ఉరుముల్ మెరుపుల్ | business 2013 review | Sakshi
Sakshi News home page

ఉరుముల్ మెరుపుల్

Published Sat, Dec 28 2013 12:42 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

business 2013 review

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక మలుపులు, మరెన్నో కీలక ఘట్టాలకు నెలవుగా మారిన 2013 సంవత్సరం మరో నాలుగు రోజుల్లో గుడ్‌బై చెప్పనుంది. వాణిజ్య రంగానికి ఈ ఏడాది మొత్తం యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించే అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశీయంగా చూస్తే... ఆర్థిక వ్యవస్థ అథఃపాతాళానికి పడిపోగా.. చుక్కలు చూపించిన ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రూపాయి దేశవాసులను అల్లాడించింది. చరిత్రాత్మకమైన కనిష్టాలకు జారిపోయి ధరదడలాడించింది. అయితే, స్టాక్ మార్కెట్లు మాత్రం గత రికార్డులను చెరిపేస్తూ.. అత్యున్నత శిఖరాలకు దూసుకెళ్లాయి.

కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను నమోదుచేసినప్పటికీ.. చిన్న ఇన్వెస్టర్లకు మాత్రం నిరాశనే మిగిల్చాయి.  బొగ్గు, స్పెక్ట్రం తదితర కుంభకోణాల్లో కార్పొరేట్ దిగ్గజాలు చిక్కుకోవడం కూడా పారిశ్రామిక రంగాన్ని కుంగదీసింది. ఆర్థిక సంస్కరణల విషయంలో ప్రభుత్వం దూకుడును ప్రదర్శించినప్పటికీ.. కార్పొరేట్లలో ఇది పెద్దగా విశ్వాసాన్ని పెంపొందించలేకపోయింది. ఆటోమొబైల్ రంగం డీలాపడినా... లగ్జరీ కార్లు, బైక్‌లు పొలోమంటూ దేశంలోకి వెల్లువెత్తాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీలు టెలికంలో కొత్త విప్లవానికి నాందిగా నిలిచాయి. మొబైల్ తయారీ కంపెనీలు రోజుకో కొత్త మోడల్ ఫోన్లు, ట్యాబ్లెట్లతో మార్కెట్‌ను ముంచెత్తాయి.

అంతర్జాతీయంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కాస్త సానుకూల పరిణామమే అయినా... అక్కడి ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్)ను అనేక మలుపుల తర్వాత ఎట్టకేలకు ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. అమెరికా షట్‌డౌన్, సైప్రస్ దివాలా, మొబైల్ దిగ్గజం నోకియా... మైక్రోసాఫ్ట్ గూటికి చేరడం వంటి అనేక కీలక అంతర్జాతీయ పరిణామాలకు ఈ ఏడాది వేదికైంది. కొత్త ఏడాదిని కొంగొత్త ఆశలతో స్వాగతిస్తూ... ముగిసిపోతున్న ఈ ఏడాదిలో జరిగిన కీలక పరిణామాలను ఒక్కసారి గుర్తుచేసుకుందుకు ‘సాక్షి బిజినెస్’ అందిస్తున్న రివైండ్ ఇది...
 
బుల్.. ధనాధన్!
ఐదేళ్ల తరువాత మళ్లీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించింది. దీంతో 2013 నవంబర్ 3న మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ కొత్త రికార్డుతో దీపావళి వెలుగులు విరజిమ్మింది. ఆపై డిసెంబర్ 9కల్లా మరింత పుంజుకుని ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టస్థాయి 21,484  పాయింట్లకు చేరింది. చివరికి 21,283 వద్ద కొత్త రికార్డుతో ముగిసింది. ఇందుకు ప్రధానంగా ఎఫ్‌ఐఐల పెట్టుబడులు దోహదపడ్డాయి. నవంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించడంతో ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్‌డీఏ(బీజేపీ)పై అంచనాలు పెరిగాయి.

తద్వారా కొత్త విధానాలు, సంస్కరణల అమలు వంటి అంశాలపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. మరోవైపు ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు చేపట్టడం సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. అమెరికా సహాయ ప్యాకేజీల్లో కోతను 10 బిలియన్ డాలర్లకే ఫెడ్  పరిమితం చేయడం కూడా మార్కెట్లకు బలాన్నిచ్చింది. మొత్తానికి ఈ ఏడాది సెన్సెక్స్ 1,767 పాయింట్లు (8.5%) లాభపడింది. 2012 డిసెంబర్ ముగింపు 19,427 పాయింట్ల నుంచి 21,194 పాయింట్లకు చేరింది. కాగా, ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ డిసెంబర్ 20న చరిత్ర సృష్టిస్తూ ఇంట్రాడేలో 6,415 పాయింట్ల రికార్డును అందుకుంది. గతేడాది ముగింపు 5,905 పాయింట్లతో పోలిస్తే 409 పాయింట్లు(6%) లాభపడి 6,314కు చేరింది.

ఈ ఏడాది(19వరకూ) ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.  1.11 లక్షల కోట్లను(20 బిలియన్ డాలర్లు) దేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఇక ఈ కాలంలో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 20,258 కోట్లు పెరిగి రూ. 69.4 లక్షల కోట్లను తాకింది. అయితే మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునే మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల సూచీలు 10-16% మధ్య డీలాపడ్డాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టీసీఎస్68%, ఇన్ఫోసిస్53%, విప్రో39%, డాక్టర్ రెడ్డీస్37%, మారుతీ 21% పురోగమిస్తే... జిందాల్ స్టీల్ 44%, భెల్ 27%, ఎస్‌బీఐ 26%, కోల్ ఇండియా 20% చొప్పున పడ్డాయి.
 
 పసిడి.. పరుగో పరుగు...
 
 సంవత్సరం ప్రారంభంలో రూ. 30,785 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఆగస్టు 28న కొత్త గరిష్ట సాయి రూ.34,500 తాకడం 2013 ముఖ్యాంశాల్లో ఒకటి. దీనికి నేపథ్యం అదే రోజు డాలర్ మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 68.85కి పడిపోవడం. రూపాయి ఒకేరోజు 256 పైసలు నష్టపోగా, బంగారం అదే స్థాయిలో రూ.2,500పైకి ఎగసింది. దేశీయంగా కరెంట్ అకౌంట్ లోటు కట్టడి చర్యల్లో భాగంగా బంగారంపై కస్టమ్స్ సుంకాలను 10 శాతానికి, ఆభరణాల దిగుమతి సుంకాలను 15 శాతానికి పెంచడం వల్ల దేశీయంగా ఈ ధరలు పటిష్టస్థాయిలోనే కొనసాగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ (31.1గ్రా) ధర 1,200 దిగువకు పడిపోయినా... దేశీయంగా తీవ్ర సుంకాల వల్ల ఆ ఎఫెక్ట్ భారత్‌లో కనిపించలేదు. ఇది దేశంలో బంగారం స్మగ్లింగ్ భారీగా పెరిగేందుకు దారితీసింది.  మొత్తంగా గడచిన ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 850 టన్నులు. అయితే 2013-14లో ఈ పరిమాణం 500 టన్నులకు పరిమితం కావచ్చని అంచనా.
 
రూ‘పాయే’ విలన్...!
దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది ‘విలన్’గా నిలిచిందేమైనా ఉందా అంటే... అది కచ్చితంగా రూ‘పాయే’ అని టక్కున చెప్పొచ్చు.  పాతాళమే పరమావధిగా కుప్పకూలిన దేశీ కరెన్సీ... రోజుకో కొత్త కనిష్టాలకు పడుతూ చిక్కిశల్యం అయింది. ఈ ఏడాది ఆరంభంలో డాలరుతో రూపాయి మారకం విలువ దాదాపు 51 స్థాయిలో ఉంది. అక్కడి నుంచి ఏప్రిల్ వరకూ 52-54 స్థాయిలో కదలాడిన కరెన్సీ విలువ... తర్వాత పతనబాటలోకి జారిపోయింది. దీనికితోడు ఈ ఏడాది మే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తొలిసారిగా పేల్చిన టేపరింగ్(సహాయ ప్యాకేజీల ఉపసంహరణ ) బాంబ్‌తో భారత్‌తోపాటు ఇతర వర్ధమాన దేశాల కరెన్సీలన్నీ కుదేలయ్యేందుకు దారితీసింది. విదేశీ నిధుల ప్రవాహానికి అడ్డుకట్టపడొచ్చనే భయాలే ఇందుకు పురిగొల్పాయి. క్రమంగా ఆవిరవుతూ వచ్చిన రూపాయి చివరకు ఆగస్టు 28న చరిత్రాత్మక కనిష్టమైన 68.85 స్థాయిని తాకి హాహాకారాలకు కారణమైంది. జనవరి నుంచి చూస్తే సుమారు 35 శాతం కుప్పకూలింది.

 రూపాయి వరుస పతనం ఫలితంగా పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్‌లతోపాటు ఎలక్ట్రానిక్స్, కార్లు ఇతరత్రా అనేక వస్తువుల రేట్లు ఎగబాకేందుకు దారితీసింది. పారిశ్రామిక రంగం కూడా కరెన్సీ క్షీణత దెబ్బకు అధిక ఉద్పాదక వ్యయాలతో కుదేలైంది. సెప్టెంబర్ 4న ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్(దువ్వూరి సుబ్బారావు స్థానంలో) వస్తూవస్తూనే కొన్ని కీలక సంస్కరణలు, చర్యలకు తెరతీయడంతో రూపాయి కాస్త కుదుటపడేందుకు దోహదం చేసింది.  ప్రస్తుతం 62 వద్ద కదలాడుతోంది(జనవరితో పోలిస్తే 21% క్షీణత).
 
వృద్ధి పాతాళంలో.. ధరలు ఆకాశంలో...
దేశ ఆర్థిక వృద్ధి రేటు పాతాళానికి పడిపోయింది. మే 31న వెలువడిన 2012-13 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి గణాంకాలు ఆందోళనకు గురిచేశాయి. వృద్ధి రేటు 10 యేళ్ల కనిష్టానికి పడిపోయింది.  ఈ రేటు కేవలం 5 శాతంగా నమోదయ్యింది.  2011-12లో 6.2 శాతం, 12-13 నాల్గవ క్వార్టర్ (జనవరి-మార్చి 2013) ఒక్కదాన్నీ చూస్తే వృద్ధి కేవలం 4.8 శాతంగా నమోదయ్యింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో (ఏప్రిల్-జూన్) వృద్ధిరేటు 4.4 శాతంగా నమోదయ్యింది.  నవంబర్ 29న వెలువడిన గణాంకాల ప్రకారం జూలై-సెప్టెంబర్ మధ్య వృద్ధి రేటు మొదటి క్వార్టర్‌కన్నా కొంచెం అధికంగా 4.8 శాతంగా నమోదయ్యింది.  ఈ నేపథ్యంలో భారత్ ఆర్థిక వృద్ధి అంచనాలను 2013-14లో 6.4 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రధాని ఆర్థిక సలహా మండలి ప్రకటించింది.

  మరోపక్క, ధరలు సామాన్యుడి నడ్డివిరుస్తున్నాయి. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణాన్ని చూస్తే- ఈ రేటు నవంబర్‌లో 14 నెలల గరిష్టం 7.52 శాతానికి ఎగసింది. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం నవంబర్‌లో ఏకంగా తొమ్మిది నెలల గరిష్టమైన 11.24 శాతానికి ఎగబాకింది.
 
 స్వాగతం - వీడ్కోలు
 ధరల కట్టడి కోసం వృద్ధిని త్యాగం చేయక తప్పదు వంటి ప్రకటనలతో ప్రభుత్వాన్ని ఇరుకున్పెట్టిన దువ్వూరి సుబ్బారావు సెప్టెంబర్ 4న ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి విరమించారు. ఈ స్థానంలో ఆర్థికశాఖ ప్రధాన ఆర్థికసలహాదారు రఘురామ్ జీ రాజన్ 23వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 

ఇక అక్టోబర్ 7న ప్రతీప్ చౌదరి నుంచి అరుంధతీ భట్టాచార్యకు తొలి మహిళా ఎస్‌బీఐ చీఫ్‌గా పగ్గాలు... ఫిబ్రవరి 9న హరినారాయణ నుంచి ఐఆర్‌డీఐ చీఫ్‌గా మాజీ ఎల్‌ఐసీ చీఫ్ విజయన్ బాధ్యతలు... జూన్ 1న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కేవీ కామత్ నుంచి మళ్లీ నారాయణ మూర్తికి పగ్గాలు వంటివి ఈ ఏడాది నియామకాల్లో ముఖ్యమైనవిగా నిలిచాయి.
 
స్కామ్‌లు... సంక్షోభాలు...                                                                                                                   
నిబంధనలకు విరుద్ధంగా సహారా గ్రూప్ సంస్థలు దాదాపు 24 వేల కోట్ల నిధుల సమీకరణ... తిరిగి చెల్లింపులో మార్కెట్ రెగ్యులేటర్ సెబీతో విభేదాలు... సుప్రీంకోర్టు నుంచి వాయిదా వాయిదాకూ చీవాట్లు 2013లో కూడా కొనసాంది.  5,600 కోట్ల చెల్లింపుల్లో నేషనల్ స్టాట్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) వైఫల్యం నియంత్రణ సంస్థల్లో లొసుగులను బట్టబయలు చేసింది. 

కింగ్‌ఫిషర్, దక్కన్ క్రానికల్ బ్యాంక్ రుణ సంబంధ సంక్షోభాలు కార్పొరేట్ అంశాల్లో ప్రధానమైనవి. శారదా చిట్‌ఫండ్స్ వంటి పోంజీ పథకాలు వెలుగులోకి వచ్చాయి. బొగ్గు గనుల కేటాయింపుల కుమారమంగళం బిర్లా పేరు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం, హిందుస్థాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ విషయంలో వేదాంత గ్రూప్ అధిపతి అనిల్ అగర్వాల్‌పై సీబీఐ ప్రాధమిక విచారణ.
 
దిగ్గజాలను కోల్పోయాం...
దేశం దిగ్గజ పారిశ్రామికవేత్తలను కోల్పోయింది. అందులో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, జనరిక్ ఔషధ ప్రదాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి ఒకరు. మార్చి 15న ఆయన తుదిశ్వాస విడిచారు. మరో పారిశ్రామికవేత్త జేకే ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ హరిశంకర్ సింఘానియా ఫిబ్రవరి 23న కన్నుమూయగా,  ఏప్రిల్ 14న టేకోవర్ కింగ్  రామ్ ప్రసాద్ గోయెంకా(ఆర్‌పీజీ) కోల్‌కతాలో మృతిచెందారు.
 
ఫెడ్ ‘కోత’ పడింది....
అమెరికా ఆర్థిక రికవరీ సాధిస్తోందన్న సంకేతాలతో- ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రకటించిన ఉద్దీపనలకు సంబంధించిన నెలకు 85 బిలియన్ డాలర్ల సహాయాన్ని వెనక్కు తీసుకోనున్నట్లు(ట్యాపరింగ్) మే నెలలో ఆదేశ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సంకేతాలు ఇచ్చింది. ఈ సంకేతాలు ప్రపంచంలోని పలు దేశాలతోపాటు భారత్ మార్కెట్లను కూడా పడగొట్టాయి. జూన్, జూలై, ఆగస్టుల్లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చవిచూశాయి.

ఎఫ్‌ఐఐలు వెనక్కుపోవడంతో రూపాయి చరిత్రాత్మక కనిష్టాలను తాకింది. అయితేఆతర్వాత ఉద్దీపనల ఉపసంహరణలకు కొంత సమయం పడుతుందని ఫెడ్  సంకేతాలు మార్కెట్లకు మళ్లీ కాస్త ఊరటనిచ్చాయి.  అయితే, తాజాగా డిసెంబర్ పాలసీ సమీక్షలో ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ ఎట్టకేలకు ట్యాపరింగ్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి బాండ్ల కొనుగోళ్లలో 10 బిలియన్ డాలర్లను తగ్గించనున్నట్లు ప్రకటించారు. నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్‌ల కొనుగోళ్లు వచ్చే నెల నుంచి 75 బిలియన్ డాలర్లకు తగ్గనున్నాయి.
 
కొత్త మోడళ్లు - ‘కారు’ మబ్బులు...
ఈ ఏడాది వాహన రంగం గతుకుల బాటలో సాగింది. రికార్డు స్థాయిలో అమ్మకాలు క్షీణించడం, వాహనాల రీకాల్స్, సమ్మెలు, రూపాయి మారకంలో ఒడిదుడుకులు, అదుపు తప్పిన ఉత్పత్తి వ్యయాలు, పెరిగిపోతున్న ఇంధనం ధరలు, ఎస్‌యూవీలపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం... ఇవన్నీ కూడా వాహన రంగాన్ని అతలాకుతలం చేశాయి.  కార్ల కంపెనీలు కొత్త మోడళ్లతో వినియోగదారులను ఊరించినప్పటికీ, అమ్మకాల పతనం ఆగలేదు.  మొత్తం మీద జనవరి-నవంబర్ కాలానికి కార్ల అమ్మకాలు 10 శాతం తగ్గాయి.  టూవీలర్ల అమ్మకాలు ఓ మెస్తరుగా వృద్ధి చెందడం ఊరటనిచ్చే అంశం. ఆశ్చర్యకరమైన రీతిలో లగ్జరీ కార్ల అమ్మకాలు మాత్రం దూసుకుపోయాయి. మారుతీ సుజుకి, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ సమ్మెటను ఎదుర్కొన్నాయి.
 
స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్ల హవా...
ఈ ఏడాది మొబైళ్లు, ట్యాబ్లెట్ల జోరు బాగా ఉంది. ఫీచర్ ఫోన్‌ల అమ్మకాలు తగ్గి స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు పెరిగాయి. అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్లు లభ్యమవడమే దీనికి కారణం. మరోవైపు ట్యాబ్లెట్‌ల అమ్మకాలూ బాగానే పెరిగాయి. నోకియా మొబైల్ ఫోన్‌ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. బ్లాక్‌బెర్రి మ్యాజిక్ ఈ ఏడాది పనిచేయలేదు. ఈ కంపెనీ మొబైళ్ల అమ్మకాలు అంతకంతకూ తగ్గుతున్నాయి.

మరోవైపు యాపిల్ అందించిన ఐఫోన్5ఎస్‌కు జనం నీరాజనం పట్టారు. భారత్‌లో విడుదలైన రెండు రోజుల్లోనే స్టాక్ అంతా అయిపోయింది. చౌకధరలో అందించిన ఐఫోన్ 5సీకి ప్రతిస్పందన మిశ్రమంగా ఉంది. మైక్రోమ్యాక్స్ తదితర దేశీయ కంపెనీలు కూడా అధిక ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్‌లు అందించాయి.   ఇక ట్యాబ్లెట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దీని ప్రభావంతో డెస్క్‌టాప్ పీసీలు, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు తగ్గాయి. ఇక మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల్లో ఆండ్రాయిడ్ ఓఎస్ హవా నడిచింది.
 
 కార్పొరేట్ డీల్స్ జోరు...
*  కోర్‌మాండల్ చేతికి లిబర్టీ ఫాస్ఫేట్ గ్రూప్.  డీల్ విలువ దాదాపు రూ.375 కోట్లు.
* ఎయిర్ ఏషియా-టాటా జేవీ కంపెనీ ఏర్పాటు
* దేశీ విమానయాన రంగంలోకి   విదేశీ ఎయిర్‌లైన్స్ అడుగుపెట్టేందుకు మార్గం సుగమం.  జెట్ ఎయిర్‌వేస్‌లో ఎతిహాద్‌కు 24 శాతం వాటా.

* అంబానీ సోదరుల మధ్య మెగా ‘టవర్ డీల్’ కుదిరింది. ఈ ఒప్పందం విలువ రూ. 12,000 కోట్లు.  దీనితో అనిల్ ఆర్‌కామ్ టవర్లను ముకేశ్ రిలయెన్స్ జియో వినియోగించుకోనుంది.

* అపోలో టైర్స్ చేతికి అమెరికా టైర్ అండ్ రబ్బర్ కంపెనీ కూపర్స్ ఒప్పందం. డీల్ విలువ రూ. 14,500 కోట్లు. ఒప్పంద ప్రక్రియ పూర్తయితే ప్రపంచంలోనే 7వ అతిపెద్ద టైర్ల తయారీ సంస్థగా అపోలో ఆవిర్భవించనుంది.

*  మైక్రోసాఫ్ట్  చేతికి నోకియా- ఈ భారీ డీల్ విలువ రూ. 47,520 కోట్లు.
*   జేపీ సిమెంట్ గుజరాత్ యూనిట్ అల్ట్రాటెక్ పరం- డీల్ రూ.3,800 కోట్లు.

* ఎల్డర్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన బ్రాండెడ్ ఫార్ములేషన్ బిజినెస్‌ను (భారత్, నేపాల్‌ల బిజినెస్‌ను )టొరెంట్ ఫార్మా కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ విలువ దాదాపు రూ.2,000 కోట్లు. భారతీ-వాల్‌మార్ట్‌ల భాగస్వామ్యం తెగతెంపులు.
 
 జనవరి
 08-01-13: ఒకే టీవీ - ఒకేసారి- రెండు షోలు- వినూత్న టీవీని ఆవిష్కరించిన శామ్‌సంగ్. దీని ధర రూ. 5,59,278.
 30-01-13:  రిమ్ (కెనడాకు చెందిన రీసెర్చ్ ఇన్ మోషన్) పేరు బ్లాక్‌బెర్రీగా మారింది.

 ఫిబ్రవరి
 05-02-13: విమానాలను ఖాళీగా తిప్పే బదులు చార్జీలు తగ్గించాలని  విమానయాన సంస్థలకు ప్రభుత్వం సూచించింది.
 09-02-13: బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తరువాత 3వ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్  ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌ను ముంబైలో ఆర్థికమంత్రి చిదంబరం ఆవిష్కరించారు.

 మార్చి
 22-03-13: దేశంలో ఒకే సూపర్ రెగ్యులేటర్ ఉండాలని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఎఫ్‌ఎల్‌ఆర్‌సీ నివేదిక పేర్కొంది.
 25-03-13: సంక్షోభంలో కూరుకుపోయిన సైప్రెస్‌కు బెయిలవుట్ డీల్.
 26-03-13: బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటుకు  5 దేశాల ఆర్థిక మంత్రుల అంగీకారం.
 27-03-13: 10 వేల కోట్ల డాలర్ల ఫండ్ ఏర్పాటుకు ఐదు దేశాల బ్రిక్స్ అగ్రనేతలు ఓకే చెప్పారు. ఈ మేరకు  డర్బన్, ధెక్వినీ డిక్లరేషన్ ఒక నిర్ణయం తీసుకుంది.

 ఏప్రిల్
 01-04-13: గ్లివిక్ కేన్సర్ ఔషధం పేటెంట్ పోరులో ఎంఎన్‌సీ ఫార్మా దిగ్గజం నోవార్టిస్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇది కోట్లాది మంది కేన్సర్ పేషెంట్లకు వరం. దేశీయ ఫార్మాకు ప్రత్యేకించి జనరల్ ఔషధ రంగానికి బూస్ట్ వంటిది.

 మే
 21-05-13: ఐ గేట్ సీఈఓ ఫణీష్ మూర్తిపై వేటు- ఇన్ఫోసిస్ తరువాత ఇక్కడా లైంగిక వేధింపులే కారణం.
 24-05-13: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’.. సిల్వర్ జూబ్లీ .

 జూలై
 21-07-13: ప్రపంచ అత్యుత్తమ ట్యాక్సీ అంబాసిడర్- బీబీసీ టాప్‌గేర్ సర్వే.

 ఆగస్టు
 08-08-13:  లోక్‌సభ ఆమోదం పొందిన కంపెనీల బిల్లుకు ఆగస్టు 8న రాజ్యసభ ఓకే. 31వ తేదీన రాష్ట్రపతి ఆమోదముద్ర.

 సెప్టెంబర్
 02-09-13: రూ.6 లక్షల కోట్లకు టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్. ఈ ఘనత అందుకున్న తొలి దేశీయ కంపెనీగా రికార్డు.
 13-09-13: అనిల్ అంబానీ ఐటీ ఖాతా హ్యాక్ చేసిన హైదరాబాద్ విద్యార్థిని.

 అక్టోబర్
 14-10-13: రాష్ట్రానికి చెందిన తొలి ఎయిర్‌లైన్స్ ‘ఎయిర్ కోస్టా’ సేవలు షురూ.
 20-10-13: ఫార్చ్యూన్-50 మహిళా శక్తిమంత జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందాకొచర్‌కు 4వ స్థానం.

 నవంబర్
 07-11-13: న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్విటర్ లిస్టింగ్ రోజున రికార్డు స్థాయిలో పెరిగి 45 డాలర్ల వద్ద క్లోజయ్యింది.
 08-11-13: ఫార్చ్యూన్ టాప్ 50 భారత్ మహిళా జాబితాలో చందా కొచర్ నంబర్ 1గా నిలిచారు.
 16-11-13:  భారతీమ మహిళా బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభం.

 డిసెంబర్
 09-12-13:  కొత్త గరిష్టానికి స్టాక్ మార్కెట్ (సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండూ).
 20-12-13: ఇన్ఫోసిస్‌కు మాజీ సీఎఫ్‌ఓ, డెరైక్టర్ బాలకృష్ణన్ రాజీనామా. ఆరు నెలల్లో  8మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement