ముంబై: అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయం అసక్తికరంగా మారుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందస్తుగా ప్రకటించాలని వస్తున్న సూచనను ఎన్సీపీ (శరద్ పవార్) చీఫ్ శరద్ పవార్ తిరస్కరించారు.
కూటమి తరఫున శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీలో చర్చలు జరగుతున్న సమయంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
‘మన కూటమే మన ఉమ్మడి సీఎం అభ్యర్థి. ఒక వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించటంపై మాకు నమ్మకం లేదు. ఉమ్మడి నాయకత్వమే మా ఫార్మూలా’ అని శరద్ పవార్ అన్నారు.
అయితే సీఎం అభ్యర్థి ప్రకటనపై కూటమిలో గురువారం నుంచి అంతర్గతం వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఓవైపు శరద్ పవార్ తిరస్కరిస్తున్న సమయంలోనే శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్.. ఎంవీకే కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను నిలపాలని అంటున్నారు. శరద్ పవార్ వ్యాఖ్యపై సంజయ్ రౌత్ స్పందించారు.
‘శరద్ పవార్ చెబుతుంది నిజమే. ఎంవీకే కూటమి ముందు మెజార్టీ స్థానాలకు సాధించాలి. అయితే రాహుల్ గాంధీని లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మరో 23 నుంచి 30 సీట్లను ఇండియా కూటమి గెలచుకొని ఉండేది. ఇది మా పార్టీ అభిప్రాయం. ఏ ప్రభుత్వం, పార్టీ అయినా సీఎం అభ్యర్థి ముఖం లేకుండా ఉండకూడదు. ప్రజలకు కూడా తెలియాలి కదా.. వారు ఎవరికి ఓటు వేస్తున్నారో.
..ప్రజలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నరేంద్ర మోదీ ఇలా అభ్యర్థుల ముఖాలను చూసే ఓటు వేశారు. అదేవిధంగా ఎంవీఏ కూటమి తరఫున ఎవరిని సీఎం అభ్యర్థిగా పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఎంవీఏలో మూడు పార్టీలు ఉన్నాయి. మూడు పార్టీలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాయి. మళ్లీ అసెంబ్లీకి సైతం ఇలాగే ఉమ్మడిగా పోటీ చేయడానికి సిద్ధం’ అని అన్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘ఉద్ధవ్ ఠాక్రే గతంలో ఎంవీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన చేసిన మంచి పనులను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. అదే విధంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రే పలు మిత్రపక్షాలను ముందుండి నడిపించారు’ అని అన్నారు. మహారాష్ట్రలో సెపప్టెంబర్/ అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment