రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తున్న ధోని
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ధోనితో పాటు బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి మరీ అవార్డు స్వీకరించారు. ఇక ధోని అవార్డు అందుకుంటుండగా అతని భార్య సాక్షిసింగ్ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేసారు.
28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు ధోని భారత్‌కు ప్రపంచకప్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఇదే రోజు ధోని దేశ మూడో అత్యున్నత పురస్కారం అందుకోవడం విశేషం. దీంతో ఏప్రిల్ 2 ధోనికి అతని అభిమానులకు ఓ ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది.
ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా 2011లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోని అద్భుత సిక్సుతో భారత అభిమానుల కల సాకారమైంది. ధోని భారత క్రికెట్‌కు అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం గతంలోనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment