చందమామపై బోలెడు నీళ్లు
చంద్రుడిపై నీరుందన్న విషయం ఎప్పుడో రూఢీ అయినా.. దాని మోతాదు అంచనాలకు మించి ఉందని తాజా అధ్యయనం ద్వారా స్పష్టమైంది. జాబిల్లి అంతర్భాగంలో నీరు ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చాలాకాలంగా అనుకున్నప్పటికీ 2008లో పరిస్థితి మారింది. చంద్రుడి నుంచి తీసుకొచ్చిన గాజులాంటి పదార్థంలో లేశమాత్రంగా నీరు ఉన్నట్లు బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త అల్‌బ్రెట్టో సాల్ గుర్తించారు. అగ్ని పర్వతాల నుంచి ఎగజిమ్మిన ఈ పదార్థం చంద్రుడి ఉపరితలంపై విస్తరించి ఉన్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా అక్కడ మునుపటి కంటే ఎక్కువ నీరు ఉన్నట్లుగా తెలుస్తోందని బ్రౌన్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాల్ఫ్ మిలికెన్ చెబుతున్నారు.
పోలో–15, అపోలో–17 అంతరిక్ష నౌకలు దిగిన ప్రాంతంతో పాటు చాలాచోట్ల ఈ గాజులాంటి పదార్థ నిక్షేపాలను ఉపగ్రహాల ద్వారా తాము గుర్తించామని, వాటిల్లోనూ నీటిజాడలు స్పష్టంగా కనిపించడంతో జాబిల్లి అంతర్భాగంలోనూ నీరు ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తెలుస్తోందని రాల్ఫ్ వివరిస్తున్నారు. చందమామ ఎలా ఏర్పడిందన్న అంశం మొదలుకొని.. భవిష్యత్తులో దీనిపై స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్న మానవ సంకల్పం వరకూ అనేక అంశాలకు ఈ సరికొత్త అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా.