ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ వ్యయం ఏటేటా ఎగబాకుతోంది. ప్రపంచ సైనిక వ్యయం 2 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించి సరికొత్త శిఖరాలకు చేరింది. సైనిక వ్యయంలో అమెరికా(38%), చైనా(14%), భారత్(3.6%) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ) వెల్లడించింది. ప్రపంచ సైనిక వ్యయం మొత్తంలో మొదటి 5 దేశాలదే 62 శాతం ఉండటం గమనార్హం. బ్రిటన్(3.2%), రష్యా(3.1%).. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 2021లో 0.7 శాతం పెరిగి 2113 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఎస్‌ఐపీఆర్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమైనప్పటికీ ప్రపంచ దేశాల రక్షణ వ్యయం గణనీయంగా పెరిగిందని ఎస్‌ఐపీఆర్‌ఐ సీనియర్ పరిశోధకుడు డాక్టర్ డిగో లోపెస్ డా సిల్వా వెల్లడించారు. కోవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థలు మెల్లగా కోలుకోవడంతో రక్షణ వ్యయం ప్రపంచ జీడీపీలో 2.2 శాతానికి చేరుకోగా, 2020లో ఈ సంఖ్య 2.3 శాతంగా ఉంది.
అమెరికా మిలటరీ ఖర్చులు 2021లో 801 బిలియన్ డాలర్లకు చేరింది. 2020తో పోలిస్తే ఇది 1.4 శాతం తగ్గింది. 2012- 2021 మధ్య కాలంలో అమెరికా సైనిక పరిశోధన, అభివృద్ధికి నిధులను 24 శాతం పెంచింది. అదే సమయంలో ఆయుధాల కొనుగోళ్ల ఖర్చు 6.4 శాతం తగ్గించింది. రెండో స్థానంలో ఉన్న చైనా 2020తో పోల్చితే 4.7 శాతం వృద్ధితో 293 బిలియన్ డాలర్లను రక్షణ కోసం వెచ్చించింది.
గత ఏడాది భారత సైనిక వ్యయం 76.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020తో పోల్చితే 0.9 శాతం పెరిగింది. 2012 నుంచి భారత రక్షణ వ్యయం 33 శాతం పెరిగింది. స్వదేశీ ఆయుధ పరిశ్రమను బలోపేతం చేయడానికి, 2021 సైనిక బడ్జెట్‌లో 64 శాతం మూలధన వ్యయం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఆయుధాల కొనుగోలుకు కేటాయించారని ఎస్‌ఐపీఆర్‌ఐ పేర్కొంది. (క్లిక్: భారత్‌కు బంపరాఫర్.. అమెరికా, యూరప్ దేశాలకు రష్యా భారీ షాక్!)
బ్రిటన్ గత సంవత్సరం రక్షణ కోసం 68.4 బిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. 2020తో పోలిస్తే ఇది మూడు శాతం అధికం. రష్యా తన సైనిక వ్యయాన్ని 2021లో 2.9 శాతం పెంచడంతో 65.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వరుసగా మూడో సంవత్సరం మిలటరీ పద్దు పెరగడంతో రష్యా సైనిక వ్యయం 2021లో జీడీపీలో 4.1 శాతానికి చేరుకుంది. (క్లిక్: ఉక్రెయిన్‌ను నడిపిస్తున్న... అమెరికా ఆయుధాలు)
Comments
Please login to add a commentAdd a comment