ముంబై: ఉద్దవ్ ఠాక్రే వార్గానికి చెందిన శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి ప్రియాంక గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణాసి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అన్నారు.ఈ మేరకు సంజయ్ రౌత్ సోమవారం మాట్లాడుతూ.. వారణాసి ప్రజలలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారని తెలిపారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీపై పోటీగా ప్రియాంక గాంధీ బరిలోకి దిగితే తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాయ్‌బరేలీ, వారణాసి, అమేథీలో బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భేటీపై కూడా సంజయ్ రౌత్ స్పందించారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలసుకోగా లేనిది శరద్, అజిత్ ఎందుకు భేటీ కాకూడదని ప్రశ్నించారు. ఆదివారం శరద్, అజిత్ పవార్ సమావేశమయ్యారని మీడియా ద్వారా తెలిసింది. దీనిపై శరద్ పవార్ త్వరలోనే మాట్లాడతారన్నారు. ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించేందుకే అజిత్ పవార్‌ను.. శరద్ పవార్ కలిసి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంపై మహారాష్ట్ర ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ సహా రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
చదవండి: తండ్రీకొడుకుల్ని బలిగొన్న నీట్.. స్టాలిన్ ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment