క్లైమేట్‌ టైం బాంబ్‌ | Crisis For Water In Feature Says Scientists | Sakshi
Sakshi News home page

క్లైమేట్‌ టైం బాంబ్‌

Published Tue, Jan 29 2019 1:58 AM | Last Updated on Tue, Jan 29 2019 10:53 AM

Crisis For Water In Feature Says Scientists - Sakshi

సాక్షి, నాలెడ్జ్‌ సెంటర్‌: భూమి మీద జీవరాశి అంతా ఇప్పుడు క్లైమేట్‌ టైం బాంబ్‌ మీద కూర్చుంది. ఇది మేమంటోన్న మాట కాదు. స్వయంగా శాస్త్రవేత్తలు చేస్తోన్న హెచ్చరిక. మరో 100 ఏళ్లలో భూమిపైన సగం జీవరాశికి చుక్కనీరు కూడా లేకుండా భూమిపొరల్లోని నీరంతా ఇంకిపోనుంది. తీవ్రమైన వాతావరణ మార్పులతో భూగర్భ జలాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదకర పరిస్థితినే శాస్త్రవేత్తలు ‘క్లైమేట్‌ టైం బాంబ్‌’ అని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల మంది జనాభా తాగునీటికీ, సాగునీటికీ ఆధారపడుతోంది మట్టిపొరలు, ఇసుక, రాళ్లల్లో దాగి ఉన్న భూగర్భ జలాలపైనే. వర్షాల కారణంగా భూమిపైన జలాశయాలూ, నదులూ, సముద్రాల్లోకి నీరు చేరుతుంది.

మనం తోడేసిన భూగర్బజలాలు ఓ మేరకు ఈ వర్షాలతో తిరిగి పుంజుకుంటాయి. అయితే వాతావరణంలో ఏర్పడిన తీవ్రమైన మార్పుల ప్రభావం కారణంగా కొన్ని చోట్ల అసలు వర్షాలు లేకపోవడం, మరికొన్ని చోట్ల మితిమీరిన వర్షపాతం నమోదవడం వల్ల భూగర్భ జలాలపై కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే భూగర్భ జాలాల నిల్వలు క్షీణించి వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతో పంట దిగుబడి తగ్గిపోయింది. దీనికి తోడు ఒకవైపు కరువు పరిస్థితులూ, మరోవైపు అత్యధిక వర్షపాతం రెండూ కూడా తీవ్రమైన నష్టానికి కారణమౌతోందని ‘నేచర్‌ క్లైమేట్‌ చేంజ్‌’ లో ప్రచురితమైన అధ్యయనం తేల్చి చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల నీటి నిల్వలు ఎలా ప్రభావితం అవుతున్నాయనే విషయాలను కంప్యూటర్‌ మోడలింగ్‌ ఆఫ్‌ గ్రౌండ్‌ వాటర్‌ డేటా ఆధారంగా అంతర్జాతీయ అధ్యయన బృందం అంచనా వేసింది.  

టైం బాంబ్‌: ‘‘ఇప్పుడు ఎదుర్కొంటోన్న వాతావరణ మార్పుల ప్రభావం దీర్ఘకాలిక సమస్య. ఇది కొన్ని చోట్ల తక్కువగానూ, మరికొన్ని చోట్ల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైనట్లు కార్డిఫ్‌ వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఎర్త్‌ సోషల్‌ సైన్సెస్‌ కి చెందిన మార్క్‌ క్యూత్‌బర్ట్‌ వెల్లడించారు. రాబోయే శతాబ్దకాలంలో కేవలం సగం భూగర్భజలాలు మాత్రమే తిరిగి భర్తీ అవుతాయనీ,  పొడి ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా క్షీణించే ప్రమాదాన్ని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితినే పర్యావరణవేత్తలు ‘టైం బాంబ్‌’గా పరిగణిస్తున్నారు.   

భావి తరాలపై ప్రభావం... 
భూగర్భజలాలు తిరిగి పుంజుకోవడం  ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అందుకు కొన్ని చోట్ల శతాబ్దాలు పట్టొచ్చు. పెద్ద పెద్ద తుపానులు, విపరీతమైన కరువు పరిస్థితులూ, అధిక వర్షపాతం భూగర్భజలాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనీ, ఫలితంగా కొన్ని తరాలపై దీని ప్రభావం పడనుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎడారి ప్రాంతాల్లోనైతే భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడటానికి వేల సంవత్సరాలు పట్టొచ్చన్నది ఈ అధ్యయనకారుల అభిప్రాయం. సహారా ఎడారిలో 10,000 ఏళ్ల క్రితం భూగర్భజలాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు మార్క్‌ క్యూత్‌బర్ట్‌ వెల్లడించారు. అయితే ఇప్పటికీ అక్కడి భూగర్బజలాలు పుంజుకోకపోవడాన్ని వారు ఉదహరించారు. తీవ్రమైన వాతావరణ మార్పుల నుంచి కాపాడుకోవడానికి తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌ తరాలకు నీటి చుక్క దొరకదని వీరు హెచ్చరిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement