World countries
-
ముందుకు కదలని ముచ్చట
మరో ఏడాది గడిచింది. మరో జీ20 సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల పెద్దలు కలిశారన్న మాటే కానీ, ఏం ఒరిగింది? బ్రెజిల్లో రెండు రోజులు జరిగిన సదస్సు తర్వాత వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ 20 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల కూటమి ఓ సమష్టి తీర్మానం చేసింది కానీ, తీర్మానంలోని భాషపై అర్జెంటీనా అభ్యంతరాలతో ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. ఆకలిపై పోరాటానికి ఒప్పందం, ప్రపంచంలో అత్యంత సంపన్నులపై పన్ను లాంటి అంశాలపై సదస్సులో మాటలు సాగాయి. కానీ, ఉక్రెయిన్‌లో, మధ్యప్రాచ్యంలో... జరుగుతున్న ప్రధాన యుద్ధాల క్రీనీడలు సదస్సుపై పరుచుకున్నాయి. చివరకు సదస్సు చివర జరపాల్సిన విలేఖరుల సమావేశాన్ని సైతం బ్రెజిల్ దేశాధ్యక్షుడు ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. రష్యాపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు, పరిమిత అణ్వస్త్ర వినియోగానికి మాస్కో సన్నద్ధతతో ఉద్రిక్తతలు పెరిగినా అమెరికా అధ్యక్షుడు ఏమీ మాట్లాడకుండానే పయనమయ్యారు. వెరసి, అధికారులు అంటున్నట్టు ఈ ‘జీ20 సదస్సు చరిత్రలో నిలిచిపోతుంది’ కానీ, గొప్పగా చెప్పుకోవడానికేమీ లేనిదిగానే నిలిచిపోతుంది. మాటలు కోటలు దాటినా, చేతలు గడప దాటడం లేదనడానికి తాజా జీ20 సదస్సు మరో ఉదాహరణ. నిజానికి, పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, నిధులు అనేవి ఈ సదస్సుకు కేంద్ర బిందువులు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, పరస్పర సహకార ప్రయత్నాలకు కట్టుబడినట్టు సదస్సు పేర్కొంది. కానీ, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి క్రమంగా పక్కకు మరలేందుకు స్పష్టమైన ప్రణాళికలేమీ చేయలేకపోయింది. పర్యావరణ పరిరక్షణ నిధులకు సంబంధించీ పురోగతి లేకుండానే ఈ జీ20 ముగిసింది. ప్రపంచ దేశాల నేతలు కృత నిశ్చయాన్ని ప్రకటిస్తూ, బలమైన సూచన ఏదో చేస్తారని ‘కాప్–29’ ఆశించినా, అలాంటిదేమీ జరగనేలేదు. కాకపోతే, ‘జీ20’ సదస్సు తుది తీర్మానంలో నిర్దిష్టమైన ఆర్థిక వాగ్దానాలేమీ లేనప్పటికీ, మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంకుల సంస్కరణలపై దృష్టి పెట్టినందున అది పరోక్షంగా పర్యావరణ నిధులకు ఉపకరిస్తుందని కొందరు నిపుణుల మాట. కాగా, ప్రపంచం నుంచి దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ జీ20 దేశాలు వచ్చే అయిదేళ్ళను కాలవ్యవధిగా పెట్టుకోవడం సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకపోయినా, సత్సంకల్పమని సంతోషించాలి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం వాషింగ్టన్లో జరిగిన జీ20 నేతల తొలి సమావేశానికి హాజరయ్యానని గుర్తు చేసుకుంటూ, పదహారేళ్ళ తర్వాత ఇప్పటికీ ప్రపంచం ఘోరమైన పరిస్థితిలో ఉందని బ్రెజిల్ అధ్యక్షుడన్న మాట నిష్ఠురసత్యం. ఆకలి, దారిద్య్రం ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. దీనికి తప్పుడు రాజకీయ నిర్ణయాలే కారణమన్న ఆయన మాట సరైనదే. ఆకలి, దారిద్య్రంపై పోరాటానికి ప్రపంచ కూటమి స్థాపన మంచి ఆలోచనే. కానీ, ఇన్నేళ్ళుగా ఇలాంటివెన్నో సంకల్పాలు చేసుకున్నా, ఎందుకు నిర్వీర్యమయ్యాయన్నది ఆలోచించాల్సిన అంశం. పేరుకు కూటమి అయినా జీ20లోని సభ్య దేశాల మధ్య యుద్ధాలు సహా అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నా యన్నది సదస్సు ఆరంభం కాక ముందు నుంచీ తెలిసినదే. అందుకే, ఈ సదస్సును అతిగా అంచనా వేస్తే ఆశాభంగమే. కొన్ని విజయాలున్నా అధిక శాతం అంతర్జాతీయ శక్తుల మధ్య విభేదాలే సదస్సులో బయటపడ్డాయి. ఏ దేశాల పేర్లూ ఎత్తకుండా శాంతి సూక్తులకే జీ20 పరిమితమైంది. సమష్టి లక్ష్యం కోసం పలుదేశాలు కలసి కూటములుగా ఏర్పడుతున్నా, అవి చక్రబంధంలో చిక్కుకొని అడుగు ముందుకేయలేని పరిస్థితి ఉందని అర్థమవుతోంది. ఇటీవలి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు ‘కాప్29’, ఇరవై ఒక్క ఆసియా – పసిఫిక్ దేశ ఆర్థిక వ్యవస్థల వేదిక ‘ఆసియా – పసిఫిక్ ఆర్థిక సహకార మండలి’, జీ20ల్లో ఎదురైన ప్రతిష్టంభనలే అందుకు తార్కాణం. అవి ఇప్పుడు సమష్టి సవాళ్ళను పరిష్కరించే వేదికలుగా లేవు. వ్యాపార సంరక్షణవాద విధానాలు, భౌగోళిక – రాజకీయ శత్రుత్వాల యుద్ధభూములుగా మారిపోయాయి. ఈ వైఫల్యం వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు అశనిపాతం. అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటివి స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం నుంచి పక్కకు జరిగాయి. ఫలితంగా తక్కువ కూలీ ఖర్చు, సరళమైన పర్యావరణ ప్రమా ణాలున్న వర్ధమాన దేశాలకు మునుపటి సానుకూలత ఇప్పుడు లేదు. పారిశ్రామికీకరణ వేళ సరళ తర నిబంధనలతో లబ్ధి పొందిన పెద్ద దేశాలు, తీరా ఇప్పుడలాంటి ఆర్థిక అవకాశాలేమీ లేకుండానే వర్ధమాన దేశాలను సుస్థిరాభివృద్ధి వైపు నడవాలని కోరడం అన్యాయమే. ప్రపంచాన్ని పీడిస్తున్న అంశాలపై దృష్టి సారించడంలో జీ20 విఫలమవడం విషాదం. పర్యావరణ సంక్షోభం, దారిద్య్రం, ఉత్పాతాల లాంటి అనేక సవాళ్ళు కళ్ళెదుటే ఉన్నా, వాటి పరిష్కారం బదులు రష్యా, చైనాలను ఏకాకుల్ని చేయాలన్నదే జీ7 దేశాల తాపత్రయం కావడమూ తంటా. భౌగోళిక – రాజకీయ వివాదాలు అజెండాను నిర్దేశించడంతో జీ20 ప్రాసంగికతను కోల్పోతోంది. సమాన అవకాశాలు కల్పించేలా కనిపిస్తున్న బ్రిక్స్ లాంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు పలు దేశాలు మొగ్గుతున్నది అందుకే. జీ20 లాంటి బహుళ దేశాల వ్యవస్థల కార్యాచరణను ఇతరేతర అంశాలు కమ్మివేస్తే అసలు లక్ష్యానికే చేటు. పరస్పర భిన్నాభిప్రాయాల్ని గౌరవిస్తూనే దేశాలు సద్భావంతో నిర్మాణాత్మక చర్చలు జరిపితే మేలు. ఏ కూటమైనా శక్తిమంతులైన కొందరి వేదికగా కాక, అంద రిదిగా నిలవాలి. పశ్చిమదేశాలు ఆ సంగతి గ్రహిస్తేనే, జీ20 లాంటి వాటికి విలువ. విశ్వ మాన వాళికి ప్రయోజనం. వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరిగేనాటికైనా జీ20 వైఖరి మారుతుందా? -
నిధులు రావాలి! నిశ్చయం కావాలి!
పర్యావరణ మార్పుల సమస్యపై ప్రపంచ దేశాలు మరోసారి చర్చకు కూర్చున్నాయి. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) శిఖరాగ్ర సదస్సు ‘కాప్–29’ అజర్‌బైజాన్‌లోని బాకూలో సోమవారం మొదలైంది. బొగ్గు, ముడిచమురు, సహజవాయువుల వినియోగం నుంచి దూరం జర గాలని చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన ఏడాది తరువాత జరుగుతున్న ఈ 12 రోజుల మేధామథనం అనేక విధాల ప్రాధాన్యం సంతరించుకుంది. గడచిన 2023, ఆ వెంటనే వర్తమాన 2024... ఇలా వరుసగా రెండో ఏడాది కూడా అత్యధిక వేడిమి నిండిన వత్సరంగా రుజువవుతున్న వేళ జరుగు తున్న సదస్సు ఇది. అలాగే, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన కొద్ది రోజులకే ఇది జరుగుతోంది. పర్యావరణ సంక్షోభం వట్టి నాటకమన్నది ఆది నుంచి ట్రంప్ వైఖరి కావడంతో మిగతా ప్రపంచమంతా బాకూ వైపు ఆసక్తిగా చూస్తోంది. నిజానికి, ఈ 2024 చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతా నామ సంవత్సరం కానున్నట్లు కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ లాంటి నివేదికలు సూచిస్తున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రత ఎక్కువైన తొలి ఏడాదే ఇదే కానుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యవసానంగా కరవు, తుపానులు, వరదలు ప్రపంచమంతటిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాప్–29 జరుగుతుండడం గమనార్హం. గమనిస్తే, ప్రపంచ కాలుష్య ఉద్గారాలలో ఇప్పటికే చైనా ప్రథమ స్థానంలో, అమెరికా రెండో స్థానంలో ఉంటే, భారత్ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారి సదస్సుకు అమెరికా, చైనా, భారత్, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల అగ్రనేతలు హాజరు కావడం లేదు. అధ్యక్షుడు బైడెన్ రావట్లేదు. కొత్తగా ఎన్నికైన ట్రంప్ ఎలాగూ రారు. అయితేనేం, అమెరికా ప్రభావం ఈ కాప్–29పై అమితంగా ఉండనుంది. నిరుటి చర్చల్లో చేసుకున్న ప్రధాన వాగ్దానానికి కట్టుబడడంలో అనేక దేశాలు విఫలమయ్యాయి. ఉదాహరణకు, అన్ని దేశాల కన్నా అత్యధికంగా ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న అమెరికా తన పద్ధతి మార్చుకోనే లేదు. ఇప్పుడు ట్రంప్ గద్దెనెక్కినందున చమురు ఉత్పత్తి, వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గే సూచన లేదు. పర్యావరణ పరిరక్షణ చర్యల నుంచి అమెరికా పూర్తి దూరం జరిగినా జరగవచ్చు. ఇది ప్రమాద ఘంటిక. అగ్ర దేశాలు హాజరు కాకున్నా సమస్య తీవ్రతయితే మారదు. వాతావరణ సంక్షోభ నివారణకు మరిన్ని నిధులవసరం. అందుకే, కాప్–29 కొత్త వాతావరణ పరిరక్షణనిధిని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. వర్ధమాన దేశాలు తమ ఉద్గారాల సమస్యను దీటుగా ఎదుర్కొని, పెరుగుతున్న వాతావరణ ముప్పును వీలైనంత తగ్గించాలంటే ఆ దేశాలకు తగినంత ఆర్థిక సహాయం అవసరం. అందుకు 100 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని 2009లోనే నిర్ణయించారు. 2020 కల్లా దాన్ని చేరాలని భావించారు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న వాతావరణ సంక్షోభ పరిస్థితుల మధ్య ఆ నిధులు ఇప్పుడు ఏ మూలకూ రావు. కాబట్టి, వర్తమాన పరిస్థితులకూ, అవసరాలకూ తగ్గట్టు దాన్ని ఇప్పుడు సవరించుకోవాల్సిన పరిస్థితి. భాగస్వామ్య పక్షాలైన 198 దేశాలకూ వీటో ఉన్న నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధన సులభమేమీ కాదు. అలాగే, ఈ మొత్తంలో ఎంత మేర ప్రజాధనం సేకరించా లనేది కూడా కీలక ప్రశ్నే. అనేక దేశాలు ఆర్థిక భారంతో ఉన్న వేళ దీని పైనా అందరి వైఖరీ ఒకేలా లేదు. అయితే, చర్యలు చేపట్టడం ఆలస్యమైన కొద్దీ మరింత భారీగా నిధులు అవసరమవుతాయి. నిధులెంత కావాలన్నదే కాదు... వాటిని ఎలా సేకరించాలి, పర్యావరణ మార్పుల కష్టనష్టాల నుంచి కోలుకొనేందుకు దేశాలకు ఎలా ఆ నిధుల్ని పంచాలి, సంక్షోభ పరిష్కారానికి రూపొందించాల్సిన ఆర్థిక వ్యవస్థ ఏమిటనేది కూడా సదస్సులో కీలక చర్చనీయాంశాలే. పర్యావరణ, ఆర్థిక, మానవ నష్టాలను నిరోధించాలంటే పరిస్థితి చేతులు దాటక ముందే ఉద్గారాల్ని తగ్గించడం కీలకం. వాతావరణ ఉత్పాతాలతో విస్తృతంగా నష్టం, పర్యవసానాలు తప్పవు. నష్టం పెరిగిన కొద్దీ ఆ దేశాల పునరుజ్జీవానికి మరింత ఖర్చవుతుంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుడమి పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండాలంటే, తక్షణ చర్యలు అవసరం. అభివృద్ధి చెందిన దేశాలు గతంలో కోవిడ్–19 సమయంలో తమ పౌరులకూ, వ్యాపారాలకూ అండగా నిలిచేందుకు 48 నెలల్లోనే దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లను అందించి, ఆ సవాలును ఎదుర్కొన్నాయి. అప్పటి కోవిడ్లానే ఇప్పుడీ పర్యావరణ మార్పు సమస్యనూ అంతే అత్యవసరంగా చూడడం ముఖ్యం. ప్రజాధనంతో పాటు ప్రైవేట్ రంగ ఆర్థిక సాయం కూడా లేకుంటే కష్టమని కాప్–29 బాధ్యులు సైతం తెగేసి చెబుతున్నారు. హరిత పర్యావరణ నిధి అంటూ పెట్టినా, సమకూరింది తక్కువే. ఇప్పటికైతే ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్లు అవసరమంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తుండడంతో, వర్ధమాన దేశాల స్వచ్ఛ అభివృద్ధి, దారిద్య్ర నిర్మూలనకు గండి పడుతోంది. అసలు ఆ నిధుల్లోనూ 60 శాతం పైగా రుణాలైతే, 30 శాతం పైగా ఈక్విటీలు. కేవలం 5 శాతమే గ్రాంట్లు. అసలే కునారిల్లుతున్న అనేక పేద దేశాలకు ఇది మోయలేని భారమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, కాప్–29 చర్చించడం ముఖ్యం. బలమైన ఆర్థికవ్యవస్థగా రూపొందుతున్న భారత్ సైతం చొరవ తీసుకోవాలి. హరిత ఇంధన టెక్నాలజీ, పరిశోధన – అభివృద్ధి, తక్కువ ఖర్చు పరిష్కారాల వైపు ప్రపంచం దృష్టి సారించేలా చూడాలి. ఏమైనా, గండం గట్టెక్కాలంటే మరిన్ని నిధులు కావాలి. అదీ వేగంగా అందాలి. వనరుల సమీకరణ సాధ్యమేనని చరిత్ర చెబుతోంది గనక, ఇప్పుడిక రాజకీయ కృతనిశ్చయముందా అన్నదే ప్రశ్న. ఈ 12 రోజుల సదస్సులో దానికి సమాధానం స్పష్టం కానుంది. -
ఏ దేశమేగినా... బొజ్జ గణపయ్యే!
నేడు వినాయక చవితి. విఘ్నాలను తొలగించి, సర్వ కార్యాల్లో విజయం సిద్ధించాలని కోరుకుంటూ గణనాథుడికి పూజలు చేస్తాం. ఆసేతుహిమాచలం మాత్రమే కాదు భారతదేశానికి ఆవల సైతం పూజలందుకుంటున్న అతికొద్ది మంది దేవుళ్లలో వినాయకుడు సైతం ఉన్నాడు. థాయిలాండ్ మొదలు కాంబోడియా, జపాన్, చైనా ఇలా ఎన్నో దేశాల్లో బొజ్జ గణపయ్య ఘనంగా పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏటా గణేష్ చతురి్థని జరుపుకుంటూ మహదానందం పొందుతున్నాడు ఆయా దేశాల ప్రజలు. వాణిజ్య, ధారి్మక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతలను పూజించడం పరిపాటి. భారత్‌లో మాదిరే వరసిద్ధి వినాయకుడు విదేశాల్లోనూ చక్కని పూజలందుకుంటున్నాడు. అయితే గణపతిని ఆయా దేశాలు వివిధ రూపాల్లో కొలుస్తుండటం విశేషం. విఘ్ననాయకుడిని విశేష రూపాల్లో ఏ దేశం? ఎలా ఆరాధిస్తుందో ఓసారి పరికిద్దాం.. థాయిలాండ్‌లో.. థాయిలాండ్ బౌద్ధులకు వినాయకుడూ ఆరాధ్య దైవమే. క్రీ.శ 550–600 ప్రాంతంలో థాయిలాండ్‌లో లంబోదరుని విగ్రహాలు వెలిశాయి. థాయిలాండ్‌లో మన మోదకప్రియుడిని ఫిరా ఫికానెట్గా కొలుస్తారు. విజయానికి చిహ్నంగా, అడ్డంకులను తొలగించే శక్తిగా భావిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు, వివాహం సందర్భంగా మహాగణపతిని పూజిస్తారు. గజాననుడి ప్రభావం థాయ్ కళ, వాస్తుశిల్పంలోనూ స్పష్టంగా గోచరిస్తుంది. గణపతి ఆలయాలు దేశవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కాంబోడియాలో ఆగ్నేయాసియా అంతటా మన విఘ్నరాజును పూజిస్తారు. ఈ సంప్రదాయ ఈ ప్రాంతానికి ఎలా వచి్చందనేది మాత్రం తెలియడం లేదు. ఐదు, ఆరో శతాబ్దాలకు చెందిన గణాధ్యక్షుడి శాసనాలు, చిత్రాలు ఆగ్నేయాసియాలో ఉన్నాయి. కంబోడియాలో గణా«దీశుడు ప్రధాన దైవం. ఏడో శతాబ్దం నుంచి ఆయనను దేవాలయాలలో పూజించారు. భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఈ దేవుడికి ఉందని ఇక్కడ నమ్ముతారు. టిబెట్‌లో టిబెట్‌లోనూ మన మంగళప్రదాయుడిని బౌద్ధ దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ మహారక్త గణపతిగా, వజ్ర వినాయకుడిగా విభిన్న రూపాల్లో ఆరాధిస్తారు. భారతీయ బౌద్ధ మత నాయకులు అతిసా దీపంకర శ్రీజ్ఞ, గాయధర వంటివారు క్రీస్తుశకం 11వ శతాబ్దంలో టిబెట్ బౌద్ధమతానికి వినాయకుడిని పరిచయం చేసినట్లు చరిత్ర చెబుతోంది. గణేశుడిని టిబెట్, మంగోలియాలో ఉద్భవించిన బౌద్ధమత రూపమైన లామాయిజం పుట్టుకతో ఈ దేశ పురాణాలు ముడిపడి ఉన్నాయి. ధర్మ రక్షకుడిగా, చెడును నాశనం చేసే శక్తిగా, అడ్డంకులను తొలగించే మూర్తిగా వినాయకుడిని బౌద్ధం బోధిస్తోంది. అందుకే ఇక్కడి గణపతి విగ్రహం దృఢంగా, బలమైన కండరాలు, కవచం, దంతాలు, ఆయుధాలతో అలరారుతుంటాయి. ఇతర టిబెటన్ దేవతల మాదిరిగా కోపం కొట్టొచి్చనట్లు ఎరుపు, నలుపు, గోధుమ వర్ణాల్లో విగ్రహాలు కనిపిస్తాయి. ఇండోనేసియాలో.. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో కృతనాగర మహారాజు మాంత్రిక కర్మలలో అడ్డంకులను తొలగించే తాంత్రిక దేవతగా వినాయకుడిని పూజించారు. ఇది క్రీ.శ 14–15 వ శతాబ్దాల నాటికి ఇక్కడ అభివృద్ధి చెందిన తాంత్రిక బౌద్ధం, శైవ మతాల కలయికగా గణపతిని ఇక్కడ ఆరాధిస్తారు. పుర్రెలు ధరించి పుర్రెల సింహాసనంపై కూర్చున్న రూపంలో వినాయకుడు పూజలందుకుంటున్నారు. భారత్‌లో సాధారణంగా కనిపించే విగ్రహరూపాల్లోనూ గణపతిని ఇక్కడ పూజిస్తారు. తూర్పు జావా ప్రాంతంలోని తెన్గెర్ సెమెరూ జాతీయ వనంలోని బ్రోమో పర్వతం ముఖ ద్వారం వద్ద 700 సంవత్సరాలనాటి గణనాథుని విగ్రహం ఉంది. బ్రహ్మదేవుని పేరు మీద ఈ పర్వతానికి బ్రోమో పేరు వచి్చంది. అగి్నపర్వతాల విస్ఫోటం నుంచి ఈ విగ్రహం తమను రక్షిస్తుందని స్థానికులు నమ్ముతారు.చైనా, అఫ్గానిస్తాన్‌లలో.. చైనాలో లంబోదరుడిని ‘హువాంగ్ సీ టియాన్’అని పిలుస్తారు. ఆయనను ఒక విఘ్నంగా భావిస్తారు. అఫ్గానిస్తాన్ రాజధా ని కాబూల్ సమీపంలోని గార్డెజ్‌లో క్రీ.శ 6 లేదా 7వ శతాబ్దంలో చెక్కిన ప్రసిద్ధ వినాయ క విగ్రహం బయలి్పంది. గార్డెజ్ గణేశుడుగా పిలువబడే ఆయనను జ్ఞానం, శ్రేయస్సునందించే దేవుడిగా స్థానికులు ఆరాధిస్తారు. జపాన్‌లో.. గణాలకు అధిపతి అయిన వినాయకుడిని జపాన్‌లో కంగిటెన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక్కడి వాణిజ్యవేత్తలు, వ్యాపారులు, జూదగాళ్ళు, నటులు, ‘గీషా’లుగా పిలవబడే కళాకారి ణులు ఎక్కువగా గణేషుడిని కొలుస్తారు. అయితే ఇక్కడ కొందరు ప్రత్యేకమైన రూపంలో ఉన్న వినాయకుడిని ఆరాధిస్తారు. ఈ వినాయక విగ్ర హంలో స్త్రీ, పురుష రూపాలు ఆలింగనం చేసుకు ని ఉంటాయి. జపనీస్ వినాయక రూపాల్లో ఒక రూపం నాలుగు చేతులతో, ముల్లంగి, మిఠాయి పట్టుకొని ఉండటం విచిత్రం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్‌లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్‌కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్‌కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్‌ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్‌గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్‌నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘బ్రిక్స్’ పార్లమెంట్ రానున్నదా?
ఈ నెల 11–12 తేదీలలో జరిగిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో రష్యా అ«ధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆ కొత్త సంస్థ యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు ఇప్పటికే బ్రిక్స్ బ్యాంక్ ఏర్పడింది. బ్రిక్స్ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మారకాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీలలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళ ధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి.ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చ జరుగు తున్న సరికొత్త విషయం బ్రిక్స్ పార్లమెంట్ నిజంగా ఏర్పడవచ్చునా అన్నది! ‘బ్రిక్స్’ గురించి తెలిసిందే. ‘బ్రిక్స్’ పార్లమెంటరీ ఫోరం మాట విన్నదే. కానీ ‘బ్రిక్స్’ పార్లమెంట్ కొత్త మాట. పార్లమెంటరీ ఫోరం సమావేశాలు ఈ నెల 11–12 తేదీలలో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగినప్పుడు, మొదటి రోజున ప్రారంభోపన్యాసం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, ఉరుములేని పిడుగువలె బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలికి పడింది. ఆయన ఆలో చనలోని ఉద్దేశమేమిటి? ‘బ్రిక్స్’ దేశాలు అందుకు సమ్మతిస్తాయా? ఆ కొత్త సంస్థ లక్ష్యాలేమిటి? అది యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా? అనే ప్రశ్నలు శరపరంపరగా తలెత్త్తటం మొదలైంది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు కలవరపాటు కలిగిస్తున్నదనేది గమనించవలసిన విషయం.ఇందుకు సంబంధించి తెలుసుకోవలసిన సమాచారాలు కొన్నున్నాయి. అంతకన్నా ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన అంత ర్జాతీయ విషయాలు చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. ఇందులో మొదటగా సమాచారాలను చూద్దాం. ‘బ్రిక్స్’ అనే సంస్థ మొదట ‘బ్రిక్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పేరిట 2006లో ఏర్పడింది. తర్వాత 2011లో సౌత్ ఆఫ్రికా చేరికతో ‘బ్రిక్స్’ అయింది. ఈ సంవత్సరం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. తమను కూడా చేర్చుకోవాలంటూ మరొక పాతిక దేశాల వరకు దరఖాస్తు చేసుకున్నాయి. ‘బ్రిక్స్’ సభ్యదేశాలు 2009లో పార్లమెంటరీ ఫోరంను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఫోరం 10వ సమావేశాలు ఈ నెలలో జరిగినపుడే పుతిన్ తన ప్రతిపాదన చేశారు. ఆ సమావేశంలో మన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. నిజానికి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అన్నది సభ్య దేశాల పార్లమెంట్ స్పీకర్ల ఫోరం. అందుకు భిన్నంగా, పుతిన్ ప్రతిపాదన కొత్తగా ఒక ఉమ్మడి పార్లమెంటును ఏర్పాటు చేసుకోవటం. ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు వచ్చే అక్టోబర్‌లో రష్యాలోని కజాన్ నగరంలో జరగ నున్నాయి. ఈ ప్రతిపాదన అపుడు అధికారికంగా చర్చకు వచ్చి,అందరూ ఆమోదించే పక్షంలో ఆచరణకు వస్తుంది. ఈలోగా ఈ విషయమై ప్రపంచమంతటా చర్చలు సాగుతాయి. మరొకవైపు సభ్య దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగగలవని వేరే చెప్ప నక్కరలేదు. పోతే, బ్రిక్స్ లక్ష్యాలే బ్రిక్స్ పార్లమెంటు లక్ష్యాలు, విధులు కాగలవని భావించవచ్చు. బ్రిక్స్ 2006లో ఏర్పడింది. ఎందుకు? ఈ 18 సంవత్సరాలలో ఆ సంస్థ చేసిందేమిటి? అన్నవి మొదట ఉత్పన్న మయే ప్రశ్నలు. ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాల కోసం ఏర్పడినటువంటిది. పరస్పర సంబంధాలతో పాటు ఇతర దేశా లతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధి కూడా ఈ పరిధిలోకి వస్తుంది. బ్రిక్స్‌కు రాజకీయపరమైన, సైనికమైన, వ్యూహాత్మకమైన లక్ష్యాలు ఏవీ లేవని, గత 18 సంవత్సరాలుగా అదే ప్రకారం పని చేస్తున్నదనేది గమనించవలసిన విషయం. అంతే గమనించవలసిందేమంటే తన ఆర్థిక లక్ష్యాల ప్రకారం బ్రిక్స్ చాలా సాధించింది. ఉదాహరణకు తాజా లెక్కల ప్రకారం, పాశ్చాత్య దేశాల కూటమి అయిన జీ–7 జీడీపీ ప్రపంచంలో 29 శాతం మాత్రమే కాగా, బ్రిక్స్ జీడీపీ 36.8 శాతానికి చేరింది. ఆర్థిక రంగంలో జరుగుతున్నదాని సూచనలను బట్టి చూడగా ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతూ పోగలదన్నది నిపుణుల అంచనా. అది చాల దన్నట్లు మునుముందు సౌదీ అరేబియా, ఇండోనేషియా, మెక్సికో తదితర దేశాలు చేరినపుడు పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. అమె రికా శిబిరానికి బ్రిక్స్ అంటే సరిపడకపోవటానికి ముఖ్యకారణం ఇదే. లోగడ ఆసియాలో ఏషియాన్, ఆఫ్రికాలో ఎకోవాస్, ఇఎసి, లాటిన్ అమెరికాలో సదరన్ కామన్ మార్కెట్ వంటివి ఏర్పడ్డాయి. ఏషియాన్ గొప్పగా విజయవంతం కాగా తక్కినవి అంతగా కాలేదు. పైగా వాటిలో అమెరికా జోక్యాలు బాగా సాగినందున తమకు పోటీగా మారలేదు. తమను అధిగమించటం అంతకన్నా జరగలేదు. బ్రిక్స్ రికార్డు వీటన్నిటికి భిన్నంగా మారింది. ఆ సంస్థ ఆమెరికా జోక్యానికి సమ్మతించలేదు. ఇండియాతో సహా ఎవరూ ఒత్తిళ్లకు లొంగలేదు. ఇది చాలదన్నట్లు అర్థికాభివృద్ధిలో తమను మించిపోతున్నారు. ఒత్తిళ్లను కాదని ఇదే సంవత్సరం ఈజిప్టు, యూఏఈ వంటివి చేరాయి. ఇరాన్‌ను చేర్చుకోరాదన్న ఒత్తిడికి బ్రిక్స్ సమ్మతించలేదు. అదే పద్ధతిలో సౌదీ, టర్కీ, ఇండోనేషియా, లిబియా, మెక్సికో వంటివి ముందుకు వస్తున్నాయి. ఇదంతా చాలదన్నట్లు, ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే పరిణామాలు మరికొన్ని జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు బ్రిక్స్ బ్యాంక్ ఒకటి 2014 లోనే ఏర్పడింది. అమెరికన్ డాలర్ ప్రాబల్యాన్ని అరికట్టేందుకు బ్రిక్స్ కరెన్సీ అయితే ఇంకా రూపొందలేదు గానీ, బ్రిక్స్ దేశాలకు చెల్లింపుల కోసం బ్రిక్స్ చెయిన్ పేరిట ఒక సాధనం చలామణీలోకి వచ్చింది. అట్లాగే ఈ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మార కాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీ లలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. బ్రిక్స్ బ్రిడ్జ్ పేరిట మరొక చెల్లింపుల పద్ధతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి ప్రభావాలతో పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక ప్రాబల్యం, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం క్రమంగా బలహీనపడుతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో బ్రిక్స్ సగటు అర్థికాభివృద్ధి 3.6 శాతం మేర, జీ–7 దేశాలది కేవలం 1 శాతం మేర ఉండగలవని అంచనా. ప్రపంచంలో ఇప్పటికే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారిన చైనా మరొక దశాబ్దం లోపలే అమెరికాను మించగలదన్నది అంతటా వినవస్తున్న మాట. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాగలదనే జోస్యాలు ఆ విధంగా బలపడుతున్నాయి. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో అమెరికా ఒత్తిళ్లను కాదని ఇప్పటికి 150 దేశాలు చేరటం, అందులో వారి శిబిరానికి చెందినవి కూడా ఉండటం ఈ ఆర్థిక ధోరణులకు దోహదం చేస్తున్నది.ఈ విధమైన ప్రభావాలను ముందుగానే అంచనా వేసి కావచ్చు అమెరికన్లు, యూరోపియన్లు మొదటినుంచే బ్రిక్స్‌ను, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివును అడ్డుకునేందుకు, బ్రిక్స్‌లోని సభ్య దేశాలను ఒత్తిడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. రకరకాల ఆంక్షలు ఏదో ఒక సాకుతో విధించటం (ఇండియాపై కూడా), వివిధ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను భంగపరచజూడటం అందులో భాగమే. భారత, రష్యాల విషయంలోనూ అదే వైఖరి చూపటానికి తాజా ఉదాహరణ ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ, పుతిన్‌ను కలవటంపై ఆగ్రహించటం. అమెరికా శిబిరం ప్రజాస్వామ్యమనీ, ఆసియా దేశాల స్వేచ్ఛ అనీ, అంతర్జాతీయ నియమాలకూ, ఐక్య రాజ్యసమితి ఛార్టర్‌కూ కట్టుబడటమనీ నీతులు చాలానే చెప్తుంది. కానీ అందుకు విరుద్ధమైన తమ చర్యల గురించి ఎన్ని రోజుల పాటైనా చెప్పవచ్చు.వీటన్నింటికి విరుగుడుగా తక్కిన ప్రపంచ దేశాలు తీసుకుంటున్న వివిధ చర్యలలో, బ్రిక్స్ పార్లమెంట్ అనే కొత్త ప్రతిపాదన ఒక ముందడుగు కాగల అవకాశం ఉంది. ప్రపంచ దేశాల మధ్య సమా నత్వ ప్రాతిపదికగా పరస్పర సహకారానికి, ఇతోధికాభివృద్ధికి అవస రమైన చర్చలు బ్రిక్స్ పార్లమెంటులో జరగాలన్నది తన ఆలోచన అయినట్లు పుతిన్ చెప్తున్నారు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
Switzerland Peace Summit: ఉక్రెయిన్‌లో శాంతికి ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక
బెర్న్: ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఎలాంటి శాంతి ఒప్పందానికైనా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక అవుతుందని 80 దేశాలు తేలి్చచెప్పాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తున్నామని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌లో శాంతి సాధన కోసం స్విట్జర్లాండ్‌లో రెండు రోజులపాటు జరిగిన సదస్సు ఆదివారం ముగిసింది. దాదాపు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం 80 దేశాల ప్రతినిధులు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ సహా కొన్ని దేశాలు ఈ ప్రకటనలో పాలుపంచుకోలేదు. తుది డాక్యుమెంట్‌పై సంతకం చేయలేదు. యుద్ధం మొదలైన తర్వాత స్వా«దీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలని పలుదేశాలు రష్యాకు సూచించాయి. స్విట్జర్లాండ్ సదస్సు పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో శాంతికి ఇదొక తొలి అడుగు అని అభివరి్ణంచారు. అయితే, ఈ సదస్సుకు రష్యా మిత్రదేశం చైనా హాజరుకాలేదు. రష్యాను ఆహ్వా నించలేదు. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి(పశి్చమ) పవన్ కపూర్ హాజరయ్యారు. -
మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మూడోసారి అధికార పగ్గాలు స్వీకరిస్తున్న ప్రధాని మోదీకి పలు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధా ని రిషి సునాక్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ ఇలా 75 దేశాలకు చెందిన అగ్రనేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
అన్నీ తెలిసినా అలసత్వమే!
సమస్య తెలుసు... దానికి పరిష్కారమూ తెలుసు... తక్షణమే అందుకు నడుము కట్టకపోతే మానవాళి జీవనానికే ప్రమాదమనీ తెలుసు. అన్నీ తెలిసినా ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఒక్కతాటి మీదకు రాలేకపోతున్నాయంటే ఏమనాలి? ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యభూతంపై పరిస్థితి సరిగ్గా అదే! సరికొత్త అంతర్జాతీయ ఒడంబడిక నిమిత్తం గత వారం ఒట్టావాలో జరిగిన సమావేశం స్పష్టమైన నిర్ణయాలేమీ తీసుకోకుండానే చప్పగా ముగిసింది. అందరిలోనూ అసంతృప్తి మిగిల్చింది. 192 దేశాల ప్రతినిధులు వారం పాటు సమావేశమై చర్చలు జరిపినా, ఆఖరి రోజున సమావేశాన్ని అర్ధ రాత్రి దాకా పొడిగించినా ఫలితం లేకపోయింది. ఒప్పందంపై ఒక నిర్ణయం కుదరలేదు. ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని అధిక భాగం దేశాలు అంగీకరించినప్పటికీ, ఉత్పత్తిపై పరిమితులు విధించడం మీద ఒక్కతాటిపైకి రాలేకపోయాయి. ఇది నిరాశ కలిగించే పరిణామం.పెట్రోలియమ్ ఉప ఉత్పత్తులైన ప్లాస్టిక్‌లపై దేశాల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన అనేక ధనిక దేశాల్లో ప్లాస్టిక్‌ల తయారీ, పంపిణీ పరిశ్రమ జోరుగా సాగుతోంది. సహజంగానే పెట్రోకెమికల్ పరిశ్రమ వృద్ధిచెందిన ఆ దేశాలు, పారిశ్రామిక గ్రూపులేమో ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితి విధించాలనే యోచనను వ్యతిరేకించాయి. ప్రస్తుతానికి వాటి మాటే పైచేయి కాగా, ఒడంబడికపై నిర్ణయం అక్కడికి ఆగింది. ప్లాస్టిక్‌పై అంతర్జాతీయ ఒడంబడిక ప్రక్రియ 2022లోనే మొదలైంది. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, వాటి ఉత్పత్తిని ఆపేయడానికి ఒక నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకోసం ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన అంతర్ ప్రభుత్వ చర్చల కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఒడంబడికను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా ఒట్టావాలో నాలుగో విడత చర్చలు జరిగాయి. ఇవాళ వివిధ రకాల ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయింది. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నా యాలు లేని పరిస్థితి. ఇది పెద్ద ఇబ్బంది. గణాంకాలలో చెప్పాలంటే... ఏటా ప్లాస్టిక్ ఉత్పత్తి 1950లో 20 లక్షల టన్నులుండేది. 2019 నాటికి 4600 లక్షల టన్నులకు చేరింది. వచ్చే 2060 నాటికి అది అంతకు మూడింతలు అవుతుందని అంచనా. దానికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నానాటికీ తీసి కట్టుగా మారింది. పైపెచ్చు, భూమిలో కలవని ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రస్తుతం ఏటా 740 టన్నులుండగా, రానున్న 2050 నాటికి అది ఏటా 1220 లక్షల టన్నులకు చేరనుంది. విధానపరమైన మార్పులు చేపట్టకుంటే ఇది పెను సమస్యే. అందుకే, వ్యర్థాల లోపభూయిష్ట నిర్వహణను వచ్చే 2040 కల్లా సున్నా స్థాయికి తేవాలనేది లక్ష్యంగా ఒడంబడిక ప్రక్రియకు రెండేళ్ళ క్రితమే శ్రీకారం చుట్టారు. వ్యర్థాలే కాదు... అసలు ప్లాస్టిక్ ఉత్పత్తే పర్యావరణానికి పెను ప్రమాదం. ప్లాస్టిక్ భూమిలో కలసిపోదు గనక పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ పెద్ద దెబ్బ. ప్లాస్టిక్ ఉత్పత్తితో గ్రీన్ హౌస్ వాయు వులు వెలువడి భూతాపం పెరుగుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తికి ఉపకరించే పెట్రోకెమికల్స్ తయారీకై శిలాజ ఇంధనాల వెలికితీత, రిఫైనింగ్‌తో ఒక్క 2019లోనే 2.24 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి వదిలినట్టయిందట. పాత లెక్కల వంతున ఏటేటా 4 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరిగినా సరే, వచ్చే 2050 నాటికి ఇది మూడు రెట్లై ఈ గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం 6.78 గిగా టన్నులకు చేరుతుంది. ఒడంబడికతో ఈ పరిమాణాన్ని 26 శాతం మేర తగ్గించాలని లక్షించారు. మనం వాడే ప్లాసిక్లలో 16వేల రకాల రసాయనాలుంటాయి. వాటిలో కనీసం 4200 విషపూరితమే. వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో 2015లో అమెరికాలో 9200 కోట్ల డాలర్ల పైగా ఖర్చయింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్‌ల వినియోగం తగ్గించాలనీ, వాటిని రీసైక్లింగ్ చేయాలనీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ, అవేవీ ఇప్పటి దాకా అనుకున్నంత విజయం సాధించలేదు. ఉత్పత్తిపై పరిమితులు విధించడం కన్నా, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై దృష్టి పెట్టాలని తాజా భేటీలోనూ ప్రధాన దేశాలు పట్టుబట్టాయి. అయితే, కేవలం వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్లతో ప్లాస్టిక్ సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టడం జరగని పని. నిష్ఠురమైనా అది నిజం. ప్రపంచంలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాల్లో 10 శాతమే ఇప్పటి దాకా పునర్వినియోగమైంది. మిగతా వ్యర్థాలన్నీ సముద్రాలు, నేలల్లో మిగిలాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి మాత్రం ఏటేటా పెరుగుతూ పోతోంది. అందుకే, ప్లాస్టిక్‌ల ఉత్పత్తిపై నియంత్రణకు ప్రపంచ దేశాలు వీలైనంత తొందరగా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. ఒట్టావా సమావేశంలో కొంత పురోగతి సాధించినట్టు ఐరాస అంటున్నా, అది వట్టి కంటి తుడుపే!కొన్నేళ్ళుగా మైక్రో, నానో ప్లాస్టిక్లు మానవ రక్తంలో, చివరకు గర్భిణుల మావిలోనూ కనిపిస్తు న్నాయని శాస్త్రవేత్తల మాట. ఇది ఆందోళనకర పరిణామం. అందుకే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చాలదు. ఉత్పత్తిని బాగా తగ్గించడమే దీర్ఘకాలంలో ఉపయోగం. మన దేశం 2022లోనే ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు’ తీసుకొచ్చి, 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించింది. అయితే, ప్రాంతానికో రకం నిబంధనలున్నందున వాటి వినియోగం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీనిపై దృష్టి సారించాలి. ప్రపంచ దేశాలు ఈ ఏడాదిలోనే మరో విడత బుసాన్‌లో సమావేశం కానున్నాయి. అప్పటికైనా అవి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మొదలైన వందేళ్ళ లోపలే మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన ప్లాస్టిక్‌లపై పోరుకు ఒక్క మాట మీద నిలవాలి. ధనిక దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలకు పక్కనబెట్టి మరీ ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే పనిలో మిగతా దేశాల చేయి పట్టుకొని ముందుకు నడవాలి. ప్రమాదం తెలుస్తున్నా పట్టించుకోకుండా, పరిష్కారంపై చర్చలను ప్లాస్టిక్ లాగా సాగదీస్తూ పోతే మనకే కష్టం, నష్టం. -
వృద్ధి గాథలో చూడాల్సిన కోణం
జీడీపీలో భారత్ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది. 1990ల్లో 17వ స్థానంలో ఉండేది. మూడు దశాబ్దాల క్రితం తలసరి ఆదాయంలో 161వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు కేవలం 159వ స్థానానికి మాత్రమే ఎగబాకింది. తలసరి ఆదాయం పెరగకుండా జీడీపీ పెరగడం దీనికి ఒక కారణం. భారత తలసరి జీడీపీ ర్యాంకింగ్ పెరగాలంటే, సగటు వృద్ధి రేటు చాలా ఎక్కువుండాలి. గత మూడు దశాబ్దాల వృద్ధి లాభాల్లో ఎక్కువ భాగం జనాభాలోని ఒక చిన్న వర్గంలో కేంద్రీకృతమై ఉంది. దేశ జనాభాకు సంబంధించి అది చిన్నదే అయినా, మార్కెట్‌గా ఆ సమూహ పరిమాణం తక్కువ కాదు. ప్రపంచ దేశాలు ఆర్థిక శక్తిగా భారత్‌పై దృష్టి సారిస్తున్నాయంటే కారణం ఇదే. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉంది. 2030 నాటికి మన జీడీపీ మూడవ స్థానానికి చేరుకుంటుందని అంచనా. 1990ల ప్రారంభంలో, జీడీపీ పరంగా భారతదేశం 17వ స్థానంలో ఉండేది. ఈ విషయంలో దాని సాపేక్ష స్థానం గణనీయంగా మెరుగు పడిందనడంలో సందేహం లేదు. అయితే, తలసరి ఆదాయం ప్రాతి పదికన, భారతదేశం 1990ల ప్రారంభంలో 161వ స్థానంలో ఉండగా ఇప్పుడు 159వ స్థానంలో ఉంది. అంటే, తలసరి ఆదాయం పరంగా భారతదేశ సాపేక్ష స్థానం జీడీపీ పరంగా 17వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకున్న కాలంలోనూ పెద్దగా మారలేదు. ఎందుకు? తలసరి ఆదాయాన్ని పెంచకుండా యాంత్రికంగా జీడీపీని పెంచే జనాభా పెరుగుదలే దీనికి కారణమని అనుకోవచ్చు. కానీ అది కారణం కాదు. వాస్తవానికి, జనాభా పరంగా భారతదేశ సాపేక్ష స్థానం ఈ కాలంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద (చైనా తర్వాత) దేశంగా ఉంది. అంతే కాదు, చర్చిస్తున్న కాలంలో జనాభా పెరుగుదల రేటు విషయంలో భారత్‌కూ, ప్రపంచ సగటుకూ గణనీయంగా తేడా లేదు. పైగా కాలక్రమేణా, దాని జనాభా పెరుగుదల రేటు తగ్గింది. 1991, 2021 మధ్య తలసరి స్థూల దేశీయోత్పత్తి ఏడు రెట్లు ఎక్కువ పెరిగిందనే వాస్తవంలో కొంత సమాధానం ఉంది. ద్రవ్యో ల్బణం ప్రభావాన్ని మినహాయిస్తే, దేశ తలసరి వాస్తవ జీడీపీ దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్లు చూడవచ్చు. అయినప్పటికీ, జీడీపీ ర్యాంకింగ్ మెరుగుపడి తలసరి జీడీపీ ఎందుకు స్తబ్ధుగా ఉంది? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దేశ తలసరి జీడీపీ దశాబ్దంలో రెట్టింపు అయిందనుకుందాం. ఆ దేశాలు ఇప్పటికే తలసరి సగటు జీడీపీని ఎక్కువగా కలిగి ఉన్నట్లయితే లేదా అవి కూడా సహేతుకమైన అధిక రేటుతో వృద్ధి చెందుతున్నట్లయితే, ఇతర దేశాలతో పోలిస్తే దాని సాపేక్ష స్థితిలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ, ఆ దేశ జనాభా ఎంత పెద్దదైతే, మొత్తం జీడీపీ విలువ ఆ జనాభా దామాషా ప్రకారం అంత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, దాని జనాభా రెట్టింపు అయితే, మొత్తం జీడీపీ నాలుగు రెట్లు పెరుగుతుంది. మనం దీనిని జనాభా గుణకం ప్రభావం అని పిలవవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే అధిక జనాభా ఉన్న దేశ సాపేక్ష స్థానం జీడీపీ పరంగా పెరిగే అవ కాశం ఉంది. ఈ పెద్ద జనాభా గుణకం కారణంగానే భారతదేశం 1990ల ప్రారంభం నుండి ఇప్పటి వరకు జీడీపీ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి ఎదగగలిగింది. కానీ భారత తలసరి జీడీపీ ర్యాంకింగ్‌ను పెంచడానికి సగటు వృద్ధి రేటు ఇంకా ఎక్కువగా ఉండాలి. అనేక దశాబ్దాలుగా జీడీపీ ర్యాంకింగ్‌లో భారత్ సాధిస్తున్న మెరుగుదల వెనుక... అధిక జనాభా, తలసరి జీడీపీకి చెందిన అధిక వృద్ధిరేటు కలయిక దాగి ఉంది. చైనాతో పోల్చి చూద్దాం. 1991, 2021 మధ్య, జీడీపీలో చైనా ర్యాంక్ 11 నుండి 2వ స్థానానికి పెరిగింది. అదే సమయంలో సగటు తలసరి ఆదాయంలో దాని స్థానం 158 నుండి 75కి పెరిగింది. ఈ కాలంలో దాని తలసరి జీడీపీ 38 రెట్లు పెరిగింది. అయితే భారతదేశ తలసరి జీడీపీ కేవలం ఏడు రెట్లు మాత్రమే పెరిగింది. చైనాలో ఎక్కువ జనాభా ఉన్నందున, జనాభా గుణకం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ వారు సగటు తలసరి ఆదా యాన్ని కూడా అనేక రెట్లు పెంచుకోగలిగారు. కాబట్టి మొత్తం ఆదాయం, తలసరి ఆదాయం రెండింటిలోనూ వారి సాపేక్ష స్థానం మెరుగుపడింది. ఇప్పుడు, అసమానతల వెలుగులో, జీడీపీ లేదా జాతీయ ఆదాయం అనేది సగటు వ్యక్తి జీవన నాణ్యతకు నమ్మదగిన కొల మానం కాదని అందరికీ తెలుసు. ధనవంతులైన 10 శాతం మంది ఆదాయం 10 శాతం పెరిగి, మిగిలిన వారి ఆదాయం అలాగే ఉంటే, జాతీయ ఆదాయం 10 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. తలసరి జీడీపీ ఈ విషయంలో సాధారణ ప్రజల జీవన ప్రమాణానికి కొంచెం ఎక్కువ విశ్వసనీయ సూచికగా ఉంటుంది. ఈ ఉదాహరణలో, తల సరి ఆదాయం 1 శాతం మాత్రమే పెరుగుతుంది. అభివృద్ధి పరంగా నిజమైన ప్రశ్న ఏమిటంటే, మొత్తం లేదా సగటు జాతీయ వృద్ధిరేటు సాధారణ జనాభా జీవన ప్రమాణాల పెరుగుదలను ఎంతవరకు ప్రతిబింబిస్తుంది అనేది. ఇప్పుడు, అధిక జనాభా కలిగిన దేశం తన తలసరి ఆదాయాన్ని దీర్ఘకాలంపాటు పెంచగలిగితే, పేదల ఉనికి ఎల్లప్పుడూ సగటు కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంత విశ్వసనీయతకు అర్హమైనది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలు ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్‌పై దృష్టి సారిస్తున్నాయంటే కారణం ఏమిటి? ఈ గణాంకాలు మొత్తం చిత్రాన్ని పట్టుకోకపోయినా, ఇంకేదాన్నో సూచిస్తాయి. మార్కెట్ సైజు, జీడీపీ వృద్ధి లాభాల్లో సింహభాగాన్ని కైవసం చేసుకుంటున్న జనాభాలోని అతి చిన్న భాగపు సౌభాగ్యం ఇందులో ఉంది. అత్యధిక రాబడిని కోరుకునే మార్కెట్లు లేదా సరళ మైన గ్లోబల్ క్యాపిటల్‌పై నిశితమైన దృష్టిని కలిగి ఉన్న బహుళజాతి సంస్థలు మొత్తం లేదా తలసరి జీడీపీ గురించి పట్టించు కోవు. గత మూడు దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోని ఒక చిన్న భాగం వారికి ముఖ్యం. గత మూడు దశాబ్దాల వృద్ధి లాభాల్లో ఎక్కువ భాగం జనాభాలోని ఒక చిన్న వర్గంలో కేంద్రీకృతమై ఉంది. అయితే భారత దేశ జనాభాకు సంబంధించి అది చిన్నదే అయినప్పటికీ, మార్కెట్‌గా ఆ సమూహ పరిమాణం తక్కువ కాదు. ఎందుకంటే బ్రిటన్ లేదా ఫ్రాన్స్ మొత్తం జనాభా భారతదేశ మొత్తం జనాభాలో 4–5 శాతానికి దగ్గరగా ఉంటుంది. చిన్న దేశాలలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉండవచ్చు లేదా వేగంగా వృద్ధి చెందవచ్చు, కానీ మార్కెట్ పరిమాణం కారణంగా భారతదేశం ముఖ్యమైనది. కాబట్టి మొత్తం జీడీపీ విలువ లేదా దాని వృద్ధి రేటు అభివృద్ధికి కొలమానంగా బలహీనంగా ఉన్నప్పటికీ లేదా జనాభాలో అధిక భాగం పేదగా ఉన్నప్పటికీ, ఇది బాగా డబ్బున్న, సంపన్న సమూహపు కొనుగోలు శక్తికి సూచిక. ఆర్థిక వ్యవస్థలోని ఈ విభాగం లగ్జరీ కార్లు లేదా ఫ్యాన్సీ స్మార్ట్ఫోన్ల మార్కె ట్‌గా పరిమాణ పరంగా చూస్తే అనేక సంపన్న దేశాలతో పోటీపడ గలదు. అదే సమయంలో మెరిసే షాపింగ్ మాల్స్, విలాసవంతమైన వస్తువులు, సేవల వినియోగం పెరగడం వల్ల భారత్ ప్రకాశిస్తున్నట్లు భ్రమ కలగవచ్చు. మార్కెట్ పరిమాణం ఎందుకు ముఖ్యమైనది? మొదటిది, భారీ స్థాయి తయారీ పరిశ్రమలకు సంభావ్య కొనుగోలుదారుల పరంగా నిర్దిష్ట పరిమాణంలోని మార్కెట్ అవసరం. లేకపోతే, పెట్టుబడి లాభ దాయకం కాదు. రెండవది, తలసరి ఆదాయంతో సంబంధం లేకుండా, ఒక పెద్ద దేశం జనాభాలో కొంత భాగం ఆదాయం నిర్దిష్ట పరిమి తిని మించి ఉంటే, దాని డిమాండ్లు అవసరాల నుండి విలాసాలకు మారుతాయి. కాబట్టి, జీడీపీ పరంగా భారతదేశ పెరుగుదల పూర్తిగా గణాంక నిర్మాణమేననీ, ఇది సామాన్యుల జీవన ప్రమాణాన్ని ప్రతిబింబించదనీ లేదా సగటు తలసరి ఆదాయం పెరగలేదనీ ఎవరైనా అనుకుంటే... వాళ్లు అసలు కథను విస్మరిస్తున్నట్టు. కొనుగోలు శక్తి జనాభాలోని నిర్దిష్ట విభాగానికి విపరీతంగా పెరిగింది. కాకపోతే సమస్య ఏమిటంటే– సప్లయ్, డిమాండ్ ఆట ఒక చిన్న విభాగానికే పరిమిత మైతే... అది జనాభాలో ఎక్కువ భాగానికి విస్తరించకపోతే ఆర్థిక వృద్ధి స్తబ్ధతకు గురవుతుంది. కోవిడ్ మహమ్మారి ముందు కనిపించిన వృద్ధి క్షీణత సంకేతాలు దానికి ప్రతిబింబం కావచ్చు. మైత్రీశ్ ఘటక్ వ్యాసకర్త లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
పక్కనున్న ఇల్లు తగలబడుతుంటే మనది కాదు కదా అని వదిలేస్తే ఆ మంటలు మన ఇంటినీ కాల్చివేస్తాయి. ఇప్పుడు హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ఈ వాస్తవాన్నే నొక్కి చెబుతోంది. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌లో రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం ఇంకా చల్లార నే లేదు. ఇంతలో హమాస్ రాజేసిన యుద్ధ జ్వాలలు లెబనాన్ మొదలుకొని జోర్డాన్, సిరియా, ఇరాక్‌ల వరకూ మొత్తం పశ్చిమాసియాను చుట్టుముట్టాయి. ఇదే సమయంలో ఎర్రసముద్రంలో మాటుగాసిన హౌతీ మిలిటెంట్లు అటుగా వచ్చిపోయే భారీ వాణిజ్య నౌకలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేయడం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. గత నవంబర్‌లో అయిదువేల కార్లను మోసుకుపోగల ‘గెలాక్సీ లీడర్’ అనే నౌకపై హెలికాప్టర్‌తో దాడిచేసి, ఆ తర్వాత దాన్ని హైజాక్ చేశారు హౌతీలు. నౌకకు బహమాస్ జెండాయే ఉన్నా అది ఇజ్రాయెల్ కోటీశ్వరుడి షిప్పింగ్ కంపెనీదని హౌతీలు పసిగట్టారు. ఆ తర్వాత ఒక ఫ్రెంచ్ యుద్ధనౌక, ఒక గ్రీక్ నౌక, నార్వే జెండాతో పోతున్న కెమికల్ ట్యాంకర్లున్న నౌక వీరి దాడులకు లక్ష్యంగా మారాయి. మధ్యలో రెండు చైనా, రష్యాల నౌకలపైనా దాడులు జరిగాయి. కానీ పొరపాటైందని హౌతీలు ప్రకటించారు. జనవరి 15న వారు నేరుగా అమెరికా కార్గో నౌకపై దాడి చేశారు. ప్రపంచ నౌకా వాణిజ్యంలో ఇంచు మించు 17 శాతం ఎర్రసముద్రం మీదుగా జరుగుతుందని అంచనా. పర్షియా జలసంధి నుంచి యూరప్‌కు తరలిపోయే చమురు, సహజవాయు ట్యాంకులన్నీ ఎర్రసముద్రం గుండా పోవాల్సిందే. కానీ ఈ దాడుల తర్వాత అందులో చాలా భాగం తగ్గిపోయింది. అనేక సంస్థలు ఆఫ్రికా చుట్టూ తిరిగి నౌకల్ని నడపాలని నిర్ణయించాయి. ఇందువల్ల సరుకు రవాణా వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇరాన్ పెంచి పోషిస్తున్న హౌతీల ఆగడాలు అరికడతామని అమెరికా, బ్రిటన్లు రంగంలోకి దిగాయి. అందుకు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వంటివి సహకారం అందిస్తున్నాయి. హౌతీ మిలి టెంట్లు క్షిపణులతో, డ్రోన్లతో గత ఏడాది అక్టోబర్ 31న ఎర్రసముద్రంలోని ఇజ్రాయెల్ టూరిస్టు రిసార్ట్‌పై బాంబు దాడులు చేశారు. అయితే వాటిని ఇంటర్సెప్టర్ల సాయంతో ఇజ్రాయెల్ జయప్రదంగా అడ్డుకోగలిగింది. దాంతో రెండు ఈజిప్టు పట్టణాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత వారు అమెరికా ఎమ్క్యూ–9 రీపర్ డ్రోన్‌ను కూల్చారు. సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సాయంతో హౌతీలు ఎడతెరిపి లేకుండా ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను అమెరికా, ఇజ్రా యెల్ అడ్డుకోగలుగుతున్నాయి. కానీ ఎక్కడో తేడా కొట్టి అడపా దడపా నౌకలు బుగ్గిపాలవుతున్నాయి. గత నెల 10న అసంఖ్యా కంగా ఒకేసారి వదిలిన డ్రోన్లలో కొన్ని రక్షణ వ్యవస్థల్ని తప్పించుకెళ్లి అమెరికా యుద్ధ నౌకలోని ముగ్గురు నౌకాదళ సభ్యుల ప్రాణాలు తీశాయి. అమెరికా కూటమి దేశాలు సాగిస్తున్న దాడులు వృథా ప్రయాసగా మిగలటమే కాదు... చివరకు ప్రపంచయుద్ధానికి కూడా దారితీసే ప్రమాదం వుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగేదాకా ఎర్రసముద్రం ప్రశాంతంగా ఉండబోదని హౌతీలు చేసిన ప్రకటనను ప్రపంచదేశాలు సకాలంలో పట్టించుకోవాలి. 2004 మొదలుకొని గత రెండు దశాబ్దాలుగా నిత్యమూ యుద్ధరంగంలో నిలిచిన హౌతీలను తక్కువ అంచనా వేస్తే చేజేతులా వారిని హీరోలను చేసినట్టే! యెమెన్‌లో ఇరాన్–సౌదీ అరేబియాలు సాగించిన ఆధిపత్య పోరు నుంచి పుట్టుకొచ్చిన సంస్థ ‘హౌతీ’. మొదట్లో ఒక ముఠా నాయకుడి జేబుసంస్థగా మొదలైన ఈ సంస్థ షియాల్లోని ‘జైదీ’ తెగ పరిరక్షకురాలిగా అవతరించింది. దక్షిణ, తూర్పు యెమెన్ ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న సున్నీలపై ఎడ తెగని దాడులు చేసి రాజధాని సానాను చేజిక్కించుకున్నారు. ఈలోగా ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలు, అందుకు అమెరికా వత్తాసుగా నిలిచిన వైనాలను హౌతీలు స్వీయ ఎదుగుదలకు వాడుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నాశనమే తమ ధ్యేయ మనీ, వారివల్ల అన్యాయానికి గురవుతున్న ముస్లింలు ఏ వర్గంవారైనా అండగా ఉంటామని హౌతీలు తమ చర్యల ద్వారా ప్రకటిస్తున్నారు. పాలస్తీనాలో సున్నీలు, షియాలు, క్రిస్టియన్లతో సహా భిన్న వర్గాలున్నా అక్కడ సున్నీలదే మెజారిటీ. హౌతీల ఎత్తుగడలను అమెరికా సరిగానే గ్రహించింది. అందుకే జనవరి నెలనుంచి ఇజ్రాయెల్‌కు సామరస్యత, శాంతి ప్రబోధిస్తోంది. కానీ ఆ దేశం వింటే కదా! హౌతీలు ప్రపంచంలో ఒంటరివారు కారు. వారికి ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అలాగని వారు ఇరాన్ చెప్పుచేతల్లో ఉండే అవకాశం లేదు. ఎవరైనా తమ ఎదుగు దలకు తోడ్పడే వరకే వారికి మిత్రులు. నచ్చనిది చెప్పిన మరు క్షణం వారు శత్రువుతో సమానం. ఇరాన్‌పై ఎన్ని రకాల ఆంక్షలు విధించినా నానావిధ ఎత్తుగడలతో తనకంటూ మిత్రుల్ని పోగేసుకుంటోంది. హౌతీలకు అది అండదండలు అందివ్వటం వెనక రష్యా, చైనాలు లేకపోలేదు. అందుకే ఆ రెండు దేశాలూ చోద్యం చూస్తూ నిలబడ్డాయి. ఇప్పుడు హౌతీల దుందుడుకు తనాన్ని కట్టడి చేయాలన్నా, కనీసం వారి చర్యల తీవ్రతను తగ్గించాలన్నా ఇరాన్ సాయం అవసరం. రష్యా, చైనాల జోక్యం తప్పనిసరి. ఈ దశలో ప్రతిష్ఠకు పోతే మున్ముందు మరిన్ని పరాభవాలు తప్పవనీ, ఇది మరో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందనీ అమెరికా, మిత్రదేశాలు గుర్తించాలి. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘రామోత్సవం’
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. అమెరికా, బ్రిటన్ సహా 50కిపైగా దేశాల్లో ‘రామోత్సవం’నిర్వహించనున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న రామభక్తులు ఇప్పటికే కొన్ని దేశాల్లో శోభాయాత్రలకు కూడా శ్రీకారం చుట్టారు. విశ్వహిందూ పరిషత్ (విశ్వ విభాగం) ఆధ్వర్యంలో మరి కొన్ని దేశాల్లో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 22న అమెరికాలో 300, జర్మనీలో 100, మారిషస్‌లో 100, కెనడా, ఆ్రస్టేలియాల్లో 30, బ్రిటన్‌లో 25 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందువులు తక్కువగా ఉన్న ఐర్లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఒక్కో కార్యక్రమం ఉంటుంది. ఇలా మొత్తం 50కి పైగా దేశాల్లో 500 పైగా ధారి్మక, వైదిక, సాంస్కృతిక పరమైన సామూహిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ వర్గాలు తెలిపాయి. -
2024: ఎన్నికల ఏడాది
2024ను ఎన్నికల ఏడాదిగా పిలవాలేమో. ఎందుకంటే ఈ ఏడాది ఏకంగా 50కి పైగా దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి! ఒక్క ఏడాదిలో ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. అలా 2024 రికార్డులకెక్కబోతోంది. పైగా అత్యధిక జనాభా ఉన్న టాప్ 10 దేశాల్లో ఏకంగా ఏడు ఈసారి ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండటం విశేషం. ఆ లెక్కన ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ ఏడు ఓటు హక్కును వినియోగించుకోనుండటం ఇంకో విశేషం! ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్ మొదలుకుని అగ్ర రాజ్యం అమెరికా దాకా ఈ జాబితాలో ఉన్న ముఖ్యమైన దేశాలను ఓసారి చూద్దాం... బంగ్లాదేశ్ 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తొలి దేశం. జనవరి 7న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే విపక్షాలన్నింటినీ నిరీ్వర్యం చేసి ఏకపక్ష ఎన్నికల ప్రహసనానికి తెర తీశారంటూ ప్రధాని షేక్ హసీనా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అణచివేతను తట్టుకోలేక పలువురు విపక్ష నేతలు ప్రవాసంలో గడుపుతున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్టతో పాటు విపక్షాలన్నీ బాయ్‌కాట్ చేసిన ఈ ఎన్నికల్లో హసీనా మరోసారి నెగ్గడం, వరుసగా ఐదోసారి అధికారంలోకి రావడం లాంఛనమే కానుంది. ప్రజాస్వామ్యానికి చెల్లుచీటీ పాడి చైనా మాదిరిగా దేశంలో హసీనా ఏక పార్టీ వ్యవస్థను నెలకొల్పేలా ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తైవాన్ చైనా పడగ నీడన తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న తైవాన్‌లో జనవరి 13న అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార డీపీపీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు బదులుగా లై చింగ్ టే బరిలో ఉన్నారు. ఆయనకు వెన్కు మించిన స్వాతంత్య్ర ప్రియునిగా పేరుంది. ఉదారవాద క్యోమింటాంగ్ నేత హో యూ యీ, తైవాన్ పీపుల్స్ పార్టీ తరఫున కో వెన్ జే ఆయనను సవాలు చేస్తున్నారు. డీపీపీ 2016 నుంచీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి కూడా అది అధికారంలోకి వస్తే యుద్ధానికి దిగైనా తైవాన్ను విలీనం చేసుకుంటానంటూ చైనా ఇప్పటికే బెదిరిస్తోంది. దాంతో ఈ ఎన్నికలు తైవాన్‌కు ఒకరకంగా జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. పాకిస్తాన్ 24 కోట్ల జనాభా ఉన్న పాక్ అనిశి్చతికి మారుపేరు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగాలి. కానీ అవి వాయిదా పడే సూచనలే ఎక్కువగా కని్పస్తున్నాయి. సైన్యాన్ని ఎదిరించి ప్రధాని పదవి కోల్పోయి అవినీతి కేసుల్లో జైలు పాలైన పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ పోటీకి దారులు మూసుకుపోయినట్టు కని్పస్తున్నాయి. ఆయన నామినేషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడం అనుమానంగా మారింది. సైన్యం దన్నుతో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) విజయం, ప్రవాసం నుంచి తిరిగొచి్చన ఆ పార్టీ నేత నవాజ్ షరీఫ్ మరోసారి ప్రధాని కావడం లాంఛనమేనని అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇండొనేసియా 27 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఇండొనేసియాలో కూడా ఫిబ్రవరిలో ఎన్నికలున్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షునితో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ పార్లమెంటు సభ్యులకు ఫిబ్రవరి 14న ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు టర్ములు పూర్తి చేసుకున్న అధ్యక్షుడు జొకో విడొడొ స్థానంలో రక్షణ మంత్రి 72 ఏళ్ల ప్రాబొవో సుబియంటో బరిలో ఉన్నారు. గంజర్ ప్రనోవో, అనీస్ బస్వేదన్ గట్టి పోటీ ఇస్తున్నారు. భారత్ 140 కోట్లకు పైగా జనాభా, 90 కోట్ల పై చిలుకు ఓటర్లతో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యంగా అలరారుతున్న భారత్ ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. ఇన్ని కోట్ల మంది ఓటర్లు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించడం పరిపాటిగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ఖాయమని అత్యధిక రాజకీయ అంచనాలు చెబుతున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని 2014లో ఆయన ఒంటి చేత్తో అధికారంలోకి తేవడం తెలిసిందే. 2019లోనూ మోదీ మేజిక్ రిపీటైంది. ఈసారి దానికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ సారథ్యంలో 28 విపక్ష పారీ్టలతో కూడిన విపక్ష ఇండియా కూటమి ప్రయతి్నస్తోంది. మెక్సికో జూన్ 2న ఎన్నికలకు మెక్సికో సిద్ధమవుతోంది. 13 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా అధ్యక్ష పదవితో పాటు మొత్తం 32 రాష్ట్రాల గవర్నర్లు, జాతీయ కాంగ్రెస్, స్థానిక సంస్థల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. క్లాడియా షేన్‌బామ్ రూపంలో ఈసారి తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టే ఆస్కారం కనిపిస్తుండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సైంటిస్టు, మెక్సికో సిటీ మాజీ మేయర్ అయిన ఆమె అధికార మొరేనా పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు. యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్‌లోని మొత్తం 27 దేశాల ప్రజలూ కీలకమైన ప్రతి ఐదేళ్లకోసారి యూరప్ పార్లమెంటులో తమ ప్రతినిధులను ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. విద్య, వైద్యం మొదలుకుని ఉపాధి దాకా ఆ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసే పలు కీలక రంగాలకు సంబంధించి నిర్ణాయక చట్టాలు చేయడంలో పార్లమెంటుదే కీలక పాత్ర. దాంతో జూన్ 6 నుంచి 9 దాకా జరగనున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 720 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికవుతారు. దక్షిణాఫ్రికా 6 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఈ దేశంలో మే–ఆగస్టు మధ్య సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 1994లో దేశంలో వర్ణ వివక్ష అంతమయ్యాక జరుగుతున్న ఏడో ఎన్నికలివి. అప్పటినుంచీ అధికారంలో కొనసాగుతున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ఈసారి విజయానికి కావాల్సిన 50 శాతం మార్కును దాటడం కష్టకాలమేనంటున్నారు. గత అక్టోబర్‌లో జరిగిన సర్వేలో ఆ పారీ్టకి మద్దతు 45 శాతానికి పడిపోయింది. అవినీతి మకిలి అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాకు ఈసారి ప్రధాన అడ్డంకిగా మారేలా కని్పస్తోంది. అధికారంలోకి వస్తూనే పూర్వ అధ్యక్షుడు జాకబ్ జుమా అవినీతిని క్షమించడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. అధికారుల్లో పెచ్చరిల్లిన అవినీతి పరిస్థితిని ఏఎన్‌సీకి మరింత ప్రతికూలంగా మార్చిందంటున్నారు. విపక్ష డెమొక్రటిక్ అలయెన్స్ దానికి గట్టిపోటీ ఇచ్చేలా కని్పస్తోంది. అమెరికా 33 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షించేవే. అధ్యక్షున్ని ఎన్నుకోవడంతో పాటు ప్రతినిధుల సభలో మొత్తం స్థానాలతో పాటు సెనేట్‌లో మూడో వంతు సీట్లకు కూడా పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి నవంబర్ 5న జరగనున్న ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొనేలా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనమే అందుకు ఏకైక కారణం! 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకునేందుకు ఆయన ససేమిరా అనడం, తననే విజేతగా ప్రకటించాలంటూ మొండికేయడం తెలిసిందే. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను అధ్యక్షునిగా ప్రకటించకుండా అడ్డుకునేందుకు ఏకంగా క్యాపిటల్ భవనంపైకి తన మద్దతుదారులను దాడికి ఉసిగొల్పారు ట్రంప్. ఆ కేసులో ఆయన దోషిగా తేలడం, ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా మారే ప్రమాదంలో పడటం విశేషం! ఈ గండం గట్టెక్కితే ట్రంప్ మరోసారి బైడెన్‌తోనే తలపడతారు. ఘనా 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండోసారి అధ్యక్షునిగా కొనసాగుతున్న ననా అకుఫో అడో స్థానంలో కొత్త నేతను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అధికార న్యూ పేట్రియాటిక్ పార్టీ, విపక్ష నేషనల్ డెమొక్రటిక్ కాంగ్రెస్ మధ్య ఈసారి హోరాహోరీ ఖాయమంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Bhavana Reddy: ఓ విశ్వవ్యాప్త భావన
‘మెరుపు మెరిసినట్లు ఉంటుందామె నాట్యం. నాట్యానికి ఆమె చేసే న్యాయం అద్భుతంగా ఉంటుంది. భారతీయ శాస్త్రీయ నాట్యానికి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణ’. ...ఇవన్నీ భావనారెడ్డి నాట్య ప్రతిభకు అందిన ప్రశంసలు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల అక్షర పురస్కారాలు. ఇప్పుడామె కొత్త నాట్యతరంగాలను సృష్టించే పనిలో ఉన్నారు. కూచిపూడి కళాకారిణి భావనారెడ్డి నాట్యాన్ని అధ్యయనం చేశారు, నాట్యంలో పరిశోధన చేశారు. నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాట్యాన్ని భావితరాలకు అందించడానికి శిక్షణనిస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్‌దేశాలలో మన కూచిపూడి అడుగులు వేయిస్తున్నారు. చిన్నారులకు కూచిపూడి అభినయ ముద్రలు నేర్పిస్తున్నారు. నాట్యకళాకారిణి నుంచి నాట్యగురువుగా మారి గురుశిష్యపరంపరకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన(ఆదివారం) ఆమెరికా, కాలిఫోర్నియాలో ఆమె శిష్యబృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కళామతల్లి దక్షిణ ‘‘నాట్యం ఎంతగా సాధన చేసినప్పటికీ ‘ఇకచాలు’ అనే ఆలోచన ఎప్పటికీ రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన నేర్చుకున్న అడుగులకు కొత్తదనం అద్దమని పోరుతూనే ఉంటుంది. పౌరాణిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను నాట్యం ద్వారా అత్యంత లలితంగా వ్యక్తం చేయగలుగుతాం. అందుకే మన శాస్త్రీయ నాట్యప్రక్రియలు నిత్యనూతనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపాన్ని నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చాను. నా వంతు బాధ్యతగా కొత్త తరాలకు శిక్షణనిస్తున్నాను. ఇది నేను నాట్యానికి తిరిగి ఇస్తున్న కళాదక్షిణ. నాట్యానికి డిజిటల్ వేదిక కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయడానికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. కళాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. దాంతో నాట్య ప్రదర్శనలు ప్రశ్నార్థక మయ్యాయి. అప్పటికే నిర్ణయమైన కార్యక్రమాలు రద్దయ్యాయి కూడా. కరోనా వైరస్ ప్రదర్శననైతే నిలువరించగలిగింది కానీ నాట్యసాధనను కాదు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను చూసి చాలా మంది నాట్యం నేర్పించమని అడిగారు. మన సంప్రదాయాన్ని గతం నుంచి భవిష్యత్తుకు చేర్చే మాధ్యమాలుగా మా కళాకారుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మంచి సమయం అనిపించింది. అలా మూడేళ్ల కిందట అమెరికాలో ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్’ సంస్థను స్థాపించాను. దాదాపు యాభై మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణనిచ్చాను. ఈ ప్రదర్శనలో గణనాట్య, పుష్పాంజలి, జతికట్టు, మండూక శబ్దం, దశావతారాల ప్రదర్శనలో మొత్తం 15 మంది చిన్నారులు పాల్గొన్నారు. అమ్మ దిద్దిన వ్యక్తిత్వం నాట్య ప్రక్రియల్లో కాలానుగుణంగా కొద్దిపాటి మార్పులు తోడవుతుంటాయి. కానీ శిక్షణనిచ్చే విధానంలో సంప్రదాయం కొనసాగుతుంది. డాన్స్ క్లాస్‌ను నాట్యమందిరంగా గౌరవించడంలో ఎటువంటి మార్పూ ఉండదు. రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి... ఈ ముగ్గురూ కూచిపూడికి ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి బిడ్డలుగా అక్క యామిని, నేను ఆ పరంపరను కొనసాగిస్తున్నాం. నన్ను శిల్పంలా చెక్కడంలో, విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో అమ్మ కౌసల్య కృషిని మాటల్లో వర్ణించలేం. నా భర్త డెనిస్ నిల్సన్ది స్వీడన్. ఆయన సంగీతకారుడు. ఇద్దరమూ కళాకారులమే కావడం నా కళాసేవకు మరింతగా దోహదం చేస్తోంది. వారి సొంతదేశం స్వీడన్. మేము అమెరికాలో నివసిస్తున్నాం. మా అబ్బాయికి ఐదు నెలలు. నడకతోపాటు నాట్యం నేర్చుకుంటాడో, మాటలతోపాటు పాటలు నేర్చుకుంటాడో చూడాలి’’ అని నవ్విందామె. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ∙ -
KPMG report: 2050 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్యం కష్టమే!
న్యూఢిల్లీ: సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని 2050 నాటికి సాధించేందుకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు చాలవని కేపీఎంజీ సంస్థ పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, పరిశ్రమలు గుణాత్మక మార్పు దిశగా కృషి చేయాల్సి ఉందని తెలిపింది. అయితే, ఎన్నో అడ్డంకులు, గణనీయ స్థాయిలో ప్రభుత్వాల రుణ భారం, అంతర్గత ఉద్రిక్తతలు, కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రణాళికలపై పెరుగుతున్న వ్యతిరేకత, ఇంధన సరఫరా విషయంలో భరోసా కలి్పంచాల్సిన అవసరం కర్బన ఉద్గారాల విషయంలో అవరోధంగా మారుతున్నట్టు వివరించింది. ఈ మేరకు కేపీఎంజీ ఓ నివేదికను విడుదల చేసింది. కాలుష్యాన్ని అధికంగా విడుదల చేసే యూఎస్, చైనా, బ్రెజిల్, కెనడా, యూఈ దేశాల్లో తక్కువ కర్బన ఆధారిత ఇంధనాల ఉత్పత్తి విషయంలో కొంత పురోగతి సాధించినప్పటికీ.. ఈ విషయంలో భారీగా అవుతున్న ఖర్చు, దేశీయ పరిశ్రమపై పడే ప్రభావం దృష్ట్యా వస్తున్న వ్యతిరేకత అవరోధంగా మారినట్టు తెలిపింది. విడిగా దేశాల వారీగా చూస్తే.. ప్రజల జీవనోపాధికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయన్నవ్యతిరేకతతో అర్థవంతమైన పురోగతికి ఆటంకం కలుగుతున్నట్టు వెల్లడించింది. వివిధ రంగాల్లో కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో పురోగతి వేర్వేరుగా ఉందని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో పెద్ద ఎత్తున వృద్ధి.. కొన్ని రంగాల్లో వేగంగా కర్బన ఉద్గారాలను ఎలా తగ్గించవచ్చన్న దానికి విజయవంతమైన నమూనాగా పేర్కొంది. విమానయానం, షిప్పింగ్ పరిశ్రమల్లో దీనికి సంబంధించి పురోగతి చాలా నిదానంగా ఉన్నట్టు వివరించింది. 2050 నాటికి సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం అన్నది సుస్థిర విమానయాన ఇంధనాలను అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. భారత్‌లో పురోగతి.. భారత్ పునరుత్పాదక ఇంధనాల విషయంలో వేగవంతమైన పురోగతి సాధిస్తున్నట్టు కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. 2047 నాటికి ఇంధనాల విషయంలో స్వతంత్ర దేశంగా అవతరించాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నట్టు తెలిపింది. ఫేమ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండడాన్ని పస్త్రావించింది. కాకపోతే వ్యవసాయ రంగం నుంచి వెలువడుతున్న వ్యర్థాల తగ్గింపు భారత్‌కు సవాలేనని పేర్కొంది. సబ్సిడీతో అందిస్తున్న ఎరువులను అధికంగా వాడుతుండడంతో, పశుగ్రాసం నుంచి మీథేన్ విడుదల తగ్గించడం కష్టమని అభిప్రాయపడింది. ‘‘భారత్ సోలార్, విండ్, హైడ్రోజన్ నుంచి మరింత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే, భారత్ ఏటా 6 శాతానికి పైగా వృద్ధి చెందే క్రమంలో ఏర్పడే ఇంధన అవసరాల దృష్ట్యా.. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం ఇక ముందూ కొనసాగుతుంది. కాకపోతే కొంత కాలానికి సంప్రదాయ ఇంధనాల వినియోగం మొత్తం ఇంధన వినియోగంలో తగ్గుతుంది’’అని కేపీఎంజీ ఇంటర్నేషనల్ ఎనర్జీ హెడ్ అనిష్ అన్నారు. -
వాతావరణ మార్పులతో కోట్ల డాలర్ల నష్టం
న్యూఢిల్లీ: వాతావరణంలో వస్తున్న భారీ మార్పులు ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నాయి. ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలోని మౌలిక సదుపాయాల రంగంలో ఏడాదికి సగటున 30,000వేల కోట్ల డాలర్ల నుంచి 33 వేల కోట్ల డాలర్ల వరకు నష్టం వస్తోందని కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ) నివేదిక వెల్లడించింది. ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన భవంతులు ఇతర సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కూడా చేరిస్తే 73,200 కోట్ల డాలర్ల నుంచి 84 వేల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2021–22లో ప్రపంచ స్థూల ఆదాయం పెరుగుదలలో ఈ నష్టం ఏడో వంతు వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. -
కేంద్రం వైఖరిని సమర్థిస్తున్నాం
లండన్: రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని పూర్తిగా సమర్థిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. విశాలమైన దేశం అయినందున ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్‌కు సహజంగానే ఉంటుందని చెప్పారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న వైఖరికి రష్యా నుంచి చమురు సరఫరాయే కారణమా అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ‘రష్యాతో మాకు సంబంధాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్షం వైఖరి భిన్నంగా ఉంటుందని నేను భావించడం లేదు’అని వివరించారు. రష్యా నుంచి దూరంగా తమవైపు భారత్‌ను లాక్కునేందుకు పశ్చిమ దేశాల నేతలు ప్రయత్నించారా అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ.. ‘‘వాస్తవానికి భారత్‌కు రష్యాతో సత్సంబంధాలున్నాయి. అదేవిధంగా అమెరికాతోనూ సంబంధాలు న్నాయి. భారత్ విశాల దేశం. పెద్ద దేశం కావడం వల్ల అనేక ఇతర దేశాలతో వివిధ స్థాయిల్లో సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎవ్వరితోనైనా సంబంధాలు కొనసాగించే హక్కు భారత్‌కు ఉంది’అని రాహుల్ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు విషయంలో ప్రతిపక్షం వైఖరిపై ఆయన..కశ్మీర్ అభివృద్ధిని కాంగ్రెస్ గట్టిగా కోరుతోంది. అక్కడ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది’అని రాహుల్ వివరించారు. కశ్మీర్ అంశం పరిష్కారానికి అంతర్జాతీయ దౌత్యం అవసరమని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు రాహుల్ సూటిగా సమాధానమిచ్చారు. వాస్తవానికి కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. కశ్మీర్ మా సొంత విషయం. అందులో భారత్‌కు తప్ప మరెవ్వరి జోక్యం అవసరం లేదు’అని కుండబద్దలు కొట్టారు. -
G20 Summit: అతిథులొస్తున్నారు...
ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. ఏయే దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు శుక్రవారం ఏ సమయానికి విచ్చేస్తున్నారో ఓసారి చూద్దామా! ► రేపు ఢిల్లీలో ప్రారంభంకానున్న జీ–20 శిఖరాగ్ర సదస్సు బ్రిటన్ :: రిషి సునాక్ జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్‌కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. జపాన్ :: ఫుమియో కిషిదా సునాక్ విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే పాలెం విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా విమా నం ల్యాండ్ కానుంది. మధ్యా హ్నం 2.15 గంటలకు ఆయన భారత గడ్డపై అడుగుపెడతారు. ఈయనను సైతం కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి రిసీవ్ చేసుకోనున్నారు. కిషిదా భారత్‌కు రావడం ఇది రెండోసారి. ఇటీవల మార్చి నెలలో భారత్‌లో రెండు రోజులపాటు పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా :: జో బైడెన్ అగ్రరాజ్యాధినేత జో బైడెన్ రాకపైనే అందరి కళ్లు. ఈయన సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ బైడెన్‌కు సాదర ఆహ్వానం పలుకుతారు. బైడెన్ సతీమణి జిల్కు కరోనా పాజిటివ్ రావడంతో బైడెన్ జీ20 సదస్సుకు వస్తారో రారో అనే సందిగ్ధత నెలకొంది. బైడెన్‌కు చేసిన కరోనా టెస్ట్‌లో నెగటివ్ ఫలితం రావడంతో ఆయన పర్యటన ఖాయమైంది. అయినా సరే సదస్సు సందర్భంగా ఆయన మాస్క్ ధరించే పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. కెనడా :: జస్టిన్ ట్రూడో అమెరికా తర్వాత ఆ దేశానికి ఉత్తరవైపు పొరుగు దేశం కెనడా తరఫున ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారత్‌లో అడుగుపెడతారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాలెం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జస్టిన్‌కు సాదర స్వాగతం పలుకుతారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు చిరునామాగా నిలిచిన కెనడాలో ఇటీవల వేర్పాటువాద సంస్థలు రెచ్చిపోయాయి. భారత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ కెనడా–భారత్ సత్సంబంధాలను క్షీణింపజేశాయి. ప్రతిపాదిత వాణిజ్య ఒడంబడికను కెనడా అర్ధంతరంగా ఆపేసింది. ఈ తరుణంలో జీ20 వేదికగా కెనడా అగ్రనేత భారత్‌లో పర్యటించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. చైనా :: లీ కియాంగ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వాస్తవానికి ఈ సదస్సులో పాల్గొనాలి. కానీ ఈసారి ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ‘జిన్‌పింగ్ గైర్హాజరు ఊహించిందే. ఇది జీ20 కూటమి పరస్పర ఉమ్మడి నిర్ణయాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావంచూపబోదు’అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కుండబద్దలు కొట్టారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అకాŠస్య్ చిన్ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ తమ కొత్త భౌగోళిక పటాన్ని చైనా విడుదలచేయడంతో డ్రాగన్ మీద భారత్ ఆగ్రహంగా ఉంది. జర్మనీ, ఫ్రాన్స్‌ల నేతలూ.. యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ రాత్రి ఏడున్నరకు ఢిల్లీలో దిగుతారు. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ సైతం జీ20 సదస్సుకు వస్తున్నారు. సింగపూర్ ప్రధాని లూంగ్ లీని కేంద్ర సహాయ మంత్రి మురుగన్ రిసీవ్ చేసుకుంటారు. జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నారు. ఈయనను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ రిసీవ్ చేసుకోనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ శనివారం మధ్యాహ్నం 12.35 నిమిషాలకు వస్తారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మహిళా మంత్రి అనుప్రియా సింగ్ పాటిల్ మేక్రాన్‌కు స్వాగతం పలుకుతారు. క్యూ కట్టనున్న నేతలు సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకుంటారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ ఇయోల్ యూన్ సాయంత్రం 5.10కి వస్తున్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసీ, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో రాత్రి సమయంలో రానున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పదిగంటలకు చేరుకుంటారు. స్పెయిన్ అధ్యక్షుడు పెట్రో పెరిజ్ రాత్రి 10.15కు చేరుకుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Global Wealth Report 2023: భారత్ తప్ప పలు అగ్రదేశాల్లో సంపద కరిగిపోతోంది
అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో సంపద పెరుగుతోంది. భారత్‌లో తప్ప ► అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. అధిక ధరలు, డాలర్‌తో పోల్చి చూస్తే వివిధ దేశాల కరెన్సీలు పడిపోవడం, భౌగోళిక రాజకీయాలు, వాతావరణ మార్పులు వంటివెన్నో దేశాల ఆర్థిక వ్యవస్థని కుంగదీస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సంపద క్షీణించడం ప్రారంభమైంది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నట్టుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్) రూపొందించిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023లో వెల్లడైంది. ప్రపంచ దేశాల్లో అమెరికా అత్యధికంగా సంపదని కోల్పోతే ఆ తర్వాత స్థానంలో జపాన్ ఉంది. 2021లో ప్రపంచ దేశాల సంపద 466.2 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2022 నాటికి 2.4% తగ్గి 454.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక సంపద తగ్గిపోవడంలో అమెరికా ముందుంది. ఏడాదిలో 5.9 ట్రిలియన్ డాలర్ల సంపదను అగ్రరాజ్యం కోల్పోయింది. ఆ తర్వాత స్థానంలో జపాన్ నిలిచింది. 2021తో పోల్చి చూస్తే ఆ దేశం 2.5 ట్రిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. ప్రాంతాల వారీగా ఇలా.. ► అత్యంత సంపన్న దేశాలున్న ఉత్తర అమెరికా, యూరప్‌లు భారీగా నష్టపోయాయి. 2022లో ఈ దేశాల్లో 10.9 ట్రిలి యన్ డాలర్ల నష్టం జరిగింది. ► ఆసియా ఫసిఫిక్ దేశాల్లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ► లాటిన్ అమెరికాలో 2.4 ట్రిలియన్ డాలర్ల సంపద పెరిగింది. ► 2022లో భారీగా సంపద హరించుకుపోయిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత జపాన్, చైనా, కెనడా, ఆ్రస్టేలియా ఉన్నాయి. ► సంపద భారీగా పెరిగిన దేశాల్లో భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్యా నిలిచాయి. ► తలసరి ఆదాయంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో పెరుగుతున్న సంపద ► ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం సంపద పెరుగుతోంది. 2021తో పోల్చి చూస్తే మన దేశ సంపద 675 బిలియన్ డాలర్లు అంటే 4.6% పెరిగింది. 2022 నాటికి 15.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా వంటి దేశాల్లో కూడా సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం పెరగడం విశేషం. దేశంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అపర కుబేరులుగా మారారు. 2000 నుంచి 2022 వరకు ఏడాదికి 15% మిలియనీర్లు పెరుగుతూ వస్తున్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్నప్పటికీ రష్యా సంపద కూడా పెరగడం గమనార్హం. స్థిరంగా సంపద పెరుగుదల.. ► భారత్‌లో సంపద పెరుగుదల 20 ఏళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది. మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సంపద ఏడాదికి 5.9% చొప్పున పెరుగుతోంది. ఒకప్పుడు చైనాలో మధ్యతరగతి సంపద అధికంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు భారత్ చైనా స్థానాన్ని ఆక్రమించింది. మిలియనీర్లు మన దేశంలో ఏకంగా 15% పెరుగుతూ వస్తున్నారు. మొత్తమ్మీద మిలియనీర్లు అమెరికాలోనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తిన వారు 5.9 కోట్ల మంది ఉంటే వారిలో 2.3 కోట్ల మంది అంటే 40% అమెరికాలోనే ఉన్నారు. 2027 నాటికి భారత్, చైనా, బ్రెజిల్, యూకే, దక్షిణ కొరియాలో కూడా కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అంచనా. 2022–27 మధ్య చైనాలో కోటీశ్వరులు 26%,భారత్‌లో 11% పెరుగుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఖర్చు తగ్గించుకోకుంటే ఎలా? నేటినుంచి మనమంతా భూమికి అప్పే!
ప్రపంచ దేశాల పర్యావరణ బడ్జెట్ బుధవారంతో పూర్తిగా ఖర్చయిపోయింది. గురువారం నుంచి భూమి అప్పుగా సమకూర్చేదే. కాస్త వింతగా అన్పించినా ఇది వాస్తవం. ఆర్థిక వనరులకు సంబంధించి వార్షిక బడ్జెట్లు, లోటు బడ్జెట్లు, అప్పులు ఉన్నట్టే పర్యావరణ వనరులకు కూడా బడ్జెట్ ఉంది. గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ తాజా అంచనా ప్రకారం.. ఆ బడ్జెట్ ఆగస్టు 2తో అయిపోయింది. అంటే.. భూగోళానికున్న పర్యావరణ వనరుల సామర్థ్యం (బయో కెపాసిటీ) అంతవరకేనన్నమాట. దీన్నే ‘వరల్డ్ ఎర్త్ ఆఫ్ షూట్ డే’అని పిలుస్తున్నారు. ఇక ఆగస్టు 3 నుంచి మనం వాడేదంతా భూమితన మూలుగను కరిగించుకుంటూ కనాకష్టంగాసమకూర్చే అప్పు (అదనపు వనరులు) మాత్రమే. 1.75 భూగోళాలు కావాలి గత ఏడాది ఈ పర్యావరణ బడ్జెట్ ఆగస్టు 1తోనే అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే ఒకరోజు ముందే అయిపోయింది. ఈ ఏడాదిలో కొద్దోగొప్పో పర్యావరణ స్పృహ పెరగడంతో ఒక రోజు అదనంగా సమకూరిందన్నమాట. పర్యావరణ బడ్జెట్ 1971 వరకు భూగోళం ఇవ్వగలిగే పరిమితులకు లోబడే ఉండేదట. అంటే 365 రోజులూ లోటు లేకుండా ఉండేదని గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ అంచనా వేసింది. ఆ తర్వాత నుంచి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెర గడంతో పాటు వినియోగంలో విపరీత పోకడల వల్ల భూగోళంపై ఒత్తిడి పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కలిసి 175% మేరకు ప్రకృతి వనరులు వాడేస్తున్నాయి. అంటే.. మనకు అవసరమైన వనరులు సునాయాసంగా సమకూర్చాలంటే 1.75 భూగోళాలు కావాలన్నమాట. ఎక్కువ వ్యయం చేస్తున్న సంపన్న దేశాలు ప్రకృతి వనరుల వినియోగం అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు. సంపన్న దేశాలు ఎక్కువ వనరులను ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు.. అమెరికా వాసుల మాదిరిగా ప్రకృతి వనరులను వాడితే 5.1 భూగోళాల పర్యావరణ సేవలు మనకు అవసరమవుతాయి. చైనీయుల్లా జీవిస్తే 2.4 భూగోళాలు కావాలి. ఇక ప్రపంచ పౌరులందరూ భారతీయుల్లా జీవిస్తే 0.8 భూగోళం చాలు. అంటే.. పర్యావరణ బడ్జెట్ 20% మిగులులోనే ఉంటుందన్న మాట. ఖతార్ బడ్జెట్ ఫిబ్రవరి 10నే ఖతం! ప్రపంచవ్యాప్తంగా తలసరి వార్షిక పర్యావరణ వనరుల సామర్ధ్యం (బయో కెపాసిటీ) 1.6 గ్లోబల్ హెక్టార్లు (బయో కెపాసిటీని, ఫుట్‌ప్రింట్ (ఖర్చు)ని ‘గ్లోబల్ హెక్టార్ల’లో కొలుస్తారు). దీనికన్నా ఖర్చు (ఫుట్‌ప్రింట్) ఎక్కువగా ఉంటే పర్యావరణ బడ్జెట్ అంత తక్కువ రోజుల్లోనే అయిపోతుంది. తక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ రోజులు కొనసాగుతుంది. భారత్‌లో తలసరి వార్షిక పర్యావరణ బడ్జెట్ 1.04 గ్లోబల్ హెక్టార్లు. అంటే లభ్యత కన్నా ఖర్చు తక్కువగా (20% మిగులు బడ్జెట్) ఉందన్న మాట. ఇక అత్యంత సంపన్న ఎడారి దేశం ఖతార్ పర్యావరణ బడ్జెట్ ఫిబ్రవరి 10నే అయిపోవడం గమనార్హం. కెనడా, యూఏఈ, అమెరికాల బడ్జెట్ మార్చి 13తో, చైనా బడ్జెట్ మే 1తో అయిపోగా, ఆగస్టు 12న బ్రెజిల్, డిసెంబర్ 20న జమైకా బడ్జెట్లు అయిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలన్నీ ఇందుకే.. వనరులు సమకూర్చే శక్తి భూగోళానికి లేకపోయినా మనం వాడుకుంటూనే ఉన్నాం కాబట్టే భూగోళం అతలాకుతలమైపోతోంది. ఎన్నడూ ఎరుగనంత ఉష్ణోగ్రతలు, కుండపోత వర్షాలు, కరువు కాటకాలు.. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ మనం పర్యావరణ వనరులు అతిగా కొల్లగొడు తున్న దాని ఫలితమే. పర్యావరణ లోటు బడ్జెట్‌తో అల్లాడుతున్న భూగోళాన్ని స్థిమితపరిచి మన భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే.. పర్యావరణ వార్షిక బడ్జెట్ 365 రోజులకు సరిపోవాలంటే.. మానవాళి మూకుమ్మడిగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వనరులను పొదుపుగా వాడాలి. ముఖ్యంగా ఐదు పనులు చేయాలి. పర్యావరణ హితమైన ఇంధనాలు వాడాలి. ఆహారోత్పత్తి పద్ధతులను పర్యావరణ హితంగా మార్చుకోవాలి. నగరాల నిర్వహణలో ఉద్గారాలు, కాలుష్యం తగ్గించుకోవాలి. భూగోళంపై ప్రకృతి వనరులకు హాని కలిగించని రీతిలో పారిశ్రామిక కార్యక్రమాలు చేపట్టాలి. అన్నిటికీ మించి వనరుల తక్కువ వినియోగానికి వీలుగా జనాభా పెరుగుదలను అదుపులో ఉంచుకోవాలి. – సాక్షి సాగుబడి డెస్క్ -
భారత్ వైపు చూస్తున్న ప్రపంచం
ముంబై: ప్రపంచం భారత్, భారత పరిశ్రమల వైపు చూస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఎగుమతులను పెంచుకోవాలని సూచించారు. ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్కెటింగ్ విధానాలు, బ్రాండింగ్ ఉత్పత్తులతో దేశంలోని వ్యవస్థాపక సామర్థ్యాలు భారత్ అసలైన సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకొస్తామయన్నారు. 49వ జెమ్ అండ్ జ్యుయలరీ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. ‘‘ఈ నెల 24న యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మంత్రులతో (ఐస్లాండ్, లీచెస్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్) సమావేశం ఉంది. వారు భారత్‌తో వాణిజ్య చర్చలకు సుముఖంగా ఉన్నారు. గల్ఫ్ దేశాలు, రష్యా కూడా భారత్‌తో చర్చలకు ఆసక్తిగా ఉన్నాయి. కనుక దేశ పారిశ్రామికవేత్తలు దీన్ని అవకాశంగా మలుచుకోవాలి’’అని మంత్రి సూచించారు. ప్రభుత్వం వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు నిజాయితీగా కృషి చేస్తోందంటూ, పరిశ్రమ నైతిక విధానాలు అనుసరించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వం యూఎస్, జీ7 దేశాలతో చర్చించడం ద్వారా ఆంక్షలు లేకుండా చూడాలని ఇదే సమావేశంలో భాగంగా జెమ్, జ్యుయలరీ ఎగుమతి ప్రోత్సాహక మండలి చైర్మన్ విపుల్ షా మంత్రిని కోరారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు?
(ఎస్.రాజమహేంద్రారెడ్డి) : సరిగ్గా ఏడాది క్రితం యముని మహిషపు లోహపు గంటల గణగణలు విని ప్రపంచం యావత్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ గణగణలు దిక్కులు పిక్కటిల్లేలా భూగోళమంతా మారుమోగుతాయేమోనని ఆందోళన పడింది. రష్యా సమరనాదం ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసి అనివార్యంగా ప్రపంచ దేశాలను రెండుగా చీల్చడం ఖాయమని పరిశీలకులూ భయంభయంగానే అంచనా వేశారు. మిత్ర దేశం బెలారస్ భుజం మీద ట్యాంకులను మోహరించి ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. చిరుగాలికే వొణికిపోయే చిగురుటాకులా ఉక్రెయిన్ తలవంచడం ఖాయమనే అనుకున్నారంతా! యుద్ధమంటేనే చావులు కదా. మృతదేహాల ఎర్రటి తివాచీ మీద నుంచే విజయం నడిచో, పరుగెత్తో వస్తుంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ, ప్రపంచం దృష్టంతా రణక్షేత్రంపైనే నిలిచింది. అయ్యో అన్నవాళ్లున్నారు, రెండు కన్నీటి చుక్కలతో జాలి పడ్డవారూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైరి పక్షాల వైపు నిలిచిన దేశాలు మాట సాయమో, మూట సాయమో, ఆయుధ సాయమో చేసి తమ వంతు పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. తటస్థంగా ఉన్నవాళ్లూ ఉన్నారు. చమురు కోసమో, తిండిగింజల కోసమో రష్యాపై ఆధారపడ్డ దేశాలు ఇప్పుడెలా అని తల పట్టుకుని ఆలోచనలో పడ్డాయి. ఒకవైపు రష్యా వైఖరిని వ్యతిరేకిస్తూ మరోవైపు దిగుమతులను స్వాగతించడం ఎలాగన్నదే వాటిముందు నిలిచిన మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండియాకు ఇవేమీ పట్టలేదు. ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకు రావడాన్నే యుద్ధం తొలినాళ్లలో లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే భారత్ తటస్థ ధోరణికే కట్టుబడింది. నెలలు గడిచి యేడాది పూర్తయ్యేసరికి రెండు దేశాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. మిగతా దేశాలు తమ సమస్యలను తమదైన రీతిలో, రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం లేనంతగా పరిష్కరించుకున్నాయి. ఇప్పుడు యుద్ధం హాలీవుడ్ వార్ సినిమాయే.. ప్రాణ నష్టం గణాంకాలే! యుద్ధం కూడా రోజువారీ దినచర్యలా రొటీన్‌గా మారిపోయినప్పుడు ఒక్క కన్నీటి బొట్టయినా రాలుతుందా? అయినా ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు? తండ్రినో, భర్తనో, కొడుకునో కోల్పోయిన అభాగ్యులు తప్ప! పక్కింటి గొడవ స్థాయికి... యుద్ధం తొలినాళ్లలో ఇకపై చమురెలా అన్నదే యూరప్‌ను వేధించిన ప్రశ్న. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు తమ చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం రష్యాపైనే ఆధారపడేవి. సహాయ నిరాకరణలో భాగంగా ఆ దిగుమతులను నిలిపివేయక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో జర్మనీ నుంచి ఇటలీ దాకా, పోలండ్ దాకా తమ దిగుమతుల పాలసీని మార్చుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. అధిక ధరకు చము రును ఇతర దేశాల నుంచి కొనాల్సి వచ్చినా, పొదుపు మంత్రంవేసి కుదుటపడ్డాయి. ప్రత్యామ్నా య మార్గం దొరికే వరకు యుద్ధం తమ గుమ్మం ముందే కరాళ నృత్యం చేస్తోందన్నంతగా హడలిపోయి ఉక్రెయిన్ పట్ల కాస్త సానుభూతిని, కాసిన్ని కన్నీటి బొట్లను రాల్చిన ఈ దేశాలన్నీ ఒక్కసారిగా కుదుటపడి ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు యుద్ధం ఈ దేశాలకు పక్కింటి గొడవే..! ఇక భారత్ విషయానికొస్తే నాటో దేశాల సహాయ నిరాకర ణతో లాభపడిందనే చెప్పాలి. బ్యారెళ్లలో మూలుగుతున్న చమురును ఏదో ఒక ధరకు అమ్మేయాలన్న వ్యాపార సూత్రాన్ని అనుసరించి రష్యా భారత్‌కు డిస్కౌంట్ ఇస్తానని ప్రతిపాదించింది. ఫలితంగా గత ఏడాది మార్చి 31 దాకా రష్యా చమురు ఎగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న భారత్ వాటా ఈ ఏడాది ఏకంగా 22 శాతానికి చేరింది! యుద్ధమంటే బాంబుల మోత, నేలకొరిగిన సైనికులు, ఉసురు కోల్పోయిన సామాన్య పౌరులు మాత్రమే కాదు, కొందరికి వ్యాపారం కూడా! భారత్‌కు చమురు లాభమైతే ఆయుధ తయారీ దేశాలకు వ్యాపార లాభం. యుద్ధమంటే ఆయుధ నష్టం కూడా. జర్మనీ, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, పోలండ్ లాంటి దేశాలు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఆయుధ ఉత్పత్తిని పెంచి, సొమ్ము చేసుకుంటున్నాయి. ఏడాది తిరిగేసరికి యుద్ధం చుట్టూ పరిస్థితులు ఇంతలా మారితే కదనరంగంలో పిట్టల్లా రాలుతున్న వారి గురించి ఎవరాలోచిస్తారు? ప్రాథమ్యాల జాబితాలో యుద్ధం ఇప్పుడు చిట్టచివరి స్థానానికి నెట్టివేతకు గురైంది. రణక్షేత్రంలోని వైరి పక్షాలకు తప్ప మిగతా దేశాలకు ఇప్పుడది కేవలం ఒక వార్త మాత్రమే! బావుకున్నదేమీ లేదు మిత్ర దేశాలు, శత్రు దేశాలు, తటస్థ దేశాలను, వాటి వైఖరులను పక్కన పెడితే వైరి పక్షాలైన రష్యా, ఉక్రెయిన్ కూడా బావుకున్నదేమీ లేదు. ప్రాణనష్టం, ఆయుధ నష్టాల్లో హెచ్చుతగ్గులే తప్ప రెండు దేశాలూ తమ పురోగతిని ఓ నలభై, యాభై ఏళ్ల వెనక్కు నెట్టేసుకున్నట్టే! శ్మశాన వాటికలా మొండి గోడలతో నిలిచిన ఉక్రెయిన్ మునుపటి స్థితికి చేరుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో యుద్ధం ముగిస్తే తప్ప అంచనా వేయలేం. యుద్ధం వల్ల పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలను, కోల్పోయిన వీర సైనికులను రష్యా వెనక్కు తెచ్చుకోగలదా? ఏడాదైనా ఉక్రెయిన్‌పై పట్టు బిగించడంలో ఘోరంగా విఫలమైన రష్యా సైనిక శక్తి ప్రపంచం దృష్టిలో ప్రశ్నార్థకం కాలేదా? నియంత పోకడలతో రష్యాను జీవితాంతం ఏలాలన్న అధ్యక్షుడు పుతిన్ పేరు ప్రతిష్టలు యుద్ధంతో పాతాళానికి దిగజారలేదా? ఆయన తన రాజ్యకాంక్షను, తన అహాన్ని మాత్రమే తృప్తి పరచుకోగలిగారే తప్ప... ప్రపంచాన్ని కాదు, తన ప్రజలను కానే కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి కూడా పుతిన్‌కు భిన్నంగా ఏమీ లేదు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్టు జెలెన్స్కీ హాస్య నటుడి నుంచి హీరో అయ్యారు. రష్యా క్షిపణి దాడుల్లో దేశం వల్లకాడులా మారుతున్నా జెలెన్స్కీపై మాత్రం పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఆయన ఎక్కడికెళ్లినా రాచ మర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు. సాహసివంటూ పొగుడుతున్నారు. దేశం నాశనమవుతోందని బాధ పడాలో, ఎగురుతున్న తన కీర్తిబావుటాను చూసి సంతోషించాలో జెలెన్స్కీకి అర్థం కావడం లేదు. బహుశా ఆయన త్రిశంకుస్వర్గంలో ఉండి ఉంటారు. కొసమెరుపు కదనరంగంలో గెలుపోటములు ఇప్పుడప్పుడే తేలే అవకాశమే లేదు. ఎవరిది పైచేయి అంటే చెప్పడం కూడా కష్టమే. స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో 54 శాతాన్ని ఉక్రెయిన్ మళ్లీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అన్ని రోజులూ ఒక్కరివి కాదంటారు కదా! ఒకరోజు రష్యాదైతే మరో రోజు ఉక్రెయిన్‌ది..అంతే! ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచానిది ఎంతమాత్రం కాదు, రష్యా–ఉక్రెయిన్లది మాత్రమే. కొనసాగించడంతో పాటు ముగించడం కూడా ఆ రెండు దేశాల చేతుల్లోనే ఉంది. అయినా ఈ యుద్ధాన్ని ఎవరు పట్టించుకుంటున్నారిప్పుడు? -
సరికొత్త సంచలనం.. ప్రపంచంలో ఐదో ఆర్ధిక శక్తిగా భారత్!
(ఎం. విశ్వనాధరెడ్డి, సాక్షి ప్రతినిధి): బలీయమైన ఆర్థిక శక్తిగా టాప్–5 దేశాల జాబితాలో చేరి భారత్ సంచలనం సృష్టించింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వస్తు, సేవల ఉత్పత్తి విలువ కోటి కోట్ల డాలర్లు దాటింది. ఇందులో 3.5 లక్షల కోట్ల డాలర్ల వాటాతో భారత్ ఐదో స్థానాన్ని దక్కించుకుని బ్రిటన్ను ఆరో స్థానానికి పరిమితం చేసింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం యాదృచ్ఛికం. బలీయమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా వినూత్న ఆవిష్కరణల సూచీలో మాత్రం భారత్ వెనుకంజలో ఉంది. బలం పుంజుకున్న ఆర్థిక వ్యవస్థకు వినూత్న ఆవిష్కరణలు తోడైతే భారత్ అద్భుతాలు సాధిస్తుందని మేధావులు పేర్కొంటున్నారు. ఈ దిశగా అడుగులు వేసి పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. జీడీపీలో సగం వాటా 5 దేశాలదే 2022లో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. ప్రపంచ దేశాల మొత్తం స్థూల ఉత్పత్తి కోటి కోట్ల డాలర్ల (100 ట్రిలియన్ డాలర్స్) మార్క్ దాటింది. ఇందులో 51 శాతం జీడీపీ అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్ నుంచే ఉంది. ఇక టాప్ 10 దేశాల్లో 66 శాతం జీడీపీ ఉంది. 84 శాతం టాప్ 25 దేశాల్లో ఉంది. మిగతా 167 దేశాల్లో కలిపి 16 శాతం మాత్రమే జీడీపీ ఉంది. అగ్రస్థానంలో స్విట్జర్లాండ్ జీడీపీలో 22వ స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ ప్రపంచ వినూత్న ఆవిష్కరణల సూచీలో పుష్కరకాలంగా తొలి స్థానంలో నిలుస్తోంది. ఇన్నోవేటివ్ ఇండెక్స్‌లో 64.6 స్కోరుతో 2022లో తొలిస్థానంలో నిలిచింది. 61.8 స్కోరుతో రెండో స్థానంలో ఉన్న అమెరికా పరిశోధన–అభివృద్ధిపై ఏటా 70 వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధన, అభివృద్ధిపై భారీగా వ్యయం చేస్తున్న నాలుగు కంపెనీలు అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, యాపిల్ అమెరికాలోనే ఉండటం గమనార్హం. ఐరాస రూపొందించిన వినూత్న ఆవిష్కరణల సూచీలో మన దేశానికి 40వ స్థానం దక్కింది. 36.6 పాయింట్ల స్కోరుతో భారత్ 40వ స్థానంలో ఉంది. జీడీపీలో రెండోస్థానంలో ఉన్న చైనా 55.3 పాయింట్ల స్కోరుతో వినూత్న సూచీలో 11వ స్థానంలో నిలిచింది. -
సమాచారం దాచి.. సంక్షోభం పెంచి
బీజింగ్: తొలిసారిగా వూహాన్లో కరోనా వైరస్ ఉద్భవించిన నాటి నుంచి చైనా అంతటా కోవిడ్ కరాళనృత్యం కొనసాగేవరకూ ఏ విషయాన్నీ స్పష్టంగా ప్రపంచదేశాలతో పంచుకోని చైనా మళ్లీ అదే పంథాలో వెళ్తోంది. దాంతో ఈసారీ ఇంకా ఎలాంటి వేరియంట్లు పడగవిప్పుతాయో తెలీక ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. చైనా హఠాత్తుగా జీరో కోవిడ్ పాలసీ ఎత్తేశాక అక్కడ విజృంభించిన కరోనా కేసులు, కోవిడ్ మరణాల సంఖ్యపై ఎలాంటి సమగ్ర వివరాలను అధికారికంగా బయటపెట్టకపోవడంతో ప్రపంచ దేశాలను ఆందోళన చెందుతున్నాయి. దీంతో ముందస్తుచర్యగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ టెస్ట్‌ను తప్పనిసరి చేస్తూ కొన్ని దేశాలు నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అమెరికా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఇటలీ, మలేసియా ఇప్పటికే చైనా ప్రయాణికులపై కోవిడ్ నిబంధనలను అమలుచేస్తున్నాయి. ‘ చాంద్రమాన నూతన సంవత్సరం సందర్భంగా 30,000 మంది తైవానీయులు చైనా నుంచి స్వదేశం వస్తున్నారు. ప్రతీ ఒక్కరినీ టెస్ట్ చేయాల్సిందే. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పారదర్శకత లోపించింది. చైనా ఇతరదేశాలతో సమాచారం పంచుకోకపోవడమే ఇక్కడ అసలు సమస్య’ అని తైవాన్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ అధినేత వాంగ్ పీ షెంగ్ అన్నారు. అప్పుడే సమగ్ర వ్యూహరచన సాధ్యం ఎప్పటికప్పుడు డాటా ఇస్తున్నామని చైనా తెలిపింది. కాగా,‘ఐసీయూలో చేరికలు, ఆస్పత్రుల్లో ఆందోళనకర పరిస్థితిపై పూర్తి సమాచారం అందాలి. అప్పుడే ప్రపంచదేశాల్లో క్షేత్రస్థాయిలో సన్నద్ధతపై సమగ్ర వ్యూహరచన సాధ్యమవుతుంది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనోమ్ ఘెబ్రియేసెస్ అన్నారు. ‘కరోనాను అంతం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన చైనా హఠాత్తుగా కోవిడ్ పాలసీని ఎత్తేయడం ఆందోళనకరం. చైనా దేశీయ పరిస్థితిని చక్కదిద్దాల్సిందిపోయి కోవిడ్ నిబంధనలను గాలికొదిలేయడంతో పశ్చిమదేశాలు ఆగ్రహంతో ఉన్నాయి’ అని వాషింగ్టన్‌లోని మేథో సంస్థ హాడ్సన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైల్స్ యూ వ్యాఖ్యానించారు. -
Financial Crises: పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు
ఆర్థిక సంక్షోభం తాలూకు విశ్వరూపాన్ని శ్రీలంకలో కళ్లారా చూస్తున్నాం. కనీసం మరో డజనుకు పైగా దేశాలు ఈ తరహా ఆర్థిక సంక్షోభం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలు... ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి... అర్జెంటీనా అధ్యక్షుని నిర్వాకం పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. జూన్‌తో పోలిస్తే జులైలో ధరలు 6 శాతం పెరిగాయి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీలంక మాదిరిగానే ప్రజలు భారీగా రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. కరెన్సీ పెసో నల్ల బజారులో ఏకంగా 50 శాతం తక్కువ విలువకు ట్రెండవుతోంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. బాండ్లు డాలర్‌కి 20 సెంట్లు మాత్రమే పలుకుతున్నాయి. కాకుంటే విదేశీ అప్పులను 2024 వరకు తీర్చాల్సిన అవసరం లేకపోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఊరట. ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ సామర్థ్యం మీదే ప్రజలు ఆశతో ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి తెచ్చయినా దేశాన్ని రుణభారం నుంచి ఆమె గట్టెక్కిస్తారన్న అంచనాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం చేసిన గాయం రష్యా దండయాత్రతో ఆర్థికంగా చితికిపోయింది. 20 వేల కోట్ల డాలర్ల పై చిలుకు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ సెప్టెంబర్‌లోనే 120 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. అమెరికా, యూరప్ దేశాలు ఆర్థికంగా అండగా నిలుస్తూండటంతో అది పెద్ద కష్టం కాకపోవచ్చు. యుద్ధం ఇంకా కొనసాగేలా ఉండటంతో మరో రెండేళ్ల పాటు అప్పులు తీర్చకుండా వెసులుబాటు కల్పించాలని కోరే అవకాశముంది. ఉక్రెయిన్ కరెన్సీ హ్రిన్వియా విలువ దారుణంగా పడిపోయింది. పాకిస్తాన్ నిత్య సంక్షోభం మన దాయాది దేశం కూడా చాలా ఏళ్లుగా అప్పుల కుప్పగా మారిపోయింది. విదేశీ మారక నిల్వలు కేవలం 980 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ సొమ్ముతో ఐదు వారాలకు సరిపడా దిగుమతులు మాత్రమే సాధ్యం. గత వారమే అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నా చమురు దిగుమతుల భారం తడిసి మోపెడవడంతో గంప లాభం చిల్లి తీసిన చందంగా మారింది. కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. దేశ ఆదాయంలో ఏకంగా 40% తీసుకున్న వడ్డీలకే పోతోంది. విదేశీ నిల్వల్ని పెంచుకోవడానికి మరో 300 కోట్ల డాలర్లు అప్పు కోసం సిద్ధమైంది. ఇలా అప్పులపై అప్పులతో త్వరలో మరో లంకలా మారిపోతుందన్న అభిప్రాయముంది. ఈజిప్టు అన్నీ సమస్యలే ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం ఆర్థికంగా కుంగదీసింది. గోధుమలు, నూనెలకు ఉక్రెయిన్‌పై ఆధారపడటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశ స్థూల జాతీయోత్పత్తి–రుణాల నిష్పత్తి 95 శాతానికి చేరింది! విదేశీ కంపెనీలెన్నో దేశం వీడుతున్నాయి. 1,100 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లినట్టు అంచనాలున్నాయి. ఐదేళ్లలో 10 వేల కోట్ల డాలర్ల రుణ చెల్లింపులు చేయాల్సి రావడం కలవరపెడుతోంది. కరెన్సీ విలువను 15 శాతం తగ్గించినా లాభంలేకపోవడంతో ఐఎంఎఫ్‌ను శరణు వేడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెడుతోంది! దివాలా బాటన మరెన్నో దేశాలు ఈక్వడర్, బెలారస్, ఇథియోపియా, ఘనా, కెన్యా, ట్యునీషియా, నైజీరియా... ఇలా మరెన్నో దేశాలు ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్నాయి. ఈక్వడర్ రెండేళ్లుగా రుణాలు చెల్లించే పరిస్థితిలో లేదు. ఘనా అప్పులకు వడ్డీలే కట్టలేకపోతోంది. నైజీరియా ఆదాయంలో 30 శాతం వడ్డీలకే పోతోంది. ట్యునీషియాది ప్రభుత్వోద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి! -
ఆహార సంక్షోభం ముంగిట్లో...
ప్రపంచ జనాభా ఏటేటా పెరుగుతోంది... 2050 కల్లా వెయ్యికోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్నది శాస్త్రవేత్తల అంచనా. మరి అప్పటికి అందరికీ చాలినంత ఆహారం దొరకడం సాధ్యమా? అదంత తేలిక కాదంటోంది కోపెన్‌హేగన్ కేంద్రంగా పని చేస్తున్న ‘ద వరల్డ్ కౌంట్స్’. మనిషి ప్రకృతి వనరులను వాడుకుంటున్న తీరును, ఆహార పద్ధతులను తక్షణం మార్చుకోవాలని సూచిస్తోంది. లేదంటే మరో పాతికేళ్లలో మనుషులంతా అన్నమో రామచంద్రా అని అంగలార్చాల్సిన గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తోంది... భూమ్మీద అందుబాటులో ఉన్న వనరులు పరిమితం. అందులోనూ సాగు భూమి అయితే మరీ పరిమితం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ పంటనైనా వేసుకోగల భూమి లభ్యత కాస్త అటూ ఇటుగా 140 కోట్ల హెక్టార్లు. ప్రపంచ జనాభా 2050 నాటికి 1,000 కోట్లకు చేరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతమంది రెండు పూటలా కడుపు నిండా తినాలంటే 2017తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పండించాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యమన్నది హార్వర్డ్ యూనివర్సిటీ సోషియో బయాలజిస్ట్ దివంగత ఎడ్వర్డ్ విల్సన్ అభిప్రాయం. మనుషులంతా శాకాహారులుగా మారినా, పాడి పశువుల పెంపకానికి వనరులు పెద్దగా వాడకపోయినా 2050 నాటికి 1,000 కోట్ల మందికి చాలినంత ఆహారం అందించడం కష్టమని తేల్చారాయన. పంటలు పండించేందుకు భూ జీవావరణానికున్న పరిమితులే ఇందుకు కారణమని ఆయన ఎప్పుడో స్పష్టం చేశారు. మాంసాహారంతో నష్టమేమిటి? శాకాహారంతో పోలిస్తే మాంసాహార ఉత్పత్తికి ఖర్చయ్యే వనరులు చాలా ఎక్కువ. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం కనీసం ఐదు కిలోల దాణా వాడితే గానీ కిలో మాంసం తయారు కాదు. అమెరికాను ఉదాహరణగా తీసుకుంటే అక్కడ దేశవ్యాప్తంగా మొక్కజొన్న పండించేందుకు వెచ్చించే వనరుల కంటే ఏకంగా 75 రెట్లు ఎక్కువ శక్తిని మాంసం ఉత్పత్తికి ఖర్చు చేయాల్సి వస్తోంది. కేలరీల లెక్కలు చూసినా మాంసం ఉత్పత్తి ఖరీదైన వ్యవహారమే. రెండు, మూడు కేలరీల ఇంధనం ఖర్చు చేస్తే సోయాబీన్, గోధుమ వంటి వాటినుంచి ఒక కేలరీ ప్రొటీన్ సంపాదించుకోవచ్చు. అదే మాంసం విషయంలో ఏకంగా 54 కేలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా మాంసాహారాన్ని మానేందుకు చాలామంది అంగీకరించే పరిస్థితులు లేవు. ఇది ఆహార సమస్య మరింత జటిలం చేసేదే. ధరలు ఆకాశానికి... రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు ఇప్పటికే నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత నెలల్లో ఏకంగా 55 దేశాలు ఆహార పదార్థాల ఎగుమతులపై నియంత్రణలు విధించాయి. 2030 నాటికల్లా మొక్కజొన్న ధర 80 శాతం, బియ్యం ధర 30 శాతం పెరుగుతాయన్నది అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఎరువులు, కీటకనాశినులకూ డిమాండ్ పెరగనుంది. ప్రస్తుతం మనం ఏటా దాదాపు 9,000 కోట్ల టన్నుల ప్రకృతి వనరులను వినియోగిస్తున్నాం. 2050 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనా. యుద్ధాలు, ప్రకృతి ప్రకోపాలు, ఘర్షణలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే ఆహారం కోసం కటకటలాడే పరిస్థితి ఎంతో దూరంలో లేదన్నది నిపుణుల హెచ్చరిక! క్రమక్షయంతో పెనుముప్పు పంటకు బలమిచ్చే నేల పై పొరలోని మట్టి పలు కారణాల వల్ల కోతకు (క్రమక్షయానికి) గురవుతుందన్నది తెలిసిందే. ఉపరితలం నుంచి 20 సెంటీమీటర్ల వరకు మట్టిలో సేంద్రియ పదార్థం, సూక్ష్మ జీవావరణం అత్యధికంగా ఉంటాయి. గత 40 ఏళ్లలో ప్రపంచం మొత్తమ్మీద నేల పై పొరలో 40 శాతం కోతకు గురైందని అంచనా. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం అందివ్వాలంటే గత 8,000 ఏళ్లలో పండించినంత ఆహారాన్ని వచ్చే 40 ఏళ్లలో పండించాల్సి ఉంటుంది!’ అన్న ‘వరల్డ్ వాడి ఫండ్’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేసన్ క్లే వ్యాఖ్యలు పొంచి ఉన్న ముప్పును చెప్పకనే చెబుతున్నాయి. ఏటా మన వృథా రూ. 92 వేల కోట్లు! ప్రపంచవ్యాప్తంగా భారీ పరిమాణంలో ఆహారం వృథా అవుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారుడిని చేరకుండానే పంటలో మూడో వంతు, చేరాక దాదాపు మరో సగం వృథా అవుతోందన్నది ఐరాస వంటి సంస్థల అంచనా. ‘ద వరల్డ్ కౌంట్స్’’ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ప్రపంచం మొత్తమ్మీద వృథా అయిన ఆహారం ఏకంగా 40.7 కోట్ల టన్నులు! పాశ్చాత్య దేశాల ఆహారపుటలవాట్ల వల్ల కూడా ఆహార సంక్షోభం తీవ్రమవుతోందని నిపుణులంటున్నారు. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే భారత్‌లోనూ ఆహార వృథా తక్కువేమీ కాదు. ఇది ఇళ్లలో కంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఎక్కువగా ఉంది. దేశంలో ఏటా దాదాపు 92 వేల కోట్ల రూపాయల విలువైన ఆహార పదార్థాలు చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి. గతేడాది ఫుడ్ వేస్టేజ్ సూచీ లెక్కల ప్రకారం భారతీయులు ఒక్కొక్కరూ రోజుకు 137 గ్రాముల చొప్పున ఏటా దాదాపు 50 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు. దీన్ని అరికట్టగలిగితే ఎందరో అన్నార్తుల కడుపులు నింపొచ్చు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్రం ఆకాంక్ష నెరవేరకపోవడానికి కోతల తరువాత పంటలకు జరుగుతున్న నష్టాలు (పోస్ట్ హార్వెస్టింగ్ లాస్) కూడా ఒక కారణమేనని నీతి ఆయోగ్ సభ్యుడొకరు అన్నారు. నిల్వ, రవాణా సదుపాయాల లేమి వల్ల పాలు, చేపలు, మాంసం, గుడ్లు వంటి త్వరగా పాడైపోయే ఆహారంలో 20 శాతం దాకా వృథా అవుతోందని, ఆహార శుద్ధి పరిశ్రమలో ఈ నష్టం 32 శాతం దాకా ఉందని అంచనా. (కంచర్ల యాదగిరిరెడ్డి)