army forces
-
తెలంగాణ ఎన్నికలు.. రంగంలోకి 20వేల కేంద్ర బలగాలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కేంద్ర బలగాలను పంపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో, రెండు రోజుల్లో రాష్ట్రానికి కేంద్ర బలగాలు రానున్నాయి. వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 100 కంపెనీల నుంచి 20వేల కేంద్ర బలగాలు తెలంగాణకు రానున్నాయి. రెండు రోజుల్లో బలగాలు రాష్ట్రానికి చేరుకోనున్నాయి. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కేంద్ర హోం శాఖ బలగాలను రాష్ట్రానికి పంపించనుంది. ఒక్కో కంపెనీలో.. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర సీమాబల్ వంటి బలగాలకు చెందిన 60-80 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఈ క్రమంలో మొత్తం 20 వేల మందికి పైగా కేంద్ర బలగాల సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని ఈ బలగాలు బందోబస్తు నిర్వహించనున్నాయి. కీలక ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాల ఏర్పాటుతో పాటు సరిహద్దుల్లోనూ తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసుకోనున్నాయి. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బృందాలు పలు విడతల్లో కవాతు జరపనున్నాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నాయి. ఓటర్లలో భయాందోళనలకు తావులేకుండా చేయడంలో భాగంగా ఫ్లాగ్‌మార్చ్‌ల ద్వారా భరోసా కల్పించనున్నాయి. ఈ సిబ్బంది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎంపిక చేసిన కొన్నింటి వద్ద సొంతంగానే విధులు నిర్వర్తించనున్నారు. మరికొన్ని కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో కలిసి బందోబస్తులో పాల్గొంటారు. మరోవైపు పోలింగ్ సమయంలో ఆయా కేంద్రాల వద్ద ఈ బలగాల బందోబస్తు కీలకం కానుంది. పోలింగ్ ముందురోజే ఆ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకొని బందోబస్తులో నిమగ్నం కానున్నారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాలు వీరి అధీనంలోనే ఉండనున్నాయి. ముందు వాటిని భద్రపరిచిన కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడం.. పోలింగ్ అనంతరం తిరిగి స్ట్రాంగ్‌రూం కేంద్రాలకు తరలించడం వంటి ప్రక్రియ కేంద్ర బలగాల నియంత్రణలోనే జరగనుంది. బందోబస్తు మాత్రమే కాకుండా.. డబ్బు, మద్యం వంటివాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టే తనిఖీల్లోనూ ఈ బలగాలు నిమగ్నం కానున్నాయి. ఇది కూడా చదవండి: ప్రగతి భవన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు -
మోహరించిన ఇజ్రాయెల్ సేనలు
జెరూసలేం/గాజా స్ట్రిప్/రఫా: గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్ల అంతు చూడడంతోపాటు వారి స్థావరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. పదాతి దళాలు పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాయి. 3 లక్షలకుపైగా ఇజ్రాయెల్ రిజర్వ్ సైనికులు గాజా సరిహద్దుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం సోమవారం పదో రోజుకు చేరుకుంది. ఈ పోరులో ఇప్పటిదాకా గాజాలో 2,750 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, 9,700 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించినట్లు తెలిసింది. అతిత్వరలోనే ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సేనలు భూతల దాడులు ప్రారంభిస్తాయని ప్రచారం సాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వలసబాట పట్టారు. ఇప్పటిదాకా 6 లక్షల మందికిపైగా జనం వెళ్లిపోయినట్లు అంచనా. ఇజ్రాయెల్‌కు సాయంగా మిత్రదేశం అమెరికా పంపించిన అత్యాధునిక యుద్ధవిమాన వాహక నౌకలు మధ్యదరా సముద్రంలో గాజా తీరంలో మోహరించాయి. గాజాను గుప్పిట్లో పెట్టుకొని తమ భద్రతకు ముప్పుగా పరిణమించిన హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను నామరూపాల్లేకుండా చేయడమే తమ ముందున్న కర్తవ్యమని ఇజ్రాయెల్ సైన్యం తేలి్చచెబుతోంది. గాజాలో ప్రజల కష్టాలకు తెరపడడం లేదు. ఆహారం, నీరు, ఇంధనం కొరత తీవ్రరూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాయపడిన వేలాది మంది ఆసుపత్రుల్లో చేరారు. ఆసుపత్రుల్లో వారి పరిస్థితి మరింత హృదయవిదారకంగా మారింది. చికిత్సలు ఆగిపోవడంతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతదేహాలను భద్రపర్చడానికి ప్లాస్టిక్ బ్యాగ్‌లు కూడా లేవని వాపోతున్నారు. హమాస్ చేతిలో బందీలు 199 మంది గాజాలో హమాస్ మిలిటెంట్ల చేతిలో ప్రస్తుతం 199 మంది బందీలు ఉన్నారని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ సోమవారం వెల్లడించారు. దాదాపు 150 మంది బందీలు ఉన్నట్లు ఇప్పటిదాకా భావించామని, కానీ, 199 మంది ఉన్నట్లు తేలిందని చెప్పారు. బందీల్లో చాలామంది ఇజ్రాయెల్ సైనికులు, మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, బందీల్లో విదేశీయులు ఉన్నారో లేదో ఆయన బహిర్గతం చేయలేదు. వైమానిక దాడులు నిలిపివేస్తే బందీలు విడుదల గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులను ఇజ్రాయెల్ నిలిపివేస్తే బందీలను విడుదల చేయడానికి హమాస్ సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారం తెలియజేసింది. కానీ, దీనిపై హమాస్ స్పందించలేదు. తమపై దాడులు ఆపడంతోపాటు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే, అందుకు బదులుగా తమ వద్దనున్న బందీలను విడుదల చేయాలన్న ఆలోచనలో హమాస్ ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో.... లెబనాన్ సరిహద్దుల్లో నివసిస్తున్న యూ దులంతా వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయా లని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లెబనాన్ సరిహద్దుల సమీపంలో 28 యూదు కాలనీలు ఉన్నాయి. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లోనూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం, లెబనాన్ ప్రభుత్వ మద్దతున్న షియా తీవ్రవాద సంస్థ హెజ్బొల్లా సభ్యుల మధ్య పరస్పరం కాల్పులు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైనిక స్థావరాల్లోని నిఘా కెమెరాలను హెజ్బొల్లా సభ్యులు ధ్వంసం చేయడం ప్రారంభించారు. తమ కదలికలను ఇజ్రాయెల్ గుర్తించకుండా ఉండేందుకు వారు ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య జరిగిన తాజా ఘర్షణలో ఒక ఇజ్రాయెల్ సైనికుడు, ఒక పౌరుడు మరణించారు. లెబనాన్‌లో ఒక జర్నలిస్టు సహా ముగ్గురు పౌరులు మృతిచెందారు. వచ్చేవారం ఇజ్రాయెల్‌కు జో బైడెన్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చేవారం ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్నారని తెలిసింది. ఈ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అరబ్ దేశాల పర్యటన ముగించుకొని సోమవారం ఇజ్రాయెల్‌కు తిరిగివచ్చారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతోపాటు అధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. గాజాపై ఆధిపత్యం పొరపాటే అవుతుంది: బైడెన్ ఇజ్రాయెల్ సేనలు గాజాలో సుదీర్ఘకాలంపాటు ఉండడం పెద్ద పొరపాటుగా పరిణమించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. గాజాపై యుద్ధం వద్దంటూ ఇజ్రాయెల్‌కు పరోక్షంగా సూచించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను కచి్చతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. గాజా ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు హితవు పలికారు. గాజాలో పాలస్తీనియన్ల ఆధ్వర్యంలోనే పాలన కొనసాగాలని తాను ఆశిస్తున్నట్లు బైడెన్ తాజాగా స్పష్టం చేశారు. మొత్తం పాలస్తీనియన్లకు హమాస్ మిలిటెంట్లు ప్రతినిధులు కాదని తేల్చిచెప్పారు. గాజాను ఇజ్రాయెల్ ఎక్కువ కాలం అ«దీనంలో ఉంచుకుంటుందని తాను భావించడం లేదన్నారు. మమ్మల్ని పరీక్షించొద్దు: నెతన్యాహూ తమ దేశ ఉత్తర సరిహద్దుల్లో తమను పరీక్షించవద్దని ఇరాన్, హెజ్బొల్లా సంస్థను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఆయన సోమవారం ఇజ్రాయెల్ చట్టసభ ‘నెస్సెట్’లో ప్రసంగించారు. హమాస్‌ను ఓడించడానికి ప్రపంచ దేశాలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘ఈ యుద్ధం మీ యుద్ధం’ అని అన్నారు. హమాస్ మిలిటెంట్లు నాజీ ముష్కరుల్లాంటివారేనని నెతన్యాహూ తేలి్చచెప్పారు. దాడులు ఆపకపోతే అన్ని చేతులూ ట్రిగ్గర్‌పైనే: ఇరాన్ గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దురాక్రమణ సాగిస్తున్న ఇజ్రాయెల్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రాంతంలో అందరూ సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరబ్దొల్లాహియాన్ స్పష్టం చేశారు. గాజాపై దాడులు ఆపకపోతే అన్ని చేతులూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయని, ఇజ్రాయెల్‌కు గుణపాఠం తప్పదని తేలి్చచెప్పారు. గాజాలో సాధారణ పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను వెంటనే ఆపాలని అమెరికాకు ఇరాన్ సూచించింది. గాజాపై వైమానిక దాడులు ఆపకపోతే తాము ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌కు ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. బందీలను వెంటనే విడుదల చేయాలి: ఐరాస బందీలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని హమాస్ మిలిటెంట్లకు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ హితవు పలికారు. అలాగే గాజా స్ట్రిప్‌కు ఆహారం, నీరు, ఔషధాల సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని సోమవారం ఇజ్రాయెల్‌కు సూచించారు. ప్రపంచ దేశాల నుంచి పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేలా ఆంక్షలు తొలగించాలని, సరిహద్దులు తెరవాలని అన్నారు. సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హర్షించదగ్గ పరిణామం కాదని చెప్పారు. ఈజిప్టు, జోర్డాన్, వెస్ట్‌బ్యాంకు నుంచి నిత్యావసరాలు పాలస్తీనియన్లకు అందేలా ఇజ్రాయెల్ చొరవ తీసుకోవాలని కోరారు. ఘర్షణ ఆగిపోవాలి: రిషి సునాక్ ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ మరింత విస్తరించవద్దని కోరుకుంటున్నానని బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. ఘర్షణ ఆగిపోవాలని, ఇందుకోసం తన వంతు కృషి చేస్తానని, ఈ దిశగా ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి పని చేస్తానని వివరించారు. రిషి సునాక్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. జోర్డాన్ రాజు అబ్దుల్లాతో లండన్‌లో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై వారితో చర్చించారు. సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు రిషి సునాక్ సూచించారు. -
మిలటరీ సామర్థ్యంలో స్థిరంగా భారత్
ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి మిలటరీ సామర్థ్యంలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది. ‘గ్లోబర్ ఫైర్ పవర్’ (జీఎఫ్‌పీ) సూచీ–2023 ఇటీవల విడుదలైంది. ఈ సూచీలో 2006 నుంచి భారత్ నాలుగో స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. తాజా సూచీలో అమెరికాకు తొలి ర్యాంకు రాగా.. రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా ఉన్నాయి. జీఎఫ్‌పీ సూచీ రూపొందించిన 2005 నుంచి ఇప్పటివరకు అమెరికా తొలి ర్యాంకులోనే ఉంది. 2005, 2006 సూచీల్లో రెండోస్థానంలో నిలిచిన చైనా.. ఆ తర్వాత రష్యా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2007 నుంచి ఇప్పటివరకు రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా కొనసాగుతున్నాయి. 2005 సూచీలో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉండగా, 2006లో 5వ స్థానానికి, 2007లో 20వ స్థానానికి పడిపోయింది. 2010కి కాస్త మెరుగుపడి 15వ స్థానానికి చేరింది. ఇప్పుడు తాజాగా 2022లో 9వ స్థానానికి వచ్చిన పాకిస్తాన్... ఈ సంవత్సరం 7వ స్థానంలో నిలిచింది. ప్రపంచ యుద్ధాల్లో కదన రీతిని సమూలంగా మార్చేసిన యుద్ధట్యాంకులు.. ఆధునిక యుగంలోనూ సైన్యం శక్తిసామర్థ్యాలకు మూలస్తంభాలుగా యుద్ధట్యాంకులు నిలవడం గమనార్హం. ► ఆధునిక ఆయుధ సంపత్తి సమకూరిన తర్వాత సైన్యం సామర్థ్యాన్ని లెక్కగట్టడంలో ఇప్పటికీ యుద్ధట్యాంకులు కీలక భూమిక పోషిస్తున్నాయి. యుద్ధ ట్యాంకులూ ఆధునికతను సంతరించుకుని, సాయుధ బలగాలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ► రష్యా వద్ద ఇవి అత్యధికంగా 12,566, భారత్ వద్ద 4,614 ట్యాంకులున్నాయి. ► అర్జున్ లాంటి అత్యాధునిక భారీ యుద్ధ ట్యాంకులతో పాటు తక్కువ బరువైన (గరిష్టంగా 25 టన్నులు) యుద్ధ ట్యాంకులు కూడా భారత్ సైన్యం వద్ద ఉన్నాయి. ► కృత్రిమ మేధస్సును వాడుకునే సామర్థ్యం ఉన్న అత్యాధునిక ట్యాంకులు మన సొంతం. ► ఇక ఎత్తయిన ప్రదేశాల్లోనూ, భౌగోళికంగా అత్యంత అనుకూల పరిస్థితులున్న చైనా సరిహద్దు ప్రాంతాల్లో శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తక్కువ బరువున్న యుద్ధ ట్యాంకులను సమకూర్చుకోవడానికి భారత్ దేశీయ పరిజ్ఞానంతో ‘ప్రాజెక్టు జొరావర్’ చేపట్టింది. ► భారీ ట్యాంకులకు ఇవి ఏమాత్రం తక్కువ కాదు. అమెరికాలోనే ఎక్కువగా.. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు తయారుచేస్తున్న అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లో చూస్తే అమెరికా వద్దే పెద్ద సంఖ్యలో ట్యాంకులు ఉన్నాయి. మిగతా అగ్ర దేశాలు తాము ఉత్పత్తి చేసిన ట్యాంకులను ఇతర దేశాలకు విక్రయించడమే తప్ప తమ సైన్యానికి ఇవ్వలేదు. అత్యాధునిక లెపర్డ్–2 ఉత్పత్తి చేస్తున్న జర్మనీ తన వద్ద ఉంచుకున్న ట్యాంకులు 266 మాత్రమే. ఛాలెంజర్–2లను ఉత్పత్తి చేస్తున్న యూకే.. తన వద్ద ఉన్న ఈ ట్యాంకుల సంఖ్య 227 మాత్రమే. అవి నాటో దేశాలు కావడంవల్లే భారీగా ట్యాంకులు సమకూర్చుకోవడం లేదు. ఉక్రెయిన్ వద్ద ఆనాటి ట్యాంకులు ఉక్రెయిన్ ఒకప్పటి యూఎస్ఎస్ఆర్లో భాగం. ఉక్రెయిన్ వద్ద ఉన్న యుద్ధ ట్యాంకుల్లో యూఎస్ఎస్ఆర్ కాలం నాటివే ఎక్కువ. రష్యా యుద్ధ ట్యాంకులను కొన్నింటిని స్వాధీనం చేసుకుని వాడుతున్నారు. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు ఇస్తే రష్యాతో యుద్ధ స్వరూపాన్ని సమూలంగా మార్చేయాలని ఉక్రెయిన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఇవ్వమని నాటో సభ్య దేశాలను అడుగుతోంది. ఇటీవల జర్మనీలో జరిగిన వివిధ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఉక్రెయిన్ విజ్ఞప్తి మీద చర్చ జరిగినా సానుకూల నిర్ణయం రాలేదు. ర్యాంకుల కథాకమామిషు.. ప్రపంచ దేశాల సైన్యాల కదన సామర్థ్యం ఆధారంగా ‘గ్లోబర్ ఫైర్ పవర్’ (జీఎఫ్‌పీ) అంతర్జాతీయ సంస్థ 2005 నుంచి ఏటా ర్యాంకులు ఇస్తోంది. సంప్రదాయ పద్ధతుల్లో ఆయా దేశాల నింగి, నేల, జల యుద్ధ సామర్థ్యాలు, సైన్యాలకు అందుబాటులో ఉన్న మానవ వనరులు, ఆయుధ సంపత్తి, సహజ వనరులు, దేశ రక్షణకు చేస్తున్న వ్యయం, భౌగోళిక పరిస్థితులు, పొరుగు దేశాల నుంచి ఒత్తిడి, సరిహద్దు పాయింట్లు.. ఇలా 60కి పైగా అంశాలను పరిగణనలోకి తీసుకుని 145 దేశాలకు ‘గ్లోబల్ ఫైర్ పవర్’ ర్యాంకులు ఇస్తోంది. -
రక్షణకు 113 బిలియన్ డాలర్లు కేటాయించిన జర్మనీ
బెర్లిన్/బ్రసెల్స్: రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల కోసం ఏకంగా 113 బిలియన్ డాలర్లు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ప్రకటించారు. దేశ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రక్షణపై పెట్టుబడులను మరింతగా పెంచాల్సిన అవసరముందని ఆదివారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చెప్పారు. తాజా ప్రకటనతో రక్షణపై పెట్టుబడులు దేశ జీడీపీలో 2 శాతాన్ని మించాయి. ఉక్రెయిన్‌కు సాయంగా 500 స్టింగర్ మిసైళ్లు, 1,000 యాంటీ ట్యాంక్ వెపన్స్, ఇతర ఆయుధాలు, సామగ్రిని పంపుతున్నట్టు శనివారం రాత్రి జర్మనీ ప్రకటించడం తెలిసిందే. రష్యాపై ఉక్రెయిన్ దాడి యూరప్‌లో రక్షణ విధానాలను తిరగ రాస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జర్మనీ తాజా నిర్ణయమే ఇందుకు నిదర్శనమంటున్నారు. రక్షణపై సరైన మొత్తంలో నిధులు వెచ్చించడం లేదంటూ అమెరికా, నాటో దేశాలు కొంతకాలంగా జర్మనీని విమర్శిస్తూ వస్తున్నాయి. -
లాక్డౌన్ ఉల్లంఘన : రంగంలోకి ఆర్మీ..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ను చాలామంది ఉల్లంఘిస్తున్న తరుణంలో దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది. వైరస్ నియంత్రణకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలయ్యేలా చూసేందుకు అన్ని రాష్ట్రాలలో ఆర్మీని రగంలోకి దించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త తరఫున న్యాయవాదులు ఓం ప్రకాష్, దుష్యంత్ తివారి పిటిషన్ ఈ దాఖలు చేశారు. లాక్డౌన్ అమలవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఆరోగ్య సిబ్బందిపై దాడులు తప్పుడు వార్తలు ఆధారంగా పెద్దఎత్తున జనాలు గుమిగూడడం, మతపరమైన సమావేశాలు జరుగుతుండటంతో ఆర్మీని రంగంలోకి దించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఈనెల 14న ముంబైలో వలస కూలీలు పెద్దఎత్తున గుమిగూడిన అంశాలన్ని కూడా దానిలో పొందుపరిచారు. ఇక కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వివాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు నివారించడంలో విఫలమయ్యాయి అని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దేశంలో అనేక చోట్ల ప్రజలు గుమిగూడడంపై జాతీయ దర్యాప్తు సంస్థ తో విచారణ జరిపించాని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. -
1.5 లక్షల జవాన్లు.. 600 ప్రత్యేక రైళ్లు
దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం లక్షా యాభై వేల మంది భద్రతా సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు. సరిహద్దు భద్రతా దళం, కేంద్ర రిజర్వు పోలీసు, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు, రైల్వే రక్షక దళాలకు చెందిన వీరిని దశల వారీగా వివిధ ప్రాంతాలకు తరలించేందుకు మొత్తం 600 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీరి కోసం రైల్వే శాఖ వెయ్యి బోగీలను కేటాయించింది. మొదటి విడతగా మార్చి 13వ తేదీన 12 ప్రత్యేక రైళ్లలో భద్రతా సిబ్బందిని 20 రాష్ట్రాలకు తరలించడం ఇప్పటికే మొదలైంది. బిహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాలకు వీరిని పంపుతున్నారు. ఒక రైల్లో 14 కంపెనీల భద్రతా సిబ్బందిని పంపుతున్నారు. ఒక కంపెనీలో 125 మంది ఉంటారు. మొదటి దశ పోలింగ్ జరిగే 20 రాష్ట్రాల్లో వీరి సేవల్ని ఉపయోగించుకుంటారు. తర్వాత వీరిని రెండో దశ పోలింగ్ జరిగే రాష్ట్రాలకు తరలిస్తారు. ఇలా మొత్తం ఏడు దశలకూ వీరి సేవల్ని వినియోగించుకుంటారు. -
‘కశ్మీర్ నుంచి ప్రాణాలతో తిరిగి వెళ్లరు’
శ్రీనగర్ : కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులు వెంటనే లొంగిపోవాలని, లేదంటే చేతిలో తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ప్రతీ ఒక్కరిని అంతం చేస్తామని ఆర్మీ అధికారి కన్వాల్ జీత్‌సింగ్ థిల్లాన్ హెచ్చరించారు. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ను ఆనవాలు కశ్మీర్ లోయలో కనిపించకుండా చేస్తామని పేర్కొన్నారు. పుల్వామా దాడి వెనుక జైషే మహ్మద్ హస్తం ఉందని స్పష్టమైందని, దీనికి పాక్ సహకారం ఉందని వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో సోమవారం నాటి ఎన్కౌంటర్లో దాడి కీలక సూత్రధారి, జైషే మహ్మద్ టాప్ కమాండర్ రషీద్ ఘాజీని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.(పుల్వామా ఉగ్రదాడి; మాస్టర్ మైండ్ హతం!) ఈ క్రమంలో ఆర్మీ అధికారులు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఎన్కౌంటర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా... 40 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి బాధ్యులను 100 గంటల్లోనే అంతం చేశామని పేర్కొన్నారు. ‘ ఉగ్ర సంస్థలో ఉన్న, చేరాలనుకున్న ఎవరైనా సరే లొంగిపోవాలని విఙ్ఞప్తి చేస్తున్నా. తుపాకీ వదిలేయమని కుటుంబ సభ్యులైనా వారికి సూచిస్తే మంచింది. అలా జరగని పక్షంలో వారిని కోల్పోవాల్సి ఉంటుంది. కశ్మీర్ నుంచి వారిని పూర్తిగా తొలగిస్తాం. మీరకుంటున్నట్లుగా లొంగిపోయే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. లేదంటే అంతం చేయడానికి మేము సిద్ధం’ అంటూ థిల్లాన్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణాలతో తిరిగి వెళ్లరు.. పుల్వామా దాడికి ప్రణాళిక పాకిస్తాన్‌లోనే జరిగిందని కశ్మీర్ ఐజీ ఎస్పీ పంత్ తెలిపారు. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే తమ లక్ష్యమని... కశ్మీర్లో అడుగుపెట్టిన ఉగ్రవాదులు ప్రాణాలతో తిరిగి వెళ్లరని హెచ్చరించారు. పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదులు కనిపించగానే కాల్చి పారేస్తామని స్పష్టం చేశారు. -
‘లొంగిపోండి.. లేదంటే అంతం చేస్తాం’
-
ఆర్మీ అధికారులకు ధోని స్పెషల్ మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశ సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన ఇన్‌స్టాగ్రమ్ పోస్ట్‌లో ‘భారత మూడో అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆర్మీ దుస్తుల్లో అందుకోవడంతో నా సంతోషం పదిరెట్లు అయింది. మీ కుటుంబాలకు దూరంగా ఉంటూ.. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి.. దేశ పౌరులు రాజ్యాంగ హక్కులను స్వేచ్చగా వినియోగించుకునేలా.. దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనికులందరికీ ధన్యవాదాలు. జైహింద్’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక ధోని పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్న విషయం తెలిసిందే. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ధోని ఆర్మీ దుస్తుల్లో వచ్చి కవాతు చేస్తూ మరి అవార్డు స్వీకరించాడు. 2007లో టి20 ప్రపంచకప్, అనంతరం వన్డే ప్రపంచకప్ అందించిన ధోనిని భారత ఆర్మీ 2011, నవంబర్ 1న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో సత్కరించింది. అయితే కెప్టెన్‌గా ధోని సరిగ్గా ప్రపంచకప్ అందించిన రోజే ఈ అత్యున్నత పురస్కారం అందుకోవడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘మీరు మాకెప్పుడు ఆదర్శమేనంటూ’.. కామెంట్ చేస్తున్నారు. ఆర్మీ డ్రెస్‌లో ఉన్న ధోని కూతురు జీవాకు ఆర్మీ క్యాప్ పెట్టి ఉన్న ఫొటోను ఈ పోస్ట్‌కు ట్యాగ్ చేశాడు. ఈ ఫొటో సైతం అభిమానులను ఆకట్టుకుంటోంది. An honour to get the Padma Bhushan and receiving it in Uniform increases the excitement ten folds.thanks to all the Men and Women in Uniform and their families for the Sacrifices they make so that all of us could enjoy our Constitutional Rights.Jai Hind A post shared by @ mahi7781 on Apr 2, 2018 at 11:36pm PDT -
పదాతిదళాన్ని కుదించనున్న చైనా
♦ నౌకాదళం, క్షిపణి వ్యవస్థలను బలోపేతం చేసేందుకే... ♦ ఇప్పటిదాకా పదాతిదళం సంఖ్య 23 లక్షలు ♦ పది లక్షలకే పరిమితం చేయనున్న డ్రాగన్ ♦ గతంలో పదాతిదళ యుద్ధంపైనే దృష్టి ♦ తాజా పరిస్థితుల నేపథ్యంలో సైనిక బలగాల పునర్వ్యవస్థీకరణ బీజింగ్: ప్రపంచంలోనే భారీసంఖ్యలో సైనిక బలగాలను కలిగిన చైనా తన పదాతి దళాన్ని కుదించనుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)లో మొత్తం సిబ్బంది సంఖ్య 23 లక్షలు కాగా ఇప్పుడు దీనిని పది లక్షల మేర తగ్గించనుంది. చరిత్రలోనే ఇది అతిపెద్ద తగ్గింపుకానుంది. నౌకాదళం, క్షిపణి వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ దిశగా అడుగులు వేయనుంది. ఈ విషయాన్ని చైనా అధికార మీడియా బుధవారం వెల్లడించింది. పీఎల్ఏను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియలో భాగంగా సైన్యంతోపాటు ఇతర బలగాలను సమం చేయనుంది. ఈ విషయాన్ని చైనా సైనిక విభాగం అధికార మీడియా అయిన పీఎల్ఏ డైలీ వెల్లడించింది. నౌకాదళం, క్షిపణి బలగాలసహా ఇతర విభాగలలో సిబ్బందిని పెంచనుంది. పురాతన సైనిక వ్యవస్థలో పెద్దసంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్నారని, వీరిని ఇతర విభాగాలను బదలాయిస్తామని తెలిపింది. ‘వ్యూహాత్మక లక్ష్యాలు, భద్రతా అవసరాలను బట్టి సంస్కరణలు చేపడతామని తెలిపింది. కాగా పీఎల్ఏ గతంలో పదాతిదళ యుద్ధంతోపాటు దేశ అంతర్గత భద్రతావసరాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. అయితే ఇప్పుడు ఈ విధానంలో ప్రాథమిక మార్పులు తీసుకురానుంది. క్రియాశీలక పీఎల్ఏ సైనిక బలగాల సంఖ్యను పదిలక్షలకు కుదించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. పీఎల్ఏ వైమానిక దళం సిబ్బందిని మాత్రం అలాగే ఉంచనుంది. తాజా ప్రతిపాదనతో నౌకాదళం, స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్ సంఖ్య పెరుగుతుందని గ్లోబల్ టైమ్స్ పత్రిక మంగళవారం రాసిన కథనంలో పేర్కొంది. భద్రత దృష్ట్యా చైనా ప్రాథమ్యాలు, అవసరాలు మారిపోయాయని, అంతర్జాతీయస్థాయిలో విస్తరించాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సైనిక విభాగం సలహాదారు జూ గౌన్గ్యు చెప్పారు. చైనా అంతర్జాతీయ హోదాకు తగ్గట్టుగా పీఎల్ఏని పునర్వ్యవస్థీకరిస్తామని ఆయన వివరించారు. కశ్మీర్ అంశంలో వేలుపెడతాం బీజింగ్: సిక్కిం సరిహద్దులోని డోక్లాంను దురాక్రమించడానికి యత్నిస్తున్నా చైనా తాజాగా భారత్‌ను మరోసారి రెచ్చగొట్టిం ది. కశ్మీర్లో పరిస్థితి చేయి దాటినందున అంతర్జాతీయ జోక్యం అనివార్యమని స్పష్టం చేసింది. నియంత్రణ రేఖ వద్ద పరి స్థితులు విషమించాయని, హింస ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతంలో సుస్థిరత దెబ్బతింటుందని పేర్కొంది. భారత్, పాక్ సంబంధాలను బలోపేతం చేయడంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా విదేశాంగమంత్రిత్వశాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ బుధవారం చెప్పారు. కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, ఇందులో మూడోపక్షం జోక్యానికి తావే లేదని భారత్ మొదటి నుంచీ చెబుతున్న సంగతి తెలిసిందే. భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే డ్రాగన్ ఈ ప్రకటన చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, భూటాన్ తరఫున డోక్లామ్‌లో చైనాకు వ్యతిరేకంగా ఇండియా ఎలా పోరాడుతున్నదో కశ్మీర్ అంశానికీ అదే వర్తిస్తుందని ఆ దేశ నిపుణుడు ఒకరు ఇటీవల హెచ్చరించారు. డోక్లామ్ భారత్ భూభాగం కాదన్నారు. ఒకవేళ పాకిస్థాన్ కోరితే తమ సైన్యం కశ్మీర్లో అడుగుపెడుతుందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పత్రికకు రాసిన వ్యాసంలో చైనా వెస్ట్ నార్మల్ యూనివర్సిటీ డైరెక్టర్ లాంగ్ జింగ్‌చున్ హెచ్చరించారు. -
పాక్ దాడుల్లో 35 మంది మిలిటెంట్లు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బలగాలు మంగళవారం జరిపిన దాడుల్లో 35 మంది మిలిటెంట్లు మృతి చెందారు. ఆఫ్ఘాన్ స్థాన్ సరిహద్దు వద్ద సమస్యాత్మకంగా మారిన మిలిటెంట్ల స్థావరాలపై పాకిస్థాన్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడిలో 35 మంది మిలిటెంట్లు మృతిచెందినట్లు ఆర్మీ అధికారి స్పష్టం చేశారు. తాజా దాడిలో పలు వాహనాలు, కొన్ని భవనాలు కూడా ధ్వంసమైనట్లు తెలిపారు. అయితే దాడిలో మృతి చెందిన మిలిటెంట్ల వివరాలు తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు. మృతి చెందిన మిలిటెంట్లలో విదేశీయులు కూడా ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.