
అంతర్జాతీయ అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో దేశాలు తమ డిఫెన్స్ విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. అందుకు భారీగానే నిదులు గుమ్మరిస్తున్నాయి. కొన్నిదేశాలు స్వయంగా ఆయుధాలు సమకూర్చుకుంటున్నా, అత్యాధునిక వెపన్స్ దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. ఇటీవల ఇండియా-పాక్ మధ్య యుద్ధ భయాలు నెలకొంటున్న నేపథ్యంలో భారత ఆర్మీ ఆయుధ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందాం.
దేశీయ ఉత్పత్తి
ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ రంగంలో స్వావలంబనపై ప్రభుత్వం ఎప్పటినుంచో దృష్టి సారించింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా పాత ఇన్‌సాస్ రైఫిల్స్ స్థానంలో ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీకి రష్యాతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఎస్ఐజీ సౌర్ 716 రైఫిల్స్‌ను అమెరికా నుంచి కొనుగోలు చేస్తుంది. యూఏఈకి చెందిన కారకల్‌తో క్వార్టర్ బాటిల్ కార్బైన్స్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ తరుణంలో పాక్ ఇండియాతో తలపడి గెలవడం దాదాపు అసాధ్యం.
రక్షణ బడ్జెట్
భారత్ 2025 సంవత్సరానికిగాను రూ.6.81 లక్షల కోట్ల (80 బిలియన్ డాలర్లు) రక్షణ బడ్జెట్‌ను కేటాయించింది. ఇండియా అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉంది. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 9.8%గా ఉంది. దిగుమతులు తగ్గించుకుంటూ క్రమంగా దేశీయ తయారీను పెంపొందించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు
కీలక సరఫరాదారులు
ప్రస్తుతానికి దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి పెరిగినప్పటికీ, అధునాతన ఆయుధాల కోసం భారత్ ఇప్పటికీ దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ విభాగంలో ప్రధాన సరఫరాదారులుగా ఉన్న దేశాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
రష్యా: చారిత్రాత్మకంగా భారత్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయినప్పటికీ దాని వాటా 64% నుంచి 45%కి తగ్గింది.
ఫ్రాన్స్: భారత్ ఆయుధ దిగుమతుల్లో 29 శాతం వాటాతో రెండో అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది.
అమెరికా: డ్రోన్లు, యుద్ధ విమానాలతో సహా భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 11% సరఫరా చేస్తుంది.