ముంబై: నకిలీ ఎన్సీపీ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీసీ (శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారితో (బీజేపీ) తాను ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గాన్ని ఉద్ధేశిస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో విలీనమై ఉనికి కోల్పోవడం కన్నా.. అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండేతో చేతులు కలపాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయోలో చేరాలని తెలిపారు.
‘గత 40-50 ఏళ్లుగా మహారాష్ట్రకు చెందిన ఓ ప్రముఖ నాయకుడు (శరద్ పవార్) రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. బారామతి లోక్‌సభ స్థానంలో పోలింగ్ తర్వాత ఏమవుతుందో అని ఆయన ఆందోళన చెందుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. జూన్ 4 అనంతరం చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్‌లో విలీం చేయాలని ఆయన అంటున్నారు’ అని మోదీ తెలిపారు. నకిలీ ఎన్‌సీపీ, నకిలీ శివసేన ఇదే ఆలోచనతో ఉన్నట్లు’ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల పార్టీల గురించి ఎద్దేవా చేశారు.
దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. మోదీ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. తాను గాంధీ-నెహ్రూ భావజాలాన్ని ఎన్నడూ వదులుకోనని, ముస్లిం వ్యతిరేక విధానాలు అవలంబించే వారితో చేతులు కలపనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతల్లో ఓటమి తాలూకు భయం కన్పిస్తోందని, అందుకే తన ప్రసంగాన్ని మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ తమపై వస్తున్న ప్రతికూలతను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. ఇందుకు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను అరెస్టు చేసిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.
‘కేజ్రీవాల్, సోరెన్‌లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం పాత్ర లేకుండా ఇది సాధ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికి ఎంత విశ్వాసం ఉందో ఇది తెలియజేస్తోంది. ప్రధానమంత్రి మోదీ ఇటీవలి ప్రసంగాలు వర్గాల మధ్య చీలికలు సృష్టించేలా ఉన్నాయి. మోదీ ప్రసంగాలు ప్రధాని పదవికి తగినవి కావు. ఇది దేశానికి ప్రమాదకరం. శివసేన(యూబీటీ), ఎన్సీపీలను నకిలీ అని విమర్శించడం సరికాదు. డూప్లికేట్ అని పిలిచే హక్కు ఆయనకు ఎవరిచ్చారు?’ అని శరద్ మండిపడ్డారు
Comments
Please login to add a commentAdd a comment