మోహరించిన ఇజ్రాయెల్‌ సేనలు | Thousands of Israeli reservists called up for war against Hamas | Sakshi
Sakshi News home page

మోహరించిన ఇజ్రాయెల్‌ సేనలు

Published Tue, Oct 17 2023 5:02 AM | Last Updated on Tue, Oct 17 2023 11:15 AM

Thousands of Israeli reservists called up for war against Hamas - Sakshi

ఇజ్రాయెల్‌ దాడుల్లో కుప్పకూలిన భవన శిథిలాల మధ్య దిగాలుగా ఓ పాలస్తీనా బాలుడు; గాజా స్ట్రిప్‌ దిశగా సాయుధ శకటంపై వెళ్తూ విక్టరీ సింబల్‌ చూపుతున్న ఇజ్రాయెల్‌ సైనికుడు

జెరూసలేం/గాజా స్ట్రిప్‌/రఫా: గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్‌ మిలిటెంట్ల అంతు చూడడంతోపాటు వారి స్థావరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా భూతల దాడులకు ఇజ్రాయెల్‌ సైన్యం సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. పదాతి దళాలు పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాయి. 3 లక్షలకుపైగా ఇజ్రాయెల్‌ రిజర్వ్‌ సైనికులు గాజా సరిహద్దుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు.

ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం సోమవారం పదో రోజుకు చేరుకుంది. ఈ పోరులో ఇప్పటిదాకా గాజాలో 2,750 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, 9,700 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించినట్లు తెలిసింది. అతిత్వరలోనే ఉత్తర గాజాపై ఇజ్రాయెల్‌ సేనలు భూతల దాడులు ప్రారంభిస్తాయని ప్రచారం సాగుతోంది. ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వలసబాట పట్టారు.

ఇప్పటిదాకా 6 లక్షల మందికిపైగా జనం వెళ్లిపోయినట్లు అంచనా. ఇజ్రాయెల్‌కు సాయంగా మిత్రదేశం అమెరికా పంపించిన అత్యాధునిక యుద్ధవిమాన వాహక నౌకలు మధ్యదరా సముద్రంలో గాజా తీరంలో మోహరించాయి. గాజాను గుప్పిట్లో పెట్టుకొని తమ భద్రతకు ముప్పుగా పరిణమించిన హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ను నామరూపాల్లేకుండా చేయడమే తమ ముందున్న కర్తవ్యమని ఇజ్రాయెల్‌ సైన్యం తేలి్చచెబుతోంది.

గాజాలో ప్రజల కష్టాలకు తెరపడడం లేదు. ఆహారం, నీరు, ఇంధనం కొరత తీవ్రరూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో గాయపడిన వేలాది మంది ఆసుపత్రుల్లో చేరారు. ఆసుపత్రుల్లో వారి పరిస్థితి మరింత హృదయవిదారకంగా మారింది. చికిత్సలు ఆగిపోవడంతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతదేహాలను భద్రపర్చడానికి ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు కూడా లేవని వాపోతున్నారు.  

హమాస్‌ చేతిలో బందీలు 199 మంది  
గాజాలో హమాస్‌ మిలిటెంట్ల చేతిలో ప్రస్తుతం 199 మంది బందీలు ఉన్నారని ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారీ సోమవారం వెల్లడించారు. దాదాపు 150 మంది బందీలు ఉన్నట్లు ఇప్పటిదాకా భావించామని, కానీ, 199 మంది ఉన్నట్లు తేలిందని చెప్పారు. బందీల్లో చాలామంది ఇజ్రాయెల్‌ సైనికులు, మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, బందీల్లో విదేశీయులు ఉన్నారో లేదో ఆయన బహిర్గతం చేయలేదు.  

వైమానిక దాడులు నిలిపివేస్తే బందీలు విడుదల  
గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులను ఇజ్రాయెల్‌ నిలిపివేస్తే బందీలను విడుదల చేయడానికి హమాస్‌ సిద్ధంగా ఉందని ఇరాన్‌ విదేశాంగ శాఖ సోమవారం తెలియజేసింది. కానీ, దీనిపై హమాస్‌ స్పందించలేదు. తమపై దాడులు ఆపడంతోపాటు ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే, అందుకు బదులుగా తమ వద్దనున్న బందీలను విడుదల చేయాలన్న ఆలోచనలో హమాస్‌ ఉన్నట్లు సమాచారం.  

ఇజ్రాయెల్‌–లెబనాన్‌ సరిహద్దుల్లో....  
లెబనాన్‌ సరిహద్దుల్లో నివసిస్తున్న యూ దులంతా వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయా లని ఇజ్రాయెల్‌ సైన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లెబనాన్‌ సరిహద్దుల సమీపంలో 28 యూదు కాలనీలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌–లెబనాన్‌ సరిహద్దుల్లోనూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యం, లెబనాన్‌ ప్రభుత్వ మద్దతున్న షియా తీవ్రవాద సంస్థ హెజ్బొల్లా సభ్యుల మధ్య పరస్పరం కాల్పులు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాల్లోని నిఘా కెమెరాలను హెజ్బొల్లా సభ్యులు ధ్వంసం చేయడం ప్రారంభించారు. తమ కదలికలను ఇజ్రాయెల్‌ గుర్తించకుండా ఉండేందుకు వారు ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌–హెజ్బొల్లా మధ్య జరిగిన తాజా ఘర్షణలో ఒక ఇజ్రాయెల్‌ సైనికుడు, ఒక పౌరుడు మరణించారు. లెబనాన్‌లో ఒక జర్నలిస్టు సహా ముగ్గురు పౌరులు మృతిచెందారు.

వచ్చేవారం ఇజ్రాయెల్‌కు జో బైడెన్‌!  
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వచ్చేవారం ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్నారని తెలిసింది. ఈ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అరబ్‌ దేశాల పర్యటన ముగించుకొని సోమవారం ఇజ్రాయెల్‌కు తిరిగివచ్చారు. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూతోపాటు అధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చలు జరిపారు.  

గాజాపై ఆధిపత్యం పొరపాటే అవుతుంది: బైడెన్‌  
ఇజ్రాయెల్‌ సేనలు గాజాలో సుదీర్ఘకాలంపాటు ఉండడం పెద్ద పొరపాటుగా పరిణమించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు. గాజాపై యుద్ధం వద్దంటూ ఇజ్రాయెల్‌కు పరోక్షంగా సూచించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను కచి్చతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. గాజా ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు హితవు పలికారు. గాజాలో పాలస్తీనియన్ల ఆధ్వర్యంలోనే పాలన కొనసాగాలని తాను ఆశిస్తున్నట్లు బైడెన్‌ తాజాగా స్పష్టం చేశారు. మొత్తం పాలస్తీనియన్లకు హమాస్‌ మిలిటెంట్లు ప్రతినిధులు కాదని తేల్చిచెప్పారు. గాజాను ఇజ్రాయెల్‌ ఎక్కువ కాలం అ«దీనంలో ఉంచుకుంటుందని తాను భావించడం లేదన్నారు.   

మమ్మల్ని పరీక్షించొద్దు: నెతన్యాహూ  
తమ దేశ ఉత్తర సరిహద్దుల్లో తమను పరీక్షించవద్దని ఇరాన్, హెజ్బొల్లా సంస్థను ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ హెచ్చరించారు. ఆయన సోమవారం ఇజ్రాయెల్‌ చట్టసభ ‘నెస్సెట్‌’లో ప్రసంగించారు. హమాస్‌ను ఓడించడానికి ప్రపంచ దేశాలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘ఈ యుద్ధం మీ యుద్ధం’ అని అన్నారు. హమాస్‌ మిలిటెంట్లు నాజీ ముష్కరుల్లాంటివారేనని నెతన్యాహూ తేలి్చచెప్పారు.   

దాడులు ఆపకపోతే అన్ని చేతులూ ట్రిగ్గర్‌పైనే: ఇరాన్‌  
గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ వైమానిక దాడులను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దురాక్రమణ సాగిస్తున్న ఇజ్రాయెల్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రాంతంలో అందరూ సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీరబ్దొల్లాహియాన్‌ స్పష్టం చేశారు. గాజాపై దాడులు ఆపకపోతే అన్ని చేతులూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయని, ఇజ్రాయెల్‌కు గుణపాఠం తప్పదని తేలి్చచెప్పారు. గాజాలో సాధారణ పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను వెంటనే ఆపాలని అమెరికాకు ఇరాన్‌ సూచించింది. గాజాపై వైమానిక దాడులు ఆపకపోతే తాము ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.  

బందీలను వెంటనే విడుదల చేయాలి: ఐరాస  
బందీలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని హమాస్‌ మిలిటెంట్లకు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌ హితవు పలికారు. అలాగే గాజా స్ట్రిప్‌కు ఆహారం, నీరు, ఔషధాల సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని సోమవారం ఇజ్రాయెల్‌కు సూచించారు. ప్రపంచ దేశాల నుంచి పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేలా ఆంక్షలు తొలగించాలని, సరిహద్దులు తెరవాలని అన్నారు. సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హర్షించదగ్గ పరిణామం కాదని చెప్పారు. ఈజిప్టు, జోర్డాన్, వెస్ట్‌బ్యాంకు నుంచి నిత్యావసరాలు పాలస్తీనియన్లకు అందేలా ఇజ్రాయెల్‌ చొరవ తీసుకోవాలని కోరారు.   

ఘర్షణ ఆగిపోవాలి: రిషి సునాక్‌  
ఇజ్రాయెల్‌–హమాస్‌ ఘర్షణ మరింత విస్తరించవద్దని కోరుకుంటున్నానని బ్రిటిష్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ చెప్పారు. ఘర్షణ ఆగిపోవాలని, ఇందుకోసం తన వంతు కృషి చేస్తానని, ఈ దిశగా ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి పని చేస్తానని వివరించారు. రిషి సునాక్‌ తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. జోర్డాన్‌ రాజు అబ్దుల్లాతో లండన్‌లో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంపై వారితో చర్చించారు. సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు రిషి సునాక్‌ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement