రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూకే నుంచి సుమారు 100 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది. 1991లో భారత్ విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. రాబోయే నెలల్లో మరింత బంగారాన్ని బదిలీ చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ పరిణామాల అనంతరం టన్నుల కొద్దీ మన బంగారాన్ని విదేశాలలో ఎందుకు ఉంచారు అన్న సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. దానికి సమాధానమే ఈ కథనం..
వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతు ఇవ్వడానికి హామీగా, విలువ నిల్వగా బంగారం నిల్వలను కలిగి ఉంటాయి. చరిత్రాత్మకంగా, గోల్డ్ స్టాండర్డ్ యుగంలో ఈ నిల్వలను డిపాజిటర్లు, నోట్ హోల్డర్లకు వాగ్దానాలను చెల్లించడానికి ఉపయోగించేవారు. నేడు, ఇవే బంగారం నిల్వలు ఆయా దేశాల కరెన్సీల విలువకు మద్దతు ఇస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తున్నాయి.
బంగారం నిల్వలు ఎందుకు?
కేంద్ర బ్యాంకులు అనేక కారణాల వల్ల బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది. జాతీయ ఆర్థిక నిర్వహణకు కీలకమైన బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. బంగారాన్ని కలిగి ఉండటం దేశ విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడానికి సహాయపడుతుంది. ఏదైనా ఒక కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
మన దగ్గరున్న బంగారం ఎంతంటే..
2024 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం, భారత్ దేశీయంగా 308 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తన కరెన్సీకి మద్దతుగా కలిగి ఉంది. అదనంగా 100.28 టన్నుల బంగారం స్థానికంగా బ్యాంకింగ్ విభాగం ఆస్తిగా ఉంది. మొత్తంగా 413.79 మెట్రిక్ టన్నుల బంగారం విదేశాల్లో ఉంది. స్థానికంగా ఉన్న బంగారాన్ని ముంబై, నాగపూర్ లోని హై సెక్యూరిటీ వాల్ట్ లలో భద్రపరుస్తారు.
827.69 మెట్రిక్ టన్నుల సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్ లో భారత్ ప్రపంచంలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇది దాని విదేశీ మారక నిల్వలలో 8.9 శాతం. ఇక 8,133.5 మెట్రిక్ టన్నులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల బంగారం నిల్వల్లో ఇది 71.3 శాతం. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ గణనీయమైన బంగారు నిల్వలు ఉన్న ఇతర దేశాలలో ఉన్నాయి.
విదేశాలలో నిల్వ చేయడమెందుకు?
అనేక ఇతర దేశాల మాదిరిగానే, భారత్ కూడా అనేక కారణాల వల్ల తన బంగారు నిల్వలలో కొంత భాగాన్ని విదేశీ వాల్ట్‌లలో నిల్వ చేస్తోంది. బంగారాన్ని ఇతర దేశాలలో నిల్వ చేయడం వల్ల భౌగోళిక రాజకీయ అస్థిరత లేదా ప్రాంతీయ సంఘర్షణలు నుంచి భద్రత లభిస్తుంది.
లండన్, న్యూయార్క్, జ్యూరిచ్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ లావాదేవీలు, మార్పిడిలు లేదా రుణాలకు పూచీకత్తుగా సులభంగా పొందవచ్చు.
బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయడానికి చారిత్రక, భద్రతా కారణాలు కూడా ఉన్నాయి. నమ్మకమైన సంరక్షకులుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలకు ఉన్న ఖ్యాతి, వాటితో ఉన్న చారిత్రక సంబంధాలు విదేశాల్లో బంగారాన్ని నిల్వ చేయాలనే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వాల్ట్ లలో అధునాతన భద్రతా చర్యలు ఉంటాయి. నిల్వల భద్రతను నిర్ధారిస్తాయి.
ప్రధాన అంతర్జాతీయ గోల్డ్ వాల్ట్స్ ఇవే..
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బంగారు నిల్వల ప్రధాన కస్టోడియన్‌గా ఉంది. సమగ్ర నిఘా వ్యవస్థలు, కఠినమైన యాక్సెస్ ప్రోటోకాల్స్‌తో సహా విస్తృతమైన భద్రతా చర్యలను అందిస్తుంది. యూకేతో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలు, బ్యాంక్ ఖ్యాతి.. ఇక్కడ బంగారాన్ని నిల్వ చేయడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.
స్విట్జర్లాండ్ లోని బేసెల్ లో ఉన్న బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సహకారానికి దోహదపడుతుంది. ఇది కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలకు ప్రత్యేకంగా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. బంగారం నిల్వల భద్రత, ప్రాప్యతను పెంచుతుంది.
అమెరికాలోని ఫోర్ట్ నాక్స్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, జర్మనీలోని డ్యుయిష్ బుండెస్ బ్యాంక్, ఫ్రాన్స్‌లోని బాంక్యూ డి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో ఉన్న స్విస్ నేషనల్ బ్యాంక్ మరియు జ్యూరిచ్ వాల్ట్స్ ఇతర అంతర్జాతీయ గోల్డ్ వాల్ట్స్‌లలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment