మాల్దీవుల వివాదం.. ప్రధాని మోదీకి మద్దతుగా శరద్‌ పవార్‌ | Sharad Pawar Support To PM Modi On Maldives row | Sakshi
Sakshi News home page

Maldives Row: మోదీకి మద్దతుగా శరద్‌పవార్‌.. ‘ప్రధానిని ఏమైనా అంటే ఊరుకోం’

Published Tue, Jan 9 2024 3:58 PM | Last Updated on Tue, Jan 9 2024 4:50 PM

Sharad Pawar Support To PM Modi On Maldives row - Sakshi

‘లక్షద్వీప్‌’ విషయంలో మాల్దీవులు-భారత్ మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటన అనంతరం భారత్‌పై మాల్దీవ్‌ మంత్రులు వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదాస్పద వాతావరణం తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల వివాదంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ స్పందించారు.

ఈ విషయంలో మోదీకి మద్దతుగా నిలిచి శరద్‌ పవార్‌.. ఇతర దేశాలకు చెందిన వారు ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తాము(దేశం) అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ‘మోదీ దేశానికి ప్రధానమంత్రి.. వేరే దేశస్థులు మా ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని మేము అంగీకరించము. మేము ప్రధానమంత్రి పదవిని గౌరవిస్తాం. ఆయనకు వ్యతిరేకంగా  బయటి వాళ్లు ఏం మాట్లాడినా మేం ఊరుకోం’ అని పేర్కొన్నారు.

‌కాగా గత వారం ప్రధాని లక్ష్యద్వీలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన.. కొన్ని గంటలపాటు ఆ సముద్ర తీరంలో సేద తీరారు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో.. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు.
సంబంధిత వార్త: భారత్-మాల్దీవుల వివాదం.. దుష్టబుద్ధిని బయటపెట్టిన చైనా

లక్షద్వీప్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఈ క్రమంలో  ప్రపంచ పర్యాటకులంతా లక్షద్వీప్ వైపు చూస్తున్నారు. చాలా వరకు భారతీయులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. బైకాట్‌ మాల్దీవులు అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

మరోవైపు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు మాల్దీవ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్‌పై విమర్శలు చేసిన మంత్రులపై వేటు వేసింది. భారత్‌తో  ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో త్వరలోనే మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు భారత్‌ పర్యటనకు రానున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
చదవండి: లక్షద్వీప్ వైపు లక్షల మంది చూపు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement