రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మిషేల్, ఒబామా
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు సంప్రదాయం ప్రకారం ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిభవన్‌లో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో రాష్ట్రపతిభవన్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విందుకు వచ్చిన అతిథులకు శాకాహార వంటకాలతో పాటు మాంసాహార వంటకాలను వడ్డించారు. కశ్మీర్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు గల పసందైన వంటకాలను మెనూలో చేర్చారు. ఇందులో కశ్మీరీ గుస్తబా, మటన్ రోగన్ జోష్, గలౌటీ కబాబ్, పనీర్ మలై టిక్కా, చికెన్ టిక్కా, ఖాది పకోడ తదితరాలు ఉన్నాయి.
ఈ విందుకు రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. కొందరు ప్రముఖులను ఒబామా, అతని భార్య మిషేల్ కలిశారు. ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఈ విందులో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆయన మంత్రి వర్గ సహచరులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, వ్యాపార దిగ్గజాలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ తదితరులు పాల్గొన్నారు.