న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, సమాజంలో వెనుకబడ్డ తరగతులు, మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సుల్లో మోదీ మాట్లాడారు. ఆరోగ్య, విద్య, పర్యాటక రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా పేద, అణగారిన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని ప్రధాని తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది.
రాజ్యాంగ విధులు నిర్వర్తించే గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు సామాన్యుల సమస్యలను పట్టించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీ, మహిళ, యువజన వర్గాలకు ప్రభుత్వ పథకాల లబ్ది అందేలా చూడాలని కోరారు. పరస్పర సహకారం, పోటీతత్వంతో కూడిన సమాఖ్య వ్యవస్థ సాకారానికి గవర్నర్ల వ్యవస్థ ఎంతో కీలకమైందని ప్రధాని పేర్కొన్నారు. ‘భారత రాజ్యాంగ రచన 70 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల విధులు, బాధ్యతలపై అవగాహన పెంచేందుకు కలిసి పనిచేయాలి’ అన్నారు. ఢిల్లీలో జరిగిన 50వ గవర్నర్ల వార్షిక సమావేశంలో తొలిసారి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లుగా నియమితులైన 17 మంది పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణే కాదు!రాష్ట్రపతి
గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల పాత్ర కేవలం రాజ్యాంగ పరిరక్షణకు మాత్రమే పరిమితం కారాదని, ప్రజా జీవితంలో వీరికున్న అపార అనుభవం ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన 50వ గవర్నర్ల వార్షిక సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. గవర్నర్లు ఆయా రాష్ట్రాల ప్రజల సేవకు, సంక్షేమానికి నిత్యం పనిచేయాలని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ కేంద్ర పాలిత ప్రాంతాలు లడాఖ్, జమ్మూ కశ్మీర్‌ల లెఫ్టినెంట్ గవర్నర్లు ఆర్.కె.మాథుర్, జి.సి.మర్మూల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించిన రాష్ట్రపతి గిరిజనుల అభివృద్ధి, సాధికారత సమీకృత అభివృద్ధికి, దేశ భద్రతలకూ కీలకమని వ్యాఖ్యానించారు. ‘వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి సంబంధించి గవర్నర్లు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వాలకు తగిన సూచనలు చేయవచ్చు’ అని సూచించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య గవర్నర్లను ఉద్దేశించి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment