ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి
మిలటరీ సామర్థ్యంలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది. ‘గ్లోబర్ ఫైర్ పవర్’ (జీఎఫ్‌పీ) సూచీ–2023 ఇటీవల విడుదలైంది. ఈ సూచీలో 2006 నుంచి భారత్ నాలుగో స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. తాజా సూచీలో అమెరికాకు తొలి ర్యాంకు రాగా.. రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా ఉన్నాయి. జీఎఫ్‌పీ సూచీ రూపొందించిన 2005 నుంచి ఇప్పటివరకు అమెరికా తొలి ర్యాంకులోనే ఉంది. 2005, 2006 సూచీల్లో రెండోస్థానంలో నిలిచిన చైనా.. ఆ తర్వాత రష్యా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2007 నుంచి ఇప్పటివరకు రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా కొనసాగుతున్నాయి. 2005 సూచీలో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉండగా, 2006లో 5వ స్థానానికి, 2007లో 20వ స్థానానికి పడిపోయింది. 2010కి కాస్త మెరుగుపడి 15వ స్థానానికి చేరింది. ఇప్పుడు తాజాగా 2022లో 9వ స్థానానికి వచ్చిన పాకిస్తాన్... ఈ సంవత్సరం 7వ స్థానంలో నిలిచింది.
ప్రపంచ యుద్ధాల్లో కదన రీతిని సమూలంగా మార్చేసిన యుద్ధట్యాంకులు.. ఆధునిక యుగంలోనూ సైన్యం శక్తిసామర్థ్యాలకు మూలస్తంభాలుగా యుద్ధట్యాంకులు నిలవడం గమనార్హం.
► ఆధునిక ఆయుధ సంపత్తి సమకూరిన తర్వాత సైన్యం సామర్థ్యాన్ని లెక్కగట్టడంలో ఇప్పటికీ యుద్ధట్యాంకులు కీలక భూమిక పోషిస్తున్నాయి. యుద్ధ ట్యాంకులూ ఆధునికతను సంతరించుకుని, సాయుధ బలగాలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి.
► రష్యా వద్ద ఇవి అత్యధికంగా 12,566, భారత్ వద్ద 4,614 ట్యాంకులున్నాయి.
► అర్జున్ లాంటి అత్యాధునిక భారీ యుద్ధ ట్యాంకులతో పాటు తక్కువ బరువైన (గరిష్టంగా 25 టన్నులు) యుద్ధ ట్యాంకులు కూడా భారత్ సైన్యం వద్ద ఉన్నాయి.
► కృత్రిమ మేధస్సును వాడుకునే సామర్థ్యం ఉన్న అత్యాధునిక ట్యాంకులు మన సొంతం.
► ఇక ఎత్తయిన ప్రదేశాల్లోనూ, భౌగోళికంగా అత్యంత అనుకూల పరిస్థితులున్న చైనా సరిహద్దు ప్రాంతాల్లో శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తక్కువ బరువున్న యుద్ధ ట్యాంకులను సమకూర్చుకోవడానికి భారత్ దేశీయ పరిజ్ఞానంతో ‘ప్రాజెక్టు జొరావర్’ చేపట్టింది.
► భారీ ట్యాంకులకు ఇవి ఏమాత్రం తక్కువ కాదు.
అమెరికాలోనే ఎక్కువగా..
అత్యాధునిక యుద్ధ ట్యాంకులు తయారుచేస్తున్న అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లో చూస్తే అమెరికా వద్దే పెద్ద సంఖ్యలో ట్యాంకులు ఉన్నాయి. మిగతా అగ్ర దేశాలు తాము ఉత్పత్తి చేసిన ట్యాంకులను ఇతర దేశాలకు విక్రయించడమే తప్ప తమ సైన్యానికి ఇవ్వలేదు. అత్యాధునిక లెపర్డ్–2 ఉత్పత్తి చేస్తున్న జర్మనీ తన వద్ద ఉంచుకున్న ట్యాంకులు 266 మాత్రమే. ఛాలెంజర్–2లను ఉత్పత్తి చేస్తున్న యూకే.. తన వద్ద ఉన్న ఈ ట్యాంకుల సంఖ్య 227 మాత్రమే. అవి నాటో దేశాలు కావడంవల్లే భారీగా ట్యాంకులు సమకూర్చుకోవడం లేదు.
ఉక్రెయిన్ వద్ద ఆనాటి ట్యాంకులు
ఉక్రెయిన్ ఒకప్పటి యూఎస్‌ఎస్‌ఆర్‌లో భాగం. ఉక్రెయిన్ వద్ద ఉన్న యుద్ధ ట్యాంకుల్లో యూఎస్‌ఎస్‌ఆర్ కాలం నాటివే ఎక్కువ. రష్యా యుద్ధ ట్యాంకులను కొన్నింటిని స్వాధీనం చేసుకుని వాడుతున్నారు. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు ఇస్తే రష్యాతో యుద్ధ స్వరూపాన్ని సమూలంగా మార్చేయాలని ఉక్రెయిన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఇవ్వమని నాటో సభ్య దేశాలను అడుగుతోంది. ఇటీవల జర్మనీలో జరిగిన వివిధ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఉక్రెయిన్ విజ్ఞప్తి మీద చర్చ జరిగినా సానుకూల నిర్ణయం రాలేదు.
ర్యాంకుల కథాకమామిషు..
ప్రపంచ దేశాల సైన్యాల కదన సామర్థ్యం ఆధారంగా ‘గ్లోబర్ ఫైర్ పవర్’ (జీఎఫ్‌పీ) అంతర్జాతీయ సంస్థ 2005 నుంచి ఏటా ర్యాంకులు ఇస్తోంది. సంప్రదాయ పద్ధతుల్లో ఆయా దేశాల నింగి, నేల, జల యుద్ధ సామర్థ్యాలు, సైన్యాలకు అందుబాటులో ఉన్న మానవ వనరులు, ఆయుధ సంపత్తి, సహజ వనరులు, దేశ రక్షణకు చేస్తున్న వ్యయం, భౌగోళిక పరిస్థితులు, పొరుగు దేశాల నుంచి ఒత్తిడి, సరిహద్దు పాయింట్లు.. ఇలా 60కి పైగా అంశాలను పరిగణనలోకి తీసుకుని 145 దేశాలకు ‘గ్లోబల్ ఫైర్ పవర్’ ర్యాంకులు ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment