‘బ్రిక్స్‌’ పార్లమెంట్‌ రానున్నదా? | Sakshi Guest Column On BRICS countries Parliament | Sakshi
Sakshi News home page

‘బ్రిక్స్‌’ పార్లమెంట్‌ రానున్నదా?

Published Thu, Jul 18 2024 12:14 AM | Last Updated on Thu, Jul 18 2024 12:14 AM

Sakshi Guest Column On BRICS countries Parliament

విశ్లేషణ

ఈ నెల 11–12 తేదీలలో జరిగిన బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో రష్యా అ«ధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ బ్రిక్స్‌ పార్లమెంట్‌ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆ కొత్త సంస్థ యూరోపియన్‌ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు ఇప్పటికే బ్రిక్స్‌ బ్యాంక్‌ ఏర్పడింది. బ్రిక్స్‌ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మారకాలను అంగీకరించే దేశాలతో అమెరికన్‌ డాలర్‌ బదులు తమ కరెన్సీలలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళ ధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చ జరుగు తున్న సరికొత్త విషయం బ్రిక్స్‌ పార్లమెంట్‌ నిజంగా ఏర్పడవచ్చునా అన్నది! ‘బ్రిక్స్‌’ గురించి తెలిసిందే. ‘బ్రిక్స్‌’ పార్లమెంటరీ ఫోరం మాట విన్నదే. కానీ ‘బ్రిక్స్‌’ పార్లమెంట్‌ కొత్త మాట. పార్లమెంటరీ ఫోరం సమావేశాలు ఈ నెల 11–12 తేదీలలో రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగినప్పుడు, మొదటి రోజున ప్రారంభోపన్యాసం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్, ఉరుములేని పిడుగువలె బ్రిక్స్‌ పార్లమెంట్‌ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలికి పడింది. ఆయన ఆలో చనలోని ఉద్దేశమేమిటి? ‘బ్రిక్స్‌’ దేశాలు అందుకు సమ్మతిస్తాయా? ఆ కొత్త సంస్థ లక్ష్యాలేమిటి? అది యూరోపియన్‌ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా? అనే ప్రశ్నలు శరపరంపరగా తలెత్త్తటం మొదలైంది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు కలవరపాటు కలిగిస్తున్నదనేది గమనించవలసిన విషయం.

ఇందుకు సంబంధించి తెలుసుకోవలసిన సమాచారాలు కొన్నున్నాయి. అంతకన్నా ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన అంత ర్జాతీయ విషయాలు చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. ఇందులో మొదటగా సమాచారాలను చూద్దాం. ‘బ్రిక్స్‌’ అనే సంస్థ మొదట ‘బ్రిక్‌’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పేరిట 2006లో ఏర్పడింది. తర్వాత 2011లో సౌత్‌ ఆఫ్రికా చేరికతో ‘బ్రిక్స్‌’ అయింది. ఈ సంవత్సరం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చేరాయి. తమను కూడా చేర్చుకోవాలంటూ మరొక పాతిక దేశాల వరకు దరఖాస్తు చేసుకున్నాయి. ‘బ్రిక్స్‌’ సభ్యదేశాలు 2009లో పార్లమెంటరీ ఫోరంను ఏర్పాటు చేసుకున్నాయి. 

ఈ ఫోరం 10వ సమావేశాలు ఈ నెలలో జరిగినపుడే పుతిన్‌ తన ప్రతిపాదన చేశారు. ఆ సమావేశంలో మన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. నిజానికి బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం అన్నది సభ్య దేశాల పార్లమెంట్‌ స్పీకర్ల ఫోరం. అందుకు భిన్నంగా, పుతిన్‌ ప్రతిపాదన కొత్తగా ఒక ఉమ్మడి పార్లమెంటును ఏర్పాటు చేసుకోవటం. ‘బ్రిక్స్‌’ శిఖరాగ్ర సమావేశాలు వచ్చే అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌ నగరంలో జరగ నున్నాయి. ఈ ప్రతిపాదన అపుడు అధికారికంగా చర్చకు వచ్చి,అందరూ ఆమోదించే పక్షంలో ఆచరణకు వస్తుంది. ఈలోగా ఈ విషయమై ప్రపంచమంతటా చర్చలు సాగుతాయి. మరొకవైపు సభ్య దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగగలవని వేరే చెప్ప నక్కరలేదు. 

పోతే, బ్రిక్స్‌ లక్ష్యాలే బ్రిక్స్‌ పార్లమెంటు లక్ష్యాలు, విధులు కాగలవని భావించవచ్చు. బ్రిక్స్‌ 2006లో ఏర్పడింది. ఎందుకు? ఈ 18 సంవత్సరాలలో ఆ సంస్థ చేసిందేమిటి? అన్నవి మొదట ఉత్పన్న మయే ప్రశ్నలు. ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాల కోసం ఏర్పడినటువంటిది. పరస్పర సంబంధాలతో పాటు ఇతర దేశా లతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధి కూడా ఈ పరిధిలోకి వస్తుంది. బ్రిక్స్‌కు రాజకీయపరమైన, సైనికమైన, వ్యూహాత్మకమైన లక్ష్యాలు ఏవీ లేవని, గత 18 సంవత్సరాలుగా అదే ప్రకారం పని చేస్తున్నదనేది గమనించవలసిన విషయం. 

అంతే గమనించవలసిందేమంటే తన ఆర్థిక లక్ష్యాల ప్రకారం బ్రిక్స్‌ చాలా సాధించింది. ఉదాహరణకు తాజా లెక్కల ప్రకారం, పాశ్చాత్య దేశాల కూటమి అయిన జీ–7 జీడీపీ ప్రపంచంలో 29 శాతం మాత్రమే కాగా, బ్రిక్స్‌ జీడీపీ 36.8 శాతానికి చేరింది. ఆర్థిక రంగంలో జరుగుతున్నదాని సూచనలను బట్టి చూడగా ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతూ పోగలదన్నది నిపుణుల అంచనా. అది చాల దన్నట్లు మునుముందు సౌదీ అరేబియా, ఇండోనేషియా, మెక్సికో తదితర దేశాలు చేరినపుడు పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. అమె రికా శిబిరానికి బ్రిక్స్‌ అంటే సరిపడకపోవటానికి ముఖ్యకారణం ఇదే. లోగడ ఆసియాలో ఏషియాన్, ఆఫ్రికాలో ఎకోవాస్, ఇఎసి, లాటిన్‌ అమెరికాలో సదరన్‌ కామన్‌ మార్కెట్‌ వంటివి ఏర్పడ్డాయి. 

ఏషియాన్‌ గొప్పగా విజయవంతం కాగా తక్కినవి అంతగా కాలేదు. పైగా వాటిలో అమెరికా జోక్యాలు బాగా సాగినందున తమకు పోటీగా మారలేదు. తమను అధిగమించటం అంతకన్నా జరగలేదు. బ్రిక్స్‌ రికార్డు వీటన్నిటికి భిన్నంగా మారింది. ఆ సంస్థ ఆమెరికా జోక్యానికి సమ్మతించలేదు. ఇండియాతో సహా ఎవరూ ఒత్తిళ్లకు లొంగలేదు. ఇది చాలదన్నట్లు అర్థికాభివృద్ధిలో తమను మించిపోతున్నారు. ఒత్తిళ్లను కాదని ఇదే సంవత్సరం ఈజిప్టు, యూఏఈ వంటివి చేరాయి. ఇరాన్‌ను చేర్చుకోరాదన్న ఒత్తిడికి బ్రిక్స్‌ సమ్మతించలేదు. అదే పద్ధతిలో సౌదీ, టర్కీ, ఇండోనేషియా, లిబియా, మెక్సికో వంటివి ముందుకు వస్తున్నాయి. 

ఇదంతా చాలదన్నట్లు, ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే పరిణామాలు మరికొన్ని జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు బ్రిక్స్‌ బ్యాంక్‌ ఒకటి 2014 లోనే ఏర్పడింది. అమెరికన్‌ డాలర్‌ ప్రాబల్యాన్ని అరికట్టేందుకు బ్రిక్స్‌ కరెన్సీ అయితే ఇంకా రూపొందలేదు గానీ, బ్రిక్స్‌ దేశాలకు చెల్లింపుల కోసం బ్రిక్స్‌ చెయిన్‌ పేరిట ఒక సాధనం చలామణీలోకి వచ్చింది. అట్లాగే ఈ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మార కాలను అంగీకరించే దేశాలతో అమెరికన్‌ డాలర్‌ బదులు తమ కరెన్సీ లలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. 

బ్రిక్స్‌ బ్రిడ్జ్‌ పేరిట మరొక చెల్లింపుల పద్ధతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి ప్రభావాలతో పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక ప్రాబల్యం, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం క్రమంగా బలహీనపడుతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో బ్రిక్స్‌ సగటు అర్థికాభివృద్ధి 3.6 శాతం మేర, జీ–7 దేశాలది కేవలం 1 శాతం మేర ఉండగలవని అంచనా. ప్రపంచంలో ఇప్పటికే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారిన చైనా మరొక దశాబ్దం లోపలే అమెరికాను మించగలదన్నది అంతటా వినవస్తున్న మాట. 

ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాగలదనే జోస్యాలు ఆ విధంగా బలపడుతున్నాయి. చైనా ప్రారంభించిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో అమెరికా ఒత్తిళ్లను కాదని ఇప్పటికి 150 దేశాలు చేరటం, అందులో వారి శిబిరానికి చెందినవి కూడా ఉండటం ఈ ఆర్థిక ధోరణులకు దోహదం చేస్తున్నది.

ఈ విధమైన  ప్రభావాలను ముందుగానే అంచనా వేసి కావచ్చు అమెరికన్లు, యూరోపియన్లు మొదటినుంచే బ్రిక్స్‌ను, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివును అడ్డుకునేందుకు, బ్రిక్స్‌లోని సభ్య దేశాలను ఒత్తిడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. రకరకాల ఆంక్షలు ఏదో ఒక సాకుతో విధించటం (ఇండియాపై కూడా), వివిధ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను భంగపరచజూడటం అందులో భాగమే. 

భారత, రష్యాల విషయంలోనూ అదే వైఖరి చూపటానికి తాజా ఉదాహరణ ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ, పుతిన్‌ను కలవటంపై ఆగ్రహించటం. అమెరికా శిబిరం ప్రజాస్వామ్యమనీ, ఆసియా దేశాల స్వేచ్ఛ అనీ, అంతర్జాతీయ నియమాలకూ, ఐక్య రాజ్యసమితి ఛార్టర్‌కూ కట్టుబడటమనీ నీతులు చాలానే చెప్తుంది. కానీ అందుకు విరుద్ధమైన తమ చర్యల గురించి ఎన్ని రోజుల పాటైనా చెప్పవచ్చు.

వీటన్నింటికి విరుగుడుగా తక్కిన ప్రపంచ దేశాలు తీసుకుంటున్న వివిధ చర్యలలో, బ్రిక్స్‌ పార్లమెంట్‌ అనే కొత్త ప్రతిపాదన ఒక ముందడుగు కాగల అవకాశం ఉంది. ప్రపంచ దేశాల మధ్య సమా నత్వ ప్రాతిపదికగా పరస్పర సహకారానికి, ఇతోధికాభివృద్ధికి అవస రమైన చర్చలు బ్రిక్స్‌ పార్లమెంటులో జరగాలన్నది తన ఆలోచన అయినట్లు పుతిన్‌ చెప్తున్నారు. 


టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement