న సంస్కృతి, సంప్రదాయమే ఇప్పుడు వారికి ఎంతో ఇష్టంగా మారిపోయింది. ఈ సంస్కృతిలో భాగమవుతున్నారు. ఎలాంటి భయం లేకుండా మాతృభూమిపై ఉన్నట్టుగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. తెలుగుతో పాటు ఉర్దూ భాషలపై మమకారం పెంచుకుని వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మురిసిపోతున్నారు. ఎంతోమంది స్నేహితులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీల్లో విదేశీ విద్యార్థులకు డిగ్రీ, పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు వేలాది మంది ఇక్కడికి వచ్చి కాలేజీల్లో చేరుతున్నారు. నిజాం కాలేజీలోనే దాదాపు 300 మంది విద్యార్థులు ఏటా వస్తున్నారని చెబుతున్నారు. ఇక, వేరే కాలేజీలు, యూనివర్సిటీలు కలిపి 2 వేలకు పైగా విద్యార్థులు ఏటా వస్తున్నారు. నిబద్ధతతో నేర్చుకుంటారు.. ఇక్కడికి వచ్చే విదేశీ విద్యార్థులు పాఠాలను ఎంతో నిబద్ధతతో నేర్చుకుంటారు. ఏటా వందలాది మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ చదువుకుని వెళ్లిన వారు వారి బంధువులకు కూడా ఈ కాలేజీ గురించి చెప్పి ఇక్కడికి పంపిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారు మంచి ఉద్యోగాలు సాధించామని ఫోన్ చేసి చెబుతుంటారు. ఇక్కడి పిల్లలతో కలిసిపోతుంటారు. విదేశీ విద్యార్థులకు కాలేజీలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా మేం చూసుకుంటాం. – ప్రొ.మహ్మద్ అబ్దుల్ అలీ, విదేశీ విద్యార్థలు కో–ఆర్డినేటర్, నిజాం కాలేజీ ఫీజులు కాస్త తక్కువ.. తమ దేశాలతో పోలిస్తే ఇక్కడ ఫీజులు కాస్త తక్కువగా ఉండటమే కాకుండా, చదువు కూడా క్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. సుడాన్, తుర్కెమెనిస్తాన్, యెమెన్, సోమాలియా వంటి దేశాల నుంచి ఎక్కువగా వస్తుంటారని నిజాం కాలేజీ విదేశీ విద్యార్థుల కో–ఆర్డినేటర్ మహ్మద్ అబ్దుల్ అలీ తెలిపారు. స్థానిక విద్యార్థులు కూడా విదేశీ విద్యార్థులతో కలివిడిగా ఉంటూ, వారికి ఏ అవసరం ఉన్నా కూడా సాయపడుతున్నారు. భాష సమస్య ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఉంటామని, ఇంగ్లి‹Ùలో కమ్యూనికేట్ అవుతుంటామని నిజాం కాలేజీలోని పలువురు విదేశీ విద్యార్థులు పేర్కొన్నారు. తమకు ఇక్కడి వారు చాలా మంది స్నేహితులు ఉన్నారని, సెలవులు ఉన్నప్పుడు వారితో హైదరాబాద్‌లోని సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లి వస్తుంటామని వివరించారు.సంస్కృతి చాలా ఇష్టం..హైదరాబాద్ సంస్కృతి అంటే చాలా ఇష్టం. మట్టిగాజులు, మెహందీ మా దేశంలో ఎవరూ వేసుకోరు. కానీ నాకు వాటిపై ఎంతో ఇష్టం పెరిగింది. అందుకే ఎప్పుడూ మెహందీ పెట్టుకుంటాను. గాజులు వేసుకుంటాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి ఫ్రెండ్స్‌ను అప్పుడప్పుడూ అడిగి తెలుసుకుంటాను. భారత్‌కు ముఖ్యంగా హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది. – దుర్సుంజెమల్ ఇమ్రుజకోవా, బీఏ ఫస్ట్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్సొంతూర్లో ఉన్నట్టే.. ఇక్కడ చదువుకున్న ఓ బంధువు నిజాం కాలేజీ గురించి చెబితే ఇక్కడ చేరాను. మొదట్లో ఇక్కడి వాతావరణం, ఆహరంతో కాస్త ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు అలవాటైంది. స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటాం. మా వంట మేమే చేసుకుంటాం. అప్పుడప్పుడూ ఇక్కడి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి.. హైదరాబాద్ రుచులను ఆస్వాదిస్తుంటాం. చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రదేశాలకు చాలాసార్లు వెళ్లాం. – మహ్రీ అమన్దుర్దీయువా, బీఏ థర్డ్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్చాలా సంతోషంగా ఉంది.. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. ఇక్కడి వారితో పాటు మా దేశం నుంచి వచి్చన ఫ్రెండ్స్‌తో టైం పాస్ చేస్తుంటాం. ఇక్కడి ఫుడ్, కల్చర్ చాలా నచి్చంది. – అనస్, బీఏ ఫస్ట్ ఇయర్, సూడాన్ -
ఇలా చేస్తే భారీగా విదేశీ పర్యాటకులు
న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులను భారీగా ఆకర్షించేందుకు, పర్యాటక రంగం వృద్ధికి వీలుగా బుకింగ్ డాట్ కామ్ కీలక సూచనలు చేసింది. అంతర్జాతీయంగా మరిన్ని ప్రాంతాల నుంచి డైరెక్ట్ విమాన సరీ్వసులను అందుబాటులోకి తీసుకురావడం, వీసా ప్రక్రియలను సులభతరం చేయడం, భారత్‌లోని విభిన్న, విస్తృతమైన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయాలని సూచించింది. వివిధ భాగస్వాముల నుంచి సమిష్టి చర్యలకు తోడు నిర్దేశిత పెట్టుబడులతో భారత పర్యాటకం కొత్త శిఖరాలకు వెళుతుందని పేర్కొంది. రానున్న ఏడాది, రెండేళ్లలో భారత్‌ను సందర్శించాలని అనుకుంటున్న వయోజనుల అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుని బుకింగ్ డాట్ కామ్ ఒక నివేదిక విడుదల చేసింది. 19 దేశాలకు చెందిన 2,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుంది. భారత్‌కు రావాలనుకుంటే, ఎదుర్కొనే సవాళ్లు, ప్రోత్సాహకాలు, ప్రాధాన్యతలు ఏంటని ప్రశ్నించి, వారి అభిప్రాయాలు రాబట్టింది. విదేశీ పర్యాటకుల్లో సగం మంది కేవలం భారత్‌ను చూసి వెళ్లేందుకే వస్తున్నారు. మూడింట ఒక వంతు భారత్‌తోపాటు, ఆసియాలో ని మరికొన్ని దేశాలకూ వెళ్లేలా ట్రావెల్ ప్లాన్‌తో వస్తున్నారు. యూఎస్, యూకే, జర్మనీ, యూఏఈ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. సంప్రదాయంగా చైనా, కెనడా, బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చేవారు. భారత్‌కు వస్తున్న విదేశీ పర్యాటకులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఆ్రస్టేలియా, ఇటలీ, నెదర్లాండ్స్ తాజాగా చేరాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, జైపూర్ విదేశీ పర్యాటకులు సందర్శించే వాటిల్లో టాప్–5 ఎంపికలుగా ఉంటున్నాయి. హంపి, లేహ్‌కు ఆదరణ పెరుగుతోంది. పతి్నటాప్, పెహల్గామ్, మడికెరి, విజయవాడ, ఖజురహో ప్రాంతాలను సైతం సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. -
లాంగ్వేజ్ ఫర్ ఎర్న్.. విదేశీ భాష.. విజయాలు లెస్స
కొత్త భాషలు నేర్చుకోవడం కొన్నేళ్ల క్రితం వరకూ కేవలం హాబీగా భావించేవారు. అయితే, ప్రపంచీకరణతో విదేశీ భాషా నైపుణ్యం ఆదాయమార్గంగా కూడా అవతరించింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా నగరవాసుల్లోనూ విదేశీ భాషలపై ఆసక్తి పెరుగుతోంది. సంపాదన కోసమో, మరేదైనా లక్ష్యాలతోనో సీరియస్‌గా ఫారిన్ లాంగ్వేజెస్‌కు జై కొడుతున్నారు. ప్రస్తుతం ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ చైనీస్ అరబిక్ వంటి అనేక విదేశీ భాషలు బాగా డిమాండ్‌లో ఉన్నాయి. ఇటీవలే కొరియన్ వెబ్‌సిరీస్, మ్యూజిక్కూ పెరిగిన ఆదరణ కొరియన్ భాషా పరిజ్ఞానంపై యువత ఆసక్తిని పెంచింది. విదేశీ భాషని అధ్యయనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన రెస్యూమ్‌ను బలోపేతం చేయడంతో పాటు పర్యాటక రంగంలో, గైడ్స్‌గా ఇతరత్రా రంగాల్లో రాణించడానికి, ట్రావెల్, బ్లాగులను తయారు చేయడం తదితర ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రపంచం నలుమూలలకూ కమ్యూనికేట్ చేయగలిగేలా చేస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయలో ప్రవేశాలకు కూడా ఉపయుక్తం అవుతున్నాయి.. ప్రస్తుతం వర్క్ కల్చర్, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంతో విదేశీ భాషా నైపుణ్యాలతో ఫ్రీలాన్సర్‌గా అవకాశాలు పెరిగాయి. ఓటీటీ తదితర వేదికల విజృంభణతో అనువాదకులకు భారీగా డిమాండ్ పెరగడం కూడా విదేశీ భాషలను క్రేజీగా మార్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు దేశ విదేశాలలో రాయబార కార్యాలయాలు, హై–కమిషన్లలో విదేశీ భాషా ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీలైన కోర్సులకు డిమాండ్ సంతరించుకుంటున్నాయి. ఫ్రెంచ్ పట్ల ఆసక్తి.. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పైగా మాట్లాడే ఫ్రెంచ్ అత్యధికంగా మాట్లాడే భాషగా ఆరో స్థానంలో ఉంది. ఇది ఫ్రాన్స్, కెనడాతో సహా 29 దేశాల్లో అధికారిక భాష. ఫ్యాషన్, హాస్పిటాలిటీ, టూరిజంలో కెరీర్‌కు ఉపకరించే ఫ్రెంచ్ నేర్చుకోవడానికి విశ్వవ్యాప్తంగా విలువైన భాష. శిక్షణా తరగతులు..ఈ నేపథ్యంలో విదేశీ భాష నేర్చుకోవడంలో సహాయపడే అనేక అకాడమీలు, సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి. ఆయా భాషల కోర్సు వ్యవధి సాధారణంగా ఆరు నుంచి 12 నెలల్లో పూర్తి చేసి ప్రొఫెషనల్ డిగ్రీని అందుకుంటారు. అయితే అనర్గళంగా మాట్లాడడం, చదవడం, రాయడం అర్థం చేసుకోవడంపై పూర్తి పట్టు సాధించేందుకు మరింత వ్య«వధి అవసరం అవుతుందని శిక్షకులు అంటున్నారు. ఇవి కాకుండా ఒక విద్యార్థి ఆ భాష చరిత్ర, భాష సంస్కృతి సంబంధిత దేశాల ప్రజలు, అర్థం చేసుకునే పద్దతి, ఆ భాష యాస, డిక్షన్ గురించి కూడా నేర్చుకుంటేనే పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత సరి్టఫికెట్ డిప్లొమా స్థాయి కోర్సు లేదా పన్నెండో తరగతి పూర్తి చేసిన తర్వాత విదేశీ భాషలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసించవచ్చు. నగరంలో ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ, హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు వంటివి విదేశీ భాషల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అలాగే పలు ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విదేశీ భాషా కోర్సులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. స్పాని‹Ù.. జోష్.. దాదాపు 50 కోట్ల మందికి పైగా మాట్లాడే వారితో స్పానిష్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషలలో రెండో స్థానంలో ఉంది. స్పానిష్ మాట్లాడే దేశాలతో మన దేశానికి ఇటీవల పెరుగుతున్న వాణిజ్యం దృష్ట్యా నేర్చుకోవడానికి అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి అంతర్జాతీయ వ్యాపారం, ఆతిథ్యం పర్యాటక రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఇది బెస్ట్. విన్.. జపాన్.. సాంకేతిక హబ్ హోదా, భారతదేశంతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన జపాన్ జపనీస్ అత్యధికులు కోరుకునే భాషగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా మాట్లాడే ఈ భాష సాంకేతికత, యానిమేషన్, గేమింగ్‌లో కెరీర్‌ను ఎంచుకున్న సిటీ యూత్ ఎంపికగా మారింది.జర్మన్‌కు జై.. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా, యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే భాష జర్మన్. జర్మన్ నేర్చుకోవడం ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో విభిన్న అవకాశాలకు తలుపులు తెరుస్తోంది.ఇదీ..ఇటాలియన్.. యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే నాల్గో భాష ఇది. పర్యాటక కేంద్రంగా మరియు ఫ్యాషన్ మరియు డిజైన్‌కు కేంద్రంగా ఇటలీకి ఉన్న ప్రాచుర్యంతో ఫ్యాషన్, డిజైన్, హాస్పిటాలిటీలో కెరీర్‌ను లక్ష్యంగా చేసుకున్న సిటీ విద్యార్థులకు రైట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. మాండరిన్.. మంచిదే.. మనదేశపు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనాను దృష్టిలో ఉంచుకుంటే.. అంతర్జాతీయ వ్యాపారం, దౌత్యం పర్యాటక రంగం కోసం మాండరిన్ నేర్చుకోవడం అవసరంగా మారింది. కో అంటే కొరియన్.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మందికి పైగా మాట్లాడే కొరియన్‌కు నగరంలో బాగా డిమాండ్ ఉంది. ఆసియాలో మనదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కొరియా కావడం సాంకేతిక, వినోద పర్యాటక రంగాల్లో ఈ భాషా నైపుణ్యానికి డిమాండ్ పెంచుతోంది.గ్రేస్.. పోర్చుగీస్.. బ్రెజిల్ పోర్చుగల్‌తో సహా ఎనిమిది దేశాల్లో మాట్లాడేది పోర్చుగీస్. ఈ దేశాలతో మనకు విస్తరిస్తున్న సంబంధాల కారణంగా పోర్చుగీస్ భాషలో ప్రావీణ్యం అనేది భవిష్యత్తు విజయాలకు బాట వేస్తుంది.పలు భాషల్లో ప్రావీణ్యం కోసం.. విదేశీ భాషా పరిజ్ఞానం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో ప్రయోజనాలను యువత ఆశిస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందలకు చేరింది. కెనడాలో ఉండే భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా మాకు స్టూడెంట్స్‌గా ఉన్నారు. నేర్చుకోవడం అనేది ఇలా సులభంగా మారడం కూడా విదేశీ భాషల పట్ల ఆసక్తిని పెంచుతోంది. – ఎం.వినయ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్రెంచ్ భాషా విభాగం, ఉస్మానియా వర్సిటీ -
రండి.. తిని తరించండి
ప్రజల్లో విభిన్న ఆహారపు అలవాట్లపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచ పర్యాటకం కొత్త రుచులను అన్వేషిస్తోంది. ఫలితంగా భారతదేశంలో పాకశాస్త్ర సంస్కృతిని ఆస్వాదించే పర్యాటకం (గ్యాస్ట్రోనమీ టూరిజం) ఊపందుకుంటోంది. విదేశీ పర్యాటకులు భారత పాకశాస్త్ర సంస్కృతి, కొత్త వంటకాల తయారీపై మక్కువతో మన దేశానికి క్యూ కడుతున్నారు. 2023లో విదేశీ పర్యాటకుల రాకపోకలు 15.6 శాతం పెరిగాయి. ఈ పర్యాటకులలో అత్యధికులు తమ ప్రయాణంలో భాగంగా పాకశాస్త్ర అనుభవాలను కోరుకుంటారు. దేశంలోని సుసంపన్నమైన అహారం, వంటల సంప్రదాయాలు, విభిన్న ప్రాంతీయ వంటకాలు, ప్రామాణికమైన ఆహార అనుభవాలపై విదేశీ పర్యాటకులు ఆసక్తి పెంచుకుంటున్నారు. – సాక్షి, అమరావతిపాకశాస్త్ర పర్యాటకంలో టర్కీదే అగ్రస్థానంప్రపంచవ్యాప్తంగా గ్యాస్ట్రోనమీ పర్యాటకులను ఆకట్టుకోవడం, సరికొత్త అనుభూతులను అందించడంలో టర్కీ ముందంజలో ఉంది. గతేడాది రూ.1.52 లక్షల కోట్లుగా నమోదైన అక్కడి పాకశాస్త పర్యాటక మార్కెట్ నుంచి 2025 నాటికి రూ.2.10 లక్షల కోట్లకు విస్తరిస్తుందని అక్కడి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్కడ దేశవ్యాప్తంగా 2,200 కంటే ఎక్కువ స్థానిక ఆహార, పానీయాల వెరైటీలున్నాయి. ముఖ్యంగా గాజియాంటెప్, అదావా, హటే, ఇజ్మీర్ వంటి నగరాల్లో గ్యాస్ట్రోనమీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే 41 రకాల విభిన్న ఆహార పదార్థాల తయారీ విధానంపై ప్రత్యేక కోర్సుల, శిక్షణను అందిస్తోంది. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 16 శిక్షణ కేంద్రాలున్నాయి.స్థానిక ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించడానికి టర్కీ ఏకంగా 34 గ్యాస్ట్రోనమీ మ్యూజియాలను ఏర్పాటు చేయడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా 360 కంటే ఎక్కువ గ్యాస్ట్రోనమీ పండుగలను చేపడుతూ దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అందుకే గాజియాంటెప్ను ‘సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’గా యునెస్కో గుర్తించింది. మసాలా వంటకాల నుంచి మొఘలాయ్ వరకు.. దక్షిణాదిలోని మసాలా కూరల నుంచి ఉత్తరాదిలోని మొఘలాయ్ వంటకాల వరకు భారతీయ హోటళ్లు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. దీనికితోడు వీధుల్లో అమ్మే ఆహారాలు (స్ట్రీట్ ఫుడ్) సైతం అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాలు గ్యాస్ట్రోనమీకి అడ్డాలుగా మారాయి. ఈశాన్య భారతదేశం అత్యంత స్థిరంగా అభివృద్ధి చెందుతున్న పాకశాస్త్ర గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది. ఆ తర్వాత చెట్టినాడ్ విభిన్న ఆహార రుచులను అందిస్తోంది. ఇక గోవా కేవలం స్థానిక వంటకాలకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ వంటకాలను కూడా ప్రవేశపెడుతోంది. వీధి వంటకాల్లో లక్నోలో లభించే నెహారీ కుల్చా, షీర్మల్, మలై మఖాన్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అమృత్‌సర్‌లో లభించే చోలే–కుల్చే, జిలేబీ, గులాబ్ జామూన్, పొడవాటి గ్లాసుల్లో ఇచ్చే లస్సీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఆహారోత్సవాలతో ఆకర్షణవివిధ నగరాల్లో అనేక సంస్థల భాగస్వామ్యంతో ఆహారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో నార్త్–ఈస్ట్ స్లో ఫుడ్ అండ్ ఆగ్రో బయోడైవర్సిటీ సొసైటీ (నెస్పాస్) ఏటా నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మేఘాలయ రాష్ట్రంలోని మావ్‌లాంగ్‌లో నిర్వహించే ‘సేక్రేడ్ గ్రోవ్’ (మతపరమైన తోట చెట్ల పండుగ) ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, నోరూరించే రుచికరమైన ఆహార పదార్థాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈశాన్య భారతదేశంలోని స్థానికులు తయారుచేసి వడ్డించే వివిధ అటవీ, స్థానిక ఆహార వంటకాలను సంరక్షించేందుకు, ఆయా వంటకాలపై ప్రచారానికి ఈ ఉత్సవాలు దోహదం చేస్తున్నాయి. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తూ గ్యాస్ట్రోనమీ టూరిజానికి ఊతమిస్తున్నాయి. -
వందేభారత్ రైళ్ల కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి
న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. చిలీ, కెనడా, మలేషియా తదితర దేశాలు ‘వందే భారత్’ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ రైలు నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.ఇతర దేశాలలో ఆధునిక సౌకర్యాలు కలిగిన రైళ్ల నిర్మాణానికి రూ. 160-180 కోట్ల మధ్య ఖర్చు అవుతుంది. భారతదేశంలో నిర్మితమయ్యే వందే భారత్ రైలు వ్యయం రూ.120 నుండి రూ. 130 కోట్ల మధ్య ఉంటుంది. వందే భారత్ గంటకు 0 నుండి 100 కి.మీ. వేగాన్ని చేరుకోవడానికి కేవలం 52 సెకన్లు పడుతుంది. ఇది జపాన్ బుల్లెట్ రైలు కంటే అధికం. జపాన్ బుల్లెట్ రైలు గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి 54 సెకన్లు పడుతుంది. వందేభారత్‌ను మరింత మెరుగ్గా రూపొందించారని విదేశీ ప్రతినిధులు చెబుతున్నారు.కాగా భారతీయ రైల్వేల అభివృద్ధి గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ గడచిన 10 ఏళ్లలో 31,000 కిలోమీటర్లకు పైగా ట్రాక్‌లను జోడించామని తెలిపారు. దీన్ని 40,000 కిలోమీటర్ల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 10,000 లోకోలు, 9,600 కిలోమీటర్ల ట్రాక్‌కు టెండర్లు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇది కూడా చదవండి: ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్ -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ ఈ వారం కూడా కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ స్థూల ఆరి్థక గణాంకాలు సానుకూలంగా ఉండటం, అమెరికా ఆరి్థక మందగమనంపై ఆందోళనలు తగ్గడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరుగుతుండటం తదితర అంశాలు సూచీలను లాభాల దిశగా నడిపిస్తాయని చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ పరిణామాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చనేది నిపుణుల అభిప్రాయం.‘‘ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుతో ఇన్వెస్టర్లు ‘పతనమైన ప్రతిసారి కొనుగోలు’ వూహాన్ని అమ లు చేస్తున్నారు. వినియోగ, ఆటో, ఫై నాన్స్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మ ద్దతు లభించవచ్చు. డాలర్ విలువ బ లహీనపడటంతో ఎగుమతి ఆధారిత రంగాల ఫార్మా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ 26,000 స్థాయిని అందుకోవచ్చు. దిగువున 25,500 – 25, 450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అ ని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. అమెరికా నాలుగేళ్ల తర్వాత వడ్డీరేట్లను అంచనాలకు మించి 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రికార్డుల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. గతవారం మొత్తంగా సెన్సెక్స్ 1653 పాయింట్లు, నిఫ్టీ 434 పాయింట్లు లాభపడ్డాయి. గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ఈ గురువారం (సెపె్టంబర్ 22న) నిఫ్టీ సెపె్టంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికంగా నిఫ్టీకి 26,000 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని నిలుపుకోగలిగితే 26,100 – 26,350 శ్రేణిని పరీక్షిస్తుందని ఆప్షన్ డేటా సూచిస్తోంది.రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెపె్టంబర్ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ. 342 కోట్లు సమీకరించనుంది. ఎస్ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ షేర్లు ఒకేరోజున మంగళవారం (సెపె్టంబర్ 24న) స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ పెట్టుబడులుఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా ఈ సెపె్టంబర్లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘నాలుగేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ.., రేట్ల త గ్గింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు సంకేతాలిచి్చంది. వచ్చే ఏడా ది (2025) చివరికి ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.4 శాతా నికి పరిమితం చేసేందుకు ప్రయతి్నస్తోంది. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టడంతో భారత్‌లో పెట్టుబడులు మరింత పెరగొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయంగా హెచ్ఎస్బీసీ కాంపోజిట్ సెపె్టంబర్ తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడనున్నాయి. అమెరికా ఆగస్టు నెల తయారీ, కన్జూమర్ కాన్ఫిడెన్స్ డేటా మంగళవారం విడుదల కానుంది. బ్యాంకు ఆఫ్ జపాన్ ద్రవ్య కమిటీ సమావేశ వివరాలు(మినిట్స్), అమెరికా క్యూ2 జీడీపీ వృద్ధి డేటా గురువారం వెల్లడి కానుంది. సెప్టెంబర్ 13తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 20తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేస్తుంది. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. -
విస్తరిస్తున్న విదేశీ టూరిజం
విదేశీ పర్యటనలపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. గోవా, కేరళ వంటి పర్యాటక ప్రదేశాల్లో ఖర్చు పెరుగుతుండటంతో విదేశీ ప్రయాణాలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ‘కొన్నిసార్లు మేం దేశీయ పర్యటన కోసం రూ.20 వేలు ఖర్చు చేస్తున్నాం. కాబట్టి మరో రూ.10 వేలకుపైగా ఖర్చు చేసి విదేశాలకు ఎందుకు వెళ్లకూడదు. ఇక్కడ ఖర్చులతో పోలిస్తే విదేశాల్లో తక్కువే’ అని విజయవాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి హేమ అభిప్రాయపడ్డారు. ఆదాయ వనరుల్లో వృద్ధి, విమాన ప్రయాణాల కనెక్టివిటీ పెరగడంతో మధ్య తరగతి ప్రజలు విదేశీ పర్యటనలకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం దేశ జనాభాలోని 31శాతం మంది మధ్య తరగతి ప్రజలున్నారు. ఈ సంఖ్య 2040 నాటికి 60 శాతానికి పెరుగుతుందని అంచనా. 2050 నాటికి దేశంలో 100 కోట్ల కంటే ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలు ఉంటారని అంచనా. ఈ క్రమంలోనే 2027 నాటికి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌లను అధిగమించి ప్రపంచంలోని ఐదో అతిపెద్ద విదేశీ (అవుట్‌బౌండ్) టూరిజం మార్కెట్‌గా భారతదేశం అవతరిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అప్పటికి భారత పర్యాటకుల మార్కెట్ విలువ రూ.7.47 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2019లో రూ.3 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు మరో మూడేళ్లలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద దేశీయ పర్యాటక మార్కెట్‌గా మారుతుందని భావిస్తున్నారు. – సాక్షి, అమరావతిమధ్యప్రాచ్య దేశాల్లో మనోళ్ల సందడిభారతీయుల్ని మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల పర్యాటక రంగం విశేషంగా ఆకర్షిస్తోంది. భారతీయ పర్యాటకుల్లో దాదాపు సగం విదేశీ పర్యటనలు ఇక్కడే చేస్తున్నారు. ఆ తర్వాత ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్‌లో కొనసాగుతున్నాయి. పొరుగున ఉన్న సౌదీ అరేబియా, ఒమన్, దుబాయ్ హాలిడే మేకర్లలో అతిపెద్ద వనరుగా భారత్ మారింది. గోవా, కేరళ వంటి భారతీయ రిసార్ట్ గమ్యస్థానాల ధరలతో సమానంగానే వియత్నాం, శ్రీలంక, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి సమీప దేశాల్లో ధరలు కూడా ఉంటున్నాయని టూరిజం ఏజెన్సీలు చెబుతున్నాయి. దేశంలో తిరిగే ఖర్చుకు మరికొంత వెచ్చించగలిగితే విదేశాలకు వెళ్లవచ్చనే అభిప్రాయం భారతీయ పర్యాటకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల జపాన్ సైతం భారతీయ పర్యాటకుల కోసం కొత్తగా ఈ–వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో దుబాయ్ సైతం భారతీయ సందర్శకులను అకట్టుకునేందుకు బహుళ ప్రవేశ పర్యాటక వీసాను రూపొందించింది. దక్షిణాఫ్రికా సరళీకృత వీసాను తీసుకొస్తోంది. మలేíÙయా, కెన్యా, థాయ్‌లాండ్, ఇరాన్ సహా ఇతర దేశాలు భారతీయ పర్యాటకుల కోసం వీసా అవసరం లేని పర్యటనలు అందిస్తున్నాయి.231 శాతం పెరుగుదలఅమెరికన్లు 63 రోజులు, బ్రిటిషర్లు 90 రోజులతో పోలిస్తే భారతీయులు కేవలం 30 రోజుల ముందుగానే పర్యటనలు ప్లాన్ చేస్తున్నారు. భారతీయులకు సమీప దేశాల ప్రయాణాలకు బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది ఎక్కువ మంది వియత్నాం ప్రయాణించినట్టు గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. అక్కడ 2019తో పోలిస్తే భారతీయ సందర్శకుల సంఖ్య 231 శాతం పెరిగింది. ఇతర ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్‌లాండ్, సింగపూర్, ఇండోనేíÙయా రాకపోకల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.విదేశాలకు పెరుగుతున్న విమానాలు ఆ్రస్టేలియా, చైనా, జపాన్ వంటి ప్రధాన పోటీదారులను అధిగమించి భారతదేశం ప్రయాణ రంగంలో వేగంగా ముందంజ వేస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ వృద్ధిలో చెప్పుకోదగ్గ పురోగతితో దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. దేశీయ విమాన ట్రాఫిక్‌లో ఏటా 7.7 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ వృద్ధి రేటు చైనాలో 7.1 శాతం, జపాన్ 4 శాతం, ఆ్రస్టేలియాలో 2.6 శాతం ఉండగా.. భారత్ ఈ దేశాలను అధిగమించడం విశేషం. ఈ వృద్ధితో విమానయాన రంగంలో బ్రెజిల్, ఇండోనేíÙయాను భారత్ వెనక్కి నెట్టింది. ఏటా విమాన సీట్ల సంఖ్యలో 6.9 శాతం వార్షిక వృద్ధి రేటు కనిపిస్తోంది. యూఎన్ టూరిజం ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది త్రైమాసికంలో అంతర్జాతీయ ప్రయాణాలు ప్రీ–పాండమిక్ స్థాయిలో 97 శాతానికి చేరింది. భారతీయ విదేశీ టూరిజంలో ఉన్నంత వృద్ధి వేగం మరెక్కడా లేదు. వాస్తవానికి గత పదేళ్లలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. తాజాగా మరో 1,200కి పైగా విమానాల కోసం ఆయా సంస్థలు ఆర్డర్లు పెట్టడం విమాన ప్రయాణాల డిమాండ్‌ను సూచిస్తోంది.టమాటా పండుగకూ వెళ్లొస్తున్నారు టీవీలు, సినిమాల్లో చూపించే విదేశీ నగరాలను చూసేందుకు భారతీయుల్లో ఎక్కువమంది ప్రభావితం అవుతున్నారు. ఉదాహరణకు 2011 తర్వాత స్పెయిన్‌ను సందర్శించే భారతీయులు 40 శాతం పెరిగారు. అక్కడ జరిగే ‘లా టొమాటినా పండుగ’ ( టమాటాలు విసురుకోవడం) ‘జిందగీ నా మిలేగీ దొబారా’ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయం కావడంతో ఆ పండుగను చూసేందుకు భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
చైనా గట్టి నిర్ణయం.. విదేశాలకు ఆహ్వానం!
చైనా తమ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా గట్టి నిర్ణయం తీసుకుంది. ఉత్పాదక రంగాన్ని విదేశీ పెట్టుబడులకు పూర్తిగా తెరుస్తోంది. దీంతోపాటు ఆరోగ్య రంగంలోనూ మరింత విదేశీ మూలధనానికి అనుమతించనుంది.చైనాకు చెందిన నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తాజా ప్రకటన ప్రకారం.. తయారీ రంగంలో ఇతర దేశాల పెట్టుబడులపై మిగిలి ఉన్న పరిమితులన్నింటినీ నవంబర్ 1 నుండి చైనా తొలగించనుంది. ముద్రణ కర్మాగారాలపై చైనీస్ మెజారిటీ నియంత్రణ, చైనీస్ మూలికా మందుల ఉత్పత్తిలో పెట్టుబడిపై నిషేధం వంటివి ఇందులో ఉన్నాయి.సేవా రంగాన్ని సైతం మరింత విస్తరిస్తామని, విదేశీ పెట్టుబడుల ప్రవేశాన్ని ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం కట్టుబడి ఉందని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తెలిపింది. దీనికి సంబంధించిన విధాన రూపకల్పనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.ఆరోగ్య రంగంలోనూ..మరోవైపు చైనా తమ ఆరోగ్య సంరక్షణ రంగంలో మరన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ పలు విధానాలను ప్రకటించింది. మూలకణాలు, జన్యు నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, అనువర్తనాల్లో అప్లికేషన్లో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఒక ప్రకటన తెలిపింది. వీటిని తొలుత బీజింగ్, షాంఘై, గ్వాంగ్డాంగ్, హైనాన్ వంటి పైలట్ ఫ్రీ ట్రేడ్ జోన్లలో అనుమతించనున్నారు.దీంతోపాటు బీజింగ్, టియాంజిన్, షాంఘై, నాన్జింగ్, సుజౌ, ఫుజౌ, గ్వాంగ్జౌ, షెన్జెన్, హైనాన్ ద్వీపంలో పూర్తిగా విదేశీ యాజమాన్యంలోని ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు కూడా చైనా ప్రభుత్వం అనుమతించింది. అయితే సాంప్రదాయ చైనీస్ వైద్యాన్ని అందించే స్థానిక ఆసుపత్రులను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతి లేదు. కొత్త విధానం వెంటనే అమల్లోకి వస్తుందని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది. -
విశాఖబీచ్ : అలలతో విదేశీ సర్ఫర్లు సయ్యాట (ఫొటోలు)
-
విదేశాల్లో మేడిన్ ఇండియా టూవీలర్ల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారైన ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో 12.48 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. దేశీయంగా అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో తయారీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే విషయం. అలాగే టూవీలర్ల తయారీ విషయంలో భారత్ అనుసరిస్తున్న నాణ్యత, భద్రత ప్రమాణాలకు ఈ గణాంకాలు నిదర్శనం. 2024 జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో మోటార్‌సైకిళ్లు 13 శాతం వృద్ధితో 10,40,226 యూనిట్లు వివిధ దేశాలకు సరఫరా అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా ఏకంగా 83 శాతానికి ఎగసింది. స్కూటర్ల ఎగుమతులు 21 శాతం అధికమై 2,06,006 యూనిట్లుగా ఉంది. టూవీలర్స్ ఎగుమతుల్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, ఇండియా యమహా మోటార్, హీరో మోటోకార్ప్, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా టాప్‌లో కొనసాగుతున్నాయి. అగ్రస్థానంలో బజాజ్.. ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 5 శాతం వృద్ధితో ఏప్రిల్–జూలైలో 4,97,114 యూనిట్లు నమోదు చేసింది. ఇందులో 4,97,112 యూనిట్లు మోటార్‌సైకిళ్లు ఉండడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో 14 శాతం వృద్ధితో 3,13,453 యూనిట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ 76 శాతం దూసుకెళ్లి 1,82,542 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 28 శాతం అధికమై 79,082 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 33 శాతం ఎగసి 73,731 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 30 శాతం క్షీణించి 64,103 యూనిట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ 2 శాతం వృద్ధితో 28,278 యూనిట్లు, పియాజియో వెహికిల్స్ 56 శాతం దూసుకెళ్లి 9,673 యూనిట్ల ఎగుమతులను సాధించాయి. బైక్స్‌లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా, స్కూటర్స్‌లో హోండా, టీవీఎస్ మోటార్, ఇండియా యమహా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. -
ట్రావెల్ ఆపరేటర్లకు అనుకూలం
న్యూఢిల్లీ: దేశీ పర్యాటక రంగం జోరు మీద ఉండడంతోపాటు, విదేశీ ప్రయాణాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ఈ రంగంలో పనిచేసే ట్రావెల్ ఆపరేటర్లకు అనుకూలిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్ ఆపరేటర్ల ఆదాయం 15–17 శాతం వరకు వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. మౌలిక వసతులు మెరుగుపడుతుండడం, ఖర్చు చేసే ఆదాయం పెరుగుదల, ప్రయాణాలకు మొగ్గు చూపించే ధోరణికి తోడు.. దేశీ పర్యాటక రంగంపై పెరిగిన ప్రభుత్వ ప్రాధాన్యం ఈ రంగం వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ఈ రంగంలో 60 శాతం వాటా కలిగిన నలుగురు ప్రధాన ఆపరేటర్లను విశ్లేíÙంచిన అనంతరం క్రిసిల్ రేటింగ్స్ ఈ గణాంకాలను విడుదల చేసింది. ‘‘ట్రావెల్ ఆపరేటర్ల రుణ పరపతి సైతం ఆరోగ్యకర స్థాయిలో ఉంది. బలమైన బ్యాలన్స్ షీట్లకుతోడు గత ఆర్థిక సంవత్సరంలో మాదిరే 6.5–7 శాతం మేర స్థిరమైన మార్జిన్లు.. మెరుగైన నగదు ప్రవాహాలకు మద్దతునిస్తాయి. దీంతో ట్రావెల్ ఆపరేటర్లు రుణంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం రాదు’’అని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. మెరుగైన వసతుల కారణంగా కొత్త పర్యాటక ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు, ఆధ్యాతి్మక పర్యాటకానికి డిమాండ్ పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు తెలిపింది. ముఖ్యంగా కార్పొరేట్సమావేశాలు, సదస్సుల నుంచి డిమాండ్ పెరిగినట్టు పేర్కొంది. ఎన్నో అనుకూలతలు.. అధికంగా ఖర్చు చేసే ఆదాయం, 37 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే సదుపాయం, అడుగు పెట్టిన వెంటనే వీసా కారణంగా విదేశీ విహార యాత్రలు సైతం పెరుగుతున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఇక ఆకర్షణీయమైన ట్రావెల్ ప్యాకేజీలు, దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాలకు ఎయిర్‌లైన్స్ సంస్థలు సరీ్వసులు నడిపిస్తుండడం కూడా డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. ‘‘కరోనా తర్వాత అప్పటి వరకు ఎటూ వెళ్లలేకపోయిన వారు పెద్ద ఎత్తున ప్రయాణాలకు మొగ్గు చూపించగా, ఆ ధోరణి తగ్గిపోయి.. సాధారణ పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు, పట్టణీకరణ, అందుబాటు ధరల్లో టూర్ ప్యాకేజీలు, ఆదాయంలో స్థిరమైన వృద్ధి, ఈ రంగంపై పెరిగిన ప్రభుత్వం దృష్టి ఇవన్నీ టూర్, ట్రావెల్ రంగాన్ని స్థిరంగా నడిపిస్తాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. -
చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ
అస్తానా: కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలుసుకున్నారు. వీరు కరచాలనం చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. భారత్-చైనా మధ్య గత కొన్నేళ్లుగా సత్సంబంధాలు లేవు. ఈ నేపధ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా వాంగ్ యీని కలవడానికి ముందు జైశంకర్ ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ను కూడా కలుసుకున్నారు.ఎస్సీఓ సమ్మిట్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు వచ్చిన జైశంకర్ తజికిస్తాన్ విదేశాంగ మంత్రి సిరాజుద్దీన్ ముహ్రిద్దీన్‌ను కూడా కలుసుకున్నారు. జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ లో తన పర్యటన వివరాలు వెల్లడించారు. ‘ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ను కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ప్రపంచ స్థితిపై అతని అంతర్దృష్టిని మెచ్చుకోవాల్సిందే. ప్రపంచ సమస్యలు, వాటి విస్తృత ప్రభావాల గురించి సమావేశంలో చర్చించాం. అలాగే సెప్టెంబరులో జరిగే శిఖరాగ్ర సమావేశ సన్నాహాలు, భారత్-యుఎన్ భాగస్వామ్య భవిష్యత్ అవకాశాల గురించి కూడా చర్చించామని జైశంకర్ తెలిపారు.గుటెర్రెస్ను కలవడానికి ముందు జైశంకర్ తజికిస్తాన్, బెలారస్, రష్యా ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశారు. కాగా ఎస్సీఓలో భారతదేశం, ఇరాన్, కజకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలు. ప్రస్తుత సమావేశాలను కజకిస్తాన్ నిర్వహిస్తోంది. #WATCH | External Affairs Minister Dr S Jaishankar meets his Chinese counterpart Wang Yi, in Astana. pic.twitter.com/xkTjNfpZjT— ANI (@ANI) July 4, 2024 -
తెలుగు విద్యార్థుల డెస్టినేషన్‌గా యూఎస్
సాక్షి హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ డెస్టినేషన్‌గా అమెరికాను ఎంపిక చేసుకుంటున్నారు. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యూఎస్ చదువుల కోసం బ్యాగ్‌లు సర్దిపెట్టుకుంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో లెక్కల ఆధారంగా 2016తో పోల్చితే 2024 నాటికి అమెరికాలో తెలుగు వారి సంఖ్య నాలుగింతలు పెరిగిందని స్పష్టమవుతోంది. ప్రధానంగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, డల్లాస్, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, వర్జీనియా, అట్లాంటా, ఫ్లోరిడా, జార్జియా, నాష్విల్లే తదితర సిటీల్లో తెలుగు వారి ప్రాబల్యం వేగంగా పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎంతలా ఉందంటే యూఎస్‌లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషలు 350 ఉండగా అందులో తెలుగు 11వ స్థానంలో నిలిచింది.ఐటీ, ఫైనాన్స్ రంగాలపై ఆసక్తి.. అమెరికా వెళుతున్న వారిలో దాదాపు 75 శాతం పైగా ఇక్కడ ఇక్కడే స్థిరపడుతున్నారు. ప్రధానంగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే తదితర ప్రాంతాల్లో తెలుగు వారి ప్రభావం కనిపిస్తోంది. గతంలో స్థిరపడిన తెలుగు ప్రజలు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. అయితే 80 శాతం కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ, ఫైనాన్స్ రంగాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని స్థానిక సర్వేల్లో వెల్లడైంది. 3.2 లక్షల నుంచి 12.3 లక్షల వరకు.. యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం 2016 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 3.2 లక్షల మంది ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 12.3 లక్షలకు చేరింది. గతంలో వెళ్లి స్థిరపడిన నాలుగు తరాలకు చెందిన తెలుగు వారు, ఇటీవల కొత్తగా వెళ్లిన వారు సైతం అంతా అమెరికాను తమ సొంత ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నారు. తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా కాలిఫోరి్నయాలో 2 లక్షల మంది ఉండగా, టెక్సాస్ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1 లక్షలు, ఇల్లినాయిస్ 83 వేలు, వర్జీనియా 78 వేలు, జార్జియా 52 వేల మంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.హిందీ, గుజరాతీ, తరువాతి స్థానంలో తెలుగు.. అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో అత్యధికంగా హిందీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, మూడో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. అమెరికాలో సుమారు 350 విదేశీ భాషలు వాడుకలో ఉండగా అందులో తెలుగు భాష 11 స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్యా ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తోంది. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు అమెరికా వస్తున్నారని ఉత్తర అమెరికా తెలుగు భాషా సంఘం మాజీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది హెచ్1బి వీసా హోల్డర్లు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది తెలుగు సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్‌పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్‌లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్‌కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్‌కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్‌లాండ్‌లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్‌కోర్‌వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్‌లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్‌పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్‌గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
చెల్లితో వితికా షెరు విదేశీ ట్రిప్.. ఇద్దరూ కలిశారంటే రచ్చే! (ఫొటోలు)
-
మాదాపూర్ కేరీర్ ఫేయిర్‌లో విదేశీ వర్సిటీ ప్రతినిధులతో ఉత్సాహంగా విద్యార్థులు (ఫొటోలు)
-
మన బంగారం విదేశాల్లో ఎందుకు? ఆసక్తికర కారణాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూకే నుంచి సుమారు 100 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది. 1991లో భారత్ విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. రాబోయే నెలల్లో మరింత బంగారాన్ని బదిలీ చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ పరిణామాల అనంతరం టన్నుల కొద్దీ మన బంగారాన్ని విదేశాలలో ఎందుకు ఉంచారు అన్న సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. దానికి సమాధానమే ఈ కథనం..వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతు ఇవ్వడానికి హామీగా, విలువ నిల్వగా బంగారం నిల్వలను కలిగి ఉంటాయి. చరిత్రాత్మకంగా, గోల్డ్ స్టాండర్డ్ యుగంలో ఈ నిల్వలను డిపాజిటర్లు, నోట్ హోల్డర్లకు వాగ్దానాలను చెల్లించడానికి ఉపయోగించేవారు. నేడు, ఇవే బంగారం నిల్వలు ఆయా దేశాల కరెన్సీల విలువకు మద్దతు ఇస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తున్నాయి.బంగారం నిల్వలు ఎందుకు?కేంద్ర బ్యాంకులు అనేక కారణాల వల్ల బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది. జాతీయ ఆర్థిక నిర్వహణకు కీలకమైన బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. బంగారాన్ని కలిగి ఉండటం దేశ విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడానికి సహాయపడుతుంది. ఏదైనా ఒక కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.మన దగ్గరున్న బంగారం ఎంతంటే..2024 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం, భారత్ దేశీయంగా 308 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తన కరెన్సీకి మద్దతుగా కలిగి ఉంది. అదనంగా 100.28 టన్నుల బంగారం స్థానికంగా బ్యాంకింగ్ విభాగం ఆస్తిగా ఉంది. మొత్తంగా 413.79 మెట్రిక్ టన్నుల బంగారం విదేశాల్లో ఉంది. స్థానికంగా ఉన్న బంగారాన్ని ముంబై, నాగపూర్ లోని హై సెక్యూరిటీ వాల్ట్ లలో భద్రపరుస్తారు.827.69 మెట్రిక్ టన్నుల సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్ లో భారత్ ప్రపంచంలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇది దాని విదేశీ మారక నిల్వలలో 8.9 శాతం. ఇక 8,133.5 మెట్రిక్ టన్నులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల బంగారం నిల్వల్లో ఇది 71.3 శాతం. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ గణనీయమైన బంగారు నిల్వలు ఉన్న ఇతర దేశాలలో ఉన్నాయి.విదేశాలలో నిల్వ చేయడమెందుకు?అనేక ఇతర దేశాల మాదిరిగానే, భారత్ కూడా అనేక కారణాల వల్ల తన బంగారు నిల్వలలో కొంత భాగాన్ని విదేశీ వాల్ట్‌లలో నిల్వ చేస్తోంది. బంగారాన్ని ఇతర దేశాలలో నిల్వ చేయడం వల్ల భౌగోళిక రాజకీయ అస్థిరత లేదా ప్రాంతీయ సంఘర్షణలు నుంచి భద్రత లభిస్తుంది.లండన్, న్యూయార్క్, జ్యూరిచ్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ లావాదేవీలు, మార్పిడిలు లేదా రుణాలకు పూచీకత్తుగా సులభంగా పొందవచ్చు.బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయడానికి చారిత్రక, భద్రతా కారణాలు కూడా ఉన్నాయి. నమ్మకమైన సంరక్షకులుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలకు ఉన్న ఖ్యాతి, వాటితో ఉన్న చారిత్రక సంబంధాలు విదేశాల్లో బంగారాన్ని నిల్వ చేయాలనే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వాల్ట్ లలో అధునాతన భద్రతా చర్యలు ఉంటాయి. నిల్వల భద్రతను నిర్ధారిస్తాయి.ప్రధాన అంతర్జాతీయ గోల్డ్ వాల్ట్స్ ఇవే..బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బంగారు నిల్వల ప్రధాన కస్టోడియన్‌గా ఉంది. సమగ్ర నిఘా వ్యవస్థలు, కఠినమైన యాక్సెస్ ప్రోటోకాల్స్‌తో సహా విస్తృతమైన భద్రతా చర్యలను అందిస్తుంది. యూకేతో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలు, బ్యాంక్ ఖ్యాతి.. ఇక్కడ బంగారాన్ని నిల్వ చేయడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.స్విట్జర్లాండ్ లోని బేసెల్ లో ఉన్న బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సహకారానికి దోహదపడుతుంది. ఇది కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలకు ప్రత్యేకంగా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. బంగారం నిల్వల భద్రత, ప్రాప్యతను పెంచుతుంది.అమెరికాలోని ఫోర్ట్ నాక్స్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, జర్మనీలోని డ్యుయిష్ బుండెస్ బ్యాంక్, ఫ్రాన్స్‌లోని బాంక్యూ డి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో ఉన్న స్విస్ నేషనల్ బ్యాంక్ మరియు జ్యూరిచ్ వాల్ట్స్ ఇతర అంతర్జాతీయ గోల్డ్ వాల్ట్స్లలో ఉన్నాయి. -
చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
విశాఖ సిటీ: విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించారు.దీంతో బాధితులను తీసుకువచ్చేందుకు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టు విశాఖ పోలీసులు మూడు రోజుల కిందట బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గాజువాక ప్రాంతానికి చెందిన ముగ్గురు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణావిదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. సైబర్ నేరాలు చేయాలంటూ బలవంతంచైనా ముఠా నిరుద్యోగులకు టైపింగ్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించింది. తర్వాత టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చింది. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ఏడాది పాటు పనిచేసేలా అగ్రిమెంట్ రాయించుకుంది. మధ్యలో వెళ్లిపోతే 400 డాలర్లు చెల్లించాలని ఒప్పందం చేయించుకుని పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుంది. ఒప్పందం అనంతరం వారిని కంబోడియాలోనే ఒక చీకటి గదిలో బంధించారు. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు ఇతర సైబర్ నేరాలు చేయాలని బలవంతం చేశారు.అలా చేయని వారికి ఆహారం పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేశారు. ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమీషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకొనేది. వీరు అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల ఎంటర్టైన్మెంట్లు పబ్, క్యాసినో గేమ్స్, మద్యపానం, జూదంతో పాటు వ్యభిచారం సదుపాయాలు కల్పించారు.ఒక వ్యక్తి ఫిర్యాదుతోఅక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. రాకెట్‌కు ప్రధాన ఏజెంట్ అయిన చుక్క రాజేష్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు, మన్నేన జ్ఞానేశ్వరరావులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు.బాధితుల తిరుగుబాటు.. అరెస్టుకంబోడియాలో చైనా గ్యాంగ్ హింసలను భరించలేని బాధితులు అక్కడి పరిస్థితులను వివరిస్తూ విశాఖ పోలీసులకు వీడియోలు పంపించారు. అలాగే చైనా ముఠాకు వ్యతిరేకంగా మంగళవారం సుమారు 300 మంది బాధితులు కంబోడియాని సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్ అయిన సిహనౌక్విల్లోని జిన్బీ కాంపౌండ్‌లో తిరుగుబాటు చేశారు. తమను వెంటనే భారత్‌కు పంపించాలని డిమాండ్ చేశారు. దీంతో వీరిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విశాఖ సీపీ ఎ.రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వ్యవహారాన్ని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీరిని బయటకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటుఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మానవ అక్రమ రవాణా రాకెట్‌ను వెలికితీసేందుకు విస్తృతంగా పనిచేస్తున్నాయి. విశాఖకు చెందిన బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం కోసం సైబర్ క్రైమ్ సీఐ 94906 17917, సీపీ వాట్సాప్ నెంబర్ 94933 36633, కంట్రోల్ రూమ్ నెంబర్ 0891–2565454 సంప్రదించాలని సీపీ సూచించారు. -
Enforcement Directorate; ఆప్‌కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్సీఆర్ఏ) విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 7.08 కోట్లను విదేశాల నుంచి సేకరించిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర హోం శాఖకు తెలిపింది. పంజాబ్ మాజీ ఆప్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాపై డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో సోదాలు చేపట్టినపుడు ఆప్ విదేశీ విరాళాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ఈ–మెయిల్స్ లభించాయని ఈడీ పేర్కొంది. 2014– 2022 మధ్య ఆప్ రూ. 7.08 కోట్లను అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్‌ల నుంచి సేకరించిందని.. ఇది ఎఫ్సీఆర్ఏ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఉల్లఘించడమేనని తెలిపింది. ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్, కుమార్ విశ్వాస్, అనికిత్ సక్సేనా, కపిల్ భరద్వాజ్ మధ్య జరిగిన ఈ–మెయిల్ సంప్రదింపుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలున్నట్లు పేర్కొంది. అమెరికా, కెనడాల్లో నిధుల సేకరణ కార్యక్రమాల్లో విరాళాలిచి్చన వ్యక్తుల వివరాలను ఆప్ తమ ఖాతా పుస్తకాల్లో చూపలేదంది. -
సెన్స్‌క్స్ డౌట్!
మళ్లీ వచ్చేది మోదీయే... ఈసారి ఎన్డీయే కూటమికి 400 పై చిలుకు సీట్లు పక్కా... బీజేపీకి కనీసం 370 సీట్లు ఖాయం... కమలనాథుల అంచనాలివి! తీరా ఎన్నికలు మొదలై ఒక్కో విడత పోలింగ్ ముగుస్తున్నకొద్దీ ఈ ఉత్సాహం మెల్లమెల్లగా నీరుగారుతోంది. నాలుగు విడతల్లోనూ పోలింగ్ గత ఎన్నికలతో పోలిస్తే తగ్గడంతో అధికార పార్టీలో కాస్త అలజడి మొదలైంది. ఇదే మూడ్ స్టాక్ మార్కెట్లోనూ ప్రతిబింబిస్తోంది. ఓటింగ్ తగ్గడంతో బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్‌ను అందుకుంటుందో లేదోనన్న అనుమానాలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం దెబ్బతింది. రోజుకో కొత్త రికార్డులతో రంకెలేసిన బుల్ ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసింది. ఎన్నికల ‘వేడి’కి తికమకపడుతోంది. నిన్నమొన్నటిదాకా పెట్టుబడుల వరద పారించిన విదేశీ ఇన్వెస్టర్లు పొలోమంటూ అమ్మకాలకు తెగబడుతున్నారు. అయి తే ఫలితాలపై అనిశ్చితి వల్లే సెంటిమెంట్‌పై ప్రభావం పడుతోందని, బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇన్వెస్టర్లు తరలివస్తారని నిపుణులు పేర్కొంటున్నారు... స్టాక్ మార్కెట్లో ఈసారి ఎన్నికల ముందస్తు ర్యాలీతో రికార్డుల మోత మోగింది. మోదీ 3.0పై నమ్మకానికి తోడు ఎన్డీయే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనాలు దీనికి కారణం. అయితే, ఎన్నికల ‘వేడి’ జోరందుకుని, పోలింగ్ మొదలయ్యాక ఇన్వెస్టర్లలో నెమ్మదిగా నమ్మకం సడలుతూ వస్తోంది. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన నాలుగు విడతల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం దీనికి ఆజ్యం పోసింది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటి కారణాలు ఎన్నున్నా ... ఓటింగ్ పడిపోవడంతో ఫలితాల్లో బీజేపీ బంపర్ విక్టరీపై అనుమానాలు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవలే సెన్సెక్స్ (75,111 పాయింట్లు), నిఫ్టీ (22,795 పాయింట్లు) కొత్త ఆల్‌టైం గరిష్టాలను తాకిన తర్వాత భారీగానే క్షీణించాయి. గడచిన నెల రోజుల్లో సూచీలు దాదాపు 3 శాతం పైగానే పడటం దీనికి అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో తొలి విడతల్లో పోలింగ్ తగ్గినా, క్రమంగా పుంజుకుంది. దాంతో మొత్తమ్మీద రికార్డు స్థాయిలో 67.4 శాతం ఓటింగ్ జరిగింది. బీజేపీ సొంత బలం కూడా 282 నుంచి 303 లోక్‌సభ స్థానాలకు ఎగబాకింది. ఈసారి మాత్రం తొలి విడత నుంచే ఓటింగ్ క్రమంగా తగ్గముఖం పడుతూ వస్తోంది. మిగతా 3 విడతల్లోనూ ఇలాగే మందకొడిగా జరిగితే మొత్తం ఓటింగ్ గతం కంటే 2 నుంచి 3 శాతం తగ్గేలా కని్పస్తోంది.విదేశీ ఇన్వెస్టర్లు పీఛే ముడ్... ఓటింగ్ శాతం తగ్గుతుండటం, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)లో కూడా ఆందోళన మొదలైంది. మన ఈక్విటీ మార్కెట్లలో గత నెలన్నరలో రూ.30 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మేయడం దీనికి నిదర్శనం. మార్కెట్లు భారీగా పడటానికి ఎఫ్‌పీఐల విక్రయాలే కీలకంగా నిలుస్తున్నాయి. 2023లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఏకంగా రూ.1.77 లక్షల కోట్లను దేశీ మార్కెట్లో కుమ్మరించి రికార్డులు బద్దలుకొట్టారు. అంతేకాదు, ఇందులో దాదాపు మూడో వంతు (రూ.58 వేల కోట్లు) ఒక్క డిసెంబర్లోనే ఇన్వెస్ట్ చేయడం విశేషం. దీనికి తోడు దేశీ ఇన్వెస్టర్లు, ఫండ్స్ జోరుతో బుల్ రంకెలేసింది. గతేడాది సెన్సెక్స్, నిఫ్టీ 20 శాతం రాబడులు అందించాయి. కార్పొరేట్ కంపెనీల లాభాలు పుంజుకోవడం, ప్రభుత్వ పెట్టుబడుల జోరు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, వృద్ధి రేటు పుంజుకోవడం, సుస్థిర ప్రభుత్వం, స్థిరమైన పాలసీలు తదితర కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే, 2014లో ఎన్నికలు జరిగిన ఏప్రిల్–మే నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.23,607 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. 2019 ఇదే కాలంలో రూ.29,113 కోట్లు దేశీ మార్కెట్లో కుమ్మరించారు. దీంతో 2019లో నాలుగో దశ పోలింగ్ ముగిసే నాటికి నెల రోజుల్లో సెన్సెక్స్ 3.7 శాతం, నిఫ్టీ 2.2 శాతం చొప్పున ఎగబాకాయి. ఈసారి మాత్రం ట్రెండ్ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క విదేశీ ఇన్వెస్టర్లు తిరోగమన బాట పట్టగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది.విదేశీ మార్కెట్లు రయ్ రయ్ ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావం కంటే, ఎన్నికల ప్రభావమే మన మార్కెట్లో ప్రధానంగా కనిపిస్తోంది. విదేశీ మార్కెట్లు గత నెల రోజుల్లో భారీగా పెరిగినప్పటికీ.. మన సూచీలు ఆ స్థాయిలో పెరగకపోగా, 3 శాతం మేర పడిపోవడం దీనికి నిదర్శనం. గత నెల రోజుల వ్యవధిలో హాంకాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ ఏకంగా 15.2 శాతం జంప్ చేసింది. బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ సూచీ 6 శాతం, యూఎస్ డోజోన్స్ 4.7 శాతం, జర్మనీ డాక్స్ సూచీ 4.1 శాతం, చైనా షాంఘై ఇండెక్స్ 3 శాతం చొప్పున ఎగబాకాయి. ‘‘ఎన్నికల ఫలితాలపై అనుమానంతోనే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. ఓటింగ్ శాతం భారీగా తగ్గితే, బీజేపీ అంచనాలు తారుమారు కావచ్చు. ఆ పార్టీ సాధించే సీట్లు గణనీయంగా తగ్గే అవకాశముంది. మిగతా విడతల ఓటింగ్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. తదనుగుణంగానే మార్కెట్ల గమనం ఉంటుంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఎందుకీ ఆందోళన...బీజేపీకి గనుక సొంతంగా మెజారిటీ రాకపోతే ఎన్డీఏ పక్షాలపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గడం, బుజ్జగింపులు తదితరాలతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఇప్పుడున్న స్వేచ్ఛ లేకపోవడం కూడా అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు మార్కెట్లకు ప్రతికూలాంశం. చివరి మూడు విడతల్లో భారీగా ఓటర్లు పోటెత్తితే తప్ప ప్రస్తుత ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏ కూటమికి 400 పై చిలుకు సీట్ల లక్ష్యం నెరవేరే అవకాశాలు లేనట్టే. అంతేగాక గతంలో మాదిరిగానైనా రాకుండా బీజేపీ ఏ 260 సీట్ల దగ్గరో ఆగిపోతే మళ్లీ సంకీర్ణ లుకలుకలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. ఇవన్నీ మార్కెట్లకు రుచించని విషయాలే. విదేశీ ఇన్వెస్టర్లలో ఇలాంటి భయాలే నెలకొన్నాయిప్పుడు! అందుకే ప్రస్తుతానికి కొన్ని పొజిషన్లను తగ్గించుకుని, ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి మళ్లీ ఇన్వెస్ట్ చేయొచ్చనే భావన వారిలో కనబడుతోందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. సూచీల తాజా పతనంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం స్పందించారంటే, ఇన్వెస్టర్లలో ఆందోళన అధికార పక్షాన్ని కూడా బాగానే కలవరపెడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ‘గతంలో కూడా మార్కెట్లు గట్టిగా పడిన సందర్భాలున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలకు ముడిపెట్టకూడదు. తాజా ఒడిదుడుకులకు ‘కొన్ని వదంతులు’ ఆజ్యం పోసి ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం జూన్ 4కు ముందే షేర్లు కొనుక్కోండి. ఫలితాల తర్వాత మార్కెట్ దూసుకెళ్తుంది’ అని అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించారు.2004లో 20% క్రాష్ఎన్నికల ముందస్తు పరిస్థితులతో సంబంధం లేకుండా గత నాలుగు ఎన్నికల్లోనూ ఫలితాల తర్వాత సెస్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలనే అందించాయి. అయితే 2004 ఎన్నికల్లో వాజ్‌పేయి సర్కారు అనూహ్య ఓటమి చవిచూడటం, హంగ్ కారణంగా ఫలితాల తర్వాత 20 శాతం మార్కెట్ క్రాష్ అయింది! కానీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం కొలువుదీరాక మార్కెట్ విశ్వాసం పుంజుకుంది. మిగతా ఏడాది కాలంలో రాబడులు దండిగానే వచ్చాయి. 2009 ఫలితాల తర్వాత మే 18 నుంచి డిసెంబర్ వరకు 31 వరకు సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 40 శాతం దూసుకెళ్లడం విశేషం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జోరుకు తోడు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వరద, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాలో సహాయక ప్యాకేజీలు కూడా దోహదం చేశాయి. 2019 ఎన్నికల తర్వాత మాత్రం మార్కెట్లు ఏమంత పెద్దగా పెరగలేదు. ప్రపంచ మార్కెట్లలో అనిశి్చతి, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, బలహీన వృద్ధి రేటు వంటి ప్రభావాలతో 4 నుంచి 5 శాతం మాత్రమే రాబడులొచ్చాయి. అధికార పక్షం గెలుపు అంచనాలు తప్పొచ్చనే ఆందోళనల వల్లే దేశీ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీట్లు భారీగా తగ్గినా, సొంతంగా మెజారిటీ రాకపోయినా, ఫలితాల రోజున మార్కెట్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉండొచ్చు. ఫలితా లొచ్చేదాకా∙ఇదే అలజడి ఉంటుంది– మాధవీ అరోరా, ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ ముఖ్య ఆర్థికవేత్త– సాక్షి, నేషనల్ డెస్క్ -
Election 2024: ప్రధాని మోదీ బిగ్ ప్లాన్!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు వంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అధికార బీజేపీ ఎన్నికల్లో ప్రచారం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలు, ప్రచార సరళిని క్షేత్రస్థాయిలో చూపించేందుకు ప్రపంచంలోని పలు దేశాలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపింది. సుమారుగా 25 విదేశాలకు చెందిన పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలను పంపిచినట్లు తెలుస్తోంది. అయితే అందులో 13 పార్టీల ప్రతినిధులు భారత్‌కు రావడానికి ఆసక్తి చూపినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే 13 పార్టీల ప్రతినిధులు ఏయే దేశాలకు చెందినవారనే పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. బీజేపీ ఆహ్వానించిన విదేశీ పార్టీలు.. అమెరికాలోని అధికార డెమోక్రటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి బీజేపీ ఆహ్వానం పంపింది. ‘‘అమెరికాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అధ్యక్ష ఎన్నికలు కోసం తలమునకలై ఉంది. అయితే యూఎస్ పార్టీ ఇండియా, యూరప్‌లోని ఎన్నికల విధానానికి భిన్నంగా ఉంటుంది. యూఎస్ పార్టీ కార్యకర్తకు ఆ పార్టీ చీఫ్ తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అధ్యక్ష కార్యాలయం, యూఎస్ కాంగ్రెస్ (చట్ట సభ)కు అక్కడ చాలా ప్రాముఖ్యం ఉంటుంది’’అని ఓ బీజేపీ నేత తెలిపపారు. యూఎస్‌తో పాటు యూకేలోని కన్జర్వేటివ్, లేబర్ పార్టీల ప్రతినిధులను ఆహానం పంపారు. జర్మనిలో క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీని ఆహ్వానించారు. అయితే పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఒక్కపార్టీని కూడా పిలువకపోవటం గమనార్హం. భారత్‌తో పాక్‌కు సరైన సంబంధాలు సరైన సంబంధాలు లేని విషయం తెలిసిందే. అదేవిధంగా సరిహద్దు వివాదంతో తరుచు కవ్వించే చైనా పార్టీలకు కూడా బీజేపీ ఆహ్వానం పంపించలేదు. మరోవైపు పొరుదేశమైన బంగ్లాదేశ్‌లో కేవలం అధికార అవామీ లీగ్‌ను మాత్రమే ఆహ్వానించింది. ఇటీవల అక్కడి ప్రతిపక్ష పార్టీ బీఎన్బీ.. ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో భారతీయ ఉత్పత్తులను బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే. నేపాల్, శ్రీలంకకు చెందిన అన్ని ప్రముఖ పార్టీలను బీజేపీ ఆహ్వానించింది. ఇక.. తాము ఆహ్వానించిన విదేశీ పార్టీల ప్రతినిధులు లోక్‌సభ ఎన్నికల మూడో లేదా నాలుగో దశ పోలిగ్ సమయం(మే రెండో వారం)లో భారత్‌ను సందర్శిస్తారని బీజేపీ భావిస్తోంది. విదేశి పార్టీకు చెందిన ప్రతినిధులు, పరిశీలకులు ముందుగా ఢిల్లీ చేరుకొని భారత్ రాజీకీయ వ్యవస్థ, ఎన్నికల విధానం గురించి తెలుసుకుంటారు. 5-6 మంది ప్రతినిధుల బృందం నేరుగా క్షేత్రస్థాయిలో 4-5 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ నేతలను కలుస్తారు. ప్రధాని మోదీ, హోం మంత్రి వంటి నేతల ర్యాలీల్లో విదేశీ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. బీజేపీ ప్రాముఖ్యత తెలపటమే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా బీజేపీ పార్టీ ప్రాముఖ్యత తెలియచేయటంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఆయన విదేశీ పార్టీలకు చెందిన సుమారు 70 మంది ప్రతినిధులను కలువనున్నారు. ఇప్పటికే.. నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండను బీజేపీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించింది. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సైతం విదేశీ పార్టీలకు చెందిన 4-5 మంది ప్రముఖుల బృందం పలు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇక.. ప్రపంచం దేశాల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చేరువకావటమే లక్ష్యంగా బీజేపీ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రజాస్వామ్యానికి ఇండియా తల్లి వంటిది. ప్రపంచంలోనే అతి పెద్దపార్టీ బీజేపీ. బీజేపీ ఎన్నికల విధానం, ఎన్నికల ప్రచారం, అమలు చేసే వ్యూహాలను ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి’’అని బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం నేత విజయ్ చౌతైవాలే తెలిపారు. -
ఖరీదైన మద్యం తాగాలని...
బంజారాహిల్స్: ఓ పబ్ సెక్యూరిటీ గార్డ్ విదేశీ లిక్కర్ బాటిల్‌ను చోరీ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని ఆర్.యూ పబ్‌లో కొంతకాలంగా వినీత్‌కుమార్ అనే యువకుడు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఈ పబ్‌కు వచ్చే యువత ఖరీదైన విదేశీ లిక్కర్‌ను సేవిస్తుండటాన్ని గుర్తించిన అతను తాను కూడా స్నేహితులతో కలిసి ఆ లిక్కర్‌ను తాగాలనుకుని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న రాత్రి పబ్ మూసివేసిన తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి లోపలికి వెళ్లి క్యాష్ బాక్స్‌లో ఉన్న రూ.2 లక్షల నగదుతో పాటు ఐదు రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు, ఒక చివాస్ రీగల్, ఒక మొహిట్ చాన్ దాన్ బాటిల్‌ను చోరీ చేసి పబ్‌పై అంతస్తు నుంచి పైపుల ద్వారా కిందకు దిగి పరారయ్యారు. మర్నాడు ఉదయం పబ్ మేనేజర్ మద్యం బాటిళ్లతో పాటు నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా సెక్యూరిటీ గార్డ్ వినీత్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు అగంతకులు నగదు, బాటిళ్లతో కిందకు పైపుల ద్వారా కిందకు జారుతున్న దృశ్యాలను గుర్తించారు. ఆ రోజు నుంచి వినీత్‌కుమార్ విధులకు హాజరుకావడం లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉందని మేనేజర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మచ్చా... మైండ్‌బ్లోయింగ్! ’ ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతడు
ఇంగ్లీష్‌లో తట్టుకుంటూ మాట్లాడటం వేరు, భయంగా మాట్లాడటం వేరు. ఫ్లుయెంట్గా, ధైర్యంగా మాట్లాడటం వేరు. దిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో తన రిక్షాలో కూర్చున్న విదేశీ దంపతులతో ఒక రిక్షావాలా ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం చూస్తుంటే ‘మైండ్‌బ్లోయింగ్ మచ్చా’ అనిపిస్తుంది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారిలో ధైర్యం నింపుతోంది. ఈ వీడియోలాగే ఇటీవల మరో వీడియో వైరల్ అయింది. గోవా బీచ్‌లో గాజులు అమ్మే మహిళ ఆ ప్రాంతం గురించి విదేశీ టూరిస్టులతో గడ గడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియో నెట్‌లోకంలో చక్కర్లు కొట్టింది. ఎనిమిదేళ్ల వయసు నుంచి గోవా బీచ్‌లో తల్లిదండ్రులతో కలిసి తిరిగిన ఆమెకు ఆ పరిసర ప్రాంతాల్లో వినిపించే మాటలే ఇంగ్లీష్ నేర్చుకునే పాఠాలు అయ్యాయి.