BRICS countries
-
ఆ నిర్ణయంతో అమెరికాకే నష్టం.. ట్రంప్ భయం అదే!
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్, ‘తాను 2025 జనవరి 20న అధికారం చేపట్టిన వెంటనే అమెరికాతో వాణిజ్యం చేస్తున్న మూడు అగ్రభాగ దేశాలైన చైనా, కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలను విధిస్తానని’ చెప్పారు. చైనాపై ఇప్పటి వరకూ ఉన్న 60 శాతం సుంకాలతో పాటుగా అదనంగా 10 శాతం, కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలను విధిస్తానని ప్రకటించారు. అమెరికా సరిహద్దు వెంబడి అక్రమ మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయనీ, అనధికార వలసదారుల ప్రవేశానికి ప్రతిస్పందనగా తాజా చర్యలు తీసుకోబోతున్నాననీ నవంబరు 26 నాడు ప్రకటించారాయన. తాజాగా నవంబరు 30న ఏకంగా బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలను విధిస్తానని ప్రపంచం విస్తుపోయేలా ప్రకటించారు. ‘బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ దేశాలు) డాలరుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, ప్రత్యామ్నాయ కరెన్సీకి కృషి చేస్తే... బ్రిక్స్ దేశాలు అద్భుతమైన, శక్తిమంతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థతో వాణిజ్య సంబంధాలకు వీడ్కోలు చెప్పాలి. డాలరును వ్యతిరేకించననే నిబద్ధత ఈ దేశాల నుంచి మా కవసరం’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాశారు.2023లో ప్రపంచ దేశాలతో మొత్తం 773 బిలియన్ల (77,300 కోట్ల డాలర్లు) వాణిజ్య లోటుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ జబ్బుపడి ఉంది. కేవలం బ్రిక్స్ దేశాలతోనే 43,350 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును అమెరికా కల్గి ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చైనాతో 279 బిలియన్లు (27,900 కోట్ల డాలర్లు), మెక్సికోతో 15,200 కోట్ల డాలర్లు, చిన్న దేశమైన వియత్నాంతో 10,400 కోట్ల డాలర్ల వాణిజ్యలోటును కలిగి తన కృత్రిమ డాలరు మారకపు విలువతో పబ్బం గడుపుకుంటోంది. బ్రిక్స్ దేశాల నుంచి దిగుమతులను నిషేధిస్తే... ఆ దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే తయారీ వస్తువులను వర్తమాన దేశాలకు, యూరప్‌కు మళ్లించే అవకాశాలుంటాయి. అమెరికాలోని వస్తు ఉత్పత్తి రంగం వెనుకబడి ఉంది. స్వదేశీ డిమాండును ఇప్పుడున్న అమెరికాలోని పరిశ్రమలు తీర్చలేవు. అందువల్ల వస్తు ధరలు విపరీతంగా పెరగవచ్చు. బ్రిక్స్ దేశాలు కొత్త మార్కెట్లను వెతుక్కుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం దిశకు మరలవచ్చు. డాలరు ఏకఛత్రాధిపత్యం కోసం అమెరికా తీసుకొంటున్న చర్యలకు ప్రత్యామ్యాయంగా ఇప్పటికే 3 దశాబ్దాల నుండి యూరో కరెన్సీని ఐరోపా యూనియన్ ప్రవేశపెట్టింది. చైనా, రష్యాలు పరస్పరం తమ కరెన్సీలతోనే వాణిజ్యం చేసుకొంటున్నాయి.2వ ప్రపంచ యుద్ధంలో నష్టపోని అమెరికా ఆయుధ అమ్మకాలతో విపరీతమైన బంగారు నిల్వలను పోగు చేసుకొంది. 1944 జులై నుంచి ‘బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్’ అనే అంతర్జాతీయ ద్రవ్యసంస్థను ఏర్పాటు చేసుకుంది. దాని ద్వారా 44 దేశాల మద్దతుతో డాలరును అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా ఏర్పాటు చేసుకొని 1971 వరకూ బంగారం ఆధారిత డాలరుగా కొనసాగించింది. వాస్తవానికి తన వద్దనున్న బంగారు నిల్వలకు పొంతన లేకుండా డాలరు నోట్లను ముద్రించుకొంటూ ఆధిపత్యం చలాయించింది. ప్రస్తుతం అమెరికా వద్ద 8,133.46 టన్నుల బంగారు నిల్వలున్నాయి. ఈ నిల్వలను అమ్మితే వచ్చే 69,100కోట్ల డాలర్లతో అమెరికా సుమారు 36 లక్షలకోట్ల రుణాలను ఎలా తీరుస్తుంది?1971 మేలో జర్మనీ డాలరుతో తెగతెంపులు చేసుకొని బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ నుంచి బయటపడిన 3 నెలల్లోనే అనూహ్యమైన ఆర్థిక పురోభివృద్ధి సాధించింది. డాలరుతో పోల్చుకొంటే జర్మన్ మార్కు 7.5 శాతం వృద్ధి రేటు సాధించింది. వెనువెంటనే ప్రపంచ దేశాలన్నీ డాలరు విలువను బంగారం విలువతో సరిపెట్టమని డిమాండు చేశాయి. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు జర్మన్ బాటలో పయినించటంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అమెరికా బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ ఆధిపత్యాన్ని కోల్పోయింది. 1971లో (ప్రెసిడెంట్ నిక్సన్ షాక్‌గా పిలవబడే) బంగారు నిల్వతో డాలరు విలువను రద్దు చేసుకొని నేటి ‘డాలర్ ఫియట్ ఫ్లోటింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రస్తుతం ట్రంప్ విధిస్తానన్న వాణిజ్య ఆంక్షలతో బ్రిక్స్ కరెన్సీ ఏర్పడి... రానున్న కాలంలో డాలర్, యూరోలతో పోటీపడినా ఆశ్చర్యపోనవసరంలేదు. అదీగాక రష్యా, చైనా, భారత్ దేశాలు వాణిజ్యపరంగా ఐక్యమైతే ప్రపంచ దిశనే మార్చే అవకాశం ఉంది. ఒకప్పటి ప్రపంచాన్ని తమ కరెన్సీలతో ఆధిపత్యం చలాయించిన దేశాలన్నీ ఇప్పుడు అత్యంత బలహీనమైన ఆర్థికదేశాలుగా మిగిలాయి. అమెరికా కూడా ఈ తరహా దేశంగా మిగులుతుందని ట్రంప్ భయం. పరిస్థితులును పసిగట్టిన ట్రంప్ వాణిజ్య సుంకాలతో ఈ కృత్రిమ డాలరు విలువను నిలబెట్టాలని అనుకుంటున్నారు.- బుడ్డిగ జమిందార్కె.ఎల్. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ -
సుంకాల బెదిరింపు
పదవీ బాధ్యతలు పూర్తిగా చేపట్టక ముందే అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు పెంచారు. ‘అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం’ (అమెరికా ఫస్ట్) మంత్రాన్ని పదే పదే వల్లె వేస్తున్న ఆయన పదవీ బాధ్యతలు చేపడుతూనే చైనా పైనే కాక ఇతర దేశాలపైనా సుంకాలు విధిస్తానని ఇప్పటికే ప్రకటించారు. పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలూ ఆంక్షల పాలయ్యే జాబితాలో ఉన్నాయి. అమెరికా వాణిజ్య, విదేశాంగ విధానంలో రానున్న పెనుమార్పుకు ఇది ఓ సూచన అనీ, రానున్న ట్రంప్ పదవీకాలంలో ఈ జాబితా మరింత పెరగడం ఖాయమనీ విశ్లేషణ. దానిపై చర్చోపచర్చలతో వారమైనా గడవక ముందే కాబోయే అగ్రరాజ్యాధినేత మరో బాంబు పేల్చారు. ‘బ్రిక్స్’ దేశాలు గనక అమెరికా డాలర్‌కు ప్రత్యర్థిగా మరో కరెన్సీని సృష్టించే ప్రయత్నం చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకాలు వేస్తామంటూ హెచ్చరించారు. ఆయన తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’పై చేసిన ఈ తాజా ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాకూ, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకూ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణానికి ఇది ప్రతీక. అంతేకాదు... ఈ హెచ్చరికే గనక అమలు అయితే, ప్రపంచ వాణిజ్యం రూపురేఖలనే మార్చివేసే అనూహ్య పరిణామం అవుతుంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికాలతో కూడిన కూటమిగా ముందు బ్రిక్స్ ఏర్పాటైంది. ఆపైన ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా, ఇరాన్‌లు సైతం ఆ బృందంలో చేరాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా డాలర్ సాగిస్తున్న గుత్తాధిపత్యానికి ముకుతాడు వేయాలనేది కొంతకాలంగా బ్రిక్స్ దేశాల్లో కొన్నిటి అభిప్రాయం. డాలర్‌ను రాజకీయ అస్త్రంగా వాడకుండా నిరోధించగల ప్రత్యామ్నాయ అంతర్జాతీయ చెల్లింపుల విధానం అవసరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అక్టోబర్‌లో ప్రస్తావించడం గమనార్హం. బ్రిక్స్ దేశాలు డాలర్ స్థానంలో మరో కరెన్సీకి గనక మద్దతునిస్తే మొత్తం కథ మారిపోతుంది. అయితే, డాలర్ నుంచి పక్కకు జరగడం వల్ల అమెరికాతో, ఇతర పాశ్చాత్య దేశాలతో సంబంధాలు దెబ్బతిని దారుణ పర్యవసానాలుంటాయని మరికొన్ని బ్రిక్స్ దేశాల భయం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరిక వెలువడింది. ప్రతీకారంగా అమెరికా 100 శాతం సుంకం వేస్తే, సరుకుల ధరలు పెరిగిపోతాయి. ప్రపంచ వాణిజ్య ప్రవాహాలు అతలాకుతలమవుతాయి. నిజానికి, విదేశీ దిగుమతులపై కఠినంగా సుంకాలు విధించి, అమెరికా ఉత్పత్తులకు కాపు కాస్తానని వాగ్దానం చేయడం కూడా తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి దోహదపడిందని విస్మరించలేం. ‘అమెరికా ఫస్ట్’ ఆర్థిక విధానానికి అనుగుణంగానే ట్రంప్ తాజా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రపంచ వాణిజ్యంలో మార్పులతో అమెరికా ఆర్థిక సార్వభౌమాధికారం పునఃప్రతిష్ఠితమవుతుందనేది ఆయన వ్యూహం. ఇప్పుడీ సుంకాల పర్వం మొదలైతే, అది చివరకు ప్రపంచ వాణిజ్య యుద్ధంగా పరిణమిస్తుంది. ఈ సుంకాలన్నీ అమెరికా ప్రయోజనాల్ని కాపాడేందుకు సాహసోపేత నిర్ణయంగా కనిపించవచ్చు కానీ, వాటి తక్షణ ప్రభావం పడేది అమెరికా వినియోగదారులు, వ్యాపారాల మీదనే. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యావసాయిక ఉత్పత్తులు సహా రోజు వారీ అవసరాలైన అనేక సరుకుల ధరలు పెరుగుతాయి. ఇతర దేశాల విడిభాగాలపై ఆధారపడినందు వల్ల అమెరికా వ్యాపార సంస్థలు చేసుకొనే దిగుమతులపై భారం పడుతుంది. ఆ సంస్థల లాభాలు తగ్గుతాయి. అమెరికా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో పోటీపడలేకపోతాయి. అమెరికాను అప్పుల నుంచి బయటపడేసేందుకు ట్రంప్ మాత్రం మిత్రదేశాలతోనూ కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడకపోవచ్చు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు తమ ఆదాయానికి అమెరికాపై అతిగా ఆధారపడుతుంటాయి. ఇక, ఎగుమతులపై ఎక్కువగా నడిచే బ్రెజిల్, సౌతాఫ్రికా ఆర్థిక వ్యవస్థలూ మందగిస్తాయి. కొత్త సుంకాల బాధిత దేశాలు గనక ప్రతిచర్యలకు ఉపక్రమిస్తే పరిస్థితి దిగజారుతుంది. గతంలో ఈ తరహా వాణిజ్య వివాదాలు తెలిసినవే. వాటిని నివారించడానికే అమెరికా సైతం అనేక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు అంగీకరించింది. ఇప్పుడీ సుంకాలతో వాటికి అర్థం లేకుండా పోతుంది. దౌత్య పర్యవసానాలూ తప్పవు. అక్రమ వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా లాంటివి అరికట్టడానికి పొరుగు దేశాలపై సుంకాలు పనికొస్తాయని ట్రంప్ టీమ్ చెబుతున్నా, ఆశించిన ఫలితాలు దేవుడెరుగు... ఉద్రిక్తతలు పెరిగి, దేశాలతో సంబంధాలు, దీర్ఘకాలిక సహకారం దెబ్బతింటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ వాణిజ్య యుద్ధంతో మరింత అనిశ్చితిలో పడుతుంది. ఈ ప్రతిపాదిత సుంకాలను బూచిగా చూపి, బ్రిక్స్ సహా ఇతర దేశాలనూ చర్చలకు రప్పించడమే అమెరికా ధ్యేయమైతే ఫరవా లేదు. అలా కాని పక్షంలో అనేక దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ అన్వేషణను ముమ్మరం చేయవచ్చు. ట్రంప్ కఠిన వైఖరితో వర్ధమాన దేశాలు, అలాగే బ్రిక్ సభ్యదేశాలు మరింత దగ్గరవుతాయి. అది చివరకు అగ్రరాజ్యానికే నష్టం. అయితే, ప్రపంచమంతా వ్యతిరేకించినా సరే తాను అనుకున్నదే చేయడం ట్రంప్ నైజం. పర్యావరణం, వాణిజ్యం, సైనిక దండయాత్రలపై గతంలో ఆయన చేసిందదే. తాత్కాలికంగా ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం పెద్ద పెద్ద మాటలు చెప్పడం బాగుంటుంది. వాటిని ఆచరణలో పెట్టాలన్నప్పుడు దీర్ఘకాలిక పర్యవసానాల్ని ఆలోచించకపోతే కష్టమే. అమెరికా కొత్త ప్రెసిడెంట్ అది గ్రహించి, ఆచితూచి వ్యవహరించాలి. కానీ, ఆకస్మిక, అనూహ్య నిర్ణయాలకే పేరుబడ్డ ట్రంప్ నుంచి అంతటి ఆలోచన ఆశించగలమా అన్నది ప్రశ్న. అనాలోచితంగా వ్యవహరిస్తే, అది అమెరికాకే కాదు... యావత్ ప్రపంచానికీ తంటా! -
బ్రిక్స్ కరెన్సీ తెస్తే... 100 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్యపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించిన ఆయన తాజాగా భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర బ్రిక్స్ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బ్రిక్స్ కూటమి కొత్త కరెన్సీ తేవాలని చూస్తే సభ్య దేశాల దిగుమతులపై ఏకంగా వంద శాతం సుంకాలు విధిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తాజాగా సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.‘‘బ్రిక్స్ దేశాలు డాలర్ నుంచి వైదొలగాలని ప్రయత్నిస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని సృష్టించాలని చూస్తున్నాయి. ఆ ప్రయత్నాలు మానుకోవాలి. డాలర్‌కు బదులుగా కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించబోమని, మరే కరెన్సీకి మద్దతివ్వబోమని ప్రకటించాలి. లేదంటే ఆ దేశాలపై 100% సుంకాలు విధిస్తాం. అంతేకాదు అమెరికాతో వాణిజ్యానికి కూడా అవి స్వస్తి పలకాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. మెక్సికో, కెనడా, చైనా వస్తువులపై సుంకాలను భారీగా పెంచుతామని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.రష్యా, చైనా సుముఖత 2011లో ఏర్పాటైన బ్రిక్స్‌లో ఇటీవలే ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇథియోపియా, ఈజిప్ట్ కూడా చేరాయి. మరో 34 దేశాలు కూడా చేరడానికి ఆసక్తిగా ఉన్నాయి. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా 2023లో తెరపైకి తెచ్చారు. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా, డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసే ఉద్దేశంతో చైనా ఈ యోచనకు సుముఖంగానే ఉన్నాయి. అయితే బ్రిక్స్ కూటమి ఆర్థిక, భౌగోళిక విభేదాల కారణంగా కొత్త కరెన్సీకి అవకాశాలు చాలా తక్కువేనన్నది నిపుణుల మాట. -
పాశ్చాత్య ఆధిపత్యం ముగిసేనా?
మొత్తం ప్రపంచపు ఆర్థిక నియంత్రణలు తమ అధీనంలో ఉన్నందున ‘బ్రిక్స్’ కూటమి చేయగలిగిందేమీ లేదన్నది గతంలో పాశ్చాత్య దేశాల ధీమా. కజాన్(రష్యా) కన్నా ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు జరిగినా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అందుకే పట్టించుకోలేదు. కానీ బ్రిక్స్ దేశాలు తమ మధ్య చెల్లింపులను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తాము వాణిజ్యం జరిపే ఇతర దేశాలతోనూ ఆ విధమైన చెల్లింపుల కోసం ప్రయత్నించాలనీ నిర్ణయించటం పాశ్చాత్య దేశాల్లో కలవరం పుట్టిస్తోంది. అదే సమయంలో ఇండియా భాగస్వామిగా గల బ్రిక్స్ డిక్లరేషన్‌లోని అంశాలు వర్ధమాన దేశాల్లో కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. బహుళ ధ్రువ ప్రపంచమనీ, పాశ్చాత్య ఆధిపత్యం ముగియటానికి ఆరంభమనీ చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.బ్రిక్స్ కూటమి కజాన్ డిక్లరేషన్ అక్టోబర్ 23న విడుదలైన తర్వాతి పరిణామాలను గమనించినపుడు ప్రధానంగా కనిపిస్తున్నవి రెండున్నాయి. ఒకటి – వర్ధమాన దేశాలన్నిటా ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం కావటం. రెండు – పాశ్యాత్య ప్రపంచంలో కలవరపాటు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పశ్చిమాసియా, మధ్య ఆసియా, కరీబియన్లతో పాటు యూరప్‌లోని సాధారణ స్థాయి ప్రభుత్వాధినేతలు, ఇతర నాయకులు, మేధావులు, యాక్టివిస్టుల అందరి ఆలోచనలూ ఒకే విధంగా ఉన్నాయి. బ్రిక్స్ డిక్లరేషన్‌లోని అంశాలు, ప్రకటించిన కార్యక్రమం అందరికీ తమ భవిష్యత్తు పట్ల కొత్త ఆశలు కల్పించటమే అందుకు కారణం. దానితో ఉన్నట్టుండి అందరూ బహుళ ధ్రువ ప్రపంచమని, పాశ్చాత్య ఆధిపత్యం ముగియటానికి ఆరంభమని మాట్లాడుతున్నారు.మరొక వైపు పాశ్చాత్య ప్రపంచ స్పందనలను గమనించండి. మొదట బ్రిక్‌గా ఉండిన కూటమి ఆ తర్వాత బ్రిక్స్‌గా మారి కజాన్ కన్నా ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించింది. కానీ ఆ కూటమిని అంత సుదీర్ఘ కాలంలో కూడా పాశ్చాత్య దేశాలు గానీ, వారి ఆధిపత్యాన నడిచే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు గానీ, అక్కడి నిపుణులు, మేధావులు గానీ లెక్క చేయలేదు. కజాన్ సమావేశం కన్నా ముందువరకు అందులో ఇండియా, చైనా (ఆసియా నుంచి), రష్యా (యూరప్ నుంచి), దక్షిణాఫ్రికా (ఆఫ్రికా నుంచి), బ్రెజిల్ (దక్షిణ అమెరికా నుంచి) ఉండేవి. అయిదు కూడా భౌగోళిక వైశాల్యం, జనాభా, ఆర్థికశక్తి, సైనిక బలం రీత్యా ప్రముఖమైనవే. వాటి ఉమ్మడి బలాలు మొత్తం యూరప్ కన్నా, కొన్ని విషయాలలో యూరప్‌తో పాటు అమెరికాను కలిపినా ఎక్కువే. అయినప్పటికీ పాశ్చాత్య కూటమికి తక్కిన ప్రపంచం పట్ల మొదటి నుంచి గల చులకన భావంతో వారటువంటి వైఖరి తీసుకుంటూ వచ్చారు.ఈ దృష్టికి మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఇతర దేశాలు ఏమి మాట్లాడి, ఏమి చేసినా, మొత్తం ప్రపంచపు ఆర్థిక, ద్రవ్య నియంత్రణలు తమ అధీనంలో ఉన్నందున బ్రిక్స్ చేయగలిగిందేమీ లేదన్నది వారి ధీమా. ఇందుకు ఒక కీలకం అమెరికన్ డాలర్; అంతే కీలకమైనవి ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్’ (బిఐఎస్), ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్; అదేవిధంగా, బ్రిక్స్‌తో సహా అత్యధిక దేశాల నగదు నిల్వలు పాశ్చాత్య కరెన్సీలలో ఉండటం, వారి అస్తులు కూడా అనేకం పాశ్చాత్య దేశాలలో ఉండటం; అన్నిదేశాల ఎగుమతి దిగుమతులు, పరస్పర చెల్లింపులు డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో కరెన్సీల ద్వారా జరగటం. ఈ ఆర్థిక ప్రాబల్యాలు పాశ్చాత్యులకు రాజకీయ, సైనిక ప్రాబల్యాలను కూడా సహజంగానే తెచ్చిపెడుతున్నాయి.ఈ వలయంలో చిక్కుకున్న బ్రిక్స్గానీ, మరొకటిగానీ చేయగలిగిందేమిటి? అందువల్లనే 2006 నుంచి 2024 కజాన్ డిక్లరేషన్ సమయం వరకు అమెరికా, యూరప్ బ్రిక్స్‌ను పట్టించుకోలేదు. అటువంటిది ఈ డిక్లరేషన్‌తో మొదటిసారి ప్రకంపనలు మొదలయ్యాయి. అందుకు కారణం బ్రిక్స్ దేశాలు తమ మధ్య చెల్లింపులను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తాము వాణిజ్యం జరిపే ఇతర దేశాలతోనూ ఆ విధమైన చెల్లింపుల కోసం ప్రయత్నించాలనీ నిర్ణయించటం. ఇది వాస్తవ రూపంలో జరిగేందుకు మరికొన్ని సంప్రదింపులు అవసరమైనా, ఆ నిర్ణయం సూత్రరీత్యా జరగటమే పాశ్యాత్య కరెన్సీలకు పొంచి ఉన్న ఒక పెద్ద ప్రమాదం. ఈ చెల్లింపులు ఇప్పటికే కొన్ని దేశాల మధ్య మొదలయ్యాయి కూడా! బ్రిక్స్ దేశాల డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి ఇప్పటికే ఏర్పడి పనిచేస్తున్నది. భవిష్యత్తులో బ్రిక్స్ సొంత కరెన్సీ ఆలోచన కూడా ఉంది. ఈ నిర్ణయాలపై కజాన్ అనంతరం పాశ్చాత్య దేశాలు అధికారిక ప్రకటనలైతే ఇంకా చేయలేదు. కానీ, అంతర్జాతీయ సెటిల్మెంట్స్ అన్నిటికీ నాడీ కేంద్రం వంటి బిఐఎస్ అధికారుల స్పందనను గమనిస్తే రహస్యం తెలిసిపోతుంది. ఆ చెల్లింపులు ఇప్పటి వలె డాలర్ల రూపంలో గాక బ్రిక్స్ నిర్ణయించినట్లు స్థానిక కరెన్సీలలో జరగటం అంతటా మొదలైతే అది ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకే ముప్పు కాగలదని నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేశారు వారు. దాని అర్థాన్ని సాధారణ భాషలో చెప్పాలంటే, డాలర్ ప్రపంచం తలకిందులవుతుందన్నమాట! చమురును భారీగా ఉత్పత్తి చేసే నైజీరియా ఇక నుంచి డాలర్‌కు బదులు తమ కరెన్సీ నైరాలో విక్రయించాలని ఈ వ్యాసం రాసే సమయానికి నిర్ణయించటం విశేషం.మనం చేసే పనిలోని మంచిచెడులను గ్రహించాలంటే మన ప్రత్యర్థి స్పందనలను గమనించాలంటారు. కజాన్ డిక్లరేషన్‌లోని 134 పేరాగ్రాఫ్‌లు యథాతథంగానే వర్ధమాన దేశాలన్నిటా తక్షణ ఉత్సాహాలకు, ఆశాభావాలకు కారణమయ్యాయి. పైన పేర్కొన్న బిఐఎస్ అధికారుల వ్యాఖ్యలు, కొందరు పాశ్చాత్య మేధావుల వ్యాఖ్యలను బట్టి, ఈ డిక్లరేషన్‌లోని ఆర్థికపరమైన ఆలోచనలు ఏ విధంగా వర్ధమాన దేశాలను పాశ్చాత్యుల కబంధ హస్తాల నుంచి విముక్తం చేయగల అవకాశం ఉందో వారికి బాగా అర్థమవుతున్నది. డాలర్ శక్తి, ఆర్థిక లావాదేవీల నియంత్రణ, వర్ధమాన దేశాల ముడి సరుకుల ధరల తగ్గింపు, అక్కడి మార్కెట్లలో తమ ఉత్పత్తుల ధరల పెంపు, ఆ యా దేశాల కరెన్సీ విలువల కుదింపు, తమ మాట వినని వారిపై ఆంక్షలు, తమ బ్యాంక్‌లలోని ఆ యా దేశాల నిధుల స్తంభన వంటివన్నీ పాశ్చాత్య దేశాలకు ఒక క్రీడగా మారి యథేచ్ఛగా సాగుతూ వస్తున్నాయి. ఇపుడిక క్రమంగా వీటన్నిటికి బ్రేకులు పడగలవన్నది వర్ధమాన దేశాలకు ఒక కొత్త ఆశాభావం అవుతుండగా, పాశ్చాత్య రాజ్యాలకు అదే గుబులు పుట్టిస్తున్నది. అందుకే, సౌదీ అరేబియా తన చమురును చైనాకు యువాన్‌లో కాక డాలర్లలో విక్రయించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నట్టు తాజావార్తలు చెప్తున్నాయి.కజాన్ డిక్లరేషన్‌లో ఐక్యరాజ్య సమితి తదితర అంతర్జాతీయ సంస్థలు, సంబంధాలతో నిమిత్తం గల పేరాగ్రాఫ్‌లు, వర్ధమాన దేశాల మధ్య వివిధ సహకారాలు, ఇతర సంస్కరణల గురించిన ప్రస్తావనలు కూడా వర్ధమాన దేశాలంతటా సానుకూల స్పందనలకు కారణమవుతున్నట్లు ఈ వారం రోజుల కథనాలు చెప్తున్నాయి. సాధారణంగా పాశ్చాత్య దేశాలకు అణగిమణగి ఉంటాయనే భావన గల పలు దేశాలు సైతం నెమ్మదిగా ధిక్కార స్వరంతో మాట్లాడుతూ బ్రిక్స్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నాయి. కూటమిలో ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా జరగాలనే అవగాహన ఉన్నందున, సభ్యదేశాల సంఖ్య వేగంగా పెరిగితే అందుకు చిక్కులు రాకుండా ఉండేందుకు కొత్తవారిని ఆచితూచి తీసుకోనున్నారు. కజాన్ దరిమిలా ప్రపంచంలో ఎన్నడూ లేని కొత్త మార్పునకు ఆరంభం జరుగుతున్నదని పలువురు పాశ్చాత్య మేధావులు సైతం భావిస్తున్నారు. ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు, కజాన్ డిక్లరేషన్ అమలులో తగినన్ని సాధక బాధకాలున్నందున జాగ్రత్తగా ముందడుగులు వేయవలసి ఉంటుందనే గుర్తింపు బ్రిక్స్‌లోనూ ఉంది.పోతే, అమెరికాతో ఎంత సాన్నిహిత్యం ఉన్నా భారతదేశం 2006 లోనే బ్రిక్స్‌లో చేరి, ఈ కజాన్ డిక్లరేషన్‌లోనూ సాహసవంతమైన విధంగా భాగస్వామి కావటం గమనించదగ్గది. ఏ అవసరాల కోసం అమెరికాకు సన్నిహితంగా ఉన్నా, తన మౌలికమైన, దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసం తక్కిన వర్ధమాన దేశాలతో కలిసి నడవటమే సరైనదన్న గుర్తింపు ఉండటమే అందుకు కారణమనాలి, ముఖ్యంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తరచుగా తన ఇంటర్వ్యూలు, ప్రసంగాలలో చెప్తున్న మాటలు వినేవారికి ఇది స్పష్టమవుతున్నది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
S Jaishankar: వివాదాలకు చర్చలే శరణ్యం
కజన్: వివాదాలు, విభేదాలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిందేనని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. యుద్ధాలతో సాధించేదీ ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్తతలు చల్లారాలంటే చర్చలపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచించారు. రష్యాలోని కజన్ నగరంలో బ్రిక్స్ ఔట్రీచ్/బ్రిక్స్ ప్లస్ సదస్సులో చివరి రోజు గురువారం జైశంకర్ మాట్లాడారు. ఇది యుద్ధాల శకం కాదంటూ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. శాంతియుత చర్చలు, దౌత్య మార్గాలపై దృష్టి పెడితే వివాదాలు సమసిపోతాయని పేర్కొన్నారు. దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినప్పుడు వాటిని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు ఎవరైనా సరే లోబడి ఉండాలని, ఎలాంటి మినహాయింపులు ఉండొద్దని తేల్చిచెప్పారు. ప్రపంచానికి ముప్పుగా మారిన ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. పశి్చమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీర్ఘకాలపు సవాళ్లను ఎదిరించే విషయంలో కొత్తగా ఆలోచించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాల్సిందే ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందడం లేదని, ఈ నిజాన్ని బ్రిక్స్ వేదిక గుర్తించాలని జైశంకర్ కోరారు. కోవిడ్ మహమ్మారితోపాటు వేర్వేరు సంఘర్షణల కారణంగా గ్లోబల్ సౌత్ దేశాలపై భారం మరింత పెరిగిందన్నారు. వైద్యం, ఆహారం, ఇంధన భద్రత విషయంలో ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సరిసమానమైన ప్రపంచ క్రమం’ అవసరమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవి వలసవాద పాలన నుంచి వారసత్వంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలను సరి చేయాలన్నారు. సరుకుల సరఫరా కోసం దేశాల మధ్య అనుసంధానం మరింత పెరగాలన్నారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని గౌరవిస్తూ ఆ దిశగా అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి సంస్థలు, అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు తక్షణావసరమని జైశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. భద్రతా మండలిలో మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కలి్పంచాలని డిమాండ్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్∙సదస్సుకు పదికిపైగా బ్రిక్స్ సభ్యదేశాలతోపాటు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. -
ఉద్రిక్తతల నడుమ ఉక్రెయిన్‌కు అమెరికా రక్షణ మంత్రి
కీవ్: రష్యాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో లాయిడ్ ఆస్టిన్ ఉక్రేనియన్ నేతలతో ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొంటారు.I’m back in Ukraine for the fourth time as Secretary of Defense, demonstrating that the United States, alongside the international community, continues to stand by Ukraine. pic.twitter.com/0gCwAqqEpK— Secretary of Defense Lloyd J. Austin III (@SecDef) October 21, 2024తన పర్యటన సందర్భంగా ఆస్టిన్ ఒక ట్విట్టర్ పోస్టులో ‘అంతర్జాతీయ సమాజంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తుందని తెలియజేయడానికే తాను నాల్గవసారి ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చానని’ తెలిపారు. మరోవైపు రక్షణ కార్యదర్శి లాయిడ్ జె. ఆస్టిన్ III ఉక్రెయిన్‌కు చేరుకున్నారని, ఉక్రెయిన్ స్వాతంత్ర్య పోరాటానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతును పునరుద్ఘాటించారని పెంటగాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యా దురాక్రమణ నుండి ఉక్రెయిన్‌కు అవసరమైన భద్రతా సహాయాన్ని అందించడానికి యూఎస్ కట్టుబడి ఉందని పెంటగాన్ తెలిపింది. ఇది కూడా చదవండి: యాహ్యా సిన్వార్ మృతి.. హమాస్‌కు చీఫ్ లేనట్లే! -
డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ గండి?
అక్టోబర్ 22 నుండి 24 వరకు మూడు రోజులపాటు రష్యాలోని కజాన్ పట్టణంలో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో మొదలైన ఈ కూటమిలో అనేక దేశాలు చేరడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. మున్ముందు 130 దేశాలు చేరే అవకాశం ఉందని అంచనా. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది. బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. డాలర్‌కూ, బంగారానికీ సంబంధాన్ని తొలగించిన అమెరికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది.2024 సంవత్సర బ్రిక్స్ శిఖరాగ్ర సమావే శాలకు రష్యా అధ్యక్షత వహిస్తోంది. వివిధ దేశాల అత్యున్నత నాయకులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. బ్రిక్స్ విస్తరణ తర్వాత జరుగుతున్న కీలకమైన సమావేశం కాబట్టి, బ్రిక్స్‌లో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు, బ్రిక్స్ విస్తరణ కోసం యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడం మీద చర్చ ప్రధానంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థ స్థాపనను ప్రోత్సహించడం, శీతోష్ణస్థితి మార్పులను ఎదుర్కోవడం, ఇంధన సహకారాన్ని పెంపొందించడం, సప్లై చైన్‌ను రక్షించడం, దేశాల మధ్య శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉంటాయని ఒక కీలక చైనా పరిశోధకుడు వెల్లడించారు.ఎందుకీ ప్రత్యామ్నాయ వ్యవస్థ?అమెరికా డాలర్ ఆధిపత్యం కింద ప్రపంచం ఎనిమిది దశా బ్దాలుగా నలిగిపోతోంది. 1944లో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉని కిలోకి వచ్చిన ఈ వ్యవస్థపై పశ్చిమ దేశాలు కూడా ప్రబలమైన శక్తి కలిగి ఉన్నాయి. అమెరికా ఆధిపత్యంతో పాటు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచం బీటలు బారింది. ప్రపంచీకరణను చైనా చక్కగా వినియోగించుకుని అమెరికా, పశ్చిమ దేశాలను వెనక్కు కొట్టింది. అమెరికా స్వదేశీ విదేశీ అప్పు, ప్రమాదకరంగా 50 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరో వైపున చైనా ప్రపంచ రెండవ ఆర్థిక శక్తిగా ఎదిగి, శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతాలను నెలకొల్పుతోంది.ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల విశ్లేషణ ప్రకారం, బైడెన్ పదవీ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 15% కంటే తక్కువకి పడిపోయింది. 1999లో 21% కంటే ఎక్కువగా ఉన్నది, స్థిరమైన క్షీణత చూసింది. చైనా 18.76%తో పెద్ద వాటాను కలిగి ఉంది. దశాబ్దాల క్రితపు అమెరికా ఆధిపత్య ప్రపంచ క్రమం, నేటి వాస్తవాలకు తగ్గట్టుగా లేదు. సంపన్న దేశాలు, పేద దేశాలను అన్ని విధాలా అణిచివేస్తున్నాయి. ఈ కాలంలో అమెరికా 210 యుద్ధాలు చేసింది. 180 యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొంది. ప్రపంచ ప్రజలకు అమెరికా ఆధిపత్య కూటమిపై నమ్మకం పోయింది. అందుకే, ప్రపంచ ప్రజలందరి ప్రయోజనాలకు, సమానత్వానికి ఉపయోగపడేలా, ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, న్యాయమైన బహుళ ధ్రువ ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నెలకొల్పాల్సిన, నేటి అసమాన ప్రపంచ క్రమాన్ని సమగ్రంగా సంస్కరించవలసిన అగత్యం ఏర్పడింది. బ్రిక్స్ తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో మొదలై(బ్రిక్), తర్వాత సౌత్ ఆఫ్రికాను కలుపుకొంది. అటుపై ఈజిప్ట్, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను భాగస్వామ్యం చేసుకుంది. ఇంకా అనేక దేశాలు చేరే అవకాశం ఉంది. 23 దేశాలు అధికారికంగా దరఖాస్తు పెట్టుకున్నాయి. కరేబియన్ దేశా లలో భాగమైన క్యూబా విదేశాంగ మంత్రి తాము కూడా బ్రిక్స్‌లో భాగం అవుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లేఖ రాశారు. శ్రీలంక విదేశాంగ మంత్రి పాల్గొంటారని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు. ఒక విశ్లేషణ ప్రకారం, బ్రిక్స్‌లో 130 దేశాలు చేరే అవకాశం ఉంది. ఊపందుకున్న డీ–డాలరైజేషన్బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. ఈ ధోరణి వేగంగా పెరుగుతూ, ఆధిపత్య దేశాల ఆంక్షలకు, భూ భౌగోళిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక మంత్రి జాతీయ కరెన్సీలు, రష్యా రూబుల్‌ను బ్రిక్స్‌లో ఉపయోగిస్తు న్నామన్నారు. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటం తగ్గించే క్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది.బ్రిక్స్ తర్వాత, మరో కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్’ (సీఐఎస్) కూడా డీ–డాలరైజేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మాల్దోవా, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి తమ జాతీయ కరెన్సీలతో 85% సరిహద్దు లావాదేవీలను జరిపింది. వాణిజ్యంలో అమెరికా డాలర్‌ను ఉపయోగించడం నిలిపివేసింది. సీఐఎస్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం స్థానిక కరెన్సీలలో జరగడంతో, డాలర్ ఉపయోగం 85% తగ్గిపోయిందని బ్రిక్స్, సీఐఎస్ రూపకర్తల్లో కీలకమైన రష్యా ప్రకటించింది. శాశ్వతంగా అమెరికా డాలర్ పైన ఆధారపడటం తగ్గిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా చైనాల మధ్య గత ఏడాది జరిగిన 200 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో డాలర్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి, యువాన్ రూబుల్‌లలో కొనసాగించాయి.ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు చెందిన 300 బిలియన్ డాలర్లకు పైగా కరెన్సీని అమెరికా ప్రపంచ బ్యాంకింగ్ నెట్వర్క్ ‘షిఫ్ట్’ స్తంభింపజేసింది. ఇరాన్, వెనిజువేలా, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్ లాంటి అనేక దేశాల డాలర్ల డబ్బును అమెరికా భారీగా స్తంభింపజేసింది. ఇది వేగంగా డీ–డాలరైజేషన్‌కు దోహదం చేసింది. డాలర్ నుంచి గ్లోబల్ సౌత్ దూరంగా వెళ్ళింది. ఈ దేశాల మధ్య స్థానిక కరెన్సీ మార్పిడి బాగా పెరిగింది. రూబుల్‌ను ‘రబుల్’ (నిర్వీర్యం) చేస్తామంటూ రష్యాపై బైడెన్ విధించిన ఆంక్షలు బెడిసి కొట్టాయి. అమెరికా 1971లో నిక్సన్ కాలంలో డాలర్‌కూ బంగారానికీ మధ్య సంబంధాన్ని తొలగించింది. వాస్తవ ఉత్పత్తితో సంబంధం లేకుండా‘డాలర్ కరెన్సీ’ని పిచ్చి కాగితాల వలె ముద్రించింది. అమె రికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ‘అట్లాంటిక్ కౌన్సిల్’ ‘డాలర్ డామినెన్స్’ మీటర్ ప్రకారం, అమెరికా డాలర్ నిలువలలో బ్రిక్స్ దేశాల వాటా గణనీయంగా తగ్గి పోయింది. ‘స్విఫ్ట్’ (ప్రపంచవ్యాప్త అంతర్‌బ్యాంకుల ఆర్థిక టెలీ కమ్యూనికేషన్స్ వ్యవస్థ)కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ చెల్లింపుల వ్యవస్థ కట్టుదిట్టంగా రూపొందింది. బ్రిక్స్ చైనా కేంద్రంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ‘సీబీడీసీ’ ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్ కరెన్సీతో ఇప్పటికే 60 దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో రిహార్సల్స్ జరిగాయనీ, మరిన్ని దేశాల మధ్య జరుగుతున్నాయనీ వివిధ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ఇండియా దారి?ఇజ్రాయిల్– పాలస్తీనా–హెజ్‌బొల్లా్ల(లెబనాన్) యుద్ధం వల్ల ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు చైనాకు తరలిపోవడం, విదేశీ బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడం వంటి కారణాలతో రూపాయి భారీగా పతనమైంది. రూపాయి మారకపు విలువ చరిత్రలో మొట్టమొదటిసారి అమెరికా డాలర్‌తో అత్యంత దిగువ స్థాయికి అంటే 84.08 రూపాయలకు పడి పోయింది. మంద గమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు చైనా ప్రకటించిన ద్రవ్య ఆర్థిక చర్యల తర్వాత విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారులు ‘ఇండియా స్టాక్స్ విక్రయించండి, చైనా స్టాక్స్ కొనండి’ అనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. చైనా స్టాక్‌లు చౌకగా ఉండటం వల్ల ఇండియా డబ్బంతా చైనాకు తరలిపోతోంది.ప్రపంచ కరెన్సీగా ఉన్న డాలర్ అమెరికా ప్రయోజనాలకూ, ఇతర దేశాలపై భారీ ఆంక్షలుకూ పనికివచ్చింది తప్ప, మరే సమానత్వ ప్రయోజనమూ డాలర్లో లేదు. కాబట్టి బ్రిక్స్ కూటమితో కలిసి, అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయ విధానాలను, కరెన్సీని ఆవిష్కరించడం తప్ప, భారత్ బాగుకు మరో దారి లేదు.నైనాల గోవర్ధన్ వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్మొబైల్: 97013 81799 -
‘బ్రిక్స్’ పార్లమెంట్ రానున్నదా?
ఈ నెల 11–12 తేదీలలో జరిగిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో రష్యా అ«ధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆ కొత్త సంస్థ యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు ఇప్పటికే బ్రిక్స్ బ్యాంక్ ఏర్పడింది. బ్రిక్స్ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మారకాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీలలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళ ధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి.ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చ జరుగు తున్న సరికొత్త విషయం బ్రిక్స్ పార్లమెంట్ నిజంగా ఏర్పడవచ్చునా అన్నది! ‘బ్రిక్స్’ గురించి తెలిసిందే. ‘బ్రిక్స్’ పార్లమెంటరీ ఫోరం మాట విన్నదే. కానీ ‘బ్రిక్స్’ పార్లమెంట్ కొత్త మాట. పార్లమెంటరీ ఫోరం సమావేశాలు ఈ నెల 11–12 తేదీలలో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగినప్పుడు, మొదటి రోజున ప్రారంభోపన్యాసం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, ఉరుములేని పిడుగువలె బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలికి పడింది. ఆయన ఆలో చనలోని ఉద్దేశమేమిటి? ‘బ్రిక్స్’ దేశాలు అందుకు సమ్మతిస్తాయా? ఆ కొత్త సంస్థ లక్ష్యాలేమిటి? అది యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా? అనే ప్రశ్నలు శరపరంపరగా తలెత్త్తటం మొదలైంది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు కలవరపాటు కలిగిస్తున్నదనేది గమనించవలసిన విషయం.ఇందుకు సంబంధించి తెలుసుకోవలసిన సమాచారాలు కొన్నున్నాయి. అంతకన్నా ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన అంత ర్జాతీయ విషయాలు చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. ఇందులో మొదటగా సమాచారాలను చూద్దాం. ‘బ్రిక్స్’ అనే సంస్థ మొదట ‘బ్రిక్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పేరిట 2006లో ఏర్పడింది. తర్వాత 2011లో సౌత్ ఆఫ్రికా చేరికతో ‘బ్రిక్స్’ అయింది. ఈ సంవత్సరం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. తమను కూడా చేర్చుకోవాలంటూ మరొక పాతిక దేశాల వరకు దరఖాస్తు చేసుకున్నాయి. ‘బ్రిక్స్’ సభ్యదేశాలు 2009లో పార్లమెంటరీ ఫోరంను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఫోరం 10వ సమావేశాలు ఈ నెలలో జరిగినపుడే పుతిన్ తన ప్రతిపాదన చేశారు. ఆ సమావేశంలో మన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. నిజానికి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అన్నది సభ్య దేశాల పార్లమెంట్ స్పీకర్ల ఫోరం. అందుకు భిన్నంగా, పుతిన్ ప్రతిపాదన కొత్తగా ఒక ఉమ్మడి పార్లమెంటును ఏర్పాటు చేసుకోవటం. ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు వచ్చే అక్టోబర్‌లో రష్యాలోని కజాన్ నగరంలో జరగ నున్నాయి. ఈ ప్రతిపాదన అపుడు అధికారికంగా చర్చకు వచ్చి,అందరూ ఆమోదించే పక్షంలో ఆచరణకు వస్తుంది. ఈలోగా ఈ విషయమై ప్రపంచమంతటా చర్చలు సాగుతాయి. మరొకవైపు సభ్య దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగగలవని వేరే చెప్ప నక్కరలేదు. పోతే, బ్రిక్స్ లక్ష్యాలే బ్రిక్స్ పార్లమెంటు లక్ష్యాలు, విధులు కాగలవని భావించవచ్చు. బ్రిక్స్ 2006లో ఏర్పడింది. ఎందుకు? ఈ 18 సంవత్సరాలలో ఆ సంస్థ చేసిందేమిటి? అన్నవి మొదట ఉత్పన్న మయే ప్రశ్నలు. ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాల కోసం ఏర్పడినటువంటిది. పరస్పర సంబంధాలతో పాటు ఇతర దేశా లతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధి కూడా ఈ పరిధిలోకి వస్తుంది. బ్రిక్స్‌కు రాజకీయపరమైన, సైనికమైన, వ్యూహాత్మకమైన లక్ష్యాలు ఏవీ లేవని, గత 18 సంవత్సరాలుగా అదే ప్రకారం పని చేస్తున్నదనేది గమనించవలసిన విషయం. అంతే గమనించవలసిందేమంటే తన ఆర్థిక లక్ష్యాల ప్రకారం బ్రిక్స్ చాలా సాధించింది. ఉదాహరణకు తాజా లెక్కల ప్రకారం, పాశ్చాత్య దేశాల కూటమి అయిన జీ–7 జీడీపీ ప్రపంచంలో 29 శాతం మాత్రమే కాగా, బ్రిక్స్ జీడీపీ 36.8 శాతానికి చేరింది. ఆర్థిక రంగంలో జరుగుతున్నదాని సూచనలను బట్టి చూడగా ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతూ పోగలదన్నది నిపుణుల అంచనా. అది చాల దన్నట్లు మునుముందు సౌదీ అరేబియా, ఇండోనేషియా, మెక్సికో తదితర దేశాలు చేరినపుడు పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. అమె రికా శిబిరానికి బ్రిక్స్ అంటే సరిపడకపోవటానికి ముఖ్యకారణం ఇదే. లోగడ ఆసియాలో ఏషియాన్, ఆఫ్రికాలో ఎకోవాస్, ఇఎసి, లాటిన్ అమెరికాలో సదరన్ కామన్ మార్కెట్ వంటివి ఏర్పడ్డాయి. ఏషియాన్ గొప్పగా విజయవంతం కాగా తక్కినవి అంతగా కాలేదు. పైగా వాటిలో అమెరికా జోక్యాలు బాగా సాగినందున తమకు పోటీగా మారలేదు. తమను అధిగమించటం అంతకన్నా జరగలేదు. బ్రిక్స్ రికార్డు వీటన్నిటికి భిన్నంగా మారింది. ఆ సంస్థ ఆమెరికా జోక్యానికి సమ్మతించలేదు. ఇండియాతో సహా ఎవరూ ఒత్తిళ్లకు లొంగలేదు. ఇది చాలదన్నట్లు అర్థికాభివృద్ధిలో తమను మించిపోతున్నారు. ఒత్తిళ్లను కాదని ఇదే సంవత్సరం ఈజిప్టు, యూఏఈ వంటివి చేరాయి. ఇరాన్‌ను చేర్చుకోరాదన్న ఒత్తిడికి బ్రిక్స్ సమ్మతించలేదు. అదే పద్ధతిలో సౌదీ, టర్కీ, ఇండోనేషియా, లిబియా, మెక్సికో వంటివి ముందుకు వస్తున్నాయి. ఇదంతా చాలదన్నట్లు, ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే పరిణామాలు మరికొన్ని జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు బ్రిక్స్ బ్యాంక్ ఒకటి 2014 లోనే ఏర్పడింది. అమెరికన్ డాలర్ ప్రాబల్యాన్ని అరికట్టేందుకు బ్రిక్స్ కరెన్సీ అయితే ఇంకా రూపొందలేదు గానీ, బ్రిక్స్ దేశాలకు చెల్లింపుల కోసం బ్రిక్స్ చెయిన్ పేరిట ఒక సాధనం చలామణీలోకి వచ్చింది. అట్లాగే ఈ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మార కాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీ లలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. బ్రిక్స్ బ్రిడ్జ్ పేరిట మరొక చెల్లింపుల పద్ధతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి ప్రభావాలతో పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక ప్రాబల్యం, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం క్రమంగా బలహీనపడుతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో బ్రిక్స్ సగటు అర్థికాభివృద్ధి 3.6 శాతం మేర, జీ–7 దేశాలది కేవలం 1 శాతం మేర ఉండగలవని అంచనా. ప్రపంచంలో ఇప్పటికే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారిన చైనా మరొక దశాబ్దం లోపలే అమెరికాను మించగలదన్నది అంతటా వినవస్తున్న మాట. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాగలదనే జోస్యాలు ఆ విధంగా బలపడుతున్నాయి. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో అమెరికా ఒత్తిళ్లను కాదని ఇప్పటికి 150 దేశాలు చేరటం, అందులో వారి శిబిరానికి చెందినవి కూడా ఉండటం ఈ ఆర్థిక ధోరణులకు దోహదం చేస్తున్నది.ఈ విధమైన ప్రభావాలను ముందుగానే అంచనా వేసి కావచ్చు అమెరికన్లు, యూరోపియన్లు మొదటినుంచే బ్రిక్స్‌ను, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివును అడ్డుకునేందుకు, బ్రిక్స్‌లోని సభ్య దేశాలను ఒత్తిడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. రకరకాల ఆంక్షలు ఏదో ఒక సాకుతో విధించటం (ఇండియాపై కూడా), వివిధ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను భంగపరచజూడటం అందులో భాగమే. భారత, రష్యాల విషయంలోనూ అదే వైఖరి చూపటానికి తాజా ఉదాహరణ ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ, పుతిన్‌ను కలవటంపై ఆగ్రహించటం. అమెరికా శిబిరం ప్రజాస్వామ్యమనీ, ఆసియా దేశాల స్వేచ్ఛ అనీ, అంతర్జాతీయ నియమాలకూ, ఐక్య రాజ్యసమితి ఛార్టర్‌కూ కట్టుబడటమనీ నీతులు చాలానే చెప్తుంది. కానీ అందుకు విరుద్ధమైన తమ చర్యల గురించి ఎన్ని రోజుల పాటైనా చెప్పవచ్చు.వీటన్నింటికి విరుగుడుగా తక్కిన ప్రపంచ దేశాలు తీసుకుంటున్న వివిధ చర్యలలో, బ్రిక్స్ పార్లమెంట్ అనే కొత్త ప్రతిపాదన ఒక ముందడుగు కాగల అవకాశం ఉంది. ప్రపంచ దేశాల మధ్య సమా నత్వ ప్రాతిపదికగా పరస్పర సహకారానికి, ఇతోధికాభివృద్ధికి అవస రమైన చర్చలు బ్రిక్స్ పార్లమెంటులో జరగాలన్నది తన ఆలోచన అయినట్లు పుతిన్ చెప్తున్నారు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
బ్రిక్స్ దేశాలు సాధించింది శూన్యం
దక్షిణాఫ్రికా వేదికగా ‘బ్రిక్స్’ దేశాల 15వ సమావేశం ముగిసింది. అంతర్జాతీయ సమాజం ఈ సమావేశాలపై అనూహ్యంగా తన దృష్టిని కేంద్రీకరించింది. వ్యాఖ్యాతలు కొందరు ఇంకో అడుగు ముందుకేసి దీన్ని 1955 నాటి బండుంగ్ (ఇండోనేషియా) సమావేశాలతో పోల్చారు. బండుంగ్ వేదికగానే భారత్ సహా చైనా, ఇండోనేషియా, ఈజిప్ట్ యుగొస్లావియా కలసికట్టుగా అలీనోద్యమాన్ని ప్రకటించాయి. తాజా సదస్సులో బ్రెజిల్, రష్యా,ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా నవతరం నేతలు అమెరికా ఆధిపత్య ప్రపంచానికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించే ప్రయత్నం చేసినంత హడావిడి జరిగింది. ప్రత్యామ్నాయం ఏమిటి? అయితే... సమావేశాలు నడుస్తున్న కొద్దీ వీటి డొల్లతనం ఇట్టే బయటపడింది. ఆతిథ్య దేశమైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి రాకపోవడంతో, భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానంలోంచి దిగేందుకు నిరాకరించి నట్లు ప్రముఖ దక్షిణాఫ్రికా వెబ్సైట్ ఓ వార్త ప్రచురించింది. ఇతర నాయకులతో పాటు వీడియో లింక్ ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉపన్యసించిన ప్రారంభ సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కారణం చెప్పకుండా, ఇవ్వాల్సిన ఉపన్యాసం ఇవ్వలేదు. యుద్ధ నేరాల పేరుతో ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారో అన్న భయంతో దక్షిణాఫ్రికాకు రాలేకపోయిన పుతిన్ యథావిధిగానే ఉక్రెయిన్ మీద తమ యుద్ధానికి బాధ్యత పాశ్చాత్య దేశాలదేనని నిందించారు. చైనా అధ్యక్షుడు తన ప్రసంగంలో పేరు చెప్పకుండా, కానీ దేని గురించో తెలి సేట్టుగా ఒక దేశం ‘తన ఆధిపత్యాన్ని ఎలాగైనా కొనసాగించాలన్న పంతంతో’ ఉందనీ, చైనా ప్రగతిని అడ్డుకుంటోందనీ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనా సియోలులా డ సిల్వా ప్రసంగం మాత్రం కొంత కల్లోలం చేసిందని చెప్పాలి. డీ–డాలరైజేషన్, బ్రిక్స్‌కు ప్రత్యా మ్నాయం వంటి అంశాలపై ఈయన మాట్లాడారు. కానీ ఏ ఫలితమూ రాలేదు. బ్రిక్స్ సభ్యదేశాల సంఖ్యను పెంచే విషయంతో ఈ శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. సంక్షోభంలో ఉన్న అర్జెంటీనా, ఇథియోపియాలతోపాటు చమురు నిల్వలు పుష్టిగా ఉన్న సౌదీ అరేబియా, ఇటీవలిదాకా దీని ప్రత్యర్థి దేశం ఇరాన్ ఇప్పుడు బ్రిక్స్ బృందంలో చేరనున్నాయి. అయితే ఏ ప్రత్యామ్నాయ సంస్థలు బ్రిక్స్ నిర్మిస్తుందో మాత్రం స్పష్టం కాలేదు. ఈ అంశాలపై స్పష్టత ఇవ్వడం కోసం జరగాల్సిన విలేఖరుల సమావేశాన్ని కాస్తా, జర్న లిస్టులకు ‘విశ్రాంతి’ పేరుతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామ ఫోసా చివరి నిమిషంలో రద్దు చేశారు. అమెరికా సెక్యురిటీస్ సంస్థలో పెట్టుబడులను రాబ ట్టేందుకు ఓ బ్రిటిష్ ఆర్థికవేత్త యథాలాపంగా పెట్టిన ‘సంక్షిప్త నామం’తో నడుస్తున్న బ్రిక్స్ సదస్సు నుంచి ఇంతకంటే గొప్పగా ఏమీ ఆశించలేము. అయితే అమెరికా నేతృత్వంలోని వ్యవస్థకు ప్రతిగా ఏర్పాటైన చాలా ముఖ్యమైన సంస్థ బ్రిక్స్ అని డబ్బా కొట్టుకోవడాన్ని మాత్రం ఎలా పరిహరించవచ్చో ఆలోచించాలి. పాశ్చాత్య దేశాల భౌగో ళిక, ఆర్థిక పెత్తనానికి చెక్ పెట్టేందుకు ఒక దీటైన సంస్థ కోసం ప్రపంచం శతాబ్దానికి పైగా ఎదురు చూస్తోంది. అయితే ఇలాంటి ఓ సంస్థ ప్రాముఖ్యతను గుర్తించడంలో పాశ్చాత్య జర్నలిస్టులు విఫలమవుతూండటం విచారకరం. దూరదృష్టి కరవు ఒక విషయమైతే స్పష్టం. బ్రిక్స్‌కూ, అలీనోద్యమానికీ ఏమాత్రం సారూప్యత లేదు. 1950లు అంటే ఇండియా, ఈజిప్టు, చైనా... జాతీయోద్యమాలు, వలస పాలనకు వ్యతిరేక సంఘర్షణల నుంచి అప్పుడప్పుడే బయట పడు తున్న కాలం అది. ఆర్థికాభివృద్ధి విషయంలో అందరికీ సమాన అవకాశాలిచ్చే అంతర్జాతీయ వ్యవస్థ ఒకటి అవస రమని అప్పటి నాయకులు నిజాయితీగా నమ్మారు. ఈ నమ్మకంలో భాగంగానే న్యూ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఆర్డర్ వంటివి బయటకు వచ్చాయి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... బండుంగ్ సమావేశపు ప్రతి నిధు లకు ఉన్న దార్శనికత, దూరదృష్టి దక్షిణాఫ్రికా బ్రిక్స్ సదస్సులో అస్సలు కనిపించకపోవడం. వాస్తవానికి మారి పోతున్న పరిస్థితుల్లో తామేం చేయాలన్నది ఇప్పుడి ప్పుడే వీళ్లు నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. కొత్తగా చేరిన సభ్యులతో సహా అన్ని బ్రిక్స్ దేశాల సాధారణ ‘విజన్’ ఏంటంటే– వాణిజ్యం, టెక్నాలజీ, మిలి టరీ ఒప్పందాల్లో తమకు ప్రాధాన్యం ఎక్కువ ఉండేలా అమెరికా, యూరప్‌లతో బేరాలు సాగించగలగడం. ఇంతకంటే భిన్నంగా ఉండే అవ కాశం లేదు. భారత్‌నే ఉదాహరణగా తీసుకుందాం. వ్యూహాత్మకంగా శత్రువైనప్పటికీ చైనా నుంచి చౌక వస్తువులు కావాలి. చౌక ధరల్లో రష్యా నుంచి ముడి చమురు కావాలి. మిలిటరీ టెక్నాలజీ, ఆయు ధాల్లాంటివి అమెరికా, యూరప్‌ల నుంచి తెచ్చు కోవాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పెట్టుబడులూ కావాలి. అందుకు తగ్గట్టుగానే భారత్ విదేశాంగ విధా నమూ ఉంటుంది. ఒంట రిగానైనా, గుంపుగానైనా ఆయా దేశాలకు కట్టుబడి ఉండేలా వ్యవహరిస్తుందన్నమాట! గ్లోబల్ సౌత్‌కు నేతృత్వం వహిస్తున్నామనీ, అందుకే వరి, చక్కెరల ఎగు మతులపై నిషేధం విధిస్తున్నామనీ కూడా భారత్ ప్రకటించుకోలేదు. ఈ విషయంలో చైనాకు ఎంతో కొంత మంచి పేరున్నా... రోజురోజుకూ ముదిరిపోతున్న ఆర్థిక సంక్షో భాన్ని తట్టుకోవడంలోనే ఆ దేశం తలమున కలై ఉంది. సభ్యులు, పెరిగినా, తగ్గినా బ్రిక్స్‌తో ప్రయోజనం శూన్య మని అర్థం చేసుకునేందుకు బహుశా వచ్చే ఏడాది రష్యాలో జరగనున్న సదస్సు వరకూ వేచి చూడా ల్సిన అవసరం లేదేమో! పంకజ్ మిశ్రా వ్యాసకర్త నవలా రచయిత, సామాజిక విశ్లేషకుడు (‘బ్లూమ్‌బర్గ్’ సౌజన్యంతో) -
గుడ్‌న్యూస్: భారీగా పెరగనున్న భారతీయుల జీతాలు!! చైనా,రష్యా దేశాల్లో అంతసీన్ లేదంట!
భారతీయ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది మనదేశానికి ఉద్యోగుల జీతాలు భారీ ఎత్తున పెరగనున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు రానున్న ఐదేళ్లలో మిగిలిన దేశాలకు చెందిన ఉద్యోగుల కంటే మనదేశానికి చెందిన ఉద్యోగుల జీతాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ సర్వే ప్రకారం..2022లో మనదేశానికి చెందిన ఉద్యోగుల జీతాలు ఐదేళ్ల గరిష్ఠ స్థాయి 9.9 శాతానికి చేరుకుంటాయని తేలింది. సంస్థలు సైతం 2021లో జీతాలు 9.3 శాతంతో పోలిస్తే 2022లో 9.9 శాతం జీతాల పెరుగతాయని అంచనా వేస్తున్నట్లు అయాన్ తన సర్వేలో హైలెట్ చేసింది. 40కి పైగా పరిశ్రమలకు చెందిన 1,500 కంపెనీల డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనంలో అత్యధికంగా జీతాలు పెరుగుతాయని అంచనా వేసింది. భారీగా పెరగనున్న జీతాలు ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్, హైటెక్/ఐటి ,ఐటి ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటిఇఎస్), లైఫ్ సైన్సెస్ రంగాలు ఉన్నాయి. జీతాల విషయంలో తగ్గేదేలా బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా లలో అయాన్ సర్వే చేసింది. ప్రపంచ జనాభాలో 41 శాతం వాటా, ప్రపంచ జీడీపీలో 24 శాతం భాగస్వామ్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో 16 శాతం వాటా బ్రిక్స్ దేశాలదే. అయితే ఈ బ్రిక్స్ దేశాల్లో అయాన్ చేసిన సర్వేలో బ్రెజిల్, రష్యా, చైనాల కంటే మనదేశంలో పనిచేసే ఉద్యోగుల జీతాలు ఎక్కువగా ఉండనున్నట్లు తెలిపింది. ఇక పర్సంటేజీల వారీగా చూసుకుంటే చైనాలో జీతాల పెంపుదల 6 శాతం, రష్యాలో 6.1 శాతం, బ్రెజిల్లో 5 శాతం ఉండనున్నట్లు తన తన రిపోర్ట్‌లో పేర్కొంది. -
BRICS: కోవిడ్‌తో కోలుకోలేని దెబ్బ
ముంబై: కోవిడ్ మహమ్మారి బ్రిక్స్ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని బ్రిక్స్ ఎకనమిక్ బులిటన్ పేర్కొంది. నిరుద్యోగం, పేదరికం, లింగ వివక్షత, వలసలు... ఇలా పలు సామాజిక అంశాలపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉందని వివరించింది. బ్రిక్స్ సెంట్రల్ బ్యాంకుల సభ్యులతో బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ) రీసెర్చ్ గ్రూప్ రూపొందించిన బులెటిన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. బ్రిక్స్ పరిశోధన, ఆర్థిక విశ్లేషణ, నిఘా సామర్థ్యాన్ని పెంపొందించడానికి సీఆర్ఏ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటయ్యింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్‌కు ప్రస్తుతం భారతదేశం అధ్యక్ష స్థానంలో ఉంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. - కోవిడ్ సంక్షోభం అన్ని దేశాలను విచక్షణారహి తంగా ప్రభావితం చేసింది. బ్రిక్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ సభ్య దేశాలు కూడా మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాని నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. - మహమ్మారి వ్యవధి–తీవ్రతల విషయాల్లో బ్రిక్స్ దేశాల మధ్య గణనీయమైన వైవిధ్యత ఉంది. - చైనా కోవిడ్‌ను పటిష్ట స్థాయిలో కట్టడి చేయగా, ఇతర బ్రిక్స్ దేశాలు అనేక రకాల ఇన్ఫెక్షన్లను చవి చూశాయి. తీవ్ర సెకండ్వేవ్లను ఎదుర్కొన్నాయి. మూడవ వేవ్ భయాల ముందు నిలిచాయి. - 2020లో ఎదురైన మహమ్మారి–ప్రేరిత తీవ్ర సవాళ్ల నుండి బ్రిక్స్ కోలుకున్నట్లు విశ్వసనీయంగా కనిపిస్తోంది. అయితే, రికవరీ విషయంలో బ్రిక్స్ సభ్యుల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. - కరోనా సవాళ్లు, ఆర్థిక పునరుద్ధరణ, దేశాల మధ్య రికవరీలో వైరుద్యాలు, ద్రవ్యోల్బణం ఇబ్బందులు, అంతర్జాతీయంగా ఎదురవుతున్న అవరోధాలు, ఫైనాన్షియల్ రంగంలో ఒడిదుడుకులుసహా బ్రిక్స్ దేశాలు పలు సమస్యలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి. - మహమ్మారిని ఎదుర్కొనడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషించనుంది. విస్తృత వ్యాక్సినేషన్ వేగం, సమర్థత వంటి అంశాలు ఆర్థిక పునరుద్ధరణలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. - కోవిడ్ అనిశ్చితికి తోడు, కఠిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, సంక్షోభం నుండి ఉత్పన్నమయ్యే నిరంతర ఆర్థిక మరియు నిర్మాణాత్మక మార్పులు బ్రిక్స్ దేశాలలో ఆందోళనను రేకెత్తిస్తున్న మరికొన్ని అంశాలు. - మహమ్మారి అనంతరం చక్కటి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించడం, ఆయా ప్రణాళికలు విజయవంతానికి కృషి, సంక్షోభం తదనంతరం ఉద్భవించే అవకాశాలను అందిపుచ్చుకోవడంపై బ్రిక్స్ దేశాలు దృష్టి సారించాలి. - సంవత్సరాలుగా సమన్వయం– సహకారానికి బ్రిక్స్ దేశాలు బలమైన పునాదులను ఏర్పరచుకున్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ), కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ) ఏర్పాటు ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు. చదవండి: భారత్ ఎకానమీకి ఢోకాలేదు.. క్రెడిట్ సూసీ నివేదిక -
‘ఉగ్ర’ పోరుకు ఐక్య కార్యాచరణ
ప్రిటోరియా: ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, అక్రమ నగదు చలామణీని అరికట్టేందుకు బ్రిక్స్ దేశాలు ఐక్య కార్యాచరణ చేపట్టాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) విదేశాంగ మంత్రుల సదస్సులో ఆమె మాట్లాడారు. అంతర్జాతీయ వాణిజ్యం సవాళ్లను ఎదుర్కుంటోందన్నారు. వాటిని తిప్పికొట్టడానికి, బ్రిక్స్ దేశాల దీర్ఘకాల అభివృద్ధికి ఐక్య కార్యాచరణ అవసరమన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింత సహకారం పెంపొందించుకోవడానికి సదస్సు సాయపడుతుందన్నారు. సదస్సు తర్వాత మీడియాతో సుష్మా మాట్లాడుతూ.. ఉగ్రవాద వ్యతిరేక పోరుకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. సదస్సులో దేశాలు రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాలకు సంబంధించిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చాయని చెప్పారు. సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు.. వచ్చే నెలలో జొహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ నాయకత్వ సదస్సు విజయవంతానికి సాయపడతాయన్నారు. బ్రిక్స్ వృద్ధి రేటు, అధిక పెట్టుబడి, వాణిజ్య వాటాతో ప్రపంచ జనాభాలో దాదాపు 42 శాతం ప్రజలను ఏకం చేస్తుందన్నారు.ఈ సదస్సులో సుష్మాతో పాటు చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, లిండివె సిసులు, మార్కస్ బెజెరా అబ్బాట్ గల్వాయో, సెర్జీ లావ్రోవ్ పాల్గొన్నారు. సుష్మా స్వరాజ్ ఐబీఎస్ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) విదేశాంగ మంత్రుల సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో చర్చలు బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణా్రఫ్రికా వెళ్లిన సుష్మా స్వరాజ్ ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను కలసి పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. నైపుణ్యాభివృద్ధి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం మరింతగా సహకరించుకోవాలని ఇరువురు నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. -
త్వరలో బ్రిక్స్ దేశాలతో ‘కార్మిక’ ఒప్పందాలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ దేశాలతో కార్మిక సంబంధాలను పటిష్టపర్చుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు పలు ఒప్పందాలకు సిద్ధమవుతోంది. వలస కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రత, సంక్షేమం కోసం త్వరలో బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బ్రిక్స్ ఎంప్లాయీమెంట్ వర్కింగ్ గ్రూపు(బీఈడబ్ల్యూజీ) సమావేశాలు బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సమావేశాల విశేషాలను ఆయన గురువారం సాయంత్రం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీఈడబ్ల్యూజీ తొలి సమావేశాలు భారతదేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించడం విశేషమన్నారు. సమ్మిళిత అభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాల్లో ఉపాధి సృష్టి, కార్మికుల సామాజిక భద్రతపై పరస్పర అవగాహన ఒప్పందం, కార్మిక శిక్షణ సంస్థల అనుసంధానం అనే మూడు అంశాలపై ఆ దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారని తెలిపారు. ఈ చర్చల ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా వచ్చే సెప్టెంబర్‌లో ఆగ్రాలో జరగనున్న బ్రిక్స్ దేశాల కార్మిక, ఉపాధి కల్పన మంత్రుల సమావేశంలో వాటితో ఒప్పందాలు కుదుర్చుకుంటామని మంత్రి చెప్పారు. అభివృద్ధి చెందిన జీ-20 దేశాలు పరస్పరం సహకరించుకుంటున్న విధంగా ‘బ్రిక్స్’ దేశాలు సైతం ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. దేశ యువజన జనాభా 80 కోట్ల వరకు ఉందని, నైపుణ్యాభివృద్ధి ద్వారా వీరందరికీ దేశ, విదేశాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. 10 మంది, అంతకు మించిన సంఖ్యలో కార్మికులతో నడుస్తున్న దుకాణాలు, వ్యాపార సంస్థలను ఏడాదిలో 365 రోజులూ రాత్రింబవళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ ‘షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని’ తీసుకొచ్చామన్నారు. భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించి రాత్రివేళల్లో మహిళలకు ఉపాధి కల్పించవచ్చని దత్తాత్రేయ చెప్పారు. ఈ చట్టాన్ని అమలు చేయాలా? వద్దా? అనేది దుకాణాలు, వ్యాపార సంస్థల ఇష్టమన్నారు. ఈ చట్టంతో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. -
ఇంధన సామర్థ్యంపై ‘బ్రిక్స్’ చర్చలు
- విశాఖలో 2 రోజుల సదస్సు ప్రారంభం సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ ఇంధన సామర్థ్యసదస్సు సోమవారం విశాఖలో ప్రారంభమైంది. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రెండురోజుల సదస్సులో ‘బ్రిక్స్’ భాగస్వామ్య దేశాలైన భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పాల్గొంటున్నాయి. ఇంధన రంగంలో ఈ దేశాలు సాధించిన ప్రగతి గురించి సమీక్షిస్తున్నారు. ఏపీలోని విశాఖలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు గురించి ఇంధనశాఖ అడిషనల్ సెక్రటరీ బి.పి.పాండే విదేశీ ప్రతినిధులకు వివరించారు. తమ దేశాలు అవలంబిస్తున్న విద్యుత్ సామర్థ్యం పెంపు-ఆదా విధానాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రిక్స్ దేశాల ప్రతి నిధులు చర్చించారు. రాత్రి 7 గంటలకు విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ దీపాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భారత్ నుంచి బి.పి.పాండేతో పాటు బిఈఈ సెక్రటరీ సంజయ్సేత్, ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ స్థాయికి వరంగల్ 'నిట్' !
బ్రిక్ దేశాలతో ఒప్పందం విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కొత్త పీహెచ్డీ కోర్సులకు అవకాశం హన్మకొండ (వరంగల్) : వరంగల్‌లోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) మరో సువర్ణ అవకాశాన్ని దక్కించుకుంది. ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాలకు చెందిన ప్రఖ్యాత వర్సిటీలతో నిట్‌కు ఒప్పందం కుదిరింది. ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమాఖ్య బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియ, ైచైనా, దక్షిణాఫ్రికా)ల మధ్య విద్యా సంబంధమైన అంశాల్లో నెట్వర్క్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని గతేడాది నిర్ణయించగా, బ్రిక్ దేశాల నెట్వర్క్ యూనివర్సిటీలో నిట్ వరంగల్ చోటు దక్కింది. గత నెలలో రష్యాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. బ్రిక్ నెట్వర్క్ వర్సిటీలో చోటు దక్కడం వల్ల నెట్‌వర్క్‌లో ఉన్న వర్సిటీల మధ్య కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంశాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. అంతేకాకుండా నిట్ వరంగల్ వర్సిటీకి చెందిన విద్యార్థులు బ్రిక్ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర వర్సిటీల్లో ఒక సెమిస్టర్ చదివేందుకు అర్హులు అవుతారు. ఇదే పద్ధతిలో బ్రిక్ సభ్యదేశాలకు చెందిన విద్యార్థులు నిట్ వరంగల్‌లో ఒక సెమిస్టర్ చదువుకోవచ్చు. విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర వర్సిటీలో బోధించవచ్చు. విదేశీ ప్రొఫెసర్లు నిట్ వర్సిటీలో ప్రత్యేక బోధన చేసేందుకు అనుమతి లభిస్తుంది. బ్రిక్ దేశాల ఆర్థిక ప్రగతికి ఆయా దేశాల్లోన్ని శాస్త్ర సాంకేతిక రంగాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. సరికొత్త ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలతో బ్రిక్ దేశాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన ప్రముఖ విద్యాసంస్థలకు మనదేశానికి చెందిన విద్యార్థులు, అధ్యాపకులను పంపడం వలన కొత్త విషయాలను స్వయంగా నేర్చుకునేందుకు వీలవుతుంది. కంప్యూటర్ సైన్స్‌తో పాటు పర్యావరణంలో మార్పు, నీటి వనరులు, కాలుష్య నియంత్రణ, ఆర్థికరంగం వంటి అంశాల్లోనూ కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించారు. ఈ అంశాల్లో పీహెచ్‌డీలతో పాటు షార్ట్‌టర్మ్, సర్టిఫికెట్ కోర్సులను నిట్ వరంగల్ విద్యార్థులు నెట్వర్క్ పరిధిలో విశ్వవిద్యాలయాల్లో చేయవచ్చు. నెట్వర్క్ పరిధిలో ఇతర దేశాల్లో కోర్సులు, సెమిస్టర్ చదివేందుకు ఎంపికైన విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సాయం లభిస్తుంది. -
ప్రపంచంలో 7వ అత్యంత విలువైన ‘నేషన్ బ్రాండ్’గా భారత్
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచపు 7వ అత్యంత విలువైన ‘నేషన్ బ్రాండ్’గా అవతరించింది. భారత్ బ్రాండ్ విలువ ఒకేసారి అత్యధికంగా 32 శాతం వృద్ధి చెంది 2.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 19.7 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో అమెరికా ప్రపంచపు అత్యంత విలువైన నేషన్ బ్రాండ్‌గా అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో చైనా, జర్మనీ, యూకే, జపాన్, ఫ్రాన్స్ ఉన్నాయి. ఈ విషయాలు బ్రాండ్ ఫైనాన్స్ వార్షిక నివేదికలో వెల్లడయ్యాయి. చైనా బ్రాండ్ విలువ 1% తగ్గి 6.3 బిలియన్ డాలర్లుగా ఉంది. నేషన్ బ్రాండ్ విలువ ప్రతి దేశంలోని అన్ని బ్రాండ్ల ఐదేళ్ల భవిష్యత్ అమ్మకాల అంచనాలపై ఆధారపడి ఉంటుంది. భారత్‌కు ‘ఇన్క్రిడబుల్’ ఇండియా నినాదం బాగా అనుకూలించిందని, అలాగే జర్మనీకి ఫోక్స్‌వ్యాగన్ సం క్షోభం ప్రతికూలంగా పరిణమించిందని బ్రాండ్ ఫైనాన్స్ పేర్కొంది. వ్యాపారానుకూల వాతావరణంతో అమెరికా అత్యంత విలువైన నేషన్ బ్రాండ్‌గా కొనసాగుతోందని తెలిపింది. చైనా స్టాక్ మార్కెట్ పతనం, అర్థిక వృద్ధి మందగమనం వంటి అంశాలు అమెరికాకు అనుకూలించాయని పేర్కొంది. బ్రిక్స్ దేశాల్లో కేవలం భారత్ బ్రాండ్ విలువ మాత్రమే పెరిగినట్లు వెల్లడించింది. -
ఉగ్రవాదంపై నిష్పాక్షిక పోరు
బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు * అంతర్జాతీయ నిబంధనలను కచ్చితంగా పాటించాలి * ఐరాస భద్రతమండలిలో సంస్కరణలు ఆవశ్యకం ఉఫా(రష్యా): స్వ, పర భేదం లేకుండా ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలని బ్రిక్స్ దేశాలకు భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాద గ్రూపులు, వాటికి సాయమందిస్తున్న దేశాలు, ఉగ్రవాదం లక్ష్యంగా చేసుకున్న దేశాలపై ఎలాంటి భేదభావం చూపకూడదని హితవు చెప్పారు. బ్రిక్స్, ఐరాస భద్రతామండలితో పాటు ఇతర అంతర్జాతీయ వేదికలపైనా ఇదే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అంతర్జాతీయ నియమ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాలన్నారు. సామాజిక, ఆర్థికాభివృద్ధికి శాంతి, సుస్థిరతలు మూల స్తంభాలని పేర్కొన్నారు. రష్యాలోని ఉఫాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో గురువారం మోదీ ప్రసంగించారు. చైనా అధ్యక్షుడు పింగ్, బ్రెజిల్ అధ్యక్షురాలు రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జుమాల సమక్షంలో ఉగ్రవాదంపై భారత వైఖరిని, ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన విధానాల్ని మోదీ వివరించారు. ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని విడుదల చేసిన పాకిస్తాన్‌పై చర్య తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్న నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్‌పై చర్యకు అవసరమైన సమాచారం భారత్ ఇవ్వలేదంటూ ఐరాసలో భారత ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ‘ఐరాస ఎలాంటి సామాజిక, ఆర్థిక సవాళ్లనైనా ఎదుర్కొనే స్థాయికి రావాలంటే ముందుగా, అతిత్వరగా భద్రతమండలిలో సంస్కరణలు రావాలి’ అన్నారు. అంతర్జాతీయంగా కీలక ఆర్థిక వ్యవస్థలైన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు.. ఏకాభిప్రాయం, సహకారంతో సవాళ్లు ఎదుర్కోవాలన్నారు. బ్రిక్స్ బ్యాంక్ వచ్చే సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, తర్వాత విద్యుత్ ప్రాజెక్టులకు నిధులు అందిస్తుందని పుతిన్ తెలిపారు. బ్రిక్స్ డిక్లరేషన్.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రాజకీయ వ్యూహాలు, పక్షపాత ధోరణి ఉండకూడదని బ్రిక్స్ డిక్లరేషన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఉగ్రవాదంపై పోరులో పక్షపాత వైఖరి అవలంబిస్తున్న పాక్‌ను ఉద్దేశించే ఈ ప్రకటన అని, ఇది భారత్ సాధించిన విజయమని పరిశీలకులు భావిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరును అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి సమన్వయం చేయాలని ఆ డిక్లరేషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ స్టేట్ దురాగతాలను కూడా అందులో తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై బ్రిక్స్ సదస్సు చర్చించింది. నేడు మోదీ, షరీఫ్‌ల భేటీ.. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సుల నేపథ్యంలో.. భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు నేడు(శుక్రవారం) ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కశ్మీర్‌పై పాక్ వ్యాఖ్యలు, బంగ్లాదేశ్‌లో మోదీ పాక్ వ్యతిరేక కామెంట్లతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చే చర్యలపై మోదీ, షరీఫ్‌లు చర్చించనున్నారు. అలాగే, ఉగ్రవాదం, ఇతర సీమాంతర కార్యక్రమాలపై షరీఫ్‌కు మోదీ తీవ్ర నిరసన తెలిపే అవకాశం ఉంది. బ్రిక్స్, ఎస్సీఓ సభ్య దేశాధినేతలకు గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన విందులో మోదీ, షరీఫ్‌లు ఎదురుపడ్డారు. నవ్వుతూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న దాయాది దేశాల ప్రధానులు కాసేపు ముచ్చటించుకున్నారు. రష్యాలో ఇరాన్ అధ్యక్షుడు రౌహనీతో మోదీ భేటీ అయ్యారు. సహకారానికి పది సూత్రాలు బ్రిక్స్ దేశాల మధ్య మరింత సహకారం సమన్వయం పెంపొందాలని మోదీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సదస్సులో ‘దస్ కదమ్: భవిష్యత్తుకు పది అడగులు’ పేరుతో పది సూత్రాలను ప్రతిపాదించారు. వీటిలో వాణిజ్య ప్రదర్శన, రైల్వే పరిశోధన కేంద్రం, ప్రధాన ఆడిట్ సంస్థల మధ్య సహకారం, బ్రిక్స్ క్రీడా మండలి తదితరాలు ఉన్నాయి. కాగా, ఏకపక్ష ఆంక్షలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను పరోక్షంగా విమర్శిస్తూ బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
బ్రిక్స్.. ప్రపంచ బ్యాంక్‌కు ప్రత్యామ్నాయం కాదు
బ్రిక్స్ అబ్జర్వర్ రీసెర్చ్ నిపుణులు విశ్వనాధన్ విశాఖపట్నం: బ్రిక్స్ దేశాలు ఏర్పాటుచేయనున్న బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)లకు ప్రత్యామ్నాయం కాదని, ఆదృష్టితో చూడకూడదని బ్రిక్స్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిపుణుడు, మాజీ రాయబారి హెచ్.హెచ్.ఎస్ విశ్వనాధన్ తెలిపారు. బ్రిక్స్ నూతన ఆర్ధిక అంతర్జాతీయ సదస్సును గీతం వర్సిటీలో సోమవారం నిర్వహించారు. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, భారత్, ఛైనా, సౌత్ ఆఫ్రికా దేశాల (బ్రిక్స్ దేశాలు) నుంచి ప్రతినిధులు పాల్గొని ఆయా దేశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య సంబంధాల మెరుగు పడటానికి బ్రిక్స్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విశ్వనాధన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల ప్రమేయం లేకుండా బ్రిక్స్ భవిష్యత్తులో ప్రపంచ ఆర్ధిక శక్తిగా ఎదగలేదన్నారు. భారత మాజీ రాయబారి అమిత్ గుప్తా మాట్లాడుతూ వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై బ్రిక్స్ ప్రపంచంలో ఇతర దేశాలకు మార్గదర్శకం వహించాలన్నారు. దక్షిణాఫ్రికా హైకమిషన్ కార్యాలయం కార్యదర్శి శ్రీధరన్ ఎస్.పిళ్లై, చైనా రాయబారి కార్యాలయం డిప్యూటీ మినిస్టర్ కౌన్సిల ర్ జెన్ నియో మాట్లాడుతూ బ్రిక్స్ కూటమి టైజం, పైరసీ, ఆరోగ్య రంగం తదిర సామాజిక అంశాలపై దృష్టి సారించాలన్నారు. గీతం అధ్యక్షుడు ఎం.వి.వి.ఎస్ మూర్తి మాట్లాడుతూ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఎగుమతులు పెరిగే అవకాశం ఉందన్నారు.