crises
-
బలహీన విధానాలతోనే బ్యాంకింగ్ సంక్షోభం
ముంబై: బలహీన వ్యాపార విధానాలే అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభానికి కారణమై ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకుల వ్యాపార విధానాలను తాము సునిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో భారత బ్యాంకులు బలంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. అమెరికాలో ఇటీవలే సిలికాన్ వ్యాలీ బ్యాంకులో నిధుల సమస్య తలెత్తడం తెలిసిందే. డిపాజిటర్లలో అభద్రతకు దారితీసి, ఆ ప్రభావం ఇతర బ్యాంకులకూ విస్తరించడం తెలిసిందే. ఈ క్రమంలో శక్తికాంతదాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అమెరికాలో ఇటీవలి పరిణామాలు చూస్తే అక్కడ విడిగా ఒక్కో బ్యాంకుల వారీ వ్యాపార విధానాలు సరిగ్గానే ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. భారత బ్యాంకుల వ్యాపార విధానాలను ఆర్బీఐ మరింత పరిశీలనగా చూడడం మొదలు పెట్టింది. ఒకవేళ లోపాలు ఉంటే అది సంక్షోభానికి దారితీయవచ్చు’’అని శక్తికాంతదాస్ చెప్పారు. ముంబైలో ఓ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా దాస్ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘బ్యాంకులు అనుసరించే వ్యాపార విధానాల వల్ల కొన్ని సందర్భాల్లో వాటి బ్యాలెన్స్ షీట్లలోని కొన్ని భాగాల్లో సమస్యలు ఏర్పడొచ్చు. అవి ఆ తర్వాత పెద్ద సంక్షోభానికి కారణం కావచ్చు. అమెరికా, యూరప్ బ్యాంకింగ్‌లో ఇటీవలి పరిణామాలు గమనిస్తే వాటి బ్యాలెన్స్ షీట్లలో సురక్షిత ఆస్తులు అనుకున్న వాటి నుంచే సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది’’అని దాస్ పేర్కొన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభానికి ఆస్తుల, అప్పుల మధ్య అసమతుల్యత వల్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండడం తెలిసిందే. -
రుణాలపై పర్యవేక్షణ కీలకం
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్‌లోని కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో అగ్రశ్రేణి రుణాలపై సరైన పర్యవేక్షణ ఉండాలని, బడా కార్పొరేట్లు తాకట్టు పెట్టిన షేర్లకు సంబంధించి తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోరింది. సమయానుకూల చర్యలను తీసుకోడానికి తాకట్టు పెట్టిన సెక్యూరిటీల మార్కెట్ డేటాను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ తరహా చొరవలు తక్షణం సవాళ్ల నిర్వహణకు దోహదపడే విధంగా ఉంటుందని తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత వారం పలు ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలపై బ్యాంకింగ్ చీఫ్‌లతో సమా వేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సంక్షోభ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యూహాలను రూపొందించడానికి తగిన అవకాశాలను అన్వేషించాలని ఈ సందర్భంగా ఆమె బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేశారు. -
ఫస్ట్ సిటిజన్స్ చేతికి ఎస్వీబీ
న్యూయార్క్: సంక్షోభంతో మూతబడిన సిలికాన్ వేలీ బ్యాంక్ (ఎస్వీబీ) సింహభాగం కార్యకలాపాలను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ దక్కించుకుంది. దీంతో ఎస్‌వీబీకి చెందిన అన్ని డిపాజిట్లు, రుణాలు ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ అండ్ ట్రస్టుకు బదిలీ అవుతాయి. ఎస్వీబీ కస్టమర్లు ఆటోమేటిక్‌గా ఫస్ట్ సిటిజన్స్ ఖాతాదారులుగా మారతారని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) తెలిపింది. ఫస్ట్ సిటిజన్స్‌లో ఎఫ్‌డీఐసీకి 500 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లు దక్కుతాయి. ఎస్‌వీబీకి చెందిన 167 బిలియన్ డాలర్ల అసెట్లలో 90 బిలియన్ డాలర్ల అసెట్లు ఎఫ్‌డీఐసీ వద్దే ఉంటాయి. 72 బిలియన్ డాలర్ల అసెట్లు, ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్‌కు భారీ డిస్కౌంటుపై 16.5 బిలియన్ డాలర్లకు దక్కుతాయి. ఎస్వీబీ వైఫల్యంతో డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్‌పై 20 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడనుంది. ఎస్వీబీ దెబ్బతో కుదేలైన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు అమెరికాలోని 11 భారీ బ్యాంకులు దాదాపు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని అందించాయి. 1898లో ఏర్పాటైన ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ .. నార్త్ కరోలినాలోని రాలీ ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. 100 బిలియన్ డాలర్ల పైచిలుకు అసెట్లతో 21 రాష్ట్రాల్లో 500 శాఖలు ఉన్నాయి. బ్యాంకు ఆర్థిక పరిస్థితిపై అనుమానాలతో ఖాతాదారులు తమ డిపాజిట్లను భారీగా వెనక్కి తీసుకుంటూ ఉండటంతో మార్చి 10న ఎస్వీబీ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకు సిగ్నేచర్ బ్యాంక్ కూడా మూతబడింది. -
క్రెడిట్ సూసీకి ‘స్విస్ బ్యాంక్’ భరోసా
న్యూఢిల్లీ: ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రెడిట్ సూసీకి స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు అండగా నిల్చింది. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకుపై ఇన్వెస్టర్లు, డిపాజిటర్లలో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు, దానిపై నమ్మకాన్ని కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా 54 బిలియన్ డాలర్ల మేర రుణాన్ని అందించేందుకు అంగీకరించింది. క్రెడిట్ సూసీ గురువారం ఈ విషయం వెల్లడించింది. దీంతో బ్యాంకు షేరు ఒక దశలో ఏకంగా 33% ఎగిసి 2.17 స్విస్ ఫ్రాంకులకు (1 స్విస్ ఫ్రాంకు సుమారు రూ. 89) పెరిగింది. అటు యూరప్ బ్యాంకింగ్ షేర్లు కూడా ఒక మోస్తరుగా పెరిగాయి. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఇన్వెస్టరు నిరాకరించారన్న వార్తలతో క్రెడిట్ సూసీ షేరు బుధవారం 30% కుప్పకూలిన సంగతి తెలిసిందే. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్వీబీ, సిగ్నేచర్) మూతబడటం, క్రెడిట్ సూసీ ఆర్థిక పరిస్థితిపై నీలినీడలు కమ్ముకోవడం తదితర పరిణామాలతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభం ముంచుకొస్తోందన్న ఆందోళన నెలకొంది. అయితే, ఈ భయాలను తొలగించేందుకు, అంతర్జాతీయంగా కీలక బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న క్రెడిట్ సూసీని నిలబెట్టేందుకు స్విస్ నేషనల్ బ్యాంక్ రంగంలోకి దిగింది. మూలధనం, లిక్విడిటీపరమైన నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్ సూసీ ఉంటే బ్యాంక్‌కు అవసరమైన తోడ్పాటు అందిస్తామని ప్రకటించింది. -
ప్రపంచానికి ఆర్థిక కష్టాలు.. భారత్ లో ప్రభావమెంత..?
-
రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు..జార్ఖండ్ సీఎం అనర్హతపై అదే సస్పెన్స్
రాంచీ: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై మూడు రోజులుగా నెలకొన్న సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. ఈలోగా రిసార్టు రాజకీయాలకు తెర లేచింది. ఎమ్మెల్యేలు గోడ దూకుతారేమోనన్న భయంతో వారిని సోరెన్ క్యాంపుకు తరలించారు. శనివారం ఉదయం పాలక యూపీఏ భాగస్వామ్య పక్షాలైన జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో సీఎం నివాసంలో మూడో దఫా సుదీర్ఘ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలంతా నేరుగా లగేజీలతో పాటుగా భేటీకి రావడం విశేషం. ఆ వెంటనే వారందరినీ మూడు బస్సుల్లో గుర్తు తెలియని చోటుకి తరలించారు. వారిని పశ్చిమబెంగాల్‌కో, ఛత్తీస్‌గఢ్‌కో తీసుకెళ్లి ఉంటారంటూ వార్తలొచ్చాయి. కానీ ఎమ్మెల్యేలంతా కుంతీ జిల్లాలోని మూమెంట్స్ రిసార్ట్‌కు పిక్నిక్కు వెళ్తున్నారంటూ మంత్రులు ఆలంఘీర్ ఆలం, బన్నా గుప్తా చెప్పారు. సాయంత్రానికల్లా వారంతా రాంచీ తిరిగొచ్చినట్టు సమాచారం. సోరెన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలన్న ఈసీ సిఫార్సుపై గవర్నర్ రమేశ్ బైస్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. -
సంక్షోభాలు, విలయాలతో అంటురోగాలు.. ప్రాణాంతక ఆంత్రాక్స్ బయటపడిందిలా!
న్యూయార్క్: వరదలు, కరువు వంటి పర్యావరణ సంక్షోభాలు, విలయాలు కలిగించే నష్టం ఎంత అపారంగా ఉంటుందో మనమంతా చూస్తున్నదే. అయితే వీటివల్ల టైఫాయిడ్, జికా వంటి అంటురోగాల వ్యాప్తి కూడా పెరుగుతోందని ఓ సర్వే తేల్చింది! 2016 సంగతి. ఉత్తర సైబీరియాలో నివసించే ప్రజలు ఉన్నట్టుండి రోగాల బారిన పడసాగారు. వారితో పాటు జింకల వంటి జంతువులకు కూడా ఆంత్రాక్స్ సోకి కలకలం రేపింది. ఉష్ణోగ్రతల పెరుగుదలే దీనికి కారణమని తేలింది. 2016లో సైబీరియాలో ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరగనంతగా పెరిగాయి. దాంతో మంచు విపరీతంగా కరిగి దశాబ్దాల క్రితం ఆంత్రాక్స్‌తో చనిపోయిన ఓ జింక శవం బయట పడిందట. అందులోంచి ఆంత్రాక్స్ కారక బ్యాక్టీరియా తదితరాలు గాల్లో వ్యాపించి మరోసారి వ్యాధి తిరగబెట్టేందుకు కారణమయ్యాయని తేలింది! ఇదొక్కటనే కాదు. తుఫాన్లు, కరువులు, వరదలు తదితరాల వాతావరణ సంబంధిత విలయాలు ఆంత్రాక్స్ వంటి బ్యాక్టీరియా మొదలుకుని జికా వంటి వైరస్లు, మలేరియా వంటి పరాన్నభుక్కు సంబంధిత అంటువ్యాధుల వ్యాప్తిని 58 శాతం దాకా పెంచుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ హవాయి–మనోవాకు చెందిన కెమిలో మోరా అనే శాస్త్రవేత్త చేసిన అధ్యయనంలో తేలింది. ఇందుకోసం విలయాలు, వ్యాధుల మధ్య సంబంధంపై వచ్చిన వందలాది పరిశోధక పత్రాల నుంచి సమాచారాన్ని ఆయన బృందం సేకరించింది. దాన్ని లోతుగా విశ్లేషించిన మీదట ఈ మేరకు తేల్చింది. ఈ ఫలితాలను నేచర్ జర్నల్ పచురించింది. గ్రీన్హౌస్ ఉద్గారాలను ఆపాల్సిందే కొన్ని విలయాలకు అంటువ్యాధులతో సంబంధం నేరుగా కనిపిస్తుంది. వరదలొచ్చినప్పుడు కలుషిత నీటి వల్ల వ్యాపించే మెదడు వాపు వంటివాటివి ఇందుకు ఉదాహరణ. నీరు చాలాకాలం నిల్వ ఉండిపోతే డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటివీ ప్రబలుతాయి. విపరీతమైన వేడి గాలుల వంటి పర్యావరణ విపత్తులు కూడా పలు రకాల వైరస్లు ప్రబలేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. విపత్తుల కారణంగా 1,000కి పైగా మార్గాల్లో అంటురోగాలు ప్రబలినట్టు సర్వేలో తేలిందని మోరా చెప్పుకొచ్చారు. ‘‘వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడం భారీ వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. బదులుగా మూలానికే మందు వేసే ప్రయత్నం చేయాలి. అంటే, పర్యావరణ విపత్తులకు మూలకారణంగా మారిన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు తక్షణం అడ్డుకట్ట వేయాలి’’ అని సూచించారు. -
Financial Crises: పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు
ఆర్థిక సంక్షోభం తాలూకు విశ్వరూపాన్ని శ్రీలంకలో కళ్లారా చూస్తున్నాం. కనీసం మరో డజనుకు పైగా దేశాలు ఈ తరహా ఆర్థిక సంక్షోభం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలు... ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి... అర్జెంటీనా అధ్యక్షుని నిర్వాకం పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. జూన్‌తో పోలిస్తే జులైలో ధరలు 6 శాతం పెరిగాయి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీలంక మాదిరిగానే ప్రజలు భారీగా రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. కరెన్సీ పెసో నల్ల బజారులో ఏకంగా 50 శాతం తక్కువ విలువకు ట్రెండవుతోంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. బాండ్లు డాలర్‌కి 20 సెంట్లు మాత్రమే పలుకుతున్నాయి. కాకుంటే విదేశీ అప్పులను 2024 వరకు తీర్చాల్సిన అవసరం లేకపోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఊరట. ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ సామర్థ్యం మీదే ప్రజలు ఆశతో ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి తెచ్చయినా దేశాన్ని రుణభారం నుంచి ఆమె గట్టెక్కిస్తారన్న అంచనాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం చేసిన గాయం రష్యా దండయాత్రతో ఆర్థికంగా చితికిపోయింది. 20 వేల కోట్ల డాలర్ల పై చిలుకు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ సెప్టెంబర్‌లోనే 120 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. అమెరికా, యూరప్ దేశాలు ఆర్థికంగా అండగా నిలుస్తూండటంతో అది పెద్ద కష్టం కాకపోవచ్చు. యుద్ధం ఇంకా కొనసాగేలా ఉండటంతో మరో రెండేళ్ల పాటు అప్పులు తీర్చకుండా వెసులుబాటు కల్పించాలని కోరే అవకాశముంది. ఉక్రెయిన్ కరెన్సీ హ్రిన్వియా విలువ దారుణంగా పడిపోయింది. పాకిస్తాన్ నిత్య సంక్షోభం మన దాయాది దేశం కూడా చాలా ఏళ్లుగా అప్పుల కుప్పగా మారిపోయింది. విదేశీ మారక నిల్వలు కేవలం 980 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ సొమ్ముతో ఐదు వారాలకు సరిపడా దిగుమతులు మాత్రమే సాధ్యం. గత వారమే అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నా చమురు దిగుమతుల భారం తడిసి మోపెడవడంతో గంప లాభం చిల్లి తీసిన చందంగా మారింది. కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. దేశ ఆదాయంలో ఏకంగా 40% తీసుకున్న వడ్డీలకే పోతోంది. విదేశీ నిల్వల్ని పెంచుకోవడానికి మరో 300 కోట్ల డాలర్లు అప్పు కోసం సిద్ధమైంది. ఇలా అప్పులపై అప్పులతో త్వరలో మరో లంకలా మారిపోతుందన్న అభిప్రాయముంది. ఈజిప్టు అన్నీ సమస్యలే ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం ఆర్థికంగా కుంగదీసింది. గోధుమలు, నూనెలకు ఉక్రెయిన్‌పై ఆధారపడటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశ స్థూల జాతీయోత్పత్తి–రుణాల నిష్పత్తి 95 శాతానికి చేరింది! విదేశీ కంపెనీలెన్నో దేశం వీడుతున్నాయి. 1,100 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లినట్టు అంచనాలున్నాయి. ఐదేళ్లలో 10 వేల కోట్ల డాలర్ల రుణ చెల్లింపులు చేయాల్సి రావడం కలవరపెడుతోంది. కరెన్సీ విలువను 15 శాతం తగ్గించినా లాభంలేకపోవడంతో ఐఎంఎఫ్‌ను శరణు వేడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెడుతోంది! దివాలా బాటన మరెన్నో దేశాలు ఈక్వడర్, బెలారస్, ఇథియోపియా, ఘనా, కెన్యా, ట్యునీషియా, నైజీరియా... ఇలా మరెన్నో దేశాలు ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్నాయి. ఈక్వడర్ రెండేళ్లుగా రుణాలు చెల్లించే పరిస్థితిలో లేదు. ఘనా అప్పులకు వడ్డీలే కట్టలేకపోతోంది. నైజీరియా ఆదాయంలో 30 శాతం వడ్డీలకే పోతోంది. ట్యునీషియాది ప్రభుత్వోద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి! -
Davos: ఆర్థిక విచ్ఛిన్నంతో విపరిణామాలు
దావోస్: ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంతో మరింత విపరిణామాలు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్థికవేత్తలు హెచ్చరించారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా వీరు నివేదికను విడుదల చేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలు ఎక్కువగా ఉండడం, యూరోప్, లాటిన్ అమెరికాలో వాస్తవ వేతనాలు తగ్గిపోవడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇటీవలి కాలంలో ప్రపంచం అతిపెద్ద ఆహార సంక్షోభాన్ని (భద్రతలేమి) ఎదుర్కొంటోందని, ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో ఈ పరిస్థితులు నెలకొన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాల వేగం తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాలు, అతిపెద్ద ఆహార అభద్రత అన్నవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నం కారణంగా తలెత్తే విపరిణామాలని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంబంధించి గత అంచనాలను తగ్గించేసింది. అమెరికా, చైనా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచర్యం, ఉత్తర ఆఫ్రికాలో మోస్తరు ఆర్థిక వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. -
Sakshi Cartoon: శ్రీలంక సర్కార్ మెడపై అవిశ్వాసం కత్తి
శ్రీలంక సర్కార్ మెడపై అవిశ్వాసం కత్తి -
రాజ్‌భవన్ ఎదుటే బైటాయింపు
జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయ డ్రామా కొనసాగుతోంది. తాజాగా, గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు వేదిక మారింది. సోమవారం నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నాకు దిగారు. రాజ్‌భవన్‌లోనికి వెళ్లిన గహ్లోత్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో మాట్లాడారు. ఆ తరువాత గవర్నర్ రాజ్‌భవన్ ప్రాంగణంలో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వచ్చి మాట్లాడారు. అసెంబ్లీ భేటీపై ప్రకటన చేసే వరకు ధర్నా చేస్తా్తమని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇవ్వడంతో ఐదు గంటల అనంతరం ఎమ్మెల్యేలు ధర్నా విరమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా వెల్లడించారు. అయితే, సీఎం నుంచి గవర్నర్ కొన్ని వివరణలు కోరారని, వాటిపై ఈ రాత్రి కేబినెట్ భేటీలో గహ్లోత్ నిర్ణయం తీసుకుంటారని వివరించారు. అయితే, అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో మంత్రి మండలి సిఫారసులను ఆమోదించడం మినహా గవర్నర్‌కు వేరే మార్గం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. జైపూర్ శివార్లలోని ఒక హోటల్లో ఉంటున్న ఎమ్మెల్యేలు నాలుగు బస్సుల్లో అక్కడి నుంచి గహ్లోత్ నేతృత్వంలో రాజ్‌భవన్ చేరుకున్నారు. అంతకుముందు, ఆ హోటల్ వద్ద గహ్లోత్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌పై విమర్శలు గుప్పించారు. గవర్నర్‌ను తన రాజ్యాంగబద్ధ విధులు నిర్వర్తించనివ్వకుండా ‘పై’నుంచి ఒత్తిడి వస్తోందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కోరుతూ గురువారమే గవర్నర్‌కు లేఖ రాశామని, ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ప్రజలు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తే తమది బాధ్యత కాబోదన్నారు. 103 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ వద్ద ధర్నా చేస్తున్నారని, ఇకనైనా గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చేందుకు ఆదేశాలను ఇవ్వాలని రాష్ట్ర మంత్రి సుభాష్ గార్గ్ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ వద్ద ఘర్షణ వద్దని, గాంధీ మార్గంలో నిరసన తెలపాలని ఎమ్మెల్యేలకు గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. తన ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని, అసెంబ్లీ వేదికగానే ఆవిషయాన్ని రుజువు చేస్తామని గహ్లోత్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలో ఆ ఎమ్మెల్యేలను బౌన్సర్లను పెట్టి వారిని ఎక్కడికి వెళ్లకుండా నిర్బంధించారని ఆరోపించారు. ఇప్పుడే అసెంబ్లీని సమావేశపర్చవద్దని గవర్నర్‌పై ఒత్తిడి వస్తోందని గహ్లోత్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, కరోనా వైరస్ విస్తృతి, ఆర్థిక రంగ దుస్థితిపై చర్చించేందుకు అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కేబినెట్ భేటీ అనంతరం గవర్నర్‌ను కోరాం. కానీ, ఇప్పటివరకు గవర్నర్ నుంచి స్పందన లేదు. పైలట్ వర్గం ప్రస్తుతానికి సేఫ్ సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై శుక్రవారం హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చడానికి కోర్టు ఆమోదం తెలిపింది. హైకోర్టులో రిట్ పిటషన్‌పై విచారణ సాగుతుండగానే.. అసెంబ్లీ స్పీకర్ జోషి బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మరోవైపు, కాంగ్రెస్‌లో కొన్ని నెలల క్రితం ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు చేరడాన్ని చట్ట విరుద్ధంగా పేర్కొంటూ, ఆ విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ శుక్రవారం హైకోర్టులో కేసు వేశారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను అభ్యర్థించానని, దానిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ ఎమ్మెల్యే పిటిషన్లో వివరించారు. ఈ కేసుపై సోమవారం విచారణ జరగనుంది. ఆ బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంతోనే గహ్లోత్ సర్కారు పూర్తి మెజారిటీ సాధించగలిగింది. -
క్లైమేట్ టైం బాంబ్
సాక్షి, నాలెడ్జ్ సెంటర్: భూమి మీద జీవరాశి అంతా ఇప్పుడు క్లైమేట్ టైం బాంబ్ మీద కూర్చుంది. ఇది మేమంటోన్న మాట కాదు. స్వయంగా శాస్త్రవేత్తలు చేస్తోన్న హెచ్చరిక. మరో 100 ఏళ్లలో భూమిపైన సగం జీవరాశికి చుక్కనీరు కూడా లేకుండా భూమిపొరల్లోని నీరంతా ఇంకిపోనుంది. తీవ్రమైన వాతావరణ మార్పులతో భూగర్భ జలాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదకర పరిస్థితినే శాస్త్రవేత్తలు ‘క్లైమేట్ టైం బాంబ్’ అని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల మంది జనాభా తాగునీటికీ, సాగునీటికీ ఆధారపడుతోంది మట్టిపొరలు, ఇసుక, రాళ్లల్లో దాగి ఉన్న భూగర్భ జలాలపైనే. వర్షాల కారణంగా భూమిపైన జలాశయాలూ, నదులూ, సముద్రాల్లోకి నీరు చేరుతుంది. మనం తోడేసిన భూగర్బజలాలు ఓ మేరకు ఈ వర్షాలతో తిరిగి పుంజుకుంటాయి. అయితే వాతావరణంలో ఏర్పడిన తీవ్రమైన మార్పుల ప్రభావం కారణంగా కొన్ని చోట్ల అసలు వర్షాలు లేకపోవడం, మరికొన్ని చోట్ల మితిమీరిన వర్షపాతం నమోదవడం వల్ల భూగర్భ జలాలపై కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే భూగర్భ జాలాల నిల్వలు క్షీణించి వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతో పంట దిగుబడి తగ్గిపోయింది. దీనికి తోడు ఒకవైపు కరువు పరిస్థితులూ, మరోవైపు అత్యధిక వర్షపాతం రెండూ కూడా తీవ్రమైన నష్టానికి కారణమౌతోందని ‘నేచర్ క్లైమేట్ చేంజ్’ లో ప్రచురితమైన అధ్యయనం తేల్చి చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల నీటి నిల్వలు ఎలా ప్రభావితం అవుతున్నాయనే విషయాలను కంప్యూటర్ మోడలింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డేటా ఆధారంగా అంతర్జాతీయ అధ్యయన బృందం అంచనా వేసింది. టైం బాంబ్: ‘‘ఇప్పుడు ఎదుర్కొంటోన్న వాతావరణ మార్పుల ప్రభావం దీర్ఘకాలిక సమస్య. ఇది కొన్ని చోట్ల తక్కువగానూ, మరికొన్ని చోట్ల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైనట్లు కార్డిఫ్ వర్సిటీ స్కూల్ ఆఫ్ ఎర్త్ సోషల్ సైన్సెస్ కి చెందిన మార్క్ క్యూత్‌బర్ట్ వెల్లడించారు. రాబోయే శతాబ్దకాలంలో కేవలం సగం భూగర్భజలాలు మాత్రమే తిరిగి భర్తీ అవుతాయనీ, పొడి ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా క్షీణించే ప్రమాదాన్ని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితినే పర్యావరణవేత్తలు ‘టైం బాంబ్’గా పరిగణిస్తున్నారు. భావి తరాలపై ప్రభావం... భూగర్భజలాలు తిరిగి పుంజుకోవడం ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అందుకు కొన్ని చోట్ల శతాబ్దాలు పట్టొచ్చు. పెద్ద పెద్ద తుపానులు, విపరీతమైన కరువు పరిస్థితులూ, అధిక వర్షపాతం భూగర్భజలాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనీ, ఫలితంగా కొన్ని తరాలపై దీని ప్రభావం పడనుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎడారి ప్రాంతాల్లోనైతే భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడటానికి వేల సంవత్సరాలు పట్టొచ్చన్నది ఈ అధ్యయనకారుల అభిప్రాయం. సహారా ఎడారిలో 10,000 ఏళ్ల క్రితం భూగర్భజలాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు మార్క్ క్యూత్‌బర్ట్ వెల్లడించారు. అయితే ఇప్పటికీ అక్కడి భూగర్బజలాలు పుంజుకోకపోవడాన్ని వారు ఉదహరించారు. తీవ్రమైన వాతావరణ మార్పుల నుంచి కాపాడుకోవడానికి తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు నీటి చుక్క దొరకదని వీరు హెచ్చరిస్తున్నారు. -
ప్రజల దృష్టిని మళ్లించే ప్రతిభ
ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఎదురైన సంక్షోభాల జాబితాను పరిశీలిం చండి. ఎప్పుడూ ఇదే వ్యూహాన్ని అనుసరించడం కనిపిస్తుంది. యురిలో వైఫల్యాన్ని నాట కీయంగా జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌తో సర్దుకున్నారు. దీనిని ప్రశ్నిస్తే సైనిక బలగాలను శంకించినట్టవుతుంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా నోరెత్తకుండా అభినందించాయి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఇక సహించలేరన్న స్థాయికి చేరుకున్న తరువాత, దేశంలో అక్కడా ఇక్కడా పెద్ద పెద్ద నోట్ల గుట్టలు కనుగొన్నట్టు కథనాలు, ఫొటోలు దర్శనమిచ్చాయి. వారం క్రితం అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తూ పత్రికల మొదటి పేజీలలో కనిపించిన పతాక శీర్షికలనీ, వాటి ఆధారంగా చానళ్లలో ప్రైమ్‌టైమ్ కార్య క్రమాలలో వినిపించిన గావుకేకలనీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి! ఇవన్నీ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఆ మామాఅల్లుళ్లు నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీ సొమ్ము దొంగిలించిన ఉదంతానికి సంబంధించినవే. ఆ గొడవ పేపర్లలో కనిపిస్తూ ఉండగానే వేయి కోట్ల రూపాయల పరిమితితో రోటోమ్యాక్ పెన్నుల సంస్థ అధిపతి విక్రమ్ కొఠారీ, ఇంకా ఇతరులు బ్యాంకు లకు టోపీ వేయడం గురించి కూడా వార్తలు వచ్చాయి. చూడబోతే ఇలాంటి భాగోతం ఇంకా కొనసాగేటట్టే కనపడుతోంది. అవినీతి మీద పోరాటం నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఈ పరిణామం అంత మంచిది కాదు. ప్రజా«ధనానికి కాపలాదారుడిని (చౌకీ దార్) అంటూ గతంలో మోదీ చెప్పుకోవడాన్ని గుర్తుచేస్తూ విమర్శకులూ, కాంగ్రెస్‌వారూ ప్రధానిని ఎద్దేవా చేస్తున్నారు. ఇక బీజేపీ అవినీతి వ్యతిరేక నినాదాన్ని చేజార్చుకుందనీ, మరీ ముఖ్యంగా దావోస్‌లో జరిగిన సమావే శంలో నీరవ్ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ఫొటో దిగిన నేపథ్యంతో ఇది మరింత స్పష్టమైందనీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పన్ను ఎగవేత లేదా రుణాల ఎగవేత కారణంగా విదేశాలకు ఉడాయించిన విజయ్ మాల్యా, లలిత్ మోదీ అనే ఇద్దరు లబ్ధప్రతిష్టుల పేర్లు, తాజాగా మరో రెండు పేర్లతో జతగూడాయి. కానీ బీజేపీ అధికార ప్రతినిధి మాత్రం టీవీ చానళ్లలో మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇబ్బంది పడ్డారు. యూపీఏ ప్రభుత్వ హయాం లోనే, 2011లో ఈ దొంగతనం మొదలయిందంటూ ఆ అధికార ప్రతినిధి చేసిన వాదన సీబీఐ వారి ఎఫ్ఐఆర్ దగ్గర వీగిపోయింది. అయితే ఇలాంటి పతాక శీర్షికలు రుచించలేదు. దీనితో అంతా మారిపోయింది. ఆ పతాక శీర్షిక లన్నీ కాలగర్భంలో కలసిపోయాయి. కొత్తవి అవతరించాయి. సమయం సందర్భమే ముఖ్యం అంటే ఇది శ్రీదేవి మరణంతో జరిగిందని మాత్రం నేను సూచించడం లేదు. ఆ నటి మరణం పూర్తిగా విషాదం, యాదృచ్ఛికం. ఆ పెద్ద మార్పు మానవ ప్రేరేపితమే. ఇంకా చెప్పాలంటే బీజేపీ తెచ్చిన మార్పే. ఈ కాలమ్ అచ్చుకు వెళ్లిపోతున్నది కాబట్టి, కొత్త పతాకశీర్షికల గురించి ఆలోచించాలి. ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాల నుంచి కార్తి చిదంబరం 7,00,000 డాలర్లు తీసు కున్నారా? ఈ ఒప్పందం కుదర్చడంలో ఆయన తండ్రి తోడ్పడ్డారా? కస్టడీలో ఉన్న కార్తికి ఇంటిదగ్గర నుంచి వచ్చిన భోజనాన్ని అనుమతించలేదు. కానీ ఆయన బంగారు గొలుసు, ఇతర ఆభరణాలని మాత్రం న్యాయమూర్తి అను మతించారు. ఇలాంటివే ఇంకా శీర్షికలు. ప్రకటనలన్నీ మారిపోయాయి. నిజా నికి కార్తిని గడిచిన ఆ ఏడురోజులలో ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. అయితే ఆయన దేశం వీడి వెళుతున్నప్పుడు అరెస్టు చేయలేదన్న విషయాన్ని మాత్రం గమనించండి! ఆయన తిరిగి స్వదేశానికి చేరుకున్నాక విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం? ప్రజలకు చేరవేయదలుచుకున్న సమాచారాన్ని క్రమబద్ధం చేయదలుచుకుంటే అందుకు సరైన సమయం ఎంచుకోవడం ప్రధానం. నాలుగు సంవత్సరాలు నానిన తరువాత ఇప్పుడు లోక్‌పాల్ నియా మకం విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. అంతా ఊహించినట్టే కాంగ్రెస్ నిర సన వ్యక్తం చేసింది. దీని మీద ధర్మబద్ధమైన పతాకశీర్షికలతో వార్తలు వచ్చాయి. తరువాత మరో తాజా అంశానికి సంబంధించిన శీర్షికలు వచ్చాయి. అవి పరారైన ఆర్థిక నేరగాళ్ల పని పట్టేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదిస్తూ ఈ వారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణ యానికి చెందినవి. ఈ బిల్లు ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ సంస్థల ఆదేశాలకు ఆరువారాల లోగా స్పందించని వారందరినీ పరారైన ఆర్థిక నేరగాళ్లుగానే పరి గణిస్తారు. మాల్యానీ, నగల వ్యాపారి మోదీని పరారైన ఆర్థిక నేరగాళ్లని ఇప్పుడు ప్రకటిస్తే అందులో తేడా ఏమిటో తెలియక మనం విస్తుపోవల సిందే. అంతేకాదు, ఒక ప్రశ్నను కూడా మనం సహేతుకంగా అడగవచ్చు. వారు ఇప్పటికే పరారైన నేరగాళ్లు కాదా? మరొక సందర్భంలో అయితే దీనిని నేను లాలీపాప్ రాజకీయమని కొట్టిపారేసేవాడిని. అంటే ఒక సమస్యని పరిష్కరించలేని స్థితిలో, ఆ సమస్యని పరిష్కరించేశామన్నట్టు ఒక చట్టాన్ని మాత్రం చేసి ఊరుకోవడమే. కానీ ఇప్పుడు ఆ మాట అనను. ఎందుకంటే ఏం కావాలని కోరుకున్నారో దానినే ఇది చక్కగా నెరవేరుస్తున్నది. చేతులు కాలాక... ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం చేయదలుచుకున్న కొత్త చట్టాల గురించి కూడా వార్తలు బయటకొస్తున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టే ఉద్దేశంతో దేశం విడిచి వెళ్లిపోతున్న వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేస్తారని, దీనికి అవసరమైన కొత్త నిబంధనలనే కేంద్రం రూపొందిస్తున్నదని వార్తలు బయటకొస్తున్నాయి. ఈ విషయాన్ని చట్టబద్ధత, ప్రాథమిక హక్కులు అనే కోణం నుంచి చూద్దాం. వ్యాపారంలో నష్టం రావడం చేత, లేదా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ఒక పౌరుడు దేశాన్ని వీడి వెళుతున్నాడని ఎవరు నిర్ధారిస్తారు? ఇంకా చెప్పాలంటే, భారతదేశంలో పాత పోలీసు వ్యవస్థలో కనిపించే పద్ధతిలా ఇది కనిపిస్తుంది. దోపిడీ జరిగిపోయిన తరువాత, అది జరిగిన ఇంటి ముందు పోలీసులను నియమించేవారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇలాంటిదేనని అనిపించడం లేదా? ప్రస్తుతం ఉన్న రాజకీయ స్థితినీ, సరిగ్గా వారం క్రితం బీజేపీ చేష్టలుడిగిన క్షణాలనీ పోల్చి చూడండి. ఏ టీవీ చానల్లో చూసినా బీజేపీ పైచేయిగా తన దాడిని కొనసాగిస్తూ ఉంటే, కాంగ్రెస్ చిదంబరాలను వెనకేసుకురావడంలో మునిగి ఉంది. లోక్‌పాల్, పలాయత ఆర్థిక నేరగాళ్ల నిరోధక బిల్లు, ఇలాంటి నేరగాళ్ల కదలికల మీద ఇమ్మిగ్రేషన్ శాఖ ఆంక్షలు వంటి అంశాల మీద ఇతరత్రా కూడా సంపాదక వ్యాఖ్య, చర్చలు వినపడుతున్నాయి. జాతీయ బ్యాంకుల చార్టర్డ్ అకౌంటెంట్స్ పర్యవేక్షణల మీద కొత్త నిబంధనావళిని కూడా ప్రకటిం చారు. రూ. 50 కోట్ల వరకు ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసిన వారి జాబితాలను సీబీఐకి అందించాలని కూడా ఈ బ్యాంకులను ఆదేశించినట్టు కనిపిస్తున్నది. శీర్షికల మర్మం ఇదే! ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. పలుకుబడి కలిగిన బడా వ్యాపా రులు రూ. 20,000 కోట్లకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన తరు వాత మాత్రమే ఈ చర్యలన్నీ ప్రారంభమైనాయి. అలా పలాయనం చిత్త గించిన వారిలో ఒకరు మోదీతో దావోస్‌లో ఫొటో దిగినవారు. మరొకరు స్వయంగా మోదీయే ‘మేహుల్ భాయ్’ అని సంభోధించినవారు. ఇదంతా అశుభ సమాచారమే. అయినా మనం మరచిపోదగినది, మరిచిపోయినదీ కూడా. కానీ ఒక్క వారంలోనే ఇలాంటి దోపిడీని అరికట్టలేని ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం మీద ముద్ర పడింది. తన రక్షణలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను దోపిడీ చేయడానికి, దివాలా తీసే పరిస్థితులు కల్పించడానికి ఇలాంటి దొంగలకు అవకాశం ఇచ్చిందన్న అభియోగం ఎదుర్కొంది. అంతా తల్లకిందులైంది. పతాకశీర్షికలను శాసించడంలో రాజకీయం చేసే మర్మం ఇదే. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఎదురైన సంక్షోభాల జాబితాను పరిశీలించండి. ఎప్పుడూ ఇదే వ్యూహాన్ని అనుసరించడం కని పిస్తుంది. యురిలో వైఫల్యాన్ని నాటకీయంగా జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌తో సర్దు కున్నారు. అయితే దీనిని ప్రశ్నిస్తే సైనిక బలగాలను శంకించినట్టవుతుంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా చాలావరకు నోరెత్తకుండా అభినందించాయి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఇక సహించలేరన్న స్థాయికి చేరుకున్న తరువాత, దేశంలో అక్కడా ఇక్కడా పెద్ద పెద్ద నోట్ల గుట్టలు కనుగొన్నట్టు కథనాలు, ఫొటోలు దర్శనమిచ్చాయి. తరువాత ఆ నోట్ల గుట్టలు నకిలీవని కూడా తేలింది. కానీ అప్పటికి ప్రజల ఆలోచనలను అది మళ్లించగలిగింది. రోహిత్ వేముల ఉదంతాన్ని తీసుకోండి. అతడి ఆత్మహత్య తరువాత జేఎన్‌యూ విద్యార్థుల మీద కేసులు నమోదు చేసి దృష్టి మళ్లించారు. కన్హయ్యకుమార్, ఉమర్ ఖాలిద్ ‘భారత్‌ను ముక్కలు చేస్తాం’ అని ఉపన్యాసాలు ఇచ్చారంటూ దేశద్రోహం కేసులు మోపారు. వాళ్ల ఉపన్యాసాల వీడియోలను చూడకుం డానే ఈ కేసులు నమోదయ్యాయి. డోక్లాం సంక్షోభాన్ని మరింత సున్నితమైన విధానంతో ఏమార్చారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ విషయాన్ని విశేషంగా చూపించవద్దని పత్రికలను, టీవీ చానళ్లను ‘ఒప్పిం చడం’ ద్వారా ఆ పని చేశారు. కశ్మీర్ సరిహద్దులలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి సాయం వేళల్లో గొంతు చించుకునే కమాండో కమేడియన్లు డోక్లాం గురించి మాటమాత్రంగా కూడా ఏమీ చెప్పలేదు. వార్తలన్నీ మోదీని ఆకాశానికెత్తేవే... సాధారణంగా సందేశాలని ప్రభుత్వాలన్నీ సొంతం చేసుకుంటాయి. కానీ మోదీ, షా బీజేపీ మాత్రం దానిని ఒక లలితకళగా అభివృద్ధి చేసింది. అన్ని పతాక శీర్షికలు కూడా కచ్చితంగా మోదీ ముద్రకు చెందిన మూడు కోణాలను ప్రతిబింబిస్తాయి: ఆయన మచ్చలేని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు. హిందూత్వ ఛాయతో ఉన్న జాతీయవాదాన్ని ఎలాంటి శషభిషలు లేకుండా రక్షించేవాడు. విస్తారమైన భుజాలు, విశాలమైన ఛాతి కలిగిన ఆయన ముఖంలో ఎలాంటి సంక్షోభమైనా సరే, చిన్న మార్పును కూడా తేలేదు. ఆయన చేసేదేదీ తప్పు కాదని ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఆయన అజేయుడు. ఆ కారణంగానే ఆయన ఏ వైఫల్యం గురించి స్పందించ రాదని గట్టిగా నిశ్చయించుకున్నారు. మన్మోహన్ సింగ్‌తోను, ఆయన ప్రభుత్వం తోను బేరీజు వేసి చూడండి. తమ సంరక్షణలో ఒక కూరల బండి నుంచి ఎవరో కొన్ని టొమేటోలు దొంగిలించారని తెలిసినా వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. అందుకే సంక్షోభాల వేళ మోదీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో వారు భయ విహ్వలురై చూడాలి. అలాగే వారి ప్రభుత్వం ప్రదర్శించే రాజ కీయ తెలివిడిని శ్లాఘించాలి. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఉరుముల్ మెరుపుల్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక మలుపులు, మరెన్నో కీలక ఘట్టాలకు నెలవుగా మారిన 2013 సంవత్సరం మరో నాలుగు రోజుల్లో గుడ్‌బై చెప్పనుంది. వాణిజ్య రంగానికి ఈ ఏడాది మొత్తం యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించే అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశీయంగా చూస్తే... ఆర్థిక వ్యవస్థ అథఃపాతాళానికి పడిపోగా.. చుక్కలు చూపించిన ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రూపాయి దేశవాసులను అల్లాడించింది. చరిత్రాత్మకమైన కనిష్టాలకు జారిపోయి ధరదడలాడించింది. అయితే, స్టాక్ మార్కెట్లు మాత్రం గత రికార్డులను చెరిపేస్తూ.. అత్యున్నత శిఖరాలకు దూసుకెళ్లాయి. కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను నమోదుచేసినప్పటికీ.. చిన్న ఇన్వెస్టర్లకు మాత్రం నిరాశనే మిగిల్చాయి. బొగ్గు, స్పెక్ట్రం తదితర కుంభకోణాల్లో కార్పొరేట్ దిగ్గజాలు చిక్కుకోవడం కూడా పారిశ్రామిక రంగాన్ని కుంగదీసింది. ఆర్థిక సంస్కరణల విషయంలో ప్రభుత్వం దూకుడును ప్రదర్శించినప్పటికీ.. కార్పొరేట్లలో ఇది పెద్దగా విశ్వాసాన్ని పెంపొందించలేకపోయింది. ఆటోమొబైల్ రంగం డీలాపడినా... లగ్జరీ కార్లు, బైక్‌లు పొలోమంటూ దేశంలోకి వెల్లువెత్తాయి. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు టెలికంలో కొత్త విప్లవానికి నాందిగా నిలిచాయి. మొబైల్ తయారీ కంపెనీలు రోజుకో కొత్త మోడల్ ఫోన్లు, ట్యాబ్లెట్లతో మార్కెట్‌ను ముంచెత్తాయి. అంతర్జాతీయంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కాస్త సానుకూల పరిణామమే అయినా... అక్కడి ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్)ను అనేక మలుపుల తర్వాత ఎట్టకేలకు ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. అమెరికా షట్‌డౌన్, సైప్రస్ దివాలా, మొబైల్ దిగ్గజం నోకియా... మైక్రోసాఫ్ట్ గూటికి చేరడం వంటి అనేక కీలక అంతర్జాతీయ పరిణామాలకు ఈ ఏడాది వేదికైంది. కొత్త ఏడాదిని కొంగొత్త ఆశలతో స్వాగతిస్తూ... ముగిసిపోతున్న ఈ ఏడాదిలో జరిగిన కీలక పరిణామాలను ఒక్కసారి గుర్తుచేసుకుందుకు ‘సాక్షి బిజినెస్’ అందిస్తున్న రివైండ్ ఇది... బుల్.. ధనాధన్! ఐదేళ్ల తరువాత మళ్లీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించింది. దీంతో 2013 నవంబర్ 3న మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ కొత్త రికార్డుతో దీపావళి వెలుగులు విరజిమ్మింది. ఆపై డిసెంబర్ 9కల్లా మరింత పుంజుకుని ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టస్థాయి 21,484 పాయింట్లకు చేరింది. చివరికి 21,283 వద్ద కొత్త రికార్డుతో ముగిసింది. ఇందుకు ప్రధానంగా ఎఫ్ఐఐల పెట్టుబడులు దోహదపడ్డాయి. నవంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించడంతో ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్డీఏ(బీజేపీ)పై అంచనాలు పెరిగాయి. తద్వారా కొత్త విధానాలు, సంస్కరణల అమలు వంటి అంశాలపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. మరోవైపు ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు చేపట్టడం సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. అమెరికా సహాయ ప్యాకేజీల్లో కోతను 10 బిలియన్ డాలర్లకే ఫెడ్ పరిమితం చేయడం కూడా మార్కెట్లకు బలాన్నిచ్చింది. మొత్తానికి ఈ ఏడాది సెన్సెక్స్ 1,767 పాయింట్లు (8.5%) లాభపడింది. 2012 డిసెంబర్ ముగింపు 19,427 పాయింట్ల నుంచి 21,194 పాయింట్లకు చేరింది. కాగా, ఎన్ఎన్ఈ నిఫ్టీ డిసెంబర్ 20న చరిత్ర సృష్టిస్తూ ఇంట్రాడేలో 6,415 పాయింట్ల రికార్డును అందుకుంది. గతేడాది ముగింపు 5,905 పాయింట్లతో పోలిస్తే 409 పాయింట్లు(6%) లాభపడి 6,314కు చేరింది. ఈ ఏడాది(19వరకూ) ఎఫ్ఐఐలు నికరంగా రూ. 1.11 లక్షల కోట్లను(20 బిలియన్ డాలర్లు) దేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఇక ఈ కాలంలో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 20,258 కోట్లు పెరిగి రూ. 69.4 లక్షల కోట్లను తాకింది. అయితే మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునే మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల సూచీలు 10-16% మధ్య డీలాపడ్డాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టీసీఎస్68%, ఇన్ఫోసిస్53%, విప్రో39%, డాక్టర్ రెడ్డీస్37%, మారుతీ 21% పురోగమిస్తే... జిందాల్ స్టీల్ 44%, భెల్ 27%, ఎస్బీఐ 26%, కోల్ ఇండియా 20% చొప్పున పడ్డాయి. పసిడి.. పరుగో పరుగు... సంవత్సరం ప్రారంభంలో రూ. 30,785 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఆగస్టు 28న కొత్త గరిష్ట సాయి రూ.34,500 తాకడం 2013 ముఖ్యాంశాల్లో ఒకటి. దీనికి నేపథ్యం అదే రోజు డాలర్ మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 68.85కి పడిపోవడం. రూపాయి ఒకేరోజు 256 పైసలు నష్టపోగా, బంగారం అదే స్థాయిలో రూ.2,500పైకి ఎగసింది. దేశీయంగా కరెంట్ అకౌంట్ లోటు కట్టడి చర్యల్లో భాగంగా బంగారంపై కస్టమ్స్ సుంకాలను 10 శాతానికి, ఆభరణాల దిగుమతి సుంకాలను 15 శాతానికి పెంచడం వల్ల దేశీయంగా ఈ ధరలు పటిష్టస్థాయిలోనే కొనసాగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ (31.1గ్రా) ధర 1,200 దిగువకు పడిపోయినా... దేశీయంగా తీవ్ర సుంకాల వల్ల ఆ ఎఫెక్ట్ భారత్‌లో కనిపించలేదు. ఇది దేశంలో బంగారం స్మగ్లింగ్ భారీగా పెరిగేందుకు దారితీసింది. మొత్తంగా గడచిన ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 850 టన్నులు. అయితే 2013-14లో ఈ పరిమాణం 500 టన్నులకు పరిమితం కావచ్చని అంచనా. రూ‘పాయే’ విలన్...! దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది ‘విలన్’గా నిలిచిందేమైనా ఉందా అంటే... అది కచ్చితంగా రూ‘పాయే’ అని టక్కున చెప్పొచ్చు. పాతాళమే పరమావధిగా కుప్పకూలిన దేశీ కరెన్సీ... రోజుకో కొత్త కనిష్టాలకు పడుతూ చిక్కిశల్యం అయింది. ఈ ఏడాది ఆరంభంలో డాలరుతో రూపాయి మారకం విలువ దాదాపు 51 స్థాయిలో ఉంది. అక్కడి నుంచి ఏప్రిల్ వరకూ 52-54 స్థాయిలో కదలాడిన కరెన్సీ విలువ... తర్వాత పతనబాటలోకి జారిపోయింది. దీనికితోడు ఈ ఏడాది మే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తొలిసారిగా పేల్చిన టేపరింగ్(సహాయ ప్యాకేజీల ఉపసంహరణ ) బాంబ్‌తో భారత్‌తోపాటు ఇతర వర్ధమాన దేశాల కరెన్సీలన్నీ కుదేలయ్యేందుకు దారితీసింది. విదేశీ నిధుల ప్రవాహానికి అడ్డుకట్టపడొచ్చనే భయాలే ఇందుకు పురిగొల్పాయి. క్రమంగా ఆవిరవుతూ వచ్చిన రూపాయి చివరకు ఆగస్టు 28న చరిత్రాత్మక కనిష్టమైన 68.85 స్థాయిని తాకి హాహాకారాలకు కారణమైంది. జనవరి నుంచి చూస్తే సుమారు 35 శాతం కుప్పకూలింది. రూపాయి వరుస పతనం ఫలితంగా పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్లతోపాటు ఎలక్ట్రానిక్స్, కార్లు ఇతరత్రా అనేక వస్తువుల రేట్లు ఎగబాకేందుకు దారితీసింది. పారిశ్రామిక రంగం కూడా కరెన్సీ క్షీణత దెబ్బకు అధిక ఉద్పాదక వ్యయాలతో కుదేలైంది. సెప్టెంబర్ 4న ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్(దువ్వూరి సుబ్బారావు స్థానంలో) వస్తూవస్తూనే కొన్ని కీలక సంస్కరణలు, చర్యలకు తెరతీయడంతో రూపాయి కాస్త కుదుటపడేందుకు దోహదం చేసింది. ప్రస్తుతం 62 వద్ద కదలాడుతోంది(జనవరితో పోలిస్తే 21% క్షీణత). వృద్ధి పాతాళంలో.. ధరలు ఆకాశంలో... దేశ ఆర్థిక వృద్ధి రేటు పాతాళానికి పడిపోయింది. మే 31న వెలువడిన 2012-13 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి గణాంకాలు ఆందోళనకు గురిచేశాయి. వృద్ధి రేటు 10 యేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఈ రేటు కేవలం 5 శాతంగా నమోదయ్యింది. 2011-12లో 6.2 శాతం, 12-13 నాల్గవ క్వార్టర్ (జనవరి-మార్చి 2013) ఒక్కదాన్నీ చూస్తే వృద్ధి కేవలం 4.8 శాతంగా నమోదయ్యింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో (ఏప్రిల్-జూన్) వృద్ధిరేటు 4.4 శాతంగా నమోదయ్యింది. నవంబర్ 29న వెలువడిన గణాంకాల ప్రకారం జూలై-సెప్టెంబర్ మధ్య వృద్ధి రేటు మొదటి క్వార్టర్కన్నా కొంచెం అధికంగా 4.8 శాతంగా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో భారత్ ఆర్థిక వృద్ధి అంచనాలను 2013-14లో 6.4 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రధాని ఆర్థిక సలహా మండలి ప్రకటించింది. మరోపక్క, ధరలు సామాన్యుడి నడ్డివిరుస్తున్నాయి. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణాన్ని చూస్తే- ఈ రేటు నవంబర్‌లో 14 నెలల గరిష్టం 7.52 శాతానికి ఎగసింది. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం నవంబర్‌లో ఏకంగా తొమ్మిది నెలల గరిష్టమైన 11.24 శాతానికి ఎగబాకింది. స్వాగతం - వీడ్కోలు ధరల కట్టడి కోసం వృద్ధిని త్యాగం చేయక తప్పదు వంటి ప్రకటనలతో ప్రభుత్వాన్ని ఇరుకున్పెట్టిన దువ్వూరి సుబ్బారావు సెప్టెంబర్ 4న ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి విరమించారు. ఈ స్థానంలో ఆర్థికశాఖ ప్రధాన ఆర్థికసలహాదారు రఘురామ్ జీ రాజన్ 23వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇక అక్టోబర్ 7న ప్రతీప్ చౌదరి నుంచి అరుంధతీ భట్టాచార్యకు తొలి మహిళా ఎస్బీఐ చీఫ్‌గా పగ్గాలు... ఫిబ్రవరి 9న హరినారాయణ నుంచి ఐఆర్డీఐ చీఫ్‌గా మాజీ ఎల్ఐసీ చీఫ్ విజయన్ బాధ్యతలు... జూన్ 1న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కేవీ కామత్ నుంచి మళ్లీ నారాయణ మూర్తికి పగ్గాలు వంటివి ఈ ఏడాది నియామకాల్లో ముఖ్యమైనవిగా నిలిచాయి. స్కామ్‌లు... సంక్షోభాలు... నిబంధనలకు విరుద్ధంగా సహారా గ్రూప్ సంస్థలు దాదాపు 24 వేల కోట్ల నిధుల సమీకరణ... తిరిగి చెల్లింపులో మార్కెట్ రెగ్యులేటర్ సెబీతో విభేదాలు... సుప్రీంకోర్టు నుంచి వాయిదా వాయిదాకూ చీవాట్లు 2013లో కూడా కొనసాంది. 5,600 కోట్ల చెల్లింపుల్లో నేషనల్ స్టాట్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈఎల్) వైఫల్యం నియంత్రణ సంస్థల్లో లొసుగులను బట్టబయలు చేసింది. కింగ్‌ఫిషర్, దక్కన్ క్రానికల్ బ్యాంక్ రుణ సంబంధ సంక్షోభాలు కార్పొరేట్ అంశాల్లో ప్రధానమైనవి. శారదా చిట్‌ఫండ్స్ వంటి పోంజీ పథకాలు వెలుగులోకి వచ్చాయి. బొగ్గు గనుల కేటాయింపుల కుమారమంగళం బిర్లా పేరు సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చడం, హిందుస్థాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ విషయంలో వేదాంత గ్రూప్ అధిపతి అనిల్ అగర్వాల్‌పై సీబీఐ ప్రాధమిక విచారణ. దిగ్గజాలను కోల్పోయాం... దేశం దిగ్గజ పారిశ్రామికవేత్తలను కోల్పోయింది. అందులో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, జనరిక్ ఔషధ ప్రదాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి ఒకరు. మార్చి 15న ఆయన తుదిశ్వాస విడిచారు. మరో పారిశ్రామికవేత్త జేకే ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ హరిశంకర్ సింఘానియా ఫిబ్రవరి 23న కన్నుమూయగా, ఏప్రిల్ 14న టేకోవర్ కింగ్ రామ్ ప్రసాద్ గోయెంకా(ఆర్పీజీ) కోల్‌కతాలో మృతిచెందారు. ఫెడ్ ‘కోత’ పడింది.... అమెరికా ఆర్థిక రికవరీ సాధిస్తోందన్న సంకేతాలతో- ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రకటించిన ఉద్దీపనలకు సంబంధించిన నెలకు 85 బిలియన్ డాలర్ల సహాయాన్ని వెనక్కు తీసుకోనున్నట్లు(ట్యాపరింగ్) మే నెలలో ఆదేశ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సంకేతాలు ఇచ్చింది. ఈ సంకేతాలు ప్రపంచంలోని పలు దేశాలతోపాటు భారత్ మార్కెట్లను కూడా పడగొట్టాయి. జూన్, జూలై, ఆగస్టుల్లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చవిచూశాయి. ఎఫ్ఐఐలు వెనక్కుపోవడంతో రూపాయి చరిత్రాత్మక కనిష్టాలను తాకింది. అయితేఆతర్వాత ఉద్దీపనల ఉపసంహరణలకు కొంత సమయం పడుతుందని ఫెడ్ సంకేతాలు మార్కెట్లకు మళ్లీ కాస్త ఊరటనిచ్చాయి. అయితే, తాజాగా డిసెంబర్ పాలసీ సమీక్షలో ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ ఎట్టకేలకు ట్యాపరింగ్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి బాండ్ల కొనుగోళ్లలో 10 బిలియన్ డాలర్లను తగ్గించనున్నట్లు ప్రకటించారు. నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోళ్లు వచ్చే నెల నుంచి 75 బిలియన్ డాలర్లకు తగ్గనున్నాయి. కొత్త మోడళ్లు - ‘కారు’ మబ్బులు... ఈ ఏడాది వాహన రంగం గతుకుల బాటలో సాగింది. రికార్డు స్థాయిలో అమ్మకాలు క్షీణించడం, వాహనాల రీకాల్స్, సమ్మెలు, రూపాయి మారకంలో ఒడిదుడుకులు, అదుపు తప్పిన ఉత్పత్తి వ్యయాలు, పెరిగిపోతున్న ఇంధనం ధరలు, ఎస్‌యూవీలపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం... ఇవన్నీ కూడా వాహన రంగాన్ని అతలాకుతలం చేశాయి. కార్ల కంపెనీలు కొత్త మోడళ్లతో వినియోగదారులను ఊరించినప్పటికీ, అమ్మకాల పతనం ఆగలేదు. మొత్తం మీద జనవరి-నవంబర్ కాలానికి కార్ల అమ్మకాలు 10 శాతం తగ్గాయి. టూవీలర్ల అమ్మకాలు ఓ మెస్తరుగా వృద్ధి చెందడం ఊరటనిచ్చే అంశం. ఆశ్చర్యకరమైన రీతిలో లగ్జరీ కార్ల అమ్మకాలు మాత్రం దూసుకుపోయాయి. మారుతీ సుజుకి, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ సమ్మెటను ఎదుర్కొన్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్ల హవా... ఈ ఏడాది మొబైళ్లు, ట్యాబ్లెట్ల జోరు బాగా ఉంది. ఫీచర్ ఫోన్ల అమ్మకాలు తగ్గి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పెరిగాయి. అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లు లభ్యమవడమే దీనికి కారణం. మరోవైపు ట్యాబ్లెట్ల అమ్మకాలూ బాగానే పెరిగాయి. నోకియా మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. బ్లాక్‌బెర్రి మ్యాజిక్ ఈ ఏడాది పనిచేయలేదు. ఈ కంపెనీ మొబైళ్ల అమ్మకాలు అంతకంతకూ తగ్గుతున్నాయి. మరోవైపు యాపిల్ అందించిన ఐఫోన్5ఎస్‌కు జనం నీరాజనం పట్టారు. భారత్‌లో విడుదలైన రెండు రోజుల్లోనే స్టాక్ అంతా అయిపోయింది. చౌకధరలో అందించిన ఐఫోన్ 5సీకి ప్రతిస్పందన మిశ్రమంగా ఉంది. మైక్రోమ్యాక్స్ తదితర దేశీయ కంపెనీలు కూడా అధిక ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లు అందించాయి. ఇక ట్యాబ్లెట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దీని ప్రభావంతో డెస్క్‌టాప్ పీసీలు, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు తగ్గాయి. ఇక మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ల్లో ఆండ్రాయిడ్ ఓఎస్ హవా నడిచింది. కార్పొరేట్ డీల్స్ జోరు... * కోర్మాండల్ చేతికి లిబర్టీ ఫాస్ఫేట్ గ్రూప్. డీల్ విలువ దాదాపు రూ.375 కోట్లు. * ఎయిర్ ఏషియా-టాటా జేవీ కంపెనీ ఏర్పాటు * దేశీ విమానయాన రంగంలోకి విదేశీ ఎయిర్‌లైన్స్ అడుగుపెట్టేందుకు మార్గం సుగమం. జెట్ ఎయిర్వేస్లో ఎతిహాద్‌కు 24 శాతం వాటా. * అంబానీ సోదరుల మధ్య మెగా ‘టవర్ డీల్’ కుదిరింది. ఈ ఒప్పందం విలువ రూ. 12,000 కోట్లు. దీనితో అనిల్ ఆర్‌కామ్ టవర్లను ముకేశ్ రిలయెన్స్ జియో వినియోగించుకోనుంది. * అపోలో టైర్స్ చేతికి అమెరికా టైర్ అండ్ రబ్బర్ కంపెనీ కూపర్స్ ఒప్పందం. డీల్ విలువ రూ. 14,500 కోట్లు. ఒప్పంద ప్రక్రియ పూర్తయితే ప్రపంచంలోనే 7వ అతిపెద్ద టైర్ల తయారీ సంస్థగా అపోలో ఆవిర్భవించనుంది. * మైక్రోసాఫ్ట్ చేతికి నోకియా- ఈ భారీ డీల్ విలువ రూ. 47,520 కోట్లు. * జేపీ సిమెంట్ గుజరాత్ యూనిట్ అల్ట్రాటెక్ పరం- డీల్ రూ.3,800 కోట్లు. * ఎల్డర్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన బ్రాండెడ్ ఫార్ములేషన్ బిజినెస్‌ను (భారత్, నేపాల్‌ల బిజినెస్‌ను )టొరెంట్ ఫార్మా కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ విలువ దాదాపు రూ.2,000 కోట్లు. భారతీ-వాల్‌మార్ట్‌ల భాగస్వామ్యం తెగతెంపులు. జనవరి 08-01-13: ఒకే టీవీ - ఒకేసారి- రెండు షోలు- వినూత్న టీవీని ఆవిష్కరించిన శామ్సంగ్. దీని ధర రూ. 5,59,278. 30-01-13: రిమ్ (కెనడాకు చెందిన రీసెర్చ్ ఇన్ మోషన్) పేరు బ్లాక్‌బెర్రీగా మారింది. ఫిబ్రవరి 05-02-13: విమానాలను ఖాళీగా తిప్పే బదులు చార్జీలు తగ్గించాలని విమానయాన సంస్థలకు ప్రభుత్వం సూచించింది. 09-02-13: బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తరువాత 3వ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ను ముంబైలో ఆర్థికమంత్రి చిదంబరం ఆవిష్కరించారు. మార్చి 22-03-13: దేశంలో ఒకే సూపర్ రెగ్యులేటర్ ఉండాలని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఎఫ్ఎల్ఆర్సీ నివేదిక పేర్కొంది. 25-03-13: సంక్షోభంలో కూరుకుపోయిన సైప్రెస్కు బెయిలవుట్ డీల్. 26-03-13: బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటుకు 5 దేశాల ఆర్థిక మంత్రుల అంగీకారం. 27-03-13: 10 వేల కోట్ల డాలర్ల ఫండ్ ఏర్పాటుకు ఐదు దేశాల బ్రిక్స్ అగ్రనేతలు ఓకే చెప్పారు. ఈ మేరకు డర్బన్, ధెక్వినీ డిక్లరేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 01-04-13: గ్లివిక్ కేన్సర్ ఔషధం పేటెంట్ పోరులో ఎంఎన్సీ ఫార్మా దిగ్గజం నోవార్టిస్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇది కోట్లాది మంది కేన్సర్ పేషెంట్లకు వరం. దేశీయ ఫార్మాకు ప్రత్యేకించి జనరల్ ఔషధ రంగానికి బూస్ట్ వంటిది. మే 21-05-13: ఐ గేట్ సీఈఓ ఫణీష్ మూర్తిపై వేటు- ఇన్ఫోసిస్ తరువాత ఇక్కడా లైంగిక వేధింపులే కారణం. 24-05-13: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’.. సిల్వర్ జూబ్లీ . జూలై 21-07-13: ప్రపంచ అత్యుత్తమ ట్యాక్సీ అంబాసిడర్- బీబీసీ టాప్‌గేర్ సర్వే. ఆగస్టు 08-08-13: లోక్‌సభ ఆమోదం పొందిన కంపెనీల బిల్లుకు ఆగస్టు 8న రాజ్యసభ ఓకే. 31వ తేదీన రాష్ట్రపతి ఆమోదముద్ర. సెప్టెంబర్ 02-09-13: రూ.6 లక్షల కోట్లకు టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్. ఈ ఘనత అందుకున్న తొలి దేశీయ కంపెనీగా రికార్డు. 13-09-13: అనిల్ అంబానీ ఐటీ ఖాతా హ్యాక్ చేసిన హైదరాబాద్ విద్యార్థిని. అక్టోబర్ 14-10-13: రాష్ట్రానికి చెందిన తొలి ఎయిర్‌లైన్స్ ‘ఎయిర్ కోస్టా’ సేవలు షురూ. 20-10-13: ఫార్చ్యూన్-50 మహిళా శక్తిమంత జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందాకొచర్‌కు 4వ స్థానం. నవంబర్ 07-11-13: న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్విటర్ లిస్టింగ్ రోజున రికార్డు స్థాయిలో పెరిగి 45 డాలర్ల వద్ద క్లోజయ్యింది. 08-11-13: ఫార్చ్యూన్ టాప్ 50 భారత్ మహిళా జాబితాలో చందా కొచర్ నంబర్ 1గా నిలిచారు. 16-11-13: భారతీమ మహిళా బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభం. డిసెంబర్ 09-12-13: కొత్త గరిష్టానికి స్టాక్ మార్కెట్ (సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండూ). 20-12-13: ఇన్ఫోసిస్‌కు మాజీ సీఎఫ్ఓ, డెరైక్టర్ బాలకృష్ణన్ రాజీనామా. ఆరు నెలల్లో 8మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై.