ప్రతీకాత్మక చిత్రం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా క్రమంగా వ్యాపిస్తోంది. భారతదేశం అప్రమత్తమైనప్పటికీ.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఒమిక్రాన్ కారణంగా కోవిడ్ -19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ఒమిక్రాన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన ఆంక్షలు విధించాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో వైరస్ ప్రమాదకర స్థాయికి వ్యాపించే అవకాశముందని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ పట్ల ప్రపంచ దేశాలు ఏవిధంగా స్పందించాయో చూద్దాం.
అమెరికా.. వేడుకలపై ఆంక్షల్లేవు
అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనా.. ఎక్కడా కఠిన ఆంక్షలు విధించలేదు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై అదనంగా నియంత్రణలు పెట్టబోమని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పౌరులందరూ టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు. ఒమిక్రాన్ బాధితులకు వైద్యం అందించేందుకు సైనిక వైద్యులను ఆయన రంగంలోకి దించారు.
బ్రిటన్‌లో అత్యధిక కేసులు
ఇప్పటివరకు అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదైన బ్రిటన్‌లోనూ అదనంగా ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వం అనుకోవడం లేదు. ఇప్పటికే బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసులు లక్ష దాటేశాయి. భవిష్యత్ గణాంకాల ఆధారంగా కఠిన ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని జూనియర్ ఆరోగ్య మంత్రి గిలియన్ కీగన్ చెప్పారు. బ్రిటన్‌లోనే మొట్టమొదటి ఒమిక్రాన్ మరణం సంభవించింది. ఇప్పటివరకు 12 మరణాలు నమోదయ్యాయి. (చదవండి: ఒమిక్రాన్‌తో కరోనా విశ్వరూపం!)
ఆస్ట్రేలియాలో అదనపు ఆంక్షల్లేవు
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను ఆస్ట్రేలియా కొనసాగిస్తోంది.ఫేస్ మాస్క్ ధరించడాన్ని ఆసీస్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. క్రిస్మస్-న్యూ ఇయర్ సెలవుల్లో బహిరంగ కార్యక్రమాల కోసం ఆంక్షలు ప్రకటించే అవకాశముందని ‘ది ఆస్ట్రేలియన్’ నివేదించింది. 75 శాతం సామర్థ్యంతో ప్రజా రవాణా సేవలు కొనసాగుతున్నాయని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. కేసులు వేగంగా పెరుగుతున్నప్పటికీ ఆస్ట్రేలియా ఇంకా ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేదు.
చైనా కఠిన నిబంధనలు
ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాలతో పోలిస్తే చైనా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. చైనాలోని జియాన్ నగరంలో లాక్‌డౌన్ విధించారు. వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో కోవిడ్ -19 వైరస్ యొక్క కమ్యూనిటీ వ్యాప్తి నివారణకు చైనా చర్యలు చేపట్టిందని ‘ది గార్డియన్’ పేర్కొంది. (చదవండి: ఒమిక్రాన్ ముప్పు.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు..)
ఇజ్రాయెల్.. బూస్టర్ డోసింగ్
ఒమిక్రాన్ ముప్పును సమర్థవంతంగా ఇజ్రాయెల్ ఎదుర్కొనేందుకు బూస్టర్ డోసింగ్ ప్రయత్నాలను వేగవంతం చేసింది. 60 ఏళ్లు పైబడిన వారు కోవిడ్-19 వ్యాక్సిన్ 4వ డోస్ లేదా రెండవ బూస్టర్ డోస్ వేసుకునేందుకు అనుమతిచ్చింది. బూస్టర్ డోస్‌తో ఒమిక్రాన్‌ను నిలువరించవచ్చని అధ్యయనాలు వెల్లడించడంతో ఈ దిశగా ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. కోవిడ్-19 వ్యాక్సిన్ నాలుగు డోస్‌లను అనుమతించిన మొదటి దేశం ఇజ్రాయెల్.
కఠిన ఆంక్షలు తప్పనిసరి
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల కదలికలపై కఠినమైన ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ విజ్ఞప్తి చేశారు. హాలిడే ప్లాన్‌లను రద్దు చేసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.
లాక్‌డౌన్‌లు అవసరం లేదు
డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ వ్యాఖ్యలపై ప్రజారోగ్య నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌లు, కఠినమైన నియంత్రణలు అమలు చేయాల్సిన అవసరం లేదని దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ ‘ఇండియా టుడే’తో చెప్పారు. మార్కెట్‌లను మూసివేయడం కంటే.. వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. ప్రజలు వైరస్‌తో జీవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను మొదట గుర్తించిన ఘనత ఆమెకే దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment