సభ్యదేశాలకు ట్రంప్ హెచ్చరికలు
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్యపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించిన ఆయన తాజాగా భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర బ్రిక్స్ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బ్రిక్స్ కూటమి కొత్త కరెన్సీ తేవాలని చూస్తే సభ్య దేశాల దిగుమతులపై ఏకంగా వంద శాతం సుంకాలు విధిస్తానని సంచలన ప్రకటన చేశారు.
ఈ మేరకు తాజాగా సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.‘‘బ్రిక్స్ దేశాలు డాలర్ నుంచి వైదొలగాలని ప్రయత్నిస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని సృష్టించాలని చూస్తున్నాయి. ఆ ప్రయత్నాలు మానుకోవాలి. డాలర్‌కు బదులుగా కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించబోమని, మరే కరెన్సీకి మద్దతివ్వబోమని ప్రకటించాలి. లేదంటే ఆ దేశాలపై 100% సుంకాలు విధిస్తాం. అంతేకాదు అమెరికాతో వాణిజ్యానికి కూడా అవి స్వస్తి పలకాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. మెక్సికో, కెనడా, చైనా వస్తువులపై సుంకాలను భారీగా పెంచుతామని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.
రష్యా, చైనా సుముఖత
2011లో ఏర్పాటైన బ్రిక్స్‌లో ఇటీవలే ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇథియోపియా, ఈజిప్ట్ కూడా చేరాయి. మరో 34 దేశాలు కూడా చేరడానికి ఆసక్తిగా ఉన్నాయి. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా 2023లో తెరపైకి తెచ్చారు. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా, డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసే ఉద్దేశంతో చైనా ఈ యోచనకు సుముఖంగానే ఉన్నాయి. అయితే బ్రిక్స్ కూటమి ఆర్థిక, భౌగోళిక విభేదాల కారణంగా కొత్త కరెన్సీకి అవకాశాలు చాలా తక్కువేనన్నది నిపుణుల మాట.
Comments
Please login to add a commentAdd a comment