కుంతీ జిల్లాలో ఎమ్మెల్యేలతో కలిసి సీఎం హేమంత్ బోటు షికారు
రాంచీ: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై మూడు రోజులుగా నెలకొన్న సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. ఈలోగా రిసార్టు రాజకీయాలకు తెర లేచింది. ఎమ్మెల్యేలు గోడ దూకుతారేమోనన్న భయంతో వారిని సోరెన్ క్యాంపుకు తరలించారు. శనివారం ఉదయం పాలక యూపీఏ భాగస్వామ్య పక్షాలైన జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో సీఎం నివాసంలో మూడో దఫా సుదీర్ఘ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్యేలంతా నేరుగా లగేజీలతో పాటుగా భేటీకి రావడం విశేషం. ఆ వెంటనే వారందరినీ మూడు బస్సుల్లో గుర్తు తెలియని చోటుకి తరలించారు. వారిని పశ్చిమబెంగాల్‌కో, ఛత్తీస్‌గఢ్‌కో తీసుకెళ్లి ఉంటారంటూ వార్తలొచ్చాయి. కానీ ఎమ్మెల్యేలంతా కుంతీ జిల్లాలోని మూమెంట్స్ రిసార్ట్‌కు పిక్నిక్‌కు వెళ్తున్నారంటూ మంత్రులు ఆలంఘీర్ ఆలం, బన్నా గుప్తా చెప్పారు. సాయంత్రానికల్లా వారంతా రాంచీ తిరిగొచ్చినట్టు సమాచారం. సోరెన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలన్న ఈసీ సిఫార్సుపై గవర్నర్ రమేశ్ బైస్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment