విశ్లేషణ
మొత్తం ప్రపంచపు ఆర్థిక నియంత్రణలు తమ అధీనంలో ఉన్నందున ‘బ్రిక్స్’ కూటమి చేయగలిగిందేమీ లేదన్నది గతంలో పాశ్చాత్య దేశాల ధీమా. కజాన్(రష్యా) కన్నా ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు జరిగినా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అందుకే పట్టించుకోలేదు. కానీ బ్రిక్స్ దేశాలు తమ మధ్య చెల్లింపులను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తాము వాణిజ్యం జరిపే ఇతర దేశాలతోనూ ఆ విధమైన చెల్లింపుల కోసం ప్రయత్నించాలనీ నిర్ణయించటం పాశ్చాత్య దేశాల్లో కలవరం పుట్టిస్తోంది. అదే సమయంలో ఇండియా భాగస్వామిగా గల బ్రిక్స్ డిక్లరేషన్‌లోని అంశాలు వర్ధమాన దేశాల్లో కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. బహుళ ధ్రువ ప్రపంచమనీ, పాశ్చాత్య ఆధిపత్యం ముగియటానికి ఆరంభమనీ చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.
బ్రిక్స్ కూటమి కజాన్ డిక్లరేషన్ అక్టోబర్ 23న విడుదలైన తర్వాతి పరిణామాలను గమనించినపుడు ప్రధానంగా కనిపిస్తున్నవి రెండున్నాయి. ఒకటి – వర్ధమాన దేశాలన్నిటా ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం కావటం. రెండు – పాశ్యాత్య ప్రపంచంలో కలవరపాటు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పశ్చిమాసియా, మధ్య ఆసియా, కరీబియన్‌లతో పాటు యూరప్‌లోని సాధారణ స్థాయి ప్రభుత్వాధినేతలు, ఇతర నాయకులు, మేధావులు, యాక్టివిస్టుల అందరి ఆలోచనలూ ఒకే విధంగా ఉన్నాయి. బ్రిక్స్ డిక్లరేషన్‌లోని అంశాలు, ప్రకటించిన కార్యక్రమం అందరికీ తమ భవిష్యత్తు పట్ల కొత్త ఆశలు కల్పించటమే అందుకు కారణం. దానితో ఉన్నట్టుండి అందరూ బహుళ ధ్రువ ప్రపంచమని, పాశ్చాత్య ఆధిపత్యం ముగియటానికి ఆరంభమని మాట్లాడుతున్నారు.
మరొక వైపు పాశ్చాత్య ప్రపంచ స్పందనలను గమనించండి. మొదట బ్రిక్‌గా ఉండిన కూటమి ఆ తర్వాత బ్రిక్స్‌గా మారి కజాన్ కన్నా ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించింది. కానీ ఆ కూటమిని అంత సుదీర్ఘ కాలంలో కూడా పాశ్చాత్య దేశాలు గానీ, వారి ఆధిపత్యాన నడిచే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు గానీ, అక్కడి నిపుణులు, మేధావులు గానీ లెక్క చేయలేదు.
కజాన్ సమావేశం కన్నా ముందువరకు అందులో ఇండియా, చైనా (ఆసియా నుంచి), రష్యా (యూరప్ నుంచి), దక్షిణాఫ్రికా (ఆఫ్రికా నుంచి), బ్రెజిల్ (దక్షిణ అమెరికా నుంచి) ఉండేవి. అయిదు కూడా భౌగోళిక వైశాల్యం, జనాభా, ఆర్థికశక్తి, సైనిక బలం రీత్యా ప్రముఖమైనవే. వాటి ఉమ్మడి బలాలు మొత్తం యూరప్ కన్నా, కొన్ని విషయాలలో యూరప్‌తో పాటు అమెరికాను కలిపినా ఎక్కువే. అయినప్పటికీ పాశ్చాత్య కూటమికి తక్కిన ప్రపంచం పట్ల మొదటి నుంచి గల చులకన భావంతో వారటువంటి వైఖరి తీసుకుంటూ వచ్చారు.
ఈ దృష్టికి మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఇతర దేశాలు ఏమి మాట్లాడి, ఏమి చేసినా, మొత్తం ప్రపంచపు ఆర్థిక, ద్రవ్య నియంత్రణలు తమ అధీనంలో ఉన్నందున బ్రిక్స్ చేయగలిగిందేమీ లేదన్నది వారి ధీమా. ఇందుకు ఒక కీలకం అమెరికన్ డాలర్; అంతే కీలకమైనవి ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్’ (బిఐఎస్), ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్; అదేవిధంగా, బ్రిక్స్‌తో సహా అత్యధిక దేశాల నగదు నిల్వలు పాశ్చాత్య కరెన్సీలలో ఉండటం, వారి అస్తులు కూడా అనేకం పాశ్చాత్య దేశాలలో ఉండటం; అన్నిదేశాల ఎగుమతి దిగుమతులు, పరస్పర చెల్లింపులు డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో కరెన్సీల ద్వారా జరగటం. ఈ ఆర్థిక ప్రాబల్యాలు పాశ్చాత్యులకు రాజకీయ, సైనిక ప్రాబల్యాలను కూడా సహజంగానే తెచ్చిపెడుతున్నాయి.
ఈ వలయంలో చిక్కుకున్న బ్రిక్స్‌గానీ, మరొకటిగానీ చేయగలిగిందేమిటి? అందువల్లనే 2006 నుంచి 2024 కజాన్ డిక్లరేషన్ సమయం వరకు అమెరికా, యూరప్ బ్రిక్స్‌ను పట్టించుకోలేదు. అటువంటిది ఈ డిక్లరేషన్‌తో మొదటిసారి ప్రకంపనలు మొదలయ్యాయి. అందుకు కారణం బ్రిక్స్ దేశాలు తమ మధ్య చెల్లింపులను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తాము వాణిజ్యం జరిపే ఇతర దేశాలతోనూ ఆ విధమైన చెల్లింపుల కోసం ప్రయత్నించాలనీ నిర్ణయించటం. ఇది వాస్తవ రూపంలో జరిగేందుకు మరికొన్ని సంప్రదింపులు అవసరమైనా, ఆ నిర్ణయం సూత్రరీత్యా జరగటమే పాశ్యాత్య కరెన్సీలకు పొంచి ఉన్న ఒక పెద్ద ప్రమాదం.
ఈ చెల్లింపులు ఇప్పటికే కొన్ని దేశాల మధ్య మొదలయ్యాయి కూడా! బ్రిక్స్ దేశాల డెవలప్‌మెంట్ బ్యాంక్ ఒకటి ఇప్పటికే ఏర్పడి పనిచేస్తున్నది. భవిష్యత్తులో బ్రిక్స్ సొంత కరెన్సీ ఆలోచన కూడా ఉంది. ఈ నిర్ణయాలపై కజాన్ అనంతరం పాశ్చాత్య దేశాలు అధికారిక ప్రకటనలైతే ఇంకా చేయలేదు. కానీ, అంతర్జాతీయ సెటిల్మెంట్స్ అన్నిటికీ నాడీ కేంద్రం వంటి బిఐఎస్ అధికారుల స్పందనను గమనిస్తే రహస్యం తెలిసిపోతుంది.
ఆ చెల్లింపులు ఇప్పటి వలె డాలర్ల రూపంలో గాక బ్రిక్స్ నిర్ణయించినట్లు స్థానిక కరెన్సీలలో జరగటం అంతటా మొదలైతే అది ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకే ముప్పు కాగలదని నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేశారు వారు. దాని అర్థాన్ని సాధారణ భాషలో చెప్పాలంటే, డాలర్ ప్రపంచం తలకిందులవుతుందన్నమాట! చమురును భారీగా ఉత్పత్తి చేసే నైజీరియా ఇక నుంచి డాలర్‌కు బదులు తమ కరెన్సీ నైరాలో విక్రయించాలని ఈ వ్యాసం రాసే సమయానికి నిర్ణయించటం విశేషం.
మనం చేసే పనిలోని మంచిచెడులను గ్రహించాలంటే మన ప్రత్యర్థి స్పందనలను గమనించాలంటారు. కజాన్ డిక్లరేషన్‌లోని 134 పేరాగ్రాఫ్‌లు యథాతథంగానే వర్ధమాన దేశాలన్నిటా తక్షణ ఉత్సాహాలకు, ఆశాభావాలకు కారణమయ్యాయి. పైన పేర్కొన్న బిఐఎస్ అధికారుల వ్యాఖ్యలు, కొందరు పాశ్చాత్య మేధావుల వ్యాఖ్యలను బట్టి, ఈ డిక్లరేషన్‌లోని ఆర్థికపరమైన ఆలోచనలు ఏ విధంగా వర్ధమాన దేశాలను పాశ్చాత్యుల కబంధ హస్తాల నుంచి విముక్తం చేయగల అవకాశం ఉందో వారికి బాగా అర్థమవుతున్నది.
డాలర్ శక్తి, ఆర్థిక లావాదేవీల నియంత్రణ, వర్ధమాన దేశాల ముడి సరుకుల ధరల తగ్గింపు, అక్కడి మార్కెట్లలో తమ ఉత్పత్తుల ధరల పెంపు, ఆ యా దేశాల కరెన్సీ విలువల కుదింపు, తమ మాట వినని వారిపై ఆంక్షలు, తమ బ్యాంక్‌లలోని ఆ యా దేశాల నిధుల స్తంభన వంటివన్నీ పాశ్చాత్య దేశాలకు ఒక క్రీడగా మారి యథేచ్ఛగా సాగుతూ వస్తున్నాయి. ఇపుడిక క్రమంగా వీటన్నిటికి బ్రేకులు పడగలవన్నది వర్ధమాన దేశాలకు ఒక కొత్త ఆశాభావం అవుతుండగా, పాశ్చాత్య రాజ్యాలకు అదే గుబులు పుట్టిస్తున్నది. అందుకే, సౌదీ అరేబియా తన చమురును చైనాకు యువాన్‌లో కాక డాలర్లలో విక్రయించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నట్టు తాజావార్తలు చెప్తున్నాయి.
కజాన్ డిక్లరేషన్‌లో ఐక్యరాజ్య సమితి తదితర అంతర్జాతీయ సంస్థలు, సంబంధాలతో నిమిత్తం గల పేరాగ్రాఫ్‌లు, వర్ధమాన దేశాల మధ్య వివిధ సహకారాలు, ఇతర సంస్కరణల గురించిన ప్రస్తావనలు కూడా వర్ధమాన దేశాలంతటా సానుకూల స్పందనలకు కారణమవుతున్నట్లు ఈ వారం రోజుల కథనాలు చెప్తున్నాయి. సాధారణంగా పాశ్చాత్య దేశాలకు అణగిమణగి ఉంటాయనే భావన గల పలు దేశాలు సైతం నెమ్మదిగా ధిక్కార స్వరంతో మాట్లాడుతూ బ్రిక్స్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నాయి.
కూటమిలో ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా జరగాలనే అవగాహన ఉన్నందున, సభ్యదేశాల సంఖ్య వేగంగా పెరిగితే అందుకు చిక్కులు రాకుండా ఉండేందుకు కొత్తవారిని ఆచితూచి తీసుకోనున్నారు. కజాన్ దరిమిలా ప్రపంచంలో ఎన్నడూ లేని కొత్త మార్పునకు ఆరంభం జరుగుతున్నదని పలువురు పాశ్చాత్య మేధావులు సైతం భావిస్తున్నారు. ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు, కజాన్ డిక్లరేషన్ అమలులో తగినన్ని సాధక బాధకాలున్నందున జాగ్రత్తగా ముందడుగులు వేయవలసి ఉంటుందనే గుర్తింపు బ్రిక్స్‌లోనూ ఉంది.
పోతే, అమెరికాతో ఎంత సాన్నిహిత్యం ఉన్నా భారతదేశం 2006 లోనే బ్రిక్స్‌లో చేరి, ఈ కజాన్ డిక్లరేషన్‌లోనూ సాహసవంతమైన విధంగా భాగస్వామి కావటం గమనించదగ్గది. ఏ అవసరాల కోసం అమెరికాకు సన్నిహితంగా ఉన్నా, తన మౌలికమైన, దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసం తక్కిన వర్ధమాన దేశాలతో కలిసి నడవటమే సరైనదన్న గుర్తింపు ఉండటమే అందుకు కారణమనాలి, ముఖ్యంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తరచుగా తన ఇంటర్వ్యూలు, ప్రసంగాలలో చెప్తున్న మాటలు వినేవారికి ఇది స్పష్టమవుతున్నది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment