
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ హాజరు కాలేదు. పవార్ గైర్హాజరుపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తనకు వీవీఐపీ వరుసలో కాకుండా.. వీఐపీ వరుసలో అది కూడా ఐదో రోలో స్థానం కేటాయించడంతో శరద్ పవార్ మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ అధికారులు ఈ వార్తలపై స్పందించారు. అత్యంత సీనియర్ అతిథులు కూర్చునే వీవీఐపీ సెక్షన్‌లోని రెండో వరుసలో ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు సీటు కేటాయించినట్టు రాష్ట్రపతి భవన్ మీడియా ప్రతినిధి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆహ్వాన లేఖలో ‘వీ సెక్షన్’ అని ఉండటం వల్ల శరద్ పవార్ కార్యాలయ సిబ్బంది దానిని రోమన్ అంకెలలోని ఐదుగా పొరపాటు పడ్డారని ఆయన వివరించారు.