చైనా తమ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా గట్టి నిర్ణయం తీసుకుంది. ఉత్పాదక రంగాన్ని విదేశీ పెట్టుబడులకు పూర్తిగా తెరుస్తోంది. దీంతోపాటు ఆరోగ్య రంగంలోనూ మరింత విదేశీ మూలధనానికి అనుమతించనుంది.
చైనాకు చెందిన నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తాజా ప్రకటన ప్రకారం.. తయారీ రంగంలో ఇతర దేశాల పెట్టుబడులపై మిగిలి ఉన్న పరిమితులన్నింటినీ నవంబర్ 1 నుండి చైనా తొలగించనుంది. ముద్రణ కర్మాగారాలపై చైనీస్ మెజారిటీ నియంత్రణ, చైనీస్ మూలికా మందుల ఉత్పత్తిలో పెట్టుబడిపై నిషేధం వంటివి ఇందులో ఉన్నాయి.
సేవా రంగాన్ని సైతం మరింత విస్తరిస్తామని, విదేశీ పెట్టుబడుల ప్రవేశాన్ని ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం కట్టుబడి ఉందని నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తెలిపింది. దీనికి సంబంధించిన విధాన రూపకల్పనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
ఆరోగ్య రంగంలోనూ..
మరోవైపు చైనా తమ ఆరోగ్య సంరక్షణ రంగంలో మరన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ పలు విధానాలను ప్రకటించింది. మూలకణాలు, జన్యు నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, అనువర్తనాల్లో అప్లికేషన్‌లో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటన తెలిపింది. వీటిని తొలుత బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌డాంగ్, హైనాన్ వంటి పైలట్ ఫ్రీ ట్రేడ్ జోన్‌లలో అనుమతించనున్నారు.
దీంతోపాటు బీజింగ్, టియాంజిన్, షాంఘై, నాన్జింగ్, సుజౌ, ఫుజౌ, గ్వాంగ్‌జౌ, షెన్‌జెన్, హైనాన్ ద్వీపంలో పూర్తిగా విదేశీ యాజమాన్యంలోని ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు కూడా చైనా ప్రభుత్వం అనుమతించింది. అయితే సాంప్రదాయ చైనీస్ వైద్యాన్ని అందించే స్థానిక ఆసుపత్రులను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతి లేదు. కొత్త విధానం వెంటనే అమల్లోకి వస్తుందని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment