
న్యూఢిల్లీ: అంతర్జాతీయ నగదు బదిలీ సేవలు అందించడానికి ఫినో పేమెంట్స్ బ్యాంకు (ఫినో)కు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఇకపై విదేశాల్లోని వారు పంపే రెమిటెన్సులను ఫినో ఖాతాదారులు కూడా ఇక్కడ అందుకునేందుకు వీలవుతుంది. విదేశాల్లోని కుటుంబసభ్యులు పంపే నిధులను, కస్టమర్లు నేరుగా తమకు దగ్గర్లోని మైక్రో ఏటీఎంలలో లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసులు అందించే ఫినో బ్యాంకు మర్చంట్ పాయింట్లలోనైనా విత్‌డ్రా చేసుకోవచ్చని ఫినో పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి ఈ సేవలు అందించగలమని బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మేజర్ ఆశీష్ అహూజా తెలిపారు.
ఈ రాష్ట్రాల నుంచి
గుజరాత్, పంజాబ్, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా విదేశాల నుంచి రెమిటెన్సులు వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని వ్యాపార సంస్థల నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకున్నామని, దీంతో ఈ తరహా సర్వీసులను మరింత త్వరితగతిన అందించడానికి సాధ్యపడగలదని అహూజా తెలిపారు. సెప్టెంబర్ 30 నాటికి తమ నెట్‌వర్క్‌లో ఎనిమిది లక్షల మంది పైగా వ్యాపారులు ఉన్నట్లు వివరించారు.
త్వరలో విదేశాలకు
త్వరలో విదేశాలకు రెమిటెన్స్ సర్వీసులను కూడా ప్రారంభించాలనే యోచన ఉన్నట్లు అహూజా చెప్పారు. 2021లో భారత్‌లోకి 87 బిలియన్ డాలర్ల మేర రెమిటెన్సులు రావచ్చని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికంగా ఉండగలదని ప్రపంచ బ్యాంకు ఇటీవల ఒక నివేదికలో అంచనా వేసింది. చాలా మంది వర్కర్లు గల్ఫ్ దేశాలకు తిరిగి వెళ్లే అవకాశాలు ఉన్నందున.. ఈ రెమిటెన్సులు 2022లో మూడు శాతం పెరిగి 89.6 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది.
చదవండి: యూపీఐ పేమెంట్స్ చేసే యూజర్లకు శుభవార్త..! ఎన్నారైలకు మరింత సులువు..!
Comments
Please login to add a commentAdd a comment