రాజ్‌ఠాక్రేపై ఏ ఫైల్‌ ఓపెన్‌ చేశారు: సంజయ్‌ రౌత్‌ | Sakshi
Sakshi News home page

రాజ్‌ఠాక్రేపై ఏ ఫైల్‌ ఓపెన్‌ చేశారు: సంజయ్‌ రౌత్‌

Published Wed, Apr 10 2024 2:27 PM

Sanjay Raut questions Raj Thackeray Which file opened over BJP tilt - Sakshi

ముంబై:  లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ఠాక్రేపై శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్‌ ఠాక్రేపై ఏదో ఫైల్‌ ఓపన్‌ చేశాని.. అందుకే ఒక్కసారిగా బీజేపీకి తన మద్దతు ప్రకటించారని సంజయ్‌ రౌత్‌ అన్నారు. 

‘ఒక్కసారిగా ఏదో విచిత్రం జరిగింది. మేము ఈ విషయాన్ని రాజ్‌ఠాక్రేను అడగదలుచుకున్నాం. ఒక్కసారిగా మారిపోయి మహారాష్ట్ర శత్రువుల(ప్రత్యర్థుల)వైపు చేరి పూర్తి మద్దతు ఇస్తున్నారు. మీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? ఇలా చేయటం వెనక ఉన్న బలమైన కారణం ఏంటీ? మీ మీద ఏ ఫైల్‌ ఓపెన్‌ చేశారు?’ అని సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు.

మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు సోదరుడైన రాజ్‌ ఠాక్రే... తన పార్టీ బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌ (ఎన్సీపీ) కూటమికి సంపూర్ణ మద్దత ఇస్తుందని ప్రకటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌ ఠాక్రే.. తన పార్టీ కేవలం ప్రధాని నర్రేందమోదీ, ఎన్డీయే కూటమికే మాత్రమే మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనకు 1990 నుంచి బీజేపీతో మంచి సంబంధాలు ఉ‍న్నాయని తెలిపారు. మొదటి నుంచి నరేంద్ర మోదీ.. ప్రధాని అవుతారన్న వారిలో తాను ఒకరినని చెప్పారు.

ఇక.. ఉద్ధవ్‌ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం మహావికాస్‌ ఆఘాడీ కూటమి మధ్య సీట్లు పంపిణీ ఖరారైన విషయం తెలిసిందే. శివసేన (యూబీటీ)కి -21,కాంగ్రెస్‌- 17, ఎన్సీపీ (శరద్‌ చంద్ర పవార్‌)-10 సీట్లుతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement