Rashtrapati Bhawan
-
Bharat Ratna : భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి (ఫొటోలు)
-
‘పద్మ’కు తాకిన కరోనా భయాలు!
న్యూఢిల్లీ: కరోనా భయాల నేపథ్యంలో పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదాపడింది. అంతకంతకూ కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో ఏప్రిల్ 3న జరగాల్సిన పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ప్రకటించింది. కాగా, ఈ ఏడాది పలు రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి. పద్మ విభూషణ్ అవార్డు ఏడుగురిని వరించగా.. పద్మభూషణ్ 16 మందిని.. 118 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఇక తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ క్రీడా కారిణి పీవీ సింధుకు పద్మ భూషణ్ పురస్కారం లభించగా.. రైతు చిన్నితల వెంకట్ రెడ్డి, సాహిత్య రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన విజయ సారథి శ్రీ భాష్యంకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కళారంగంలో సేవలందించినందుకు దలవాయి చలపతిరావు, ఎడ్ల గోపాలరావుకు పద్మశ్రీ పురస్కారాలు అందుకోనున్నారు. (చదవండి: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం) -
మైనారిటీల అభ్యున్నతికి కృషి చేయండి
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, సమాజంలో వెనుకబడ్డ తరగతులు, మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సుల్లో మోదీ మాట్లాడారు. ఆరోగ్య, విద్య, పర్యాటక రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా పేద, అణగారిన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని ప్రధాని తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగ విధులు నిర్వర్తించే గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు సామాన్యుల సమస్యలను పట్టించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీ, మహిళ, యువజన వర్గాలకు ప్రభుత్వ పథకాల లబ్ది అందేలా చూడాలని కోరారు. పరస్పర సహకారం, పోటీతత్వంతో కూడిన సమాఖ్య వ్యవస్థ సాకారానికి గవర్నర్ల వ్యవస్థ ఎంతో కీలకమైందని ప్రధాని పేర్కొన్నారు. ‘భారత రాజ్యాంగ రచన 70 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల విధులు, బాధ్యతలపై అవగాహన పెంచేందుకు కలిసి పనిచేయాలి’ అన్నారు. ఢిల్లీలో జరిగిన 50వ గవర్నర్ల వార్షిక సమావేశంలో తొలిసారి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లుగా నియమితులైన 17 మంది పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణే కాదు!రాష్ట్రపతి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల పాత్ర కేవలం రాజ్యాంగ పరిరక్షణకు మాత్రమే పరిమితం కారాదని, ప్రజా జీవితంలో వీరికున్న అపార అనుభవం ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన 50వ గవర్నర్ల వార్షిక సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. గవర్నర్లు ఆయా రాష్ట్రాల ప్రజల సేవకు, సంక్షేమానికి నిత్యం పనిచేయాలని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ కేంద్ర పాలిత ప్రాంతాలు లడాఖ్, జమ్మూ కశ్మీర్‌ల లెఫ్టినెంట్ గవర్నర్లు ఆర్.కె.మాథుర్, జి.సి.మర్మూల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించిన రాష్ట్రపతి గిరిజనుల అభివృద్ధి, సాధికారత సమీకృత అభివృద్ధికి, దేశ భద్రతలకూ కీలకమని వ్యాఖ్యానించారు. ‘వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి సంబంధించి గవర్నర్లు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వాలకు తగిన సూచనలు చేయవచ్చు’ అని సూచించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య గవర్నర్లను ఉద్దేశించి మాట్లాడారు. -
వీఐపీ కాదు.. వీవీఐపీ వరుసలోనే
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరు కాలేదు. పవార్ గైర్హాజరుపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తనకు వీవీఐపీ వరుసలో కాకుండా.. వీఐపీ వరుసలో అది కూడా ఐదో రోలో స్థానం కేటాయించడంతో శరద్ పవార్ మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ అధికారులు ఈ వార్తలపై స్పందించారు. అత్యంత సీనియర్ అతిథులు కూర్చునే వీవీఐపీ సెక్షన్‌లోని రెండో వరుసలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు సీటు కేటాయించినట్టు రాష్ట్రపతి భవన్ మీడియా ప్రతినిధి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆహ్వాన లేఖలో ‘వీ సెక్షన్’ అని ఉండటం వల్ల శరద్ పవార్ కార్యాలయ సిబ్బంది దానిని రోమన్ అంకెలలోని ఐదుగా పొరపాటు పడ్డారని ఆయన వివరించారు. -
రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్‌లో కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో శుక్రవారం కలకలం రేగింది. ఈ క్వార్టర్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మృతుడు రాష్ట్రపతి సచివాలయంలో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. మృతదేహం ఉన్న గది నుంచి వాసన రావడంతో సహఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేయగా వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. అదేవిధంగా మృతుడి ఉన్న గదికి లోపలి నుంచి తాళం వేసి ఉన్నట్టు తెలిపారు.. ఆయన కొద్ది కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అయితే మృతుడి మరణానికి కారణాలేమిటో తెలియరాలేదు. -
పద్మభూషణ్ అవార్డు అందుకున్న ధోని
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ధోనితో పాటు బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి మరీ అవార్డు స్వీకరించారు. ఇక ధోని అవార్డు అందుకుంటుండగా అతని భార్య సాక్షిసింగ్ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేసారు. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు ధోని భారత్‌కు ప్రపంచకప్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఇదే రోజు ధోని దేశ మూడో అత్యున్నత పురస్కారం అందుకోవడం విశేషం. దీంతో ఏప్రిల్ 2 ధోనికి అతని అభిమానులకు ఓ ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా 2011లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోని అద్భుత సిక్సుతో భారత అభిమానుల కల సాకారమైంది. ధోని భారత క్రికెట్‌కు అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం గతంలోనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
పద్మభూషణ్ అవార్డు అందుకున్న ధోని, పంకజ్ అద్వాని
-
అశోక్, సుజనా రాజీనామాలు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామాలకు ఆమోదముద్ర పడింది. కేంద్ర మంత్రి పదవులకు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి చేసిన రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి సిఫారసు మేరకు వీరి రాజీనామాలను ఆమోదం లభించిందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. పౌర విమానయాన శాఖను ప్రధాని పర్యవేక్షిస్తారని వెల్లడించింది. సుజనా చౌదరి నిర్వహించిన శాస్త్ర, సాంకేతిక సహాయ శాఖను ఎవరికీ అప్పగించలేదు. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వీరిద్దరూ రాజీనామాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుగా టీడీపీ ఎంపీల నిరసనలకు దూరంగా ఉన్న అశోక్‌గజపతిరాజు ఈరోజు పార్లమెంట్ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. సహచర ఎంపీలతో కలిసి నినాదాలు చేశారు. -
పరిశుభ్ర భవనంగా రాష్ట్రపతి భవన్!
న్యూఢిల్లీ: దేశరాజధానిలో పరిశుభ్రమైన భవనాల జాబితాలో రాష్ట్రపతి భవన్, హైదరాబాద్ హౌజ్, యూపీఎస్సీ బిల్డింగ్తోపాటు జవహార్‌లాల్ నెహ్రూభవన్ మొదటి స్థానంలో ఉన్నయని.. తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలోని 36 ప్రముఖ భవంతుల్లో స్వచ్ఛతపై జరిపిన ఈ సర్వేలో.. ఎన్నికల సంఘం, జైపూర్, జామ్‌నగర్, జైసల్మేర్ భవనాలు చివరి స్థానంలో ఉన్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ పనితీరు అంచనావేసేందుకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మార్చి 16-21 వరకు ఈ సర్వే నిర్వహించింది. -
'రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్‌ను కూల్చాలి'
రాంపూర్: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి ఆజమ్ ఖాన్ మరోసారి వివాదానికి తెరలేపారు. గతంలో తాజ్‌మహల్ కూల్చి శివాలయం నిర్మించాలంటూ వివాదాన్ని సృష్టించిన ఆయన.. తాజాగా మరో వివాదాన్ని రగిలించారు. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలు బానిసత్వానికి ప్రతీకలని, వాటిని కూలగొట్టాలంటూ వ్యాఖ్యానించారు. రాంపూర్‌లోని డిగ్రీ కళాశాలలో జరిగిన ఒక సెమినార్లో ప్రసంగించిన ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాలు బానిసత్వానికి చిహ్నాలని పేర్కొన్నారు. ఈ వరుసలో ముందు తాజ్‌మహల్, తరువాత రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ నిలుస్తున్నాయన్నారు. అందుకే వాటికి పడగొట్టాలన్నారు. ప్రజాధనాన్నిభారీగా వృధా చేసిన స్మారక కట్టడాల్లో తాజ్ మహల్ ఒకటనీ, అక్కడ నిలబడాలంటేనే తనకు నచ్చదన్నారు. అదొక క్రిమినల్ వేస్ట్ అంటూ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాష్ట్రపతి భవన్లో ఒబామా దంపతులకు విందు
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు సంప్రదాయం ప్రకారం ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిభవన్‌లో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో రాష్ట్రపతిభవన్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విందుకు వచ్చిన అతిథులకు శాకాహార వంటకాలతో పాటు మాంసాహార వంటకాలను వడ్డించారు. కశ్మీర్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు గల పసందైన వంటకాలను మెనూలో చేర్చారు. ఇందులో కశ్మీరీ గుస్తబా, మటన్ రోగన్ జోష్, గలౌటీ కబాబ్, పనీర్ మలై టిక్కా, చికెన్ టిక్కా, ఖాది పకోడ తదితరాలు ఉన్నాయి. ఈ విందుకు రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. కొందరు ప్రముఖులను ఒబామా, అతని భార్య మిషేల్ కలిశారు. ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఈ విందులో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆయన మంత్రి వర్గ సహచరులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, వ్యాపార దిగ్గజాలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ తదితరులు పాల్గొన్నారు. -
15వ ప్రధానిగా రేపు మోడీ ప్రమాణం!
న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సోమవారం ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. లోకసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగేలా బీజేపీ మెజార్టీ సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. భారత దేశ 15వ ప్రధానిగా మోడీ ప్రమాణం స్వీకారం చేయనున్న కార్యక్రమానికి 3 వేల మంది విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, అతిధులు హాజరవ్వనున్నారు. సార్క్ దేశాల నుంచి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, భూటాన్ ప్రధాని షేరింగ్ తోగ్బే, నేపాల్ ప్రధాని సుశీల్ కుమార్ కోయిరాలా, మాల్డీవ్ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ లు కూడా అతిధుల జాబితాల ఉన్నారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జరిగే కార్యక్రమంలో మోడీ, ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.