శరద్ పవార్‌తో అజిత్ పవార్ (ఫైల్)
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని శివనేత నేత సంజయ్ రౌత్ విమర్శించారు. బీజేపీతో కలిసి అజిత్ పవార్ అధికారం పంచుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ వ్యవహారం వెనుక శరద్ పవార్ లేరని నమ్ముతున్నట్టు వెల్లడించారు. అజిత్ పవార్‌పై ముందు నుంచి అనుమానం ఉందని, ఈడీ కేసులకు భయపడే ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చారని ఆరోపించారు. శుక్రవారం తమతో జరిగిన సమావేశంలోనూ అజిత్ తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు.
శరద్ పవార్‌ను అజిత్ మోసం చేశారని, దొంగదెబ్బ తీశారని దుయ్యబట్టారు. ఛత్రపతి శివాజీ వారసత్వమున్న మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు సరికాదన్నారు. అజిత్, ఆయనను సమర్థిస్తున్న ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీని, మహారాష్ట్ర ప్రజలను అవమానించారని మండిపడ్డారు. ధన బలంతో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుందన్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో శరద్ పవార్ టచ్‌లోనే ఉన్నారని, వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడతారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో శరద్ పవార్‌కు శివసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. (అందుకే కలిశాం; ‘మహా’ ట్విస్ట్‌పై వివరణ)
బీజేపీకి శివసేనే వెన్నుపోటు పొడిచిందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటిమికి అనుకూలంగా మహారాష్ట్ర ప్రజలు ఓటు వేస్తే ప్రజా తీర్పును శివసేన అపహాస్యం చేసిందని ధ్వజమెత్తారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా మొదటి నుంచి శివసేన ప్రత్యామ్నాయం గురించి మాట్లాడిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్సీపీ మద్దతుతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో శివసేనకు దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు. సంజయ్ రౌత్ ఇకకైనా నోరు మూసుకుంటే మంచిదని హితవు పలికారు. శివసేనను నాశనం చేస్తోంది ఆయననే దుయ్యబట్టారు. (‘మహా’ మలుపు; రాత్రికి రాత్రి ఏం జరిగింది?)
Comments
Please login to add a commentAdd a comment