కూతురు జీవాతో ధోని
సాక్షి, హైదరాబాద్ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశ సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన ఇన్‌స్టాగ్రమ్ పోస్ట్‌లో ‘భారత మూడో అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆర్మీ దుస్తుల్లో అందుకోవడంతో నా సంతోషం పదిరెట్లు అయింది. మీ కుటుంబాలకు దూరంగా ఉంటూ.. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి.. దేశ పౌరులు రాజ్యాంగ హక్కులను స్వేచ్చగా వినియోగించుకునేలా.. దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనికులందరికీ ధన్యవాదాలు. జైహింద్’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ఇక ధోని పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్న విషయం తెలిసిందే. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ధోని ఆర్మీ దుస్తుల్లో వచ్చి కవాతు చేస్తూ మరి అవార్డు స్వీకరించాడు. 2007లో టి20 ప్రపంచకప్, అనంతరం వన్డే ప్రపంచకప్ అందించిన ధోనిని భారత ఆర్మీ 2011, నవంబర్ 1న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో సత్కరించింది. అయితే కెప్టెన్‌గా ధోని సరిగ్గా ప్రపంచకప్ అందించిన రోజే ఈ అత్యున్నత పురస్కారం అందుకోవడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘మీరు మాకెప్పుడు ఆదర్శమేనంటూ’.. కామెంట్ చేస్తున్నారు. ఆర్మీ డ్రెస్‌లో ఉన్న ధోని కూతురు జీవాకు ఆర్మీ క్యాప్ పెట్టి ఉన్న ఫొటోను ఈ పోస్ట్‌కు ట్యాగ్ చేశాడు. ఈ ఫొటో సైతం అభిమానులను ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment