సందర్భం
అక్టోబర్ 22 నుండి 24 వరకు మూడు రోజులపాటు రష్యాలోని కజాన్ పట్టణంలో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో మొదలైన ఈ కూటమిలో అనేక దేశాలు చేరడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. మున్ముందు 130 దేశాలు చేరే అవకాశం ఉందని అంచనా. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది. బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. డాలర్‌కూ, బంగారానికీ సంబంధాన్ని తొలగించిన అమెరికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది.
2024 సంవత్సర బ్రిక్స్ శిఖరాగ్ర సమావే శాలకు రష్యా అధ్యక్షత వహిస్తోంది. వివిధ దేశాల అత్యున్నత నాయకులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. బ్రిక్స్ విస్తరణ తర్వాత జరుగుతున్న కీలకమైన సమావేశం కాబట్టి, బ్రిక్స్‌లో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు, బ్రిక్స్ విస్తరణ కోసం యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడం మీద చర్చ ప్రధానంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థ స్థాపనను ప్రోత్సహించడం, శీతోష్ణస్థితి మార్పులను ఎదుర్కోవడం, ఇంధన సహకారాన్ని పెంపొందించడం, సప్లై చైన్‌ను రక్షించడం, దేశాల మధ్య శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉంటాయని ఒక కీలక చైనా పరిశోధకుడు వెల్లడించారు.
ఎందుకీ ప్రత్యామ్నాయ వ్యవస్థ?
అమెరికా డాలర్ ఆధిపత్యం కింద ప్రపంచం ఎనిమిది దశా బ్దాలుగా నలిగిపోతోంది. 1944లో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉని కిలోకి వచ్చిన ఈ వ్యవస్థపై పశ్చిమ దేశాలు కూడా ప్రబలమైన శక్తి కలిగి ఉన్నాయి. అమెరికా ఆధిపత్యంతో పాటు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచం బీటలు బారింది. ప్రపంచీకరణను చైనా చక్కగా వినియోగించుకుని అమెరికా, పశ్చిమ దేశాలను వెనక్కు కొట్టింది. అమెరికా స్వదేశీ విదేశీ అప్పు, ప్రమాదకరంగా 50 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరో వైపున చైనా ప్రపంచ రెండవ ఆర్థిక శక్తిగా ఎదిగి, శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతాలను నెలకొల్పుతోంది.
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల విశ్లేషణ ప్రకారం, బైడెన్ పదవీ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 15% కంటే తక్కువకి పడిపోయింది. 1999లో 21% కంటే ఎక్కువగా ఉన్నది, స్థిరమైన క్షీణత చూసింది. చైనా 18.76%తో పెద్ద వాటాను కలిగి ఉంది. దశాబ్దాల క్రితపు అమెరికా ఆధిపత్య ప్రపంచ క్రమం, నేటి వాస్తవాలకు తగ్గట్టుగా లేదు. సంపన్న దేశాలు, పేద దేశాలను అన్ని విధాలా అణిచివేస్తున్నాయి.
ఈ కాలంలో అమెరికా 210 యుద్ధాలు చేసింది. 180 యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొంది. ప్రపంచ ప్రజలకు అమెరికా ఆధిపత్య కూటమిపై నమ్మకం పోయింది. అందుకే, ప్రపంచ ప్రజలందరి ప్రయోజనాలకు, సమానత్వానికి ఉపయోగపడేలా, ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, న్యాయమైన బహుళ ధ్రువ ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నెలకొల్పాల్సిన, నేటి అసమాన ప్రపంచ క్రమాన్ని సమగ్రంగా సంస్కరించవలసిన అగత్యం ఏర్పడింది.
బ్రిక్స్ తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో మొదలై(బ్రిక్), తర్వాత సౌత్ ఆఫ్రికాను కలుపుకొంది. అటుపై ఈజిప్ట్, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను భాగస్వామ్యం చేసుకుంది. ఇంకా అనేక దేశాలు చేరే అవకాశం ఉంది. 23 దేశాలు అధికారికంగా దరఖాస్తు పెట్టుకున్నాయి. కరేబియన్ దేశా లలో భాగమైన క్యూబా విదేశాంగ మంత్రి తాము కూడా బ్రిక్స్‌లో భాగం అవుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లేఖ రాశారు. శ్రీలంక విదేశాంగ మంత్రి పాల్గొంటారని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు. ఒక విశ్లేషణ ప్రకారం, బ్రిక్స్‌లో 130 దేశాలు చేరే అవకాశం ఉంది.
ఊపందుకున్న డీ–డాలరైజేషన్
బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. ఈ ధోరణి వేగంగా పెరుగుతూ, ఆధిపత్య దేశాల ఆంక్షలకు, భూ భౌగోళిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక మంత్రి జాతీయ కరెన్సీలు, రష్యా రూబుల్‌ను బ్రిక్స్‌లో ఉపయోగిస్తు న్నామన్నారు. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటం తగ్గించే క్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది.
బ్రిక్స్ తర్వాత, మరో కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్’ (సీఐఎస్) కూడా డీ–డాలరైజేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మాల్దోవా, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి తమ జాతీయ కరెన్సీలతో 85% సరిహద్దు లావాదేవీలను జరిపింది. వాణిజ్యంలో అమెరికా డాలర్‌ను ఉపయోగించడం నిలిపివేసింది.
సీఐఎస్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం స్థానిక కరెన్సీలలో జరగడంతో, డాలర్ ఉపయోగం 85% తగ్గిపోయిందని బ్రిక్స్, సీఐఎస్ రూపకర్తల్లో కీలకమైన రష్యా ప్రకటించింది. శాశ్వతంగా అమెరికా డాలర్ పైన ఆధారపడటం తగ్గిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా చైనాల మధ్య గత ఏడాది జరిగిన 200 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో డాలర్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి, యువాన్ రూబుల్‌లలో కొనసాగించాయి.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు చెందిన 300 బిలియన్ డాలర్లకు పైగా కరెన్సీని అమెరికా ప్రపంచ బ్యాంకింగ్ నెట్‌వర్క్ ‘షిఫ్ట్’ స్తంభింపజేసింది. ఇరాన్, వెనిజువేలా, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్ లాంటి అనేక దేశాల డాలర్ల డబ్బును అమెరికా భారీగా స్తంభింపజేసింది. ఇది వేగంగా డీ–డాలరైజేషన్‌కు దోహదం చేసింది. డాలర్ నుంచి గ్లోబల్ సౌత్ దూరంగా వెళ్ళింది. ఈ దేశాల మధ్య స్థానిక కరెన్సీ మార్పిడి బాగా పెరిగింది. రూబుల్‌ను ‘రబుల్’ (నిర్వీర్యం) చేస్తామంటూ రష్యాపై బైడెన్ విధించిన ఆంక్షలు బెడిసి కొట్టాయి.
అమెరికా 1971లో నిక్సన్ కాలంలో డాలర్‌కూ బంగారానికీ మధ్య సంబంధాన్ని తొలగించింది. వాస్తవ ఉత్పత్తితో సంబంధం లేకుండా‘డాలర్ కరెన్సీ’ని పిచ్చి కాగితాల వలె ముద్రించింది. అమె రికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది.
‘అట్లాంటిక్ కౌన్సిల్’ ‘డాలర్ డామినెన్స్’ మీటర్ ప్రకారం, అమెరికా డాలర్ నిలువలలో బ్రిక్స్ దేశాల వాటా గణనీయంగా తగ్గి పోయింది. ‘స్విఫ్ట్’ (ప్రపంచవ్యాప్త అంతర్‌బ్యాంకుల ఆర్థిక టెలీ కమ్యూనికేషన్స్ వ్యవస్థ)కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ చెల్లింపుల వ్యవస్థ కట్టుదిట్టంగా రూపొందింది. బ్రిక్స్ చైనా కేంద్రంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ‘సీబీడీసీ’ ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్ కరెన్సీతో ఇప్పటికే 60 దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో రిహార్సల్స్ జరిగాయనీ, మరిన్ని దేశాల మధ్య జరుగుతున్నాయనీ వివిధ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.
ఇండియా దారి?
ఇజ్రాయిల్– పాలస్తీనా–హెజ్బొల్లా్ల(లెబనాన్) యుద్ధం వల్ల ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు చైనాకు తరలిపోవడం, విదేశీ బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడం వంటి కారణాలతో రూపాయి భారీగా పతనమైంది. రూపాయి మారకపు విలువ చరిత్రలో మొట్టమొదటిసారి అమెరికా డాలర్‌తో అత్యంత దిగువ స్థాయికి అంటే 84.08 రూపాయలకు పడి పోయింది.
మంద గమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు చైనా ప్రకటించిన ద్రవ్య ఆర్థిక చర్యల తర్వాత విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారులు ‘ఇండియా స్టాక్స్ విక్రయించండి, చైనా స్టాక్స్ కొనండి’ అనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. చైనా స్టాక్‌లు చౌకగా ఉండటం వల్ల ఇండియా డబ్బంతా చైనాకు తరలిపోతోంది.
ప్రపంచ కరెన్సీగా ఉన్న డాలర్ అమెరికా ప్రయోజనాలకూ, ఇతర దేశాలపై భారీ ఆంక్షలుకూ పనికివచ్చింది తప్ప, మరే సమానత్వ ప్రయోజనమూ డాలర్‌లో లేదు. కాబట్టి బ్రిక్స్ కూటమితో కలిసి, అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయ విధానాలను, కరెన్సీని ఆవిష్కరించడం తప్ప, భారత్ బాగుకు మరో దారి లేదు.
నైనాల గోవర్ధన్
వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్
మొబైల్: 97013 81799
Comments
Please login to add a commentAdd a comment