Financial Crises: పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు | Financial Crises: Explanations In The World Number of Countries | Sakshi
Sakshi News home page

Financial Crises: పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు

Published Sun, Jul 24 2022 1:53 AM | Last Updated on Sun, Jul 24 2022 2:00 AM

Financial Crises: Explanations In The World Number of Countries - Sakshi

ఆర్థిక సంక్షోభం తాలూకు విశ్వరూపాన్ని శ్రీలంకలో కళ్లారా చూస్తున్నాం. కనీసం మరో డజనుకు పైగా దేశాలు ఈ తరహా ఆర్థిక సంక్షోభం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలు... ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి...

అర్జెంటీనా అధ్యక్షుని నిర్వాకం
పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. జూన్‌తో పోలిస్తే జులైలో ధరలు 6 శాతం పెరిగాయి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీలంక మాదిరిగానే ప్రజలు భారీగా రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.

కరెన్సీ పెసో నల్ల బజారులో ఏకంగా 50 శాతం తక్కువ విలువకు ట్రెండవుతోంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. బాండ్లు డాలర్‌కి 20 సెంట్లు మాత్రమే పలుకుతున్నాయి. కాకుంటే విదేశీ అప్పులను 2024 వరకు తీర్చాల్సిన అవసరం లేకపోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఊరట. ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్‌ సామర్థ్యం మీదే ప్రజలు ఆశతో ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి తెచ్చయినా దేశాన్ని రుణభారం నుంచి ఆమె గట్టెక్కిస్తారన్న అంచనాలున్నాయి.

ఉక్రెయిన్‌ యుద్ధం చేసిన గాయం
రష్యా దండయాత్రతో ఆర్థికంగా చితికిపోయింది. 20 వేల కోట్ల డాలర్ల పై చిలుకు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ సెప్టెంబర్‌లోనే 120 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. అమెరికా, యూరప్‌ దేశాలు ఆర్థికంగా అండగా నిలుస్తూండటంతో అది పెద్ద కష్టం కాకపోవచ్చు. యుద్ధం ఇంకా కొనసాగేలా ఉండటంతో మరో రెండేళ్ల పాటు అప్పులు తీర్చకుండా వెసులుబాటు కల్పించాలని కోరే అవకాశముంది. ఉక్రెయిన్‌ కరెన్సీ హ్రిన్వియా విలువ దారుణంగా పడిపోయింది.

పాకిస్తాన్‌ నిత్య సంక్షోభం
మన దాయాది దేశం కూడా చాలా ఏళ్లుగా అప్పుల కుప్పగా మారిపోయింది. విదేశీ మారక నిల్వలు కేవలం 980 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ సొమ్ముతో ఐదు వారాలకు సరిపడా దిగుమతులు మాత్రమే సాధ్యం. గత వారమే అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నా చమురు దిగుమతుల భారం తడిసి మోపెడవడంతో గంప లాభం చిల్లి తీసిన చందంగా మారింది. కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. దేశ ఆదాయంలో ఏకంగా 40% తీసుకున్న వడ్డీలకే పోతోంది. విదేశీ నిల్వల్ని పెంచుకోవడానికి మరో 300 కోట్ల డాలర్లు అప్పు కోసం సిద్ధమైంది. ఇలా అప్పులపై అప్పులతో త్వరలో మరో లంకలా మారిపోతుందన్న అభిప్రాయముంది.

ఈజిప్టు అన్నీ సమస్యలే
ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం ఆర్థికంగా కుంగదీసింది. గోధుమలు, నూనెలకు ఉక్రెయిన్‌పై ఆధారపడటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశ స్థూల జాతీయోత్పత్తి–రుణాల నిష్పత్తి 95 శాతానికి చేరింది! విదేశీ కంపెనీలెన్నో దేశం వీడుతున్నాయి. 1,100 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లినట్టు అంచనాలున్నాయి. ఐదేళ్లలో 10 వేల కోట్ల డాలర్ల రుణ చెల్లింపులు చేయాల్సి రావడం కలవరపెడుతోంది. కరెన్సీ విలువను 15 శాతం తగ్గించినా లాభంలేకపోవడంతో ఐఎంఎఫ్‌ను శరణు వేడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెడుతోంది!

దివాలా బాటన మరెన్నో దేశాలు
ఈక్వడర్, బెలారస్, ఇథియోపియా, ఘనా, కెన్యా, ట్యునీషియా, నైజీరియా... ఇలా మరెన్నో దేశాలు ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్నాయి. ఈక్వడర్‌ రెండేళ్లుగా రుణాలు చెల్లించే పరిస్థితిలో లేదు. ఘనా అప్పులకు వడ్డీలే కట్టలేకపోతోంది. నైజీరియా ఆదాయంలో 30 శాతం వడ్డీలకే పోతోంది. ట్యునీషియాది ప్రభుత్వోద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement